తెలుగులో ఆధునిక కథకు ఆరంభం 1910 లో గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు అని చాలాకాలంగా అనుకొంటూ వచ్చాం. కానీ భిన్న సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాలలో చరిత్ర అంచులకు నెట్టివేయబడిన స్త్రీలను వెతికి కేంద్రంలోకి తీసుకువచ్చే పూనిక పెరిగిన క్రమంలో 1901 నాటికే కథలు వ్రాసిన భండారు అచ్చమాంబను తెలుసుకోగలిగాం. 1879 నుండి ఆధునిక స్వరూప స్వభావాలను సంతరించుకొంటూ తెలుగు కథ ప్రయాణం ప్రారంభం అయితే ఆ ప్రయాణంలో అడుగులు కలిపిన తొలి మహిళ భండారు అచ్చమాంబ. స్త్రీల జీవిత చైతన్య వికాసాలకు కేంద్రమైన సంఘ సంస్కరణోద్యమ ఆశయ ప్రచార నిబద్ధత నుండి ఆమె కథలు వ్రాసింది. ఆ వారసత్వం ఈనాడు సామాజిక మార్పు దిశగా నక్సల్బరి కలలను వాస్తవీకరిస్తున్న దండకారణ్య ఆచరణలో భాగమై ఉన్నతీకరించబడిన ఉజ్వల దృశ్య ఆవిష్క్కరణ ‘వియ్యుక్క’. నాలుగు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలోని మహిళా విప్లవకారులు యాభై మంది వ్రాసిన 282 కథలు ఇందులో ఉన్నాయి.
విప్లవోద్యమ గమనాన్ని, అందులో స్త్రీల బహుముఖ భాగస్వామ్య పాత్రను తెలిపే కథలు ఇవి. మధ్యతరగతి కథా పాఠకులకు వైవిధ్య భరితమైన మానవ సమాజాలు, సమూహాలు ఎన్ని ఉన్నాయో , జీవన యాతనలకు , సంఘర్షణలకు లోనవుతూ మనుగడ కోసం వాళ్ళు చేస్తున్న అనివార్యమైన పోరాటాలు ఎలాంటివో తెలియచేస్తాయి ఈ కథలు. తెలుగు కథా సాహిత్య చరిత్రకు వస్తు విస్తృతిని, స్త్రీలు చేసిన దోహదాన్ని ఏక కాలంలో నిరూపించి చూపగలిగిన ఈ సంకలనం అపురూపమైనది. వంటిళ్లు, పిల్లల పెంపకం, చీరలు, నగలు తప్ప మరొక ప్రపంచం తెలియదని, వాళ్ళ కథలు వాటి చుట్టూనే పరిభ్రమిస్తుంటాయని స్త్రీల కథలను చిన్న చూపు చూసే విమర్శకులకు విప్లవ రాజకీయాలలో నిగ్గుతేలిన స్త్రీల కథల సంకలనంగా ఇదొక సవాల్.
ఒక రకంగా మనకు తెలియని అడవి మనతో చేసే సంభాషణ ఈ కథలు. ఆ సంభాషణకు చెవి ఒగ్గుదాం. చేయి కలుపుదాం.