(*వియ్యుక్క*  పేరుతొ  అజ్ఞాత రచయిత్రుల కథలు ఆరు భాగాలుగా విరసం తీసుకొస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇందులో మూడు  పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటి ఆవిష్కరణ ఈ నెల 24 న హైదరాబాదులో ఉంది. ఈ సందర్భంగా తొలి మూడు భాగాలకు వియ్యుక్క ఎడిటర్ బి. అనురాధ రాసిన ముందుమాట పాఠకుల కోసం …వసంత మేఘం టీం )

పెన్నూ గన్నూ పట్టిన రచయిత అనగానే మనకి మొట్టమొదట గుర్తుకొచ్చేది సుబ్బారావు పాణిగ్రాహి. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అందులోనూ ఒక చేత్తో గన్ను పట్టి పోరాటం చేస్తూ అద్భుతమైన, అసంఖ్యాక రచనలు చేస్తున్న మహిళా విప్లవకారుల గురించి తెలిసిందైతే ఇంకా తక్కువ. దీనికి కారణాలు అన్వేషించే క్రమంలో ప్రముఖ సాహిత్యవేత్త కాత్యాయనీ విద్మహే తన ‘విప్లవోద్యమ కథ- తెలంగాణ రచయిత్రులు1’ అన్న వ్యాసంలో ప్రముఖ చరిత్రకారుడు ఇ.హెచ్‌.కార్‌ ను ఉటంకిస్తూ ఒక విశ్లేషణ చేశారు. ‘సాహిత్య చరిత్రకారులు ఒక నిర్ధిష్ట సమాజంలో జీవిస్తూ, నిర్ణీత భావజాలంతో ప్రభావితులవుతూ తదనుగుణంగా ఏది అసలైన, వాస్తవమైన సాహిత్యమని భావిస్తారో దానినే భద్రపరచడానికి పరిమితం కావటం వల్ల తరచూ చాలా సాహిత్య సంప్రదాయాలు చరిత్రలో నమోదు కాకుండానే, భాగం కాకుండానే మిగిలిపోతున్నాయి. ఆ రకంగా చూచినపుడు తెలుగు సాహిత్యచరిత్రలో విప్లవోద్యమ సాహిత్యానికి గాని, తెలంగాణా తదితర వెనుకబడ్డ ప్రాంతాల సాహిత్యానికి గాని, సమాజం చివరి అంచులకి నెట్టివేయబడిన స్త్రీల సాహిత్యానికి గాని, సమాజంలో అణచివేతకు గురవుతున్న దళిత మైనారిటీ వర్గాల సాహిత్యానికి గానీ తగిన స్థానం లభించలేదన్నది వాస్తవం. సాహిత్య చరిత్రలోని ఈ ఖాళీలను పూరించి సమగ్రం చేయటం ఇప్పటి అవసరం. ఈ అవసరాన్ని సమర్థవంతంగా శాస్త్రీయంగా తీర్చటానికి తెలంగాణా సాహిత్యం, అందులోనూ ప్రత్యేకించి కథ, ఆ కథలోనూ విప్లవోద్యమ సంబంధంలో వచ్చిన కథ, విప్లవోద్యమ కథలోనూ స్త్రీలు రాసిన కథలు ఇలా సూక్ష్మ విషయాలకు పరిమితమై అధ్యయనాలు చేసుకుంటూ పోవటం ఎంతయినా ఉపయోగకరంగా ఉంటుంది’ అని అన్నారు.

ఈ సంకలనాలు అందులో ఒక ఖాళీని తప్పక పూరిస్తాయి. నాలుగు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలోని మహిళా విప్లవకారులు రాసిన కథలివి. గోండి భాషలో ‘వియ్యుక్క ’ అంటే వేగుచుక్క అని అర్థం. ఇప్పటివరకూ మాకు దొరికినవి 282 కథలు. దాదాపు 50 మంది రచయితలు రాసిన కథలు ఆరు సంకలనాలుగా వెలువడుతున్నాయి. ఆ కథలను మళ్లీ రెండు ప్రధాన భాగాలుగా విడగొడితే సాయుధ విప్లవోద్యమం కథా వస్తువుగా తీసుకొని రాసిన కథలు 148. ఆ రచయితలే సమాజంలోని ఇతర విషయాలను గురించి రాసిన కథలు 134. అయితే ఈ కథలను రచయితల వారీగా కాకుండా విషయ వస్తువు ఆధారంగా విభజించి వివిధ శీర్షికల కిందికి తీసుకువచ్చాం. మొదటి మూడు సంకలనాల్లో విప్లవోద్యమం కథావస్తువు. తరవాతి మూడు సంకలనాల్లో ఇతర కథా వస్తువులతో వచ్చిన కథలతో పాటు అర్బన్‌ ఉద్యమానికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి.

‘విప్లవోద్యమ కథా సాహిత్యాన్ని బయట నుండి వచ్చినది, లోపలి నుండి వచ్చినది అన్న రెండు కోణాల నుండి అధ్యయనం చేయాల్సి ఉంది’ అని కూడా కాత్యాయని విద్మహే గారు పైన ఉటంకించిన వ్యాసంలో అన్నారు. ఆ రకంగా ఈ కథలు నేరుగా ‘లోపల’ నుండి వచ్చిన కథలు. ‘బయటి’ విషయాలను గురించి కూడా మాట్లాడే కథలు. నాలుగు దశాబ్దాల ఉద్యమ గమనాన్ని, చరిత్రను సృజనాత్మకంగా మన ముందుంచిన కథలు.

అజ్ఞాత రచయితల రచనలు సేకరించడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. సేకరించగలిగినా వాటిలో కూడా అజ్ఞాత రచయితలు అనేక కలం పేర్లతో రాయడం వలన కూడా అందులో మహిళలు రాసిన వాటిని వెతికిపట్టుకోవడం అంత తేలికగా జరగలేదు. విప్లవకారులు అమరులైనపుడు వారి జీవితం గురించిన పుస్తకాలు వెలువడిన సందర్భాల్లో వారి కలం పేర్లు, వారి రచనలు కూడా తీసుకొచ్చిన కొన్ని సందర్భాల వల్ల కొందరు మహిళా రచయితలను కనుక్కోవడం కొంత వరకూ సాధ్యమైంది. ఇద్దరు ముగ్గురు మహిళా రచయితల కథలను గతంలో సంకలనాలుగా తీసుకురావడం వల్ల కూడా కొన్ని కలం పేర్లను అర్థం చేసుకోగలిగాం.

ఎనభయ్యవ దశకం ప్రారంభంలో విప్లవోద్యమ నేపథ్యంలో వచ్చిన కొన్ని కథలు తొంభయ్యవ దశకంలో సంకలనాలుగా వచ్చాయి. వాటిలో మహిళల పేర్లమీద వచ్చిన కొన్ని కథలు నిజంగా మహిళలు రాసినవి కాదని మా పరిశోధనలో తెలుసుకున్నాం.

ఉదాహరణకు ‘నేలతల్లి విముక్తికోసం’(1990), ‘శ్వేతరాత్రులు’ (1993), ‘రుతుపవనాలు’ (1996) మొదలైన సంకలనాలు. ఇందులో కొన్ని కథలు మహిళల పేర్లతో వచ్చినప్పటికీ వాటిని పురుషులు మహిళల పేరుతో రాశారు. మరికొన్ని మహిళల పేర్లతో ఉన్న కథలు మహిళలే రాసినప్పటికీ వారు అజ్ఞాత రచయితలు కాదు. ఆ కారణంగా వాటిని ఈ సంకలనాల్లో చేర్చలేదు. ఈ సంకలనాల్లో చేర్చిన కథలు అజ్ఞాత మావోయిస్టు ఉద్యమంలో పని చేసి అమరులైనవారూ, కొనసాగుతున్న వారూ, అరెస్టయిన వారూ, ఏ ఇతర కారణాల వల్లనైనా కొంత కాలం పనిచేసి బయట ఉన్నవారూ రాసిన కథలు. అయితే ఇంకా ఎన్నో కథలు దొరకకుండా పోయాయి. ఉదాహరణకు న్యాలకొండ రజిత కూడా కొన్ని కథలు రాసిందని తెలుస్తోంది. కానీ అవి మాకు దొరకలేదు. మాసాని రవీందర్‌ పేరుతో ఆమె కథలు రాసినట్టుగా జనవరి-ఫిబ్రవరి 2004 అరుణతారలో అచ్చయిన షంషేర్‌ ఉత్తరం వల్ల తెలిసింది.

ఎల్లంకి అరుణ బిర్సా పేరుతో ఒక కథ రాసింది. ఈ విషయం కూడా పై ఉత్తరం వల్లనే కాకుండా ఆమె జీవితం, రచనలు పుస్తకంగా రావడం వలన ఆ కథ ఆమె రాసిందని తెలిసింది. అలాగే కొందరు రచయితల కలం పేర్లతో స్త్రీలా పురుషులా చెప్పడం కష్టం. ఉదాహరణకు, ‘స్పార్క్‌’, ‘సెలయేరు’ వంటి పేర్లు. స్పార్క్‌ అంటే గజ్జెల సరోజ అనీ, సెలయేరు అంటే చాడ విజయలక్ష్మి (ఈస్ట్‌ డివిజన్‌ కరుణ) అనీ వారు అమరులయిన తరవాత వచ్చిన వ్యాసాలను బట్టి తెలుసుకున్నాం. అలా తెలుసుకోలేకపోయిన కథలను చేర్చలేకపోయాం. ఉదాహరణకు, భూమి, నింజా వంటి పేర్లతో వచ్చిన కథలు. మహిళల పేర్లతో వచ్చిన కథలను కూడా వాళ్లు నిజంగా మహిళలే అనే విషయాన్ని అనేక ప్రయత్నాలు చేసి ధ్రువపరుచుకున్నాం. అలా ధ్రువపరచుకున్న కథలను మాత్రమే చేర్చాం.

1980లో మునుపటి సిపిఐ ఎం.ఎల్‌. పీపుల్స్‌వార్‌ పార్టీ ఏర్పడిన నాటి నుండీ 2004 లో రెండు ప్రధాన పార్టీల విలీనం జరిగి సిపిఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పడి కొనసాగుతున్న నేటి 2023 వరకూ నాలుగు దశాబ్దాలు పైబడిన కాలంలో ప్రధానంగా మూడు దశాబ్దాల కాలంలో మహిళలు కథలు రాశారు. ఇప్పటికీ రాస్తున్నారు. మొదటి దశకం చివరలో మాత్రమే కథా రచన ప్రారంభం అయినట్టు తెలుస్తోంది.

అజ్ఞాత దళజీవితం వడ్డించిన విస్తరి కాదు. రోజువారీ దళ జీవితంలో గంటల కొద్దీ నడక ఉంటుంది. నిరంతరం చలనంలోనే ఉంటారు కాబట్టి మోసుకుపోగలిగే సామాను అతి తక్కువగా ఉంచుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత సామానుతో పాటు సమష్టిగా ఉపయోగించుకొనే సామాన్లు, సరుకులూ కూడా తలా ఇంతా పంచుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి గుండుసూది కూడా బరువుగా తోస్తుంది. ఒక్కొక్కరూ తమ ఆయుధంతో కలిపి కనీసంగా 15-20 కిలోల బరువు మోసుకుంటూ తిరగాల్సివస్తుంది. యుద్ధరంగంలో ఉండడంవల్ల ఏమాత్రం ఏమరుపాటుగా ఉండే వీలుండదు. సౌకర్యవంతంగా కూర్చొని రాయడానికి కుర్చీలు, రాతబల్లలు ఉండవు. రాత్రిపూట రాయడానికి లైట్లు ఉండవు. క్యాంపులు వేసుకొని ఉండే సందర్భాల్లో తప్ప రోజువారీ దిన చర్యలో రాత్రి పూట వెలుతురే శత్రువు కనక రాసే అవకాశం ఉండదు. ముఖ్యంగా నిర్బంధకాలాల్లో అసలే వీలుకాదు. మైదానప్రాంతం నుండి దళాల్లోకి వెళ్లిన వాళ్లు ముందు ఆ జీవితానికి అలవాటు పడటానికే సమయం పడుతుంది. కాబట్టి వెంటనే కథా రచన కష్టమే అని చెప్పాలి. ఈ అన్నీ పురుష విప్లవకారులకి కూడా వర్తిస్తాయి. కాబట్టి తొలినాళ్లలో రాసిన వాళ్లలో చాలా మంది రచయితలు ఆ జీవితంతో సాన్నిహిత్యం ఉండీ, లేదా కొంతకాలం పని చేసి వచ్చిన అనుభవాలతోనో బయట నుండి రాసినవే ఎక్కువ కనిపిస్తాయి. అయితే విప్లవకారుల్లోని పురుష రచయితలు కొందరు దళజీవితంలో ఉంటూనే కూడా రచనలు చేశారు. అందులో బయట సమాజంలో కూడా చిరపరిచితులు ‘రాగో’ రచయిత సాధన. రాగో కంటే ముందు ‘అడవిలో అన్నలు’ పేరుతో సీరియల్‌ కూడా రాశారు. తరవాత ఇది ‘సరిహద్దు’ పేరుతో నవలగా అచ్చయ్యింది. అయితే అచ్చయిన వివరాల ప్రకారం సాధన కూడా 80 వ దశకంలోని రెండవ భాగంలోనే రాయడం మొదలుపెట్టారు.

సరిగ్గా అదే సమయంలో ‘అడవిలో అక్కలు లేరా’ అని ప్రశ్నించే చైతన్యాన్ని సంతరించుకున్న ‘అక్కలు’ తమ ఉనికిని చాటిచెప్పడమే కాదు విప్లవోద్యమంలోని అన్ని రంగాల్లో తమ స్థానాన్ని స్థిరపరచుకుంటూ వచ్చారు. ఎనభయ్యవ దశకంలో దండకారణ్యంలోకి దళాలు ప్రవేశించిన కొంత కాలానికి దళాల్లోకి మహిళలు రావడం మొదలయ్యింది. ఆ దశకం చివరినాటికి మైదాన ప్రాంతంలో ఏర్పడిన దళాల్లోకి కూడా తక్కువ సంఖ్యలోనైనా సరే మహిళలు చేరారు. నల్లమల, ఆంధ్ర ఒరిస్సా బార్డర్‌ లోని దళాల్లోకి కూడా మహిళలు ప్రవేశించారు.

అలా దళాల్లో ఉంటూ రాసిన కథల్లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన మొదటి కథ 1988 లో మయూరి పేరుతో ఎల్లంకి అరుణ రాసింది. ఆమె అమరత్వం తరవాత వచ్చిన వ్యాసంలో ఆమె గురించిన వివరాలు చూస్తే ఆమె 1983లోనే విద్యార్థిగా రాడికల్‌ విద్యార్థి సంఘంలో తన కార్యకలాపాలు మొదలుపెట్టినప్పటికీ పూర్తికాలం కార్యకర్తగా 1988లోనే ఆమె దళాల్లోకి వెళ్లిందని తెలుస్తోంది. వెళ్లిన తొలి నాళ్లలోనే ఆ కథ రాసినట్టు అర్థం అవుతోంది. ఈ సంకలనాల్లో చేర్చిన రచయితలంతా విప్లవోద్యమ పరిచయం అయిన తరవాతే, ఆ ప్రభావంతోనే ఈ కథలు రాశారు.

కొందరు రచయితలు తాము అడవి జీవితంలోకి వెళ్లక ముందే ప్రజా సంఘాల్లో ఉంటూ వివిధ మహిళా సమస్యలపైనా కథలు రాశారు. విప్లవోద్యమ నేపథ్యంతో కూడా కథలు రాశారు. ముఖ్యంగా రాడికల్‌ విద్యార్థిసంఘం కార్యకర్తలుగా పని చేసి తరవాత అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్న వాళ్లు రాసిన కథలు ఇంకొంచెం ముందుగానే మొదలయ్యాయి. అట్లాంటి కథల్లో మొదటిది రాడికల్‌ మార్చ్‌ లో ప్రచురితమైన ‘నిర్భంధాన్ని ధిక్కరిస్తాం’ కథ. నిలొవ్నా (కవినిగా సుపరిచితం) రాసిన ఈ కథ 1985లోనే వచ్చింది. అర్బన్‌ ఉద్యమాలకి సంబంధించి దొరికిన కథల్లో ఇదే మొదటిది అని చెప్పవచ్చు.

అర్బన్‌ ఉద్యమంలో అజ్ఞాతంలో ఉండి పనిచేసిన కొందరు మహిళా రచయితలు కూడా అడవి జీవితంతో పోలిస్తే తమకున్న వెసులుబాటును ఉపయోగించి అనేక కథలు రాశారు. కొందరు అజ్ఞాత జీవితంలోకి వెళ్లక ముందే కథలు రాయడం మొదలుపెట్టి వెళ్లాక కూడా కొనసాగించారు. మరికొందరు సుదీర్ఘ విప్లవ జీవితం గడిపి వ్యక్తిగత కారణాలతోకానీ, జైలు జీవితం గడిపి కానీ బయిటికి వచ్చాక ఆ జీవితానికి సంబంధించిన కథలు రాశారు. ఉత్తర తెలంగాణా ఉద్యమంలో పనిచేసిన నర్సక్క జైలు నుండి విడుదలయిన కాలంలో వనజ పేరుతో ‘అడవి పుత్రిక’,  భారతి ‘అమ్ములపొది’ నవలలను రాశారు.  ఈ సంకలనాలు కథలకే పరిమితం అవ్వడం వల్ల ఆ నవలలను ఇందులో చేర్చలేదు.

అజ్ఞాత రచయిత్రుల కథలు ఇప్పటివరకూ నాలుగు కథా సంకలనాలు రచయిత పేర్లతో అచ్చయ్యాయి. ‘జాజిపూల పరిమళం’ కథా సంకలనం ద్వారా షహీదా, ఆ పేరు మీదే కాక పి. శేషులత, ఎన్‌.డి., మణి, ప్రభాత పేర్లతో కూడా రాసిందని తెలుసుకున్నాం. ఒక కథ సుధాకర్‌ పేరుతో కూడా రాసింది. ఆ సంకలనంలో చేర్చిన 32 కథలకు రచయిత పేరు షహీదా అనే పేర్కొన్నాము. ‘జాజిపూల పరిమళం’ తరవాత షహీదా ఇంకా ఎన్నో కథలు రాసింది. అలాగే ‘మెట్ల మీద’ – మిడ్కో కథలు పేరిట వచ్చిన సంకలనం వల్ల మిడ్కో ఆ పేరుతోనే కాక నిర్మల, రేణుక, జమీన్‌ మొదలైన పేర్లతో కూడా రాసిందని తెలిసింది. ఆ సంకలనంలో చేర్చిన 18 కథలకు రచయిత పేరు మిడ్కో అనే పేర్కొన్నాం. తాయమ్మ కరుణ, టుంబ్రి అనే కలం పేరుతో కూడా రాసింది. ఆమె కథలు ఇప్పటికే సంకలనాలుగా వెలువడినాయి కనక తాయమ్మ కరుణ గానే ప్రస్తావించాం. నిత్య, సుజాత, మైనాల కథలు ‘సామాన్యుల సాహసం’ పేరుతో సంకలనంగా వచ్చాయి. అందులో చేర్చిన కథలు మాత్రమే కాక వారు రాసిన మరికొన్ని కథలు కూడా తరవాత దొరికాయి. 

ఉద్యమంలో నర్మదగానూ రచయితగా ‘నిత్య’ గానూ పరిచితమైన ఉప్పుగంటి నిర్మల క్యాన్సర్‌ వ్యాధికి చికిత్సకోసం హైదరాబాద్‌ నగరానికి వచ్చిన సమయంలో అరెస్టు అయ్యి నిర్బంధంలో ఉండగానే అమరులయ్యారు. ముంబయ్‌ లోని బైకులా జైలు నుండి ‘ఇంక వైద్యం అందించగలిగే పరిస్థితి లేద’ని చెప్తూ ఆమెను హోస్పైస్‌ సెంటర్‌కి తరలించాక అక్కడే అమరులయ్యారు. ఆమె పాఠకులకు నిత్యగానే చిరపరిచితులు కావడంతో అసలు పేరుతో కాక నిత్య గానే పేర్కొన్నాం. ఆమె ఒక కథ నర్మద పేరుతో కూడా రాసింది.

ఉద్యమ ప్రాంతంలో లలితగా, సాధనగా పరిచితమైన ఎల్లంకి అరుణ బిర్సా, ప్రణీత, మయూరి పేర్లతో రాసింది. ఆమె అమరత్వం తరవాత వచ్చిన ‘ప్రణీత సవ్వడి’ సంకలనం ఆధారంగా ఆమె రాసిన కథలకు ఎల్లంకి అరుణ అనే పేరునే వాడాం. గజ్జెల సరోజ స్పార్క్‌ పేరుతోనూ, ఒక కథ షహీదా పేరుతోనూ రాసినప్పటికీ ఆమె అమరత్వం తరవాత ‘గజ్జెల సరోజ రచనలు’ పేరుతో వెలువడిన పుస్తకం ఆధారంగా ఆమె కథలకు ఆమె అసలు పేరునే ఉంచాం.

సెలయేరు పేరుతో వచ్చిన రెండు కథలను ఉద్యమంలో (ఈస్ట్‌ డివిజన్‌) కరుణగా పరిచితమైన రచయిత అమరత్వం తరవాత ‘విప్లవమహిళ’ పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా చాడ విజయలక్ష్మి రాసిందని తెలుసుకున్నాం.

కా.దగ్గుబాటి కల్పన పల్నాడు ప్రాంతంలోనూ, రాయలసీమ లోనూ రెండు దశాబ్దాల పాటు పనిచేశారు. జిల్లా కమిటీ స్థాయిలో ఉండగా 2006 నవంబర్‌ 10 న కడప జిల్లాలోని బద్వేల్‌ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులయ్యారు. ఉద్యమ ప్రాంతంలోని ప్రజలకు రమణగా, చందనగా సుపరిచితులు. కల్పన పేరుతో ‘మహిళామార్గం’ లో వచ్చిన కథ ఆమె రాసినదే అని ఆమె మిత్రుల ద్వారా తెలుసుకున్నాం.

అమిడేలు విజయ ఆత్మకథగా ‘పోరుమహిళ’ పత్రికలో వచ్చిన కథ చివరన రచయిత విజయ అమిడేలులో అమరులైనట్టు పేర్కొన్నారు. ఆ విజయ అసలు పేరు జర్తా వెంకట లక్ష్మి అని ‘మహిళా అమరవీరుల జీవిత చరిత్రలు’ పుస్తకం ద్వారా తెలుసుకున్నాం. కా.జర్తా వెంకట లక్ష్మి కొండరెడ్ల తెగకు చెందిన ఆదివాసీ కామ్రేడ్‌. ఉద్యమంలోకి వచ్చాక చదువుకుని సాంస్కృతిక కార్యకర్తగా పనిచేస్తూ తన జీవిత అనుభవాన్ని కథగా రాసింది. సాయుధ జననాట్యమండలి దళానికి కమాండర్‌గా పనిచేసి అమరురాలైంది.

అర్బన్‌ ఉద్యమంలో మహిళలను సంఘటిత పరిచిన ఆదోని పద్మ ‘తుంగభద్ర’ పేరుతో రాసినప్పటికీ ఆమె అసలు పేరుతోనే ప్రచురించాం. ఈ కథ తదుపరి మూడు సంకలనాలలో ప్రచురించాం. పద్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటగా ఏర్పడిన మహిళా సబ్‌కమిటీ సభ్యురాలు.

విప్లవోద్యమ అవసరాలు ఎన్నో రకాలు. అందులో నాయకత్వం కోసం డెన్‌లు నిర్వహించడం కూడా ఒకటి. అటువంటి పనిని అనేక యేళ్లపాటు నిర్వహించారు ఆలూరి లలితగారు. ఎనభయ్యవ దశకంలో విజయవాడలో మహిళా సంఘంలో పనిచేసి మహిళా ఉద్యమానికి బాటలు వేసారు. రమాదేవి పేరుతో కథలు రాసారు.

                                                                                —

ఈ కథలకి బలం అంతా అందులోని విషయం. ఈ కథలేవీ కల్పించినవి కావు. నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న విప్లవోద్యమానికి సంబంధించిన నడుస్తున్న చరిత్ర. విప్లవోద్యమంలో నేరుగా పాల్గొన్న వాళ్లు తప్ప రాయలేని జీవితం. ఈ కథలు ఇవాళే కొత్తగా వచ్చినవి కాదు. ఎనభయ్యవ దశకంలో వచ్చిన రెండు, మూడు కథలు తప్పించి అనేక కథలు మూడు దశాబ్దాలుగా అరుణతార పత్రికలో వచ్చినవే. కొన్ని కథలు మహిళా మార్గంలోనూ, కొన్ని వివిధ సంకలనాల్లోనూ, వసంత మేఘం, విరసం డాట్‌ ఆర్గ్‌, కొలిమి వంటి వెబ్‌ పత్రికల్లోనూ వచ్చినవే. కొన్ని మాత్రమే ‘పోరుమహిళ’, ‘విప్లవ మహిళ’, ‘విప్లవి’, ‘తూర్పు కనుమ’ వంటి అజ్ఞాత పత్రికల్లో వచ్చాయి. మొత్తం సంఖ్యతో పోల్చి చూసినపుడు అవి పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ఆ రకంగా ఇవి ‘ప్రధాన స్రవంతి’లోనే నమ్రతగా నిశ్శబ్దంగా ఉండిపోయాయి. ఒక దగ్గర చేర్చితే కానీ ఇంతమంది మహిళా రచయితలను విప్లవోద్యమం తయారు చేసిందని అర్థంకాలేదు. అందులోనూ ఇంత పెద్ద సంఖ్యలో విప్లవ రచయిత్రులు ఉన్నారని కూడా ఊహించలేం. కొందరు ఒక్క కథ మాత్రమే రాసిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే శిల్ప నైపుణ్యాన్ని, తమదైన శైలినీ సంతరించుకుని చెయ్యి తిరిగిన రచయితలుగా పరిణతి పొందిన రచయిత్రులూ ఉన్నారు.

యదార్థ ఘటనలను యాథాతథంగా చిత్రించి, పాత్రల పేర్లను కూడా కల్పించకుండా శక్తివంతంగా రాసిన కథకులూ ఉన్నారు. ‘కల్పన కన్నా వాస్తవం వింతైనది’ అన్న నానుడిని ఇవి గుర్తుచేస్తాయి. ప్రతి పాత్రా ఇది కల్పితం కాదు, రక్తమాంసాలున్న మనిషి అనే గ్రహింపు కలిగి, చాలా భావోద్వేగానికి గురవుతాం. మనం రాసేది అందరికోసం కావచ్చు, కానీ సామాన్య ప్రజానీకానికి అర్థం కావడం ముఖ్యం అనే స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. పాత్రల సంభాషణల్లోనే కాకుండా రచయిత్రులు కూడా తమకు కలిగిన వర్గ చైతన్యం వల్లా, పీడిత ప్రజలతో మమేకం చెందడం వల్లా అదే భాషను ఉపయోగించి కథ చెప్పడం కూడా చూస్తాము. అలాగే విప్లవోద్యమంలోనే చదువు నేర్చుకుని కథలు రాసినవారు సహజంగానే ప్రజల భాషలోనే రాశారు. ఆ రకంగా ఇవి నేల మీద మొలకెత్తిన కథలు.

తెలంగాణాలోని వివిధ మాండలికాల్లో ఎక్కువ కథలున్నప్పటికీ తీర ప్రాంత ప్రజల భాషలోనూ, గోండీ భాషా పదాలను విస్తృతంగా ఉపయోగించిన కథలు, కొన్ని సంభాషణలను నేరుగా గోండిలో రాసి అనువాదం బ్రాకెట్లలో ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇన్ని కథలు రావడం వెనుక, విప్లవోద్యంలో జరిగిన సాహిత్య కృషి కూడా తక్కువేమీ కాదు. అటువంటి కృషి ఎలా జరిగిందన్నది తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అటువంటి కృషి గురించి బయటి సమాజానికి తెలియజేసిన మొదటి ప్రయత్నం 1993 లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దండకారణ్యం నుండి సమర్పించిన పత్రం ‘దండకారణ్య సాహిత్యోద్యమ పరిశీలన’.

‘విప్లవ రచయితల్లోని కొందరు నేటి వ్యవస్థను ప్రతిబింబించే కథలు తేవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా నెత్తుర్లోడుతున్న తెలంగాణా మాగాణ పల్లెల్లో రగుల్కొన్న విప్లవాగ్నులకు, ఆ మహాయజ్ఞంలో వీరోచిత త్యాగాలు చేస్తూ అసువులర్పిస్తూ సమిధలవుతున్న ప్రజల, విప్లవ కార్యకర్తల చరిత్రను అన్ని కోణాల నుండి విశ్లేషిస్తూ, ప్రతిబింబించేలా వాటికి కథా రూపం విస్తృతంగా ఇవ్వాల్సే ఉంది. పోరాట పల్లెల్లో, అడవిలో, మైదానాల్లో జరుగుతున్న అనేక మార్పుల్ని, ఉత్పత్తి సంబంధాల్లో ఆర్థిక జీవితాల్లో వస్తున్న మార్పుల్ని, భూసంబంధాల్లో జరుగుతున్న పరిణామాలను గతితర్కానుగతంగా ప్రజల ముందుంచడం నేటి రచయిత కర్తవ్యం. …….’ అని అందులో రాశారు.

‘మిలిటరీ రంగంలో ప్రజల విజయాల్ని, విప్లవకారుల విజయాలను, దీర్ఘకాల వ్యూహంతో శత్రువు ప్రజలపై దాడులకు సిద్ధపడుతుంటే ప్రజలు ప్రతిఘటిస్తున్న తీరును, నిర్బంధంలో ప్రజల అనుభవాలను, దళాల రోజువారీ కష్టాలను ఈ దేశంలో విప్లవాలను ప్రేమించేవారి ముందు, అశేష పీడిత ప్రజానీకం ముందు పెట్టాల్సిన అవసరం నిన్నటి కన్నా నేడు మనందరిపై మరింత సీరియస్‌ గా ఉందంటున్నాం’ అని కూడా రాశారు.

చేయవలిసిన కర్తవ్యాల గురించి సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం ఏమి రాసుకొన్నారో ఆ కర్తవ్యాలను చాలా వరకు విప్లవ మహిళా రచయితలు పరిపూర్తి చేసి మన ముందుంచారు. వాటిని అందుకొని విప్లవాభిమానుల ముందు, అశేష పీడిత ప్రజానీకం ముందు ఉంచే కర్తవ్యాన్ని నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నమే మీముందుకు వస్తున్న ఈ సంకలనాలు. నిజానికి అప్పటికి విప్లవోద్యమం నుండి నేరుగా కథలు రాసిన వాళ్లలో మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత. ఈ మూడు దశాబ్దాల్లో అనేక మంది కథలు రాశారు.

విప్లవోద్యమంలోకి వివిధ ప్రాంతాల నుండి, వివిధ సామాజిక వర్గాల నుండి, వివిధ చైతన్య స్థాయిల్లో ఉండే వాళ్లు వస్తారు. వారు పాత సంబంధాలన్నిటిలోని ప్రగతి నిరోధక భావజాలాన్ని దానికి సంబంధించిన భూమికను రద్దుచేసి నూతన మానవ సంబంధాలను నెలకొల్పుతున్నారు. తమ చుట్టూ జరుగుతున్న మార్పులకు అవి జరిగే పరిణామక్రమానికీ వారే కర్తలూ కర్మలూ క్రియలూ కనుక వాటిని అతి సహజంగా, జరిగిన వాటినీ జరుగుతున్న వాటినీ ముచ్చట చెబుతున్నంత సహజంగా రాసెయ్యగలిగారు. సంఘటనని కల్పించడం, దాని చుట్టూ కథ అల్లడం, దాని కోసం ఊహాగానం చేయడం ఒక కథని సృష్టించడం అనే ప్రక్రియ కాదిది. అబ్బురం అనిపించే వాస్తవాలను అతి సామాన్యంగా మానవ హృదయాలను స్పృసించేంత దగ్గరగా కథలాగా చెప్పడం. అందుకే ఈ కథలను, కథకులను విప్లవోద్యమం తయారుచేసింది. అనాదిగా తమ చరిత్రను మౌఖికంగా కథల రూపంలో చెప్పుకుంటూ రావడం తరతరాలుగా ప్రజల్లో ఉన్న ఒక అద్భుత కళ. దానికి ఒక లిఖితరూపం ఇచ్చి చరిత్రగా నమోదు చేస్తున్న ఈ ప్రయత్నం ఆ కళకు ఒక కొనసాగింపు. 

1997 డిసెంబర్‌ లో వెలువడిన ‘కొండగోగులు’ అనే కవితా సంకలనానికి రాసిన ముందుమాట ద్వారా అప్పటి భారత కమ్యూనిస్టు పార్టీ (మా.లె.) పీపుల్స్‌వార్‌ పార్టీ ‘1995 నవంబర్‌ లో పార్టీ అఖిల భారత స్థాయి స్పెషల్‌ కాన్ఫరెన్స్‌ జరగడానికి ముందు రాష్ట్ర స్థాయిలో జరిగిన అన్ని మహాసభల్లోనూ, స్పెషల్‌ కాన్ఫరెన్సు మహాసభల్లోనూ సాహిత్య వేదికలు నిర్వహించారు’ అని తెలుస్తోంది. దండకారణ్య ఫారెస్ట్‌ మహాసభ సందర్భంగా వెలువడిన సాహిత్యాన్ని ‘కొండగోగులు’ సంకలనంగా తీసుకొచ్చింది. రaంకార్‌ లోని ఒక నివేదిక ఆధారంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సాహిత్యకృషిని గురించి కొంత తెలుసుకోగలిగాం. వివిధ స్థాయి కాన్ఫరెన్సుల సందర్భంగా కానీ మీటింగులు కానీ జరుపుకొనేటప్పుడు వేసే క్యాంపులలో కొన్ని రోజులు స్థిరంగా ఒక దగ్గర ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ తెల్ల కాగితాలు ఇచ్చి ప్రతి రోజు సాయంత్రం రచనలు చేయించి ‘గెరిల్లా వాణి’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నడిపారు. 1997 లో నల్లమల అటవీ ప్రాంతంలో ఒక కథా వర్క్‌ షాపు జరిపారని అప్పట్లో ఆంధ్రజ్యోతిలో నివేదిక వచ్చింది. కానీ ఆ తరవాత ఆ కథలను సంకలనంగా తెచ్చే ప్రయత్నంలో ఉండగానే పోలీసుల రెయిడ్‌ లో పోగొట్టుకున్నారని తెలిసింది. ఈ మధ్య కూడా కథా వర్క్‌ షాప్‌ నిర్వహించుకున్నారని 2022 డిసెంబర్‌ లో వసంతమేఘం అంతర్జాల పత్రికలో వచ్చిన ‘కార్యశాల కాదు, జీవిత వెతల కలబోత శాల’ అన్న రిపోర్టు వల్ల తెలుస్తున్నది. 

నిజానికి ఇలాంటి సభలు జరపడం అంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో అప్రమత్తతతో రహస్యంగా జరుపుతారు. అలాంటి పరిస్థితిలో కూడా సాహిత్య సృష్టి చేయడం అంటే సామాన్య విషయం కాదు. ‘తూగుటుయ్యాలలూ, మృష్టాన్న భోజనాలూ’ కాదు కదా క్షణకాలం కూడా ఏమరుపాటుగా ఉండలేని సమయంలో సాగాల్సిన రచనలవి. విశ్రాంతి వర్గం ఏర్పడ్డాకే కథా రచన మొదలయ్యి ఉండొచ్చు కానీ ఏమాత్రం విశ్రాంతిలేని వర్గ పోరాటంలో ఉన్న ఎర్రసైనికులు దానిని అందిపుచ్చుకోగలిగారనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న వాస్తవం. అంతే కాదు కథలు రాయడానికి సమయం ‘కేటాయించుకోవాలే’ తప్ప అది ‘దొరకడం’ అంటూ ఉండదు. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్లు చెయ్యి తిరిగిన రచయితలైనా సరే వాళ్లు కథా రచన కోసం పరిమితంగా మాత్రమే సమయం కేటాయించవలసి వస్తుంది. వారికి ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి కనక వీటికోసం కేటాయించుకోవడం వీలు కాదు. కొత్తవారిని ప్రోత్సహిస్తూనే ఎక్కువ రాయగలిగేవారిని కాస్త తగ్గించమని కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. బయటి సమాజానికి విప్లవోద్యమం పట్ల ఉండే అపోహలను తొలగించి అది తీసుకొస్తున్న మార్పులను నమోదు చేసి ప్రజల ముందుకు తీసుకుపోవడానికి ఇదొక బలమైన మాధ్యమం అన్న విషయం గుర్తించాకా ఆమేరకు కొంత ప్రత్యేక కృషి కూడా జరిగింది.

విప్లవకారులు సాహిత్య పత్రికలు కూడా నడుపుతున్నారు. అలా మొదలయ్యిందే ‘రaంకార్‌’ పత్రిక. ఇది గెరిల్లాల మొదటి సాహితీ పత్రిక. ఈ పత్రిక 10 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వచ్చిన వ్యాసంలో ఇది చేతిరాతతో మొదలయ్యి తరవాత కంప్యూటర్‌ అక్షరాలలో కూడా వెలువడిరదని రాశారు. ఈ పత్రిక తెలుగు, హిందీ, గోండి ఇలా పలు భాషల్లోని రచనలతో తీసుకువస్తున్నారు. 2004లో పది వసంతాల పండుగ జరుపుకున్న ఈ పత్రిక మూడో దశాబ్దం కూడా త్వరలో పూర్తి చేసుకుంటుంది. తూర్పు పోరాటాల గడ్డ నుండి వెలువరిస్తున్న సాహిత్య సాంస్కృతిక పత్రిక ‘తూర్పు కనుమ’. మహిళా సమస్యలను గురించి విప్లవోద్యమంలోని మహిళా కామ్రేడ్స్‌ వివిధ ప్రాంతాల నుండి వివిధ మహిళా పత్రికలను కూడా నడుపుతున్నారు. దండకారణ్య క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం పత్రిక ‘పోరుమహిళ’ గా తెలుగులోనూ ‘సంఘర్షరత్‌ మహిళ’ గా హిందీలోనూ, గోండీ భాషలో కూడా వెలువడుతోంది. ఆంధ్రలో ఉద్యమం బలంగా ఉన్న కాలంలో ‘విప్లవ మహిళ’ పత్రికను ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌ కమిటీ ఏర్పడ్డాక ‘విప్లవి’ పత్రికను తీసుకువచ్చారు. ఇవి కొనసాగుతున్నాయో లేదో సమాచారం లేకపోయినప్పటికీ ఇలాంటి పత్రికలు కూడా గెరిల్లాల సాహిత్య సృష్టికి కేంద్రాలయ్యాయనేది ఒక వాస్తవం.

అజ్ఞాత పత్రికల్లో వచ్చిన కొన్ని కథలను, కథ అనే శీర్షిక కింద కాకుండా ‘స్పందన’, ‘నా అనుభవం’, ‘ఆదర్శ గెరిల్లా’, ‘ప్రజలే ఉక్కుకోట’ ‘ఇది కథ కాదు’ ఇలా రకరకాల శీర్షికల కింద కూడా వేశారు. అయితే ఈ సంకలనాలలో కథ స్వభావం ఉన్న ప్రతి రచననీ చేర్చాము. అవి వాస్తవ ఘటనలైనందుకు వాటికి ఏవో శీర్షికలు పెట్టి ఉండవచ్చు కానీ అవి నిస్సంశయంగా కథల జాబితాలోకి వస్తాయి. కొన్ని కథనాల రూపంలో  ఉన్నాయి. జ్ఞాపకాలను కూడా కొందరు పాత్రలు, సంభాషణలు ఉంచి రాసినప్పుడు వాటిని కథల కోవలోకి చేర్చగలిగాము కానీ పూర్తి జ్ఞాపకాలుగా ఉన్నవాటిని చేర్చలేదు. మొదటి మూడు సంకలనాల్లోని కథలు వివిధ విప్లవోద్యమ ప్రాంతాల్లోని విషయాలను వస్తువుగా చేసుకొని రాశారు. దండకారణ్యం నుండి మాత్రమే కాకుండా, ఆంధ్రలో నల్లమల, పల్నాడు ప్రాంతాల నుండి, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌ ప్రాంతం నుండి, ఉత్తర, దక్షిణ తెలంగాణా ప్రాంతాల నుండి రాసిన కథలు ఉన్నాయి. మూడు కథలు రaార్ఖండ్‌ ప్రాంత నేపథ్యంలో నుండి వచ్చినవి. గత దశాబ్ద కాలంగా విప్లవోద్యమ కథను బయటి సమాజంలో ‘దండకారణ్య కథ’గా వ్యహరిస్తున్నారు. దానిని విప్లవోద్యమానికి ఒక

ఉపమానంగా వాడడమే తప్ప విప్లవోద్యమ కథకు సరిహద్దులను ఏర్పరచడం కాదు.

అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి మొదటి కథ ఫలానా సమయంలో రాశారు అని నిర్ధారిస్తున్నాం గానీ, నిజానికి ఒక కథ రాయడం మొదలు పెట్టి దానిని ఒకే ప్రయత్నంలో పూర్తి చేయగలడం ఒక గొప్ప విషయం. పూర్తిచేయగలిగిన తరవాత దానిని అజ్ఞాత జీవితం నుండి బయటికి పంపడం మరొక సాహసవంతమైన ఘట్టం. వాటిని బయటికి మోసుకుపోయే ‘కొరియర్‌ ఎర్ర సైనికులు’ లక్ష్యం చేరేలోపు తమ ప్రాణాలను కాపాడుకోగలిగి, వాటిని చేర్చగలిగినపుడు మాత్రమే అవి మనకు చేరతాయి. రచయిత తాను రాసిన కథను బయటికి పంపేలోపు, ఏ ఎన్‌కౌంటర్‌ లోనో తన ప్రాణాలను, దానితో పాటు తన కిట్టునూ కాపాడుకోగలిగినపుడే అవి కొరియర్‌ వరకైనా వెళ్లగలిగేది. కాబట్టి ఇక్కడ ప్రచురణ కాలాన్ని బట్టే చెబుతున్నాం కానీ అది రచన జరిగిన కాలం కాకపోవచ్చు.

ఎన్నో సందర్భాల్లో పేపర్‌ వార్తల్లో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాల్లో కిట్లు దొరికాయి అని చదువుతుంటాము. తమ రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రతి వస్తువునీ అందులో పెట్టుకొని మోసుకు తిరిగే జీవితంలో కథలు కూడా అందులోనే ఉంటాయి కదా. అలా పోయిన కిట్లతో పాటు ఎన్ని కథలు మనకి అందకుండా పోయాయో? జేఎన్‌ఎం భాస్కర్‌ రచనలు చేయమని ప్రోత్సహించడమే కాకుండా అందరి రచనలను భద్రపరిచి వాటిని బయటకు పంపేవరకూ జాగ్రత్తగా మోసుకుతిరిగేవాడని రaంకార్‌ లోని ఒక వ్యాసంలో రాశారు. గెరిల్లాలు కృష్టా నదిని దాటుతూ పుట్టి మునిగి అమరులయినపుడు కా.భాస్కర్‌ తో పాటు కిట్టులోని అనేక రచనలు కూడా నది పాలయ్యాయని రాశారు. అజ్ఞాత పత్రికలు జాగ్రత్త పరచి బయటి సమాజానికి అందించే ప్రయత్నం ఎంతో జరిగినా బయట సమాజం వాటిని జాగ్రత్తగా పెట్టుకోలేకపోవడం వల్ల మరెన్ని మనకి దక్కకుండా పోయాయో? అందిన కథలు కూడా నిర్బంధాలు అరెస్టుల సందర్భాల్లో ఎన్ని పోగొట్టుకున్నామో లెక్కలు తీయలేము. ఆ రకంగా చూస్తే మనకు దొరికినవే వాళ్లు రాసిన కథల మొత్తం సంఖ్య అని నిర్ధారించలేము.

మైదాన ప్రాంతాల నుండి విప్లవోద్యమంలోకి వెళ్లి అడవి బాట పట్టిన చదువుకున్న వారే మొదట రచనలు చేశారు. తరవాత మెల్లగా చదువు నేర్చుకున్న వారు కూడా తమ అనుభవాలను కథల రూపంలో రాయగలిగారు. విప్లవోద్యమం స్థానికులను ఇముడ్చుకుని బయటివారు, స్థానికుల మధ్య తేడాని క్రమంగా రద్దు చేశాక స్థానికులు కూడా అన్నింటా అందిపుచ్చుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుని నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు. స్థానిక ఆదివాసీ మహిళలు రాసిన కథలు కూడా ఇందులో రెండు ఉన్నాయని నిర్ధారించుకున్నాం. అయితే ఈ సంఖ్య ఇంకొంచెం ఎక్కువే కూడా ఉండి ఉండొచ్చు. గోండి, కువ్వి భాషలలో చేసిన కొన్ని రచనలు అజ్ఞాత పత్రికల్లో ఉన్నాయి. రaార్ఖండ్‌ నుండి హిందీలో రాసిన ఒక కథను అనువాదం చేసి అరుణతారకు పంపారు. ఆ కథను కూడా ఇందులో చేర్చాము.

‘విప్లవోద్యమమా? అదెక్కడుందీ? ఇంకా ఉందా? మీకు కనిపిస్తోందా? మాకు కనపడటం లేదు మరి. ఏదో మారుమూల ఉండి ఉండొచ్చు. అది ప్రజల జీవితం మీద ఏమన్నా ప్రభావం వేస్తున్నట్టు మాకైతే అనిపించడం లేదు’ అని మాట్లాడేసి, విప్లవోద్యమానికి అందుబాటులో లేని ప్లాట్‌ ఫామ్‌ల మీద రాసేసే వారు ఒకసారి ఈ కథలు చదవాలి. ప్రజలే రచయితలుగా మారిన ఒక అద్భుతం ఇక్కడ కనిపిస్తుంది. ‘వర్క్‌ షాప్‌లు పెట్టి రచయితలను తయారు చేయగలరనుకోవడం ఒక భ్రమ’ అని విరసాన్ని నిరసించినవారికి కూడా ఈ కథలు ఒక వినమ్రమైన జవాబు చెప్తాయి. సృజనాత్మక సాహిత్య సృష్టి ఎవరి సొంత ఆస్తీ కాదు. ఎవరికో ఒకరికి మాత్రమే సాధ్యమైన నైపుణ్యం కాదు. రచయితలను కూడా తయారుచేసుకోవచ్చు. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరి నైపుణ్యం కానీ, దుష్టత్వం కానీ తయారైనదే. సమాజం తయారుచేస్తున్న అనేక వైకల్యాలను, విషాలను, దుర్మార్గాలనూ నయం చేసేందుకు విప్లవోద్యమం ‘నూతన మానవుల’ను తయారుచేసింది. వారు చరిత్రను నిర్మించడమే కాదు, చరిత్రను అనేక రకాలుగా నమోదు చేస్తున్నారనీ, ఎర్ర సైనికులుగా మాత్రమే కాదు రచయితలుగా, కళాకారులుగా, చరిత్రకారులుగా, వైద్యులుగా,  ఉపాధ్యాయులుగా వైవిధ్యమైన పాత్రలను నిర్వహిస్తున్నారనీ ఈ గాధలు నిరూపిస్తాయి.

ఉద్యమ ప్రాంతాల్లోని ప్రజలు ఈ కథల్లో తమ వారిని పోల్చుకోగలుగుతారు. ఇవి తెల్ల కాగితాల మీద ముద్రించిన నల్లని అక్షరాలు కావు. వాటి వెనుక మన అందరికోసం తమ ప్రాణాలని, వ్యక్తిగత సౌఖ్యాలని, పేరు ప్రఖ్యాతులనీ అలవోకగా త్యాగం చేసిన జీవితాలు ఉన్నాయి. విప్లవోద్యమం స్వప్నించే ఒక ప్రత్యామ్నాయ సమాజం మట్టి పరిమళాలు వెదజల్లుతూ ఈ కథల నిండా పరచుకొని ఉంది. 

నక్సల్బరీ ప్రభావంతో డెబ్బైల నుండీ తొంభైల వరకూ రష్యా, చైనా సాహిత్యాలు ముఖ్యంగా, కథలూ నవలలూ యువతరాన్ని కుదిపి వదిలిపెట్టాయి. వ్యక్తిగతంగా తమ జీవితాలను తీర్చిదిద్దుకొనే విలువలను అందించాయి. సమాజమార్పు కోసం జరిగే పోరాటంలో పాల్గొనేందుకు ప్రేరణనిచ్చాయి. ఆ కాలంలో పుంఖానుపుంఖాలుగా ఆ సాహిత్యం అనేక ఇతర భాషలతో పాటు తెలుగులోకి కూడా అనువాదం అయ్యింది. మన దేశంలోని విప్లవోద్యమం గురించి ఇలాంటి కథలు ఎప్పుడు రాసుకుంటామో అని అనుకున్న అప్పటివాళ్లలో అనేక మంది ఇప్పుడు ఆ కలను సాకారం చేశారు. అసలు ఆ సాహిత్యమే పెద్దగా తెలియని వారు సైతం వారికి తోడయ్యి ఈ కథలను మనకి అందించారు.

                                                                            …                                                     

కుల ఆధారిత భూస్వామ్య సమాజాల్లో, పెట్టుబడిదారీ సమాజాల్లో ఉన్న కరడు గట్టిన స్త్రీ పురుష అసమానత్వం, పితృస్వామ్యం వంటివి ఆదివాసీ సమాజాల్లో ఉండవనేది వాస్తవం. ఈ సమాజాలతో పోలిస్తే అక్కడ సాపేక్షికంగా స్త్రీ పురుష సమానత్వం, లైంగిక స్వేచ్ఛ ఎక్కువగానే ఉంటాయి. కానీ అక్కడ పితృస్వామ్య అణచివేత అనేదే ఉండదు, వర్గాలు ఉండవు అనే అభిప్రాయాలు చాలాకాలం బయటి సమాజంలోని మేధావులకి ఉండేవి. అక్కడికి వెళ్ళిన తొలి నాళ్లలో విప్లవకారులకు కూడా అటువంటి అభిప్రాయం ఒక మేరకు ఉండేది.అయితే ఆదివాసీ సమాజం కూడా కాలక్రమంలో మార్పులకి గురవుతుందనే గతితార్కిక సూత్రాన్ని మర్చిపోతేనే ఈ భ్రమలు ఉంటాయి. విప్లవోద్యమం అక్కడి జీవితంలోని మార్పులను తన నివేదికలూ, వ్యాసాలు, పత్రాల ద్వారా, డాకుమెంట్ల ద్వారా రికార్డు చేసింది. బయటి సమాజానికి పరిచయం చేసింది. ఆదివాసీ సమాజం మాతృ ఆధారిత గణసమాజంగా ఎల్లకాలమూ ఉండిపోదు కాబట్టి పితృస్వామిక సమాజం ఆదివాసీ జీవితాల మీద ప్రభావం వేసిన తరవాత, బయటి నుండి షావుకార్లు, దళారీలు వాళ్ల జీవితాల్లోకి ప్రవేశించాక ఎటువంటి మార్పులు జరిగాయో, ఆదివాసీ సమాజంలో వర్గాలు ఎలా ఏర్పడ్డాయో కూడా నిర్దిష్ట పరిశీలన చేసి బయటి సమాజానికి అందించారు. 

ప్రస్తుత ఆదివాసీ సమాజంలో మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో, మైదాన ప్రాంతాల నుండి విప్లవకారుల దళాలు దండకారణ్యం లోకి ప్రవేశించినప్పటికి వాళ్ల సమస్యలు ఎలా ఉన్నాయో చిత్రించిన కథలే మొట్ట మొదటి అంశం ‘రీతిరివాజుల సంకెళ్ళు’ అన్న శీర్షిక కింద చేర్చిన 12 కథలు. రాగో నవలలో సాధన రాసిన జీవితం వివిధ రూపాల్లో ‘రాగోలు’ ఎదుర్కొన్న సమస్యలను భిన్న కోణాల్లో ఈ కథలు చూపిస్తాయి. ప్రారంభ కాలంలో ప్రజలు విప్లవకారుల పట్ల అనుమాన దృష్టితో ఉన్నా, మెల్లగా వాళ్లని ఆదరించడం మొదలుపెట్టారు. వాళ్లు తమ సాంస్కృతిక జీవనంలో ఒక భాగమైన పాటల ద్వారా ‘అన్నల’కు తమ కష్టాలు చెప్పడం మొదలుపెట్టారని ‘ముప్పయ్యేళ్ల దండకారణ్య సాహితీ సాంస్కృతిక ఉద్యమం’ పుస్తకంలోని ముందుమాటలో పేర్కొన్నారు.

దళజీవితం ఎలా ఉంటుంది? రోజువారీ జీవితం, ఆహారం, నడక, ప్రజలతో సంబంధాలు, కార్యక్రమాలు మొదలైనవి విస్తారంగా చూపించే 8 కథలు ‘దళజీవితం’ శీర్షిక కింద ఉన్నాయి. కథా వస్తువు ఏదైనప్పటికీ ప్రధానంగా దళజీవితాన్ని చిత్రించిన కథలు ఇందులో ఉన్నాయి.

మనదేశంలో, ముఖ్యంగా ఆదివాసీ సమాజంలో నాలుగు దశాబ్దాల కిందట అక్షరాస్యత చాలా తక్కువ. కాబట్టి విప్లవోద్యమంలో చేరినవారు మొదటి నుండే చదువు నేర్చుకోవడం పరిపాటి. దైనందిన కార్యక్రమంలో అది ఒక తప్పనిసరి భాగం. చదువుకున్న వాళ్లు ఏ ప్రాంతంలో పని చేయడానికి వెళ్లారో అక్కడి భాషలను నేర్చుకోవడం కూడా తప్పనిసరి. సైద్ధాంతిక అధ్యయనం కూడా ఉంటుంది. ఆ రకంగా చదువుకోవడం దాదాపు అందరూ చేసే మొదటి పని అనుకోవచ్చు. అది ఎన్నిరకాలుగా సాగుతుందో ఆసక్తికరంగా తెలియజేసే 11 కథలు ‘చదువుకుందాం’ శీర్షికన ఉన్నాయి. 

బయటి సమాజంలో ఉన్న మానవ సంబంధాలను పెను మార్పులకి గురిచేసి వాటిని ఉన్నత స్థాయికి తీసుకుపోవడమే విప్లవోద్యమం చేసేపని. అటువంటి సంబంధాలలో స్త్రీపురుషుల మధ్య సాహచర్యం, వైవాహిక సంబంధాలు కూడా ఉంటాయి. స్త్రీలు చైతన్యవంతం అయ్యి విప్లవోద్యమ బాట పట్టినపుడు అప్పటివరకూ ఉన్న సంబంధాలు ఇంకా అలాగే ఉండిపోవడం అసాధ్యం. సహచరులిద్దరి చైతన్య స్థాయి సమానంగా  ఉన్నప్పుడే వాటికి నిలకడ ఉంటుంది. కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అవి కనీసం ఒకే దిశలో ప్రయాణించేలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సంబంధాలు ఉన్నతీకరణ చెంది నూతన ప్రమాణాలను అందుకోగలుగుతాయి. అయితే ఆ మార్పు అంత తేలికగా జరిగేది కాదు. ఏ మార్పైనా తీవ్ర ఘర్షణకి దారితీస్తుంది. ఒకరకంగా ఆ ప్రయాణాన్ని, ఘర్షణని, ఉన్నత స్థాయి సంబంధాలను అందుకొన్న క్రమాన్ని రేఖామాత్రంగానైనా చిత్రించే 12 కథలు ‘సాహచర్యం’ లో ఉన్నాయి.

పిల్లల్ని కనడం స్త్రీలకు ప్రకృతి ఆపాదించిన శరీర ధర్మం. దాని కారణంగా ఒకప్పుడు ‘సృష్టికర్తలుగా’ గౌరవం పొందిన స్త్రీలు తమ ఉన్నత స్థానాన్ని కోల్పోయి అధీనులుగా బ్రతకవలిసివస్తోంది. పిల్లలని పెంచడం అంత తేలికైన విషయం కాదు. విప్లవోద్యమంలో పురుషులతో పాటు సమానంగా పాలుపంచుకోవాలని కోరుకొనేవారికి పిల్లలని కనడం అంటే గెరిల్లా జీవితానికి దూరం కావడమే. అందువల్ల దండకారణ్యంలో మొట్టమొదట కాలుబెట్టిన మళ్ల రత్నమాల (నిర్మల) వంటి ఎందరో మహిళా విప్లవకారులు తమ పసిబిడ్డలను ఇతరులకి అప్పగించి గెరిల్లా జీవితంలోకి వెళ్లవలసివచ్చింది. దానిలో ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. తల్లులకి ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఒక దశాబ్దం గడిచేసరికి పిల్లల్ని కని మళ్లీ ఇతరులకి ఇవ్వడం కంటే అసలు కనకుండా ఉండడం మేలు అనే కఠిన నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయికి మహిళా గెరిల్లాలు రాగలిగారు. గెరిల్లాలకి తమ సొంతం అనేది ఏమీ లేనట్టే పిల్లలు కూడా తాము కంటేనే తమ పిల్లలు అనే సంకుచిత ప్రేమలు కూడా లేవు. పిల్లలని వదిలి వచ్చినప్పటి ఘర్షణ, పిల్లల్ని కనకుండా ఉండాల్సి రావడం గురించిన ఘర్షణ, ఇతరుల పిల్లలని తమ పిల్లలుగా ప్రేమించగలిగే ఔన్నత్యం సంతరించుకోవడం వంటి ఎన్నో భావోద్వేగాలను చిత్రించిన 8 కథలు ‘అమ్మతనం’ శీర్షికన ఉన్నాయి.

విప్లవోద్యమం అంటేనే సాయుధపోరాటం. చాలా మందికి స్త్రీల భాగస్వామ్యం పట్ల కొన్ని సందేహాలు ఉంటాయి. వాళ్ల పాత్రని సహాయక పాత్రగా తప్ప ఊహించలేకపో తారు. వాళ్లకి అసలు నిజంగా ధైర్యం ఉంటుందా? అసలు తుపాకి మోయడమేనా, నిజంగా దానిని వాడతారా? ఇలాంటి సందేహాలు కూడా వస్తుంటాయి. అలాంటి సందేహాలకి సమాధానం ఇచ్చే 11 కథలు ‘ప్రజా సైన్యం’ శీర్షికన ఉన్నాయి. నిజానికి కొందరు మహిళా కమాండర్లు, ఇంకా ఆపై నాయకత్వంలో పనిచేసిన మహిళా కామ్రేడ్స్‌ ప్రదర్శించిన అద్భుత మిలిటరీ సాహసాలను నమోదు చేస్తూ కథలు వచ్చివుంటే అవి మాత్రమే ఒక సంకలనం కాగలిగినన్ని ఘటనలు ఉన్నాయని అమరుల గురించి రాసిన సందర్భాల్లో వచ్చిన వ్యాసాల వల్ల అర్థం అవుతుంది.

ప్రజలతో వేరుపడిన ఉద్యమం అంటూ ఉండదు. ఉంటే అది కొనసాగలేదు. విప్లవకారులు నీళ్లల్లో చేపల్లా ప్రజలతో కలిసిపోతారు. ఆ ప్రజలు విప్లవకారులను తమ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే ప్రజలే ఉక్కుకోట అన్నారు. విప్లవకారులను కాపాడుకోవడానికి ఆ సామాన్యులే అసమాన సాహసాలు, త్యాగాలు చేస్తున్నారు. సహజంగానే అటువంటి ఘటనలకు కథారూపం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారని ఆ కోవలోకి వచ్చిన కథల సంఖ్య చెప్పకనే చెబుతోంది. ‘సామాన్యుల సాహసాలు’ శీర్షికన అటువంటి 21 కథలున్నాయి. అయినప్పటికీ ప్రజల పాత్రను, ముఖ్యంగా మహిళల పాత్రను తెలియజెప్పగలిగే విషయాల్లో ఇవి  పావువంతుని కూడా చిత్రించినట్టు కాదు.

పిల్లలు కూడా ప్రజలే అన్నారు ప్రసిద్ధ రష్యన్‌ కమ్యూనిస్టు నాయకురాలు కృపస్కయా. శత్రువుకానీ, నిర్బంధం కానీ పిల్లలకి ఏ మినహాయింపులూ ఇవ్వలేదు. పిల్లలు కూడా తమని తాము యుద్ధానికి సిద్ధం చేసుకోవడం తప్ప మరోదారిలేని పరిస్థితి. విప్లవ పురోగమనంలో వాళ్ల పాత్రని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము. ఆ విషయాన్ని నిరూపించే 8 కథలు ‘విప్లవమొలకలు’ శీర్షికన ఉన్నాయి.

వేలయేళ్లుగా పాతుకొని పోయిన పాత భావజాలాన్ని ధ్వంసం చేసి నూతన ప్రజా సంస్కృతిని స్థాపించడంలో కొన్ని పొరబాట్లు కూడా జరుగుతుంటాయి. అయితే జరుగుతాయి అని సరిపెట్టుకోడం కాకుండా జరిగిన వాటిని దిద్దుకోవడం చాలా ముఖ్యం. అలా చేయకపోతే ముందుకుపోవడం కూడా కష్టమే. దిద్దుకోవడం అంటే అది కేవలం కమిటీల్లో సమీక్షించుకోవడం కాదు, అది నిరంతరం జరిగేదే, వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లి అక్కడ బహిరంగంగా ఆ తప్పులను చెప్పి సరిచేసుకోవడం. అలాంటి దిద్దుబాటు క్యాంపెయిన్లు పార్టీ లోనూ, దళాల లోనూ, ప్రజా సంఘాలలోనూ, ప్రజల ముందు కూడా ఈ నాలుగు దశాబ్దాలలో (సమాచారం ఉన్న మేరకు) కనీసం మూడు సార్లు జరిగాయి. ఇవి కాక స్థానికంగా (రాష్ట్ర స్థాయిలో) జరిగినవి అదనం. పితృస్వామిక ధోరణులపై ప్రత్యేకంగా ఒక దిద్దుబాటు క్యాంపెయిన్‌ జరిగింది. అలాంటి క్యాంపెయిన్ల సందర్భంగా మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా చిన్నచిన్నవి అనుకునే వాటిని కూడా ఎలా దిద్దుకున్నారో తెలియజేసే 8 కథలు ‘దిద్దుబాటు’ శీర్షికలో ఉన్నాయి.

ఉద్యమ ప్రాంతాల్లో జైలుకి వెళ్లడం కూడా ఒక అనివార్య పరిణామం. కానీ విప్లవకారులకి సంబంధించిన అరెస్టులు, చిత్రహింసలు, జైలు పోరాటాల గురించి తగినన్ని కథలు రాలేదనే చెప్పాలి. ‘బందీకాని గొంతుకలు’ శీర్షికన 6 కథలు ఉన్నాయి.

నిర్బంధం గురించి బయట సమాజానికి ఎంతో సమాచారం ఉంది. ఎన్నో వార్తలు నివేదికలు, నిజనిర్ధారణల సందర్భంగా వెలికి వచ్చిన విషయాల్లో ఎంతో సమాచారం

ఉంది. కానీ అవి ప్రజల జీవితాలను ఎంత భయంకరంగా అతలాకుతలం చేసాయనేది మాత్రం ఈ నివేదికలు పట్టుకోలేవు. సరిగ్గా ఆ జీవిత చిత్రణ చేసిన 8 కథలు ‘నిర్బంధం-ధిక్కారం’ శీర్షికన ఉన్నాయి. నిర్బంధం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలు ఎలా ప్రతిఘటించడానికి పూనుకుంటున్నారో కూడా ఇందులో మనకి కనిపిస్తుంది.

సల్వాజుడుం అనే పదానికి అర్థం శాంతి యాత్ర. మహేంద్ర కర్మ నాయకత్వంలో సల్వాజుడుం పేరుతో చేసిందంతా సైనిక అణచివేత అభియాన్‌. గూడేల మీద దాడులు చేసి హత్యలూ, అత్యాచారాలూ, సజీవ దహనాలు, పంటలను తగలబెట్టటం, ప్రజలను ‘రాహత్‌ శిబిరాల’ పేరుతో ఏర్పాటు చేసిన కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులకు తరలించడం, క్యాంపులలో మహిళల పై నిరంతరం అత్యాచారాలు చేయడం. ఈ దుర్మార్గాలను చిత్రించిన 6 కథలు సల్వా ‘జులుం’ శీర్షికన ఉన్నాయి.

విప్లవోద్యమంలో అమరులైన వారి జీవితాలను చిత్రించిన కథలు 10 ‘అమరత్వగానం’ శీర్షికన ఉన్నాయి. అమరులైనవారి కుటుంబాలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు, తోడబుట్టినవారికీ అవి ఎంత ఆఘాతాలుగా పరిణమిస్తాయో చెప్పలేము. విప్లవకారులకు కుటుంబ సంబంధాలకన్నా వర్గ సంబంధం నుండి కలిగిన బంధువులే ఎక్కువ. రాజ్యహింసను ఎదుర్కొని రక్త సంబంధీకులకు ఆఖరి చూపులైనా కల్పించేందుకు వీరు చేసే కృషి, అమరుల జ్ఞాపకాలను పంచుకొని, వారి స్మృతిచిహ్నాలను నిలబెట్టే ప్రయత్నాలు వంటివి, ముఖ్యంగా ఆ తల్లుల వేదనను చిత్రించిన 21 కథలు ‘ధిక్కారమైన దుఃఖం’ శీర్షికన  ఉన్నాయి. వీటిని ఇలా వరుసగా చదువుకుంటూ పోతే నాలుగు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రను విహంగ వీక్షణంలో దర్శించవచ్చు. ఈ కథలు విప్లవోద్యమాన్ని నిజాయితీగా, కల్లాకపటంలేని ఒక స్వచ్ఛతతో నిస్సంకోచంగా పారదర్శకంగా దగ్గరగా చదువరుల ముందుంచుతాయి.

 అజ్ఞాత రచయిత్రుల రచనలను ‘ప్రధాన సాహిత్య స్రవంతి’ గా చలామణి అవుతున్న సాహిత్య ప్రపంచంలోకి తీసుకురావాలన్న విప్లవకారుల ప్రయత్నం ఈనాటిది కాదు. కానీ ముందే వివరించినట్టు అతికష్టంగా సేకరించుకున్న కథలు ఒక పద్ధతిలో పేర్చి అందించే లోపు అరెస్టులు, నిర్బంధాల్లో పోగొట్టుకొని మళ్లీ మళ్లీ ఆ ప్రయత్నాలను చేయవలిసిరావడంతో కనీసం ఒక దశాబ్ద కాలం ఆలస్యంగా ఈ రూపంలో బయటికి వస్తున్నాయి.

పుస్తకాలలోపలి చిత్రాలలో 12 బొమ్మలు మిత్రులు కా.కరుణాకర్‌ గారు అరుణతార కోసం గతంలో గీసిచ్చినవే. ఆయన అకాల మరణం అన్ని రకాల ప్రగతిశీల ఉద్యమాలకూ తీరని లోటు. ఈ సందర్భంలో ఆయనను ప్రత్యేకంగా స్మరించుకుంటున్నాం.

విప్లవోద్యమానికి సంబంధించిన ఏ పని అయినా సమష్టిగానే జరుగుతుంది. బాధ్యత ఒకరు తీసుకొని ఉండవచ్చు. కానీ ఎంతోమంది సహకారం లేకుండా జరగవు. ఈ ప్రయత్నం కూడా అలాంటిదే. ఎంతో మంది సహకరించినా ప్రత్యేకంగా కథలను ఆయా అంశాల కింద విభజించడంలోనూ, వాటి మీద అభిప్రాయాలను, సూచనలను ఇచ్చి, ప్రూఫ్‌లు చూసిపెట్టి, విలువైన సలహాలు ఇచ్చి సహకరించినందుకు అనల, అరవిందలకు, డిటిపి చేసిపెట్టిన రాముకు, ఇంకా ఇతరత్రా అనేక సహాయ సహకారాలు అందించిన వారికి, ఈ ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చిన విరసానికీ విప్లవాభినందనలు.  ఇక పదండి, విప్లవోద్యమ చారిత్రక కథాసమయంలోకి ప్రవేశిద్దాం.

జూలై 2023                                                                                                                                              

1. 2009 సెప్టెంబర్‌ 15,16 తేదీలలో తెలంగాణ తెలుగు కథ మీద కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన సెమినార్‌లో సమర్పించిన పత్రం. 2011, ఫిబ్రవరిలో డా.పంతంగి వెంకటేశ్వర్లుగారి సంపాదకత్వంలో వెలువడిన ‘తెలంగాణ తెలుగు కథ’ వ్యాస సంకలనంలో ప్రచురితం.

Leave a Reply