మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ అమూల్యమైన ప్రాణాలర్పించిన వేలాది సమరయోధులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ (జతీన్ దా) ఒకరు. ఆయన జైలులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ అమరణ నిరహారదీక్షకు పూనుకొని 63 రోజుల తర్వాత అమరుడైనాడు. ఆయన సంస్మరణలో సెప్టెంబర్ 13ను రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా పాటించడం మన దేశంలో ఒక పోరాట సంప్రదాయంగా నిలిచింది. ఎప్పటిలాగే ఈ యేడు కూడ రాజకీయ ఖైదీల హక్కుల దినం సెప్టెంబర్ 13నాడు దేశ వ్యాప్త జైళ్లలోని ఖైదీలు, విచారణలోని ఖైదీలు  సంకల్ప దినంగా పాటించాలనీ. బయట ప్రజలు కూడ వారికి సంఘీభావంగా నిలిచి వారిని బేషరతుగా విడుదల చేయాలనీ, జైళ్లలో వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ నినదిదించాలి.

కామ్రేడ్ జతీన్ దా 1904 అక్టోబర్ 27నాడు కొలకతాలో జన్మించాడు. ఆయన తన విద్యార్థి జీవితం నుండే విప్లవ కార్యకలాపాలలో పాలుపంచుకుంటూ తర్వాతి క్రమంలో ‘‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ’’ (HSRA) తో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. ఆ విప్లవ సంస్థ కార్యకలాపాలలో భాగంగా ఆయన కామ్రేడ్ భగత్ సింగ్ తో కలిసి 14 జూన్ 1929 అరెస్టునాడు అరెస్టు అయ్యాడు. కామ్రేడ్ భగత్ సింగ్ నాయకత్వంలో వారు జైలు సమస్యల పరిష్కారానికై 13 జులై 1929 అమరణ నిరహారదీక్ష ప్రారంభించారు. వాటిలో విప్లవకారులను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ, నిరంకుశ జైలు అధికారులను శిక్షించాలనే డిమాండ్స్ ప్రముఖమైనవి. ఆ డిమాండ్ల సాధనకై పోరాడుతూ 63 రోజుల నిరహారదీక్షతో ఆయన ఆరోగ్యం పూర్తిగా శుష్కించి తుదకు 13 సెప్టెంబర్ 1929 నాడు అసువులు బాసి అమరుడయ్యాడు. ఆ అమరునితో పాటు భారత జైళ్లలో రాజకీయ ఖైదీల హక్కుల కోసం పోరాడి అసువులు బాసిన స్వతంత్ర్ర్య సమరయోధులందరినీ స్మరించుకుంటూ ముందుగా జోహార్లు అర్పిద్దాం. వారి ఆశయాల సాధనలో భాగంగా జైళ్లలోని విప్లవకారులందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనే 94 ఏళ్లనాటి డిమాండ్ ను నిరవధిక పోరాటాల ద్వారనే సాధించుకోవాలనీ,  ప్రజల ప్రజాస్వామ్య కోసం దృఢంగా పోరాడుదామనీ ఆనాటి అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి పోరాట స్ఫూర్తిని నిలబెడుతామని ప్రతిన పూనాలి.

భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ గత సంవత్సరం భారత దేశంలోని రాజకీయ ఖైదీల విడుదల కేంపెయిన్ చేపట్టి ఆరు మాసాలు కొనసాగించింది. ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల ముందుకు సమస్యను తీసుకెళ్లి భారతదేశ అతి విశాల ప్రజాస్వామ్య డొల్లతనాన్ని ఎండగట్టింది.  తిరిగి 2023 జులై మాసాంతం భారత, ఫిలిప్పీన్స్ ప్రజాయుద్ధ అమరులను సంస్మరించుకోవడంతో పాటు, రాజకీయ ఖైదీల విడుదలను కోరుతూ ప్రజల ముందుకు మరో విడుత తీసుకెళ్లడాన్ని  ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించాలి.

గత దశాబ్దకాలంగా మన దేశాన్ని హిందుత్వ ఫాసిస్టు శక్తులు పాలిస్తున్నాయి. ఆ దుష్ట శక్తులు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి ఒక వైపు పరమ నిరంకుశ విధానాలను అనుసరిస్తూ, మరో వైపు ప్రజలను తప్పు తోవ పట్టించడానికి అనేక కుట్రలు, కుహకాలకు పాల్పడుతున్నాయి. వారు కామ్రేడ్స్ భగత్ సింగ్ నుండి జతీంద్రనాథ్ దాస్ వరకు; గాంధీ నుండి అంబేడ్కర్ వరకు తమకు అవసరమైన వారిని ఎవరినీ వదలకుండా ‘‘ఆరాధిస్తున్నారు’’. భారత స్వతంత్ర్యోద్యమంలో ఎన్నడూ పాలుపంచుకొనని, పైగా దానిని ద్వేషించి, వ్యతిరేకించి వలసాధిపతుల పల్లకి మోసిన వారి మాతృ సంస్థ ‘‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’’ (ఆర్.ఎస్.ఎస్) శిక్షణలో రాటుతేలిన మన దేశ వర్తమాన హిందుత్వ పాలకులు స్వతంత్ర్య సమరయోధులను కీర్తిస్తున్నారంటే, ‘‘ఆజాదీకి అమృత్ మహోత్సవ్’’, ‘‘మేరీ మాటి-మేరా దేశ్’’ అంటున్నారంటే నిజానికి ఆచరణలో సమరయోధులను, వారి ఫలాలను, స్వప్నాలను ధ్వంసం చేయడానికేనన్నది అసలు నిజం. వాటి పేరెత్తుకోవడానికైనా వారు ఎంతమాత్రం అర్హులు కారనీ వారి గత ఆచరణే తేటతెల్లం చేస్తున్నది.

హిందుత్వ పాలకులు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలకు, హిందుత్వ మత  విద్వేష విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ప్రశ్నిస్తున్న, పోరాడుతున్నప్రతి ఒక్కరిని ఆ ఫాసిస్టులు వేదిస్తున్నారు, హింసిస్తున్నారు, తప్పుడు ఆరోపణలతో కటకటాల పాలు చేస్తున్నారు, కాదంటే నిర్ధాక్షిణ్యంగా హత్య చేయడానికీ వెనుకాడడం లేదు. వారెంతటి నిరంకుశ ఫాసిస్టు విధానాలకు పాల్పడినా దేశంలోని నిజమైన దేశ భక్తులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, పోరాటకారులు, సామాజిక రాజకీయ కార్యకర్తలు తమ పోరాటాలను మరింత సమరశీలంగా కొనసాగించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా గుర్తించాలి.

ఈ సంవత్సర కాలంలో వివిధ స్థాయిలలోని విప్లవకారులతో పాటు ఉద్యమ ప్రాంతాలలోని అనేక గ్రామాల నుండి విప్లవ ప్రజాసంఘాల నాయకులను, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, గ్రామాలలో తమ హక్కుల సాధనకై చట్టబద్ధంగా పోరాడుతున్న సాధారణ ఆదివాసీ గ్రామసభల కార్యకర్తలను పోలీసులు మావోయిస్టులంటూ వేల సంఖ్యలో అరెస్టు చేసి తప్పుడు కేసులలో ఇరికించి జైలు పాలు చేశారు. పట్టణాలలో, మైదానాలలో ప్రభుత్వ దురహంకారాన్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను, హిందుత్వ శక్తుల ఆగడాలను ప్రశ్నిస్తున్న, వ్యతిరేకిస్తున్న బుద్ధిజీవులను, కవులను, రచయిత లను, కళాకారులను, వకీళ్లను, అధ్యాపకులను, ఉపాధ్యాయులను, హక్కుల కార్యకర్తలను, సామాజిక కార్యకర్తలను విచక్షణా రహితంగా అరెస్టులు చేస్తున్నారు. వారిపై కక్షసాధింపు చర్యలలో భాగంగా ఎన్ఐఏ దాడులు కొనసాగిస్తున్నది.

ఇటీవల తెలంగాణలో 152 మంది బుద్ధిజీవులు, కవులు, కళాకారులు, హక్కుల కార్యకర్తలు, సామాజిక రాజకీయ కార్యకర్తలపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం ‘ఊపా’ను మోపగా వారు తీవ్రంగా ఖండిస్తూ ఊపాను ఎత్తివేయాలనీ గట్టిగా పోరాడుతున్నారు. వారికి హిందుత్వ వ్యతిరేక శక్తులన్నీ అండగా నిలవాల్సిన అవసరం వుంది. హిందుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటమనే ఆయుధానికి మరింత పదను పెడుతూ, పోరాడేవారిని చెరసాలలు,    ఉరికొయ్యలు భయపెట్టలేవనే వాస్తవాన్నిపోరాటాల ద్వారానే నిరూపించాలి. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా ముంబాయిలోని తలోజా జైలులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ రంగాలకు చెందిన ప్రజాహిత సామాజిక రాజకీయ కార్యకర్తలకు కనీసం బెయిల్ అయినా ఇవ్వకుండా న్యాయస్థానాలు మౌలిక న్యాయసూత్రాలనే ఉల్లంఘిస్తున్నాయి. దాదాపు దశాబ్దకాలానికి పైగా నాగ్ పుర్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న 90 శాతం అంగవికలుడైన ప్రొ. సాయిబాబాను ముంబాయి ఉన్నత న్యాయస్థానం నిర్ధోషిగా ప్రకటించి విడుదల చేయాలనీ ఆదేశించగా, పాలకులు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి తమ  ‘సత్తా’ను ప్రదర్శించి ఉన్నత న్యాయస్థాన తీర్పును చెల్లకుండా చేసి పరిహసించారు. అనేక మంది నిర్ధోషులైన వాళ్లు తప్పుడు కేసులలో యేళ్ల తరబడి విచారణలోని ఖైదీలుగా జైళ్లలో మగ్గుతూ, తుదకు విడుదలై, తమ విలువైన కాలాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు. చేయని నేరాలకు యేళ్ల తరబడి  జైలు పాలు చేస్తున్నజవాబుదారీతనం తెలియని రాజ్యాన్ని ప్రశ్నించేవాళ్లు కరువవుతున్నారు.

దేశాన్ని హిందూ ‘రాష్ట్రం’గా మార్చడానికి సకల ప్రయత్నాలు, కుట్రలు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు ఇటీవలే ముగిసిన పార్లమెంటరీ సమావేశాలు ప్రబల సాక్ష్యంగా వున్నాయి. పార్లమెంటులో ఆమోదించిన 23 బిల్లులలో ఏ ఒక్కటీ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చేది కాదు. అవన్నీ భారత రాజ్యాంగం దేశ పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను, హామీలను ఉల్లంఘిస్తూ దేశంలో సులభ వ్యాపారాన్నితెగ ప్రోత్సహించేవే అనడానికి 19 విభాగాలతో కూడిన జన్ విశ్వాస్ (సవరణల) బిల్లు- 2023, గనులు, ఖనిజాలు (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) బిల్లు – 2023, డిజిటల్ డాటా ప్రొటెక్షన్ బిల్,  అటవీ సవరణ చట్టం 2023, జాతీయ పరిశోధన సంస్థ బిల్లు-2023, అడ్వకేట్ల (సవరణ) బిల్లు – 2023, ది ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లైన్) బిల్ – 2023 లాంటివి మచ్చుకు నిదర్శనంగా వున్నాయి. అదే మార్గంలో రానున్న శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టడానికి మరిన్ని బిల్లులు సిద్ధంగా వున్నాయి. వాటిలో‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్’ఒకటి. ఇవన్నీనామమాత్ర దేశ సార్వభౌమత్వానికి, రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు, రూపొందించిన ఆదేశిక సూత్రాలకు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిపై భారత రాజ్యాంగాన్ని త్రికరణశుద్ధిగా గౌరవించేవారు ఏ ఒక్కరూ మౌనంగా వుండరాదు. 2047వరకు అంటే, వందేళ్ల భారత ‘‘స్వాతంత్ర్య’’ వేడుకల నాటికి దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలనీ గడువు పెట్టుకున్న హిందుత్వ శక్తులు అప్పటికి భారత రాజ్యాంగాన్నే సమూలంగా మార్చివేసే భారీ పథకంతో తమ సత్తాను నిరంకుశంగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వారి ప్రతి రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక చర్యను గట్టిగా వ్యతిరేకించాలనీ రాజకీయ ఖైదీల హక్కుల దినం సందర్భంగా ప్రతినబూనాలి.

మన దేశ హిందుత్వ పాలకులు గత ఐదు మాసాలుగా మణిపుర్ లో కుకీ ప్రజలపై మారణహోమాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ ఒక రకమైన ‘అంతర్యుద్ధం’ సాగుతోంది. అది హిందుత్వ పాలకుల దుష్ట ఫాసిస్టు ఆర్థిక, రాజకీయ, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా తమ గుర్తింపు, అస్థిత్వం, ఆత్మ గౌరవం కోసం, తమ అటానమస్ కోసం కుకీ  ప్రజలు సాయుధంగా పోరాడుతున్నారు. వారిపై అనేక తప్పుడు కేసులు ఆరోపిస్తూ ఎంతో మందిని జైలు పాలు చేస్తున్నారు. జల్, జంగల్, జమీన్ పై అధికారం కోసం దేశంలోని ఆదివాసీలు పోరాడుతున్నారు. రైతాంగం తమ న్యాయమైన హక్కుల సాధనకై రోడ్ల మీదికి వస్తున్నారు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. కానీ, ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాశవిక పోలీసు బలగాలతో, చట్టాలతో, అన్యాయ తీర్పులతో అణచివేతే సాధనంగా పాలిస్తున్నారు. మన దేశంలోని మత మైనార్టీలు ముఖ్యంగా ముస్లిం సోదరుల జీవితాలకు ఏ మాత్రం భద్రత లేకుండా పోయింది. అందుకు ఒక తాజా ఉదాహరణ హర్యాణా రాష్ట్రంలోని నూహ్ లో చోటు చేసుకున్న విధ్వంసకాండ. దేశంలోని అనేక పట్టణాలలో వివిధ సాకులతో బుల్ డోజర్లతో ముస్లిం ప్రజల ఆస్తులను కూలుస్తూ, జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. వారిని పరాయి దేశస్థులుగా పరిగణిస్తూ వారితో పూర్తిగా శతృ వైఖరితో వ్యవహరిస్తున్నారు. వారికి లౌకిక, ప్రజాస్వామిక శక్తులన్నీ అండగా నిలువాలి. దేశంలోని మూలవాసీ ప్రజలు ప్రజాధర్నా అనే సమరశీల పోరాట రూపాన్ని ఎంచుకొని బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర మున్నగు రాష్ట్రాలలో తమ రాజ్యాంగ హక్కుల సాధన కోసం నెలల తరబడిగా పోరాడుతున్నారు. వారి ధర్నా స్థలాలపై పోలీసు బలగాలు తీవ్రమైన దాడులకు, హత్యలకు (నరసంహారాలు), అత్యాచారాలకు,  పాల్పడుతున్నప్పటికీ, రాజ్యం వారిపై ఆకాశదాడులను కొనసాగిస్తున్నప్పటికీ వారు వెనుకంజ వేయడం లేదు. దేశ వ్యాప్తంగా అనేక జైళ్లలో నిరపరాధులైన మూలవాసీలు జీవితఖైదీలుగా, దీర్ఘకాల జైలు శిక్షలను అనుభవిస్తున్నారు. సంవత్సరాల తరబడిగా వేల సంఖ్యలోని మూలవాసీలు విచారణలోని ఖైదీలుగా జీవితం గడుపుతున్నారు. వారి గురించి న్యాయస్థానాలలో పోరాడే అనేక మంది వకీళ్లు, హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు కటకటాల పాలవుతున్నారు. అయినప్పటికీ, ప్రజల పోరాటాలు ఆగడం లేదు. వారి పక్షాన నూతన శక్తులు ముందుకు రావడం కొనసాగుతునే వుంది. సెప్టెంబర్ 13 సందర్భంగా మన దేశాన్ని కాపాడుకోవడానికి, మన దేశ వైవిధ్యాన్ని నిలుపుకోవడానికి, మన దేశ సంపదలను, పర్యావరణాన్ని, ప్రజలను పరిరక్షించుకోవడానికి పోరాడి జైలు పాలైన వారి విడుదలకు పోరాడుదామనీ, వారి పోరాట సంప్రదాయాలను కొనసాగిస్తామని శపథం చేద్దాం.

Leave a Reply