ఏప్రిల్ 14,2023న రాష్ట్ర4 రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న డా||బి. అర్ అంబేడ్కర్ విగ్రహ అవిష్కరణ జరగడం ఒక మంచి పరిణామమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం వలన తెలంగాణ పౌర సమాజం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో అంబేడ్కర్ నీ సమరించుకోవడం అనేది ఇక్కడి ప్రజల బాధ్యతగా భావించవచ్చు. అది వారి గుండెల్లో చెరగని ముద్రగా, ఇంటి పెద్దలను తలచినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ నేలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం మెండు. ఎవరు ఏది సహాయం చేసిన వారి ప్రాణం ఉన్నంత వరకు మరవ లేరు. అది ఇక్కడి నేలలోని సాంప్రదాయం. అదే విధంగా ఈ నేలకు పోరాట పటిమ ఎంతో ఉన్నది. ఈ రెండు కలగలిసిన గంగా జమున తేజీభ్ సంస్కృతి ఇక్కడది. అలా తెలంగాణ నేల విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. అలాంటి పోరులో అనేక మంది అమరులైనారు. వారి పోరాట ఫలితమే నేటి స్వరాష్ట్రం.
ఇక్కడ అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ప్రకాష్ అంబేడ్కర్ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధ్యతను నిలబెట్టాడు. ఈ అంశంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. ఇక్కడే తెలంగాణ ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు సందించాల్సిన అవసరం ఉన్నది. నేడు తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావడం అంబేడ్కర్ ఒక కారణం అయితే. ఇక్కడి నేలలో జరిగిన పోరాటాలు కూడా ఒక కారణం. నాటి నైజాం రాజుల పాలనను అనేక రాజుల పాలనను ఎదిరించిన గోండు వీరులు కొమరం భీం, వెయ్యి ఊడలమర్రికి వేలాడదీసిన రాంజీ గోండు, విసునూరు దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య, నైజాం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ, ఇలా ఎందరో జ్ఞాత, అజ్ఞాత వీరులున్నారు. వారి పోరాటం ఈ నేలలో ఇమిడి ఉన్నది.
ప్రజా పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్న సత్యాన్ని గ్రహించుకోవాలి. అలాంటి స్వరాష్ట్రంలో అమరులను తల్చుకోవడం అనేది ఈ నేల బాధ్యతగా రుణపడి ఉండాలి. అయితే ఇక్కడ వివిధ పోరాటాల్లో అమరులైన వారు ఉన్నారు. అందులో తెలంగాణ నేల కోసం పోరాడిన వాళ్లు ఉన్నారు, ఈ నేల విముక్తి వర్గ పోరాటం ద్వారానే అని విశ్వసించి తమ ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్లు ఉన్నారు. ఇక్కడ అమరులను తల్చుకోవడం అంటే నేరమే అయినట్టు ఉన్నది. రాజ్యం తనకు నచ్చిన, తనకు ఫలితం దక్కే పని చేస్తుంది, చేయిస్తుంది తప్ప ప్రజల మనసు ఎరిగి నడుచుకోదు. విశాల ప్రజానీకం దృక్పథం నుండి ఏ పాలక ప్రభుత్వాలు నడుచుకోవు. అందుకే ఈ రాజ్య హింస ఇంక పేట్రేగిపోతోంది. దీనికి సమాధానం ప్రజా పోరాటమే పరిష్కారం చూపుతుంది.
ఇక్కడ కానీ నేల మీద ఎక్కడైనా కానీ ప్రజల పక్షం వహించిన వారిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని కొలుస్తారు/తలుస్తారు (కొలుస్తారు అనే పదం హిందూ సాంప్రదాయం కావచ్చు కానీ అది ప్రజలు వారిని ఒక ఉన్నత స్థితిలో చూడడం మాత్రమే..). అలా ఎవరి విధానంలో వారు వారి అమరులను యాది చేసుకుంటారు. అయితే ఇక్కడి నేల మీద ప్రత్యామ్నాయ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆ రాజకీయాలు ప్రజల అండతో ముడి పడి ఉన్నాయి.
ఆ రాజకీయాల్లో అమరులైన వారిని స్మరిస్తూ స్థూపం నిర్మించుకోవడం నేరమా..? నివాళి అర్పించడం నేరమా..? నేరమే అయితే మీరు మీ వాళ్ళను స్మరించుకోవడం నేరమే కదా..? ఈరోజు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించి రాజ్యాంగ ఉల్లంఘనలు చేయడమే కదా..?
రాజ్యాంగం హక్కుల్ని కల్పించింది. మీరు ఆ హక్కుల్ని అనిచివెస్తున్నారు. ఇదెక్కడి ద్వందా నీతి.! ఎవరి సంప్రదాయాలు వారివి అని మీరే ప్రసంగిస్తారు. మరీ ఇక్కడ స్మరించుకోవడం వారి సాంప్రదాయం కదా.? వారి సాంప్రదాయాన్ని అడ్డుకోవడం ఏంటి.? తెలంగాణ స్వరాష్ట్రం వచ్చి పది ఎండ్లు కావస్తుంది. ఇప్పటికైనా మీరు అమరులను స్మరించుకోవడం నేరంగా పరిగణించే సాంప్రదాయాన్ని విడనాడండి.ప్రత్యామ్నాయ రాజకీయల మీద మీ దమన నీతిని మార్చుకోండి.అమరుల స్థుపాలను ప్రజలే నిర్మించారు వారిని స్మరించుకునే విధానంపై ఆజ్ఞలను తొలగించండి.