కథలను చివరి వరకూ  బ్రతికించేది..జీవద్భాషే అనిపిస్తుంది ఈ కథలను చదివినప్పుడు.అవును!కథా లక్షణాల బరువులను సూత్రీకరణలను,  నియమాలను, వస్తువు ,శైలి, శిల్పంఇలాంటివి కాసేపు పక్కన పెడితేనికార్సయిన జీవద్భాష లో మనుషులు సహజంగా మలినం లేకుండా మాట్లాడుకుంటే, రచయిత ప్రమేయమే లేదనేంత  సహజత్వం ఉంటేఅవి “మునికాంతనపల్లి” కథలు అవుతాయి.
ఇవి కథలు కావు కతలు. ఊహించి రాసినవి కావు, కల్పనలు అసలే కావు. కొంచెం అలా నెల్లూరు జిల్లా దాకా వెళ్లి వస్తే, అక్కడ  మనం వినాల్సిన గుండెలు గొంతులు,మనసులు చాలా ఉన్నాయని, మనం తప్పకుండా వినాల్సిన సత్యాలు చాలా కాలం చాలా  మరుగునే ఉండిపోయాయని, ఇన్నేళ్లకు ఆ గొంతుల్ని ఆ గుండెల్ని , ఆ మనసుల్నివినే అవకాశాన్ని సోలోమోన్ విజయకుమార్ కల్పించారని అర్థం అవుతుంది.ఇలాంటి కథలు చదివాక  కథ ఆకాశంలో ఉండదని, నేల మీద తడి కాళ్ళతో నడుస్తుందని, కన్నీళ్లు ఆకలి అవమానం అసహాయత పరాజయం, వీటితోపాటు మానవీయత కోసం, బ్రతకడం కోసం, ఆత్మ గౌరవం కోసం, జీవించడం కోసం మనిషి సహజంగా చేసే పోరాటమే  చరిత్ర అని మనకు అర్థం అవుతుంది.  జీవితంలో నిలదొక్కుకోవాలని, కూడు గూడు గుడ్డ తో పాటు, మనుషులు అందరితో సమానంగా బ్రతకడానికి  “గౌరవం ” కూడా పోరాడి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన లక్ష్యం అని, దిగువ తరగతి జీవితాల్లో ఈ నిత్య పోరాటాలు అంతే ముఖ్యమని ఈ కథలు చెబుతాయి.అసమ సమాజంలో అవినీతి, కుల వివక్షత, పెట్టుబడిదారి వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, రాజకీయ అధిక్షేపణ సాధారణమైన మనుషుల్ని మనుషులు కాకుండా ఎలా చేస్తాయో, వ్యవస్థ చేసే మోసాల గురించి, దగా గురించి కుట్రల గురించి, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత అయినా అస్వతంత్ర భారతదేశం గురించిన ప్రశ్నలు సందేహాలు కలవరాలు కలతలు ఆలోచనాపరులను కలవరపెడుతూనే ఉన్నాయి.

విద్య ఆరోగ్యం ఉపాధి రంగాలలో సంపూర్ణమైన అవకాశాలను కల్పించకపోవడం, నామ మాత్రంగా ఉన్న పథకాలను సక్రమంగా వాస్తవికంగా క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం, అనేక ప్రలోభాలు, రాజకీయాలు మనుషుల్ని మనుషులుగా భౌతికంగా మానసికంగా అదృశ్యం చేస్తున్న దృశ్యాలు ఎక్కడ లేవు? లేవని అంటే అలా అంటున్నది ఎవరు అనేది మరొక ప్రశ్న?? ఒక తరం ఒక వర్గం ప్రశ్నించుకుంటూ వెళుతుంటే, మరొక వర్గం ప్రతి తరంలో తల వంచు కొంటూనే బతికింది. కొందరి పాదరక్షల దగ్గర మరి కొందరికి పాదాల దగ్గర తల వాల్చిన మనుషులు తలలు ఎగరేయడం వర్తమానం. తల లేని మనుషులకు కాలం చెల్లింది.అయినా  పూర్తిగా విప్లవీకరగించబడని, చైతన్యవంతం కాని  జీవితాల్లో  వెలుగు కి ఎంత మాత్రం చోటు లేకపోవటమే నేటి కథావస్తువు.*పరాయీకరణకు నిత్యం మనుషులు గురికావడం, ఆడపిల్లలు పుట్టుకతోనే చంపబడడం, కుల వివక్షత, ఉపాధి కల్పించ లేకపోవటం, నిరంతర అభద్రత, విచ్ఛిన్నత కారణంగా చదువుకి వాడల్లోని, గిరిజన గూడే లలోని పిల్లలు దూరం కావటం, పౌష్టికాహార లోపం, సరైన దారులు రహదారులు లేకపోవడం, ప్రసవ మరణాలు, ఆకలి చావులు, ఆత్మన్యూనతతో ఆత్మహత్యలు, పరువు హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలు, చాలని జీతాలు చాలని జీవితాలు.. ఇవన్నీ సభ్యసమాజాన్ని ఇదేమిటని ప్రశ్నిస్తాయి. నిలదీస్తాయి. మనుషులు ప్రశ్నలు కావటమే కదా వర్తమానత. మనుషులు సమాధానాలను అన్వేషించడమే కదా  చరిత్ర. ఇప్పుడు వర్తమానతను కాదనలేం. సమస్యలను  తప్పించుకోలేం. ఎవరి మాటల్ని వాళ్లే మాట్లాడుకుంటున్న సందర్భంలో జీవాక్షరాలతో, జీవద్భాషలో ఎవరికి వాళ్లు రాసుకుంటున్న చీకటి చరిత్రను కాదనలేం*ప్రేమకథలలో ఏముంటుంది? ప్రేమలో కులాంతర ప్రేమలు ఉంటాయా? ప్రేమకి హెచ్చుతగ్గులు ఉన్నాయా?  ఆకాశం లోకి ఇల్లు కట్టుకుందామని ప్రయాణిస్తున్న ఈ కాలంలో కూడా, సంఘంలో తక్కువగా చూడబడుతున్న మనుషులకి, కేవలం కులం కారణంగా నమ్మిన మనిషి తో బ్రతకలేక, ఆ ప్రేమని కాదు, ఆ మనిషినే చంపేస్తుంటే ఈ సమాజాన్ని ఏమనాలి? కుల వివక్షత ని, కుల అహంకారాన్ని ఎట్లా పెకలించి వేయాలి? ప్రేమికుల ఆత్మహత్యలు, హత్యలు ,పరువు హత్యలు మనుషులకు ఏం నేర్పుతున్నాయి? ఇద్దరు మనుషులు ఇష్టపడటానికి ఇద్దరు మనుషులు కలిసి బతకడానికి కులం ఎందుకు ఇంకా అడ్డుగోడగా నిలుస్తోంది? కుల వ్యవస్థ నిర్మూలన, ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానత్వం ఎప్పుడు జరుగుతుంది?కనీసం రేపటి సమాజం ఈ దుర్మార్గాలకు దూరంగా ఉండాలంటే, కులం అనే మలినం అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనుషుల్లో మనసుల్లో ఆలోచనల్లో వ్యవస్థలో ఎట్లా మార్పు తీసుకురావాలి?*అతడు రెడ్డి, ఆమె నక్కలోళ్ల బిజిలీ. ప్రేమ ఇద్దరినీ ఏకం చేసింది.ప్రేమ ఇద్దరు మనుషులను సమానంగా చూసినప్పటికీ కులం ఈ సమాజంలో ఇద్దరినీ సమానంగా చూడటానికి  ఎందుకో అస్సలు ఇష్టపడదు.కథానాయకుడు తండ్రి, కథానాయిక కులం పెద్ద , ఇంకా ఆ కులం పెద్దమనుషులు కుట్ర పన్నుతారు. పెద్ద రెడ్డి, నక్కలోళ్ల పెద్ద మనుషులకు డబ్బు ఎర చూపిస్తాడు. డబ్బు కట్టలు చేతులు మారుతాయి. ఆమె హత్యకు కు కుట్ర జరుగుతుంది. మంత్రసాని ముసల్ది ఏం చేసిందో చూడండి.*వాళ్లందరూ గొట్టిన సావుదెబ్బలకి, కొనూపిరితో కొట్టకలాడుతుండాదా పిల్ల…

ఆ పిల్లని నేలమింద పండేసి ఇద్దురు మొగోళ్లు దాని రొండు సేతుల్నీ నేలకదిఁవి పెట్టుండారు, ఇంకో ఇద్దురు మొగోళ్లు ఆ పిల్ల రొండు. కాళ్లనీ పంగ సీల్సి పట్టుకోనుండారు..

మంతరసాని ముసిల్ది, పొడుగోటి పుల్లకి గెట్టెంగా, దిట్టంగా గుడ్డని జుట్టి దాన్ని నూనిలో ముంచి పిండేసి సిన్నంగా, గుండ్రంగా ఆ పిల్ల మానం లోపలకి దూర్చింది. ఏకాడికి దూర్సాల్నో ఆకాడికి దూర్సినాక, రొట్లో రోకలాడిచ్చినట్టు ఆడిచ్చను మల్లుకున్నాది.

నెత్తురు బైటికి తన్నక రావాలిప్పుడు, సాచ్చెంగా..!

నెత్తురొచ్చినాదా..?

నాహ్ నాహ్కీ భోసే, ఏమోఖూ సోరు బిఝాఢీ (నెత్తురు రాడంలేదు. ఇది లంజితనం జేసింది) అంటా తుపక్కన ఊసి పైకిలేసినాదా ముసిల్ది.

అప్పటిదాకా ఆ పిల్లని పండేసి కాళ్లనీ, సేతుల్నీ తొక్కి పట్టుకోనుండిన మొగోళ్లు ఎంటనే ఆ పిల్లని లేపి నిబెట్నారు. రాతిర్నుంచీ వోళ్ల దగ్గిర సావు దెబ్బలు తింటుండేటి ఆ పిల్ల వొంటిమింద సుక లేకుండా వోళ్ల సేతల్లో యాలాడతుండాది.

సూరుకత్తి సేత బట్టుకోని, ఊరపందంటి ముసిలి కులపెద్ద, ఆ పిల్ల ముందరకొచ్చి నిలబడినాడు..*ఇక్కడ  జీవితం అందరికీ ఒకే రకంగా ఎందుకు లేదో, అందరికీ సహజంగా అందుబాటులో ఉండే వనరులు స్తోమత కనీసం ఒక స్థిర నివాసం వాళ్లకు ఎందుకు ఈ కాలానికీ లేవో, ఎందుకు వాళ్ళు ఇంకా సంపూర్ణ అక్షరాస్యులు కాలేదో, ఎందుకు ఇంకా వాళ్ల ఆలోచనల్లో , బ్రతుకు తీరులో బ్రతుకుతెరువు లో మార్పు రాలేదోఈ కథ ప్రశ్నిస్తుంది. 

చావు ఎంత ఘోరమైంది అయినా, ఆ చావు కంటే ఆ తర్వాత జరిగే తతంగమే ఇంకా ఘోరంగా ఉంటుంది.ఇదంతా రచయిత మాటల్లోనే వినాలి. ఇది రచయిత మాటలు కూడా కాదు. అక్కడి అదే జనం మాటలు. ఎవరి కథలు వాళ్ళే చెప్పుకుంటారు కదా, అట్లా ఎవరి కథలు వాళ్ళు చెప్పుకుంటే,  ఆడంబరాలు లేని భాషలో ఆ వ్యధ ఇలా ఉంటుంది.*పెళ్లి, సావూ రోగం, కస్టం అనేటివి ఏవాటానుంటాయో బయిటి. పంచికానికి దెలవనీకుండా దారికి ఆపక్కా ఈపక్కా సెట్లకింద ఎండా వానలకి ఎట్టిక్కి బతికేసే బతుకులా నక్కలోళ్లవి.
నాటు తుపాకుల్ని బుజానేసుకోని యాటకి బోతారు మొగోళ్లు కేట్బాలుతో కాకుల్ని, పిసికిల్ని కొట్టి సంపి తీసుకొస్తారు పిలకాయిలు. ఊరిమిందకి గందోడి నెత్తుకోని పిన్నీసులూ, మొలతాళ్లూ అమ్మేదానికి పోతారు ఆడోళ్లు.

 ముసిలీ ముతకా సాప బరుసుకోని, పూసలూ దువ్విన్లూ అద్దాలూ ,పొట్టుగూర్చిన ఉడతలూ బెట్టుకొని అమ్ముకుంటా కూసోనుంటారు. మనిసి జస్తే, అద్దరేతిరికాడ సడీసప్పుడూ జెయ్యకుండా సెపాన్ని యాడకో అడవల్లోకి ఎత్తకబోతారంటారు.
రొండు దినాలకి ముందర పట్టకొచ్చి, కులాశారం పెకారం పరిచ్చలు. జేసి కొట్టి సంపిన బిజిలీ సెపాన్ని గూడా, యేఁవి జేసినారో ఎవురికీ దెలవదు.*ప్రేమకథలకు ముగింపు ఎలా ఉంటుంది, సమాజంలో తక్కువగా చూడబడుతున్న వారి  వ్యధలు ఎలా ఉంటాయి?ఇప్పటికీ ఇంకా కులాంతర మతాంతర వివాహాల పట్ల, దేశంలో అనేక చోట్ల హింస, దౌర్జన్యం, కులాధిపత్యం, దురహంకారం కొనసాగుతూనే ఉండటానికి కారణాలు ఏమిటి? కొన్ని ప్రాంతాలలో వ్యక్తులనే కాకుండా కుటుంబాలనే ముట్టు పెట్టడం ఏమిటి? ఆస్తులను అగ్నికి ఆహుతి చేయడం ఏమిటి? కుల ద్వేషంతో మానభంగాలు చేయడం ఏమిటి? ఈ దుష్టత్వానికి వ్యవస్థ ఎంతవరకు కారణం? రాజ్యం ఎంత వరకు కారణం?చాలా ప్రశ్నలకు దశాబ్దాలుగా సమాధానాలు లేవు? మనిషి జీవితం కాకపోయినా మనిషి మరణం  అయినా సాటి మనుషుల్లో చైతన్యాన్ని కలిగించాలి,  కదలికను తీసుకురావాలి. అయితే నిస్తేజంగా వాళ్లు బ్రతుకుల ని వదిలి బ్రతుకుజీవుడా అనుకుంటూ వలస వెళ్లి పోవడం వెనకాల గల కారణం ఏమిటి? కలసి బ్రతకటానికి కులం పేదరికం కారణాలు కావటం ఏమిటి?ఊరికి వాడకు మధ్య ఉన్న హద్దులు సరిహద్దులు మనస్పర్ధలు, అడ్డుగోడలు, కట్టుబాట్లు, నియంత్రణలు, ఆంక్షలు ఎప్పుడు కూలిపోతాయి?ఈ దిశగా మనుషుల్లో చైతన్యం రావటానికి ఏ కారకాలు అడ్డుపడుతున్నాయి? 

పరిష్కారం వెతకమంటోంది ఈ కథ.ఎక్కడి కత ఇది? ఈ దేశం లోని కథే. ఈ కాలం కథే.దక్షిణాపథం రాజ్యాలుగా ఉన్న కాలంలో తొండనాడుగా పిలవబడిన రాజ్యానికి ఉత్తర సరిహద్దు గ్రామాల్లో ఒకటి అయిన మునికాంత పల్లి….స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఆ పల్లె పేరు ఇప్పుడు మొగిలేరు.*నాయిడుపేటకీ కాలాస్తిరికీ మద్దిన దారి నానుకోనుంటాది రాసినోరి సత్రం అనేటి సిన్న పల్లిటూరు, ఆ పల్లి సివర్న పాడుబడ్డ రకదారి బంగలా లోగిట్లో ఎండిపొయ్యిన సిన్న నీళ్లగుంట మద్దిన దిమ్మి మింద నిలబెట్టుంటాది అద్దాలరైకి, కుచ్చిల్ల పావడా గట్టుకోని, పూసల దండలు మెడ్లో ఏస్కోని దుమ్ముబట్టి, రూపు మాసిన ఆ నక్కలోళ్ల బిజిలీ ఇగ్గరహం..

ఆ ఇగ్గురోహానికి ఎదాళంగా కూసోని, రేతిరీ పొగులూ దానిసాయే జూస్తా మాటా మందలా లేకుండా నవ్వతా, యాడస్తా, యాడో ఆలోసిన జేసుకుంటా ఉండేటోడు సచ్చిపొయ్యేరోజుదాకా పిచ్చోడైన రగురాఁవరెడ్డి..!*ఇక్కడితో ఈ కథ అయిపోయిందని చెప్పలేం. ఇది ఈ కథకి ముగింపు అని కూడా చెప్పలేం. ఈ కథలో ప్రశ్న ఉంది. ఇది ముగింపు కాదని, ఇది పరిష్కారం కాదనే సూచన ఉంది. పరిష్కరించవలసిన ప్రశ్న, అన్వేషించవలసిన సమాధానం ఈ కథ.వర్తమాన దళిత కథలలోని పాత్రలుపాత్రలు కావు. జీవద్భాష తో మన ముందుకు వస్తున్న మన కాలం మనుషులు వాళ్ళు. వాళ్ళు మాట్లాడేది కర్కశంగా ఉన్నప్పటికీ ,సున్నితంగా లేకపోయినప్పటికీ, వాళ్లు మాట్లాడే నిజాల్ని మనం విని తీరాలి. అట్లా వినగలిగినప్పుడే ఆలోచించగలుగుతాం.కుల వివక్షత ని ప్రశ్నించటం ఎంత ముఖ్యమో, నిర్మాణాత్మకంగా నిర్దిష్టంగా కొత్త సమాజాన్ని కొత్త విలువలతో నిర్మించుకోవటం కూడా అంతే ముఖ్యం. ఈ నిర్మాణంలో కొత్త ఆలోచనలు ఆచరణ అత్యవసరాలు. ఈ క్రమంలో ఈ కథ, ఈ కథలు, ఇలాంటి కథలు కొత్త సృజనకు ప్రేరణ గా నిలుస్తాయి.ఈ కతలేవెలుగులోకి రాని అనేక చీకటి జీవితాలను, సంచార జాతుల దుఃఖ భరిత జీవన చిత్రాలను నగ్నంగా మన ముందుకు తీసుకు వస్తాయి.ఉద్వేగాన్ని, ఉద్రిక్తతను, ఉద్రేకాన్ని,ఉద్విగ్నత ను దాటిన తర్వాత వాస్తవిక సమాలోచనలులక్ష్యాలను మెరుగుపరుస్తాయి. ఆలోచనాపరుల సృజన కారుల దృష్టిని తక్షణం ఆకట్టుకునే ఇలాంటి కథల అవసరం ఈనాటి సమాజానికి ఎంతైనా ఉంది.*నిజానికి ఇక్కడ హత్య చేయబడింది ఆమె మాత్రమే కాదు. ఒక జాతి మొత్తం హత్య చేయబడుతుంది. ఒక జాతి ఆత్మ గౌరవం హత్య చేయబడుతుంది. ఒక జాతి గొంతులు హత్య చేయబడతాయి. ఒక జాతి చైతన్యం హత్య చేయబడుతుంది. ఇదీ నిజమైన హత్య.ఇదీ హత్య లోని, కుట్ర లోని అంతరార్థం.పిచ్చెక్కింది ప్రేమికుడికి కాదు. కులం కులం అని మూర్ఖత్వానికి పోయిన ఒక కుల అహంకారికి. ప్రేమ ని హత్య చేసిన అతడి నాన్నకు, ఆ హంతకుడికి ఏం మిగిలింది? అది మిగిలింది కుల పిచ్చితనం. అది చావు కంటే ఘోరమైంది. అలాంటి వాడికి గతమే తప్ప భవిష్యత్తు ఉండదు.ఈ కథలోని అసలైన హత్య ఏమిటో, అసలైన పిచ్చితనం ఎవరిదో తెలుసుకోవలసిన వాళ్లు తెలుసుకునే సమయం ఎప్పుడు వస్తుందో?

Leave a Reply