Herr Vogt జర్మన్‌ ప్రచురణ-1860

ఇంగ్లిష్‌ అనువాదం : 1982

పుస్తకం కంపోజింగ్‌, ముద్రణ, బైండింగ్ –  ట్రేడ్‌యూనియన్‌ లేబర్‌

కార్ల్‌మార్క్స్‌ విస్తృత రచనల్లో ఒక విస్మృత గ్రంథం Herr Vogt. ఆయన సమగ్ర రచనల జాబితా తయారు చేసేటప్పుడు తప్ప ఈ పుస్తకం పేరు మరెక్కడా వినపడదు. మార్క్స్‌ ఇతర రచనల గురించి సుదీర్ఘంగా, సూక్ష్మంగా చర్చించిన పండితులు కూడా ఈ పుస్తకాన్ని, ఎందుకోగాని విస్మరించారు.

ఏది ఏమైనప్పటికీ, CAPITAL రాస్తున్న దశలో ఒక సంవత్సరంపాటు ఆ కృషికి విరామమిచ్చి, ఈ పుస్తకం రాశాడు మార్క్స్‌. తనూ, ఎంగెల్స్‌ ఇతర మిత్రులకు వ్యతిరేకంగా కార్ల్‌వోగ్ట్‌ అనబడే పెద్దమనిషి (బోనాపార్టిస్టు) ప్రచురించిన ఒక కరపత్రాన్ని (Mein Prozess gegen die Alge meine Zeitung) చీల్చి చెండాడుతూ యిచ్చిన సమాధానమిది. ఈ పుస్తకం ప్రచురణకు ముందే ‘‘చాలా మంది మేధావులు తెలివిగలవాళ్లమని చెప్పుకునేవాళ్ళు’’ ఒక సంవత్సర కాలాన్ని ఈ పిచ్చి వాగుడుతో ఎలా వృథా చేయగలనని ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి పుస్తకం రాయటమే వాళ్ల ఊహకందని విషయం’’ అని రాసుకున్నాడు మార్క్స్‌.

ఈ తెలివిమంతులమని చెప్పుకునేవాళ్లూ, వాళ్ళ వారసులూ అర్థం చేసుకోలేని విషయం మరొకటుంది. 1860 నాటి మార్క్స్‌ కూ, ఈనాటి మార్క్సిస్టులకూ విప్లవ పార్టీని శతృవుల విషప్రాపగాండా నుండి రక్షించుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం.

1830, 40 నాటి జర్మన్‌ కార్మికోద్యమం, దేశ సరిహద్దుల కావల తన కృషిని కొనసాగిస్తున్నప్పటికీ, అదే తొలి అంతర్జాతీయ కార్మికోద్యమం. ఈ ఉద్యమం నుండే స్ఫూర్తిని పొంది మార్క్స్‌, ఎంగెల్స్‌ 1847లో కమ్యూనిస్టు లీగ్‌ను స్థాపించాడు. లీగ్‌ సూచనమేరకే మార్క్స్‌, ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు మానిఫెస్టోను తన కార్యాచరణ ప్రణాళికగా అంగీకరించింది లీగ్‌. ఆ తర్వాత ‘‘కార్మిక విప్లవం’’ అనే నినాదాన్ని తన జెండా మీద బాహాటంగా ప్రదర్శించింది.

1848లో జర్మనీ, యురోప్‌లలో వ్యాపించిన విప్లవోద్యమంలో, కార్మికవర్గ ప్రతినిధులుగా ప్రముఖ పాత్ర పోషించారు లీగ్‌ సభ్యులు ఆ తర్వాత ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసినప్పుడు దేశాంతరవాసంలో కమ్యూనిస్టు లీగ్‌ సమావేశమై గత సంవత్సరంలో (1848)లో ఉద్యమం నేర్పిన పాఠాలను సమీక్షించుకొన్నారు. స్వతంత్ర కార్మికోద్యమం నుండి విప్లవ నాయకత్వం ఎదగాలని నొక్కి చెప్పారు మార్క్స్‌, ఎంగెల్స్‌. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుగుదల, వర్గపోరాటాలను నిరంతరం విశ్లేషిస్తూ, 1847లో యూరోప్‌ను నిర్వీర్యం చేసిన పారిశ్రామిక సంక్షోభం, ఆ తర్వాత ఎగసిన విప్లవ జ్వాలలు అప్పటికి కాస్త తగ్గినట్టే కనిపించాయి. పెట్టుబడి విధానం అత్యంతవేగంగా, అడ్డూ, అదుపూ లేకుండా విస్తరిస్తోంది. ఉత్పత్తి శక్తులు, తిరిగి ఉత్పత్తి విధానంతో హింసాయుతంగానైనా తలపడేట్టు కార్మిక వర్గాన్ని సిద్ధం చేయ్యటమే (అప్పటి) నాయకత్వ బాధ్యత.

కాని, 1848 నాటి అనుభవంతో, అన్ని దేశాల పెటీబూర్జువా గ్రూపులూ ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. హంగేరీకి చెందిన లూయిస్‌ కోసబ్‌, ఇటాలియన్‌ జూసెప్పి మజ్జినా, అనేక మంది ఇతరులూ లండన్‌కు వచ్చి, తాత్కాలిక ప్రభుత్వాలను ఏర్పాటుచేసి తమ దేశాలను విముక్తి చేస్తామన్నారు. కింకెల్‌ చుట్టూ ఉన్న ఒక పెటీ బూర్జువా గ్రూపు అమెరికాలో అప్పుచేసి విప్లవానికి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామన్నారు. లీగ్‌లోని విల్లిచ్‌, షాపర్‌ లాంటి వాళ్లు పెటీబూర్జువా అడ్వెంచరిజంను అనుసరిస్తామన్నప్పుడు ఇక లీగ్‌లో చీలిక అనివార్యమైంది.

ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పెటీ బూర్జువాల గ్రూపుల గురించి మార్క్స్‌ తన అభిప్రాయం మార్చుకోకపోవటం ఆ తర్వాతి రోజుల్లో సరైన నిర్ణయమని రుజువైంది. వాళ్ల సైనిక విన్యాసాలు అత్యంత విషాదంగా ముగిశాయి. యురోపియన్‌ రియాక్షనరీలకు పెటీ బూర్జువాలలో మంచి పట్టుదొరికింది. ఈ రియాక్షనరీల నాయకుడు లూయిస్‌ నెపోలియన్‌ బోనా పార్టీ (ఫ్రెంచ్‌ అధ్యక్షుడు) 1852లో ఆయన తనను తాను ఎంపరర్‌ (చక్రవర్తి) నెపోలియన్‌ IIIగా ప్రకటించుకొని సెకండ్‌ ఎంపైర్‌ను స్థాపించాడు. (ఈ ఎంపైర్‌ 1870 దాకా కొనసాగింది) ఆ వెంటనే పలు రంగుల పెటీ బూర్జువా మూకలను మభ్యపెట్టి, దొంగ వాగ్దానాలుచేసి యూరోప్‌లో తన అధికారం సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నించాడు.

ఈలోగా, పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చిన పరిణామాల ఎదుగుదల కారణంగా 1857-1858లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభమే యిటు కార్మికవర్గ పోరాటాలకూ, అటు జాతీయవాదుల ఉద్యమాలకూ కారణమైంది. 1848 నాటి ప్రతిపాదనలు/వాగ్దానాలు ముఖ్యంగా జర్మనీ, ఇటలీల ఏకీకరణ`ఇప్పుడు తక్షణమే అమలు చెయ్యవలసిన సమస్యగా మారిపోయాయి. 1859లో ఇటాలియన్‌ యుద్ధం ప్రారంభమైంది.

కమ్యూనిస్టులకిదొక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే పెద్ద ప్రమాదంగా కూడా మారే ప్రమాదమున్నది. కార్మికవర్గ కార్యకలాపాలు, కొత్త శక్తుల పునరేకీకరణకు సంకేతాలిచ్చాయి. కాని బోనాపార్టీ తోలుబొమ్మ ప్రభుత్వాలతో శతృవుల మీద దాడి చెయ్యటం మరింత కష్టతరమైంది.

మార్క్స్‌, అతని అనుయాయులను తీవ్రంగా విమర్శిస్తూ కార్ల్‌ వోగ్ట్‌ తన కరపత్రంలో విషం కక్కటానికి నేపథ్యం యిదీ. 1848లో పెటీ బూర్జువా డెమోక్రాట్లను సమర్థించాడు కార్ల్‌వోగ్ట్‌. ఇప్పుడు అతడు కమ్యూనిస్టులను నీచాతినీచంగా తిట్టడం ప్రారంభించాడు. చివరికి అతడు 1852లో కొలోన్‌ కమ్యూనిస్టు ట్రయల్‌ సమయంలో పోలీసులు ప్రవేశపెట్టిన దొంగ సాక్ష్యాన్ని కూడా వాడుకోవటానికి సందేహించలేదు. కమ్యూనిస్టుల రహస్య, హింసాత్మక కుట్రలు పన్నుతున్నారనీ, మార్క్స్‌ వాళ్ల డిక్టేటర్‌ అనీ ప్రచారం చేశాడు.

ఈ పుస్తకంలో మార్క్స్‌, వోగ్ట్‌ కరపత్రంలోని ప్రతి లైనుకూ, ప్రతి అభియోగానికీ దీటుగా సమాధానాలిచ్చాడు. తొలి అధ్యాయంలో మార్క్స్‌, కమ్యూనిస్టు రహస్య కుట్రుల చేసేవారన్న అభియోగం పచ్చి అబద్ధమని నిరూపిస్తాడు. ఇందుకోసం జర్మన్‌ శరణార్థుల వాంగ్మూలాలను కూడా ఉదహరిస్తాడు. తరచూ హాస్యం అప్పుడప్పుడూ పరుష పదజాలం కూడా  ఉపయోగించటానికి సందేహించాడు మార్క్స్‌.

అయితే, Herr Vogt కేవలం ఆత్మరక్షణ కోసం రాసిన పుస్తకం కాదు. వోగ్ట్‌ కప్పుకున్న ముసుగును, అతడి రంగును లోకానికి చూపించడం మార్క్స్‌ ప్రధాన ఉద్దేశం. యురోపియన్‌ పరిస్థితుల గురించి వోగ్ట్‌ పత్రికా కథనాలను  ఉదహరిస్తూ అవి కేవలం బోనాపార్టీ నోటి నుండి వచ్చినట్టుగానే ఉన్నాయని నిరూపిస్తాడు. వోగ్ట్‌తో ప్రారంభమైన మార్క్స్‌ పరిశోధన బోనాపార్టీ ఏజెంట్లు అతడి మోచేతి నీళ్లుతాగే నీచులు కార్మికవర్గ ఉద్యమాలలోనికి Infiltrate అయి ఎలా పక్కదారి పట్టిస్తున్నారో స్పష్టంచేస్తాడు. వోగ్ట్‌ కేవలం నేపోలియన్‌ III అభిప్రాయాలనే ప్రచారం చేస్తున్నాడని స్పష్టమవుతుంది.

ఈ పుస్తక ప్రభావం విప్లవోద్యమం మీద పదేళ్ల తర్వాత కనిపించింది. Second Empire పతనం తర్వాత, నెపోలియన్‌ కిరాయి ఏజెంట్ల జాబితాలో Herr Vogt పేరు ప్రముఖంగా కనిపించింది.

1975 నుండీ నాల్గవ ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ కమిటీ దాని వ్యవస్థాపకుడైన లియోన్‌ట్రాట్స్కీ మరణానికి దారితీసిన పరిస్థితులను పరిశోధించటంలో నిమగ్నమైవుంది. అతని యింట్లోకి GPU ఏజెంట్లు చొరబడటం, ఆ తర్వాత ట్రాట్స్కీ ఉద్యమం అమెరికన్‌ సోషలిస్టు వర్కర్స్‌ పార్టీని ఇంపీరియలిస్టు ఏజెంట్లు తమ అడ్డాగా చేసుకోవడం గురించి అనేక విషయాలు తెలిశాయి. ఇంటర్నేషనల్‌ కమిటీ ఇప్పటిదాకా వెలుగుచూడని అనేక విషయాలను వెలుగులోకి తేవటంలో సఫలమైంది.

తొలినుండీ, ఈ పరిశోధన రివిజనిస్టులు, వాళ్ల పెటీబూర్జువా గ్రూపులు వృథా కాలయాపనగా, కొండను తవ్వి ఎలుకను పట్టుకొంటారన్నట్లుగా చులకనగా చూశాయి. ఇంటర్నేషనల్‌ కమిటీని భయాన్ని వ్యాపింపచేస్తున్న సంస్థగా అవి ప్రచారం చేశాయి. చారిత్రకంగా, రివిజనిస్టులు సరైన జోడీనే ఎంచుకొన్నారని చెప్పాలి. Herr Vogt వల్ల మనకు తెలిసేది ఏమిటంటే తొలినాళ్లనుండే మార్క్సిస్టు ఉద్యమం తన భద్రతకూ, కార్మికోద్యమంలో రహస్యంగా చొరబడ్డ రివిజినిస్టు ఏజెంట్లను ఎండగట్టడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని అర్థమవుతుంది. మార్క్సిస్టులమని కాలరెగరేసుకొని తిరిగే కొందరు అకడమీషియన్లు, మార్క్స్‌ Vogt పుస్తకం రాయకపోతే అతడి Capital గ్రంథానికి, బోనాపార్టిస్టు ఏజెంట్ల వల్ల ఎంత నష్టం వాటిల్లేదో గ్రహించారు.

Vogt కరపత్రాన్ని జర్మనీలోనే కాకుండా యూరోప్‌ అంతటా బూర్జువా ప్రెస్‌, కమ్యూనిస్టు వ్యతిరేక దుష్ప్రచారానికి బాగా వాడుకుంది. అంతేకాదు ఈ ప్రచారానికి మార్క్స్‌ను కేంద్ర బిందువుగా చేశారు. కాని పార్టీ భవిష్యత్తు మనుగడ ప్రమాదంలో పడ్డదని మార్క్స్‌ వెంటనే గ్రహించాడు. Vogt నూ, అతడి దుష్ప్రచారాన్ని ఎండగట్టడం ఒక చారిత్రక అవసరంగా మారింది.. ముఖ్యంగా జర్మనీలో పార్టీని రక్షించుకోవాలి.

‘‘ఫ్రెల్‌గ్రాత్‌కు మార్క్స్‌ రాసిన ఫిబ్రవరి 23, 1860 నాటి లేఖ నుండి’’

బెర్లిన్‌ నుండి వెలువడే National Zeitung Vogt కరపత్రంలో రాసిన పచ్చి అబద్ధాలను యథాతథంగా ప్రచురించింది. వీటిని ఎండగట్టటానికి  తక్షణమే కోర్టుకెక్కాలనుకొన్నాడు మార్క్స్‌. ఈ విషయం తెలిసిన ప్రష్యన్‌ అధికారులు (మార్క్స్‌ గురించి వాళ్లకు బాగా తెలుసు. ఆయన కోర్టులో వ్యాజ్యం వేస్తే వాళ్లకు చిక్కులే) మార్క్స్‌ కోర్టులో కేసు ఫైలు చెయ్యకుండా అడ్డుకున్నారు. ఆదశలో ఆయన కోర్టులో వెయ్యవలసిన కేసు ప్రస్తుత Vogt పుస్తకంగా పెంచాడు. పనిలో పనిగా బూర్జువా ప్రెస్‌ను, ముఖ్యంగా లండన్‌ నుండి వెలువడుతున్న డెయిలీ టెలిగ్రాఫ్‌ (ఇది లిబరల్‌  పేపర్‌) రాస్తున్న అబద్ధాలను కూడా ఎండగట్టాడు.

ఈ పుస్తకంలోని ముఖ్యాంశం, కిరాయి ఏజెంట్లు వాళ్ల యజమానులకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యటమే కాకుండా, ఈ పోరాటానికే, స్వతంత్ర, విప్లవ కార్మిక వర్గ నాయకత్వానికీ ఉన్న సంబంధం గురించి లోతుగా విశ్లేషించాడు. పెటీబూర్జువా స్వభావం నుండి, ఆ ఆకర్షణల నుండి కార్మిక వర్గం తనను తాను రక్షించుకోవాలి. ఒక స్పష్టమైన, స్థిరమైన రాజకీయ దృక్పథం లేకుండా Vogt మీద పోరాటం కొనసాగేది కాదు. విల్లిచ్‌ ` షాపర్‌ల కుట్రలు ` అడ్వెంచరిజం పొజిషన్‌ను వ్యతిరేకించిన మార్క్స్‌కు Vogt మీద పోరాటం చెయ్యటం సులువైంది. బోనా పార్టిజంను విశ్లేషించటంతో, Vogt కూ, ఇతర పెటీ బూర్జువా ఏజెంట్లకూ ఉన్న సంబంధాన్ని నిరూపించడం పెద్ద కష్టం కాలేదు. ఇటాలియన్‌, జర్మన్‌ బూర్జువా జాతీయవాదులతో చేతులు కలిపిన బోనా పార్టిజంను ‘ప్రొగ్రెసివ్‌’గా చూడటానికి ఎంగెల్స్‌, మార్క్స్‌ నిరాకరించారు. ఒకవేళ ఏకీకరణ అవసరమనుకుంటే అది విప్లవ ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా  మాత్రమే జరగాలని జర్మన్‌ సోషలిస్టు నాయకుడు లసాలేకు కూడా స్పష్టం చేశాడు.

ఈ విషయంలో కూడా International committee of the Fourth International మార్క్స్‌ ప్రారంభించిన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంది. అన్ని రకాల రివిజనిజంకు వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధకాలం నుండే జరుగుతున్న దీర్ఘకాల పోరాటం ఇదొక్కటే. Fourth International ను బలహీనపరిచి అపప్రదపాలు చేసిన ట్రాట్స్కీయిస్టు ఉద్యమంలోని ఒక గ్రూపును ఎండగట్టగలిగే  (అమెరికన్‌ సోషలిస్టు వర్కర్స్‌ పార్టీలో ఈ గ్రూపు తిష్టవేసుకుంది) దశకు చేరుకొంది.

ఇక, ఈ కిరాయి ఏజెంట్లు (Vogt ఇతర బోనాపార్టిస్టు తాబేదార్లు) మార్క్స్‌ను కమ్యూనిస్టు లీగ్‌ నాశనం చేయ్యలేకపోయారో, ఈనాటి ఏజెంట్లు కూడా విషపు కోరలు పీకిన పాముల్లాగైపోయారు. విప్లవ పార్టీని ఇలాంటి దుర్మార్గుల దాడుల నుండి కాపాడుకోవటానికి 120 ఏళ్ల తర్వాత కూడా మార్క్స్‌ Herr Vogt ఒక ఆదర్శ విశ్లేషణ, పరిశోధనా గ్రంథంగా నిలుస్తుంది.

Leave a Reply