14 సంవత్సరాల 19 రోజుల తరువాత ప్రశాంత్ రాహి, చంద్రకళ తదితరులను ఉత్తరాఖండ్ కోర్టు UAPA కేసులో నిర్దోషులుగా ప్రకటించింది
2022 జనవరి 7న, ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని జిల్లా- సెషన్స్ జడ్జి ప్రేమ్ సింగ్ ఖిమల్ కోర్టు, దేశద్రోహం, రాజద్రోహం, UAPA నిందితులు ప్రశాంత్ రాహి, అతని జీవన సహచరి చంద్రకళతో పాటు మరో ఇద్దరిని నిరోషులుగా ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో 14 సంవత్సరాల 19 రోజుల పాటు సాగిన ఈ ప్రసిద్ధ కేసులో అనేక కోణాలు వున్నాయి. 2007 డిసెంబర్ 17 న డెహ్రాడూన్‌లోని ఆరాఘర్ దగ్గర ప్రశాంత్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వ్యాన్‌లో నుంచి కిందకు దిగి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ప్రశాంత్ రాహిని 5 రోజుల పాటు అక్రమ కస్టడీలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. డిసెంబర్ 22న అతడిని మావోయిస్టుగా కోర్టులో హాజరుపరిచారు. అతడిపై తమకు తోచిన ఆధారాలు చూపించారు. సహజంగానే, ఈ విషయాన్ని సంచలనాత్మకంగా ప్రదర్శించారు. సంచలనం సృష్టించిన ఈ తప్పుడు కేసుపై పోలీసులు పలువురి ప్రశంసలు కూడా పొందారు.
తన తండ్రి నిర్దోషి అని నిరూపించేందుకు ఉత్తరాఖండ్‌లో ప్రచారం నిర్వహించిన ముంబైకి చెందిన సినీ నిర్మాత, రాహి కుమార్తె శిఖా, ఉత్తరాఖండ్ కేసులో నిర్దోషిగా విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. అయితే, తీర్పు వెలువడినప్పుడు, సుప్రీంకోర్టు అనుమతించిన వీడియో-కాన్ఫరెన్సింగ్ ద్వారా స్ట్రెచర్‌పై ఉన్న తన తండ్రిని చూసిన ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
మహారాష్ట్ర జైళ్లలో అలవాటు ప్రకారం సయాటికాతో బాధపడుతున్న అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు.
“గత 14 సంవత్సరాలుగా మనమందరం ఎదురుచూస్తున్న క్షణాన్ని ఆస్వాదించడానికి రాజ్యం నన్ను దూరం చేసిందని నాకు కోపంగా వుంది” అని శిఖా అన్నారు
ప్రశాంత్ రాహి జీవన సహచరి చంద్రకళ తన తల్లిదండ్రుల ఇంట్లో వున్నప్పుడు (గ్రామం- మన్పూర్ వెస్ట్, రాంపూర్ రోడ్, హల్ద్వానీ, నైనిటాల్ జిల్లా) 2007 ఫిబ్రవరి 3 ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఆమెను గృహ నిర్బంధంలో వుంచి చేసిన సోదాలో పోలీసులు ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్, కొన్ని సాధారణ పత్రికలు, కరపత్రాలు, పుస్తకాలు, వారు స్వాధీనం చేసుకున్న జాబితాలో “ఫోటోకాపీలు” అని వివరించిన కాయితాలు, ఇదే కేసులో 2009-10 మధ్యకాలంలో ఉత్తరాఖండ్‌లోని వివిధ జైళ్లలో ఉన్నప్పుడు ప్రశాంత్ రాహి తమ పరస్పర జైలు స్నేహితుల ద్వారా పంపిన కొన్ని వ్యక్తిగత లేఖలను తీసుకువెళ్లారు. ల్యాప్‌టాప్ ఆమెది కాదు, ఒక సహ కార్యకర్త వదిలిపెట్టిన పాత ల్యాప్‌టాప్. అందులో ఆమె అధ్యయనానికి సంబంధించిన విషయాలు వునాయి. ఆమె రాజకీయ ఆసక్తులు, అభిరుచులు, పరిశోధనలకు సంబంధించినవి కూడా ఉండవచ్చు. ఆమె బెయిల్‌పై విడుదలైన 2-3 సంవత్సరాల తర్వాత 2012-13లో నైనిటాల్‌లోని కుమావో యూనివర్శిటీలో “ఉత్తరాఖండ్ మహిళల ఆస్తి వారసత్వ హక్కు – స్థితి”పై రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ థీసిస్‌కు సంబంధించిన మొత్తం పరిశోధన అంశాలు వున్న ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌లు కూడా పోలీసుల దాడిలో పోయాయి. ఉత్తరాఖండ్ మహిళా మంచ్‌లో ఆమె రాజకీయ, సామాజిక కార్యకలాపాలు, హల్ద్వానీ, చుట్టుపక్కల ప్రాంతాలలో మహిళలపై పెరుగుతున్న దారుణ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇతర ప్రజాస్వామిక, పార్లమెంటేతర వామపక్ష సంస్థలు, సమూహాలతో కలిసి ఉమ్మడిగా ఆందోళనలో ప్రధాన భాగంగా చేసిన క్షేత్ర స్థాయి పరిశోధనా ఫలితాలు కూడా అందులో ఉన్నాయి.
ఆమె కార్యకర్తగా వున్న, ప్రగతిశీల ప్రజాస్వామిక మహిళల విశాల వేదిక సభ్య సంఘమైన ‘ఉత్తరాఖండ్ మహిళా మంచ్’ చేపట్టిన అసెంబ్లీ ఎన్నికల బూటకత్వాన్ని బహిర్గతం చేసే ప్రచార కార్యకమంలో భాగంగా ప్రచురించిన కొన్ని కరపత్రాలను, డెహ్రాడూన్‌లో ఉన్న 75 ఏళ్ల న్యాయవాది రమేష్ బెర్రీ అనే స్వతంత్ర మార్క్సిస్ట్ రాసిన ఆంగ్లం నుండి హిందీలోకి అనువాదమైన“మార్క్స్ వాద్ క్యా హై?” అనే పుస్తకాన్ని తీసుకెళ్లారు.
ఆమె సోదరులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తూ, తమ కుటుంబాలతో వుండడంతో ఆమె గత కొన్ని వారాలుగా తన వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులతో వుంటోంది. అవకాశం వుండి తన తల్లి తండ్రులను చూసుకోడానికి యింట్లో వున్న ఆమె కోసం పోలీసులు రావడంతో గ్రామంలో కుటుంబ ప్రతిష్ట దెబ్బ తిన్నదనే పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ కూడా ఆమెపై దాడి చేసింది.
ఈ ఇంటిపై పోలీసులు దాడి చేయడం ఇదే తొలిసారి కాదు. 3 రోజుల క్రితం డెహ్రాడూన్‌లో తీసుకెళ్ళిన ప్రశాంత్ రాహి యింకా అక్రమ నిర్బంధంలో వుండి చిత్రహింసలకు గురవుతున్నప్పుడు, అతని అరెస్టును యింకా ప్రకటించని (22న జరిగింది) 2007 డిసెంబర్ 20 ఉదయం (ఈరోజు అదే సమయంలో) కూడా దాడి జరిగింది. (PUDR (ఢిల్లీ) – PUCL (ఉత్తరాఖండ్) సంయుక్త నిజ నిర్ధారణ వేదిక PUDR వెబ్సైట్లో వుంది).
అటువంటి సర్చ్-అండ్-సీజ్ ఆపరేషన్ల కోసం ఉత్తరాఖండ్ పోలీసులు గుర్తించిన 7 మంది వ్యక్తులలో మొదటి వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో మావోయిస్ట్ కార్యకలాపాలలో పాలుపంచుకున్నట్లు లేదా మావోయిస్ట్ భావజాలంపై విశ్వాసం ఉన్నవారుగా గుర్తించబడిన 7 మంది వ్యక్తుల ఇళ్లపై దాడి చేసినందుకు శిక్ష పడకుండా వుండటానికి పోలీసులకు అనుమతించినట్లుగా ఈ వారెంట్‌లో వుంది. వాస్తవానికి ఉన్నత న్యాయస్థానం (సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడం ద్వారానూ /లేదా హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై అధికారిక అప్పీల్‌ను తిరస్కరించడం ద్వారా) లేదా విచారణ ద్వారా (సెషన్లలో) తిరస్కరించింది కాబట్టి ఆ ఆరోపణ యింకా నిరూపించబడకపోయినప్పటికీ వారెంట్ జారీ చేసిన కోర్టు ప్రజల ఇళ్లపై దాడులు చేసి వారిని, వారి కుటుంబ సభ్యులను వారి సైద్ధాంతిక విశ్వాసం లేదా కార్యకలాపాలలో మునుపటి భాగస్వామ్యం ఆధారంగా వేధించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చిందని గమనించవచ్చు..
గతంలో ముగ్గురు న్యాయమూర్తుల ముందు 2007 కేసులో తుది వాదనలు మూడుసార్లు పూర్తయ్యాయి కానీ ఈ న్యాయమూర్తులు ఎవరూ తీర్పు ఇవ్వక ముందే బదిలీ అయిపోయారు. తుది వాదనలు విన్న జడ్జి ఖిమల్ నాలుగో న్యాయమూర్తి. ఢిల్లీకి చెందిన న్యాయవాది త్రిదీప్ పైస్ గత రెండు సార్లు తుది వాదనలు వినిపించారు.
2011లో, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు, ఉత్తరాఖండ్ పోలీసులు తీవ్రంగా హింసించిన రాహిని జైలులో, అతను ఇతరులతో కలవడానికి అనుమతించని “అణుబాంబు” లాగా పరిగణించి ఏకాంత నిర్బంధంలో ఉంచారు.
కానీ ఈ “అణుబాంబు” యొక్క అపరాధం గురించి న్యాయమూర్తి ఖిమల్ను ఒప్పించడంలో పోలీసులు విఫలమయ్యారు.
విచారణలో ప్రవేశపెట్టిన ముగ్గురు స్వతంత్ర సాక్షుల్లో ఒకరు అటవీశాఖ అధికారి.
అతని అరెస్టు తర్వాత, ఉత్తరాఖండ్‌లోని చారిత్రాత్మక పట్టణం నానక్‌మట్టా సమీపంలో అడవి మధ్యలో వేసిన నల్లటి ప్లాస్టిక్ డేరా వద్దకు రాహి వారిని తీసుకెళ్ళాడని, అక్కడ పొదల్లో దాచిపెట్టిన ల్యాప్‌టాప్, సీడీ, పెన్ డ్రైవ్, సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
అయితే క్రాస్ ఎగ్జామినేషన్‌లో, ఫారెస్ట్ రేంజర్, తనకు నల్ల టెంట్ కనిపించలేదని, ఫారెస్ట్ గార్డులు కూడా తనకు అలాంటి డేరా గురించి తెలియజేయలేదని, అది రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రాంతమని, అందుకే ఫారెస్ట్ గార్డులే కాదు, గ్రామస్థులు కూడా అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకుంటే తమకు సమాచారం ఇస్తారని, తనకు ఎలాంటి సమాచారం అందలేదని కోర్టుకు తెలిపారు. మరో స్వతంత్ర సాక్షిని చేసిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పోలీసుల సంస్కరణపై సందేహాన్ని కలిగిస్తుంది.
సెక్షన్ 164 ప్రకారం ఈ సాక్షి వాంగ్మూలం మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసిన తేదీ, 2008 ఫిబ్రవరి ఉంది. ఆ వాంగ్మూలంలో, అతను ఆరు నెలల క్రితం, అంటే అక్టోబర్ 2007లో, అడవిలో బయటి వ్యక్తులను చూశానని చెప్పాడు.
అయితే, కోర్టులో ప్రమాణ స్వీకారం చేస్తూ, ఈ సాక్షి తాను అడవిలో బయటి వ్యక్తులను చూసిన సంవత్సరాన్ని 2004గా పేర్కొన్నాడు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో కూడా అతను సమర్థించాడు, 2004లో పోలీసులు తన వాంగ్మూలాన్ని తీసుకుని, 15 రోజుల తరువాత మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు అని చెప్పాడు.
ఒక స్వతంత్ర సాక్షి యిచ్చిన వాంగ్మూలంలో ఇటువంటి స్పష్టమైన వైరుధ్యం వుండడం వల్ల అతని వాంగ్మూలానికి విలువ లేదని న్యాయమూర్తి భావించారు.
అతను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని విరుద్ధంగా చెప్పడంతో మూడవ స్వతంత్ర సాక్షిని శత్రుత్వంగా ప్రకటించారు. అతను అడవిలో బయటి వ్యక్తులను చూశానని అతని పోలీసు వాంగ్మూలం పేర్కొంది. అయితే, కోర్టులో, అతను అడవిలో బయటి వ్యక్తులను చూడలేదని, కోర్టులో ఉన్న నిందితులను గుర్తించలేకపోయానని చెప్పాడు. పోలీసులు బెదిరించి వాంగ్మూలాన్ని ఇప్పించారని ఈ సాక్షి అంగీకరించారు.
ప్రశాంత్ రాహి అరెస్ట్ గురించి పోలీసు కథనాన్ని నమ్మడం కూడా న్యాయమూర్తికి కష్టంగా అనిపించింది. శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిన మావోయిస్టులను పట్టుకునేందుకు వెళ్లగా నలుగురు మావోయిస్టులు పారిపోయారని, ప్రశాంత్ రాహి అనే ఒక్కడినే పట్టుకోగలిగామని వారు పేర్కొన్నారు.
రివాల్వర్, రెండు రైఫిల్స్ తో ఆయుధాలతో ఉన్న 7 మంది సభ్యులున్న పోలీసు పార్టీ, ఐదుగురు నిరాయుధ మావోయిస్టులలో ఒకరిని మాత్రమే పట్టుకోగలిగారు అనే అసమంజస విషయాన్ని న్యాయమూర్తి ఎత్తి చూపారు.
తనను డిసెంబర్ 17న డెహ్రాడూన్ నుంచి పికప్ చేశారని, 5 రోజుల తర్వాత అరెస్ట్ చేసినట్లు తప్పుగా చూపించారని రాహి కోర్టులో పేర్కొన్నారు.
రాహి నుండి నిషేధిత సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వాదించినప్పటికీ, ఈ సాహిత్యం నిషేధిత జాబితాలో ఉందని చూపించడానికి వారు ఎటువంటి నోటిఫికేషన్‌ను అందించలేకపోయారు.
రాహి నుండి స్వాధీనం చేసుకున్న సిడిలో హరిద్వార్ జైలు వీడియో ఉందని, నిందితులు మావోయిస్టులు నీలు వల్లభ్ మరియు అనిల్ చౌడకోటి అక్కడి నుండి తప్పించుకోవడానికి సహాయం చేయాలని ప్లాన్ చేశారని కూడా పోలీసులు ఆరోపించారు. 2007 డిసెంబర్ లో CDని తిరిగి తీసుకున్నారు. కానీ అప్పటికి ఈ ఇద్దరు మావోయిస్టులు బెయిల్‌పై బయట ఉన్నారు. అంతేకాకుండా, జైలు నుంచి తప్పించుకొనే ప్రణాళిక గురించి వీడియో ఏమీ చూపించలేదని పోలీసులు అంగీకరించారు; అది జైలు గోడను మాత్రమే చూపించింది.
శిఖాకి ఈ 14 ఏళ్లు అంతులేనివిగా అనిపించాయి. “మా నాన్నను మొదటిసారి అరెస్టు చేసినప్పుడు నాకు 24, మా నాన్నకు కేవలం 48 సంవత్సరాల వయస్సు. అతనికి ఇప్పుడు 62 సంవత్సరాలు, ఎటువంటి సౌకర్యాలు లేని అండా సెల్లో తను సంవత్సరాలు గడపవలసి ఉంటుంది, రోజు మార్చిరోజు మాత్రమే బయటకు వదలుతారు” అని ఆమె గుర్తుచేసుకుంది.
“రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ప్రతిదానికీ పరువు నష్టం కేసులు పెడతారు. నా దగ్గర వారికి వున్న వనరులు ఉంటే, నేను కూడా అమాయకులపై కుట్ర కేసులు పెట్టినందుకు రాజ్యాంపై దావా వేస్తాను” అని శిఖా ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రాజ్యం, పోలీసులు, మీడియా కలిసి సృష్టించిన ఈ ప్రతికూల చిత్ర ప్రభావం మా సామాజిక సంబంధాలపై కూడా పడింది. మమ్మల్ని చూసి జనం భయపడి పారిపోయారు. నా వృద్ధ తల్లిదండ్రులు మాత్రమే నివసించే హల్ద్వానీలోని మా ఇంటిపై రెండుసార్లు దాడి జరిగింది. నేడు దేశద్రోహం లేదా రాజద్రోహ కేసులపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు, నేను 14 సంవత్సరాల ఈ ప్రయాణాన్ని తలచుకుంటే ఏళ్ల తరబడి పోలీసులు, మీడియా ప్రచారం చేస్తున్న అబద్ధాలవల్ల ప్రశాంత్‌తో పాటు సామాజిక నిర్లక్ష్యానికి గురైన మాలాంటి వాళ్లందరి ముఖాలను నా కళ్ల ముందుకి వస్తున్నాయి. మేం, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు పడిన మానసిక వేదనను ఎలా తీర్చగలరు? అన్నింటికంటే మించి మనం జైలులో గడిపిన జీవితానికి జవాబుదారీ ఎవరు?” అని చంద్రకళ ప్రశ్నిస్తున్నారు.
“ఈ ప్రశ్నకు సమాధానంగా నాకు శూన్యం కనిపిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పినందుకే, అబద్ధపు కేసులు బనాయించి, ఎలాంటి విచారణ లేకుండా, అభియోగాలు మోపకుండా, ఏళ్ల తరబడి జైళ్లలో ఉన్న నిందితులందరితో ఈ రోజు కూడా నేను నిలబడి ఉన్నాను. ఎంతోమంది జైలులోనే చనిపోతారు, యువకులు వృద్ధులు అవుతారు… ఈ క్రమం ఇలా కొనసాగుతూనే వుంటుంది. ఈరోజు ప్రశాంత్ రాహి గురించి మాట్లాడుకుందాం. మహారాష్ట్రలో జన్మించిన ప్రశాంత్ రాహీ జీవితం ఒడిదుడుకులతో కూడుకున్నది. నా జీవన సహచరుడు ప్రశాంత్ రాహి బనారస్ యూనివర్శిటీ ఐఐటీలో ఎంటెక్ చదివాడు. గతంలో జర్నలిస్టుగా డెహ్రాడూన్‌లోని ‘హిమాచల్ టైమ్స్’లో పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వస్తున్న ‘ది స్టేట్స్‌మన్’ అనే ఆంగ్ల పత్రికలో ఉత్తరాఖండ్‌కు చెందిన గుర్తింపు పొందిన జర్నలిస్టుగా పనిచేశారు. ఉద్యోగపు స్వర్ణ యుగ కాలంలో, ఉద్యోగాన్ని వదిలి మానవ హక్కుల కోసం తన సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై నిరంతరం రాసేవారు.
అతను మంచి అనువాదకుడు కూడా. అనేక వ్యాసాలతో పాటు ‘లోకమాన్య తిలక్ జీవిత చరిత్ర’, ‘పిల్లల కోసం అర్థ శాస్త్రం’, ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ మెడిసిన్’లను హిందీలోకి అనువదించారు. బనారస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ప్రశాంత్‌కి విద్యార్థి ఉద్యమంతో పరిచయం ఏర్పడి, సామాజిక-రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత 90వ దశకంలో ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో భాగమయ్యారు.
స్టేట్స్ మన్ జాతీయ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నప్పుడు, అతను తన రచనల ద్వారా ఉత్తరాఖండ్ ప్రాథమిక సమస్యలను, ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవశ్యకతను దేశ స్థాయిలో లేవనెత్తాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రజానుకూల కార్యకర్త కావడం, ఉత్తరాఖండ్ సమస్యల పట్ల సున్నిత మనస్తత్వం ఉండడం వల్ల ఈ ఉద్యోగం చేయడం అసాధ్యం అవడంతో స్టేట్స్ మన్ జాతీయ ప్రతినిధి పదవిని వదులుకోవాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నారు. దీని తరువాత, అతను ఉత్తరాఖండ్ సహజ వనరులను మాఫియా, దళారీల అక్రమ దోపిడీకి వ్యతిరేకించేవారిని సంఘటితం చేయడం మొదలుపెట్టాడు. ఉత్తరాఖండ్ రాజధాని గైర్సైన్ తదితర డిమాండ్లతో ఏర్పాటు అయిన ఉత్తరాఖండ్ సంయుక్త్ సంఘర్షణ కమిటీలో కూడా సభ్యునిగా ప్రశాంత్ తన భాగస్వామ్యాన్ని నిర్ధారించుకున్నాడు. ప్రశాంత్ ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా తెహ్రీలో, ఆసియాలోనే ఎత్తైన తెహ్రీ డ్యామ్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో చేరాడు. ఉత్తరాఖండ్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న ఉద్వేగభరితమైన కార్యకర్త. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్తరాఖండ్‌లోని మహిళలు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మాజీ సైనికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో ప్రజలు మళ్లీ ఆందోళనకు దిగారు.
2005లో, రాజకీయ, సామాజిక ఆందోళనకారులకు గుణపాఠం నేర్పేందుకు ప్రభుత్వం తీవ్ర అణచివేతను ఆశ్రయించింది. జాతీయ భద్రతా చట్టంతో పాటుగా దేశద్రోహం లేదా రాజద్రోహ చట్టాల కింద అరెస్టులు చేయడం మొదలుపెట్టింది. ప్రశాంత్ రాహి, ఉత్తరాఖండ్ ప్రజలతో కలిసి ఈ ఉద్యమకారుల విడుదల, బెయిల్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
దీని తర్వాత, ప్రశాంత్ నిరంతరాయంగా రాజ్యం కళ్ళలో నలుసయ్యాడు. చివరకు 2007 డిసెంబర్ 17న ప్రశాంత్ రాహిని అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని పలు జైళ్లలో నాలుగున్నరేళ్లు గడిపిన ప్రశాంత్ 2011లో బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలులో కూడా ప్రశాంత్ ఎన్నో యిబ్బందులు పడ్డాడు.
2011లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ ఒక్కరోజు కూడా ఉండలేదు. జైలులో ఉన్నప్పుడు తను ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అవమానకర ప్రవర్తనను గ్రహించిన ఆయన రాజకీయ ఖైదీల విడుదల కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అతని కార్యక్షేత్రం ఉత్తరాఖండ్ మాత్రమే కాదు దేశం అంతటా. రాజకీయంగా అరెస్టయిన వ్యక్తులకు చట్టబద్ధమైన లేదా ఇతరత్రా ఎలాంటి అవసరం ఉందని భావించిన చోటకు, ఎటువంటి సంకోచం లేకుండా అక్కడికి చేరుకుని హృదయపూర్వకంగా తన పనిలో నిమగ్నమయ్యేవాడు. 2013 సెప్టెంబర్ 1న కొంతమంది ఖైదీల విడుదలకు సంబంధించి కొన్ని చట్టపరమైన పత్రాలను సేకరించడానికి రాయ్‌పూర్ న్యాయవాదులను కలవడానికి వెళ్ళినప్పుడు, ప్రశాంత్‌ను ఎత్తుకెళ్ళారు.
ప్రశాంత్ మరియు అతని సహ నిందితులను ఐఓ సుహాస్ బావాచే దారుణంగా హింసించారని సమాచారం. నిందితులందరినీ అత్యంత అమానుషంగా హింసించారు. బవాచే వ్యక్తిగతంగా ప్రశాంత్, ఇతరులపై క్రూరమైన శక్తిని ప్రయోగించాడు, వారిని మానసికంగా శారీరకంగా హింసించాడు. పోలీస్ కస్టడీ రిమాండ్‌లో అనేక వారాలపాటు, రాత్రింబవళ్ళు అందరినీ హింసించాడు, వేధించాడు.
హేమ్ మిశ్రా, పాండు నరోటి, మహేష్ తిర్కీలు వాస్తవానికి ఆగస్టు 20న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని బల్లార్షా వద్ద రైల్వే స్టేషన్ ఆవరణలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకువెళ్లారు, నిర్ణీత 24 గంటల వ్యవధిలోపల నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి వుండగా, 2 రోజుల పాటు వారిని అక్రమ కస్టడీలో దారుణంగా హింసించారు. ఆ తర్వాత ఇదే కేసులో శారీరక వికలాంగుడైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఇంటిపై దాడి చేసి ఆయనను కూడా అరెస్ట్ చేశారు. వీరందరినీ కూడా ప్రభుత్వం తప్పుడు కేసులో అరెస్టు చేసి అమానవీయ పరిస్థితుల్లో జైల్లో ఉంచింది.
చాలా తక్కువ వ్యవధిలో, గడ్చిరోలి జిల్లా- సెషన్స్ కోర్టు నిందితులందరిపై న్యాయపరమైన సాక్ష్యాలను రుజువు చేయకుండా, బలమైన సాక్ష్యాలేవీ లేకున్నా, పక్షపాత తీర్పునిచ్చింది. ప్రశాంత్ సహా ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, ప్రశాంత్ అమరావతి జైలులో, మరికొందరు మహారాష్ట్రలోని ఇతర జైళ్లలో ఉన్నారు. ప్రస్తుతం, ఉత్తరాఖండ్‌లో ప్రశాంత్, అతని సహ నిందితులకు అనుకూలంగా ప్రతి ఒక్కరినీ నిర్దోషులుగా విడుదల చేసిన ఈ కోర్టు తీర్పు మనందరికీ ఒక ఆశను కలిగించింది. ప్రస్తుతం, ప్రభుత్వ విధానాలను విమర్శించడం కూడా దేశద్రోహంగా పరిగణించబడుతున్న సమయంలో ఈ నిర్ణయం సానుకూల సంకేతం. వివిధ సామాజిక, రాజకీయ కార్యకర్తలకు, వారితో వున్న ప్రజలందరికీ ఆశాజనకంగా ఉంది.
“భీమా కోరెగావ్ కేసు ఖైదీలతో పాటు (ప్రశాంత్ గడ్చిరోలి కేసులో పోరాడిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్తో సహా అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు) వేలాది మంది పేద ఆదివాసీలు, దళితులు, ముస్లింలు జైళ్లలో ఉన్నారు. ఈ రోజు ఢిల్లీ అల్లర్లలో బనాయించిన తప్పుడు కేసుల్లో జైలుకెళ్లిన యువతీ, యువకులులందరూ నిర్దోషులుగా బయటికి వస్తారు. అంతిమంగా, ప్రధాన విషయం ఏమిటంటే, ప్రశాంత్ జైలుకు వెళ్ళిన తరువాత, ఈ పోరాటంలో మా స్నేహితులు, మిత్రుల ప్రత్యక్ష, పరోక్ష సహకారం లేకుండా, ఇంత సుదీర్ఘ పోరాటం సాధ్యమయ్యేది కాదు.
ఉత్తరాఖండ్‌లోని న్యాయవాదులతో పాటు, ఢిల్లీకి చెందిన న్యాయవాదులు ధైర్యంగా, శ్రమించి సహనంగా తమ వాదనలను వినిపించానికి చేసిన కృషి కూడా ఒక ఉదాహరణ. మేము అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం” అంటున్నారు చంద్రకళ.
ప్రశాంత్ రాహీ, అతని కుటుంబం, చలనచిత్ర నిర్మాణ కుమార్తె శిఖా రాహి మొదటి రోజు నుండి తన తండ్రికి మద్దతుగా నిలిచిన ధైర్యం మరియు పట్టుదల అతని కుటుంబం యొక్క ఈ కష్టతరమైన ప్రయాణంలో స్ఫూర్తిదాయకం. డిసెంబర్ 21, 2007 (శిఖా రాహి) ‘తారే జమీన్ పర్’ చిత్రంలో తన పని (సహాయ దర్శకురాలిగా) విజయవంతమైనందుకు ప్రజల అభినందనలు కోరుతున్నప్పుడు, ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేసినట్లు శిఖాకు సమాచారం అందించారు.
ఆనాటి నుంచి నేటి వరకు తన తండ్రికి న్యాయం జరగాలని శిఖా నిరంతరం పోరాడుతోంది. జైలులో వున్న తండ్రిని కలుస్తూ, అతని అవసరాలన్నీ తీరుస్తూ, ఒక బలహీనమైన ఆశను పట్టుకొని న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది, గతేడాది ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘‘జూన్ 10కి నా నాన్నకి 62 ఏళ్లు నిండాయి. దాదాపు నాలుగు సంవత్సరాలు ఉత్తరాఖండ్ జైలులో కటకటాల వెనుక చూశాను, అక్కడ 2007 డిసెంబర్ నుండి 2011 ఆగస్టు వరకు ఉన్నాడు ఇప్పుడు గడ్చిరోలి కేసులో 5 సంవత్సరాలకు పైగా ఖైదీగా చూస్తున్నాను. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను.”కానీ ఉత్తరాఖండ్ తప్పుడు కేసులో తన తండ్రి నిర్దోషి అని శిఖాకు సమాచారం వచ్చినప్పుడు, కిల కిలా నవ్వుతూ నాకు తెలుసు మా నాన్న నిర్దోషిగా విడుదలవుతాడని అని అన్నది.
మహారాష్ట్రలోని దేశద్రోహం కేసులో ప్రశాంత్‌కు సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో అప్పీల్ విచారణ జరగాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కోవిడ్ తదితర కారణాల వల్ల, ఈ విచారణ నిరంతరం వాయిదా పడుతోంది. న్యాయం కోసం తన తండ్రి చేసిన నిరంతర ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ.. ‘మా నాన్న ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా ఐదేళ్లు జైలు జీవితం గడిపారు.. అయినా నేను వదలడం లేదు.. నాకు ఖచ్చితంగా తెలుసు.. అవి అక్రమ, నేరారోపణలు అని. మా నాన్న ఇతర సహ నిందితులపై వాటిని మోపడం తప్పు అని ఏదో ఒక రోజు రుజువు అవుతుంది, నాన్న త్వరలోనే స్వేచ్ఛా గాలి పీల్చుకుంటారని నాకు తెలుసు. ఇది జైలులో ఉన్న రాజకీయ ఖైదీలకు వెలుగుని చూపించడమే కాకుండా మనస్సులలో ఆశను నింపుతుంది. ప్రతిఘటనా స్వరాన్ని అణిచివేసేందుకు తప్పుడు కేసుల ద్వారా జైళ్లలో బంధించబడిన వారి కుటుంబాలలో ఆశని కలిగిస్తుంది.” అని శిఖా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(అంతర్జాల సమాచారం సహాయంతో)