ఎన్నికల రుతువు 
మొదలైన వేళ నుండీ
అరుస్తూనే వున్నారు
ఈ నేలని ప్రశ్నలకు తావు
లేకుండా చేస్తామని

నీకూ నాకూ అక్కరలేకుండా
పోయిన సహజ సంపదకు
వాళ్ళు భరోసాగా నిలబడి
పోరాడుతున్నారు

యుద్ధానికి రంగూ రుచీ వాసనా
ఏమీ వుండవు
కానీ తుపాకి వున్న చేయి
ఎవరిదన్నదే ప్రశ్న కదా

అబుజ్ మడ్ నెత్తుటి వసంతంతో
ఈ నేలకు హామీగా మిగిలి వున్నది

వాడు నవ్వుతూ ఉన్నాడంటే
నీ కడుపులో చిచ్చు పెడుతున్నాడనే

కానీ నీ నా చూపు ఇప్పుడు
బ్యాలెట్ కాగితం పైనే వేలాడుతోంది

జీవితం యుధ్ధమయిన వాళ్ళకి
సత్యమేదో నిత్యమూ
కనుల ముందు బుల్లెట్ లా
దూసుకు వస్తూనే వుంది

నేలను ముద్దాడిన
వారి పెదవి చివరి నెత్తుటి
బొట్టు రేపటి ఉదయాన్ని
హామీగా ఇస్తుంది

వాళ్ళు ప్రేమికులు కదా
యుద్ధం ఒక తప్పనిసరి
జీవన భీభత్సం
అయినా వాళ్ళు ప్రేమిస్తూనే వున్నారు
ఈ నేలనీ ఆ ఆకాశాన్నీ
సమస్త మానవాళినీ

One thought on “29 మంది

Leave a Reply