1.  వొక నగ్నదేశభక్తి   

చంపింది రైలేనా?

రూపాయి రుచి ఎరుగని   

చెమట చుక్కల్ని   

ఆకలి నుండి ఆకలికి  

అనంత యాత్త్రైన

ఆకలి చేతుల్ని   

ఆర్థికమొసళ్ళ నోటికందించింది    

సుభాషితాల సింహాసనం!

దేశం గిడ్డంగి   

పేరుకుపోయిన ఆకలి నిల్వ!  

గుర్తుపట్టని నట గుడ్డి   

ఆహారభద్రత నిల్వ !!  

దేశాన్ని పోతపోసే         

చెమట చేతులు  

ఆకలినదై    

ముంచుతున్నప్పుడే    

68,607కోట్ల నగ్న దేశభక్తి పొర్లి పొంగింది  

సోకెవడిదో?  

సొమ్మెవడిదో?    

చెమట చుక్కలారా!   

ఇంత నోరుంది    

ఇన్ని అక్షరాలున్నై కాని   

మీ ఆకల్ని   

వాడి కనురెప్పలు చేయలేక పోయాను    

మీ ఆకల్తో   

వాడి  కర్ణభేరి మోగించలేక పోయాను   

ఆశల్నీదీఈది   

ఆకలి నడకలు ఆపతి నడకలు   

అలసిన కనులు కప్పుకున్న కలలజంపఖాన!  

నిద్ర పోతున్న పట్టాల మీదే   

నిద్ర పోయిన ఆకలి   

ఆకలి చీకటి!

వాళ్ళ   

చచ్చి పోయిన సూర్యోదయాల్లా   

వాళ్ళే!   

ఈ రాత్రి చీకటంతా   

వాళ్ళ శ్వాస మీదే కూలింది!

సింహాసన చక్రాలు 

తొక్కిన కలలు    

కంకరముక్కలై నెత్తురొడ్తున్నాయి   

ఒరేయ్ !దేశభక్తులారా!  

వాళ్ళు 

తింటూతింటూ వదిలేసిన   

కొన్ని చెమటచుక్కలు    

కొన్ని నెత్తుటిఛారికలల్లిన   

రొట్టెముక్కల్నీ   

ఈ దేశం ఖజానాకు జమచేయండ్రా! 

  

2. ఆకలి హంతకుడిని గురించి   

ఆ రోడ్డు మీద   

పగిల్న గుడిసె నిలబడ్డది  

ఆ రోడ్డు మీద   

మడికట్టు మొలక 

అనాధైమొలిచింది  

ఆ రోడ్డు మీద   

ఊట పడిన రక్త కన్నీళ్ళ కాలువ నడుస్తున్నది   

ఎవడ్రా?

ఆకలి దప్పుల నడి రోడ్డు మీద  

అన్నదాతను నాటేసింది   

భూమి మాట్లాడుతూ మాట్లాడుతూ   

బువ్వై పూసె 

చెమటగింజను  

ఎవడ్రా?  

ఎర్రని రోడ్డు మీద ఎండ బెడ్తున్నది   

ముత్యాలమ్మ చుట్టూర  

ముత్యాలు పండిస్తూ   

పైరుపాట పాడే   

ఊరు పిచ్చుకను    

ఎవడ్రా? 

పొలం కొమ్మల మీంచి కొట్టుకొచ్చింది   

కలలు పొదిగిన 

మక్కజొన్న కంకై నడిచే   

ఆశలు బరువై వొంగిన 

వరిగొల్సై ఊగే   

చెమట మట్టి ని  

ఎవడ్రా?   

చెప్పులు చెప్పులు గా పోత పోసింది   

మెరుపుతీగెల 

నాగలి నవ్వుల్లో నడిచే  

నవధాన్య పొలం    

ఎవడ్రా?  

నడి బజారు కల్లం చేసింది    

మట్టి  

మహాసుందర్ని చేసే 

బురుదోణ్ణి    

ఎవడ్రా?

బూచోడై పట్టింది   

బతుకు బరువైన 

బంగారు తెలంగాణ  ! 

అతివృష్ఠుల్నీ అనావృష్ఠల్నీ   

ఆకుపచ్చగా 

ఓడించిన చెట్టు ను   

ఎవడ్రా? 

గుల్మం చేసి  

వేర్లు తెంపి   

ఎరువులకు విత్తులకు   

ఊర్లు దాటించింది    

ఈ దేశాన్ని  

ఎవడెవడో పోగులేసుకు పోతున్నా   

ఈ దేశం అణువణువుకు 

దేహాన్ని పోగులేస్తున్న   

‘ధాన’కర్ణుణ్ణి  

ఎవడ్రా?  

దరిద్ర దహనం చేస్తున్నది 

మోటబాయి పాట లోన్ని   

విద్యత్తు తీగతో 

ఉరేస్తున్నది   

కళ్ళలోంచి

 కలలురాలి పోతున్నా     

మట్టి బుక్కి  

మనుషులకు   

“మణి”పంచుతున్న  

ఆకలిహంతకున్ని   

ఆయుధం చేయకు రాజ్యమా!   

చిగురాకుల చిలకలపొలాల్లో    

అలలవ్వాల్సిన    

చెమట సముద్రంలో   

భూకంపం పెట్టకు !  

3. సలాం! సపాయివాలా!!

మన శరీరాల  

కాపలై జీవిస్తుంటాడతడు       

కరోనా కౄరత్వం

కళ్ళు తెరవకముందు నుంచే  

నిద్రచిన్నెల్ని దుల్పుకొని   

ఈరబోసుకున్న చీపిరే కావొచ్చు  

ఏక చెయ్యి పొడుగు పారే కావొచ్చు

రొండేరొండు ఆయుధాల్తో—

సపాయి!

నిత్య యుద్ధ సిపాయి!!  

ఆ సపాయివాలే !

సంజీవనీ మొక్కై   

మా వాడ చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటాడు  

ఏదో  దాచిపెట్టుకున్న వాడిలా !!

ఆ సపాయిని చూస్తే  

చెత్త  

చెంపలేసుకొని ఛెంగునెగిరి పోతుంది    

ఆ సపాయిని చూస్తే  

గజ్జి లేసిన మురికి కాలువ  

గలగల సెలయేరవుతుంది  

ఆ సపాయి కాలు తాకి  

ఉదయ సూర్యునికి ధూపం వేసినట్టు   

దుమ్ము మేఘాలు లేస్తూ   

వీధులు ఇస్త్రై పోతాయి  

 దుమ్ము స్నానం చేస్తూనే     

ఈగల దోమల  

రోగాసురులతో   

మళ్ళీమళ్ళీ యుద్ధం చేస్తుంటాడు  

శుభ్రతా క్రిమి సంహారిణి చల్లుకుంటూ   

దుర్గంధాన్ని చంపుతాడు  

పారుతున్న పురుగులు పువ్వులై  

కాళ్ళను తాకుతుండగా  

వైరస్

పండుగ చేసుకుంటున్నప్పుడే   

ఆంటీ వైరసై   

వీర విహారం చేస్తాడు   

అంటురోగాల తల మీద  

అడుగు పెట్టి   

పాతాళం తొక్కుతున్న 

శుభ్రతాధిపతై పోతాడు       

మిత్రులారా!  

రండి!

కొంత దుబ్బ  కొంతకుళ్ళినమురుగు చెత్త 

కొన్ని గాజు పెంకులు

కొన్నిముసుర్తున్న ఈగలు దోమలు 

కొన్ని కక్కొచ్చేపురుగులముత్యాల  

అస్ప్రశ్య సౌందర్య సాధనాల     

అసహ్య అలంకరణైన  

సపాయి అందాల పాదాల్ని ముద్ధాడ్దాం!

 రండి ! !

తనకు 

తన కుటుంబానికీ   

ఏ రక్షణ లేకున్నా  

మనల్ని  

రక్షణ వలయమై చుట్టుకున్నందుకు ! 

4. చీకటిదీపం

 తీసుకెళ్ళు   

చీకట్లోకే !

విద్యుత్తు నుండి  

ఒత్తులకాలానికి  

విపత్తుల మూలానికి

అయినా

మతోన్మాద మాదకద్రవ్యం చల్లి   

అహ్మదాబాదు నుండి  

ఈశాన్య ఢిల్లీ దాకా  

వెలుగుల్నార్పేయడం కొత్తా !  

కాలేకడుపుల మీద 

కార్పోరేట్లను  వెలిగించి  

చెల్లని రూపాయిముఖాన్ని   

చీకటి బొంతలో దాచుకోవడం కొత్తా !!

ఆకలీ కరోనా అన్నదమ్ములై పోయి   

అఖండభారత దండయాత్ర చేస్తుంటే  

మెతుకంటకముందే   

ఆకలి

చేతుల్ని కడిగేసుకోమనడం కొత్తా!!!  

ఓటమి కోసమే ఓటు వేస్తున్న 

ఓటరులారా!  

మీ కృషి ఫలిస్తోంది   

విషాదం ముందు కెల్తుంటే     

ఆకలి  

ఆదిమానవుని వేట కొనసాగుతుంది. 

 

5. ముగిసినట్టేం కాదు గాని   

అంతా ప్రశాంతం గానేవుంది

సముద్రం   

చేతులు కట్టుకొని నిలబడింది    

అలలు  

కళ్ళు మూసుకొని మౌనం పాటిస్తున్నాయి   

అంతా  

మన మంచికే   

బాద  

సొట్టుబోయిన మాటలు    

నెత్తుటి గాయాల నిట్టూర్పులు    

శాంతి  శాంతి  శాంతి    

కూలిన గోడల్లోంచి   

ఎగిసి పడ్తున్న దుమ్ము    

మూసిన కళ్ళల్లో పడ్తోంది     

‘ఇగో’ తృప్తి పర్చుకొని   

రాముడు పునీతుడవుతున్నాడు    

కార్పోరేటు కరసేవలో    

మధుర జ్వరమొకటి    

కొత్త వణుకు పట్టింది    

కాశీ కండ్ల కలక   

కనుగుడ్డు చితికేలా  సల్పుతోంది    

తాజ్ మహల్ గుండెల్లో   

శూలాలు గుచ్చుకుంటున్నాయి   

చార్ మినార్ స్మ్రతుల పతంగీలు   

కాలంగాలం చిక్కి     

విలవిల్లాడు తున్నాయి     

కాషాయం భుజం మీంచి   

కార్పోరేటు   

కత్తి గురి పెట్టింది   

నీళ్ళను   

తెల్ల ప్లాస్టిక్ కవర్లో కట్టినట్టు   

2.77ఎకరాలు  

మళ్ళీ  

వికృత ప్రజాస్వామ్య ముఖ చిత్రమైనాయి       

కలగూర గంప   

పురుగు పడిన కలవరంగా    

దేశం పెదాలకు   

తాళం వేసి   

కళ్ళకు చెవులకు 

తీర్పు నంటించారు 

చేతులు కడుక్కున్నట్టు        

ఇంకేం ?   

రండి! పూజలు చేయండి !      

నా పడగ్గది కింది భూమిలో    

రాముని హస్తికలు శ్వాసిస్తున్నాయి   

ఆధారాలెందుకు ?

ఎట్లైనా విజయమే!   

ఆర్కియాలజీ విశ్వాస తవ్వకాలు చాలు !  

రండి! రండి!    

చారిత్రక తవ్వుదాం    

నా బాత్రూం కిందే   

సీత 

ఆత్మహత్య చేసుకుంది 

  

6. రాజ్యకళ    

ఎవరుచావాలి?    

చంపాల్సినవి

చంపకుండ  

చంపకూడని వాళ్ళ     

చంపుతుంటే     

చావాల్సినవి    

చావవు కదా!   

తెరే 

ఉరేసుకునే

వొక సినిమాసురుడు   

ఇంటిగోడలే   

సిగ్గుతో చచ్చిపోయె   

వొక బుల్లితెరాసురుడు   

కళ్ళే కళ్ళ 

కుళ్ళబొడ్చుకునే   

వొక మొబైలాసురుడు    

వావి వొరుసలే    

తలకొరివి పెట్టుకునే   

వొక మద్యం దయ్యం

అందీ అందని   

అక్షర పేదరికమై మండిన        

వొక దరిద్రాసురుడు    

 నాగరికాన చరిస్తూ  

నరుల్నే       

నారీ మాన మాంసభక్షుల్ని చేస్తుంటే    

 ఎవర్ని చంపాలి?  

కాసుల కళ   

హోదా గుల    

కులస్పర్శ  

మతస్ప్రహ  

ఓటు సోయి చావులు      

ఏ అద్భుతం బ్రద్దలు చేస్తాయి ?          

చంపాల్సిన మనుషుల సృష్టించి    

చంపాల్సిన మనుషుల చేతుల్లో    

చచ్చే మనుషుల సృష్టించి       

చంపబడే మనుషులు  

చంపబడే మనుషుల  చేతుల్లో చచ్చే మనుషులు

చచ్చినా    

బతికినా      

కార్పోరేటు కనుల రాజ్యానికి  

కాసులవర్షమే కురియాలి    

కనులనుంచైనా   

కారుమేఘాలనుంచైనా   

కాల్చి చంపిన శవాలనుంచైనా    

మూలాలకు గొళ్ళెం పెట్టి       

చట్టాన్ని 

జీనులా పరచుకొని           

తూటాగుర్రమెక్కి  

అమాయక జైజైలపూలవర్షం కురుస్తుండగా   

రాజ్యమేగుతుండడమొక కళ!    

7. ఏమేరుతున్నావో    

సముద్రం 

చూస్తూనే ఉంది     

ఏ చెత్త    

ఎట్లావచ్చిందో 

నేనడుగను     

ఐతే  

నువ్వేరుతున్న చెత్త       

నే నేనా ?    

నా అన్న దళితుడా ?     

నా అమానూల్లా ఖానా ?     

నిజంగా   

చెత్తేరే వాళ్ళు    

మురికి బట్టలతో    

మురికి చేతులతో    

మురికి కాళ్ళతో  

ఆకలి కి

మసిగుడ్డ చుట్టినట్టు        

మనిషంతా మాసిపోయి   

దుమ్ము గుడ్డ కప్పుకున్న

మట్టిలాఉంటారు         

మనస్సు

నది పారుతున్న శుభ్రంగా ఉంటారు    

నీలా 

ఖరీదైన మనుషులేం కారు      

ఈగలు ముసుర్తూ    

దోమలు ఎగుర్తూ   

పురుగులు పార్తూ    

మురిగి కంపు కొడ్తున్న చెత్త    

నీ మనస్సు నిండా ఉంది     

నీ ఆలోచన్ల నిండా ఉంది   

నీ అణువణువు పేరుకుంది    

నిండిన కడ్పుతో    

చెత్తకు రూపంలా    

చరిత్ర ముందు నిలబడ్డావు  కాని      

ప్లాస్టిక్కో   పాత కాగితాలో  పండ్లతోళ్ళో     

నువ్వేరుతున్న  

చెత్తను చూసి   

చెత్త కుండి    

ఏ చెత్త వేస్తాడోనని    

ఫక్కున నవ్వింది     

ఎందరి కన్నీళ్ళో         

దిగ మింగుకున్న సముద్రం     

నీ లోని చెత్తను చూసి   

ఉప్పగ నవ్వుతోంది 

     

8. వొక సముద్రసమయంలో

పురిటివాసనల్లో    

సూరీడింకా నెత్తుటిగుడ్డే!    

చలచల్లగా    

మనుషులెవ్వరు చూడకుండ  

అనాచ్ఛాదిత ఇరువైనాలుగు క్యారెట్ల

బంగారుసముద్రం    

నను తడితడిగా పిలిచింది    

ఇసుకబురదలో    

నా కాళ్ళు దిగబడుతుంటే   

నా అనాదిమైత్రీ సంభాషణోత్సవానికి వెళ్ళాను   

నేల వానమబ్బు ముద్దాడిన సంబరంగా—       

నను చూసి అలలథింసా ఆడింది   

నేను పరుగెడితే తను    

తను పరుగెడితే నేను  

ఒకరినొకరు ముట్టిచ్చుకొనేఆట 

ఓడామూ గెల్చామూ అలిసామూ         

ఎట్లా పండుగ జరుపుకుందో!    

వద్దంటే వింటేనా   

నా కాళ్ళకిందినుంచి మక్మల్ ఊయలై పర్చుకొని  

నన్ను అలలమీదిపడవతుళ్ళింతలా ఊపింది    

నా కాళ్ళకు నురుగుపూలు చుట్టి  

నా మెడకు గవ్వలమాల కట్టి     

పరుగాగింతర్వాతి శ్వాసతో ఊగుతున్న    

నా కడుపులాంటికడుపుతో    

కొన్నిసంతోషాలూ అనేకదుఃఖాలతీరంలో        

నా కోసం మత్స్యకారులు చేపల వాసనేస్తున్న   

సముద్రపాట పాడింది  

హఠాత్తుగా  

నీటిపడగైలేచి     

చినుకుముత్యాల్ని కుమ్మరించి  

నాలో మునకలేసి మురిసింది    

ఇంతకిది 

మారాం మారాంచేసి      

మనుషుల్ని ఊళ్ళనీ మింగే బకాసురురాలా?

కాళ్ళను గిలిగింతలుపెడ్తూ నాకే చేపపిల్లనా!!

9. మాటలు మాయం చేయబడిన చోట

నేను మాటల్ని నమ్ముకున్నాను

నువ్వు మరల్ని నమ్ముకున్నావు

యుద్ధం చెయ్యి

నువ్వో మరలా!

నేనా

నిన్నాపలేను

నేనో ఓటునో!

నీ అభిప్రాయ సేకరణ ఓసంఖ్యనో!

కత్తులు పదును దేరిన నోటికి

నెత్తుటి దాహపుమూర్ఛబిళ్ళ వేలాడేసుకుంటావు

నా మెతుకు లాక్కొని

నా చెమట పిండుకొని

నా నెత్తురు తాగి

నా కోసమే ఆయుధాలు కొని

 నా కొన్ని కాళ్ళు  నాకొన్ని చేతులు

 మరికొన్ని తలకాయలు ఇంకొన్ని మొండాలు 

ఖజానాలో వేసుకోవడమే కదా 

యుద్ధమంటే 

భూమంతా నానెత్తుటి అలుకు చల్లి 

నామాంసం ముద్దల ముగ్గు వేయడమేకదా యుద్ధమంటే

 చెమట చుక్కల నిర్మాణాలు 

మట్టి కుప్పలైపోయాక 

నేను నిరాశ్రయమై

బట్టలు లేక చెప్పులు లేక

నా బతుకుక్షణాలు లెక్క పెడ్తున్న గాలిలో

చిరిగిన శరీరం తో

చిలుంపట్టి పాడుబడిన ఇనుప ముక్కలా

ఒంట్లోని కణాలు రాలిపోతుంటే

 దిక్కులు నడచిపోవడమే కదా యుద్ధమంటే 

నవ్వులు ఏడుస్తుంటాయి  

ఏడుపులు మరణిస్తుంటాయి

ఇనుప శకలాలు చొరబడ్డ జ్ఞాపకాలేవీ లేకుండా నీడలు కూలి పోతుంటాయి 

యుద్ధమంటే మనుషులు కలిసి ఉన్న 

నా గురుతులని దోచుకు పోవడం కదా!

పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న

నా చనుబాలధార ఒక్కసారిగా ఎండిపోయి

 పసిపిల్లల పేగులు దగ్ధం అవుతుంటాయి

భయంపగిలిన నదులు

సరిహద్దుల్ని ఈదుతుంటాయి

బెలూన్లా ఎగురుతున్న ప్రాణాన్ని పట్టుకొని

ఒక్కో అవయవం తెంపుకొని

నన్ను పొడిచేసి

మట్టిలో కలిపేస్తావు తృప్తిగా

నా బతుకు నేను బతకనప్పుడు

నా కోసం యుద్ధమెందుకు?

నా జీవితాన్ని నేను జీవించనప్పుడు

నీకోసమే కదా!

 ఈ రణదాహం!!

సరిహద్దు కివతల ఒకమృగం

సరిహద్దు కవతల ఒక మృగం

అధిపత్యస్వభావ రోగాధిపత్యంతో

దేశాల్ని మట్టిని మనుషుల్ని తినే 

కౄరమృగం చిక్కుబడి

నన్ను ముక్కలుగా నరికి

బాంబులు మిస్సైల్లు మాట్లాడుతుంటారు

ఏదో ఓ రోజు

చెరోవైపు నెత్తుటి సముద్రం ఎగురుతూ వచ్చి

తృప్తిగా నెమరేస్తూ

ఎటోళ్లటు వెళ్ళిపోతారు మళ్లీ యుద్ధం దాకా!

ఒరేయ్!

నా యుద్ధప్రభువా!

నీ మనుషుల మాయం దేశభక్తి ముందు

నా దేశభక్తి చిలికలుపేలికలని తెలుసు

ఐనా సరే

నన్ను బతుకనీయకున్నా

నా పిల్లల్ని బతుకనీయండ్రా!

ఈ ప్రపంచ భవిష్యత్తు బతకనీయాండ్రా!!

10. చనుబాల సల్పు


మొగ్గలను  

పురుగు మేస్తోంది      

చిగుళ్ళను   

గద్ద తింటోంది    

అణిచినఅరబ్బువసంత 

ఆకలి ఖరీదు   

మానమైపోయిన  దేశం లో    

బాలశవాల మైదానాలు   విస్తరిస్తున్నాయి     

తూటా   

ఊయలలూగుతోంది     

 జోలపాట   

 కత్తివేటు నెత్తురై పారుతోంది    

 కాలుచేతులు తెగిన ఆటబొమ్మ    

కాల్పులాడుకొంటున్నాయి    

నెత్తుటికన్నీళ్ళ తడ్సిన నేలనేలంతా    

నిషిద్ధ రసాయనాయుధ ఫైరింగ్ రేంజై పోయింది

 భవిష్యత్తు తుంచి వేయబడ్తున్న  నేల    

ఉక్రెయిన్‌

ముద్దుముద్దు మాటలు     

నెత్తురొడుతూ కూలి పోయాయి  

చిట్టిచిట్టి అడుగులు  

 చిటారుకొమ్మ చిక్కిన పతంగిలా చిరిగాయి    

సామ్రాజ్యవాదసాయుధ చదరంగం లో     

బాల్యం నిషేధించబడిన నేల    

బాదలే దేశమై పోయిన నేల    

గర్భశోకం     

ఈ ప్రపంచాన్ని చేతులు చాచి అర్థిస్తోంది    

అమ్మఒడి మరణించిన పసితనం   

సేపుకొచ్చిన    

భూ చనుబాలై సల్పుతోంది     

ప్రపంచమా!

దుఃఖించు!!     

నాగరికమా!   

సిగ్గుపడు!!          

Leave a Reply