పాణి

కామ్రేడ్‌ ఆర్కె మరణించి కూడా మనకు  ఒక  భరోసాను ఇచ్చాడు. ఈ చీకటి రోజుల్లోనూ ధైర్యాన్ని అందించాడు. తన విస్తారమైన ప్రజా జీవితంలో వలె మరణానంతరం కూడా  మనలో ఆశను రగిల్చాడు.   

ఆర్కె జ్ఞాపకాల, రచనల సంపుటి ‘సాయుధ శాంతి స్వప్నం’ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. పుస్తకాలను ప్రచురణకర్తకు ఇచ్చేయాలని, ప్రింటర్‌ మీద పెట్టిన కేసు చెల్లదని ప్రకటించింది. న్యాయ పీఠాలు అన్యాయ స్థావరాలుగా మారిపోయిన వేళ ఇలాంటి తీర్పు వెలుబడిరది. తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద  పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. అయితే ఆ చట్టం ప్రకారం కేసు పెట్టదలుచుకుంటే పాటించవలసిన పద్ధతులను పోలీసులు పాటించకపోవడం దగ్గరి నుంచి పుస్తకంలో, పుస్తక ప్రచురణలో చట్ట వ్యతిరేకత ఏమున్నదో కనీసంగా ప్రస్తావించలేదని, ఇంకా అచ్చు  కాని పుస్తకం వల్ల ప్రజా భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందనడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడిరది. 

ఒకవేళ పుస్తకాల స్వాధీనంలో, కేసు నమోదులతో పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ నిబంధనలకు పాటించినా పుస్తకంలో, పుస్తక ప్రచురణలో చట్ట వ్యతిరేకతను నిరూపించడం పోలీసులకు సాధ్యం అయ్యేది కాదు. దేనికంటే సాయుధ శాంతి స్వప్నంలో ఉన్న రచనలు నేరాన్ని ప్రేరేపించేవి కాదు. ఆ రచనలన్నీ ఇప్పటికే పత్రికల్లో, మాధ్యమాల్లో బహిరంగమైనవే. అందులోని రచనలు అమరుడు ఆర్కె పట్ల గౌరవాన్ని ప్రకటించేవి. ఆయన మార్గం పట్ల నమ్మకాన్ని ప్రకటించేవి. ఇవేవీ ప్రజా భద్రతకు భంగం కాదు. ఈ తీర్పులోని న్యాయ సంబంధమైన వివరాలు ఒక ఎత్తు.  అయితే ఈ తీర్పుకు ఒక  రాజకీయ సందర్భం ఉంది. రాజకీయ అర్థం కూడా ఉంది. దేనికంటే పోలీసులు కేసు నమోదు చేయడం, అచ్చవుతున్న పుస్తకాలను తీసికెళ్లడం చట్ట పరమైన(చట్ట రాహిత్యమైన) చర్య మాత్రమే కాదు. అందులో ఒక రాజకీయ ఉద్దేశం కూడా ఉంది. అందువల్ల ఈ తీర్పు సందర్భంలో  పోలీసులు  భావాలను, విశ్వాసాలను, రచనలను, పుస్తకాలను నిర్బంధించడం సాధ్యం కాదని చెప్పడానికి అవకాశం కలిగింది.   

ఇలాంటి తీర్పులు గతంలో  కూడా న్యాయస్థానాలు ఇచ్చాయి. కొన్ని కేసులు సాంకేతిక స్థాయిలోనే ఓడిపోయాయి. అయినా రాజ్యానికి భావాలంటే భయం. ఆలోచనలను, జ్ఞాపకాలను, రాజకీయాలను, సిద్ధాంతాలను అడ్డుకోడానికి బరితెగించి దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడైతే ఎన్‌ఐఏ అదికారులు రచన నేరమని, చదవడమే చట్ట వ్యతిరేకమని, పుస్తకాలను ఉంచుకోవడమే తీవ్రవాదమని రుజువు చేయడానికి   నానా తంటాలు పడుతతున్నారు.  విప్లవకారులను స్మరించుకోవడం, విప్లవోద్యమానికి మద్దతు ప్రకటించడం దేశద్రోహం అని  నిర్ధారించడానికి అలవికాని కుట్రలను పన్నుతున్నారు.  యథాతధ, తిరోగమన, పురా జ్ఞాపకాల, గత అనుభవాల, ఏడుగొట్టు పుస్తకాలైతే పర్వాలేదు. చీమలు పాకకుండా కవాతు చేస్తాయనే ఊహను కూడా సహించలేకపోతోంది. సరిగ్గా ఫాసిజం అంటే ఎలా ఉంటుందో మన అనుభవంలోకి వస్తున్న సమయం ఇది. ఫాసిజం భౌతిక నిర్మూలనే కాదు, మన ఆలోచనా ప్రపంచాన్ని, మన ఊహాశక్తిని, మన పఠనాసక్తిని, మన అంతరాంతరాల్లోని విశ్వాసాలను కూడా ధ్వంసం చేయదల్చుకుంది.

ఇలాంటి వాతావరణంలో సహజంగానే పాఠకులకు ఒక సందేహం కలుగుతుంది. ఏ పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏ పుస్తకాలు చదవచ్చు. ఏవి దగ్గర పెట్టుకుంటే నేరం, ఏవి చదివితే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం రూపంలో రాజ్యం మనల్ని ‘నేరస్థుల’ను చేస్తుంది? మావోయిస్టు ఉద్యమాన్ని సమర్థించే పుస్తకాలు ఇంట్లో ఉంచుకుంటే కేసులు నమోదు చేస్తారా? అమరవీరులను స్మరించుకుంటే చీకటి కొట్లో తోసేస్తారా? ఏ రకం పుస్తకాలను ఇంట్లోంచి తీసేస్తే రక్షణ దొరుకుతుంది? ఏ మాటలు ఉచ్ఛరించకుండా,  వినకుండా  ఉంటే కొద్దికాలమైనా భద్రత ఉంటుంది?  అనే స్థితిని రాజ్యం, ఎన్‌ఐఏ, యుఏపీఏ కల్పించాయి.  నిజంగానే ఇదొక  భయానక వాతావరణం. ఒక సందిగ్ధ స్థితి. 

ఆర్కె ‘సాయుధ శాంతి స్వప్నం’ మీద గత ఏడాది నవంబర్‌ 11న దాడి జరిగాక ఇది మరింత ఎక్కువైంది. ఉమ్మడి ఆంధ్రపద్రేశ్‌లో ఎన్నో విప్లవ రచనలను ప్రభుత్వం నిషేధించింది. రచయితలను, ప్రచురణకర్తలను అరెస్టు చేసింది. కానీ ఎమర్జెన్సీ కాలంలో కూడా ఒక పుస్తకం ఇంకా వెలుగులోకి రాక ముందే అది ‘ప్రమాదకరం’ అని భావించి ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ఎత్తుకపోలేదు. ఇలాంటి ఘటన ఇదే మొదలు. ప్రెస్‌ యజమాని రామకృష్ణారెడ్డి, ఆయన సహచరి, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య మీద కేసులు నమోదు చేశారు. ఆ మరునాడు   సభ జరగకుండా హాలు యజమానులను బెదిరించి అడ్డుకున్నారు. ఈ దుర్మార్గం వల్ల  ప్రజల్లో ఆందోళన కలిగింది.  

అంతక  ముందే దేశ వ్యాప్తంగా మేధావులను, రచయితలను, ఉద్యమకారులను భీమాకొరేగావ్‌ కేసులో నిర్బంధించాక ఈ ఆందోళన తీవ్రమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యార్థులు, కళాకారులు, రచయితల మీద రెండు మూడు సార్లు ఎన్‌ఐఏ దాడులు జరిగాక, ఒక్కొక్కరి మీద అనేక యుఏపీఏ కేసులు నమోదు చేశాక, కొందరిని అరెస్టు చేశాక ఈ సందేహాలు ఎక్కువయ్యాయి. ఆర్కె పుస్తకం అచ్చుకాకుండానే అడ్డుకున్నాక ఈ వాతావరణం మరింత పెరిగింది. 

కానీ ఆర్కె పుస్తకం మీద హైకోర్టు  తీర్పు కూడా ఈ ఆందోళనాపూరిత వాతావరణంలోనే వచ్చింది. ఆ పుస్తకంలో 33 కవితలు, పాటలు ఉన్నాయి. 14 వ్యాసాలు, 5 సంతాప ప్రకటనలు అచ్చయ్యాయి. శిరీష ఇంటర్వ్యూలు రెండు, ఆర్క్‌ ఇంటర్వ్యూలు, రచనలు 9 ఉన్నాయి. ఇవన్నీ అచ్చంగా సాయుధ శాంతిని స్వప్నించినవే. నవంబర్‌ 11న  నవ్య ప్రింటింగ్‌ ప్రెస్‌ మీద దాడి చేసిన పోలీసులు తమ చర్యను సమర్థించుకోడానికి ఒక మాట అన్నారు. సాయుధ శాంతి స్వప్నంలో విప్లవ సాహిత్యం ఉందని అన్నారు. అందుకే స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 

ఆ పుస్తకంలో విప్లవ సాహిత్యమే ఉన్నది. జీవితమంతా విప్లవం కోసం ధార పోసిన వ్యక్తి గురించిన జ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, అంచనాలు విప్లవానికి సంబంధించినవే. ఆయన రచనలు కూడా విప్లవోద్యమానికి సంబంధించినవే. ఈ సమాజాన్ని మానవీయం చేయడానికి దోహదం చేసే ఆలోచనలే అందులో ఉన్నాయి. కానీ అది చట్టవ్యతిరేకం అని, ప్రజా భద్రతకు ప్రమాదం అని ఆరోపించిందిగాని నిరూపణగా ఒక్క వాక్యం కూడా పోలీసులు ఆరోపణల్లో రాయలేదు. ఈ పుస్తక ముద్రణ చట్టవ్యతిరేక కార్యకలాపం అనడానికి ఒక్క రుజువు కూడా చూపలేకపోయారు. దీన్ని కేవలం పోలీసుల వ్యవహార శైలిగా భావిస్తే పొరబాటు. కేసులోని సాంకేతిక సమస్య మాత్రమే కాదు ఇది. నిజంగానే ఈ రచనల ద్వారా, పుస్తక ముద్రణ ద్వారా చట్టవ్యతిరేకంగా ప్రజా భద్రతను ఎలా భంగం కలిగించదల్చుకున్నదీ చెప్పడం సాధ్యం కాలేకపోయింది. ఒక జ్ఞాపకం, ఒక ఆశయ ప్రకటన ఎలా నేరం అవుతుంది? నేరమని ఎలా నిరూపణకు నిలబడుతుంది? అధికారం ఉంది కాబట్టి దేని మీదైనా నేరం ఆపాదించగల చట్టాలు తయారు చేసుకోవచ్చు. కానీ అది నేరం అని ఎలా చెప్పగలరు? సాక్ష్యం ఎలా తేగలరు? ఎలా నిరూపించగలరు? 

అందుకే న్యాయస్థానం తన తీర్పు ద్వారా సాయుధ శాంతి స్వప్నాన్ని  ప్రజల్లోకి విడుదల చేసింది. విప్లవ ఆలోచనలు, విశ్వాసాలు, అమరుల జ్ఞాపకాలు, విప్లవోద్యమానికి మద్దతు ప్రకటించడం చట్ట వ్యతిరేకం  కాదని గత యాభై ఏళ్లలో న్యాయస్థానాలు ఎన్నోసార్లు ప్రకటించాయి. మావోయిస్టు సంస్థల్లో ఉండటం కూడా నేరం కాదని తీర్పు ఇచ్చాయి. నేరపూరిత చర్యలే భారత శిక్షా స్మృతి ప్రకారం శిక్షార్హం. మిగతావేవీ నేరం కాదని చెప్పాయి. 

కానీ భారత పాలకులు రాజ్యాంగ వ్యతిరేకంగా యుఏపీఏ అనే అప్రజాస్వామిక చట్టాన్ని, ఎన్‌ఐఏ అనే జేబు సంస్థను తయారు చేసుకొని తమకు ఇష్టం లేని ఆలోచనలను కూడా నేరంగా మార్చేశాయి.  

ఈ తీర్పు ప్రకారం సాయుధ శాంతి స్వప్నం పుస్తకాన్ని అమరుల బంధుమిత్రుల సంఘం తరపున ఆర్కె సహచరి అచ్చువేయడం నేరం కాదు. ఆ పుస్తకానికి రచనలు ఇవ్వడం నేరం కాదు. ఆర్కె తన విప్లవోద్యమ జీవితంలో భాగంగా రాసిన రచనలను అచ్చు వేయడం కూడా నేరం కాదు. విప్లవోద్యమ పుస్తకాలను  ప్రెస్‌లు ముద్రించడం నేరం కాదు. అంతకుమించి ఇలాంటి పుస్తకాలను ఆవిష్కరిస్తూ సభలు పెట్టడం, వాటిని చదవమని చెప్పడం, ఇష్టంగా చదువుకోవడం నేరం కానే కాదు. సాయుధ శాంతి స్వప్నం తరహా పుస్తకాలను ఇండ్లలో పెట్టుకోవడం ఎంత మాత్రం నేరం కాదు. ఈ పనుల ద్వారా నేరం ఏం జరిగిందో, చట్ట వ్యతిరేక చర్యలు ఏం జరిగాయో పోలీసులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. వాదన తార్కికంగా సాగితే అక్కడి దాకా వెళుతుంది. 

నిజానికి ఎవరు ఏ పుస్తకాలు రాయాలి? ఏవి చదవాలి? ఏవి ప్రచురించాలి? అనేది భారత రాజ్యాంగం కూడా నిర్దేశించలేదు. రాజ్యాంగం తన పౌరులను గుర్తించి వాళ్ల భావ ప్రకటనా స్వేచ్ఛకు రక్షణ ఇస్తుంది. కానీ ప్రజలు పౌరులు కావడానికన్నా ముందు మనుషులు.  సృజనాత్మక ఆలోచనా జీవులు. విమర్శనాత్మకత, సృజనాత్మకత అనేవే సకల జీవజాలం నుంచి మానవులను వేరే చేశాయి. మానవ సమాజానికి దాని వల్లనే చరిత్ర ఉన్నది. మరే జీవ రాసులకు చరిత్ర లేదు. సంస్కృతి లేదు. ఈ విమర్శనాత్మకతను, సృజనాత్మకతను, ఎంపిక చైతన్యాన్ని, ఊహాశక్తిని రాజ్యాంగం నిర్దేశించలేదు. ఇవేవీ దాని పరిధిలోనివి కావు. అసలు ఈ భాష రాజ్యాంగానికి అర్థమే కాదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ కంటే చాలా విశాలమైనది. మౌలికమైనది.   మానవ జీవి సహజాతం. కాకపోతే  రాజ్యాంగం ఈ భూభాగంలోని మనుషులను పౌరులుగా గుర్తించింది కాబట్టి ఆమేరకు భావ ప్రకటనా స్వేచ్ఛగా మాత్రమే  దీన్నంతా నమోదు చేసుకుంది. అందుకే రచయితలు భారత రాజ్యాంగాన్ని దగ్గర పెట్టుకొని రచనలు చేయరు. పాఠకులు రాజ్యాంగ నిబంధనల మేరకు పుస్తకాలు ఎంచుకొని చదవరు. అసలు మానవులు రాజ్యాంగాన్ని నిత్యం పఠిస్తూ అందులో ఉన్న నిబంధనల మేరకే ఆలోచించడం, ఊహించడం, రాజకీయ విశ్వాసాలను ఏర్పరచుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు. 

న్యాయస్థానాలకు ఇంత విస్తృతమైన సామాజిక సాంస్కృతిక, మానవ సంబంధమైన అవగాహన ఏమీ ఉండదు. అట్లా ఆలోచించడం న్యాయస్థానాలకు సాధ్యం కాదు. ఇదంతా వాటి పరిధిలోనిది కాదు.  గత యాభై ఏళ్లుగా అయినా భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలో ఆలోచించి ఇలాంటి తీర్పులు ఇస్తూనే వచ్చాయి. పుస్తకాలపై నిషేధం చెల్లదని, సాహిత్య సంస్థలపై నిషేధాలు కుదరవని చెబుతూనే వచ్చాయి. చాలాసార్లు ఏ చట్టం ప్రకారం పోలీసులు చర్యలు తీసుకున్నారో ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే వీగిపోయిన కేసులు కూడా ఉన్నాయి. సాయుధ శాంతి స్వప్నం విషయంలో  న్యాయస్థానం అలాంటి లొసుగులను కూడా గుర్తించింది. 

అయినా పాలకులకు, పోలీసులకు ఇలాంటి  తీర్పుల మీద గౌరవం ఉండదు.  కాబట్టి   తీర్పులు ఇలా వస్తూనే ఉంటాయి. వాళ్లు చేసేది చేస్తూనే ఉంటారు. 

అయినా సాయుధ శాంతి స్వప్నం మీద తీర్పు సాహిత్య మేధో రంగాలకు, ముద్రణ రంగానికి ఒక చిన్న ఆసరా. దీనికి ఉన్న ప్రాధాన్యతను తక్కువ చేయడానికి లేదు. కాకపోతే ఇట్లా ఒక పుస్తకాన్ని ముద్రణ దశలోనే ఎత్తుకపోవడం ఏమిటని తెలుగు రచయితల్లో చాలా మందికి అనిపించలేదు.  ఒక ప్రచురణ సంస్థ బాధ్యతపడి అచ్చేయదల్చుకున్న పుస్తకం మీద దాడి చేయడం ఏమిటని బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రచురణ సంస్థ కూడా అడిగినట్లు లేదు.   పుస్తకాల అచ్చు గురించి,  అమ్మకాల వ్యాపారం గురించి చర్చోప చర్చలు చేసి ప్రచురణ రంగంలో విప్లవం తేవాలని కసరత్తు చేసే వాళ్లెవరికీ ఇది నొప్పి అనిపించలేదు.  ఆర్కె పుస్తకం అచ్చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రెస్‌ యజమాని మీద కేసులు పెట్టడమేమిటి? వాళ్ల కీలక సామాగ్రిని జప్తు చేయడం ఏమిటని ఒక్క ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని కూడా నోరెత్తి వాళ్లకు మద్దతుగా రాలేదు.  ఒక పుస్తక ఆవిష్కరణ సభను ఇంత దుర్మార్గంగా అడ్డుకోవడం ఏమిటని నిత్యం పుస్తకావిష్కరణ మేళాలు జరిపే వాళ్లెవరికీ అనిపించలేదు. ఈ మాట అంటే ఇదంతా విప్లవోద్యమ వైఫల్యమే అని సిద్ధాంతాలు వల్లించేవాళ్లకూ కొదువ లేదు. మళ్లీ అందరికి అందరూ పోటీపడి అభ్యుదయం గురించి మాట్లాడేవారే.  అంత మాత్రాన ఇదేమీ కానికాలం కాదు. బహుశా మరే తరహా పుస్తకాలకంటే ఆర్కెలాంటి అమరుల పుస్తకాలను, విప్లవ రచనలకే లెక్కలేనంత మంది పాఠకులు ఉన్నారు. సాధారణ పుస్తక ప్రియులు,   విప్లవాభిమాన పాఠకులే అనేక భయ సంక్షోభాల నుంచి ఎప్పటికప్పుడు తేరుకొని  ఈ యాభై ఏళ్లుగా అండగా ఉన్నారు. వాళ్లు తమను తాము విప్లవంలో భాగం అనుకున్నారు కాబట్టే సకల సందిగ్థతలతో సహా సాయుధ శాంతిని స్వప్నిస్తూ ఉన్నారు.  వాళ్లే ఎప్పటికైనా సాయుధ శాంతిని నిజం చేస్తారు. ఈ కోర్టు తీర్పు వల్ల ఆర్కె సమరగాథ చట్టబద్ధంగానే మనకు చేరువ అయింది.   అలాంటి వేలాది మంది అమరుల పుస్తకాలను మనం చదవడం, వాళ్లు నిర్మిస్తున్న విప్లవోద్యమంతో భావజాల మమేకత పొందడం  నేరం కాదనే  వైఖరి తీసుకోవాల్సిన సందర్భం ఇది. 

Leave a Reply