వెదుర్లు
అక్కడ యుద్ధం జరిగినట్లు వుంది. మృత కళేబరాల్లా ఉన్నాయి టమోటా మొక్కలు. సైనికుల దండయాత్రేదో జరిగినట్లుంది. పొలమంతా నానా భీభత్సంగా వుంది. టమోటాలు చితికిపోయి నలిగిపోయి వున్నాయి. ఎకరా పొలంలో ఎక్కడా ఒక మొక్క బతకలేదు. ఒక్క టమోటా కూడా మిగల్లేదు. ఎరుకల దొరస్వామి గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. పక్కనే అతడి భార్య ఏడో నెల గర్భిణి నీలమ్మ కండ్లల్లో నీళ్ళు పొంగుతున్నాయి. ఆమె పక్కనే ఆరేళ్ళ కుర్రాడు. రాజు దిక్కుతోచకుండా అమ్మానాన్నల వైపు బిత్తరపోయి చూస్తూ వున్నాడు. ఏం జరిగిందో, టమోటా పంట మొత్తం ఎందుకిట్లా నాశనం అయ్యిందో, అమ్మానాన్న ఎందుకట్లా ఏడుస్తున్నారో వాడికి అస్సలు అర్థం కాలేదు.