రిక్షా అప్పన్న కూతురు పెళ్లంట. ఆడి పెద్ద కూతురు మల్లీశ్వరికి పద్నాలుగేళ్లుంటాయి. ముగ్గురు కూతుళ్ల తరువాత ఒక్కడే మొగ్గుంటడు పుట్టాడు అప్పన్నకి. అప్పన్నకి తాను తోలే రిక్షా కాకుండా పన్నెండు బళ్లు అద్దెకు తిరుగుతాయి. చెయ్యెత్తు మనిషైనా అప్పన్నకి ఒక కాలు బోదకాలు అవ్వడం చేత ఎక్కువగా రిక్షా తొక్కడు. బళ్ల అద్దెలు వసూలు చేసుకుంటాడు. అతని అన్నదమ్ములందరిదీ ఒకటే వాసని పెంకుటిళ్లు. చూడముచ్చటగా ఉంటాయి. ఎలమంచిల్లోని మాలపల్లంతటికీ అప్పన్నే మోతుబరి. అప్పన్న అక్క ఒకావిడ రంగం ఎల్లి బోల్డు బంగారం, డబ్బు తెచ్చిందనీ, అన్నదమ్ములకి ఒక కాపు కాసిందనీ చెప్పుకుంటారు. రంగవప్పయ్యమ్మకి ఈ ఊర్లో ఒక మొగుడున్నాడు. ఆవిడ భుజాల దగ్గరకే రాడు, మొగుడు సన్నాసి. రంగం ఎల్లాక అక్కడ చిన అప్పారావనే షావుకారితో జతకలిసి అప్పయ్యమ్మ బాగా సంపాదించింది. మాలపేటలో డాబాయిల్లు కట్టిన మొదటి వ్యక్తి అప్పయ్యమ్మే. రిక్షా అప్పన్న చెల్లి వెంకటి మొగుడు తాతారావు తాపీ పనికెళ్తాడు. అదుగో ఆళ్ల కొడుకే గాంధీగాడు. ఆడు ఊళ్లో పది పాసయ్యి విశాఖపట్నంలో ఐటిఐ చదివి డాక్‌యార్డులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మల్లీశ్వరి అందానికి గాంధీ తగడని, చాలా రోజులు అప్పన్న చెలెల్ని సంబంధం అడగలేదు.
‘‘ఒరే, తమ్ముడా… నా కాడ కొడుకుల్లేరు. లాపోతే నేనే నీ కూతుర్ని సేస్సికుందిను. సెల్లి, దాని మొగుడు మంచోలురా. నిన్ను కట్నం, కానుకలు అడక్కంటా ఆలైతే సేసుకుంతారు. దీని అందం ఇద్దరు పిల్లల్తోటిసరి. ఎనక మొగడందాన్ని ఇది కొరుక్కుతింటాదేట్రా, అయినా గాంధీగోడి కేవీ నలుపుపైనా కుదిమట్టంగుంటాడు. మొగోడికి అందం జూత్తావా? బాగా ఆలోసించరా తమ్ముడూ, ఆనక ఇసారించీ పనిసెయ్యక ఉజ్యోగత్తుడు దొరకడవంటే మాట్లా? నువ్వొందంటే పెద తమ్ముడు ఆల జయకిచ్చీడానికి సూత్తన్నాడు. ఇంకేటి రెండేల్లాగితే అదీ పెద్దమనిసయిపోద్ది. అప్పుడు ఆడితో నువ్వు పోటీ కెల్లినట్టుగుంటాది. ఆలోసించు. మల్లీస్పరి పెద్ద పిల్లయ్యి అప్పుడే సమచ్చరం అయిపోతుంది. ఎన్నాల్లుంచుతావు పిల్లనీ… అని ఒకనాడు రంగవప్పయ్యమ్మ అప్పన్నతో ఊసెట్టింది.
‘‘అదే ఆలోసిత్తన్నానే అప్పా, ఇది చూత్తే ఇప్పుడే నా బుజంకాడకుంది. ఆడుసూత్తే బూవికి జానెడున్నాడు. ఇది చూత్తే తెల్లగ పుస్పం నాగుంతాది. ఆడు చూత్తే కాకి నలుపు. ఉజ్యోగత్తుడికిత్తే ఇది సుఖపడీమాట నిజవే, కానీ ఈడుజోడూ బొత్తిగా కుదర్నేదు. గాంధీగాడు ఆశపడుతున్నాడు దీన్ని సేసుకోవాలనిగానీ, ఏటిసెయ్యడం తోచనేదు’’ అన్నాడు అప్పన్న సాలోచనగా.
‘‘పెల్లయిపోతే ఆలే జంటైపోతారు. నా మొగుడు నల్లగున్నాడు అని నాను కాపరం సెయ్యనని ఈ గుంట అనగల్దేటి? మనం నలుగురం కూడి డబదబ లాండిచేద్దారి’’ అన్నాది అప్పయమ్మ దబాయింపుగా.
‘‘పిల్ల ఏపుగా పెరిగేత్తంది. నిరుటి నంగాలు ఈ ఏడు పొట్టై పోయాయి. దానికి మొన్నాల్ల నాన్న తీసికెల్లి మల్లీ నంగా గుడ్డలు కొనుక్కొచ్చాడు. ఆటిమీదకి మల్లీ వోనీలు కొనమని కూచ్చుండిది కొట్టుకాడ. పెద్ద కూతురు నోట్లోంచి ఏదొత్తే అదే సేసేత్తాడీబాబు. బట్టలకొట్టు కెల్లిందంతే పైపై గుడ్డలు ఎంచదు నీ మేనగోల్లు మీదకెల్లి బేల్లన్ని తీయిత్తాది. దానికి కంటికి నచ్చిన గుడ్డ ఆల్ల బాబుతో కొనిపించేత్తాది. ఈ బాబూ కాదన్డు. అడగడవే ఆలీస్సం, కొనేత్తాడు. అందరు గుంటల్లాగా సల్దన్నం తిన్దు. అయ్యరు ఒటల్నించి ఆళ్ల బావు రోజూ మసాల్దోస తెత్తాడు. ఆకలికైన ఉండిపోద్దిగాని నీలోసిన అన్నం ముట్టదు. ఆల సెల్లిల్లకేసిన రిబ్బన్లూ ముట్టుకోదు. దానియేరేగా ఎట్టుకుంతాది. ఎత్తుజోల్లు కొనిపించుకుంతాది ఆలనాన్నతోటి. దీన్దంతా ఈ పద్ధతిలో సాగుతంది. కంటికి నచ్చనిదాన్ని తొడగదు. తిన్దు. సిలిమా కెల్లిదంటే కుర్సీ టిక్కెట్టే తియ్యాల. సేసేద్దారి సేసేద్దారి అని మనం అనుకుంటే ఎలగ. గాంధీగోడ్ని సేసుకోనాడికి ఇది ఒప్పుకోవద్దా? అంటూ మధ్యలోకొచ్చింది అప్పన్న భార్య మాలచ్మి.
‘‘ఆడగుంటలకి కంటికి నచ్చిన మొగున్ని తేవాలంటే మనవల్ల అవుతదేటే లచ్చివా… మరీ సెప్తున్నావుగాని గుడ్డముక్కలకీ మొగుడి సాపత్తివా? మనవలాగే సేసుకున్నావేటే పెల్లిల్లు. నీ మొగిడికి ఏటీ నా తమ్ముడి కాడ నువ్వు పీలిగ్గుడ్డనాగ ఇంతగొద్దుంతావు. నా మొగుడు నా బుజాలికాడికే రాడు. మనం పెల్లాడనేదా? పిల్లల్ని కాయనేదా? దానికి నచ్చచెప్పుకోని సెసుకోవాలగాన్ని, ఉజ్యోగం మొగుణ్ణి మల్లి తేగలవంటే? అంది అప్పయ్యమ్మ మరదల్ని దబాయిస్తూ.
‘‘కాదొదినీ, ఇట్టంలేని మనుపు సేసారు నా యమ్మానాన్న అనది ఉసూరుమనేడిత్తే ఇంటికి పెద్దదాయి కదా, మనకి బాగుంతాదా? అని’’ అన్నాది నెమ్మదిగా మాలచ్మి.
‘‘పెద్దానికి గాబట్టికే కదా వాయైనోడికి పెయోజకుడికీ ఇచ్చి సేద్దారంటున్నాను. దాని గొంతు కోసేత్తావేటి ఈసమ్మందం సేసి. అన్నందాలా అది సుఖపడతాదనే నానూ ఆలోసిత్తిన్నానా? మరేటీ కాదూ – జాకెట్టు గుడ్డకీ, కాటికి పొడుంకీ కూడా పుట్టింటోల్లి కాసి సూడకుండా ఉజ్యోగత్తుడి కిత్తే దాని బతుకది మన కాసి సూడకుండా బతుకుతాదనిగానీ తగినజోడు కుదిర్తే నాకు ఇష్టంనేదా? తమ్ముడా… నాను సెప్పాల్సింది సెప్పాను. నువ్వొకపాలి పెద్దదాన్ని కదిపిసూడు, దాని మనసుకాలేనేటున్నాదో! అంటూ వెళ్లడానికి లేచింది అప్పయ్యమ్మ.
‘‘బాప్పా ఎల్లిపోతన్నావేటి? అన్నం తినవా?” అంటూ మల్లీశ్వరి ఆల్ల చిన్నాన్న ఇంట్లోంచి వాళ్ల గుమ్మంలోకి వచ్చింది.
‘‘పెత్తల్లీ ఎంకటిబాప్ప ఇంటికెల్దాం వత్తావేటి’’ అన్నాది అప్పయ్యమ్మ మల్లీశ్వరితో.
‘‘నీనురాను బాబూ, ఆ గాంధీగోడుంతాడు. ఆడు పల్లు ఈసిపెట్టుకోని ఏదోటి అంటాడు. ఆలింటికి నేర్రాను’’ అంది మల్లీశ్వరి.
‘‘మొగుడు పెల్లాంతోటి ఆసికవాడప్పోతే ఇంకెవుల్తోటి ఆడతాడే’’ అంటూ హాస్యమాడింది మేనగోడల్తో అప్పయ్యమ్మ.
‘‘ఆడు నాకు మొగుడేటి? అలాటి ఆలోసన గానీ సేసినారా?” అంటూ ‘‘ఆడికి నేనొక సమ్మందం చూసాను అది సేసీయండి’’ అంది మల్లీశ్వరి ఉక్రోషంగా.
‘‘ఎవల్తోనే ఆడికి పెల్లిసేసేత్తావు? నవ్వుతూ అడిగింది అప్పయ్యమ్మ.
‘‘రాములోరి గుడి దగ్గర సెట్టుమీదుండి, ఆడిలాగే అదీ పల్లికిలించుకోని గెంతుతుంటాది, దాన్నిసేసీయండీ ఆడికి కరెట్టుగా సరిపోద్ది” అన్నాది మల్లీశ్వరి.
‘‘ఆ కోతి మొకవోడి బుజం మీదే ఎక్కుతావు పెల్లినాడు. ఆడికేవే నలుపు నాన్నెం అన్నారు. ఆడందానికే ఒంకెడుతన్నావా?” అంది అప్పయ్యమ్మ.
‘‘ఆడి మొకం, నీ మొకం ఓసారి అద్దంలో సూసుకోండి. అప్పుడు ఆడుదురుగాని పెల్లిమాటలు’’ అంటూ అరుగు మీద నుంచి చెంగున గెంతుతూ వాకిట్లోకి వచ్చి గెంతుకుంటూ ఇంట్లోకెల్లిపోయింది మల్లీశ్వరి.
‘‘వొయిసు కురకురా, బాతు కురుకురా అంటారు ఇదేగావోలు. ఇదేటిలగ రాలిపోతుంది’’ అని మరదలితో నిష్టూరంగా అని తను తలుచుకుంటే కానిదేముంది అనే ధీమాని కనపరుస్తూ వాకిలిదాటి రోడ్డు కెలిపోయింది అప్పయ్యమ్మ.
…..
రెండ్రోజులు గడిచాయి. ఊళ్లో పనులు చూసుకోని మద్యాన్నం అవుతుండగా ‘‘పెత్తల్లీ.. మారా, మారమ్మా’’ అనుకోని ఇంట్లోకొచ్చాడు అప్పన్న. మంచంమీద వోణిని ముసుగెట్టి పడుకున్న మల్లీశ్వరి సర్రున లేచి ‘‘నన్ను మారమ్మ అని పిలొవొద్దన్నానా? మల్లీస్పరని పిల్లేవా? అని కోపంగా అడిగి అటు తిరిగి పడుకుంది. మాలచ్మి వొచ్చి మంచెం బద్దెమీద కూచోని ‘‘మీ నాన్న పిలుత్తుంటే పలకవేటి, ఆ బాబేటో మాటాడలట. నెగు నెగిసి కూకోని జవాబు సెప్పు’’ అంది మాలచ్మి.
‘‘నేనేటీది జెప్పాల? అన్ని మీరే అనీసుకున్నారుకదా, పెల్లి మూర్తనాలు కూడా ఎట్టీసి ఇప్పుడు నన్నడుగుతారా? మీరెందరెన్ని అడిగినా ఆడితో నాకు పెల్లిస్టం లేదమ్మా’’
“ఇష్టంతో పన్లేదనే కదా మూర్తాలు కూడా పెట్టించీసారూ? మల్లి నన్నెందు కడగడం?” అని కోపంగా అని లేచి వచ్చి వాకిట్లో అరుగు మీద కూచుంది.
ఆ కూర్చున్న మల్లీశ్వరి ఎలా ఉందంటే అల్ల కోనేరు గట్టుమీద అప్పుడే విరిసిన ఎర్రగన్నేరు పువ్వులాగుంది. గట్టెక్కి కోనేట్లోకి చూస్తే చప్పున ముడుచుకున్న తామర మొగ్గలాగుంది. దానొంటిమీద ఏసిన బట్టలు దాని ఒంటిసొంపుకి సలాము చేసి దాన్నే అతుక్కుపోయాయి. ఆ పిల్ల కళ్లు లోకంలోని అందాలన్నింటినీ తాగేసి నిషా ఎక్కిపోయిన చేప్పిల్లలాగ ఉన్నాయి. కోపంతో ముడుచుకున్న దానిమ్మ గింజరంగు పెదాలు ఆవిడ వంటిరంగుతో పోటీ పడుతున్నాయి. చక్కదనాల చుక్క చేమంతి రెక్క మల్లీశ్వరి రెండ్రోజుల్నుండీ అన్నం తినకపోయినా వయసు పొంగుమీద ఆందాలొలుకుతూనే అలిగి కూర్చుంది. గాంధీతో పెళ్లన్నదగ్గర్నుంచీ మనసు నిలుపుకోలేక, ఏం చెయ్యాలో తెలీక మసలిపోతుంది. ఆ యింటి గోరువంక మల్లీశ్వరి.
ఇంతలో తుపాన్లాగా వచ్చింది ఆవిడగారి రంగంబాప్ప నోరు చేసుకుంటూ ‘‘ఒరే, ఇంకా అన్నం తినలేదా? బేగిరా పంతులుగోరి కాడకి ఎల్దామన్నావూ?” అనుకుంటా.
మల్లీశ్వరి బాప్పని చూసి మరీ ముడుచుకుపోయి మొహం వేరే దిక్కుకి పెట్టి కూర్చుంది
‘‘అప్పా ఇలారా, నోపడికొత్తే కుంచెం మాటాడాల’’ అని లోపల్నించీ పిలిచాడు అప్పన్న.
‘‘ఏట్రా’’ అనుకుంటూ లోపలికెల్లింది అప్పయ్యమ్మ.
‘‘అది పెల్లొద్దనేత్తంది. బలివిని సేత్తే దాని బతుకెలగుంతాడోనని బయ్యవేత్తందప్పా’’ అన్నాడు బేలగా అప్పన్న.
‘‘ఔనొదినీ, రెండ్రోజులుకాణ్ణించీ అది మెతుకున్నం ముట్టనేదు ఏటిసెయ్యడం’’ అన్నాది మాలచ్మి.
‘‘బాగుందర్రా – పిల్లకట పెల్లిస్టంలేదంట. సిగ్గునేదట్రా అలగ సెప్పడానికి మనవేటి దానికి కుంటోడ్ని కడతన్నావా? గుడ్డోడ్ని చేసుకోమంతన్నావా? సొంత బాప్ప కొడుకుని, ఉజ్యోగం సేసీవోణ్ణి సేసుకోవే సుఖపడతావని అంటన్నావు. అయినా, ఆడ గుంటనడిగి ఎవులయినా పెల్లిల్లు సేత్తారా? దాని బాగ్గోరి మనవీ సమందం అనుకున్నాం. అమ్మ బాబుల మాటకి తలొగ్గాలిగానీ నాను శోబనబాబుని సేసుకుంతాను. నాగేస్పర్రావుని సేసుకుంతానంతే మనం దానికి సమ్మందాలు తేగలవా? సెప్పుకోడం రాప్పోతే ఇదిగిలిగే ఉంటాదర్రా. నీను మాటాడతానుండండి. అదెందుకు సేసుకోదో సూద్దారి’ అనుకుంటూ బైటకి వచ్చింది అప్పయ్యమ్మ.
‘‘మారా, ఓలి మారా’’ అంటూ మల్లీశ్వరి దగ్గర కొచ్చి పీట జరుపుకోని కూచుంది అప్పయ్యమ్మ. మల్లీశ్వరి అసలు పేరు మారమ్మ. దానికి వయసు పెరిగేకొద్దీ ఆ పేరు ఇష్టం లేక స్నేహితుల్తో ముచ్చట్లాడి మల్లీశ్వరి అని పేరు మార్చీసుకుంది. కానీ, దాని అమ్మా, నాన్న దగ్గరోళ్లూ మారమ్మా, మారా, మారతల్లీ అనే పిలుస్తారు ఆమెకి మంటెత్తేలా.
మల్లీశ్వరి బాప్పవైపు చూడలేదు. ఏడుపునాపుకుంటూ బుర్రదించీసింది. అప్పయ్యమ్మ ఆమె తల మీద రెండు చేతులూ ఏసి తల బలవంతంగా పైకెత్తి ‘‘పెత్తల్లీ నామాటినే, నువ్వలగ మంకుపట్టు పట్టీత్తే, మీ నానా అమ్మాసూడు ఎలగైపోన్రో, సిన్నప్పటి కాన్నించి నువ్వేదడిగినా నా తమ్ముడోడు కాదన్నేదు. నువ్వంతే అంతెర్రి ఆడికి. మీయమ్మ మాత్తరవు నిన్నేనాడన్నా తిన్నా గిన్నె కడగనిచ్చిందా? పేడలో సెయ్యెట్టి అరుగులలికించిందా? నువ్వాడింది ఆట, పాడింది పాట సేసారిద్దరూ. మావు మాత్తరం ఇంటికి తొలాడపిల్లవని నీకేటి తక్కువ సేసాం? అంటూ ఏదో చెప్పబోతుండగా కళ్లల్లో నీళ్లు ముత్యాల్లా రాలుతుండగా మల్లీశ్వరి ఉక్రోషంతో ‘‘అందుకేనేటి ఇప్పుడగ్గిలో తోసేత్తన్నారు’’ అని అడిగింది.
‘‘సిన్నతనంసేత నీకేటి తలకండందే మారా, ఆడు ఒక్క పిసరు నలుపేగాని ఆడికేవే బాగా నుంతాడు. ఆడి ఉజ్జోగం ఎక్కడో తెలుసా? ఇసాపట్నంలో, అక్కడాడికి సొంత కొంపుంది. నాలుగొందల జీతగాడు. నిన్ను మారానిలాగ సూసుకుంతాడు. నేను మొన్నోలింటికెల్లినపుడు పెల్లి ఇసయాలొచ్చి ‘‘దానికొంటరాదురా, ఆలమ్మ, బాబూ గారం సేస్సారు, మరి దాన్ని సేసుకుంటే నీకు డూటీకి కేరేజెవరు కడతార్రా’ అన్నాను.
‘దాని పెళ్లి కొప్పుకోమను బప్పా, అయన్ని నీను సూసుకుంతాను. నాకు పొయిలో అగ్గేస్సి ఒండేడవూఒచ్చు. చీపురెట్టి తుడిసేడవూ తెలుసు, గిన్నెలూ తపేలాలూ తోవేడమూ వచ్చు. దాన్తో పనులు సేయిత్తానా, మాయ్య దాన్నెలగ పెంచుకొచ్చాడో నాకు తెల్దా’’ అన్నాడు తెలుసా! అలాటి మొగుడు దొరకడం మాట్లేటే. ఆడికి రూపం తక్కువైనా గునం గుల్లో గోపురవంత వున్నాది. అయినా మీ నాన్న నీకు నేరిపిన సోకులికి ఉజ్జోగత్తుడు కాపోతే మరొక కూలీ నాలీ మొగుడైతే తీర్సలేడే. గాంధీగోడ్నీ సేసుకున్నావంతే కోరిన తిండి, కోరిన బట్టా ఇత్తాడు. ఈ పల్లెటూరంట సమందాలు నీకు అసలకీ నప్పవు. ఆడ్ని సేసుకుంతే మారాజునాగ వొయిజాగెలిపోతావు. అక్కడ ఎవరూ ఉండరు మీరిద్దరే. ఆడు తెచ్చిన జీతం మీకు కుప్పలైపోద్ది. ఆడ్ని నీవు సేసుకున్నావంతే నీ సోకులన్నీ ఆడికి మప్పేవన్నమాటే, అప్పుడాడే ఉంతాడు మారాజునాగా” అంటూ మల్లీశ్వరిలో ఆశల్ని మెరిపించింది. మళ్లీ అందుకుంటూ ‘‘అయినా మీనాన్న ఆలికి మాటిచ్చీసేడే. ఆడి మాట నువ్వు మన్నించవా మారతల్లీ! ఆడి పరుపు తీస్సి పలానా అప్పన్నగోడి కూతురు కుదిరిన సమ్మందం ఒద్దనీసిందట, ఆమ్మా బాబుని నెక్క సెయ్యినేదంట అంటే ఎవలికే సెడ్డపేరు? మాలపేటకి మూల తంబంనాటి మీనాన్న నడ్డి ఇరిసేకే, నీకు పున్నెవుంతాది. పెద్దలం నీ బాగు కోర్నోల్లం కాబట్టి ఇంతదిగా సెపుతున్నాం. మా మాటినమ్మా, మా తమ్ముడ్ని తలదించుకోనీకు తల్లీ’’ అన్నాది అప్పయ్యమ్మ.
బాప్ప పెట్టిన తాయిలాలికి, బెదిరింపులకీ వేడికోళ్లకి ఆ వయసు పిల్ల పద్నాలుగేళ్ల మల్లీశ్వరి ఏమి జవాబు చెప్పలేక మందార తొడిమలాంటి మెడని వంచీసింది. అదుగో, ఆ చిగురు తొడిమెకే గాంధీగాడు మూడుముళ్లు ఏసేశాడు.
…..
ముప్పయ్యేళ్ల ముదురు మొగుడు గాంధీ వెంట భయంభయంగా కాపురానికొచ్చిది. మల్లీశ్వరనే మారెమ్మ విశాఖపట్నంలోని మర్రిపాలేనికి. గవర్నమెంటు జాగాలో అక్కడక్కడా కమ్మల పాకలున్న ఆ ఏరియాని ఆశోకనగర్ అనేవారు అప్పట్లో. గాంధీ తోటి ఉద్యోగస్తులైన తన కులపోళ్లతో కలిసి ఏర్పడిన సొసైటీ మెంబర్‌గా తనూ కొంత స్థలాన్ని ఆక్రమించి ఇల్లేసుకున్నాడు.
ఉద్యోగంలో చేరాక వారంలో ఐదురోజులు ఆ యింట్లోనే ఉంటూ ఇంత ఒండుకోని కేరేజీ కట్టుకోని డ్యూటీకి వెళ్లిపోయేవాడు. ఆఫైతే ముందురోజే డ్యూటీ దిగి ఎలమంచిలి వెళ్లిపోయేవాడు. అందుకే గాంధీకి ఇంటిపనులు, వంటపనులు అన్నీ వచ్చేవి. మల్లీశ్వరి కాపురానికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ల వెంట అప్పన్నా, రంగవప్పయ్యమ్మ వచ్చి దిగబెట్టి రెండ్రోజులుండి వెళ్లారు. రోడ్డు మీద నుంచి గాంధీ ఇంటికి వచ్చీటప్పుడు ముందుగా గురమ్మ ఇల్లు తగుల్తాది. ఆవిడికి మొగుడు, నలుగురు కొడుకుల్తో ఇల్లు కోళ్లగూడులాగా ఉండేది. గురమ్మంటే ఆ వీధికి తెలీనోళ్లవరూ ఉండరు. ఆవిడ భర్త పోర్టులో పనిచేస్తాడు. గురమ్మ మంచి జబరైన మనిషి మాట చురుకు. మొగుణ్నీ పిల్లల్ని ఒంటిచేత్తో ఎల్తూ ఆ కుటుంబాన్ని తనే నడిపిస్తాది. మంచికి మంచిగానూ, చెడ్డకి మహాచెడ్డగానూ వ్యవహరించే ఆవిడ అక్కడ వెలిసిన సొసైటీ ఇళ్లకి ఒక పెద్ద దిక్కులాగే ఉంటాది. కొత్తగా కాపరానికి వచ్చిన మల్లీశ్వర్ని చూసి ‘‘గాంధీగోడు అదురుష్టమంతుడే బొమ్మలాంటి పెల్లం దొరికింది’’ అన్నాది పబ్లిగ్గానే. మర్నాడు వాకిట్లో మంచాలేసి కూర్చున్న అప్పయ్యమ్మనీ, అప్పన్ననీ చూసి నెమ్మదిగా అక్కడికి వచ్చిన గురమ్మ వాళ్లని కుశల ప్రశ్నలు వేసింది. అప్పయ్యమ్మ లోని ఒడుపుతనానికి పొంగిపోయి దగ్గర చుట్టరికం కలిపేసింది.
అప్పయ్యమ్మ ‘‘అమ్మా, పిల్లసిన్నది, ఏటీ తెలీదు, ఒగ్గేసిలిపోతున్నాం. నువ్వే ఒక కంటసూడాలి. మా యబ్బాయి పొద్దున్నెలిపోతే పొదోయెత్తాడు. పిల్లకి తోడు ఎవరూ నేరు. వంటావార్పూ, పనీపాటా తెలీని పిల్ల. ఎలిగో నువ్వుకొంచెం పిల్లకి కాపుకాసేవంటే నాల్రోజుల్లో అదే నేర్సీసుకుంతాది. ఎలాగా, ఎలాగా అనుకుంతున్నావు దేవుళ్లాగ కనిపించావు. మా తమ్ముడికి అదంటే పేనం. ఒక్కదాన్నొగ్గేసి ఎలాగప్పా ఎలిపోతాం? అని నిన్నటినుంచీగింజుకుపోతన్నాడు. కొంచెం పిల్లని కనిపెట్టి సూడమ్మా అని బతిమలాడింది. ‘‘అయ్యో, అన్నిందాలుగా సెప్పాలేటమ్మా, నానుసూసుకోనా, అయినా కాపరానికి కొచ్చిన దానికి కాపరం సెయ్యడం నేరపాలా? అదేసేత్తాది మా సక్కగ సేపకి నీటిలో ఈదడం నేరుపుతారా? మీరేటి బయ్యం పడకండి. మావంతానేవా, ఇక్కడికొచ్చాక ఇంక మీ పిల్లేటి? మా పిల్లే. గాంధీమాకు ఎప్పట్నుండో తెలుసు. ఆ బాబు బారియాని మేముసూసుకోమా మంచిదే’’ అని భరోసా ఇచ్చేసింది గురమ్మ. ఆ మర్నాడు అప్పయ్యమ్మ, అప్పన్న నిశ్చింతగావెళ్ళిపోయారు పిల్లనొదిలేసి కొత్త కాపురానికొచ్చిన మల్లీశ్వరికి కొత్తగా భయంగా వుంది. కానీ వీటన్నిటినీమర్చిపోయే వింతలు ఆమెకి మొగుళ్లోనే కనబడ్డాయి. గాంధీ ఏరకం మనిషో ఆమెకి అంతుపట్టలేదు. తన ఊళ్లో తను బతికిన నాజూకైన బతుక్కి ఈ పట్నపు ఉద్యోగస్తుడు బతుకుతున్న మోటు బతుక్కి బేరీజు వేసుకుంటూరోజులు గడుపుతోంది. గాంధీ ఆదోరకం మోటుమనిషి, మారెమ్మ అంటేనే చిరాకు పడే ఆమెని ఇంటికొచ్చిన రోజే ఆమెను గాంధీ ‘ఓలి పిల్లా’ అని పిలవడం అన్నింటికన్నా ఆమెకి అభ్యంతరకరంగా ఉండేది. తెల్లారకముందేలేచిపోయి ఇళ్లూ, వాకిళ్లూ బరబరా చీపురెట్టి తుడిసేసి పొయ్యి వెలిగించి వేడినీళ్లు పెట్టేసి, కాళీ తపేళాని ఉత్తచేతుల్తోనే దించేసి నల్లటి టీ గిన్నెను పొయ్యెక్కించీసి డికాక్షన్ చేస్సి, రెండు పెద్ద గ్లాసుల్లో పోస్సి శబ్దం వచ్చేలాతాను తాగుతూ మల్లీశ్వరి మంచందగ్గరకొచ్చి ‘‘ఓలి పిల్లా, లెగూ, టీ తాగుదువు’’ అనేవాడు. ‘‘నాకొద్దు’’, అదేంటియ్య, పాలు లేకుండానే, పాలుతో చేత్తేనే నాను తాగుతాను, లాప్పోతే నాకొద్దు’’ అనేది మల్లీశ్వరి. రెండురోజులలాగ జరిగేసరికి చీకట్నే లేచిన వెంటనే వెళ్లి పాలు తెచ్చి టీ చేయడం మొదలెట్టాడు. టీ తాగి మల్లీశ్వరి నోట్లో బ్రెష్ పెట్టుకునేవేళకి రాత్రి తిన్న గిన్నెలూ, కంచాలు బైటేసి తోమేశావాడు గాంధీ. ‘ఓయ్, పిల్లా ఏణీలు ఏసుకో, దొడ్లోఎట్ట్టీసాను’ అనేవాడు. ఈలోగా పొయ్యిమీదకి అన్నంగిన్నెక్కించీసివాడు. దబదబా కూరచేస్సితాలింపు పెట్టేసీవాడు. ఉఫ్ ఉఫ్మని ఊదుకుంటూ వేడిగంజెన్నం తినీసి తనే గబగబా కేరేజి కట్టేసుకోని,ఇంటిముందున్న రాయిమీద గోచిగుడ్డతో నిలబడి నాలుగు చెంబుల నీళ్లు పోసేసుకునేవాడు. సైకిల్కి కారేజీతగిలించుకోని, ‘‘ఓయ్, నేనెళ్తాను జాగర్త” అనిచెప్పి డ్యూటికెళ్లిపోయేవాడు. మల్లీశ్వరికి అతని రూపం కన్నాఅతనిట్లో ఉన్నప్పుడు చిన్న తువ్వాలు కట్టుకోని తిరగడం, గోచి పెట్టుకొని నిలబడి వచ్చీపోయే ఆడోళ్లతోమాట్లాడటం చూస్తే పరమ రోతగా ఉండేది. కానీ అతడు తన పట్ల కనపరచీ శ్రద్ధా, పేమా బాగాచూసుకోవాలన్న తపనా చూసి ఏమీ మాట్లాడలేక గమ్మునుండిపోయేది. అతడు పొద్దున్న ఏడింటికి డ్యూటీకెళ్లిపోతే మళ్లీ రాత్రి ఏడుగంటలకే వచ్చేవాడు. అతనెళ్లేసరికే స్నానం, ముస్తాబు పూర్తిచేసుకోని ఉండే మల్లీశ్వరికి రోజంతా ఏమీ తోచేదికాదు. తన ఈడు పిల్లలెలవరూ ఆ చుట్టుపక్కల లేరు.
మల్లీశ్వరి రెండుమూడుసార్లు గురమ్మ ఇంటికి వెళ్లి కూర్చుంది. గురమ్మ కొడుకుల్లో పెద్దోడు పగలు ఆటో వేసేవాడు. రాత్రుళ్లు దొంగతనానికెళ్తాడని చెప్పుకునేవారు. అతడి పేరు వాసు. ఇరవై ఏళ్లుంటాయి. మిగతా కొడుకులు చిన్నోళ్లే. ఇద్దరు పనికెళ్లేవారు. అఖరోడు రవణ చదువుకునే వాడు. వాళ్లందరూ మల్లీశ్వరికి పరిచయమైపోయారు. గురమ్మని మల్లీశ్వరి వాళ్ల రంగం బాప్పని పిలిచినట్లే బాప్పా అని పిలిచేది. గురమ్మ పెద్ద కొడుకు వాసు మాత్రం మల్లీశ్వరిని చూస్తే చిరాకు పడిపోయేవాడు. ‘‘ఆళ్లు మాలొల్లటకదా, ఆ పిల్లకెందుకు మన గిన్నెల్లో అన్నం పెడుతున్నామని’ ఒకసారి మల్లీశ్వరి వింటుండగానే ఆళ్లమ్మని అడిగాడు. రోషంతో మల్లీశ్వరి నాలుగు రోజులు వాళ్లింటికి వెళ్లనేదు.
‘‘ఆడి మాట్లకేంటి మలీస్రీ, ఆడొక రౌడీఎదవ, ఆడి మాట్లు పట్టించుకోకు’’ అని గురమ్మ సర్ది చెప్పిన మీదట తోచడానికి ఇంకో దారిలేక మళ్లీ వాళ్లింటికెళ్లి కూచోడం మొదలు పెట్టింది. ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చిన వాసు మల్లీశ్వరి చూసి ఒళ్లుమండి వాకిట్లో పడుకున్న కుక్కని కాల్తో తన్ని ‘‘ఎన్నిసార్లు చెప్పినా నీకుసిగ్గులేదే’’ అన్నాడు ఓరగా మల్లీశ్వరి చూస్తూ. మొహంలోకి రక్తం పొంగుకొచ్చిన మల్లీశ్వరి చివాలున లేచి గబగబా నడుచుకుంటూ తనింటికొచ్చేసింది. ఒకరోజు వాకిట్లో దండెం మీద బట్టలారవేస్తుండగా అటువైపు సైకిలుమీదెల్తున్న వాసు ఈమెని చూసి కావాలనీ బెల్లు కొట్టాడు. మనసు చివుక్కుమనిపించిన మల్లీశ్వరి గిరుక్కున తిరిగి ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంది. నాలుగు రోజులు పోయాక గురమ్మొచ్చి ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, మళ్లీ మల్లీశ్వరిని ఇంటికి తీసికెళ్లింది. గుమ్మంలోనే వాసు కూర్చోనున్నాడు. మల్లీశ్వర్ని చూసి ఆదోలా నవ్వాడు. ‘‘నువ్వు రాలేదని ఈ పోకిరీ ఎదవ నన్ను తిడతన్నాడు’’ అంది గురమ్మ అనందంగా, ‘‘రోజూ వచ్చీవోలు రాపోతే బాదకదా’’ అన్నాడు మల్లీశ్వరి వైపు పట్టిపట్టి చూస్తూ.
తల్లీకొడుకుల మాటలకి చిర్రెత్తిపోయిన మల్లీశ్వరి ‘‘నాకు సిగ్గులేకొచ్చాను, మీవు మాలోల్లంకదా, మరి మీరు బేమ్మర్లుకదా? మీలాంటి బేమ్మర్లింటికెందుకు రావాలా?” అంది ఉక్రోషంగా.
‘‘మీవు మాలోల్లవే, మరి మీరూ సేపల్లోల్లుకాదా? మీది మీకుంతే మాది మాకుంతాది’’ అన్నాది సీరియస్‌గా.
‘‘ఆడి మాట్లకేటే, అప్పుడేదో అన్నాడు, అలగ సీరియసైపోతే ఎలాగే’’ అని గురమ్మ సర్దిచెప్పింది. అక్కడ కూర్చున్నంతసేపూ గుమ్మంలో మంచం మీద పడుకున్నట్లు నటిస్తూ వాసు తన వైపు చూడ్డాన్ని మల్లీశ్వరి గమనిస్తూనేవుంది. వెళ్లిపోవాలనీ ఉందీ, ఉండాలనీ ఉంది. అది మొదలు ఆ ఇంటి ఆకర్షణ ఆమె జీవితంలోకి సుడిగాల్లాగా కొట్టుకొచ్చింది. గాంధీ డ్యూటికెళ్లిపోయాకా వాసు ఒక్కడే ఒకరోజు మల్లీశ్వరింటికి వచ్చాడు. నవ్వుతూ సైకిల్ దిగి ‘‘లోపలికి రావచ్చా” అంటూనే లోపలికి వచ్చేసాడు. మంచి ఒడ్డూ పొడుగూ, రంగూచూడచక్కని రూపంలో యవ్వనంతో తొణికిసలాడే వాసు రూపం మల్లీశ్వరిని ఆకర్షించడం ఎప్పుడోజరిగిపోయింది. చొరవగా లోపలికి వచ్చిన అతడికి ఆమె చూపులు స్వాగతం పలికాయి. దగ్గరగా వచ్చినవాసుని తోసేసి “మాలదాన్తో నేంటి సరసాలు?’’ అన్నాది.
“నోర్ముయ్యే! పడుకోడానికి కులవేంటి? అయినా నువ్వంటే నాకెంత పిచ్చో నీకు తెలుసా?” అన్నాడు గారాలు పోతూ.
‘‘ఇష్టవైతే ఒకడి పెల్లం దగ్గరికి వచ్చేత్తావా?” అనడిగింది మల్లీశ్వరి.
‘‘ఎవడన్నాడే ఆడికి నువ్వు పెల్లానివని. నువ్వెక్కడ? ఆడెక్కడ? నక్కకీ నాగవంశానికీ అన్నట్లుంది మీ ఇద్దరికి. నా కల్లల్లో ఎప్పుడైతే నువ్వు పడ్డావో అప్పట్నుంచీ నువ్వు నా పెల్లానివే గానీ… అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. పెనుగులాడ్డం ఇష్టం లేని మల్లీశ్వరి ‘ఇదెంత తప్పో తెలుసా?’ అంటూ ఉండగానే ఆమెనాక్రమించుకోవడం మొదలెట్టాడు. ఏ స్పందనా కలగని మొగుడితో కాపరం కన్నా వాసుతో సమాగమం మల్లీశ్వరికెంతో తృప్తినిచ్చింది. తన వయసు వాసు కళ్లల్లో పొంగడం ఎంతో గర్వమనిపించింది. ఆడా మగా కలుసుకోడంలో ఇంతందవుందా అని ఆశ్చర్యపోయింది. ఒక మొగోడు పట్టుదలతో ఆడదాన్ని అనుభవిస్తే ఇంత సుఖంగా ఉంటాది కాబోలని తెలుసుకుంది.
వాసు తాకిన శరీరాన్ని చూసుకొని మురిసిపోయింది. ఎంతో నున్నగా ఉండే తన ఒళ్లు ఇంకా నునుపెక్కి మెరుస్తున్నట్లుగా భ్రమించింది. కానీ, కానీ ఆడు అంతా అయ్యాక ‘‘ఇవేల్టినుండీ నువ్వు గాంధీగాడితో కాపరం జెయ్యడానికి ఈల్లేదు. రోజూ ఆడులేనప్పుడు నేనే వస్తాను. నువ్వు నాకే చెందాల. నేను చెయ్యేసిన ఆడదానొంటిమీద మరోకడు చెయ్యేత్తే చెయ్యి నరికేత్తాను’’ అనడం గుర్తొచ్చి బయ్యవేసింది.
‘మాయ్యతో మల్లీ నేనెలగ ఉండాలా? ఉండకపోతే ఆడేటంటాడో’ననే బెంగ మొదలయ్యింది. వాసూ వెళ్లిపోయినా అక్కడ్నించీ లేవబుద్దెయ్యలేదు. ఏదో కొత్త బరువు గుండెల మీద కొచ్చీసి కూర్చున్నట్లయ్యింది మల్లీశ్వరికి. రాత్రి పక్కలోకొచ్చిన గాంధీతో ‘‘ఒంట్లో బాగులేదు, తలనొప్పి’’ అని తప్పించుకుంది. మళ్లీ మర్నాడు గాంధీ డ్యూటీకెళ్లగానే వాసూ వచ్చేశాడు. మల్లీ, మల్లీ అంటూ వెంట తిరిగాడు. ఆమెనుంచి కావల్సినంతా తీసుకున్నాడు. మొగుడితో ఉండకూడదన్న రూల్సుకి మరిన్ని రూల్స్ చేర్చాడు. గాంధీకి వండి ఉంచిన అన్నం తినేసి, దర్జాగా గదిలో మంచం మీద పడుకున్నాడు. మల్లీశ్వరి బితుకుబితుకు మంటూ ఇంట్లోకి పెరట్లోకి మతిపోయిన్దాన్లా తిరుగుతూనే ఉంది. సాయంత్రం ఆమెతో టీ పెట్టించుకొని తాగి మళ్లీ ఆమెను మంచం మీదకి లాగాడు. హాయిగా, దర్జాగా అనుభవించి బట్లేసుకోని వెళ్లిపోయాడు. గాంధీ వచ్చేసరికి మల్లీశ్వరి జబ్బు పడి లేచినదాన్లాగా కనిపించింది. గాంధీ తనంతటతానే అన్నీ పన్లు చేసుకోని మల్లీశ్వరికింత పెట్టి తినమని చేతికి కంచవిచ్చాడు. ‘‘మాయ్యా! అంటూ బోరుమంది మల్లీశ్వరి. ‘సిన్న జరానికీ, తలనొప్పికే అలగయిపోతెలగ? మీ నాన్న అలగ ముద్దుమీద పెంచాడు నిన్నూ, తిను తిను, తినేసి బేగిపడుకుండిపోదూగాని’ అన్నాడు ఆమె ఏడుపుకి విలవిల్లాడిపోతూ. ఏవో రెండు మెతుకులు తిన్నాననిపించేసి గదిలోకెళ్లి మంచం మీద పడుకుంది. గాంధీ సడవాలో ఏమీ వేసుకోకుండానే పడి నిద్రపోయాడు. అది మొదలు మల్లీశ్వరి బతుకులో కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర కరువైపోయాయి. రోజూ గాంధీ వెళ్లగానే వచ్చే వాసు ఆ ఇంటికి, ఆమె ఒంటికీ హక్కుదారుడై పోయాడు. గాంధీ భార్యని వేళాపాళా లేకుండా పక్కలోకి రమ్మనడం, గాంధీ వండినదంతా తినీడం, గుర్రంలాగ సైకిలెక్కి వెళ్లిపోవడం అతడి అలవాటుగా మారింది. తిండిలేక, విశ్రాంతిలేక, మనశ్శాంతి కోల్పోయి, అపరాధభావంతో అల్లాడిపోయి వాసూ అత్యాచారానికి బలైపోయింది మల్లీశ్వరనే మారమ్మ బతుకు.
నెలతప్పింది మొగుడిక్కాదని, తన మనసుకి తెలుసు. గాంధీ సంబరాన్ని చూసి చాటుగా భోరుమంది. అప్పటికే చుట్టుపక్కలోళ్లకి వాసు రాకపోకల వాసన తగిలింది. మల్లీశ్వరిని అదోలా చూడ్డం మొదలెట్టారు. దాంతో వాకిట్లోకే రావడం మానుకుంది. గురమ్మ ఇంటికెల్లి ఎన్నో రోజులైంది. కానీ పిల్లలు గానీ, తల్లి గురమ్మగానీ ఇటువైపు వొంగీ తొంగీ చూడలేదు. వాళ్లకీ ఈ విషయం తెలిసిపోయుండొచ్చు. అందుకే నా ముఖం చూడ్డం లేదని మరీ దిగులు పడిపోయింది మల్లీశ్వరి. భార్య కడుపుతో ఉందన్న వార్త, సొంతూరుకి చెరవేసాడు గాంధీ. బిలబిలమంటూ అమ్మా, అయ్యా బాప్పలు, పెద్దమ్మ, పిన్నమ్మలు బయల్దేరి మర్రిపాలెంలో దిగబడిపోయారు. ఆళ్ళున్న రెండ్రోజులు కొన్ని దిగుళ్లని మరచి వాళ్లతో గడిపేసింది మల్లీశ్వరి. మూడోనాడు గాంధీతో ‘‘ఒరే, దీన్ని తీసికెల్తావురా, ఏగుళ్లకి పిల్ల ఎలగైపోయిందో చూడు. ఏగుల్లు తీరీదాకా ఎలమంచిల్లో ఉంటాది. నువ్వు రోజూ డ్యూటీ చేసుకోని మనూరొచ్చీదువు, ఏటంతావు? అని అడిగారు. ‘‘తీసికెళ్లండి, దాని నీర్సకి ఏటిసెయ్యాలో, దాని నోటికి ఏ రుసికావాలో నాకేం తెలుత్తాది. తీసికెల్లండి నానూ రోజూక్కాపోయినా వత్తుంటాను’’ అన్నాడు గాంధీ. ఈ రకంగానైనా కొన్నాళ్లు మనసుకి శాంతి లభిస్తుందనుకొంది మల్లీశ్వరి.
……
ఊరొచ్చాకా నాల్రోజులు మంచం దిగకుండా అమ్మతో సేవలు చేయించుకుంది మల్లీశ్వరి. వాళ్ల నాన్న మురిపం తీరా పళ్లూ, పలహారాలూ తెచ్చి కూతుర్తో తినిపించి సంబరపడి పోయేవాడు. బాప్పలు, పెద్దమ్మ, పిన్నమ్మలు ఏవో చేసి తెచ్చి తినీదాకా ఊరుకునీ వారుకాదు. మళ్లీ మల్లీశ్వరిలో మునుపటి కాంతి వచ్చి చేరుతుందనగా ఒకనాడు మధ్యాహ్నం వాకిటి అరుగు మీద నిలబడి తలదువ్వుకుంటున్న అమెకు ఎదర రోడ్డుమీద వాసు నిలబడి సిగరెట్టు కాలుస్తూ తమ ఇంటికేసి చూడ్డం కనిపించింది. గుండె గుభేల్మన్నాది.
‘ఈడేటి ఇక్కడికొచ్చాడని’ గుండెనరచేత్తో పట్టుకోని లోపలికెళ్లిపోయింది. సాయంత్రం బడి నుంచొచ్చిన పెద్ద చెల్లి ఆమెచెవి దగ్గరకొచ్చి ‘‘అక్కా మర్రిపాలెం నుంచి ఎవరో వాసట వచ్చానని నీతో చెప్పమన్నాడు’’ అని చెప్పగానే మల్లీశ్వరికి తానున్న ఇల్లు గిరగిరా తిరిగినట్టయింది. ‘నిన్ను సినిమా హాలుకాడికి రమ్మంటున్నాడు’ అని చెల్లి చెప్పిన మాటకి ‘ఎల్తాను, ఇంకెప్పుడూ ఇలా రావద్దని బతిమలాడుకుంటాను’ అని చెప్పులేసుకోని బైటకి వచ్చింది.
నేరుగా సినిమా హాలు దగ్గరకెల్లి ఆ సందులో నిలబడిన వాసూ దగ్గరకెల్లి ‘‘వాసూ! ఇదేమన్నా బావుందా? ఇక్కడా నన్ను బతకనివ్వా? మా నాన్నోలికి తెలిత్తేనిన్నూ నన్ను కూడా సంపేత్తారు. బేగెలిపో బాబూ’’ అని బతిమలాడింది.
‘‘ఎవడే నన్నడిగినోడు, ఏటుకొక్కడ్ని నేనే ఏసేత్తాను. నువ్వు నా దగ్గిర పడుకున్న విసయం మర్చిపోయి మాటాడతున్నావేటి? సడాల్మని నువ్వొచ్చిస్తే నేనేటయిపోవాల? నువ్వెప్పుడొస్తావో చెప్పు’ అని దబాయించి మాట్లాడ్డం మొదలుపెట్టాడు. మల్లీశ్వరి బిక్కమొహం ఏసుకోని ‘‘ఈల్లు నన్నిప్పుడు పంపరు, నాకూ రావాలనే ఉంటాదికదా వాసూ ఎలగ రావడం’’ అన్నాది నంగినంగిగా. ‘‘నా కదంతా తెలీదు. నువ్వు వెంటనే బయల్దేరి రా, వీలు లేపోతే నేను ఇలగే వచ్చీసి, తిన్నగ మీ ఇంట్లో దూరిపోతాను. ఎవడేటి చేత్తాడో చూత్తాను. అన్నట్టు గాంధీగాడు ఇక్కడికొస్తున్నాడా? ఆడి దగ్గర కూడా పడుకుండిపోతున్నావేటి? అని అసహ్యంగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు.
‘‘ఏటి వాసూ అలగ మాటాడుతున్నావు, ఎంగిలి అయిపోయి మల్లీ ఆడిదగ్గర కెళ్తానా, అయినా ఇయ్యన్ని ఇక్కడ మాటాడకు. నేనెలాగో ఒకలాగ రెండ్రోజుల్లో వచ్చేత్తానులే ఎల్లు’’ అని బతిమలాడి ఆడు సరే అన్న తరవాత చీకట్లో ఇంటికొచ్చీసింది. ఎవరేమంటారోనన్న భయంతో లోపలికొచ్చి అమ్మతో ‘‘అమ్మోజమ్మ కూతురు కనబడితే రోడ్ కెల్లి మాట్లాడీసొత్తున్నాను’’ అనబోతుండగా చెల్లి, ‘‘కాదు’’ అంటూ ఏదో చెప్పబోయింది. మల్లీశ్వరి వద్దని కళ్లతోనే సైగ చేసేసరికి ఊరుకుండిపోయింది.
‘‘నాకే ఏగుళ్లూ లేవర్రా.. తిని కూచోని మాయ్యనక్కడ పస్తులు పెట్టేత్తన్నాను. నేనెలిపోవాల, ఎలిపోవాల. అని ఒకటే పంతంపట్టి నాలుగు రోజుల్నాడు వైజాగ్ బయల్దేరింది మల్లీశ్వరి. ఆమె అటు వెళ్లగానే రాత్రి బండి దిగి తన భార్య వైజాగెలిపోయిందని తెలిసి నోరెళ్లబెట్టాడు గాంధీ. ఆడి మొఖం చూసి అక్కడెవ్వరికీ ఏమీ అర్ధం కాలేదు.
మల్లీశ్వరి విషయంలో వాసూ ఆగడాలు పెచ్చరిల్లిపోయిన కాలమది. నాకు చెప్పకుండా, నన్ను పట్టించుకోకుండా పుట్టింటి కెందుకెల్లావని వచ్చినాటి రాత్రే గాంధీ భార్యని గాంధీ సొంతిట్లో చితకబాదాడు వాసుగాడు. వాసూ గుద్దే పిడిగుద్దులకి సుకుమారమైన ఆమె దేహం కందిపోయింది. చెంపలు వాచిపోయాయి. తన్ని తన్ని అలిసిపోయి, ఏవనుకుంటాన్నావో ఈ వాసూ అంటే, రోడ్ కెల్లానంటే అందరూ అడలిచత్తారు నన్ను చూసి, ఇక నుంచీ నాకు చెప్పకుండా నువ్వేంసెయ్యడానికి లేదు తెల్సా? అని వార్నింగిచ్చి ఆమె మీద పొర్లాడాడు. చివికిపోయిన ఒళ్లూ, చితికి పోయిన మనసుతో వాసు దౌర్జన్యం ముందు దిగజారిపోయింది మల్లీశ్వరి. ఆమె శరీరంతో అతడాడే ఆటలకు అడ్డేలేక పోయిందారోజుల్లో. అసహ్యకరమైన అతడి చేష్టలన్నింటినీ మౌనంగా భరించిందామె. ఎవరికీ చెప్పుకోగలదు ఆమె వేదన్ని? కర్కశమైన అతడి మోరటు దేహం కోరిందల్లా చిగురుటాకులాంటి ఈమె శరీరం తీర్చాల్సిందే. న్యాయాన్యాయాలకు మంచిచెడ్డలకీ తావులేని ఒక నరకకూపంలోకి ఆమె ఏనాడో ప్రవేశించింది. ఇతరులెవ్వరూ చోరలేని ఆ మకిలి దుర్గాన్ని వాసూగాడు నిరంకుశంగా ఏలాడు. అక్కడ వాడు చెప్పేదే న్యాయం. చేసేదే చట్టం. ఆనోటా ఈనోటా ఈ విషయం గాంధీకి తెలిసిపోయిందని వాసుకు తెలిసిపోయింది. ఒకనాడు డ్యూటీ నుంచి వస్తున్న గాంధీని సైకిల్తో గుద్దించి కింద పడేశాడు వాసు. లేచి దులుపుకుంటున్న గాంధీని కాలరుపట్టుకోని ‘‘ పెల్లాన్ని ఏల్లేని కొజ్జా లంజా కొడకా, నీకిదే చెప్పడం నీ పెల్లం ఒంటిమీద సెయ్యేసావా, సెయ్యి నరికేత్తాను. లమ్డికొడకా, నాలాంటి రౌడీనాకొడుకు ఎప్పుడూ నీకు తగిలిఉండడు. దాని కడుపులోనన్నది కూడా నా కొడుకే. నోర్మూసుకోనున్నావా ఉండు. లేదా నిన్ను పైకిపంపించేసి దాన్ని లాడిజీలంట తిప్పి, నేను కింగయిపోతాను తెలిసిందా” అని రెండు గుంజులు గుంజి వదిలేసాడు. బుర్ర దించుకోని సైకిలు తీసుకోని ఇంటికి నడిచొచ్చాడు గాంధీ. వస్తూనే మల్లీశ్వరి మొహం చూళ్లేక మంచం మీద పడుకోని అటు తిరిగి ఏడిచాడు. ‘‘మాయ్యా, ఏవీ ఒంట్లో బాలేదా?’’ అని దగ్గరకొచ్చి అడిగింది మల్లీశ్వరి. ‘ఈ సిటీలంట బతకాలని రావడం మన్దే తప్పే. నిన్నాడికొగ్గేసి నేనెలగ ఎలిపోనే మారా.. ఆడు నిన్ను ఎవరికైనా అమ్మేత్తాడంటే, పిల్లా, ఎలాటి బతుకు బతికి ఎలాటోడి సేతిలపడిపోయావే’ అని విలవిల్లాడుతూ ఎక్కిళ్లు పెట్టాడు. మావయ్యకి అంతా తెలిసిపోయిందని ఎప్పట్నించో సందేహపడుతున్న మల్లీశ్వరికి దుఃఖం రాలేదు. ఎద గుండె పడిపోయింది. కళ్లు నిలబడిపోయాయి. ఏడుస్తున్న భర్తను వదిలేసి వాకిట్లో జాంచెట్టు కింద నిలబడి అణచుకున్న వేదన్ని బైటకి రాకుండా మళ్లీ లోపలే తొక్కిపెట్టేసి శూన్యంలోకి చూస్తూ నిలబడిపోయింది. పక్కనే సైకిల్ బెల్ వినపడి చప్పున చూసింది. వాసు సైకిల్ మీదే కూర్చుని కళ్లగరేసాడు. కాండ్రించి ఉమ్మేద్దామనిపించింది. కానీ తను ఆడి ఖైదీనన్నవిషయం గుర్తొచ్చి కోపాన్ని అదుపుచేసుకుంది. ఏదో దిక్కుమాలిన సైగ చేసి ఆడెలిపోగానే వచ్చి గుమ్మంలో కూర్చుంది. ‘‘నాకింక బతుకులేదు. లేదుగాక లేదు, ఎలాగ జరగాలో అలాగే జరగనీ’’ అనుకుంది. ‘‘మాయ్యేటైపోతాడో’’ అనుకుంది. పుట్టబోయే బిడ్డగురించి ఆలోచించింది. ఎటుచూసినా మూసుకుపోయిన దార్లే. పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన చిన్నారి మల్లీశ్వరి కంటనీటిచుక్క రాలకుండా దుఃఖాన్ని బిగబట్టింది.
అది మొదలు గాంధీ మల్లీశ్వరి దగ్గర కొచ్చేవాడుకాదు. ఇంట్లోకి కావలసినవి మాత్రం తెచ్చిపడేసేవాడు. నెలలు నిండి భారంగా తిరుగుతున్న మేనగోడల్ని చూసి అప్పుడప్పుడు కంటతడి పెట్టేవోడు. పురిటికి పుట్టింటికెళ్తే వాసుగాడు అక్కడికెళ్లి రభస చేస్తాడని మల్లీశ్వరి భయపడ్తుంటే, తమ బతుకెక్కడ వీధిలోకోస్తాదోనని భయపడి గాంధీ మల్లీశ్వరిని పురిటికి పంపకుండా దేవుడిబాబు ఆస్పత్రిలో చేర్పించాడు. రంగవప్పయ్యమ్మ, మల్లీశ్వరి వాళ్ల అమ్మా వచ్చి ఆస్పత్రిలో పిల్లదగ్గరున్నారు. పెళ్లాన్ని పురిటికి పంపని గాంధీని ఇద్దరూ తిట్టి పోశారు ‘పెల్లవంటే మరీ అంత బెమ ఉండకూడదన్నారు. ఆడదానికి పురిట్లో తల్లి తోడునేకపోతే ఎలాగన్నారు. పురిటి పచ్చెం నువ్వే ఎట్టేత్తావా? అని ఇకటలాడేరు. పోనీ ఆసుపత్రి నుంచైనా ఎలమంచిలి తీసుకుపోతావన్నారు. వల్లకాదన్నాడు గాంధీ ‘ఈడేటి ఇలగ మొండిగ తయారయ్యాడు. పెల్లికి ముందు మారమ్మే కొయ్యనుకున్నావు. అది మెత్తగయిపోయింది. ఈడేటి ఇలగమారిపోయాడా అని’’ వాళ్లిద్దరూ మచ్చెట్లేసుకున్నారు. ఆసుపత్రిలో ఉండగా ఒకనాడు తెల్లారుజామున అందరూ పడుకోని ఉండగా వాసు మెల్లగా కిటికీ దగ్గరకొచ్చి ‘మల్లీ, మల్లీ అని మూడుసార్లు కేకేసారు. తుళ్లిపడి లేచిన ఆమెని చూసి ‘‘ఏవే నా కొడుకును నాకు చూపించవా? ఆ కొజ్జాగొల్లిగాడు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. కన్నోణ్ణి నీను రాకూడదేటి? ఏడేబాబు చూపిచ్చు” అని అడగడం మొదలెట్టాడు. పాలు తాగుతున్న పసివాణ్ణి పాలు వదిలిపించి అడ్డాల్లోకి తీసుకోని చూపించింది. అమ్మా, బాప్పా ఎక్కడ లేస్తారోనని గుండెచిక్కబట్టుకోని వాసుగాడి కోరిక మళ్లీ తీర్చింది. ఆడు పిల్లోణ్ణి చూసి వెకిలినవ్వు నవ్వి ‘‘మనలాగే ఉన్నాడు ఎవడి కొడుకు. ఆ కోతిమొకవోణ్ణి ఎత్తుకోనియ్యకు. ఆడి సేతిలో పిల్లాణ్ణి సూసానో ఆడికి తగిలేత్తాయి నాలుగు పుంజీలు’’ అని బెదిరించి వెళ్లిపోయాడు.
అమ్మా, బాప్పా విన్నారేమోనన్న భయంతో తూరుపు తెల్లారే ఆ పొద్దు బిక్కచచ్చిపోయింది మల్లీశ్వరి. మల్లీశ్వరి పంపనని భీష్మించుకున్న గాంధీ తన పంతం నెగ్గించుకోని, బాలింతరాలైన భార్యకు అన్నీ తానే అయ్యి సపర్యలు చేశాడు. పిల్లాడికి స్నానం చేయించడం రాని మల్లీశ్వరిని ప్రక్కకు నెట్టి ఆడికి తానే నీళ్లు పోసేవాడు. పిల్లాడికి మూడోనెల రాకుండానే వాసు మళ్లీ గాంధీ ఇల్లు దూరడం మొదలెట్టాడు. తన ఆకలి తీర్చుకుంటూనే గాంధీగాడు పిల్లాణ్ణెందుకు కెత్తుకున్నాడనో, నీ బట్టలు ఎందుకరాశాడనో, ఆడు డ్యూటికెళ్లినప్పుడు బైటకొచ్చి ఎందుకు సాగనంపావనో ఏదో ఒక వంకని ఆమెను చితకబాదేవాడు. కొంచెం మందలవాటున్న వాసూ రౌడీయిజంలో ఒక మెట్టు ఎదగడం వలన రోజూ ఖరీదైన మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. తాగొచ్చి మల్లీశ్వరిని నానా బాధపెట్టేవాడు. మధ్య మధ్యలో గాంధీకి వార్నింగులిచ్చేవాడు. వాడ వాడందరికీ మల్లీశ్వరి కొడుకు వాసుకేపుట్టాడని అర్ధం అయిపోయింది. నెలలు గడిచేకొద్దీ వాసు పోలికలు పిల్లోడ్లో స్పష్టంగా కనిపించేవి. ఇవన్నీ చూసి చూడనట్లుండిపోయింది గురమ్మ. మల్లీశ్వరిని పలకరించేది. పిల్లాడ్ని ఎత్తుకునేది. కూరా నారా పంపించేది. ఇంతలో గురమ్మ మొగుడు చివరి సర్వీసుని ఒదిలేసుకోని రిటైర్మెంటు తీసుకున్నాడు. ఉద్యోగాన్ని వాసుబాబుకి రాసేశాడు. వీధి రౌడీగా తిరిగిన కొడుక్కి ఉద్యోగం రావడంతో గురమ్మకి కొడుకుమీద ఆశలు మొదలయ్యాయి. తను పిల్లలు పుట్టకముందు పెంపకానికి తెచ్చుకున్న తన అక్కకూతురు రాయగడలో ఉంది. ఆమెకు ముగ్గురూ కూతుళ్లే. పెద్దకూతురుకి పెళ్లీడువచ్చింది. ఆ పిల్లకి వాసునిచ్చి చెయ్యాలని పెద్దల్లో మాటలయిపోయాయి. వాసుతో ఆ ముక్క మాట్లాడ్డానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. లాభం లేదనుకున్న గురమ్మ ఒకనాడు మల్లీశ్వరి దగ్గరకొచ్చింది.
‘‘మల్లీ, ఇలిగిలిగ వాసుగాడికి భవానీ కూతురు హేమలతని అడుగుదావనుకుంతన్నాము. ఆడేమో నీ పిచ్చిలోనున్నాడు. నీకూ భరతా, పుట్టెడు బలగం ఉన్నారు. ఆడ్ని ఎలాగో ఒప్పించి ఒదిలీయ్, ఆడికీ బతుకుంటాది, నీకు భయ్యం లేని బతుకౌతాది ఏటంతావు?’’ అనడిగింది.
‘‘బాప్పా, నీ కొడుకుని నీను రమ్మంటన్నానా? ఆడి ఇష్టానికి ఆడు వచ్చి ఎల్తన్నాడు. నాకు నా మొగుడికీ ఇడబాపులు చేస్సాడు. పోనీ ఊరెల్లి బతుకుదావంటే మా యయ్యని నరికీసి నన్నూ సంపేత్తానంటున్నాడు. కన్నోరికి దూరమై పుట్టెడు దుఃఖంతోనున్నాను. నీ మాట్లు నా సెవిలో పాలుపోసినట్టుగే వున్నాయి. కానీ, నీ కొడుకింతాడానా మాట? ఆడికి నేను చెప్పగల్నా? కొడుకుని కనక ముందు రంకుమొగుల్లాగ సాట్నోచ్చోడు. ఆడు పుట్టాక డైరెట్రుగా ఇల్లు దూరుతున్నాడు నీ కొడుకు. నీకు తెలీని ఇసయంనీ కాదు నువ్వు నన్నడగడానికీ, నేన్నీకు సెప్పడానికీనూ’’ అన్నాది నిష్టూరంగా మల్లీశ్వరి.
‘‘నిజవేనే మల్లీ, ఆడు తల్లికి మొగుడు. ఒకరు సెప్తే ఇంటాడా? అయినా నీ దరమంగా సెప్పిసూడు’’ అని కాసేపు పిల్లాడ్ని ఎత్తుకొని ముద్దులాడి ‘‘ మీ బాబుకి నువ్వైనా సెప్పరా, పెల్లి సేసుకోమనీ” అని హాస్యాలాడి వెళ్లిపోయింది.
వాసూ వచ్చినపుడు ‘‘మీ యమ్మ సమందం సూసిందంట నీకు, మీ యక్క కూతురేనట. సేసుకో, పెల్లిసేసుకోక తప్పదు కదా, నేనెప్పుడూ నీకయిపోతానేటి?’’ అన్నాది మల్లీశ్వరి భయంభయంగా ఎక్కడ చెయ్యి చేస్సికుంటాడోనని జడుస్తూ
వాసూ వికారంగా నవ్వి ‘‘సేసుకోక, ఇలాగే ఉండిపోతాననుకుంతున్నారా అందరూనూ. నాకేటే ఉజ్జోగస్తుడ్ని పిలిచి పిల్లనిత్తారు. ఏటీ… ఇందాకేటన్నావు. ఎప్పటికీ నీనే ఉండిపోతానా అనా? ఏవే, ఎందుకొచ్చింది నీకా డౌటు? నేను పెల్లిసేసుకునీది మా నాన్న ఇంటిపేరు కోసం మొగోడికి పెల్లవ్వకపోతే పదిమందిలో ఇలువ ఉండదనీన్ని. అదీ ఉంటాది. నువ్వూ వుంటావు. నిన్ను నీ నొదుల్తానని కల్లో కూడా అనుకోకు. నేనోడిన వస్తువు ఇంకోడు వాడ్డానికి లేదు, బాగా గుర్తెట్టుకో’’ అని వార్నింగిచ్చాడు.
మూడునెలల్లో వాసుకి పెళ్లయిపోయింది. అటూ ఇటూ బోగట్టాగా వాసు అత్తవారికి వాసుకీ, మల్లీశ్వరికీ ఉన్న సంబంధం గురించి తెలిసింది. పెళ్లయిన నాలుగు రోజులున్నాడు. తిరుగుళ్లు, మరుగుళ్లకి రాయిగడ వెళ్లిన వాసుకి రైల్వేలో పనిచేస్తున్న వాళ్ల మామ కూర్చోబెట్టి బుద్దులు చెప్పాడు. పెళ్లయి పోయింది గాబట్టి చెడుతిరుగుళ్లు తిరగొద్దని హితవు పలికాడు. వాసు ఏం మాటాడకుండా బైటకి వెళ్లిపోయి, కొంచెం మందేసుకోనొచ్చి అత్తవారింటి ముందు వీరంగం చేశాడు. నీ కూతుర్ని నీ దగ్గరే ఉంచేసుకో నాకక్కర్లేదన్నాడు. నాకు సెప్పినంతటోడెవడడూ ఈబూమ్మీద లేరని అన్నాడు. మొగోణ్ణి నాకు నచ్చినంతమందితో తిరుగుతానన్నాడు. ఇరుగు పొరుగు వింటారని సిగ్గుపడి అల్లుడి మాటలకెవరూ ఎదురు చెప్పలేదు. కానీ వాసు పెళ్లాడిన హేమకి మాత్రం తన బతుకు తీరేంటో అర్ధమయ్యింది. మొగుడి మొహం చూడ్డానికే అసహ్యించుకుంది. కాపరానికి వెళ్లనని భీష్మించింది. తల్లిదండ్రులు నచ్చచెప్పి అల్లుడ్ని మెల్లగా దారిలోకి తెచ్చుకుందామనీ, తొందరపడితే మిగతా ఇద్దరాడపిల్లల భవిష్యత్తూ పాడయిపోద్దని హేమకి హితబోధ చేసి కాపురానికి పంపించారు. ఈ పెళ్లి హడావిడిలో వాసూ మల్లీశ్వరింటికి మళ్లీ రెండు నెల్లు రాలేదు. నెమ్మదిగా తేరుకున్న గాంధీ, మల్లీశ్వరీ మళ్లీ ఒకటిగా బతికేందుకు ఆసరా దొరికిందని ఊపిరి పీల్చుకున్నారు.
మల్లీశ్వరి మళ్లీ నెల తప్పింది. ఏదో ఆనందం ఆమెలో కన్పిస్తోంది. ‘‘ఇంక ఆడు రాడు. ఈసారైనా ముద్దూ ముచ్చటా తీరుసుకుంటారు మావోళ్లు. మాయ్య నాకు ముడేసినందుకు ఆడి ఇంటిపేరు నిలబెట్టడానికి నేనొకడ్ని కనిత్తన్నాను’’ అని సరదా పడిపోయింది. కూతురు నెలతప్పిందని తెలిసి అప్పన్న కూతుర్ని కన్నవారింటికి తీసికెళ్లాడు. రంగవప్పయ్యమ్మ వొచ్చి ఒకనాడు ఎవరూ లేకుండా చూసి, ‘‘మారా.. ఆస్పత్తర్లో ఆరోజు వచ్చి పిల్లడ్ని చూసినోడు ఎవుడే, నీకొడుక్కి నీ పోలికా రానేదు, నీ మొగుడి పోలికారానేదు ఏటి, ఏటి జరిగినాదేటి?’’ అనడిగింది. ఏం చెప్పాలో తెలీక కొంగడ్డు పెట్టుకోని ఏడుస్తూ ఉండిపోయింది మల్లీశ్వరి. నాలుగోనెల్లో మళ్లీ విశాఖప్నం వచ్చేసింది మల్లీశ్వరి. ఊళ్లోకొచ్చిన రెండురోజులన్నాడు స్టవ్ వెలిగింది టీ పెట్టుకొంటున్న మల్లీశ్వరిని వెనక నుంచి వచ్చి రెండుచేతుల్తో పట్టుకున్నాడు వాసు. దెయ్యవొచ్చి మీదపడినట్లుగా కేకేసింది ముందు. తరువాత తేరుకొని ‘‘మళ్లీ ఏంటిది వాసూ’’? అని గట్టిగానే అడిగింది. ‘‘మల్లీనా, ఆర్నెల్లకి ఇదే కదా తొలాట?’’ అని ఎకసెక్కవాడి మంచం మీద కెల్లి కూర్చున్నాడు. ‘‘నీ బతుకేదో నువ్వు సూసుకున్నావు, నేనూ ఏదో నాదార్న బతుకుతున్నాను. మల్లీ ఇలా రాడం పద్దతేనా వాసూ?’’ న్యాయవడిగింది మల్లీశ్వరి. ‘‘నీ ఎదవనీతులు నీకాడే ఉంచుకోని టీయ్యట్టుకోని ఇలా రాయే’’ అన్నాడు ఆమె మాటలనేమీ పట్టించుకోకుండా. టీ కప్పు చేతిలోపెట్టి ‘‘మల్లీ ఇలాగంటే బాగోదు వాసూ, మీయావిడకి తెలిత్తే మల్లీ అదొక గొడవా’’ అంది నచ్చచెప్పే స్వరంతో ‘‘గాడిదగుడ్డేం కాదూ దానికెప్పుడో తెలుసు. అది ఏటినన్నడుగుతాది, దాని బాబునే ఎప్పుడో కడిగీసాను’’ అన్నాడు వాసు ధీమాగా. ఏమాట్లాడాలో తెలీక మౌనంగా టీ కప్పందుకుంది మల్లీశ్వరి.
‘‘ఏం అక్కడ నిలబడ్డావూ, కొత్తేటి? నేప్పొతే ఫోజు కొడతన్నావా? ఈ ఆర్నేల్లు నా నొగ్గేసి నీకు మొగుడి మీదకి మనసెల్లిపోయుంటాది. మల్లీ కడుపట? ఆడిలాంటి కుర్రోణ్ణో, కొండముచ్చుదాన్నో కనీసొగ్గేయ్. అయినా నానిటుకాసి రాక నీకు ఒల్లుపోత్రం పెరిగిపోయిందే. నేన్నినొదిలీసానని ధీమ బలిసి పోయినట్టుగుంది. నీనొత్తే మల్లీ మామ్మూలుగా నాతోనుండాలంతే. లేకపోతే చీరేసి కారం ఎట్టేత్తాను తెలుసా! అని బెదిరింపులకు దిగి నాలుగో నెల కడుపుతో నవనవలాడుతున్న మల్లీశ్వరిని పశువు కుమ్మినట్టు కుమ్మేశాడు వాసు. ఆవేల్టీనుంచీ మళ్లీ మునుపటి కథ మొదలయ్యిందామె జీవితంలో. ఈసారి గాంధీ ఉంటుండగానే ఇంట్లోకొచ్చీడం, ఆడెదురుగానే కడుక్కున్న ముఖాన్నో, చెమటముఖాన్నో మల్లీశ్వరి చెంగుతో తుడిచేకోవడం, చెయ్యి పట్టుకొని లాగడంలాంటి చేష్టలు మొదలుపెట్టాడు. ఈసారి గాంధీ ఊరుకోలేదు. డ్యూటీలో తన స్నేహితులిద్దర్ని తీసుకొచ్చి వాసు తన భార్యని అల్లరిపెడుతున్నాడని చెప్పి అడిగించాడు. వాళ్లిద్దర్ని అసభ్యంగా తిట్టి ‘‘మీకు తెలుసా ఈడు అంటే ఈ గాంధీ కొజ్జాతనకి పక్కలోకి పనికిరాడనే ఈడి పెల్లం నన్నెకుంది. ఆ సంగతాడికీ తెలుసు. నాకూ తెలుసు. నేనామధ్య మా అత్తగారింటికి రాయగడ ఎలిపోతే ఈడు పిల్లాన్ని మరెవరికి తార్సాడో తెలీదు, దానికి కడుపొచ్చింది. ‘‘మీరే చెప్పండి, కొజ్జాలంజ కొడుకులికి పిల్లలు పుడతారా ఆ.. ఏటి? సెప్పండి? అలాగ ఎర్రి మొకాలేసారేవీ? అని వాళ్లని సిగ్గుపడిపోయేలా చేసి చెదరగొట్టి పంపించేశాడు. గాంధీ ఈసారి వాసూ లేనప్పుడు చూసి వాడి భార్యతో వాసుని అదుపులో పెట్టుకోమని చెప్పాడు. ఆ పిల్ల తేలకళ్లతో గాంధీని చూసి ఊసూరుమని ఏడ్చింది. ఎందుకొచ్చిందో తెలీదుగానీ ఆ యమ్మిని చూసి గాంధీకూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సాయంత్రం వాసుగాడు కొత్త నాటకానికి తెర తీసాడు. ఆళ్లమ్మ గురమ్మని వెంటబెట్టుకుని గాంధీ ఇంటికొచ్చి బండ బూతులు లంకించుకున్నాడు. గురమ్మ పేట్రేగిపోయి ‘‘సుబ్మా అని నా కొడుక్కి పెల్లి చేసాను. ఇన్నాల్లూ ఈ లంజ కొంగుక్కట్టుకోని నా కొడుకుని కుక్కలాగ తిప్పుకోని ఇయ్యలాడు పెల్లిసేసుకుంతే సూల్లేక దాని మొగుడ్ని నా కోడలిమీదికి ఉసి గొలిపింది. ఈడేం సిగ్గులేని గొల్లిగోడమ్మా, ఆడదయినాగొచ్చి ఆడదాన్తో ఊసులెట్టిన దొంగగొల్లిగోడ్నీ ఈడ్నే సూసాను. ఈడి పెల్లం సానరికానికి ఈడే పక్కల్దులుపుతాడట. ఇదేం గోరం. ఓలే. లోపట్నుండి బైటకి రాయే, పెద్ద సంసార్నాగ లోపల కూకోనేటి సేత్తన్నావే… నీకిట్టం లేకుండానే నా కొడుకు నీ పక్కలొకొచ్చాడేటే? ‘‘ఒరే గాంధీ దమ్మున్న మొగోడివైతే బైటకొచ్చి నా కొడుక్కి సమాధానం చెప్పరా’’అంటూ వీరంగవేసి సవాళ్లని విసిరింది.
ఏంచెయ్యడానికీ పాలుపోని భార్యభర్తలిద్దరూ గురమ్మా, వాసు వాళ్లింటి ముందునుంచీ వెళ్లిపోయేవరకూ మౌనంగా కూర్చున్నారు. వీధివీదంతా ఈ సినిమాని కళ్లప్పగించి చూసింది. మర్నాడు డ్యూటీకెళ్లడానికి వీధిలోకొచ్చిన గాంధీ తలపైకెత్తలేకపోయాడు. భరించరాని బాధని తనలోనే దాచుకోలేకపోయాడు. రంగం పెద్దమ్మ దగ్గరకెళ్లి జరిగిందంతా చెప్పుకున్నాడు. మరితను మేనగోడల్తో కలిసి బతకలేనని, వెళ్లినా వాసుగాడు చంపేస్తాడని చెప్పాడు. ‘‘ఎవడ్రా ఆడు ఆడికి పెల్లాన్నొగ్గేసి వచ్చేసావా? పద ఆడి సంగతి సూద్దాం’’ అని అప్పయ్యమ్మ ముందుకురికింది గానీ గాంధీ చెప్పిన విషయాల్లో కొన్ని ఆమెని వెనక్కిలాగాయి. ఊరుగాని ఊరెల్లి రౌడీమూకతో దెబ్బలాడ్డంలో సులువెంతుందోనని ఆలోచించింది. పిల్లల బతుకు బాగుండడానికి వేరే తోవేదైనా దొరుకుతాదేమోనని ఆలోచనలో పడిపోయి “తొందరపడకురా గాంధీ, ఏదోకటి సేద్దాం” అన్నాది. మర్నాడు డ్యూటీ కెళ్లిన గాంధీకి ఇంటి దగ్గర ఒంటరిగా చిన్నపిల్లాడితో భార్య ఏం తంటాలు పడుతుందోనని ఊహ కలిగింది. ఆ వెంటనే ‘‘ఆ వాసుగాడు దాన్నేమీ సెయ్యలేదుకదా” అని భయవేసి గబగబా ఇంటికి వచ్చాడు. దెబ్బతిన్న పక్షిలా పిల్లాడ్ని ఒళ్లో వేసుకోని గుమ్మంలో కూర్చోనుంది మల్లీశ్వరి. ‘అమ్మయ్య’ అనుకున్నాడు. కొన్ని రోజులకి తెలిసింది వాసూ భార్య మరి తిరిగిరానంటూ ఆ గొడవ జరిగిన రెండోరోజు కన్నవారింటికెళ్లిపోయిందనీ, గురమ్మ కొడుకుని తీసుకోని రాయగడ ఎల్లిందనీన్ని. అక్కడ లజ్జుగుజ్జులు పడ్డారుగానీ హేమ ఎంతమాత్రం కాపురానికి రానని ఖరాఖండిగా చెప్పేసిందని తెలిసింది. మల్లీశ్వరి గుండెలో రాయి పడింది. ఆడ్నూరినుంచీ రాగానే తన మీదకో, భర్తమీదకో కయ్యానికి దిగుతాడనే భయంతో రోజులు గడుపుతోంది. ఒక సాయంత్రం గురమ్మగొంతు వీధిలో వినిపించిన మల్లీశ్వరి భయానికి అంతులేకుండా పోయింది. డ్యూటీ నుంచి వొచ్చేస్తే భర్తను కొన్నాళ్లు ఊరెళ్లి పొమ్మని చెప్దామన్న పరిష్కారానికి వచ్చింది. కానీ టైమయినా మొగుడింటికి రాలేదు. ఎదురు చూస్తూ వాకిటి దడి దగ్గరే నిలబడిపోయింది. కాసేపటికి సైకిల్ మీద కాకుండా నడుచుకుంటూ గాంధీ రావడం కనిపించి గబగబా ఎదురెళ్లింది. ఒళ్లంతా రక్తమండలవైపోయిన మొగుణ్ణి చూసి బావురుమంది. ‘ఏటి మాయా, ఏటైంది? అంటుండగానే వెనకనుంచి గాంధీ సైకిల్ మీద వాసుగాడొచ్చాడు. ‘‘ఆడ్ని కాదు నన్నడుగు. నీను చెప్తాను. నా పెల్లనికి పుండాకోరు సాడీలన్నీ చెప్పి మమ్మల్నీడు ఇడదీస్సాడు. పెల్లం ఇంక రానని పుట్టింటికెలిపోతే మీసవున్న మొగోడు ఏటిసేత్తాడు? పుల్లలెట్టి దాని మనసిరిసీసిన ఇలాంటోడ్ని గుండగ తంతాడు. నా పరువు తీస్సిన నీ మొగుడికి సిచ్చేసారీ జడిజీగోరు. ఏటి సెయ్యగల్రో సెయ్యండీతూపు’’ అని విర్రవీగిపోయాడు. గాంధీలోపలికొచ్చి బట్టలు మార్చుకోని మంచానికడ్డంగా పడిపోయాడు. ఒక రాత్రి వేళ మల్లీశ్వరిని లేపాడు ‘‘ఆ వాసూగాడింక నిన్నొగ్గడే పిల్లా. నీను మానూరెలిపోతాను. మాయమ్మెప్పుడూ నన్నర సేతి దెబ్బ కొట్టనేదు. మా నాన్న పల్లెత్తు మాటన్లేదు. ఈ మాటలు పడ్నేక, ఈ డెబ్బలు కాయలేక నీనోడిపోయానే. నిన్నా నరకాసురిడికి వొగ్గేసి ఎలిపోతున్నాను. పిల్లడు జాగర్త” అని ఏడ్చుకుంటూ బయటికెళ్లి చీకట్లో కలిసిపోయాడు. నిలువుగుడ్లు పడి పోయిన మల్లీశ్వరికి చీకటికంటే చీకటిగా బతుకు గోచరించింది. కన్నారకుండా ఏడ్చింది. పిల్లడి మొహం మీద తన బతుకు కన్పిస్తుంటే ఆడిని గుండెలకదుముకోని ఏడ్చింది. అమ్మ నాన్నల్ని తలచుకోని ఏడ్చింది. చిన్ననాటి తన భోగాన్ని గుర్తుచేసుకుని ఏడ్చింది. చెల్లెళ్ల భవిష్యత్తు ఊహించుకొని ఏడ్చింది. అన్నింటికన్నా ముందు బతుక్కుదారేంటో? అని శోధించి శోధించి కుళ్లి కుళ్లి ఏడ్చింది.
వాసూగాడి దౌర్జన్నం గుర్తొచ్చి భయంభయంగా ఏడ్చింది. గాంధీ మాయ ఎర్రిమొకం మీద మమకారంతో ఏడ్చింది. మాయ్య ఎలగుబతుకుతాడో అనుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. రేపెలాగా? అనుకోని మరీమరీ ఏడ్చింది. గోడలూ, గుమ్మాలూ, తాటాకాలు, మట్టరగులు విన్నాయి. నిశ్చలంగా నిలబడ్డాయి.
తెల్లారింది. వాసు వచ్చాడు. “గాంధీ డ్యూటీకెల్లాడా?’’ అన్నాడు ఏమి ఎరగనట్లు. ఏం పూనకవొచ్చిందో తెలీలేదు మల్లీశ్వరికి. ‘‘ఏడ్చీదేదో నాగురించి ఏడు. ఆడి ఊసు తెచ్చావంటే బాగోదు, వాసూ నువ్వూ నేను తప్పు చేశాం. అదేదో మనం చూసుకోవాలి. ఆడినెందుకు మద్దిలోకి తెత్తావు. అడ్ని కొట్టి కొట్టానని ఊరేగడం పెద్ద గొప్పగొప్పనుకుంటున్నావేమో, ఆడికెవరూ లేరనా నీ పొగరు! నేనేటైపోతానని ఆడాలోసించి ఊరుకున్నాడు. నీకు జడిసికాదు. అయినా ఆడితో నీకుపనేటి? నువ్వొచ్చిన పని సూసుకోనెల్లు, మరెక్కువ పేలకు’’ అని గట్టిగా అనీసరికి ‘ఏటే ఏటంత కోపమైపోతున్నావు? అదెలిపోయింది తెల్సా?’ అన్నాడు మాటమారుస్తూ.
ఎర్రబడ్డ కళ్లతో సూటిగా వాసు మొహంలోకి సూసి “ఈడూ ఎలిపోయాడు, ఇంక రాడు’’ అన్నాది మల్లీశ్వరి. ‘‘అయితే నాకు ఒక్కడ రోజూ రెండు డూటీలన్నమాట’’ అని కన్ను కొట్టి నవ్వాడు వాసు. అసహ్యంతో ఒళ్లు జలదరించిన మల్లీశ్వరి పిల్లాణెత్తుకోని వాకిట్లోకెలిపోయింది. ఆ రోజు నుండీ వాసు పర్నినెంటుగా ఆ ఇంట్లో సెటిలయిపోయాడు.
……
ఊరెల్లిన గాంధీ అప్పయ్యమ్మతోనే కాకుండా మామయ్యలందరికీ తన గోడు చెప్పుకున్నాడు. మల్లీశ్వరి మన కింక దక్కదన్నదే ఆ మాటల సారాంశం. రిక్షా అప్పన్నకి మతిపోయింది. నేరని పిల్లని వద్దంటున్నకొద్దీ పెళ్లి చేసి అగ్గిలో తోస్సినట్టుగయిందని గొల్లుగొల్లున ఏడ్చాడు. కుటుంబవంతా ఒక దగ్గర చేరి ఏటిచేద్దావంటే, ఏటిచేద్దాం అని అనుకున్నారు. మల్లీశ్వరిని తీసుకొచ్చేసి ఇక్కడ కాపురం పెట్టించేసి గాంధీని రోజు రైల్లో డ్యూటీకి తిరగమని తీర్మానించారు. ‘‘ఎక్కడున్నా ఆడు దాన్ని ఒదల్దు. మనవేంచేసినా ఆ పిల్లని బాధ పెడతాడు తప్పితే సమస్య తీరదని గాంధీ వాళ్లతో వాదించాడు. ఆడి నోరు మూయించేసి, ఆడెలాటీ మొగోడైనా, ఎంత రౌడివోడయినా ఇన్ని కుటుంబాల మధ్యకి రాలేడని మళ్లీ అంతా కలిసి దైర్యం చెప్పుకోని విశాఖపట్నం బయల్దేరారు ఒకనాడు. అమ్మా నాన్నల్ని, బాప్పల్ని చూసిన మల్లీశ్వరి వచ్చే కన్నీళ్లని ఆపుకుంది. పెళ్ళొద్దని మొండికేసిన చిట్టితల్లి కాదీ మల్లీశ్వరి. చూడకూడనివి చూస్సి, వినకూడనివి వినీసి, చెయ్యకూడనివి చేస్సీ, ఉండకూడనోడితో ఉంటున్న ఈ మల్లీశ్వరిని అనుభవం ఆరిందాని చేసింది. మౌనంగానే తన వాళ్లకి మర్యాదలు చేసింది. ‘‘ఏంటంతావమ్మా, మనూరెల్లిపోదాం. గెద్ద తిరుగుతుందని తెలీక కోడిప్లిలని జారొగ్గీసినట్లు జారొగ్గీసాం. అక్కడికెలిపోతే ఇక మరేటి ఉండదు. ఆడేం నిన్నేలన్లేదు కదా, మాయందరి మజ్జినీ మీ ఇద్దరూ పొయ్యికు దుర్నాగ ఉందురుగాని బయలెల్లు పిల్లడి బట్టలూ, నీ బట్టలూ సర్దుకో, తరవాతో ఎవలవో ఒకలవొచ్చి మిగతా సామాన్లట్టుకెల్దాం’ అన్నాది బాప్ప.
అణగారిపోయిన ఆశలకి రెక్కలొచ్చినట్టుగయింది. మల్లీశ్వరికి తన తప్పు తెలిసీ మన్నించి మళ్లీ బతుకు నిస్తావంటున్న తన వాళ్లు తన కళ్లకి కదుల్తాన్న దేవతల్లాగ అనిపించారు. తెలీకుండానే మొహం మీద నవ్వు చిగురించింది. తనవీ, పిల్లడివీ బట్టల్తీసి బ్యాగులో సర్దేసింది. మొహం కడుక్కోని వచ్చి చీర కట్టుకుంటుండగా సుడిగాల్లగా వచ్చాడు వాసూగాడు.
‘‘ఎవరే ఎవరూ నా ఇంట్లో దూరిన ఈ మందంతా ఎవరూ?” అంటూ పేంటుకున్న బెల్టు తీసి చేతితో పట్టుకోని ఒక చేత్తో బెదిరిస్తూ లోపలి గదిలోకి వచ్చాడు. చీరకట్టుకుంటున్న మల్లీశ్వరిని కాలుతో మంచం మీదకి తన్నేడు. ‘‘లంజా, ఎక్కడికే బయల్దేరావు? గుమ్మం దాటావంటే నరికేత్తానేటనుకుంటున్నావో’’ అని ‘బయల్దేరండి, అది ఎక్కడికీ రాదు’ అని అప్పయ్యమ్మ చేతిలో నున్న పిల్లాణ్ణి లాక్కొని ‘‘ఈడు ఈ డెవడికి పుట్టాడో ఇక్కడికొచ్చిన ఆడదానికైనా, మొగోడికైనా తెల్సా? ఈడు నా కొడుకు. నేను అంటూ… బూతులు లంకించుకున్నాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంతలో మూలన నిలబడిన గాంధీని చూసిన వాసూ అతగాడి ఫిల్టుపట్టుకోని ‘‘సిగ్గులేదురా, అన్ని సార్లు తన్నినా నీకు, నా కొడుకుని తీసికెల్లడానికి నువ్వెవడవిరా ఒకడు కన్నా కొడుకుని నీ కొడుకని ఊర్లో తిరుగుతావా పెద్ద మొగోడ్లాగా? సూడూ దాన్ని పిల్లణ్ణి తీసి కెల్లాలంటే మీ తాతలు దిగాలి తెల్సా. ఎల్లండెల్లండి వచ్చిదార్నే బయల్దేరండి’’ అని గోడమీదకి తోశ్శాడు. ఎవరూ తేరుకోలేక అలాగే బొమ్మల్లాగ ఉండిపోయారు. బైట వీధిలోంచి గురమ్మ గొంతు దగ్గరవుతూ వినిపించింది. జబర్దస్తీగా లోపలికి తిట్టుకుంటూ వచ్చి నా కొడుక్కి పెల్లిసేసి ఈ మాయలాడి వల్లోనుండి తప్పిస్తే నీ యల్లుడు బంగారం నాటి నా కోడలు మనసు ఇరీస్సాడు. అది మంచిది కాబట్టి దీన్ని సుఖపడమని సెప్పి కన్నోరింటికి ఎలిపోయింది. నా కొడుక్కి పెల్లాన్ని తప్పించేసి ఈడు మాతరం పెల్లాన్ని తీసుకెలిపోతాడా? సిగ్గులెయ్యలేదర్రా వచ్చి నా మనవణ్ణి తీసికెలిపోతావనడానికి? అంటూ తీరుతీరుగా తిట్లకి అందుకుంది. ఆ బూతులు, బూతులు కావు. ఆ మాట్లు మాట్లుకావు. ఆళ్లమ్మ రంగంలోకి దిగాక వాసుగాడు మంచమ్మీద విశ్రాంతిగా కూచున్నాడు. ఓడిపోయి పాలిపోయిన తనోళ్లని చూసి ఏడుపు తన్నుకురాగా ‘‘నాన్నా మీరెలిపోండి మీ పెద్ద కూతురు సచ్చిందని నీల్లొదిలీయండి. నీను రాలేను. నాకు బతుకు లేదు. మాయా నీ కిదే చెప్పడం. నువ్వెక్కడ సంతకం సెయ్యమంటే అక్కడ సేత్తాను నువ్వు మరి నన్ను మరిసిపో, బాప్పా అందర్నీ తీసుకోని ఎలిపో, నీను సచ్చేనని. తెలిసినా ఈ ఇసాపట్న మరి రాకండి. నన్నిలావొగ్గీయండి’’ అని దండం పెడుతూ అర్ధించింది. అప్పుడు నోరు మూసింది గురమ్మ. నేలమీద ఆడుతున్న పిల్లణ్ణి తీసుకోని ఇంటికెల్లిపోయింది. వాసు విజయగర్వంతో కుర్సీలోకి మారి దర్జాగా కూర్చున్నాడు. అందరూ మొహాలు చూసుకోని తలలు వంచుకోని బయటకి దారితీసారు. అలా మల్లీశ్వరి తన బతుకు తీస్సినోడితో బతుకు మొదలెట్టింది.
రెండోసారీ కొడుకునే కన్నాది మల్లీశ్వరి. గురమ్మ మనవళ్లని మురిపెంగానే చూసేది. ఆళ్లకి తినడానికి, బట్టలకీ లోటుచేసేవాడు కాదు వాసు. కానీ కూడు తిన్లేక మల్లీశ్వరి రోజురోజుకీ ముడుచుకుపోయింది. తన ఊరు, తనవాళ్లూ, తన భర్తా, పచ్చపచ్చని జీవితం గుర్తొచ్చినప్పుడంతా బతుకు మీద రోత కలిగేది. రెండేళ్లు పోయాక తెలిసింది. గాంధీకి తన పెద్దనాన్న కూతురు జయనిచ్చి చేశారని. వాళ్లు యలమంచిల్లోనే గాంధీ ఇంట్లోనే కాపురం పెట్టారనీ, వాళ్ల కొక కొడుకనీ ఎప్పుడో ఒకసారి వచ్చిన కోర్టు నోటీసు అందుకోని వాసుకి చూపిస్తే గాంధీ విడాకుల నోటీసిచ్చాడనీ కోర్టు కెళ్లకపోతే ఆడికి విడాకులొచ్చేస్తాయనీ చెప్పాడు. అలా విడాకులు తీసుకున్న గాంధీ మళ్లీ పెళ్లిచేసుకున్నట్లు అర్ధవయింది ఆమెకి. ‘‘పోన్లే మాయ జీవితం ఒక రూటుకొచ్చింది’’ అని ఏదో సంతృప్తి కలిగింది. ఆనాటి నుంచి గాంధీ మీద బెంగ తీరింది.
పదేళ్లు కల్లోలాగా జరిగిపోయాయి. ఈ మధ్య వాసూ సరిగా ఇంటికి రావడం లేదు. ఇంట్లో డబ్బులు సరిగా ఇవ్వడం లేదు. ఎలాగోలా ఇల్లు గడుపుకోస్తోంది. వాసు స్నేహితుడు రాజు ఉంచుకున్న కనకంతో వాసుకి స్నేహం కుదిరిందనీ ఆ విషయమై రాజూ, వాసూ రోడ్డు మీద తన్నుకున్నారనీ తెలిసింది. రాజే ఓడిపోయి ఏమీ చెయ్యలేక కనకాన్ని ఒదిలేసి వెళ్లిపోయాడనీ వాసూ పగలూ రాత్రీ అక్కడే ఉంటున్నాడనీ చెప్పుకున్నారు. వాసుతో మొదట్లో జరిగిన గొడవలప్పుడు వాడవాడంతా మల్లీశ్వరిని చిన్నచూపు చూశారు. కానీ ఆ తరువాత ఈ పన్నేండేళ్లల్లో ఆమె ప్రవర్తన చూసి వాసుగాడి అఘాయిత్యాలు తెలిసినోళ్లు కనుక మల్లీశ్వరితో అందరూ మాట కలిపేవారు. తాగొచ్చి వాసు చేసే అల్లరికి అందరూ అలవాటు పడినా మల్లీశ్వరి చూసి సానుభూతి తెలిపేవారు.
మాటా, మన్ననా, మంచీ చూసీ అందరూ మల్లీశ్వరితో చనువు పెంచుకున్నారు. గురమ్మ ఇల్లమ్ముకోని కంచరపాలెంలో ఆవిడత్తగారి సొంతింటికి వెళ్లిపోయింది. ఎప్పుడన్నా వాసు వస్తేనే అతని గురించి మల్లీశ్వరికి తెలిసేది. రానురాను రావడం బాగా తగ్గించేసాడు. పిల్లల్తో తిండికిబ్బంది పడిపోవడం మొదలయ్యింది. ‘‘ఏంటి వాసూ ఇలాగ చేస్తున్నావని అడిగితే ‘‘కట్టుకున్న మొగుడ్నా? అంత దాల్టుగా అడుగుతున్నావని’ ప్రశ్నించే వాసుతో మాట్లాడ్డం బాగా తగ్గించేసింది. వీధి చివర్ని ఉన్న శకుంతల దగ్గర పిల్లల్తో గడవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటే తనతోపాటు బ్యాకరీకి తీసికెళ్లి పనిప్పించింది. ఆమె పనిలో చేరిందని తెలుసుకున్న వాసు.
‘‘ఎల్లడానికి ఈల్లేదు. అక్కడెవడ్నేనా మరుగ్గడ్డానికా?” అని పెంటపెట్టాడు. ఆడి మాటలు ఖాతరు చేసే దశ దాటిపోయింది. ఎప్పుడూ మందుమీదుండే వాసులో మునుపటి పటుత్వం లేదు. కొట్టడానికి మీదకొచ్చినా తానే ఒక తోపు తోస్సేది మల్లీశ్వరి. పిల్లల కోసం తెగింపుతో నిర్ణయాలు తీసుకోడం మొదలెట్టింది. ఎప్పుడైనా వచ్చే, వాసు పక్కలోకి రమ్మని పోరితే ‘‘ఎవర్తోనో తిరుగుతున్నావు. నేనెవరి దగ్గరికి రావాలి! నీకు దాన్నించి అంటుకున్న రోగాలన్నీ నాకంటించీడానికా? అని ఎదురుతిరగడం మొదలెట్టింది. సమాధానం చెప్పలేక మెల్లిగా జారుకునేవాడు వాసు. ఒకసారి కనకం ఎవరితోనో మద్రాసెలిపోయింది. ఎప్పుడొస్తాదో తెలీక వాసు కిందామీదైపోయాడు. చూసి చూసి రూటు మార్చి మెల్లిగా మల్లీశ్వరి దగ్గరకొచ్చాడు. అప్పుడే డ్యూటీనుంచొచ్చింది మల్లీశ్వరి
పిల్లలు ప్రయివేటు నుంచి ఆకల్తో వస్తారని అనుకుంటూ స్టవ్ మీద అన్నానికి పెట్టింది. అన్నం ఉడుకుతోంది. వాసు గాడి వాలకానికి మనసు మసుల్తోంది. మంచి మాటలాడి దగ్గర చేసుకుందామనుకుంటున్న ఆడి ఆత్రాన్ని పసిగట్టి మాటకు మాట అంటిస్తూ అన్నం కలుపుతోంది. ‘‘మల్లీ నా పెల్లాన్ని నేనెవలికోసం ఒదిలేశానే, నీకోసం కాదా? గాంధీగాడు నీకు విడాకులిచ్చీసినా, ఉజ్జోగస్తుడి పెల్లంలాగా సుఖంగా జరిగిపోయిలా అప్పట్నుంచీ నిన్ను పెంచుకురాలేదా? అయినా మరీ అనాకానీ వోణ్ణి తీసీసినట్టే తీసేత్తావేటే. పోర్టెంప్లాయిని నన్నే ఒద్దనుకుంటున్నావా? నా బతుకు ఏటైపోద్దే నువ్వొద్దంటే, ఇప్పుడు పిల్లలు ఎదిగారనా. ఆల్లే నీకు మొగుళ్లయిపోయారా? అంటూ ఇంకా ఏదో అంటున్న వాసూ మాటలకి మల్లీశ్వరికి మంటెత్తి పోయింది. స్టౌమీద అన్నం కుతకుత ఉడుకుతుంది.
‘‘ఆపు వాసూ’’ అని గట్టిగా వారించింది.
మరింత రెబ్బిపోయిన వాసు ‘‘అవునే, నీకు కొడుకులు అందొచ్చారు కదా, ఆల్లే నీకిప్పుడు మొగుల్లయి పోయారు, నీనెందుకు నీకు? అంటుంటే పిచ్చెక్కిపోయిందామెకు, ఏంచేస్తుందో తెలియనంత ఉన్మాదం ఆవహించిందామెలో, ఉడికి ఉడికి గంజి పట్టేసిన అన్నాన్ని గిన్నెతో సహా రెండు చేతుల్తో ఎత్తి వాసూ మొహం మీద కొట్టేసింది మల్లీశ్వరి.
‘‘అబ్బా! అని కిందకూచుండిపోయాడు వాసుగాడు. ‘‘సవ్వరా సవ్వు. నువ్వు ఉజ్జోగస్తుడివిరా… నీకింద నీను జోహారైపోవాలా? ఒక ఉజ్జోగస్తుడి పెల్లాన్ని ఆడికి కాకుండా సేస్సి, దురమారంగా, దౌరుజన్నంగా నా బతుకులో నిప్పులు పోస్సిన ఎదవ్వి రానువ్వూ, నువ్వూ నీ యమ్మా కలిసి నా బతుకు తీశ్శార్రా… నువ్వే ఎల్లి నీ యమ్మకాడ తొంగోరా. పిల్లల్ని నాకు మొగుళ్లుంటావురా. ఎల్లు ఒల్లుకాలిన ఎదవతో ఏ ఎదవ కాపరం చేత్తాదో దాంతో సెయ్యి. నా జోలికొచ్చావంటే పేనం తీసేత్తానేమనుకున్నావో. పిల్లిలాగ గదిలో బందించి బయపెట్టావురా. ఇవేల నాకు తెలిసిందిరా నా సెత్తేంటో. ఎల్లు ఎక్కడికెల్లి పిర్యాదు సేసుకుంటావో సేసుకో. నా గుమ్మంలో ఇంకొక సెనం ఉన్నావా, కిరసనాయిలేసి అగెట్టేత్తాను” అంటూ కాలిపోయి చర్మం ఊడిపోయిన వాసుని రెక్కపట్టుకోని ఇంటిబైటకి లాగేసింది మల్లీశ్వరి. ఊడిపోయిన చర్మంతో ఒళ్లంతా అన్నం మెతుకుల్తో కళ్లు కనిపించక ఆ మట్టిలోనే దొర్లి దొర్లి, కొంతసేపటికి లేచి పరిగెత్తాడు వాసు.
మళ్లీ అన్నం వండడానికి బియ్యం కడిగింది మల్లీశ్వరి.