“విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాను మించిన కళారూపం మరొకటి లేదు “ అన్న లెనిన్ అభిప్రాయానికి అనువుగా వివిధ  ప్రాంతాలకు చెందిన 29 సమాంతర, ప్రత్యామ్నాయ సినిమాల గురించి ఎంతో ప్రేమతో, గొప్ప అవగాహనతో, ఒక మంచి అభిరుచితో, ఒక ప్రత్యేకమైన లోచూపుతో, రచయిత్రి శివలక్ష్మి గారు  పంచుతున్నసినీ  విజ్ఞాన చంద్రికలు  ఈ అంతర్జాతీయ సినిమాల గురించిన వ్యాసాలు. మాతృక, మహిళా మార్గం, అరుణ తార పత్రికలు; విహంగ, సారంగ, కొలిమి, వసంత మేఘం వంటి  అంతర్జాల పత్రికలలో  ప్రచురించిన సినీ సమీక్షల సంకలనం ఈ పుస్తకం.

విఖ్యాత రచయిత  వరవరరావు గారు సినిమాలలో సామ్యవాద వాస్తవికత గురించి,  మరో సినీ వీక్షకురాలు, రచయిత్రి నేస్తం ల.లి.త. గారు ఆలోచనలు రేకెత్తించే ఈ సమీక్షావరణం గురించి రాసిన వ్యాసాలు ముందుమాటలు గా ఈ పుస్తకం విశిష్టతను, ఆవశ్యకతను మనకు తెలియజెప్పటమే కాదు, పుస్తకంలో విశ్లేషించిన  సినిమాల గురించి కూడా కొంత సమాచారమిస్తూ ఈ పుస్తక పఠనానికి  దారులు తెరుస్తాయి. ఎలెక్ట్రిక్ సర్క్యూట్రీ   కాలంలో ఈ సమీక్ష లెందుకు? అని శివలక్ష్మి గారు ఇచ్చిన వివరణ పాఠకులకు ఒక దృక్పథాన్ని కలిగిస్తుంది.  ఈ పుస్తకం ఎందుకు, ఎలా చదవాలో తెలియ జేస్తుంది.  వారిని  పూర్తిగా సమాయత్తం చేస్తుంది.  అలాగే ఈ  పుస్తకంలో ఆఖరి వ్యాసంగా వున్న“సినిమా గా సినిమా” అన్న  శ్రీ నందగోపాల్  గారి పుస్తకం  పై ఆవిడ  సమీక్ష మంచి సినిమాపై ఒక విహంగ వీక్షణమై  ఆయన తెలుగు వారికి  సినిమాల గురించి చెప్పిన నాలుగు మంచిమాటలను పరిచయం చేస్తుంది. నిజానికి ఈ వ్యాసం కూడా ముందు మాటలతోపాటు వుంటే; ప్రపంచ సినిమాలో వచ్చిన పరిణామం ముందే తెలిసి, పాఠకులు శివలక్ష్మిగారి సమీక్షలను, అభిప్రాయాలను మరింత చారిత్రక దృష్టితో అర్ధం చేసుకునే వారు. శ్రీ నందగోపాల్ తనలో రగులుతున్న ఆందోళనలు, ఆవేశాలు, ఆవేదనలు కలబోసి ఈ పుస్తకంలో  ప్రకటించారని, తెలుగువారి సినీ అక్షరాస్యత కోసం ఆరాటమే శ్రీ నందగోపాల్ గారి  పుస్తకం అని వ్యాఖ్యానిస్తారు శివలక్ష్మి. ఈ “రియాలిస్టిక్ సినిమా” కూడా అదే కోవకు చెందిన, అదే స్థాయికి చేరిన పుస్తకం.

ఈనాడు మన ముందుకు వస్తున్న సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల స్థాయి, విలువలను చూస్తే అవి ప్రజలలో అధమ స్థాయి అభిరుచులను ప్రేరేపించి, సొమ్ములు చేసుకుంటున్నాయి  అనిపిస్తుంది తప్ప సర్వకళల సమాహారం సినిమా అన్న గౌరవాన్ని ఏమాత్రం కలిగించవు. “సినిమా కానీ  బొంబోడి  చెత్త సినిమాలకు అసలైన సినిమాకు వున్న తేడాని వివరించడానికి” తపనతో ఈ పుస్తకం వెలువరించారు రచయిత్రి. మంచి సినిమా ద్వారా ప్రజాస్వామ్య భావనలు పెంపొందాలని కోరుకునే మనుషుల ప్రయత్నాలు, కళాత్మక కృషి గురించిన సోదాహరణ వివరణ ఈ రచన. విశాల ప్రజానీకాన్ని ఆలోచింప జేయగలిగే సినిమా తెలుగునాట కొరగాకుండా పోతున్నదనే ఆవేదన ఈ పుస్తకానికి ప్రాణం.  “మంచి సినిమాకు తక్కువ మంది ప్రేక్షకులుంటారు కానీ ఎక్కువ మంది వీక్షకులుంటారు” అన్న జీన్ గోడార్ద వ్యాఖ్యతో ప్రేరణ పొంది తెలుగు వారిలో అలాటి వీక్షకులను పెంచాలనే ప్రయత్నమే ఈ పుస్తకం.

“సినిమా అన్నది చాలా శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమం. దాన్ని సరిగా  ఉపయోగించుకోగలిగిన  ప్రతిభా వంతులు ఇంకా రావలసి వుంది.” అన్నారు మహాకవి శ్రీశ్రీ. “ఇప్పుడెదుర్కొంటున్న ప్రపంచీకరణ, విపత్కర  పరిస్థితులకు ఎదురు నిలిచే,  చైతన్యాన్నిచ్చే చిత్రాలు మనకి లేవు. అందుకని నేను ప్రపంచాన్ని కదిలించిన వివిధ దేశాల సినిమాలను గురించి రేఖామాత్రంగా వివరించడానికి ప్రయత్నించాను” అంటారు రచయిత్రి. “సినిమా పట్ల చిన్న చూపు, నిర్లక్ష్యం, నిర్లిప్తత, నిరసన భావం, తెలుగు వారిలో  చాలాకాలంగా, చాలా మందిలో  బలంగా అల్లుకు పోయింది. “అశ్లీల దృశ్యాలు,  పూజలు, మూఢాచారాలు,  కాలంచెల్లిన సెంటిమెంట్లకు స్వస్తి చెప్పి సిసలైన సినిమాకు  స్వాగతం పలకాలనే ఆరాటం” తో “మనం గొప్ప ప్రేక్షకులం కావాలనే” ఆశతో వచ్చిన పుస్తకం ఇది. నందగోపాల్ గారి లాటి సినీ ప్రేమికుల, పెద్దల పూనిక కూడా ఇదే. కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో వున్న మంచి ఫిల్మ్ క్లబ్ లు, ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సులు, అంతర్జాతీయ సినిమా ఉత్సవాలు, హైదరాబాదులో కొంతకాలం వరసగా జరిగిన బాలల చిత్రోత్సవాలు కొంతమేరకు ఈ రకమైన కృషి చేశాయి. కాని అవి చాలా పరిమితమైన ఆవరణలోనే పని చేస్తున్నాయి. ఇప్పుడు శివలక్ష్మి గారు రాసిన ఈ పుస్తకం మరింత ఎక్కువ మందిలో ఈ సినీ స్పూర్తిని కలిగిస్తుందని ఆశించవచ్చు. 

బోల్షివిక్ విప్లవం తరువాత  వివిధ భాషలు, భిన్న సంస్కృతులకు చెందిన 16 కోట్ల మందిని  సమైక్య పరిచి  ఒకే గొడుగు కిందకు తేవాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించి 1918 నుండి 1921 వరకు సంచార రైలులో వీరుల చిత్రాలు, గ్రంథాలు, డాక్యుమెంటరీలు, ఫిల్మ్ డవలప్మెంట్,  ఫిల్మ్ ప్రాసెసింగ్  ప్రింటింగ్  సౌకర్యాలన్నీ గల సాంస్కృతిక రధాన్ని  ప్రజల వద్దకు నడిపించిందట లెనిన్ సారధ్యం లోని తొలి సోషలిస్టు ప్రభుత్వం. ప్రజల్లో ఆమోఘమైన చైతన్యాన్ని కలిగించే ఈ మాధ్యమానికున్న బలాన్ని గుర్తించిన లెనిన్ “హాలీవుడ్ ని ఒక సంవత్సరం పాటు మా చేతుల్లో వుంచండి – ప్రపంచమంతా సోషలిజం మయం చేస్తా”మని అన్నారట. ఆ లక్ష్యంతో, ఉత్తేజం కలిగించిన అనేక చిత్రాల వివరాలు విశ్లేషణలు గుది గుచ్చి, చాలా స్ఫూర్తిదాయకంగా ప్రజా సాంస్కృతికోద్యమ కర్తవ్యాలను గుర్తుచేశారు రచయిత్రి. ఆ రంగంలోని కార్యకర్తలకు పరోక్షంగా ఒక పథనిర్దేశమూ సూచించారు. నేటి సినిమాల తీరు తెన్నులతో కాస్త నిస్పృహకు గురైన వారికి “గతమెంతొ ఘనకీర్తి గలవాడ” అని భుజం తట్టారు. భాషాభేదాలను అధిగమించి అంతర్జాతీయ మానవతను ఉద్దీప్తం చేసిన అద్భుతమైన చిత్రాలను పరిచయం చేశారు, అన్ని ప్రాంతాలలోను మానవుల సంవేదనలు, వారి ఆంతరంగిక సంస్పందనలు, కుటుంబ సంబంధాలు, సామరస్య జీవన ఆకాంక్షలు ఒక్కలాగే వుంటాయనే ఎరుక కలిగిస్తుంది ఈ విశ్లేషణాత్మక గ్రంధం.

ప్రత్యేక స్థల, కాలాలకు చెందిన ఘటనలను నిర్దిష్టంగా చిత్రిస్తూనే సర్వకాలీన మానవీయ విలువలకు కాణాచి అయ్యింది మంచి సినిమా. అందుకే అది సర్వజనుల భాష అయ్యింది. జాతులను దగ్గర చేసే సాధన మయ్యింది. సామాన్య మానవుల ఆత్మస్వర మయ్యింది. విశ్వాత్మగా ప్రకటిత మయ్యింది. అలాంటి అంతర రావాన్ని మన భాషలో తెలియజేస్తుంది ఈ పుస్తకం.      

ఎన్నుకొన్న సినిమాను ఒకటి రెండు వాక్యాలలో ముఖ పరిచయం చేసి, ఇతివృత్తం, కథాసంగ్రహం ఆకట్టుకునేలా చెప్పి ఆ తరువాత సవిస్తరంగా ఆ సినిమాలోని విశేషాలను, కథన సౌందర్యాన్ని, చిత్రీకరణలో నిగూఢంగా వున్న దృశ్యీకరణ పాటవాన్ని విప్పి చెబుతారు. కథను, పాత్రలనే కాకుండా చిత్రానికి ఆధారమైన సాంఘిక, చారిత్రక నేపధ్యాన్ని, పరిణామక్రమాన్ని; వీలయిన అన్నిచోట్లా వర్తమాన చరిత్రతో అనుసంధానించి వ్యాఖ్యానించటంతో పుస్తకమంతా ఎంతో ప్రాసంగికతను సంతరించుకుంది. ఆ పైన ఆ సినిమా పొందిన అవార్డులు, రివార్డులు, ఖ్యాతి,  ప్రదర్శన వివరాలవంటివి చెప్పి  ఒక ప్రణాళికా బద్దంగా ఆ కళాఖండానికి పాఠకుల్ని చేరువ చేస్తారు రచయిత్రి.

మానవ నాగరికత పెద్ద ముందడుగు వేసిన విప్లవకాలాలను ఈ చిత్రాలలో ఎంత గాఢంగా, ఎంత తాదాత్మ్యతతో చిత్రించారో, సమీక్షకురాలు కూడ అంత మమేకతతో వాటిని వీక్షించి సమీక్షించారు.  వాస్తవ చరిత్ర వివరాలు చెప్పటమే కాదు, వాటిని ఎంత ఉత్తేజకరంగా, కళాభిజ్ఞతతో చిత్రీకరించారో కూడ శివలక్ష్మి గారు లోతుగా పరిశీలించి ఒక్కో ఫ్రేమ్ లో దాగివున్న కళారహస్యాలను వివరించి చెబుతారు. దర్శకుడు  ఒక సముద్రం ఎందుకు చూపించారో, ఒక సూర్యుడు ఎందుకు కనిపించాడో, పరస్పర విరుద్ధమైన వాదనలను, దృశ్యాలను ఎందుకు చూపిస్తున్నారో, వాటి  సంఘర్షణలో ఏ నిగూఢమైన సందేశం ప్రేక్షకునికి  అందిస్తున్నారో  వివరించారు. ఒక వెలుతురు రేఖ, ఒక చీకటి చారిక,  ఒక మందకొడిగా నడిచే దృశ్యం, ఒక పరుగులెత్తే నది, ఒకచోట స్తంభించిన ప్రకృతి, మరోచోట రెక్కవిప్పిన పక్షులు ఎందుకు వున్నాయో – ఆ  సినిమాలో కనిపించే ప్రతి బొమ్మ వెనుక వున్న అర్ధాన్ని వివరించారు. ప్రేక్షకుల అభిరుచి  స్థాయి  పెరిగేలా  ఎన్నో  కొత్త విషయాలు చెబుతూ ఎప్పటికప్పుడు మూతలు పడ్డ ప్రేక్షకుల కళ్ళను తెరిపించారు. ఈ పని ఎంత సునాయాసంగా, ఎంత సులభమయిన మాటల ద్వారా సాధించారంటే రచయిత్రి అవగాహనకు ఒకవంక ఆశ్చర్యపడుతూనే, మరోవంక ఒక అధ్యాపకురాలిగా కాకుండా ఒక స్నేహితురాలిగా  మనకు ముచ్చట్లు చెబుతున్న ధోరణికి మురిసి పోతాము.

ఈ సమీక్షా వ్యాసాలు 2017 నుండి 2020 మధ్య రాసినవి. వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి. మరియు ఈ సినిమాలు 1925 నుండి  2019 మధ్య కాలంలో నిర్మించబడినవి. ఆ చిత్రాల కథాంశాలు మరింత పూర్వపుకాలం – 1900 ల నుండి జరుగుతున్న మానవ ప్రతిఘటనల ఇతిహాసాల చిత్రీకరణలు. అందువల్ల ఈ  పుస్తకం  చదివితే కనీసం ఒక శతాబ్దం చరిత్ర కళ్ళముందు కదలాడుతుంది. వర్తమాన సమస్యలను చిత్రించిన సినిమాలనూ సమీక్షించడంలో నేటికి గతం ఒక ప్రేరణగా నిలిచి నేటి తరానికి  ఒక పరిష్కారం కూడా కనిపిస్తుంది. 

ఈ వ్యాసాలను చిత్రాలు విడుదలైన  కాలక్రమానుసారంగా  కాక  సౌలభ్యం  కోసం సారూప్యత వున్న అంశాల ఆధారంగా కొన్ని విభాగాలుగా విభజించారు. ల. లి. త గారు చెప్పినట్లు ఈ పుస్తకంలో సమీక్షించిన సినిమాలు

1.  దోపిడికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటాలను ప్రతిబింబించేవి,

2. [ప్రపంచ] యుద్ద వాతావరణంలో జరిగిన విధ్వంసం, వినాశనం, అప్పుడు ఆదర్శంగా నిలిచిన ఉన్నతమైన వ్యక్తిత్వ కధనాలు

3. స్త్రీల పట్ల వివక్ష, అణచివేతలను, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను చిత్రీకరించినవి – అనే ప్రధాన విభాగాలుగా చూడవచ్చు. 

సామ్యవాద వాస్తవికతకు ఆద్యుడనదగ్గ ఐసెన్ స్టీన్  మూడు సినిమాలు – 1924 లో నిర్మించిన “స్ట్రైక్” లో సామూహిక కార్మిక చైతన్యం, “బాటిల్ షిప్ పోటేంకిన్” లో బద్దలైన  నావికుల సాయుధ తిరుగుబాటు.  “అక్టోబర్”  (ప్రపంచాన్ని గడ గడ లాడించిన ఆ  పది రోజులు) లో రష్యాలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కార్మికవర్గ సాయుధ  తిరుగుబాటు గురించి సవిస్తరం గా సమీక్షించారు.   “స్ట్రైక్” చిత్రాన్ని శ్రామిక  సమూహాలన్నిటికి , ఆమాటకొస్తే ప్రపంచంలోని  సామాన్య ప్రజలందరికీ  చెందిన సామాజిక ఇతివృత్తంతో మాంటేజ్ టెక్నిక్ ఉపయోగించి ఈనాటికి వర్తించేలా అందమైన దృశ్యకావ్యంగా మలిచారు ఈ చిత్రాన్ని అని ప్రశంసిస్తారు. ఒక నెత్తుటి ముఖం, మండుతున్న ఆయుధం చూపిస్తూ మరో ప్రయోజనాన్ని స్పురింపజేస్తాడు దర్శకుడు.  మన ముందు తరాల వారు ప్రాణత్యాగం చేసి  సాధించిన 8 గంటల పని దినాన్ని, నేడు  కార్పొరేట్  శక్తులు హరించి వేస్తున్న  వైనం వివరిస్తూ  ఇంటి వద్ద నుంచి పనిని ఒక సౌకర్యంగా ప్రచారం చేస్తూ గంటల తరబడి పని చేయించుకుంటున్నారు, తాము కల్పించవలసిన సదుపాయాలు, సౌకర్యాల  నుంచి హాయిగా  తప్పుకుంటున్నారని ఎండగట్టారు. మార్క్స్ చెప్పిన శ్రమదోపిడికి ఇది పరాకాష్ట అని చెబుతూ 100 సంవత్సరాల నాటి సినిమాను నేటికీ అన్వయించారు. ఒక హీరో, ఒక హీరోయిన్ అనే మూసకు భిన్నంగా ఒక సమూహాన్ని, ఒక సమాజాన్ని  కథానాయకులుగా ఎంచుకుని ఐసెన్ స్టీన్ సినిమాలు తీశాడని కొనియాడారు.  “బాటిల్ షిప్ పోటేంకిన్” చిత్రం ఒక “సృజనాత్మక  విద్యుత్ఘాతం” అని వర్ణిస్తూ అందులోని ఒడెస్సా మెట్ల సీను వివరంగా  ఉదాహరించారు. ప్రజలు ఆనందంగా వున్న సమయంలో అనూహ్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరపటం జరుగుతుంది. కళ్లజోడుతో వున్న ఒక  మహిళ విపరీతమైన  భయానికి గురైనట్లు చూస్తాం  తరువాతి ఫ్రేమ్ లో ఒక  కంటిగ్లాస్ లోనుంచి  బుల్లెట్  దూసుకుపోయినట్లు  కనిపిస్తుంది.  నావికుల మురికి బట్టలు-యాజమానుల ఖరీదైన సూట్లు; భీతిల్లిపోతున్న మనుషులు – మానవ ముఖాలే లేని క్రూరమైన సైనికులు ఇలా ద్వంద్వాలను వెంటవెంటనే చూపిస్తూ సీన్ ఎక్కడ కట్ చేయాలో ఎక్కడ పొడిగించాలో అర్థవంతంగా, అతి చాకచక్యంగా కేమెరాను  ఉపయోగిస్తూ  ప్రేక్షకులను తీవ్రమైన భావోద్వేగాలకు గురి చేసిన  ప్రతిభను అక్షరాలలో పరిచారు.  ఇక  రష్యా  “అక్టోబర్ విప్లవ చరిత్రను  104 నిమిషాల వ్యవధిలో  500  షాట్ లతో  ప్రతి రెండు సెకండ్లకీ సీను కట్ చేస్తూ  దృశ్యీకరించారు. ఇంత గొప్పగా చారిత్రక,  రాజకీయ, కళాత్మక అంశాలు  కలగలిసిన చిత్రం  రావడం సినిమా చరిత్రలోనే  అపూర్వం”  అంటారు.    

మహిళా యుద్ద వీరుల చరిత్రలుగా –  “ది  రెడ్ డిటాచ్మెంట్ ఆఫ్ వుమెన్” [ చైనా మహిళా సైన్యం], “ద  డాన్స్  హియర్ ఆర్  క్వయట్ [రష్యా రెడ్ ఆర్మీ మహిళా కామ్రేడ్లు], “ద క్రేన్స్ ఆర్ ఫ్లైయింగ్” సినిమాలను పరిశీలిస్తూ, ప్రశంసిస్తూ – యుద్ధం సృష్టించిన విషాద చిత్రీకరణలుగా వాటిని అభివర్ణించారు. “1930 లలోనే  చైనా విప్లవకర సైన్యంలో ప్రత్యేక  మహిళా బెటాలియన్ లు నిర్వహించటం, వారి ప్రత్యేక అవసరాలను వారి విలక్షణతలను గుర్తించి వారి కనుకూలమైన నిర్ణయాలు చేయడం సంభ్రమం కలిగిస్తుంది” అని సమీక్షిస్తారు శివలక్ష్మి. అట్టడుగు శ్రామిక వర్గానికి చెందిన చదువు రాని  అమాయక అనాథ యువతి వు కీయాంగ్వా అనే యువతి పాత సమాజంలోని అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ, కమ్యూనిస్టు విప్లవసారంగా, సత్స్వభావంగా ఎదిగిన పరిణామాన్ని  వివరిస్తుంది “ది  రెడ్ డిటాచ్మెంట్ ఆఫ్ వుమెన్” చిత్రం.  రెండవ ప్రపంచ యుద్దంలో మహోద్రిక్తంగా పాల్గొని  జర్మనీ ఫాసిజాన్ని మట్టి గరిపించిన   రష్యాలో 1942 మే  నెలనుండి  జరిగిన వాస్తవ ఘటనలు “ద  డాన్స్  హియర్ ఆర్  క్వయట్” చిత్రం . ఐదుగురు మహిళలతో కూడిన రెడ్ ఆర్మీ దళం  జర్మన్ల దాడి నుండి ఒక స్థావరాన్ని కాపాడటానికి చేసిన వీరోచిత ప్రయత్నమే ఈ సినిమా కథ, “ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు దేశం రష్యా అయితే  ఆ దేశంలో మానవత్వపు హద్దులకు వెలి అయిన మహిళలు రెడ్ ఆర్మీలో చేరి  విప్లవాత్మకమైన పోరాటాల్లో పాల్గొనటం అన్నది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో న్యాయ పోరాటాలకు స్పూర్తినిస్తుంది” అని సమీక్షించారు.  “ద క్రేన్స్  ఆర్ ఫ్లైయింగ్ “ 1954 లో సోవియట్ నుంచి వచ్చిన  యుద్ద వ్యతిరేక సినిమా. యుద్దంలో తన ప్రియుడు  బోరిస్ ను  కోల్పోయిన వెరోనికా అనే యువతి కోణంనుంచి కథా విధానం సాగుతుంది. 1941 జూన్ 22 న జర్మనీ దాడులు ప్రారంభించగానే యుద్దానికి వెళ్ళిపోతాడు బోరిస్. ఆ తరువాత అతని గురించి ఏ సమాచారమూ ఉండదు. అక్కడినుంచి వెరోనికా విషాదము, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ప్రేక్షకుల గుండెల్ని తొలిచేస్తాయి. అది ఇరవై మిలియన్ల సైనికుల కుటుంబాలలోని స్త్రీలందరి దుఃఖానికి సంకేతం అని వ్యాఖ్యానిస్తారు రచయిత్రి. అందమైన జీవితాన్ని కోరుకునే  అమాయక అమ్మాయి అంతులేని ఆశలకు  కలలకు సంకేతంగా  చిత్ర ప్రారంభంలోనూ, చివరిలోనూ నదిలోనడయాడే  కొంగల దృశ్యీకరణ నుండి  సినిమా పేరు ఎన్నుకున్నారు అని చెబుతారు.        

ఇటలీలో  నవ్య వాస్తవికతకు పునాదులు వేసిన విట్టోరియా డి  సికా చిత్రాలు మూడింటిని  సమీక్షించారు. ఇటలీ నవతరం సినిమాలుగా వీటిని పేర్కొంటూ – 1950 లో అకాడెమీ అవార్డు పొందిన  “బైసికల్  తీవ్స్” ను  ‘ప్రజలను దొంగలుగా మారుస్తున్న ఫాసిజం’ గా గుర్తించారు రచయిత్రి. చూడటానికి ఒక కుటుంబం కథ, పేదరికం, సైకిళ్ళ  దొంగతనంలాగే కనిపిస్తుంది. లోతుగా చూస్తే పొరలు పొరలుగా అనేక జీవిత సత్యాలు గోచరిస్తాయి. తండ్రీ కొడుకుల అనుబంధాలు, ఒకరి నొకరు అర్ధం చేసుకుని అండగా నిలవడం కనిపిస్తుంది. “సైకిల్ దొంగ అనినా కొడుకుని ఎందుకు కొడుతున్నారు? వాడికో ఉద్యోగం ఇప్పించవచ్చుగా” అన్న తల్లి మాటలు ఎప్పటికీ మరచి పోలేము. పనికిమాలిన యుద్దాలతో, ఆయుధాల కొనుగోళ్లతో  ప్రజలకు కూడు  గుడ్డ  లేకుండా  దుర్భరమైన పేదరికంలోకి నెట్టిన  కనిపించని శత్రువు ఫాసిజం అని ఋజువు చేస్తాడు దర్శకుడు అని సినిమాను పరిచయం చేశారు. మానవ ప్రవృత్తి లోని వికృతమైన వికారాలను ఈ చిత్రం గాఢంగా ముద్రవేస్తుంది.  1943 లో రోమ్ పరిసరాల్లో జరిగిన వాస్తవ గాధ,  పైశాచికంగా చెలరేగిపోయిన సైనికుల వల్ల చిత్ర హింసలకు గురైన తల్లి కూతుళ్ల కథ “టు వుమెన్” చిత్రం.  దేశభక్తి, వీరజవాన్లు అని గాకుండా ఆహార పానీయాలు దొరక్క అలమటీంచే  ప్రజల పక్షం వహించి  సవ్యంగా ఆలోచించమని సినిమా మొత్తం చెబుతూ వుంటాడు దర్శకుడు అన్న అంశాన్ని ఎత్తి  చూపించారు సమీక్షకురాలు.  “రోమ్ ఓపెన్ సిటీ” సినిమాని ఇటలీ ప్రతిఘటనా పోరాటంగా అభివర్ణించారు. ఇటలీ నియంతగా ముస్సోలినీ [1883-1945] “సినిమాలలో హింసను చూపకూడదు. చెడుని చూపకూడదు. మంచినే చూపాలి అవి ఇటలీ పరువు ప్రతిష్టలు పెంచాలి” అని ఆజ్ఞలు జారీ చేశాడు.  రోమ్ నగరంలో ప్రజలు జర్మన్, ఇటాలియన్ ఫాసిస్టులతో పోరాడుతున్న సమయంలో అనేక అనిశ్చితుల మధ్య చిత్రీకరిస్తూ ఈ దర్శకుడు ప్రజల పక్షపాతిగా మారిపోయాడు.  ఈ సినిమా చూసి “సెకనుకి ఇరవై నాలుగు ఫ్రేముల చొప్పున నిజాన్ని వివరిస్తుంది ఈ ఫిల్ము”  అన్నారు నియో రియలిస్టు ఉద్యమకారులు. “అంతా బాగానే వుంది  కానీ ఈ  రెండు సినిమాలలోను  ఆడపిల్లలను చిన్నచిన్న ప్రలోభాలకు [ఉన్ని  కోటు, పట్టు మేజోళ్లు లాంటివి] కక్కుర్తి పడినట్లుగా చూపించారు. బహుశా, ఆ రోజుల్లో స్త్రీల దీనావస్థని  చెప్పడానికేమో తెలియదు”  అంటూ శివలక్ష్మి గారు కొంత అసంతృప్తిని వెలిబుచ్చారు. కానీ ఆ దర్శకుల నిబద్ధతను మాత్రం శంకించలేదు. అలాగే జపాన్ లో నూతన సినిమాకు ప్రాణం పోసిన అకిర కురసోవా చిత్రం “రషోమన్” లో  మానవ  మనస్తత్వాలను  ఒక రసహోమం గా నిర్వహించిన తీరును  పరిచయం చేశారు. ప్రజల ప్రాణాలు బలి గొంటున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆదివాసీ సినిమా “ఆల్టీప్లానో” లో పలు కోణాలలో వివరించారు.  పెరూ దేశంలోని ఒక గని నుండి  పాదరసం ఒలికి పోయి పక్కనే వున్న  గ్రామంలోని ఆదివాసీ ప్రజలు కంటి జబ్బుల బారిన పడుతుంటారు తలనొప్పితో చనిపోతుంటారు.  గిరిజన సంస్కృతినుంచి వచ్చిన రెడ్ ఇండియన్, శాటర్నీన అనే యువతి ప్రజలను కూడగట్టి  ఆందోళనలు చేస్తుంది. అక్కడి వైద్యుల మీద తిరగబడి ప్రజలు చేసిన దాడిలో  మాక్స్ అనే బెల్జియన్  కంటి వైద్యుడు చనిపోతాడు. క్రూరమైన ప్రభుత్వ దాష్టీకానికి  అణచివేతకు నిరసనగా శాటర్నీన పాదరసంతోనే  ఆత్మహత్య చేసుకుంటుంది.  చనిపోయిన మాక్స్ భార్య  గ్రేసీ  బెల్జియం నుండి ఆ స్థలం  వెతుక్కొంటూ  పెరూ వస్తుంది.  శాటర్నీనా తల్లి ఆమెకు ఆశ్రయమిచ్చి అన్ని విషయాలు చెబుతుంది.  అర్ధం చేసుకున్న గేసీ,  శాటర్నీనా శవయాత్రలో పాల్గొని ఊరట చెందుతుంది.  గిరిజన మహిళ శాటర్నీనాకు  పట్టణ జర్నలిస్టు గ్రేసీ కి మధ్య భౌతికబంధం లేకపోయినా  ఒక మానసిక  భావైక్యతను కలిగించారు. దురాక్రమణ దారుల పట్ల, ప్రజా వ్యతిరేకుల పట్ల మన ఆదివాసీలు చేస్తున్న పోరాటాలు ఈ సినిమా చూస్తున్నంతసేపు మన కళ్ళముందు తిరుగుతుంటాయని, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న వికృత మానవహింసకు  వ్యతిరేకంగా స్పందించేవారందరూ చూడవలసిన సినిమా అని  అంటున్నారు రచయిత్రి.      

మహిళల సమాంతర సినిమాలుగా కొన్నిటిని సమీక్షించారు. “పురుషాధిపత్య సమాజాలలో  మహిళల కథలు  బలంగా వినపడవు.  కానీ ఆధునిక స్త్రీ దీన్ని మార్చివేస్తున్నది.  ఆడవాళ్ళ జీవితాల్లోని అనేక అంశాలను – పైకి అల్పంగా కనిపిస్తూ, అనుభవించే  వారికి నరకప్రాయంగా వుండడాన్ని ఈ సమాంతర  సినిమాలు చిత్రిస్తున్నా” యంటారు రచయిత్రి.  2013లో అంతర్జాతీయ మహిళా శ్రామికదినం సందర్భంగా యూరోపియన్ మహిళలు “మా గురించి ఆలోచించండి” అని విజ్ఞప్తి  చేస్తూ కొన్ని చిత్రాలను భారతీయ మహిళలకోసం పంపారు. వాటిలో కొన్ని చిత్రాలను శివలక్ష్మి చూశారు. లైంగిక బానిసత్వాన్ని వేధింపులను ఇతివృత్తంగా తీసుకుని దిగ్భ్రాంతి కలిగించేలా  మలచిన పోలాండ్ చిత్రం  “యువర్ నేమ్  ఈజ్ జస్టిన్” ను మనసు గీచిన బొమ్మగా; ఫ్రాన్సు, పోలాండ్, స్విట్జర్లాండ్  దేశాల సంయుక్త నిర్వహణలో తయారయిన  ఫ్రెంచ్ చిత్రం  “త్రీ కలర్స్- బ్లూ” ను  మనశ్శాంతి నివ్వని స్వేచ్ఛగా, “బ్యాక్ టు యువర్ ఆర్మ్స్” ను తండ్రీ కూతుళ్ల ఆరాటంగా  వీక్షించారు.  స్వేచ్ఛ కోసం మహిళా ఉద్యమాలు అన్న శీర్షికలో “ఫ్రమ్ ఫియర్ టు ఫ్రీడం” – మహిళపై హింసను అంతం చేస్తూ భయం నుండి స్వేచ్ఛకు చేసిన ప్రయాణాలను చిత్రించారు, మహిళల సామూహిక పొలికేకగా “హెల్లారో” సినిమాను సమీక్షించారు.  ప్రపంచీకరణ దుష్పరిణామాలను “ఎథనేసియా” [ఆనందంగా వున్నామనే భ్రమ]  సమీక్షలోనూ, మార్కెట్ మాయాజాలంలో చిక్కుకుని పెడధోరణులకు లోనవుతున్న  యువతరం  పోకడలను “ఎక్సెంటరీస్  ఆఫ్  ఏ బ్లాoడ్ హెయిర్డ్ గర్ల్” సమీక్షలోనూ వివరణాత్మకంగా వినిపించారు. మానవాళి సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ ఓ అనూహ్యమైన వ్యక్తిత్వం ఏదో బయటపడుతుంది. సమస్యకు దారి చూపించటమే కాదు  రాబోయే శతాబ్దాలకు మార్గదర్శిగా నిలబడుతుంది. “నేను ప్రజల మనిషిని, ఏ వంకరా లేని బాణం లాంటి వాడిని.  కానీ నేను  హంతకుడిగా, పరమ దుర్మార్గుడిగా, వంకరగా వుండటానికి జైలుకు రావలసి వచ్చింది” అని అనుకుంటాడు “Shawshank’s Redemption” చిత్రంలోని కథానాయకుడు. ఈ వాక్యాలతో మనకు మనదేశంలోని ఎందరో గుర్తుకొస్తారు. జీవితమంతా  జైలే అయినప్పుడు దానికి వారు  అలవాటు పడిపోవటాన్ని ప్రతిభావంతంగా చిత్రిస్తారు. “నేను నిర్దోషిని”  అంటాడు కథానాయకుడు. “ఇక్కడ వున్న అందరూ నిర్దోషులే” అని సమాధానం ఇస్తాడు ఒక పెద్దమనిషి. అవును! సామాజిక కారణాలను శోధిస్తే అందరూ నిరపరాధులే అని వెంటనే వత్తాసు పలుకుతుంది మన రచయిత్రి. దానికి కారణం ఆవిడ స్వయంగా ఒక జైలులోని  ఖైదీలను కలిసి చేసిన సంభాషణలు. “ఎంత చిన్న కారణాలకు వాళ్ళు జైలు పాలయ్యారో? వారి నేరాల నేపధ్యాలను చూస్తే అవి మనందరికీ, సమాజానికీ, ప్రభుత్వానికీ  చెందుతాయి”  అని  నిర్ద్వంద్వంగా  చెబుతారు. చీకటి రోజుల్లో  భవిష్యత్తు మీద అపారమైన ఆశను, భరోసాను కలిగించే చిత్రం  “జైలు నుంచి విముక్తి” అనే  [షశాంక్  రిడెంప్షన్]  చిత్రం. అలాంటి భరోసాను నింపే మరో చిత్రం “ద  లాక్ డౌన్”. కరోనా విస్పోటనంతో  దాన్ని అరికట్టటానికి  చైనాలోని వూహాన్  పట్టణంలో విధించిన తొలి లాక్ డౌన్ రోజుల గురించి చైనా గ్లోబల్ టి.వి లో ప్రసారమైన డాక్యుమెంటరీ. “చైనా గ్లోబల్ టి వి అంతర్జాతీయ సమాచార ప్రవాహానికి  విలక్షణమైన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి  ప్రయత్నిస్తుంది.  దేశాలు, ప్రాంతాలు, కథలపై  సమతుల్యమైన  రిపోర్టులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది” అని వ్యాఖ్యానించి “ఆశే సంజీవనీ మంత్రం” అన్న శీర్షికతో ఆ విషయాలను సమీక్షించారు.   తెలియని క్రిమిపై  మొదటిసారి యుద్దం చేయవలసి వస్తే కలిగే సంకోచం, సంశయం, ఏదో ఒకటి చేసి ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత, అగత్యం, ఒత్తిడుల మధ్య హేతుబద్దంగా ముందుకు సాగవలసి వస్తుంది. కరో న తొలిరోజులలో ఇదే పరిస్థితి. “స్వచ్చంద సేవకులను తయారు చేయటం, వివిధ ప్రాంతాలనుండి 30 వేల సిబ్బందిని తరలించడం,  వైద్యశాలల నిర్మాణం, ఎటు చూసిన తొడుగులు, ముఖ కవచాలు, పలుపొరల రక్షణ గౌనులు కనిపిస్తాయి. వివిధ వైద్యాధికారులను, వైద్య సహాయకులను, సిబ్బందిని ఇంటర్వ్యూలు  చేస్తే అందరిదీ ఒకే మాట. “ఆశను నిరంతరం నిలుపుకుంటూ ప్రాణం వున్నంత కాలం పోరాడాలి. దీని ముందు ఇంతకు ముందు వున్న కష్టాలు కష్టాలే కావు” అని.   ఈ ప్రయత్నాలు, ప్రజలూ  ప్రభుత్వమూ కలిసి చేసిన యుద్దం వల్ల అతి తక్కువ ప్రాణనష్టంతో చైనా ఊపిరి పీల్చుకుంది.  అందుకే శివలక్ష్మి గారు  “చైనా ఏదో బయో ఆయుధంగా ఈ వైరస్ ను తయారు చేసిందనే వింత వింత కుట్ర సిద్దాంతాలు రాజ్యమేలుతున్నాయి. వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద బ్రాహ్మణీయ వర్గాలు దాడి చేస్తున్నాయి రాజకీయాలను పక్కన బెట్టి అన్ని రాజ్యాలు, అగ్రనేతలు;  తన ప్రజల రక్షణ కోసం చైనా తీసుకున్న జాగ్రత్తలను, ప్రేమను  గమనించాలి”  అని ఈ డాక్యుమెంటరీని సమీక్షలో తేల్చి చెబుతారు.  

 ఈ  పుస్తకంలో వున్న అన్ని  సినిమాల కథలు, కథనాలు వివరించటం లేక పరిచయం చేయటం నా వుద్దేశ్యం కాదు. కానీ  సినీ ప్రేమికులందరూ ఈ పుస్తకం చదివి, నిజమైన ప్రేక్షకునికి కావలసిన  కళాత్మక అభిరుచి, శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవాలని, సహృదయత, మానవతలతో సమాజాన్ని అవగాహన చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ అవగాహనకు తోడ్పడే అంశాలెన్నో ఈ సమీక్షలలో నిండి వున్నాయని  మీ దృష్టికి తెస్తున్నాను.

ఈ సినీ సమీక్షలలో సందర్భానుసారంగా తెలుగు ప్రాంతాల ఉద్యమాలను ప్రస్తావించి, సరిపోల్చి చూపారు. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా తన అభిప్రాయాలను  వ్యక్తపరిచారు. అలా ఈ సమీక్షలు మనకు మన ప్రాంతాలకు చాల దగ్గరివి, అవసరమైనవి అన్న భావన కల్పించారు. స్థానిక అవసరాలతో పాటు విశ్వ జనీనతను స్పురణకు తెచ్చి  అంతర్జాతీయ గమనంలో మనము ఒక  విడదీయరాని భాగం అన్న సోయి  కలిగించారు. మానవజాతి సహోదరత్వాన్ని, అఖండతని గుర్తుచేస్తారు. ఈ మొత్తం సమీక్షలలో  భారతీయ సినిమాలు మూడు మాత్రమే.  అవి  అమానుష కులవ్యవస్థను వివరించే అంబేద్కర్ డాక్యుమెంటరీ,  విముక్తి  పోరాటాలకు దిక్సూచిగా కాశ్మీర్ [ జష్న్ ఎ ఆజాదీ ],  హిందీ భాష  సంకలన నాటక చిత్రం  “ప్రేమ – శృంగారం – మోసం”  అన్న చిత్రాలు. సత్యజిత్ రే పథేర్ పాచోలి లో మలచిన చిరస్మరణీయ పాత్ర ఇందిరా ఠాక్రున్ గురించి ఒక ప్రత్యేక వ్యాసం వుంది. 

 శివలక్ష్మి గారి రచనలో మరో ప్రత్యేకత వుంది. ఇంగ్లీషులో వున్న సినిమా పేర్లను యధా మాతృక గా అనువదించకుండా ఆ సినిమాల ప్రధాన లక్షణాన్ని మనకు స్పురింప జేసేలా  శీర్షికలు ఉంచటం చాలా సముచితంగా అనిపిస్తుంది. తాను ఎన్నుకున్న సినిమాలలో నేటి మన దేశ స్థితికి అన్వయించే ఏ అంశాన్ని వదలకుండా పట్టుకుని తన వ్యాఖ్యలు జోడించడం చాలా సమయోచితంగా వుంటుంది. ఉదాహరణకి “దేశానికి మద్దతు ఇవ్వడం మాత్రమే దేశభక్తి కాదు. దేశాధినేతలు ప్రజలకు హాని చేసే నిర్ణయాలు తీసుకున్నప్పుడు  యువత తమ దేశ ప్రజల క్షేమం కోసం “ఇది చాలా తప్పుడు నిర్ణయమని” ప్రతిఘటించడం కూడా దేశభక్తే“ అని  “చివరి ఆరు రోజులు” అన్న డాక్యుమెంటరీలో వుంటుంది. రచయిత్రి ఈ విషయాన్ని తన సమీక్షలో సరిగ్గా నొక్కిచెబుతూ ఇప్పుడు మనందరికీ ఇది అవసరమైన సూచన అని వ్యాఖ్యానిస్తారు.

ఒక చిత్రం ప్రజల మనసుల్లో  తిష్టవేయాలంటే  ఆ చిత్ర దర్శకుడు రచయిత, సామాజిక  శాస్త్రవేత్త, కళాకారుడు అయ్యుండాలని ఐసెన్ స్టీన్ అంటారు. ఒకనాడు వనరులు తక్కువగా వున్నప్పటికి  అలాటి దర్శకులు కొందరు తెలుగులో కూడ  గొప్ప సామాజిక స్పృహతో, ప్రజా పోరాటాలకు మద్దతు నిస్తూ కొన్ని చిత్రాలను దృశ్యీకరించారు. కానీ ప్రస్తుతం ఒక హీన సంస్కృతిని ప్రేరేపించే విధంగా చిత్రాలు తయారవుతున్నాయి. నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న దోపిడి, పీడన, విపత్కర పరిస్థితులు, ఫాసిజం గురించి చిత్రాలు లేవు. వీటిని ఎదుర్కొంటున్న ప్రజల పోరాటాల చరిత్ర గానీ, వారి పోరాట స్పూర్తిగాని  ప్రధాన సినిమా వాహినిలో అంతర్వాహినిగా అయినా లేవు.

కినిమా అంటే పురోగమనం. సినిమా దాని ప్రత్యామ్నాయ పదం. అంటే సినిమా లక్ష్యం పురోగమనమే కావాలి.  సునిశిత విమర్శనా దృష్టితో, సమాజ గమనాన్ని పరిశీలిస్తూ, మంచి చెడుల భేదాన్ని గుర్తించే యువతరం ఇప్పుడు లేకపోలేదు. కాని వారి స్వరం చాలా పీలగా వినిపిస్తోంది. సంక్షోభ కాలంలో యువతరమే ఆశాజ్యోతి అన్న రచయిత్రితో ఏకీభవిస్తూ వ్యవస్థలో మార్పుకోసం తోడ్పడే ప్రత్యామ్నాయ సినిమా కోసం  ప్రయత్నించడం నేటి  సంస్కృతికోద్యమ కర్తవ్యంగా స్వీకరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది  అని కళాకారులు, కళాభిమానులు గుర్తించాలి. ఈ పుస్తకం ఆ ఆలోచనలకు పాదు కడుతున్నది. అందుకోసం  తపిస్తున్నది.  సినీరంగంలో, దాని అనుబంధ  శ్రమలలో జీవిస్తున్న అందరూ మరీ ముఖ్యం గా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళుతున్నామనుకునే బాహుబలులు, దర్శక మేధావులు, వివిధ క్రాఫ్ట్స్ లో పని జేస్తున్న కళాకారులు  ఈ పుస్తకాన్ని చదవటమే కాదు అధ్యయనం చేయాలి. ఈ పుస్తకం ప్రముఖపుస్తక విక్రేతల వద్ద, పుస్తక ప్రదర్శనలలో విరసం పుస్తక స్టాలు వద్ద లభ్యమవుతోంది. కినిమా గురించి ఇంత మంచి ఆలోచనాత్మక  పుస్తకాన్ని అందించిన రచయిత్రి  శివలక్ష్మీ గారికి హార్దిక అభినందనలు.

( “రియలిస్టిక్ సినిమా” రచయిత్రి : శివలక్ష్మి; మొబైల్ -9441883949
కుహూ/విరసం ప్రచురణలు; 
 258 పేజీలు, వెల 300 రూ.
ప్రతులకు – నవోదయ బుక్ హౌస్)
 

One thought on “అంతర్జాతీయ రియలిస్టిక్ సినిమా

  1. Our telugu movies —or telugu serials —both are trash —
    No story —too much fightings /voilence /item songs
    Telugu Cini industry is controlled by 4 families —grand fathers are HEROS plus
    Varasathvam heros -and too much politics
    Nice article
    ——————————Buchireddy gangula

Leave a Reply