హిందుత్వ ఫాసిజమనే విష వృక్షం రోజు రోజుకు తన వేర్లను సమాజ లోతుల్లోకి చొప్పించి తన పునాదిని గట్టిపర్చుకుంటుంది. తన శాఖలను విస్తరించుకుంటూ పాలనా, చట్టం, న్యాయం, మీడియా అన్నింటిని తన నీడ కిందికి తెచ్చుకుంటుంది. మన సమాజంలో చారిత్రకంగా (వందల సంవత్సరాలుగా) అనేక రూపాలలో కొనసాగుతున్న అధిపత్య భావనలు (కుల దురాహంకారం, పితృస్వామ్యం, మత పెత్తనం) హిందుత్వ విష వృక్షపు వేర్లకు సత్తువనిస్తున్నాయి. ఆ విష వృక్షం ఈ రోజు దోపిడీ కుల, వర్గాల అండదండలతో అధికారం చేజిక్కించుకొని తన ఫాసిస్టు నిజ స్వరూపాన్ని నగ్నంగా ప్రదర్శిస్తుంది.
అయితే ఈ రోజు కాకపోతే రేపు ఆ విష వృక్షపు కాండం, శాఖలు ఒక పెను తుఫానుకు విరిగిపోవచ్చు. కాని భూమిలో దాగివున్న వేర్ల సంగతేమిటి? ఆ వేర్లను పోషించే పీడిక వర్గ, కుల, లింగ భావజాలాన్ని ఎలా అంతం చేసేది? ఇది ఇప్పుడు మొత్తం సమాజం ముందున్న పెద్ద సవాల్. ఈ సందర్భంలో కవులు, రచయితలు, ఆలోచనాపరులు ఇంత కాలం చేసిన కృషి ఒక ఎత్తు అయితే, ఇక ముందు చేయాల్సింది మరో ఎత్తు. ఎందుకంటే భారతీయ సమాజంలో చాపకింద నీరులా ప్రవహిస్తూ వస్తున్న ఫాసిజం ఇప్పుడు ఒక పెను ఉప్పెనై ఎగిసిపడుతుంది. దాని రూపాన్ని, సారాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే కాని మన కలాలను, గళాలను సరిగ్గా గురిపెట్టలేము.
మొన్నటి వరకు పండిత చర్చల్లో హిందుత్వాన్ని (= హిందూరాజ్య స్థాపనే లక్ష్యంగా కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియను) ఫాసిజంగా గుర్తించని మేధావులు సహితం ఇప్పుడు ఫాసిజం మన ముంగిట్లోకి వచ్చిందని ఒప్పుకుంటున్నారు. కేవలం హిందుత్వ శక్తులు కొనసాగిస్తున్న హింసను చూసి మాత్రమే కాదు, ఆ శక్తులు మొత్తంగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న తీరు, నడిపిస్తున్న మార్గం, దాని మూలంగా చీకటి మయం కాబోతున్న భవిష్యత్తును ఊహించి వాళ్ళు ఆ నిర్థారణకు వస్తున్నారు.
హిందుత్వ ఫాసిజాన్ని కేవలం అది కొనసాగిస్తున్న అధికారాన్ని బట్టి మాత్రమే అంచనా వేస్తే దాని స్వరూపం పూర్తిగా అర్థం కాదు. దాని భావాలను, అది సమాజంలో పోగు చేసుకుంటున్న బలాన్ని సరిగ్గా అంచనా వేయాలి. ఫాసిజం కూడా ఒక ఉద్యమంగా మారిన స్థితిని అర్థం చేసుకోవాలి. అది సమాజంలోని అన్ని వర్గాలను, కులాలను తన విష కౌగిలిలోకి తీసుకుంటుంది. ఈ పని చేయడం కోసం హిందుత్వ శక్తులు తమ ఆధీనంలో ఉన్న అన్ని రాజ్య సాధనాలను, ఉన్మాదమూకలను ఉపయోగించి సమాజంలో భయాన్ని సృష్టిస్తున్నారు.
ఒకవైపు భయపెడుతూనే మరోవైపు ప్రజల్లో ఉన్న మతం మత్తును, హిందూ మెజారిటేరియన్ ఆధిపత్య భావనను ఉపయోగించుకొని హిందుత్వంపై భక్తి భావనను కూడా నిర్మాణం చేస్తున్నారు. అసత్యాలను, పుక్కటి పురాణాలను వాస్తవాలుగా, చరిత్రగా ప్రచారం చేసి వాటిని ప్రజల చేత నమ్మించే ఒక సామాజిక స్థితిని తయారు చేస్తున్నారు. ఇటువంటి స్థితిలో ప్రశ్నలకు తావు లేకుండా ఫాసిస్టు శక్తులు చెప్పింది చెప్పినట్లుగా గ్రహించి నిజమనుకునే ఒక పెద్ద సామాజిక సమూహం కూడా తయారయ్యింది. అలాంటి passive complicity ఫాసిజానికి పెద్ద బలం. అంతేకాదు దానిని ఒక సీరియల్ మాదిరిగా నిరంతరంగా కొనసాగించడం మూలంగా తన మాయలో పడిన సమూహాలను అలాగే మత్తులో ముంచి ఉంచే పనిని ఫాసిజం చేస్తుంది. ఈ పనికోసం అన్ని ప్రచార సాధనాలను వాడుకుంటుంది. పెద్ద మొత్తంలో ఒక సైబర్ మూకను (cyber fascists) సహితం తయారుచేసుకుంటుంది.
చరిత్రలో అమలులోకి వచ్చిన ఫాసిస్టు వ్యవస్థలతో పోల్చిచూస్తే హిందుత్వ ఫాసిజం రాజకీయ, సాంస్కృతిక రంగాలలో పనిచేయడం మొదలుపెట్టి అధికారంలోకి రావడానికి దాదాపు వంద ఏండ్లు పట్టింది. అంటే మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఇంతటి సుధీర్గకాలం ఏ ఫాసిస్టు శక్తులు ఉనికిలో లేవు. కాబట్టి దాని బలాన్ని, బలహీనలతను సరిగ్గా అంచనా వేసుకోవాలి. అది ఏ స్థాయిల్లో, ఏ రూపాల్లో ముందుకు నడుస్తుందో అర్థం చేసుకోవాలి.
హిందుత్వ ఫాసిజం ముందుగా ఒక సాంసృతిక ఉద్యమంగా మొదలయ్యింది. కాని అతి త్వరలో దానికి అర్థమయ్యిందేమంటే రాజకీయ రంగంలో ప్రవేశించక పోతే తన హిందూరాష్ట్ర కల నిజం కాదని. దాని దృష్టిలో రాజకీయాలంటే ప్రజల సమస్యలు తీర్చగలిగే ఒక సృజనాత్మక ప్రక్రియ కాదు. హిందూమతాన్ని దేశ ముఖచిత్రం చేయడం. “దేశంలో వుండాలంటే హిందువుగా పుట్టాల్సిందే” అని నినదించడం. అనేక జాతుల నేల ఒక్కటే జాతిగా, ఒక్కటే ఆత్మగా పలకాలని ఒత్తిడి చేయడం. అన్ని అస్తిత్వాలు రద్దు కాబడి అఖండ హిందుత్వ భారత్ గా వెలగాలనుకోవడం.
వాస్తవానికి హిందుత్వ ఫాసిస్టు శక్తులకు వారి లక్ష్యం చాలా స్పష్టంగా వుంది. వలసవాద కాలం నుండి ఇప్పటి వరకు వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద కాని, భావ సంఘర్షణల మీద కాని, సామాజిక పరివర్తనల మీద కాని, మతసామరస్యం మీద కాని ఎలాంటి నమ్మకం లేదు. లేక పోవడమే కాదు వాటన్నింటికి విరుద్ధంగా పనిచేయడమే దాని పని విధానం.
ఇన్ని ప్రతిఘాతక లక్షణాలు వున్నప్పటికి హిందుత్వ ఫాసిజం సమాజంలో ఒక పెద్ద మొత్తానికి తనదైన ఒక కలను సులభంగా అమ్మగలుగుతుంది. వాళ్ళ మెదళ్ళలో తన భావజాలాన్ని నింపగలుగుతుంది. ఆ భావజాలం ఎంత అమానవీయమైనదో, సమాజంలో ఎంతటి హింసను పురిగొల్పుతుందో, ఎన్ని ఉదాత్తమైన భావాలను ధ్వంసం చేయగలుగుతుందో తెలుసుకోలేనంతగా వాళ్ళ మానసిక స్థితిని ఫాసిజం నిర్మాణం చేస్తుంది. సమాజంలో నెలకొన్న అలాంటి రాజకీయ, మానసిక స్థితే హిందుత్వ ఫాసిజం పార్లమెంటరీ రాజకీయాలలో “విజయం” సాధించడానికి తోడ్పడింది.
ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత తన చేతికంది వచ్చిన అన్ని వ్యవస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకుని అన్ని రకాల అసమ్మతులపై అణిచివేత కొనసాగిస్తుంది. హిందుత్వ శక్తులకు కనీసం రాజ్యాంగం మీద కూడా ఎలాంటి విశ్వాసం లేదు. వాళ్ళ దృష్టిలో రాజ్యాంగం ప్రజలకు విపరీతమైన స్వేచ్ఛను కల్పిస్తుంది. అతి స్వేచ్ఛ అరాచకానికి దారి తీస్తుంది అనేది వాళ్ళ వాదన. సరిగ్గా ఇదే విషయాన్ని ముస్సోలిని ప్రకటించి పౌర స్వేచ్ఛను రద్దు చేసి ఫాసిజాన్ని అమల్లోకి తెచ్చాడు. అతిజాతీయవాదమే జాతి గౌరవాన్ని, ఉన్నతిని కాపాడుతుందని భావించాడు. అదే ఫార్ములాను హిందుత్వ శక్తులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు.
అయితే హిందుత్వ శక్తులు ఇప్పటికి ఇప్పుడుగా రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసే సాహసం చేయకపోవచ్చు. ఆ అవసరం కూడా వాళ్ళకు లేదు. కాని తమ లక్ష్యసాధనకు అవసరమైనంత వరకు రాజ్యాంగ మార్పులు చేసుకుంటాయి. నిజానికి రాజ్యాంగ పరిధిలోనే తమ ఫాసిస్టు విధానాలను అమలుపరుచుకునే సౌలభ్యం రాజ్యాంగమే కలిపిస్తుంది. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించింది కూడా రాజ్యాంగబద్దంగానే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణా ఉద్యమం ఫాసిజాన్ని ఎదురుకొనడానికి పెద్దగా పనికొచ్చే రాజకీయ ఎత్తుగడ కాదు.
అన్నింటినీ మించి ఫాసిజం తాను కొనసాగించాలనుకునే హింస కోసం ఎప్పుడూ పోలీసు లేదా మిలిటరీ యూనిఫార్మ్ వేసుకొని వెళ్ళదు. ఆ పనులు చేయడానికి రాజ్య సహకారంతో దాని బయట వుండి పని చేయగల ఒక ఉన్మాదమూకను (vigilante groups) తయారుచేస్తుంది. కాషాయం కప్పుకుని తిరిగే ఆ మూకలను దేశవ్యాప్తంగా “అల్లర్ల” పేరిట జరిగిన హింసాత్మక ఘటనలలో చూశాము. ఈ మూకలే తమతో అంగీకారం లేని అన్ని సామాజిక సమూహాల మీద దాడులు చేయడం, అంతం చేయడం చేస్తున్నాయి. తాము చేస్తున్న దుర్మార్గాలను గర్వంగా ప్రకటించుకుంటున్నాయి. ఈ అనధికార రాజ్య మూకలను రాజ్యాంగ పరిధిలోని ఏ వ్యవస్థ ఏమి చేయలేదనే విషయం రాజ్యాంగం వైపు అమాకాయంగా చూసే బుద్ధిజీవులకు ఇప్పటికైనా అర్థం కావాలి. ప్రజలకు చట్టప్రకారం నడుచుకోవాలని చెప్పే రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలు ఈ ఫాసిస్టు మూకల విషయంలో నోరు మెదపకపోవడమో లేదా సుతి మెత్తగా మాట్లాడడం అంటేనే ఫాసిజం వ్యవస్థీకృతం కావడం. ఈ మూకలు భవిష్యత్తులో మరింతగా బలపడి విజృంభించే అవకాశం లేకపోలేదు. దీర్గకాలంలో ఫాసిజానికి భౌతిక శక్తిగా మారేది ఈ మూకలే.
హిందుత్వ ఫాసిజం కేవలం భావజాలాన్ని, బలాన్ని మాత్రమే ఉపయోగించుకోవడం లేదు. అది భూస్వామ్య, పెట్టుబడిదారి వర్గాలతో ఉన్న పేగు సంబంధాన్ని ఇంకా బలపరుచుకుంటుంది. దానికి స్వదేశీ నినాదం కూడా ఒక రాజకీయ ఎత్తుగడనే. అంతకు మించి మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండని “మేక్ ఇన్ ఇండియా” కార్డ్ తో జోలె కట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న హిందుత్వ శక్తులకు నిజాయితీ లేని స్వదేశీ విధానం ఒక భారమయిపోయింది. అందుకే వాళ్ళు స్వదేశీ నినాదాన్ని కూడా మరుగున పడేశారు. నయాఉదారవాద పాలసీలను (అన్నింటిని ప్రైవేటీకరణ చేయడం, పెట్టుబడులపై నియంత్రణ తొలిగించడం, ప్రతిదాన్ని సరుకుగా మార్చడం, ప్రపంచ మార్కెట్ కు ద్వారాలు బార్లా తెరిసిపెట్టడం…) అమలు చేయడంలో కాంగ్రెస్ లాంటి బూర్జువా పార్టీలను సహితం అధిగమించారు. ఒకవైపు విదేశీ పెట్టుబడులకు ఎర్ర తివాచీ పరుస్తూనే మరోవైపు అదానీ, అంబానీ వంటి దేశీయ కారోపోరేట్లకు దేశ వనరులను దారాదత్తం చేస్తున్నారు. వీటి మూలంగా ఫాసిజమంటే అతిబూర్జువా వాదం అని మరోసారి రుజువవుతుంది.
మొత్తంగా రాజకీయ, ఆర్థిక, సాంసృతిక (భావజాల) రంగాలలో ఫాసిజం తన పట్టు బిగిస్తూ సమాజాన్ని తిరోగమన మార్గంలో నడిపిస్తుంది. తన పయనానికి అడ్డుతగిలే అన్ని రాజకీయ శక్తులను అణిచివేస్తుంది. దానికి తన దగ్గరున్న ఒకే ఒక బలమైన ఆయుధం “దేశద్రోహులు” అనే ముద్ర. హేతువుగా ఆలోచిస్తే, పీడనను ప్రశ్నిస్తే, న్యాయమడిగితే, లౌకికవాదమంటే, సమానత్వమంటే దేశద్రోహుల జాబితాలో చేరిపోతాము. దీని మూలంగా ఎక్కువగా హింసకు గురయ్యేది పీడిత వర్గాలు, కులాలు, జాతులు, లింగాలు, మతమైనారిటీలు. వీళ్ల కోసం గొంతెత్తే ఎవ్వరిపై అయినా దేశద్రోహుల ముద్ర పడుతూనే వుంది. ఇది పదే పదే రుజువవుతూనే వుంది.
ఈ దేశద్రోహులు అని ముద్ర వేసే వ్యవహారం అంతకు ముందున్న బూర్జువా పార్టీలు మొదలుపెట్టినా మోడీ ప్రభుత్వం దాన్ని ఒక స్టాండర్ద్ పాలసీగా అమలుచేస్తుంది. దానిని అర్బన్ నక్సల్స్ తో మొదలు పెట్టి పౌరసమజాన్ని భయబ్రాంతులకు గురిచేద్దామనుకుంది. కాని దాని కుట్రలు బట్టబయిలయ్యాయి. ఇక అందోళన చేసే ప్రతిఒక్కరు (అందోళనజీవులు), ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి గొంతుక రాజ్యంపై కుట్రచేస్తున్నట్లే అని నిసిగ్గుగా ప్రకటిస్తున్నారు. ఆందోళనాజీవులలో “పవిత్ర అందోళనాజీవులు” వేరయా అని కూని రాగాలు తీస్తున్నారు. “పవిత్రత” అనే భావం ఎట్లా అణచివేతలో భాగమో తెలివితక్కువగా బయటకు చెప్పేస్తున్నారు.
ఇప్పుడు హింసను కేవలం విప్లవకారులు, విప్లవ సానుభూతిపరుల మీదనే కాదు, గొంతున్న ప్రతి ఒక్కరి మీద అమలు చేస్తున్నారు. అది గాంధియన్లు, అంబేడ్కరైట్లు, పర్యావరణవాదులు ఎవరైనా కావచ్చు. హిదుత్వ ఫాసిస్టులను వేలెత్తి చూపే వాళ్ళందరి చేతులకు సంకెళ్ళు వేస్తున్నారు. బహుశా రేపు వాళ్ళ చర్యలను కీర్తించక పోయినా హింస తప్పదేమో. మాతో లేవంటే మా శతృ శిభిరంలో వున్నట్లే అనే ఒక దుర్మార్గపు విధానం అమలులోకి వస్తుంది.
ఇదంతా జరుగుతుంటే ప్రపంచం చూసి నవ్వుతుందని, ఇజ్జత్ పోతుందని “మా అంతర్గత వ్యవహారాలలో” జోక్యం చేసుకోవద్దని మేకపోతు గాంభీర్యంతో ప్రపంచం వైపు మళ్ళి ప్రకటనలు చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI= Foreign Direct Investments) తొక్కిన గడప తొక్కకుండా ప్రపంచమంతా తిరిగి ఇప్పుడు అదే విదేశాలలో ఉన్న ప్రజాస్వామిక శక్తులు భారతదేశంలో కొనసాగుతున్న ఫాసిస్టు హింసను ఎత్తిచూపితే దానిని కొత్త FDI (Foreign Destructive Ideology)గా నామకరణం చేసి సరికొత్త కుట్రకు తెరలేపుతున్నారు.
ఎన్ని కుట్రలు చేసినా, సమాజాన్ని ఎంత విచ్ఛిన్నం చేయ చూసినా ప్రజలు పోరాట మార్గాన్ని వదలడం లేదు. దానికి నిలువెత్తు నిదర్శంగా మొన్న CAA కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలను చూశాము. ఇప్పుడు కొనసాగుతున్న రైతాంగ ఉద్యమాలను చూస్తున్నాము. ఈ ఉద్యమాలన్నీ ప్రజా బలాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి. అంతేకాదు వివిధ అస్తిత్వాలను, రాజకీయ వైరుద్యాలను సెకండరీ చేసి ఫాసిస్టులతో తలబడటమే ప్రధానంగా గొప్ప స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నాయి. పౌరసమాజంలో ఆ ఉద్యమాలు ఇచ్చే ఇత్తేజాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. ఆ ఉద్యమాల సాధికారతను దెబ్బతీసే అన్ని ఫాసిస్టు ప్రయత్నాలను ఉద్యమకారులు, ప్రజలు ఎంతో సృజనాత్మకంగా తిప్పికొడుతున్నారు. రాజ్యం చివరికి నవ్వుల పాలు అయ్యేటట్లు చేస్తున్నారు. కాని ఫాసిస్టుల ఓటమీని ఒక్క సంఘటనతో రూఢీ చేయలేము. దాన్ని ఓడించడానికి దీర్ఘకాల రాజకీయ, సాంస్కృతిక కృషి చేయాల్సివుంది.
ఈ సందర్భంలో కవులు, కళాకారులు, రచయితలు, బుద్ధిజీవులు తమ మధ్య వుండే వివిధ వైరుధ్యాలను గుర్తిస్తూనే ప్రధాన శతృవైన ఫాసిజాన్ని ఒంటరి చేయడానికి, ఎదుర్కొనడానికి ఐక్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చింది. దీనిని సరిగ్గా గుర్తించకపోతే మనం భవిష్యత్త్ తరాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. రేపటి కాంతుల కోసం ఈనాటి చీకటితో రాజీలేని పోరాటం అనివార్యమవుతుంది. చరిత్ర ఇదే చెబుతుంది. నిర్దేశిస్తుంది. ఇది అందోళనాజీవుల కాలం. ఉద్యమిస్తే ఫాసిస్టుల పతనం ఖాయం.