ఢిల్లీలో నార్త్ బ్లాక్లో ఉన్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కథలు రాయడంలో తలమునకలైంది. రచయితలు చేయాల్సిన పనిని అది తలెకెత్తుకున్నది. రచయితలనేమో దేశద్రోహులుగా బందీలను చేస్తుంది. ఇప్పటికే భీమాకొరేగాం లాంటి పెద్ద కల్పిత కథను సృష్టించింది. రైతాంగ ఉద్యమం, సిఏఏ సందర్భంలో కూడా కల్పిత కథలు ప్రచారం చేసింది. ఈ సారి అది తెలుగు రాష్టాల ప్రజా సంఘాల కోసం పాత కథనే తిప్పి రాస్తుంది. మార్చి 31 2021 న సాయంత్రం 4 – 5 గంటల మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్ల మీద ఎన్ఐఏ దాడులు చేసింది. వీరిలో విరసం కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి, పాణి, పౌరహక్కుల సంఘం నాయకులు రఘనాథ్, చిలుకా చంద్రశేఖర్, మున్నా తల్లి శిరీష, కళాకారుడు డప్పు రమేష్ , చైతన్య మహిళా సంఘం శిల్ప , దేవేంద్ర, స్వప్న సింహాచలం ఐఏపిఏల్, జాన్ ప్రజా కళామండలి, హెచ్ఆర్ఎఫ్ క్రిష్ణ, కె.పద్మ, వివి బాలకృష్ణ (లాయర్ విశాఖ), అరుణ , దేవేందర్ పిడిఎం, వై. వెంకటేశ్వర్లు, కృష్ణ, కోదండం, నీలకంఠు ఉన్నారు. కుల నిర్మూలన పోరాటసమితి కృష్ణ ఇంట్లో లేకపోవడంతో ఇంటి తాళాలు పగలగొట్టి మరి సోదాలు చేశారు. వీరేకాక ఇప్పటికే అరెస్టు కాబడిన ప్రజాకళామండలి కోటి, చైతన్య మహిళా సంఘం రాజేశ్వరి, అమరుల బంధు మిత్రుల సంఘం అంజమ్మ, కొండారెడ్డి, క్రాంతి, అన్నపూర్ణ, దుడ్డు ప్రభాకర్, దుద్దుకూరి శ్రీను ఇళ్ల మీద కూడా సోదాల పేరుతో దాడులు జరుగాయి. ఇప్పటివరకు ఇరవై ఆరు మంది ఇళ్లపై దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. మరికొంత మంది సమాచారం అందాల్సి ఉంది.

23 నవంబర్ 2020 లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా ముంచింగ్ పుట్టు దగ్గర నమోదు అయినా కేసులో ఈ సోదాలు జరిపారు. పాంగి నాగన్న అనే జర్నలిస్టును నవంబర్ 23, 2020 న పోలీసులు మావోయిస్టుల కోసం పని చేస్తున్నాడంటూ అరెస్టు చేశారు. ఆ కేసులో సుమారు మొదట 64 మందిని నిందితులుగా చేర్చారు. ఆ తరువాత మరో ఇరవై మందిని కూడా ఇరికించారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాసంఘాలు నాయకులూ 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వెంటనే మరుసటి రోజున పిడుగురాళ్లలో మరొక కేసు పెట్టారు. ఈ రెండు కేసులలో ఇప్పటికే పది మంది ప్రజా సంఘాల నాయకులూ నాలుగు నెలలుగా విశాఖపట్నం, గుంటూరు జైళ్లలో నిర్బంధంలో ఉన్నారు. అరెస్టు కాకుండా ఉన్న ప్రజా సంఘాల నేతలు ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లారు. తమ పై తప్పుడు ఆరోపణలతో ఈ కేసులు పెట్టినట్టు వాదిస్తున్నారు. సుమారుగా మూడు నెలలుగా దీని మీద వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఆరోపిస్తున్నటు ప్రజా సంఘాలను మావోయిస్టు అనుబంధ సంఘాలుగా ఎలా అంటున్నారని కోర్టు ప్రశ్నించింది. దీని మీద వివరణ ఇవ్వాలని మార్చి మొదటి వారంలో ఆదేశించింది. ఇంతలో మార్చి 5, 2021 న ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి దర్యాప్తు చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 7 న ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ కాబడింది. కేసుకు సంబంధించి నిన్న, ఈ రోజు కోర్టులో వాదనలూ కూడా జరిగాయి. వాదనలకి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. ఈ లోపే ఎన్ఐఏ దాడులు చేసింది. వీరిలో ఈ కేసులు వాదిస్తున్న ఐదుగురు లాయర్లు కూడా ఉన్నారు. భీమా కోరేగాం కేసు ఎలాగైతే రాత్రికి రాత్రే ఎన్ఐఏకు బదిలీ కాబడిందో ఈ కేసు కూడా అలాగే బదిలీ చేయబడింది. ఎప్పుడు కోర్టుల్లో కేసులు ఓడిపోతాం అని అర్ధమవుతుందో అప్పుడు కేసులు ఎన్ఐఏకు బదిలీ అవుతాయి. మళ్ళీ విచారణలు, తనిఖీల పేరుతో కొత్త కథలు పుట్టుకొస్తాయి. మరికొంత మంది నిందితులుగా చేర్చబడతారు. మళ్ళీ విచారణ పేరుతో సాగదీత మొదలవుతుంది. మనుషులు బంధీలుగా మారుతారు.

సుమారు సాయంత్రం నాలుగు , అయిదు గంటల సమయానికి రెండు రాష్ట్రాలలో ఈ దాడులు మొదలయ్యాయి. లోకల్ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ పోలీసులు సోదాలు చేశారు. సోదాలు చేయడానికి వెళ్లిన పోలీసుల రెండు నల్ల బ్యాగులను ఇళ్లలోకి తీసుకువెళ్లారు. ఆ బ్యాగులలో ప్రజా సంఘాల వారిని నిడితులుగా ఇరికించడానికి అవసరమైనవి తీసుకెళ్లారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తల్లులను, తండ్రులను, పిల్లలను అరెస్టు చేసి అక్రమ నిర్బంధంలో ఉంచిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు వారి రక్త సంబధీకులను భయాందోళనకు గురి చేస్తున్నారు. మీరు మాట్లాడితే ఇల్లు సీజ్ చేసి మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ బెదిరించారు. కరోనా పేరుతో వాళ్ళని ఇప్పటికే కలవకుండా చేసిన రాజ్యం అదనంగా ఇప్పుడు ఈ రకంగా కూడా హింసకు గురి చేస్తుంది.

కేంద్రంలో అధికారంలోకి ఉన్న భాజపా ప్రభుత్వం 2018 సంవత్సరంలో ఎన్ఐఏ పరిధిలోకి మావోయిస్టు సంబంధిత కేసులను తీసుకువచ్చింది. దానికి ప్రత్యేకంగా అధికారులను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి కాకుండా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఇది పని చేస్తుంది. భీమా కోరేగాం కేసు మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉండగా మోపబడిన కుట్ర కేసు అది. మహారాష్ట్రలో ప్రభుత్వం మారి అనేక నిరసనల ఫలితంగా మళ్ళీ దర్యాప్తు చేస్తామనగానే కేంద్ర ప్రభుత్వం ఆ కేసు ఎన్ఐకు బదిలీ చేసింది. భీమా కోరేగాం కేసులో ఇప్పటికే 16 మంది మేధావులను, రచయితలను బంధించింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అదే రీతిలో తప్పుడు కేసులు పెట్టి విచారణలో నిలబడవు అనుకున్న సమయంలో ఎన్ఐఏ కు అప్పగించింది. సిఏఏ , రైతాంగ ఉద్యమాల సమయంలోను ఇదే పని చేసింది.

దేశంలో నానాటికి తీవ్రమవుతున్న భాజపా ప్రభుత్వపు ఫాసిస్టు చర్యల ఫలితమే ఈ దాడులు. గత ఏడేళ్ల కాలంలో దేశంలో అసమ్మతి గళాలపై ఈ దాడులు పెరిగిపోయాయి. హత్యలు మొదలు కుట్ర కేసుల వరకు ఇది కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ఈ కేసుల్లో అరెస్టు కాబడిన వారు, నిందితులుగా పేర్కొనబడ్డ వారు అంతా కూడా ఆదివాసీ, దళిత మైనారిటీల కోసం మాట్లాడుతున్న వారే. అణిచివేతకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నవారే. వారి మీదనే ఈ దాడులు జరుగుతున్నాయి. భిన్నమైన ఆలోచనలు కలిగి ఉండటమే వీరు చేసిన నేరం. ఈ గొంతులను కాపాడుకోవడమే మనముందున్న లక్ష్యం. ఆ వైపుగా మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

(మార్చి 31 సాయంత్రం 4 గంటల నుండి ఏప్రిల్ 1 అర్ధరాత్రి 2:30 వరకు కూడా సోదాలు జరిగాయి)

Leave a Reply