(డానియల్ అడుగుతున్నాడు.. మా ఊరి మహిళకు న్యాయం జరిగిందా? అని. న్యాయం అంటే ఏమిటని అమరుడు డానియల్ మనలను నిలదీస్తున్నాడు.. ఈ రోజు ఆయన కూడా లేకపోవచ్చు.. బాధిత మహిళల్లో కొందరు మరణించి ఉండవచ్చు.. కానీ వాళ్ళ కన్నీరు, దుఃఖం , నెత్తురు, అమరత్వం మనలను నిలదీయడం లేదా? న్యాయం అంటే ఏమిటో చెప్పమని ..18.11.2016 (virasam.org లో ప్రచురి తమైన ఈ వ్యాసం పాఠకుల కోసం.. వసంత మేఘం టీం)
విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు. బాక్సైట్ నిక్షేపాల ద్వారా ప్రతి సంవత్సరం 8 వేల కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయని కూడా ప్రభుత్వ అంచనా. రెండు దశల్లో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించి బాక్సైట్ నిక్షేపాలు వెలికితీయాలనేది ప్రణాళిక. అదే జరిగితే మొదటి దశలో 80, రెండో దశలో 185 గ్రామాల్లోని దాదాపు 26వేల మంది ఆదివాసీలు నిర్వాసితులవుతారు. అడవి మీదే ఆధారపడి జీవనం సాగించే ఆదివాసీ ప్రజలు ప్రభుత్వ ఈ యోచనను ఆది నుంచీ వ్యతిరేకిస్తున్నారు. తీవ్ర ప్రతిఘటననూ ప్రదర్శిస్తున్నారు. ఆ మన్యం పోరులోని ఒకానొక పల్లే వాకపల్లి.
అక్కడ బాల్యం భయంలో… యవ్వనం నిర్బంధంలో గడిచిపోతుంది. ఇంటి నుంచి బయటకెళ్లిన పిల్లలు తిరిగి వస్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూకలు… కత్తులు జులిపిస్తాయి. స్కూలు నుంచి వచ్చే పిల్లల్ని నక్సలైట్లంటూ నిర్భందిస్తాయి. వైద్యానికి వెళ్లే వృద్దున్ని మావోయిస్టు కేసులో నిందితుడిని చేస్తాయి. అవును.. మన్యం అటవీ ప్రాంతంలో నెలకొన్న దుస్థితి ఇది. విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం, నుర్మతి గ్రామ పంచాయతీ పరిధిలో వాకపల్లి గ్రామం ఉంది. ఊర్లో పాతికకు పైగా కుటుంబాలు జీవిస్తుంటాయి. వాళ్లంతా కోందు ఆదివాసీ తెగకు చెందిన వాళ్లు. నిత్యకృత్యంగా మారిన పోలీసు పదఘట్టనల నడుమ ఆ పల్లె ప్రతిఘటిస్తూనే ఉంది.
పచ్చని అడవి నడుమ పరుచుకున్న పల్లె అది. కొండ కోనల నడుమ కట్టుకున్న గూళ్లు అవి. ప్రకృతే ఆదెరువుగా జీవిస్తున్న ప్రజలు వాళ్లు. వాళ్లు.. కల్మషమెరుగని ఆదివాసీలు. వాళ్ల జీవితాల్లో ఒక ఉదయం కల్లోలం రేగింది. ఖాకీ బూట్ల చప్పుళ్లతో తెల్లారింది పల్లె. ఎదపై తుపాకీ మోపి… ఆమెను వివస్త్రను చేశారు. తోడేళ్లలా పడి అత్యాచారం చేశారు. ఒక్కరు కాదు… ఇద్దరు కాదు…. పదకొండు మందిపై జరిగిన అకృత్యం అది. కట్టుకునే బట్టలు, తిండి గింజలు, భూమి పట్టాలు అన్నీ ధ్వంసం చేశారు. ఇళ్లకు నిప్పు పెట్టారు.
మొత్తం దేశాన్నే కదిలించిన ఘటన. సాధారణ వ్యక్తులు ఇలాంటి దురాగతానికి పాల్పడితే… పోలీసుల్ని ఆశ్రయిస్తారు ప్రజలు. కానీ పోలీసులే నిందితులైతే ఎక్కడికెళ్తారు. అయినా… వాళ్లు మౌనం వహించలేదు. అడవి నుంచి హైదరాబాదు దాకా వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచం ముందు వెళ్లగక్కారు. అత్యాచారానికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానీ కూంబింగ్‌ని అడ్డుకునేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారంటూ ఎదురు ఆ మహిళలపైనే కేసులు మోపేందుకు యత్నించారు పోలీసులు. చివరకు అత్యాచారం జరిగింది నిజమో, కాదో తేల్చడానికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయినా… అధికారం, అంగ బలం ముందు వాళ్ల గోడు ఎవరికీ పట్టలేదు.
బడికి వెళ్లాల్సిన పదిహేనేళ్ల కుర్రాడు కళ్లలో కసి నింపుకొని చూస్తున్నాడు. ఆడబిడ్డల ఆర్తనాదాలు వింటున్నాడు. ఏమీ చేయలేని నిస్సాహయత. ఉబికిన కన్నీరు వెంటే కత్తులు మొలిచాయి. కొత్తదారేదో ఆహ్వానం పలికింది. అటు వైపు పడిన అడుగులు… మళ్లీ వెనుదిరగలేదు. యుద్ధగీతమాలపిస్తూ కదిలిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక్క వాకపల్లి కాదు… అలాంటి పల్లెలెన్నో తనని దరికి చేర్చుకన్నాయి. తల్లులెందరో ఒడికి చేర్చుకున్నారు. బడిలో వదిలిన పాఠాలు అడవిలో పదునెక్కాయి.
ఆదివాసీల హక్కుల కోసం ఆయుధం ఎత్తుకున్న ఆ నవయువకుడే డేనియల్. ఏఓబీ విప్లవోద్యమంలో తనవంతు నెత్తురు దారపోసిన వాడు. ఎనిమిదేళ్ల తరువాత రామగూడ అటవీ ప్రాంతంలో… శత్రువుతో తలపడి హోరాహోరి పోరులో నేలకొరిగాడు. కానీ ఈ ఎనిమిదేళ్లు… తను పోరాటంలో వీరుడిలా నిలబడి ఉన్నాడు. అడవి మీద హక్కు తమదే అని సగర్వంగా చాటుతూ ఆదివాసీ పోరునడిపాడు.
అక్టోబర్ 24న ఆంధ్ర – ఒరస్సా సరిహద్దులో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల్లో డేనియల్ కూడా ఉన్నాడు. టీవీల్లో వార్తలు చూసిన డేనియల్ తల్లిదండ్రులు ఆ మర్నాడు మృత దేహాన్ని తీసుకునేందుకు మల్కాన్‌గిరి వెళ్లారు. ఎనిమిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన బిడ్డను రక్తపు ముద్దగా చూసిన తల్లిదండ్రుల నోట మాటరాలేదు. చిద్రమైన దేహం… తలపై, యదలో అతి దగ్గరగా కాల్చిన గుర్తులు. విరిగి వేలాడుతున్న చేతులు. తమ చేతుల్లో పెరిగిన బిడ్డను మాంసపు ముద్దగా చూసిన ఆ తల్లి దండ్రులు బోరున విలపించారు. ఎట్టకేలకు మృతదేహాన్ని తీసుకొని వాకపల్లికి పయనమయ్యారు.
దారి మధ్యలో కాచుకు చూర్చున్న పోలీసులు. అంబులెన్సుకు అడ్డంగా వాహనాలు పెట్టి, తుపాకులు గురిపెట్టారు. వెనక నుంచి ముప్పై మంది పోలీసులు వచ్చి అంబులెన్సును చుట్టుముట్టారు. తుపాకులు పేలడమే తరువాయి… అన్నట్లు వాతావరణం. తమ బిడ్డ మృతదేహాన్ని తెచ్చుకుంటున్నామన్నా వినలేదు. ఊరు, పేరు, ఆధారాల పేరుతో హడావిడి చేశారు. నానా తిప్పలు పడి… అర్థరాత్రికి డేనియల్ మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకు వచ్చారు. మర్నాడు వందలాది మంది ప్రజలు విప్లవ సాంప్రదాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.
కానీ డేనియెల్ ఆ పల్లె ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాన్ని అణిచి వేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం ఇక్కడ విప్లవోద్యమాన్ని నిర్మూలించడమే ఏకైక మార్గమని తలచింది. అందుకే… కోవర్టు కుట్రల ద్వారా విప్లవోద్యమంపై దొంగ దెబ్బకు దిగింది. తమ కొడుకు పోలీసులు పట్టుకొని కాల్చిచంపారని, డేనియెల్‌తో పాటు మరో ముగ్గురు నిరాయుధులైన ఆదివాసీ మహిళలను సైతం పాశవికంగా హత్య చేశారని డేనియల్ తల్లిదండ్రులు చెబుతున్నారు.
కూంబింగ్ పేరిట పోలీసులు చేస్తున్న దాష్టికాలకు సజీవ సాక్ష్యం వాకపల్లి. అలాంటి పల్లెలు ఇవాళ అనేకం కనిపిస్తాయి మధ్యభారతంలో. బస్తర్‌లోని ప్రతి పల్లె ఒక వాకపల్లి లాంటిదే. అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమైన స్థితి నేడు నెలకొంది. అయినా… వాళ్లు తమ పోరాటాన్ని వీడడం లేదు. జల్ – జంగల్ – జమీన్ – ఇజ్జత్ కోసం గొంతెత్తూనే ఉన్నారు. ఏఓబీలోనూ… బాక్సైట్ వెలికితీసేందుకు ఒప్పుకోని ఆదివాసీలు దశాబ్ధకాలంపైగా పోరాటాలు చేస్తునే ఉన్నారు. ఈ పోరాటం మున్ముందు కూడా కొనసాగుతుంది. ఆ పోరాటాల్లో డేనియల్ సజీవం ఉంటాడు.
18.11.2016 (virasam.orgలో ప్రచురితం)
డేనియల్