‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం..

– వసంతమేఘం టీం )

విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది. ప్రజల తరపున పోరాడుతున్న విప్లవకారుల త్యాగాల పరంపరకు జోహార్లు చెబుతున్నది.  రాజ్యహింసను ఎదిరిద్దామని, ఆపరేషన్‌ ‌గ్రీన్‌హంట్‌ను ఓడిద్దామని నినదిస్తున్నది. ఆ హోరులో వాకపల్లి పేరు వినడంతోనే గతమంతా గుర్తుకు వచ్చింది. 

ఆ బాధిత మహిళలు ఎలా ఉన్నారో? అనిపించింది. బాలక్రిష్ణను అదే అడిగాను. 

ఆయన అక్కడి నిర్బంధం గురించి చెప్తూ ఎల్లుడి పొద్దున్నే బయల్దేరాలి అని  పోగ్రాం కూడా ఇచ్చేశాడు. 

ఎందుకంటే ఆ మర్నాడు మావోయిస్టులు కా.  అజాద్‌, ఆనంద్, కమల బూటకపు ఎన్ కౌఓటర కు నిరసనగా బంద్ కు పిలుపు ఇచ్చారు. అందువల్ల మే 17వ తేదీ ఉదయాన్నే బయల్దేరాం.  

వాకపల్లి అనగానే ఎవరికైనా 2007 ఆగస్టులో 11 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అత్యాచారం  చేసిన దుర్మార్గ ఘటన గుర్తుకు వస్తుంది. విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఊరు ఉంది. నక్సలైట్ల కోసం కూంబింగ్‌ ‌వెళ్లిన  పోలీసులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. 

పట్టణ ప్రాంత మహిళలపై అత్యాచారం జరిగితేనే  కేసు నమోదు కావడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. అట్లాంటిది లోతట్టు ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరిగితే, అదీ పోలీసులే చేస్తే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. మన భాషరాని ఆదివాసీ మహిళలు  హైదరాబాదుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎంత ఇబ్బందిపడతారో మనం ఊహించడం కూడా కష్టమే.. అంగబలం, అర్థబలం ఉన్న ప్రభుత్వం ఈ మహిళల పోరాటాన్ని దెబ్బతీయడానికి చేయాల్సిన దుర్మార్గ ప్రయత్నాలన్నీ చేసింది. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అండగా ఉండటం వల్ల కొంత ఫలితం కనిపించింది. .

నిజంగా ఇది విజయమేనా? పోలీసుల మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోరాటం జరిగింది. తమ మీద కేసు పెట్టకూడదని పోలీసులు సర్వశక్తులు ఒడ్డారు. 

కూబింగ్‌ ఆపడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, బాధిత మహిళలను కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి.  వాకపల్లి ఆదివాసులు పెద్ద ఓటు బ్యాంకు కాదు కాబట్టి ఏ బూర్జువా పార్టీ కూడా బాధితులను పట్టించుకోలేదు. 

అయితే.. పోలీసులు కాకపోతే ఈ అత్యాచారం ఎవరు చేశారో నిరూపించుకోవాల్సిన స్థితిలోకి ప్రభుత్వం పడిపోయింది. మొత్తం మీద కేసు నమోదైంది. 21 మంది ఈ సంఘటనలో నిందితులు కాగా, సెంట్రీ డ్యూటీలో ఉన్నారని 8 మంది మీద కేసు కొట్టేశారు. 13 మంది మీద కేసు పాడేరు ట్రయల్‌ ‌కోర్టులో విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పు మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నది. అయినా ఆదివాసీ మహిళలు అక్కడికి ఓ చిన్న విజయం సాధించినట్లే అని కొందరైనా  అనుకున్నారు. వప్తవానికి వాకపల్లి మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదు. కేసు నమోదు కావడం తప్ప ఒరిగిందేమీ లేదు.  

ఈ కేసులో ఎ1 ముద్దాయి అయిన ఎ. రవికుమార్‌ ‌పదోన్నతి కూడా పొందాడు. 

తొమ్మిది ఏళ్లు గడిచిపోయాయి. 

వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్‌ఘడ్‌లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు చేస్తున్నవే.  కోర్టులు, కేసులకు అక్కడ  అవకాశం లేదు.  ప్రజలు తమకు వీలైన పద్ధతిలో  ప్రతిఘటిస్తున్నారు. వాళ్ల పక్షాన పోరాడుతున్న ప్రజాస్వామికవాదుల మీద తీవ్రమైన నిర్బంధం ఉంది. విద్యావంతురాలైన ఆదివాసీ మహిళగా తమ జాతి మహిళల కోసం పోరాడుతున్న సోనీసోరీ మీద పోలీసులు దాడులు చేస్తున్నారు. 

 ఇటీవల అక్కడ అనేక రకాలుగా పోలీసు వేధింపులు పెరిగిపోవడంతో మళ్లీ వాపకల్లి  వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత వాకపల్లిలో ఏం జరుగుతోందో తెలుసుకునే పరిస్థితి మళ్లీ కలగడానికి కూడా కారణం పోలీసుల నిర్బంధమే. 

అందుకే నాలుగు ప్రజా సంఘాల ప్రతినిధులు ఎనిమిది మందితో ఈ నిజ నిర్ధారణ కమిటీ ప్రయాణం. 

తొమ్మిది గంటల కల్లా వాకపల్లి చేరుకున్నాం. ఊరి దగ్గర వాహనం ఆపి నిటారుగ ఉన్న  రోడ్డు మీది నుంచి వాకపల్లి గ్రామంలోకి వెళ్లాం.   మా పక్క నుంచి రెండు స్కూటర్లపై ఆదివాసీ యువకులు రయ్‌ ‌మంటూ పైకి వెళ్లిపోయారు. 

ఆ స్పీడ్‌కు నేను ఆశ్చర్యపోయి చూస్తోంటే … వీళ్లకు కనుక బైక్‌ ‌రేస్‌ ‌పెడితే ఫస్టు వస్తారు.. అని బాలక్రిష్ణ అన్నాడు. 

నిస్సందేహంగా.. అన్నాను. 

 గ్రామం మధ్య నుంచి అడవిలోకి సిమెంట్ రోడ్డు చీల్చుకుంటూ వెళ్లిపొయిది. ఊళ్లోకి వెళ్లడానికి ముందే ఎడమ చేతి వైపు ఓ సిమెంట్‌ ‌దిమ్మెకు జోడు పంపులు ఉన్నాయి. దానికి కనెక్షన్‌ ఎక్కడుందోగాని వాటి నుంచి నిరంతరం నీళ్లు వస్తాయట. 

 లాయర్‌ ‌ముందుగా సమాచారం ఇచ్చినందు వల్ల ఈ మధ్య పోలీసుల వేధింపులకు గురైన యువకులు, వాళ్ల కుటుంబ సభ్యులు కొద్ది మంది వచ్చారు. వాళ్లు చెప్పిన దాని ప్రకారం…

ఆ మధ్య నలుగురు యువకులు రెండు మోటారు సైకిళ్ల మీద మండల కేంద్రానికి  ఉపాధి పనికి సంబంధించిన మస్టర్లను ఈ సేవ కేంద్రంలో చెక్‌ ‌చేసుకోడానికి వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు కూంబింగ్‌ ‌పోలీసులు వాళ్లను నిలబెట్టి ఏ వూరని అడిగారు. వీళ్లు తమది వాకపల్లి అని చెప్పారు. ఏ కులం అని అడిగారు. 

వీళ్లు తాము కోందులమని చెప్పారు.

అట్లయితే పక్కన నిలబడండిరా అన్నారు పోలీసులు. ఆ తర్వాత వాళ్ల మోటారు సైకిళ్లు లాక్కొన్నారు. ఆధార్‌ ‌కార్డులు తెచ్చి చూపించమన్నారు. 

ఇంత రాత్రి ఊరికి వెళ్లి రావడం కష్టమని ఆ యువకులు చెప్పారు. 

దానికి ఓ మోటారు సైకిల్‌ ఇచ్చి నలుగుర్ని వెళ్లమన్నారు. 

నలుగురం ఎట్ల పోతాం? అయినా నలుగురు ఒక బండి మీద పోతే మీ పోలీసులే కేసు పెడతారు కదా? అని వాళ్లు అడిగారు. 

ఎక్కువ మాట్లాడితే ఎన్‌కౌంటర్‌ ‌చేస్తం.. అని పోలీసులు బెదిరించారు. అట్ల ఆదివాసులను భయపెట్టడం వాళ్లకు మామూలేనట. 

మొత్తం మీద నలుగురు ఒకే బండి మీద ఆ ఘాట్‌ ‌రోడ్డులో ఇండ్లకు చేరుకున్నారు. తెల్లారి రేషన్‌ ‌కార్డులు, ఆధార్‌ ‌కార్డులు, పాసుబుక్‌లు తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్లారు. 

అవి చూశాక కూడా ఎస్సై డి. శేఖర్‌ ‌రెండో బండి ఇవ్వకుండా మీకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి.. మీ అలియాస్‌ ‌పేర్లు చెప్పండని వేధించాడు. చివరికి వాళ్ల కార్డులన్నీ తీసుకొని, రెండో బండి ఇవ్వకుండానే వెనక్కి పంపించారు. అంతే కాదు, ఇటువైపు ఎప్పుడూ రావద్దని భయపెట్టారు. 

ఇలాంటిదే ఇంకో సంఘటన..

ఒక గర్భిణిని కాన్పు కోసం పాడేరు ఆస్పత్రికి తీసికెళ్లారు. పాప పుట్టి చనిపోయింది. అక్కడే ఖననం చేసి బాలింతను రాత్రి తీసుకరావడం దేనికని కొద్ది మంది అక్కడే ఉండి కొద్ది మంది ఊరికి తిరిగి వచ్చారు. వాళ్లలో కొర్రా శేఖర్, మోహన్‌ను దారిలో పోలీసులు ఆపేశారు. ఈ ఇద్దరికి పాతికేళ్ల వయసు ఉంటుంది. మలేరియాతో బాధపడుతున్నారు. 

వాకపల్లి అని, కోందులమని చెప్పాగానే  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని విపరీతంగా కొట్టి, మోకాళ్ల మీద నిలబెట్టి హింసించారు. ఇదంతా చేసింది సీఐ శ్రీనివాసరావు.

ఇంకో ఘటనలో ఓ గర్భిణిని ఎస్సై కడుపు మీద కొట్టాడు. అయితే అది చూసి భరించలేని మహిళలు తిరగబడి ఆ ఎస్సైని కొట్టారు. 

బాలన్న, సన్నిబాబు అనే యువకులను అక్రమంగా అరెస్టు చేసి వేధించారు. వాళ్ల తల్లిదండ్రులను పిల్చుకొని రమ్మని సర్పంచ్‌కు చెప్పారు. వాళ్లను తీసికెళితే ఆధార్‌, అకౌంట్‌ ‌బుక్స్ ‌తీసుకొని వీళ్లనేగాక ఊళ్లోని ముప్పై నలభై మందిని మిలీషియా సభ్యులుగా చూపించి, వాళ్లనంతా సరండర్‌ ‌చేయిస్తే తలా పది వేలు ఇస్తామని సర్పంచ్‌ ‌మీద ఒత్తిడి తెచ్చారు. 

దీనికి సర్పంచ్ గాని, గ్రామస్తులుగాని  అంగీకరించలేదు

అందుకని వాళ్లలో ఇద్దరి  మీద గంజాయి కేసులు పెట్టారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో గంజాయితోపాటు మావోయిస్టులకు సహకరిస్తున్నామని, అక్కడున్న ఓ ఆశ్రమాన్ని కాల్చేశామని, డాంపర్లను కాల్చేసిన ఘటనలో ఉన్నామని వాళ్లే ఒప్పుకున్నట్లు రాసుకున్నారు. 

ఈ విషయాలేవీ ఆ యువకులకు తెలియదు. ఎఫ్‌ఐఆర్‌లో ఈ ఘటనలపై కేసులు పెట్టినట్లు లాయర్లు చెప్పేవరకూ తెలియదు. తమ మీద గంజాయి కేసు మాత్రమే ఉందనుకున్నారు. ఆరకంగా మావోయిస్టుల పేరుతో అరెస్టు చేయడానికి తగిన పద్ధతిలో ఎఫ్‌ఐఆర్‌ ‌రాశారు. 

ఈ ఊళ్లోని వారంతా నాలుగు ఇంటి పేర్ల వాళ్లే. అప్పట్లో అత్యాచారానికి గురైన మహిళలు పాంగి, వంతల, కొర్ర ఇంటి పేర్లు గలవాళ్లు. ఇప్పుడు వేధింపులకు గురవుతున్న వాళ్లలో కూడా ఈ ఇంటి పేరుగల వాళ్లే. ఈ యువకులంతా ఆనాటి బాధిత మహిళల తోబుట్టువులు, భర్తల తోబుట్టువులు, ఇంటి అల్లుళ్లు. ఇలా చాలా మంది మీద కేసులు బుక్‌ అయి ఉన్నాయి. అడపాదడపా అయినా మండల కేంద్రం వైపు వెళ్లారంటే కేసులు పెట్టడం ఆనవాయితీ అయిపోయింది. 

ఆడపిల్లలకైతే చదువే లేదు. ఈ వేధింపుల వల్ల మగ పిల్లలకు పై చదువులకు అవసరమైన ఆదాయ, తెగ ధ్రువ పత్రాలు తెచ్చుకోడానికి మండల కేంద్రం  పోవాలంటే భయపడుతున్నారు. తమ పిల్లల చదువులు కొనసాగేలా లేదని ఊరి వాళ్లు అన్నారు. 

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆనాటి అత్యాచార బాధిత మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్లకు న్యాయం జరగలేదనే మనకు తెలుసు. కానీ అత్యాచారానికి గురైన వాళ్లుగా వాళ్లు ఇప్పటికీ చాలా ఆవేదనతో  ఉన్నారు. దాని నుంచి ఇప్పటికీ తేరుకోలేదు. వారిలో బార్సో, చిట్టెమ్మ అనే ఇద్దరు మహిళలు అన్నం ఉగ్గబట్టి చనిపోయారు. వీళ్ల మరణం ఎంత విషాదకరం? తమకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ మనోవేదనతో చనిపోతామని నిర్ణయించుకొని ప్రకటించి శుష్కించి చనిపోయారు.  కొత్త వాళ్ల దగ్గరికి వెళ్లాలన్నా, బంధువుల దగ్గరికి వెళ్లాలన్నా అవమానంగా భావించేవారట. జరిగిన అన్యాయం కన్నా.. ఇలా జరిగిందని న్యాయం కోసం రోడ్ల మీదికి వచ్చాక మరింత అవమానంగా బాధపడ్డారట. వాళ్ల తెగలో కూడా వివక్షకు గురయ్యారట. 

మిగతా బాధిత మహిళల మాటల్లో చెప్పాలంటే..

ఇట్ల జరిగిందని బైటికి చెప్పినందుకే తెగ పెద్దల ఆగ్రహానికి గురయ్యాం. దండుగలు కట్టాల్సి వచ్చింది. కూలీ పనులకు పోవడం తప్ప సంతలకు పోవాలన్నా సిగ్గనిపించేది. ఈ మానసిక వేదనతోనే ఆ ఇద్దరు  అన్నం తినలేదు.  కుంగిపోయారు. .. ఏం చేస్తాం.. సిగ్గుతోనే చచ్చిపోయారు.. అన్నారు. 

ఇంతకూ సిగ్గుపడాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా? దానికి మానవత్వం ఎందుకు ఉంటుంది?

మామూలుగా నీ పేరేంది? పెళ్లయిందా? పిల్లలెందరు? అని అడిగితేనే సిగ్గుపడిపోయే ఆదివాసీ మహిళలు అత్యాచార బాధిత గుర్తింపును మోస్తూ బతకడంలోని వ్యథను అర్థం చేసుకోవాల్సిందే. ఇక వాళ్లతో ఏం వివరాలు మాట్లాడగలం? పైగా వాళ్లే .. మాలాగా వాళ్లూ ధైర్యంగా ఉంటే బాగుండేది. కానీ అందరూ ఒకేలా ఉండలేరు కదా? అని కూడా అన్నారు. 

ఆ మాటలు అంటున్నప్పుడు తమకు ఈ వ్యవస్థలో న్యాయం జరగలేదని, తమ వాళ్లను ఇప్పటికీ రకరకాలుగా వేధిస్తున్నారనే దు:ఖమే కాదు, ఆగ్రహం కూడా వాళ్ల మాటల్లో ఉన్నాయి.

అది సరే ఇప్పటికీ మమ్మల్ని వేధిస్తునే ఉన్నారు కదా? వీటినన్నా మీరు ఆపగలరా? అని ఒక మహిళ నేరుగానే ఆశగా అడిగింది. 

 వాకపల్లిని కాపాడుకోడానికి రేపు మనం ఏం చేయాలో ఆలోచించాల్సిన కర్తవ్యం మన ముందు ఉంది. ఇప్పటి వరకు అనేక పరిమితుల వల్ల వాళ్లను  విస్మరించినందుకు నమ్రతగా తలవంచాం. తప్పక మళ్లీ కలుస్తామని వాళ్లకు హామీ ఇస్తూ వీడ్కోలు తీసుకున్నాం.  

2 thoughts on “మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

  1. పరిచయం అసంపూర్తిగా అనిపించింది

  2. ✊✊
    మా సత్యం
    “మానని గాయమూ తీరని ఆగ్రహమూ వాకపల్లి… ” చదివా. పద్మ కుమారి గారు రాసిన వ్యాసంలో ఎన్నో ఎన్నో కీలకమైన అంశాలను మన ముందుకు తీసుకువచ్చారు.
    ఈ తీర్పు పాలకులకు తలవగ్గిన తీర్పు.
    ముందుగా వాకాపల్లి ఆదివాసీ మహిళల పక్షాన 16 సంవత్సరాలుగా కోర్టులో వాదించిన న్యాయవాదులకు ఉద్యమ అభివందనాలు…
    ఆదివాసి మహిళలపై అత్యంత నీచంగా లైంగిక దాడి చేసిన గ్రేహాండ్స్ దళాల పై న్యాయస్థానం ఏ రకమైన చర్య తీసుకున్నారు!? తీసుకుంటే వారికి ఏ రకమైన శిక్ష విధించారు?
    కోర్టు వారు యుద్ద ప్రతిపాదికన అత్యంత సూక్ష్మస్థాయిలో పరిశీలించి విచారించాల్సిన కేసు
    16 సంవత్సరాలుగా విచారణ జరిపి, చివరకు గ్రేహాండ్స్ దళాలను సంరక్షిస్తూనే తీర్పు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది.
    ఒక విచారణ 16 సంవత్సరాలుగా కొనసాగడం బ్రిటిష్ ఇండియా బ్యూరోక్రసీకి నిదర్శనం.
    కోర్టులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి./ కోల్పోతున్నాయి. లైంగిక దాడికి పాల్పడిన గ్రేహాండ్స్ దళాలను ఉద్యోగాల నుండి డిస్మిస్ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఎందుకు జారీ చేయలేదు!?.
    ఈనాడు వాకపల్లి ఆదివాసి మహిళల పట్ల ఇచ్చిన తీర్పు కోర్టు తమ ఉనికిని కోల్పోకుండా కాపాడుకోవడానికి ఇచ్చిన తీర్పు మాత్రమే. పాలకులకు తలవగ్గిన తీర్పు.

Leave a Reply