(*వియ్యుక్క* అంటే గోండిలో వేగుచుక్క. తెలుగు అజ్ఞాత  విప్లవ కథా చరిత్రకు దారులు వేసిన రచయితలు ఎందరో. వాళ్లలో మహిళల పాత్ర గణనీయం. విప్లవంలో  సగానికి పైగా ఉన్న మహిళలు విప్లవోద్యమ చరిత్రలో, విప్లవోద్యమ కథా చరిత్రలో ప్రముఖంగా ఉండటం సహజమే. విస్తారమైన అజ్ఞాత కథా గమనానికి నిజంగానే వేగుచుక్కలవంటి రచయిత్రులు ఉన్నారు. వాళ్ళ సాహసోపేత, సృజనాత్మక, ఆదర్శప్రాయ ఆచరణా రచనా జీవితాన్ని సగౌరవంగా స్మరించుకోకుండా ఈ వియ్యుక్క సంకలనాలు ఎలా తీసుకరాగలం? అలాంటి తొమ్మిదిమంది అమర కథా రచయిత్రుల జీవిత, రచనా విశేషాలను ఈ పుస్తకాల చివర ప్రచురించాం. *వియ్యుక్క*  అందడానికంటే  ముందు వాళ్ళ వివరాలను వసంత మేఘం పాఠకులకు అందిస్తున్నాం - వసంత మేఘం టీం )

కా. గజ్జెల సరోజ బెల్లంపల్లి లోని కన్నాల బస్తీలోని దళిత కార్మిక కుటుంబంలో జన్మించింది. 1980లో పూర్తికాలం కార్యకర్తగా వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసింది. తరవాత హైదరాబాద్ కు మారింది.  సహచరుడు కా. నల్లా ఆదిరెడ్డి తదితర పార్టీ నాయకత్వంతో పాటు అరెస్టు అయ్యి జైల్లో కూడా ఖైదీల సమస్యలపై పోరాటాలు చేసింది. కొంతకాలం టెక్నికల్ రంగంలో పనిచేసి 1996లో మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా ఉద్యమంలో 2002 వరకూ చేసింది. ఉత్తర తెలంగాణాలో దళం డాక్టరుగా ఎన్నో సేవలు అందించింది. 2002 నుండీ 2006 వరకూ వివిధ స్థాయి టెక్నికల్ పనుల్లో ఉండి 2006 నుండీ జనతన సర్కార్ లో గురూజీగా పనిచేసింది. తర్వాత క్యాన్సర్ బారిన పడినప్పటికీ ఉద్యమప్రాంతంలోనే ఉండి 2013 డిసెంబర్ 11 న అమరత్వంపొందింది. స్పార్క్, అనామిక కలం పేర్లతో కవితలు, పాటలు, గల్పికలు, కథలు రాసింది. మంచి గాయని, సాంస్కృతిక కళాకారిణి.

కా.ఎల్లంకి అరుణ విద్యార్థిగా ఉన్నపుడే 1980 లో రాడికల్ విద్యార్థి సంఘం పరిచయాల్లోకి వచ్చి అప్పటి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ఖానాపూర్ లలో విద్యార్థి సమస్యల పైనా, అల్లీపూర్ లోని బీడీ కార్మికుల సమస్యలపైనా పనిచేసింది. 1988లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేపట్టింది. 1989-91ల మధ్య దండకారణ్యంలో క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్ (కేఏఎంఎస్) ఆర్గనైజర్ గా పనిచేసింది. 1993లో ఉత్తర తెలంగాణకు బదిలీ అయ్యింది. ఆదిలాబాద్ డివిజన్ కార్యదర్శిగా అక్కడి ఉద్యమానికి సారధ్యం వహించింది. సాధనగా, లలితగా ఉద్యమ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. 2003 మే 14 న ఆదిలాబాద్ జిల్లా అగరుగూడా ఎదురుకాల్పుల్లో అమరురాలయ్యింది. తాను రాసిన కొన్ని రచనలు ప్రణీత సవ్వడి పేరుతో (ఇంద్రవెల్లి ప్రచురణలు) 2004 జులై 28 న ప్రచురితమయ్యాయి. ఎల్లంకి అరుణ కథలు, స్పందనలూ, వ్యాసాలు రాసింది. ఇంటర్వ్యూలు చేసింది.

కా. బన్నూరు సుగుణ 1982 నుండి 85 వరకూ గద్వాలలో కాలేజీలో చదువుతుండగా రాడికల్ విద్యార్థి సంఘంలో క్రియాశీలంగా పనిచేసింది. 1985 నుండీ పాలమూరు జిల్లా ఉద్యమ నిర్మాణంలో అరుణక్కగా 89 వరకూ పనిచేసి మెదక్ జిల్లాకు బదిలీ అయ్యి అక్కడ రాధక్కగా చాలా ప్రజాదరణ పొందిన నాయకురాలిగా నిత్యం వార్తల్లో నిలిచింది. తరవాత పల్నాడుకు బదిలీ అయ్యి గుంటూరు జిల్లా కమిటీలో సభ్యురాలిగా లత పేరుతో పనిచేసింది. పల్నాడులో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో కరువు దాడులకు నాయకత్వం వహించింది. 2003 అక్టోబర్లో వైద్యం కోసం విశాఖపట్నం వెళ్ళినపుడు సహచరుడు కౌముదితో సహా పట్టుబడింది. పోలీసులు ఇద్దరినీ తీవ్ర చిత్రహింసలు పెట్టి చంపేశారు. రెండుదశాబ్దాలపాటు విప్లవోద్యమంలో పనిచేసింది. ఒక కథా, స్పందనా, వ్యాసాలు రాసింది.

కా. పద్మ కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో మంగలి కుటుంబంలో జన్మించింది.  బి.ఎస్సీ చదువుతుండగా 1982-85 మధ్య కాలంలో రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ కర్నూలు జిల్లా విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించింది. 1984లో గద్వాలలో జరిగిన విరసం సాహిత్య పాఠశాలలో పద్మ విరసం సభ్యురాలైంది. ఒక దశాబ్దం పాటు రాయలసీమలోని అర్బన్ ఉద్యమంలో ఆర్గనైజరుగా క్రియాశీలంగా పనిచేసింది. 1994 సెప్టెంబర్ 29న నెల్లూరులో కా. చింతా వెంకట స్వామినీ, పద్మనూ పోలీసులు పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేసి చంపి ఎన్ కౌంటర్ కట్టుకథ అల్లారు.  పద్మ అనేక పాటలు, కవితలు, వ్యాసాలు, ఒక కథ రాసింది. ఈ రచనలను ‘ఆమె నడిచినంత మేరా’ పేరుతో 1995 సెప్టెంబర్ లో ‘విరసం’ ప్రచురించింది.

కా.చాడ విజయలక్ష్మి  కరీంనగర్ లోని నవాబ్ పేటలో జన్మించింది. 1986లో పూర్తికాలం కార్యకర్తగా హైదారాబాద్ లో టెక్నికల్ స్థాఫ్ గా పనిచేస్తూ నర్సింగ్ పని నేర్చుకుంది. 1995లో శ్రీకాకుళంలోని ఉద్దానం, ఝంఝావతి దళాల్లో పనిచేసింది. కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసింది. ఈస్ట్ డివిజన్ లో, డివిజన్ కమిటీ స్థాయికి వచ్చిన మొదటి మహిళ. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కమిటీ ప్రాంతంలో 2004లో ఏర్పడిన మహిళా సబ్ కమిటీ సభ్యురాలు.  ఈస్ట్ డివిజన్ లో మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేసింది. కోరాపుట్ మల్టీపుల్ రెయిడ్ వంటి మిలటరీ దాడుల్లో పాల్గొన్నది.  మిలిటరీ డాక్టరుగా సేవలందించింది. రెండు దశాబ్దాల ఉద్యమజీవితం అనంతరం 2006 డిసెంబర్ 27 న పార్టీ కాంగ్రెస్కు హాజరుకావడానికి వెళ్తుండగా పోలీసులు ఆమెను, ఆమె సహచరుడు వడ్కాపూర్ చంద్రమౌళిని పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఉద్యమ జీవితంలో కరుణగా సుపరిచితం. రెండు కథలు రాసింది.

కా. ఉప్పుగంటి నిర్మలకు తలిదండ్రుల కృష్ణకుమారి అని పేరుపెట్టినా బడిలో చేర్చినపుడు నర్మదగా నమోదు చేశారు.  కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కొండపావులూరులో జన్మించింది. ఉద్యమంలో నర్మద పేరుతో 42 యేళ్ళు పనిచేసింది. 1987-94 మధ్య హిందీలో వెలువడే పార్టీ పత్రిక ప్రభాత నిర్వహణలో పాల్గొన్నది. 1994లో దండకారణ్యం వెళ్లింది. 1996 నుండీ ప్రజాక్షేత్రంలో పని మొదలుపెట్టి  2018 వరకూ గడ్చిరోలీ కేంద్రంగా పనిచేసింది. క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం హైదరాబాద్ నగరానికి వచ్చేనాటికే వ్యాధి ముదిరిపోయింది. 2019 జూన్ 11 న అరెస్టు అయ్యి, ఇక చికిత్స అందించలేము అంటూ హాస్పైస్ సెంటర్ కి తరలించాక అక్కడ 2022 ఏప్రిల్ 9 వ తేదీన అమరురాలయ్యింది. 1996 లో ప్రారంభమయిన పోరుమహిళ, హిందీ లో సంఘర్షరత్ మహిళ పత్రికల నిర్వహణ బాధ్యతలు కూడా చూసేది. 30 యేళ్ళ ‘దండకారణ్య మహిళా ఉద్యమం’ పుస్తక రచనలో ముఖ్యపాత్ర వహించింది. నిత్య పేరుతో అనేక కథలు, కవితలు, వ్యాసాలు, స్పందనలూ, నివేదికలూ రాసింది. ప్రధానంగా తెలుగూ, హిందీ, గోండీలో రచనలూ, అనువాదాలూ చేసింది.

కా.దగ్గుబాటి కల్పన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం లోని పెదవడ్లపూడి గ్రామంలో జన్మించింది. 1988లో విజయవాడలో పదవతరగతి చదువుతుండగా మహిళా సంఘంలో పనిచేసింది. తరవాత గుంటూరు జిల్లాలోని బొల్లపల్లి దళ సభ్యురాలిగా చేరి రమణ పేరుతో పనిచేసింది. అనేక కరువుదాడులకు నాయకత్వం వహించింది. అద్దంకి పోలీసుస్టేషన్ పై దాడిలో కీలక పాత్ర వహించింది. 2004లో జిల్లా కమిటీ సభ్యురాలైంది. తర్వాత రాయలసీమ ప్రాంతంలో చందనగా పనిచేసి 2006 నవంబర్ 10న కడప జిల్లాలోని బద్వేల్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరత్వం పొందింది. 18 యేళ్ళు ఉద్యమంలో పనిచేసింది. ఒక కథ రాసింది.

కా. జర్తా వెంకట లక్ష్మి తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని దద్దిలికవాడలో కొండరెడ్ల తెగకు చెందిన ఆదివాసీ కుటుంబంలో జన్మించింది. అద్భుత గాయని, సాంస్కృతిక కళాకారిణి. వాళ్ళ గ్రామానికి దళం వస్తుండడంతో ప్రభావితమై మహిళా సంఘంలో చేరి, తర్వాత పూర్తికాలం కార్యకర్తగా పనిచేసింది. జననాట్యమండలి సభ్యురాలయ్యి అనేక పాటలకు బాణీలు సమకూర్చింది. జేఎన్ఎం దళానికి కమాండర్ గా పనిచేసింది. ఆంధ్రా ఒరిసా బోర్డర్ ప్రాంతంలో అనేక జిల్లాలు తిరిగింది. వాకపల్లి అత్యాచార ఘటనలో దోషులైన గ్రేహౌండ్స్ ని శిక్షించాలని డిమాండు చేస్తూ 2007 సెప్టెంబర్ 26 న అమిడేలు గ్రామంలో క్యాంపెయిన్ నిర్వహిస్తుండగా గ్రేహౌండ్స్ చేసిన దాడిలో అమరత్వం పొందింది. తెలుగు, కువ్వి, కోయ, సవర భాషల్లో పాటలు పాడేది. అనేక పాటలు రాసింది. తన జీవితానుభవాన్నే కథగా రాసింది.

కా.ఆలూరి లలితగారు ఎనభయ్యవ దశకంలో విజయవాడలో మహిళా సంఘంలో పనిచేసి మహిళా ఉద్యమానికి బాటలు వేసారు. అజ్ఞాతంలో ఉంటూ నాయకత్వం కోసం అనేక యేళ్లపాటు డెన్లు నిర్వహించారు. రమాదేవి పేరుతో కథలు రాసారు.2021 నవంబర్ 21న గుండెపోటుతో అమరులయ్యారు.

One thought on “అజ్ఞాత అమర కథా రచయిత్రులు

Leave a Reply