విస్మరణ, వక్రీకరణలతోపాటు  విధ్వంసమై పోయిన   ఆదివాసుల, దళితుల, బహుజనుల, మహిళల వర్గ పోరాట చరిత్ర, సాహిత్యం సిపాయి తిరుగుబాటుతోనే  తిరిగి  వెలుగులోకి రావడం మొదలైంది .  యూరప్‌లో జరిగిన పారిశ్రామిక, ఫ్రెంచి విప్లవాలు, పారిస్‌ కమ్యూన్‌, రష్యా, చైనాల్లో జరిగిన ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలు ప్రపంచ  పీడిత ప్రజలను ప్రభావితం చేశాయి.

1967 నక్సల్బరి, శ్రీకాకుళం, ముషాహరి సాయుధ పోరాటాలు చైనా సాంస్కృతిక విప్లవం, గ్రేట్‌ డిబేట్‌ నేపథ్యంలో అర్ధవలస, అర్ధ భూస్వామిక పార్లమెంటరీ దగుల్బాజీ రాజకీయాలతో నలిగిపోయిన పీడితప్రజల ముందుకు విప్లవ శ్రేణులు వర్గపోరాటాన్ని  సాయుధ  రూపంలో బలంగా ముందుకు తెచ్చాయి. పదేండ్ల పోరాట అనుభవసారంతో 1977లో ప్రజలే చరిత్ర నిర్మాతలుగా, దళిత, బహుజన రైతాంగంలోకి, పట్టణ కార్మిక వర్గ, మధ్యతరగతి, మేధావుల్లోకి, ఆదివాసుల్లోకి మొత్తంగా దేశవ్యాపితంగా విప్లవోద్యమం వ్యాపించింది. పీడిత ప్రజలు ప్రజా సంఘాలలో సుశిక్షుతులై పటిష్టమైన పార్టీని, ప్రజా సైన్యాన్ని నిర్మించి దండకారణ్యంలో జనతన సర్కార్‌ లాంటి బేస్‌ ఏరియా నిర్మాణాలతో`పదమూడు రాష్ట్రాల్లోకి విస్తరించారు.

రైతాంగ, కార్మిక, ఆదివాసీ పోరాటాలల్లో మహిళలు పెద్దఎత్తున కదిలి వర్గ పోరాటంలో రాటుదేలి పితృస్వామిక పునాదులు పెకలించారు. ఆకాశంలో సగమైన మహిళలు పెన్ను, గన్ను పట్టి పోరులో సగభాగమయ్యారు. అలాంటి 50 మంది విప్లవకారులు రాసిన 282 కథలివి.

నక్సల్బరీలో శాంతిముండా (ఇంకా బతికి ఉన్నారు) దానేశ్వరిదేవితో 8 మంది, శ్రీకాకుళంలో పంచాదినిర్మల కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పోరాటాల నుండి దండకారణ్యం దాకా ఎల్లంకి అరుణ, గజ్జెల సరోజ, అనురాధగాంధీ, నర్మద, కంతి లింగవ్వ దాకా వందల మంది నిర్మించిన వర్గపోరాట పురోగమనాల చరిత్ర ఈ కథల్లో కనిపిస్తుంది .  అర్ధవలస, అర్ధ భూస్వామిక విధ్వంసకర ఉత్పత్తి విధానాన్ని సాయుధంగా కూలదోసే మహిళల మహత్తర పోరాట నిర్మాణ చరిత్ర  ఈ కథల్లో ఉంది.  సమస్త సంక్లిష్టతల, నిర్బంధాల ఆవరణలోంచి పెల్లుబికిన వెల్లువ ప్రవాహంగా నిర్మాణమైన మన కాలపు మహిళల పోరాట గాథలు ఇవి.  రక్తసిక్తమైన, ఉద్వేగపూరితమైన అలాంటి యుద్ధాన్ని,  యుద్ధంలో నుండే సాయుధ సైనికులుగా మహిళలు వారసత్వంగా అలవర్చుకున్న తమదైన శైలిలో, సరళంగా, సుకుమారంగా, సృజనాత్మకంగా, కళాత్మకంగా, అత్యంతప్రేమతో, బాధ్యతతో నిర్మించిన కొత్త సమాజ నిర్మాణ రూపాలివి.

ప్రపంచవ్యాపితంగా సామ్రాజ్యవాదం మరణం అంచుల్లో నుంచి చిట్టచివరి ప్రయత్నంగా ఫాసిజంగా  హింసను క్రూరత్వాన్ని అట్టడుగు పీడిత ప్రజలైన దళితులు, బహుజనులు, ఆదివాసులు, మహిళల మీద సాయుధ దాడులకు దిగుతున్న నేటి దశలో పాత అభివృద్ధి నిరోధక అర్ధవలస-అర్ధభూస్వామ్య విధ్వంసకర ఉత్పత్తి క్రమాన్ని మార్చి అందుకు అడ్డంకిగా ఉన్న తాత్విక రాజకీయార్థిక రంగాలల్లో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టిన కథలివి. పీడిత ప్రజలందరు మరింత ఐక్యంగా సాయుధంగా పోరాడి రాజ్యాధికారం చేపట్టడానికి దారులువేసిన వేగుచుక్క (వియ్యుక్క) కథలివి. తెలుగు సాహిత్యంలో, భారతీయ, ప్రపంచ సాహిత్యంలో, మహిళా వర్గ పోరాట చరిత్రకు `వస్తువులో` నిర్మాణంలో భాషలో కొత్త చేర్పు. అన్ని భారతీయ భాషల్లోకి ముఖ్యంగా హిందీ, ఇంగ్లీషులోకి అనువాదం చేయాల్సిన కథలివి.

Leave a Reply