మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా

అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో..

విప్లవోద్యమంపై నిషేధానికి, యుఎపిఎ కేసులకు, ఎన్‌ఐఎ దాడులకు వ్యతిరేకంగా సదస్సు

మార్చి 2, 2024 శనివారం ఉదయం 10.30 నుంచి సాయంకాలం 6 గంటల దాకా

అంబేద్కర్‌ భవన్‌, వరంగల్‌

మిత్రులారా!

మార్చి8 అంతర్జాతీయ శ్రామిక మహిళల విముక్తి పోరాట దినం. చరిత్రలో శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి, రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8 స్త్రీలందరి విముక్తి ఉద్యమాల దినంగా నమోదైంది. పాలకులు మార్చి8ని వేడుకల దినంగా మార్చేసినా ఈ దేశంలోని కార్మిక, ఆదివాసీ, దళిత బహుజన మహిళలు తమ త్యాగాలతో పోరాట దినంగా నిలబెడుతున్నారు. ముఖ్యంగా విప్లవోద్యమంలో పని చేస్తున్న మహిళలు ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాహసోపేతంగా పోరాడుతున్నారు. పితృస్వామ్య అణచివేతకు, కుటుంబ హింసకు, లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా, హిందుత్వ కార్పొరేట్‌ శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. పోలీసులు, సైనిక బలగాలు చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేస్తున్నారు. భారతదేశంలోనే అతి పెద్ద మహిళా ఉద్యమం విప్లవోద్యమ నాయకత్వంలో దశాబ్దాల తరబడి కొనసాగుతున్నది. ఈ పోరాటాల్లో వందలాదిగా మహిళలు తమ విలువైన ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ఆధిపత్యశక్తుల, పోలీసు బలగాల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి చిత్రహింసలకు గురవుతున్నారు. అక్రమ కేసుల్లో ఏండ్ల తరబడి జైలు జీవితం గడుపుతున్నారు. దేశంలో జరుగుతున్న ఇతర మహిళా ఉద్యమాలకు స్ఫూర్తిని అందిస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యావంతులైన మధ్య తరగతి మహిళల దగ్గరి నుంచి ఆదివాసీ శ్రామిక బహుజన మహిళలు దాకా అనేక రకాలుగా ఈ వ్యవస్థ వల్ల పీడితులైన మహిళలు ఉన్నారు.

మహిళలు కేవలం తమ విముక్తి కోసమే కాక శ్రామిక వర్గ విముక్తిలో భాగంగా నూతన సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమంలో భాగమయ్యారు.  అప్రజాస్వామిక, అనాగరిక, సనాతన, భూస్వామ్య పీడలనకు, సామ్రాజ్యవాద దోపిడీ సంస్కృతులకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఈ సమాజాన్ని ప్రజాస్వామికీకరించడానికి ప్రాణాలొడ్డి  ఉద్యమిస్తున్నారు. తద్వారా సమాజంలో రాజకీయ స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు విప్లవ మహిళా ఉద్యమం దోహదం చేస్తున్నది.

ఈ సందర్భంలో అన్ని రకాల నిషేధాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడాల్సి ఉంది. తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారాక ఇంత కాలానికి తిరిగి ప్రజాస్వామ్యం చర్చనీయాంశమవుతున్నది. తెలంగాణలో విప్లవోద్యమం ఆరంభమైనప్పటి నుంచి మూడు తరాల మహిళలు విప్లవోద్యమంలో, ఇతర పోరాటాల్లో చర్చనీయాంశం చేసిందంతా ప్రజాస్వామ్య విలువల గురించే. వాళ్ల త్యాగాలన్నీ నిజమైన ప్రజాస్వామ్యం కోసమే. అలాంటి ప్రజాస్వామిక విలువలను గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా కాలరాచింది. ప్రజలు మాట్లాడ్డానికి వీల్లేని స్థితి కల్పించింది. ఈ మొత్తానికి సీపీఐ మావోయిస్టు మీద నిషేధాన్ని సాకు చేసుకున్నది. నిషేధిత పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపించి వేలాది మందిని ప్రభుత్వం చిత్రహింసలు పెట్టింది. అక్రమంగా అరెస్టు చేసింది. జైలుపాలు చేసింది. వందలాది మందిని హత్య చేసింది. నిషేధిత ఉద్యమం అనే పేరుతో విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవకారులను వెంటాడి హత్య చేస్తున్నాయి. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారి మృతదేహాలను రక్త సంబంధీకులు తెచ్చుకోడానికి కూడా వీల్లేని నిర్బంధం అమలు చేస్తున్నాయి. తమ పిల్లల, సహచరుల, బంధువుల మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు జరిపినందుకు విప్లవకారుల కుటుంబ సభ్యులు పోలీసుల నుంచి ఒత్తిడికి గురవుతున్నారు. అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. అమరుల జ్ఞాపకార్థం స్థూపాలు కట్టుకోవడం, ప్రతి ఏటా స్మారక దినం జరుపుకోవడం కూడా నేరమైపోయింది. నిషేధిత పార్టీ కార్యకర్తలయినంత మాత్రాన వెంటాడి హత్య చేస్తారా? గౌరవంగా వారికి అంత్యక్రియలు నిర్వహించడం నేరం అవుతుందా? స్థూపాలు కట్టుకోవడం, సంస్మరణ సభలు జరుపుకోవడం చట్టవ్యతిరేక కార్యక్రమం అవుతుందా? అని అమరుల కుటుంబ సభ్యులు మొదటి నుంచీ ప్రశ్నిస్తున్నారు. నిషేధాల పేరుతో ఈ అకృత్యాలకు పాల్పడుతున్నందు వల్ల రాజకీయ సంస్థల మీద నిషేధాలు ఎత్తేయాలని అమరుల బంధు మిత్రుల సంఘం మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నది. మావోయిస్టు పార్టీ మీద నిషేధం అంటే కన్న తల్లుల దు:ఖం మీద నిషేధం. విప్లవకారులైన తమ పిల్లల గురించి చెప్పుకోడానికి వీల్లేదనే మానవ సంబంధాల మీద నిషేధం.   చనిపోయిన పిల్లల, సహచరుల, తల్లిదండ్రుల జ్ఞాపకాలు తలపోసుకోవడం మీద నిషేధం.

ఇది రాజ్యాంగంలోని రాజకీయ స్వేచ్ఛకే కాదు. మానవతకు వ్యతిరేకం. నాగరికతకు వ్యతిరేకం. అత్యున్నత మానవీయ సంస్కృతి కోసం, ప్రజాస్వామిక విలువల కోసం విప్లవకారులు చేసిన త్యాగాల్లోంచి, తల్లిదండ్రుల, జీవన సహచరుల కన్నీటిలోంచి పుట్టిన అమరుల బంధు మిత్రుల సంఘం అన్ని రకాల నిషేధాలను, అణచివేతలను  వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో మరో పదిహేను ప్రజాసంఘాలతోపాటు అమరుల బంధు మిత్రుల సంఘాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం నిషేధించినప్పుడు ఏబీఎంఎస్‌ కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసింది. రాజకీయ  ఉద్యమాలను నిషేధించడమంటే అందులో ఉండే లక్షలాది మంది ప్రజలను నిషేధిత మానవులని ప్రకటించడమే. వాళ్లకు తమ కుటుంబాలతో ఉన్న రక్త సంబంధాలను నిషేధించడమే. తల్లిదండ్రులని, బిడ్డలని, తోడబుట్టినవాళ్లని, బంధువులనే మానవ సంబంధాలను నిషేధించడం అత్యంత క్రూరమైన హింస. రక్త సంబంధీకుల పట్ల ప్రేమలను, ఆప్యాయతలను రాజకీయ నిషేధం రద్దు చేస్తుంది. రాజకీయాల్లో చర్చలు, ప్రకటనలు, విధానాలు మాత్రమే ఉండాలి. ఏ రాజకీయాలు సరైనవో ఎంచుకొనే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలి. అదే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. కానీ పాలకులు నిషేధం పేరుతో మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు.

ఈ స్థితిని ప్రశ్నించిన మేధావులను, ప్రజాసంఘాల కార్యకర్తలను, అమరుల కుటుంబసభ్యులను యుఎపిఎ చట్టం కింద నిర్బంధిస్తున్నారు. వందలాది మంది మీద కేసులు నమోదు చేశారు. పదుల సంఖ్యలో ప్రజాసంఘాల కార్యకర్తలు, అమరుల కుటుంబ సభ్యుల ఇండ్ల మీద ఎన్‌ఐఎ అధికారులు పదే పదే దాడులు చేస్తున్నారు. మానవ సంబంధాలను నిషేధించిన పాలకులు గత పదేళ్లలో నిషేధిత పార్టీతో సంబంధాలు ఉన్నాయనే నిరాధార ఆరోపణలతో, కథనాలతో అనేక మందిని జైలుపాలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రకటించింది. కానీ ఆచరణలో  అప్పుడే తన సహజ స్వభావాన్ని బైటపెట్టుకుంటున్నది. హైదరాబాదులో ఒక అక్రమ కేసులో ఎన్‌ఐఏ అధికారులు రచయితల ఇండ్ల మీద దాడులు చేశారు. చత్తీస్‌ఘడ్‌ పోలీసులు యథేచ్ఛగా తెలంగాణలోకి వచ్చి పౌరహక్కుల సంఘానికి చెందిన పోగుల రాజేశం, అవినాశ్‌ అనే వ్యక్తిని ఎత్తుకపోయారు. సీపీఐఎంల్‌ న్యూడెమోక్రసీ నాయకులు అశోక్‌, గోపి తదితరులను  అరెస్టు చేసి రెండు రోజులు దాటినా ఆచూకీ చూప లేదు. ఇలాంటి అణచివేత చర్యలు తెలంగాణలో తిరిగి మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో   తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ  మావోయిస్టుపార్టీ మీద నిషేధం ఎత్తివేయడంతో ఆరంభం కావాలి. నిషేధానికి కారణమైన తెలంగాణ ప్రజాభద్రతా చట్టాన్ని రద్దు చేయాలని, తెలంగాణలో గత ప్రభుత్వం పెట్టిన యుఎపిఎ కేసులన్నీ ఎత్తేయాలని, తిరిగి యుఎపిఎ కేసులు పెట్టమనే హామీ ఇవ్వాలని ఉద్యమించాల్సి ఉన్నది.

ప్రజాస్వామ్య హక్కుల కోసం, విలువల కోసం, మానవీయ సమాజం కోసం కుటుంబాలను, పిల్లలను వదిలి విప్లవంలో పనిచేసి అమరులైన మహిళా అమరుల స్మృతిలో నిషేధాలకు వ్యతిరేకంగా ఈ సదస్సు తలపెట్టాం. దీన్ని విజయవంతం చేయండి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో భాగం కండి. అందరికీ ఇదే ఆహ్వానం.

– అమరుల బంధుమిత్రుల సంఘం

Leave a Reply