తెల్వకుండానే 

పుట్టుక పొలిమేరల్లో చుట్టుకున్న 

నాగుపామును ఒల్చేసి

చావుదాకా

రక్తమాంసల సైద్ధాంతిక నిర్మాణమై చిగుళ్లువేసి

వర్గపోరాటమై వెల్గుజిమ్మిన

ఒక నూతన మానవుడు

ఎర్రదండై

అడవి మెడలో ఒదిగి పోయాడు


ఒక యుద్ధం లోంచి

ఆవిరి లా ఎగిరి వచ్చి

బీడుపడిన నేలను

జనసంద్రం చేసిన

శాంతి మేఘము


భూమి

యుద్ధ కేంద్ర మైనంత కాలం

వొక వాస్తవికత

మూసుకున్న తలుపుల మీద

చర్చలు నాటిపోయాడు

వొక ఆధిపత్య రక్త పాతాన్ని దొర్లించిన

సాయుధ విశాల ప్రవాహం లో

వాగులు వంకలు పిల్లకాల్వలు 

యుద్ధవ్యాపనమౌతున్న

అడవి

మైదానానికి

తుపాకులవంతెనతడు

మట్టి మనిషిని

కౌగిలించుకొని కాలం

ఈ పిడికెడు మట్టే

ఉద్యమాలపుట్ట


రేపటి విజయాన్ని దర్శించి

మనం కోల్పోయిన కలలు

కనమనే యుద్ధకలల కార్ఖానా


కుళ్ళిపోయిన పాలనల

మంద్ర స్థాయి యుద్ధ

అనాలోచిత అభివృద్ధి ప్రపంచం లోoచి

అడవిమీద ఓజోను పొరయి విస్తరించాడు


ఒకచేత్తో కన్నీరు తూడ్చుకొని

కన్నపేగు ఎరువైన

పంటకాపల కూర్చొని

పగలురేయిలో కల్సిపోయిన పాలపుంతతడు

Leave a Reply