వేకువల్లే
వేయి కలలు వెలిగించుకుని
తూరుపు కాంతులు పూసుకుని
చూపులులు మార్చుకున్న రోజులు
కళ్లపై వాలుతున్నాయ్ .

హాయిని గొలిపే ప్రపంచమంటే
కళ్ళలో వెలిగే దీపాలు
దారిచూపటం .
మనసున ఊగే భావాలు
ఊరించటం
అలరించటం అంతే కదా …

వర్షాల ఊయల్లో
అలా ఊగిపోవటం
బంధాల్ని ముడిపెట్టుకోవటం కదూ…

ఇంతలా
వెన్నెల ఆకాశాన్ని వొంచి
తల నిమురుతూంటేనూ…

లోలోపల
జ్ఞాపకాలు తడుముతుంటేనూ…

ఏదో వెన్నెల వాకిలి
వొలికి చిలికి
నీ ప్రపంచాన్ని
తెరలు తీసి ప్రదర్శిస్తుంటేనూ

అదే వర్షం ….

నాపై వాలే చినుకుల్లో
నీ జ్ఞాపకాలు తడుపుతున్నాయి .

వాస్తవానికి జ్ఞాపకానికి
ఒక తీయని ఊహా లోకం లో
కొత్త ప్రపంచాన్ని
కళ్ళలో నిర్మిస్తాను

అర్ధమౌతోందా
జీవితమంటే కన్నీళ్లే కాదు
కొన్ని కౌగిలించే జ్ఞాపకాలు కూడా .

One thought on “అదే వర్షం

  1. నాపై వాలే చినుకుల్లో నీ జ్ఞాపకాలు తడుపుతున్నాయి

Leave a Reply