భూతల్లి ఎదపై 
నాటిన ఇనుప మేకులు 
ఎవరి ఆకలిని తీర్చగలవు?
ఎంత పచ్చదనాన్ని తుంచగలవు??

ఆ సిమెంట్ బ్యారి గేట్లు 
ఎవరి ఇంటికి 
గోడలుగా నిలబడగలవు?
ఎంత ధైర్యాన్ని అణచగలవు?? 

గాలిలో ఎగిరే డ్రోన్లు 
ఎవరి పంట చేనులకు 
మందులు కొట్టగలవు?
ఎంత ఆక్సిజన్ ను భర్తీ చేయగలదు??

వాడు చేస్తున్న దాడిలో 
కోల్పోయిన రైతుల ప్రాణాలను
ఎవరు మొలకెత్తించగలరు?
గడ్డిపోచల గుండె చప్పుడుతో
ఊపిరి వీస్తున్న స్వదేశ రైతులను
కట్టడి చేసే అట్టడుగుల్లో
ఎంత కాలం కొట్టుమిట్టాడగలరు ??

రాజకీయం తెలిసిన ప్రభుత్వానికి 
రైతుల కన్నీటి బాధలను
తీర్చడం తెలియనిదా?
భారతరత్న అవార్డు ప్రకటనలో కూడా 
రాజకీయ స్వలాభం ఉందని 
ఎంతమంది ఎరుగరని అనుకుంటున్నారు?

కనీస మద్దతు ధర అడగడమే రైతు తప్పా?
మరి,సరైన పద్ధతిలో న్యాయం చేయలేక
ఆయుధాలతో ఆయువు తీసే 
అరాచక నైపుణ్యం గొప్పా?

ఈ న్యాయ పోరాటానికి మద్దతుగా 
కడుపులో పేగులున్న 
ప్రతీ మనిషి గుండె నినాదిస్తుంది!
వీపుల మీద ఎండను మోసే రైతన్నలకు
తూర్పున ఎర్రని సూర్యుడు 
ఏనాటికైనా న్యాయాన్ని ప్రకటిస్తాడు.

Leave a Reply