40 ఏళ్ల యువ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సెప్టెంబర్‌ 9న సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పౌరుల హక్కును గుర్తించినట్లైంది. కేరళ పాత్రికేయుడు సిద్ధిఖీ కప్పన్‌కు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. సెప్టెంబర్‌ 9న ఇచ్చిన తీర్పు పలు కారణాల రీత్యా విశేషమైనది. అక్రమ కేసులు బనాయించి తమకు గిట్టనివారినీ, ప్రశ్నించినవారినీ, తప్పిదాలను ఎత్తిచూపేవారినీ సుదీర్ఘకాలం జైల్లో మగ్గేట్టు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయిన కాలంలో సుప్రీం నిర్ణయం వాక్‌ స్వాతంత్య్రాన్ని ఎత్తిపట్టింది. అంతకంటే ప్రధానంగా, బెయిల్‌ అవకాశం లేని అత్యంత కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ‘ఊపా’ను ఒక అణచివేత ఆయుధంగా విరివిగా వాడుతున్న స్థితిలో, కప్పన్‌ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం స్వేచ్ఛకు ఉపశమనం. పాస్‌పోర్టు అప్పగించి, వారానికోమారు పోలీసు స్టేషన్‌లో సంతకం పెడుతూ, ఆరువారాలు ఢిల్లీలోనే ఉన్న తరువాత, ఇతర బెయిల్‌ నిబంధనలన్నీ పూర్తిచేసుకొని కప్పన్‌ స్వరాష్ట్రానికి పోవచ్చునని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. రెండేళ్ళుగా జైల్లో ఉంటున్న కప్పన్‌కు ఇది పెద్ద ఉపశమనం.

కప్పన్‌ ఒక పాత్రికేయుడు, నిజాలను నిర్భయంగా రాసే తెగువున్న యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో రెండేళ్ల కిందట 19 ఏళ్ల ఒక దళిత బాలికను అగ్ర కులాల వారు 2020 సెప్టెంబర్‌ 14న అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ ఘటన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు అర్థరాత్రి హడావుడిగా దహన సంస్కారాలు చేయడం వివాదాస్పదంగా మారింది. తన ప్రమేయం లేకుండానే ఆమెకు అంత్యక్రియలు చేశారని, కడసారి చూపు కూడ దక్కలేదని బాధితురాలి తల్లిదండ్రులు వాపోయారు. నలుగురు పెత్తందారి దుండగులను రక్షించేందుకు అక్కడి అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నించింది.                   

2020లో సామూహిక అత్యాచారానికి గురై మరణించిన 19 ఏళ్ల దళిత యువతి ఉదంతాన్ని సమాజానికి తెలియజేయాలని కేరళకు చెందిన జర్నలిస్టు కప్పన్‌ పరిశోధనకు పూనుకున్నాడు. దారుణమైన అమానవీయమైన, అత్యంత హేయమైన ఈ దురాగతాన్ని ఆధార సహితంగా పరిశోధనాత్మక కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పాత్రికేయుల్లో కప్పన్‌ ఒకరు. అందుకనే ఆయనపై బిజెపి సర్కార్‌కు అంతటి పగ. దళిత బాలికకు న్యాయం దక్కాలని కోరుకున్న ఆయనపై ‘దేశద్రోహ’ ముద్ర వేసేందుకు యోగి సర్కార్‌ విఫలయత్నం చేసింది. తీవ్రవాద సంస్థ అయిన పిఎఫ్‌ఐతో సంబంధాలున్నాయంటూ యుఎపిఎ (ఉపా) ఐపిసిలోని సెక్షన్‌ 120బి, 153ఎ, 295ఎ వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు బనాయించి వేధింపులకు గురి చేసింది. ఈ కేసుల్లోనూ వేటికీ కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవు.

ఉత్తరప్రదేశ్‌ హథ్రాస్‌లో ఒక దళిత బాలిక సామూహిక అత్యాచారం, హత్య ఘటన 2020 దేశాన్ని కుదిపేస్తున్నప్పుడు కేరళ నుంచి కప్పన్‌ ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అత్యాచారం జరిగిన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌కు కారులో వెళుతుండగా యుపి పోలీసులు 2020 అక్టోబర్‌ 5న మధురలో అరెస్టు చేశారు. ఆరంభంలో యూపీ పోలీసులు ఆయనపై శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆరోపణే చేశారు. ఆ తరువాత ఆయనకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతోనూ, నక్సల్స్‌తోనూ సంబంధాలున్నాయని ఆరోపించారు. మత విద్వేషాలు రేకెత్తించడం వంటి  ఆరోపణలు చేశారు. ఆ సంఘటన నుంచి దేశం దృష్టిని మరల్చే లక్ష్యంతో, మరే పాత్రికేయుడూ తన రాష్ట్రంలో కాలూనకుండా, నిజానిజాలు బయటకు తెలియకుండా నిరోధించేందుకు యూపీ యోగీ ప్రభుత్వం చేపట్టిన పలు కుట్రపూరిత చర్యల్లో ఇది కూడా ఒకటి. కప్పన్‌ను సుదీర్ఘకాలం జైల్లో ఉంచి, మిగతా పాత్రికేయులందరినీ భయపెట్ట్టే లక్ష్యంతో ఆయన మీద ఊపాను కూడా ప్రయోగించింది. ఆయన వద్ద విద్రోహాన్ని రేకెత్తించే, ప్రజలను రెచ్చగొట్టే సాహిత్యం దొరికిందని ఆరోపించింది.

2021 ఏప్రిల్‌లోనే కప్పన్‌పై చార్జిషీట్‌ దాఖలు చేశారు. కాని ఇంతవరకు అందుకు సంబంధించిన ఆరోపణలను రికార్డు చేయకపోవడాన్ని జస్టిస్‌ యు యు లలిత్‌ ధర్మాసనం ప్రశ్నించింది. అందుచేత ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు  ప్రకటించింది. యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కప్పన్‌పై కక్ష గట్టి జైల్లో ఉంచిందని మొదటి నుంచి స్పష్టపడుతూనే ఉంది. జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని దాదాపు ధ్రువపరిచింది. కప్పన్‌ వద్ద పోలీసులకు దొరికిన సాహిత్యం చట్టబద్ధమైనదని, ఆయనను తీవ్రవాదిగా పరిగణించడానికి తగిన ఆధారాలేవీ లేవని అభిప్రాయపడింది. జర్నలిస్టు అయిన కప్పన్‌ అరెస్టు మీడియా స్వాతంత్య్రానికి అవరోధమని ధర్మాసనం భావించినట్టు సందేహాతీతంగా వెల్లడైంది. ఉపా వంటి చట్టాల కింద కేంద్రంలోనూ, పలు రాష్ట్రాలోనూ గల బిజెపి ప్రభుత్వాలు ప్రశ్నించే హక్కును కాలరాస్తున్న వైపరీత్యం కళ్లముందున్నదే.

బెయిల్‌ కోసం 2021లో అలహాబాద్‌ హైకోర్టుకు పోతే, విచిత్రంగా హథ్రాస్‌లో నీకేమి పని అంటూ యూపీ ప్రభుత్వం, మాదిరిగానే ప్రశ్నించి, ఉపా కేసు ఉన్నందున బెయిల్‌ ఆలోచనే చేయలేదు. నిందితుడికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు ప్రాథమికంగా ఏమాత్రం విశ్వసనీయంగా కనిపించినా న్యాయస్థానాలు బెయిల్‌ ఊసెత్తకూడదని ఊపా చట్టంలోని సెక్షన్‌ 43డి(5) చెబుతుంది. దీనికితోడు, 2019 నాటి ఎన్‌ఐఎ వర్సెస్‌ జహూర్‌ అహ్మద్‌ షా వతాలీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు బెయిల్‌ థలో సాక్ష్యాధారాలను లోతుగా అధ్యయనం చేయకుండా నిరోధిస్తున్నాయి, ఎన్‌ఐఎ సమర్పించిన సాక్ష్యాలను మొత్తంగా చూడాలే తప్ప, వాటి స్వీకారయోగ్యత జోలికి పోకూడదని అంటున్నది. ఈ కారణాల రీత్యానే, న్యాయస్థానాలు ఊపా కేసుల్లో బెయిల్‌ ఊసెత్తడం మానేశాయి. భీమా కోరేగావ్‌ నిందితులంతా విచారణ మాట అటుంచితే, బెయిల్‌ కోసం కూడా ఏళ్ళతరబడి ఎదురుచూపులు చూస్తుండవలసిన దుస్థితి ఏర్పడుతున్నది. వారికి వ్యతిరేకంగా చూపుతున్న సాక్ష్యాధారాలు పాలకులు సృష్టించినవేననీ, అక్రమంగా చొరబడి ప్రతిష్టించినవేననీ తేలిపోతున్నప్పటికీ, వారంతా జైళ్ళలోనే మగ్గవలసి వస్తున్నది.

‘ఒక పౌరుడి’కి ఉన్న స్వేచ్ఛలన్నిటినీ కాలరాసి బలవంతంగా చీకటి గదిలో నిర్బంధించిన సిద్దిఖీ కప్పన్‌ కుమార్తెను నేను 75 ఏళ్లుగా మనం అనుభవిస్తున్న స్వేచ్చా స్వాతంత్య్రాలు గాంధీజీ, నెహ్రూ, భగత్‌సింగ్‌ వంటి స్వాతంత్రయోద్యమ నేతల త్యాగాల ఫలితం. భావ ప్రకటనా స్వేచ్ఛ మనందరి హక్కు, మా నాన్నకు స్వేచ్ఛ నివ్వండి’ అంటూ పద్రాగస్టు రోజున పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో సిద్దిఖీ తొమ్మిదేళ్ల కుమార్తె మెహ్నాజ్‌ కప్పన్‌ ఆకాంక్ష ఇది. సిద్దిఖీ నిర్బంధాన్ని ఖండిస్తూ అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం ఆయనను వేధిస్తూ వచ్చింది. అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడమే కాకుండా బెయిల్‌ రాకుండా పదేపదే అభ్యంతరాలు చెబుతూ వచ్చింది.

దేశంలో వాక్‌ స్వాతంత్య్రం ప్రస్తుతం దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధాని మోడీని గానీ, యోగి ఆదిత్య నాథ్‌ వంటి వారిని గానీ ఏమైనా అంటే ఊరుకోమని బేడీలు పట్టుకొని హెచ్చరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సత్యాన్ని, వాస్తవాలను వెలికితీసే పాత్రికేయులపై ఇటువంటి అరెస్టులు తరచుగా సాగిపోతున్నాయి. ప్రధాని మోడీ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.1105లకు అమ్ముతున్నట్టు బొమ్మవేసి దాని పక్కనే బైబై మోడీ అని పెద్ద అక్షరాలను రాసిన హోర్డింగ్‌ను ఉంచినందుకు, అగ్నిపథ్‌ సైనిక రిక్రూట్‌మెంట్‌ను విమర్శించినందుకు గత జూలై మొదటి వారంలో యుపి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ఆదిత్యనాథ్‌ను వ్యంగ్యంగా చిత్రిస్తూ పోస్టింగ్‌ పెట్టినందుకు 18 ఏళ్ల బాలుడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? ప్రజాస్వామ్యంలో రాజులకు, రాచరికాలకు చోటు ఎంత మాత్రం లేదు. కాని బిజెపి పాలనలో మతోన్మత్త రాచరిక పీడన పరాకాష్టకు చేరుకున్నది.

కేసుకు సంబంధించిన ఆధారాలు, సాక్షాలు మీదగ్గర ఏమైన ఉన్నాయాయని సుప్రీంకోర్టు ధర్మాసనం యుపి సర్కార్‌ను నిలదీయగా… ఒక కరపత్రాన్ని యోగి సర్కార్‌ సాక్ష్యంగా పేర్కొంది. అది కూడా అత్యాచారానికి గురైన దళిత బాలికకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనలకు సంబంధించిన ప్రచారపత్రం. ఇంతటి తీవ్రమైన నేరాలకు మీరు సేకరించిన సాక్ష్యం ఒక ఐడి కార్డు.. ఒక కరపత్రమా అంటూ ధర్మాసనమే విస్మయం వ్యక్తం చేసింది. నిరసనలకు పిలుపునివ్వడమే నేరమా? అంటూ నిలదీసింది. యోగి సర్కార్‌కు తలంటుతూనే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాధాన్యతను సుప్రీం ధర్మాసనం నొక్కి చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఈలాంటి నిరసనలు అవసరమని కోర్టు సమర్థించింది.

 హథ్రాస్‌ సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం జరుగాలంటే దోషులను కఠినంగా శిక్షించాలని కరపత్రం మాట్లాడిందని, ఆ కారణం కోసం పోరాడడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. ”ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు, సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి  బాధితురాలి పక్షాణ ఒక ఆలోచనను సమాజం ముందుంచడం తప్పేమి ఉందని, చట్టం దృష్టిలో అది నేరం లాంటిదేనా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. 2012లో నిర్బయ ఘటన సందర్భంగా ఇండియా గేటు వద్ద పోటెత్తిన నిరసనలను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ నిరసనల తర్వాతే మనం చట్టాలు మార్చుకున్నామనే సంగతినీ గుర్తు చేసింది. గొంతుక లేనివారి పక్షాన గొంతెత్తితే తప్పేంటని కడిగిపారేసింది.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను బిజెపి సర్కార్‌ నిర్వీర్యం చేస్తూ వస్తోంది. పౌరుల హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛనూ హరించి వేస్తోంది. సామ, దాన, దండోపాయాలతో మీడియాను తన అనుచరుల గుప్పిట్లో ఉండేలా కుట్రలు చేస్తోంది. మోడీ క్రోనీ మిత్రుడు గౌతం అదానీ ఎన్‌డిటివిని చేజిక్కించుకునేందుకు ఎంతటి అనైతిక కుట్రలకు పాల్పడ్డ్డాడో చూశాం. ద వైర్‌, న్యూస్‌క్లిక్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి స్వతంత్ర మీడియా సంస్థలను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి వేధింపులకు గురిచేసిన వైనాన్ని చూశాం. జనాన్ని తప్పుదారి పట్టించేందుకే ప్రత్యామ్నాయ మీడియా సంస్థలను, భావ ప్రకటనా స్వేచ్ఛను బిజెపి హరిస్తోంది. స్వేచ్ఛా స్వతంత్రాల కోసం పోరుసల్పుతున్న ప్రజాస్వామ్య గొంతులకు సుప్రీం ఇచ్చిన తీర్పు గొప్ప ఊరడింపు. భావ ప్రకటనా స్వేచ్ఛ వర్దిల్లాలి.

దాదాపు రెండేళ్లపాటు జైల్లో మగ్గిన కప్పన్‌కు బెయిల్‌ ఇవ్వడమే కాకుండా వాక్‌ స్వాతంత్య్రానికి అండగా నిలిచినందుకు జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనాన్ని ప్రశంసించాలి. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి చొరవ స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం అన్ని కట్టుబాట్లను దాటి కప్పన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. పలు లోతైన ప్రశ్నల ద్వారా అది ప్రాథమికంగా ఈ కేసులో కుట్రలూ కుతంత్రాలు దేశ ద్రోహాలు లేవని గుర్తించింది. హథ్రాస్‌లో మతకల్లోలాలు రెచ్చగొట్టడానికి కప్పన్‌ తీసుకెళుతున్న ‘టూల్‌ కిట్‌ అని యూపీ పాలకులు అంటున్నది అమెరికాలో బ్లాక్‌ లైవ్స్‌ మేటర్స్‌ ఉద్యమానికి సంబంధించిన ఇంగ్లీషు కరపత్రాలని నిర్థారించింది. కప్పన్‌ను తీవ్రవాదిగా పరిగణించడానికి తమకు ఒక్క ఆధారం కూడా కనబడటం లేదని ప్రకటించింది. ఒక బాధితురాలి పక్షాన గొంతువిప్పితే నేరం ఎలా అవుతుందని ప్రశ్నించింది. కప్పన్‌ వద్ద పేలుడు పదార్థాలేమైనా దొరికాయా అన్న ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నలోనే పాలకులపై లోతైన విమర్శ ఉన్నది. న్యాయమూర్తులు కాస్త మానవత్వంతో, విచక్షణతో వ్యవహరిస్తే ఇటువంటి కేసుల్లో డొల్లతనం ఇట్టే బయటపడుతుంది. నిరాధారమైన ఆరోపణలతో, రాక్షస చట్టాల ప్రయోగంతో ఎవరినైనా కటకటాల వెనక్కు నెట్టేయవచ్చునన్న పాలకుల నమ్మకాన్ని ప్రశ్నించే తీర్పు ఇది.

కప్పన్‌ భార్య, సోదరుడిని జమానత్‌లుగా పరిగణించాలని కోర్టును అభ్యర్థించినప్పటికీ, సెప్టెంబర్‌ 12న బెయిల్‌ షరతులు విధించిన లక్నోలోని ట్రయల్‌ కోర్టు నిరాకరించింది. బెయిల్‌ షరతుల ప్రకారం ఒక లక్ష ఆస్తికి పూచీ పడే ఇద్దరు వ్యక్తులను పూచీకత్తుగా చూపాలి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాళ్లే పూచీ పడాలన్న తిరకాసు అతని విడుదలను నిరోధిస్తుంది. ఉత్తరప్రదేశ్‌ వాసులు కప్పన్‌కు పూచీ పడడానికి జంకుతున్నారు. సుప్రీం బెయిల్‌ ఇచ్చినా ఇంకా కప్పన్‌పై మనిలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారిస్తున్న కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ఇంకా కప్పన్‌ లక్నోలోని జైలులోనే ఉన్నాడు. లక్నో జైలు సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆశిత్‌ తివారీ పిఎంఎల్‌ఎ  కేసులో బెయిల్‌ పొందగానే విడుదల అవుతారని చెప్పారు. ప్రొ. రూప్‌ రేఖ (79) లక్నో విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి కప్పన్‌ పూచికత్తు ఇవ్వడం హర్షణీయం.

Leave a Reply