Written by తెలుగు వెంకటేష్
రాత్రి నేను ప్రార్ధించేసమయంలో
తోడెళ్ళు యోనిని గాయపరుస్తాయి
లాఠీ చేయకూడని తప్పు చేస్తుంది
వైద్యం కరెన్సీ పడక మీద
నిద్దురపోతుంది
ఆకలి బాధ గడ్డకట్టుకపోయి
నిశ్చలమవుతుంది
అప్పులనీడ ఊరితాడై
కుటుంబాన్ని జనాభా లెక్కల నుంచి
వేరుచేస్తుంది
పేద , మధ్యతరగతి మనుషులు
సగం రాత్రి చచ్చి
మిగతా సగం పగలు చావడానికి
దేహాల్ని దాచుకుంటారు
భద్రత లేని లోకంలో
పండుముఖాలు నిరాశ శూన్యాలై
లోలోన గొణుక్కుంటూ ఉంటాయి
ఎక్కడో పసినిద్ర
ఉలిక్కిపడుతుంది
భ్రమల్లో బతుకుతోన్న ఆశలు
కోడినిద్దురతో కుస్తీ పడుతుంటాయి.
Related
నగ్న వాస్తవికత
మా సత్యం
‘అనిశ్చయం’ శీర్షిక భావగర్భితంగా లోతుగా అనేక సమస్యలతో కలగలిసిన అనిశ్చయం.
చాలా తాత్వికపరమైన సిద్ధాంత రాద్ధాంతాలతో ఇమిడి ఉంది.
ఈ కవితా చరణాలలో
‘లాఠీ చేయకూడని తప్పు చేస్తుంది
వైద్యం కరెన్సీ పడకమీద
నిద్దురపోతుంది ‘
రాజ్యం యొక్క వర్గ స్వభావాన్ని వ్యక్తీకరిస్తూ తనలోని ఆవేదన కవిత రూపంలో అక్షరత్వం పొందింది.