కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశం మీదికి కొత్త పదాన్ని, పథకాన్ని వదిలారు. దాని పేరు నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపి). జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ప్రణాళిక. అంటే జాతీయ ఆస్తులను అమ్ముకొని ద్రవ్యంగా మార్చుకోవడం. 

అబ్చే.. ఇది అమ్మేయడం కాదు. కేవలం లీజుకు ఇవ్వడమే. ఆస్తి పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఆస్తుల మీద అధికారం, అనుభవం మాత్రమే కార్పొరేట్లకు ఉంటాయని   కేంద్ర ప్రభుత్వం అంటోంది. కొద్ది మంది మేధావులేమంటున్నారంటే..బీజేపీ వాళ్లకు ఆర్థిక వ్యవస్థను నడపడం రాదు.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి కొద్ది మంది ఇది అసమర్థ ప్రభుత్వం.. అందుకే ఇలాంటి పనులు చేస్తోందని విమర్శిస్తున్నారు.  వీళ్లలో మార్క్సిస్టు వాసన ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. కాస్త చదువుకున్న మామూలు వాళ్లయితే బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఈ బీజేపీ వాళ్ల ఆటలు ఇలా సాగుతున్నాయని ఆక్రోశిస్తున్నారు.   ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని ఆవేదన చెందుతున్నారు.  

ఇవన్నీ నిజమా? ఇట్లా ఈ ఎన్‌ఎంపీని అర్థం చేసుకోగలమా?

ఇంతకూ ఈ పథకాన్ని తేవడానికి కేంద్రం చెప్పిన కారణం ఏమిటి?  

దేశంలో మౌలిక  సౌకర్యాలు కల్పించాలి. దీని కోసం  రూ. 111 లక్షల కోట్లతో ఒక పథకాన్ని తయారు చేశాం. దాన్ని అమలు చేయాలంటే డబ్బు కావాలి. దాని కోసమే  రూ. 6 లక్షల కోట్ల రూపాయాలకు ఈ తెగనమ్మకం పథకాన్ని చేపట్టాం.. అని నిస్సిగ్గుగా   ప్రభుత్వం చెప్పుకుంది.

కొత్తగా మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ఒక పథకం తయారు చేసి.. దాన్ని అమలు చేయడానికి ఇప్పటికే వివిధ రంగాల్లో ఉన్న ఆస్తులను అమ్మేయాలనుకోవడం ఏమిటి? మామూలుగా ఎవ్వరూ ఈ పని చేయరు. కాబట్టి ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం చేతకావడం లేదనే నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. దాన్నుంచే అసమర్థ ప్రభుత్వమనే అభిప్రాయం కూడా వస్తున్నట్లుంది.

ఇవేవీ సరైన విశ్లేషణలు కాదు.  మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చాలా సమర్థవంతమైనవి. తాము ఎంచుకున్న  లక్ష్యం దిశగా శరవేగంగా  పని చేసుకపోతున్నాయి. దశాబ్దాలుగా ఈ దేశ ప్రజల రక్తమాంసాలతో నిర్మాణమైన సంస్థలను, ఆస్తులను ఒక పథకం ప్రకారం కార్పొరేట్లపరం చేసే పథకం ఇది. చాలా పకడ్బందీగా ఈ పని చేస్తున్నారు. ఏ మాత్రం దాపరికం లేకుండా ముందుకు పోతున్నారు. తమ అధికారాన్ని ఏ వర్గ ప్రయోజనాలకు వెచ్చించవలసి ఉన్నదో గుర్తెరిగి, ఆ దిశగా పాలన సాగిస్తున్నారు.  అందులో భాగమే ఈ తాజా అమ్మకాల పథకం.   

ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ల ప్రయోజనాల కోసం పాలకులు పని చేయాలని ఎవరైనా  అనుకుంటారు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రజా ప్రాతినిధ్యం అనే ముఖం వైపు నుంచి చూస్తే ఇది సరైనదే. కానీ ఆ పక్క ఇంకో ముఖం ఉన్నది. రాజ్యాంగ యంత్రమంతా దోపిడీ వర్గం చేతిలో ఉన్నది. ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్లెవరైనా ఆ వర్గానికి అనుకూలంగా పథకాలు తయారు చేయాలి. అందులో భాగంగానే జాతీయ ఆస్తుల అమ్మకాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజల కోసం కావాలంటే.. పింఛన్‌ పథకాలు, ఉచిత పథకాలు, ఉపాధి పథకాలు ఎన్నయినా పెట్టుకోవచ్చు. 

విజ్ఞులైనవాళ్లు ఈ రెండు రకాల పథకాలను పోల్చి చూసుకోవాలి. 

ప్రజలకు ఇచ్చే పథకాల్లో నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, అవినీతి వంటివి భారీగా ఉంటాయి. అదే కార్పొరేట్ల కోసం తయారు చేసిన పథకాల్లో ఇవి ఉంటే వాళ్లు తాట తీస్తారు. నిర్మలా సీతారామన్‌ విడుదల చేసిన పత్రాల్లో ఆ చిత్తశుద్ధి ఉన్నది. నిజాయితీ ఉన్నది.   అన్నీ మీకు అమ్మేస్తాం.. తీసేసుకోండి అనే స్పష్టత ఉన్నది. 

ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే, ద్రవ్యీకరణ అనే మాటకు అమ్మకం అనే పదం వాడలేకపోతున్నారు.    లీజు, తాకట్టు వంటి వేరే పదాలను వాడుతున్నారు. మన ప్రజాస్వామ్యం పాలకులను ఇలాంటి ఇబ్బందికి గురి చేస్తోంది. అంతే.  కానీ  ఒకసారి ఆస్తులు లీజుకో, తాకట్టుకో వెళ్లిపోయాక ఏమవుతుంది? దానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు. నిబంధనల వల్లింపు అవసరం లేదు. 

ప్రజల ఆస్తులను వేరే వాళ్ల పరం చేస్తే నిర్వహణ అంతా వాళ్ల చేతిల్లోకి వెళ్లిపోతుంది.  లాభాల కోసం వాళ్లు రేట్లు ఎంతయినా పెంచేయవచ్చు. ఆ రకంగా కూడా మళ్లీ ప్రజల రక్తమాంసాలు పీల్చేస్తారు. వ్యాపారం అంటే లాభాలు. అంతేగాని సేవ కాదు. ప్రజా ప్రయోజనం కాదు. రోడ్లు, విద్యుత్‌, రైళ్లు, విమానాలు వగైరా కొనేసుకున్న వాళ్లు లాభాల కోసం ఇష్టారాజ్యంగా వాటిని నిర్వహిస్తారు. దీన్ని  కొత్తగా విశ్లేషించాల్సిన పని లేదు. ఇప్పటికే ప్రజల అనుభవంలో ఉన్నది. 

కాబట్టి ఇట్లా అమ్మే అధికారం మీకెవరు  ఇచ్చారు? కొనే అధికారం వాళ్లకు ఎవరు ఇచ్చారు? ప్రజల ఆస్తులను మేనేజ్‌ చేయడానికే నీకు అధికారం ఇస్తే నీవు ఇంకొకరికి  వాటిని కట్టబెట్టే హక్కు ఎవరిచ్చారు? అని  వాదన చేసే  దశను మన ప్రజాస్వామ్యం ఏనాడో దాటుకొని వచ్చేసింది. 

మాకు  మెజారిటీ సీట్లు ఇచ్చారు కాబట్టి మా  వెనుక ఉన్న దోపిడీ వర్గం కోసం మేము ఏమైనా చేస్తాం..  చట్టబద్ధంగానే చేస్తాం..   చాటుమాట అక్కర్లేకుండా చేస్తాం..  అనే బరితెగింపు దశ ఇది. 

అయితే ఇది ఇప్పుడే మొదలు కాలేదు. ముప్పై ఏళ్ల కింద కాంగ్రెస్‌ తెచ్చిన నూతన ఆర్థిక విధానాలతోనే ఆరంభమైంది. ఆ మాటకొస్తే నెహ్రూ హయాంలో పబ్లిక్‌`ప్రైవేట్‌ భాగస్వామ్య ఆర్థిక విధానంతోనే బండి ఈ పట్టాలు ఎక్కింది. అనేక మలుపులు తిరుగుతూ,  ఎక్కడి చేరవలసి ఉన్నదో అక్కడికి   చేరింది. పబ్లిక్‌ మనీతో మౌలిక కల్పనలు చేసి పెట్టుబడిదారీ వర్గం బలపడేలా  నెహ్రూ చేస్తే, పబ్లిక్‌ రంగ సంస్థలన్నిటినీ కార్పొరేట్లకు పూర్తిగా తెగనమ్ముకొనే పని మోదీ చేస్తున్నాడు. ఆ రకంగా భారత ప్రభుత్వం కార్పొరేట్ల పనిని  సమర్థవంతంగా  చేసుకపోతోంది.  ఇప్పుడు ఒక ‘విజన్‌’తో  జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ప్రణాళికను తీసుకొని వచ్చింది.  

మన రాజ్యానికి ఉన్న ‘ప్రజాస్వామ్య’ ముఖం నుంచి  వీటిని చూడలేం.  దాని సారమైన బూర్జువా నియంతృత్వం వైపు నుంచి చూస్తేనే సరిగా అర్థమవుతుంది. సంఫ్‌ుపరివార్‌ హిందుత్వ విధానం,  ప్రజల ఆస్తులు అమ్ముకొనే ప్రణాళిక  బొత్తిగా సంబంధం లేని విషయాలు కాదు.   దోపిడీ అర్థిక విధానాలు, అమ్మకాల ఆర్థిక ప్రణాళికలు యథేచ్ఛగా సాగించుకోడానికి మతాన్ని, ఆనాగరిక భావజాలాన్ని అడ్డం పెట్టుకోవడమే హిందుత్వ ఫాసిజం. అచ్చమైన బూర్జువా నియంతృత్వమిది. 

ఈ విధానాలతో దేశంలోని ఏ ఎన్నికల పార్టీకీ మౌలికంగా పేచీ లేదు. బలమైన ప్రతిపక్షం ఉండి ఉంటే ఈ అమ్మకాలు జరిగేవి కావని అనుకోవడం భ్రమ మాత్రమే. పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వమే నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిందనే సంగతి మర్చిపోరాదు. నిజానికి ఈ తరహా ఆర్థిక విధానాలను అమలు చేయడానికి మన దేశంలో ఏ పార్టీ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ అక్కర్లేదు. దేనికంటే అధికార, ప్రతిపక్ష, చిల్లమల్లర పార్టీలకు, కుల సమీకరణాలతో రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీల అన్నిటి విధానం ఇదే. కాకపోతే నాలుగు రోజులు ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రహసనం నడుపుతారు. 

దేశంలోని 26,700 కిమీ రహదారులు,  400 రైల్వే స్టేషన్లు, 90 రైళ్లు, 1,400 కిమీ రైలు మార్గం, 265 గూడ్స్‌ షెడ్లు, 15 రైల్వే స్టేడియాలు,   28,608 సర్క్యూట్‌ కిమీ విద్యుత్‌ సరఫరా లైన్లు,  2,86,000 కిమీ భారత్‌ నెట్‌ ఫైబర్‌, 14917 బిఎస్‌ ఎన్‌ ఎల్‌, ఎం టి ఎన్‌ ఎల్‌ టవర్లు,  ఆరు జిగా వాట్ల విద్యుదుత్పత్తి రంగం,  8,154 కిమీ సహజ వాయువు పైప్‌ లైన్లు,  3,930 కిమీ పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌ లైన్లు,  ఫుడ్‌ కార్పొరేషన్‌ కు, సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కు చెందిన 210 గోడౌన్లు,    160 గనులు,  25 విమానాశ్రయాలు, తొమ్మిది ఓడరేవులకు చెందిన 31 ప్రాజెక్టులు, రెండు జాతీయ క్రీడా స్టేడియాలు,  రెండు ప్రాంతీయ కేంద్రాలు,  ఢల్లీిలో ఇళ్ల స్థలాలు, దేశవ్యాప్తంగా హోటళ్లు మొదలైనవన్నీ అమ్మకానికి పెట్టారు. 

ఈ అమ్మకాల పథకం ఇక్కడితో ముగిసిపోయేది కాదు. ఇప్పుడు విక్రయిస్తున్నవేగాక ఇంకా తమ దగ్గర ఎంత విలువైన సరుకు ఉన్నదీ నీతి అయోగ్‌ తయారు చేసిన పత్రాల్లో రాశారు. ఎప్పటికైనా ఇవి మీకే అమ్మేస్తామని బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థలకు సంకేతం ఇచ్చేశారు. మొత్తంగా ప్రజల నెత్తుటి చెమటలతో తయారైన సంపదలను పెట్టుబడిదారులకు విక్రయించే విషయంలో శరవేగంగా పాలకవర్గం ముందుకు వెళుతోంది. దీన్ని అంకెల గారడీగా చూడ్డానికి లేదు. వంచనగా భావించడానికి లేదు. ఇన్ని ఆస్తులను అమ్మగా వచ్చిన రూ. 6 లక్షల కోట్ల రూపాయాలను తిరిగి ఎక్కడో ప్రజల మౌలిక సౌకర్యాలకు వెచ్చిస్తారని భ్రమపడటానికి లేదు. పైకి లీజుగా కనిపించే అమ్మకాలకు, అమ్మగా వచ్చిన డబ్బుకు ఎక్కడా లెక్కాపక్కా ఉండదు. కాయితాలు ఉండవు. ఆధారాలు ఉండవు. మళ్లీ వెనక్కి తీసుకొనే అవకాశమే ఉండదు. ఒక వేళ రాబోయే ఎన్నికల్లో సీట్ల అంకెల గారడీతో బీజేపీ పడిపోయి ఇంకో ప్రభుత్వం వస్తే ఈ లీజులు, ఒప్పందాలు, అమ్మకాల వ్యవహారమంతా తారుమారైతుందనుకోడానికి లేదు. దీన్నంతా వెనక్కి తీసుకొస్తారని ఆశించడానికి లేదు. దేనికంటే పీవీ నరసింహారావు ప్రవేశ పెట్టిన నూతన ఆర్థిక విధానాలను కాంగ్రెస్‌ బద్ధ వ్యతిరేక ప్రభుత్వాలు పక్కన పెట్టలేదు. పైగా కాంగ్రెస్‌ మీద విమర్శ ఏమంటే ఆ విధానాలను సక్రమంగా అమలు చేయలేదని. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని. అంటే పూర్తిస్థాయిలో కార్పొరేట్‌ పరం కావలసిన ఆర్థిక వ్యవస్థ ఇంకా కాలేదనే విమర్శ. మోదీ నిత్యం కాంగ్రెస్‌ మీద చేసే ఆరోపణ అదే కదా. అందుకే ఆయన కార్పొరేట్‌ సేవ చిత్తశుద్ధితో, ముమ్మరంగా చేస్తున్నాడు.

కాబట్టి ఎప్పటికైనా, ఇంకేదో పార్టీ అధికారంలోకి వస్తే ఈ అమ్మకాల విధానం ఆగిపోతుందని అనుకోవడం వెర్రి మాత్రమే.  కాబట్టి ఏం చేయాలో ప్రజలు ఆలోచించుకోవాల్సిందే.   దేశమంటే పాలకవర్గమే కాదు. దేశమంటే  ప్రజలు.   ఆ ప్రజలే ఏమైనా చేయగలరు.  

Leave a Reply