‘ఆసియన్ స్పీక్స్’ , ‘అరోరా ఆన్‌లైన్’ కోసం రెజాజ్ ఎం షీబా సిదీక్ 2022 ఆగస్టు 26న గాంధేయవాది, మానవ హక్కుల కార్యకర్త హిమాంశు కుమార్‌ను ఎర్నాకులంలో ఇంటర్వ్యూ చేశారు. యుఏ(పి)ఏకి వ్యతిరేకంగా జరిగిన మానవహక్కుల సదస్సులో ప్రసంగించేందుకు హిమాంశు కుమార్ కేరళకు వచ్చారు.  సుమారు ఒక గంటసేపు జరిగిన సంభాషణలో హిమాంశు భగత్ సింగ్ మాటలను ప్రతిధ్వనించారు, “భారతదేశ శ్రామిక ప్రజానీకాన్ని, సహజ వనరులను కొన్ని పరాన్నజీవులు దోపిడీ చేస్తున్నంత కాలం యుద్ధస్థితి ఉనికిలో ఉంది, ఉంటుంది. వారు పూర్తిగా బ్రిటిష్ పెట్టుబడిదారులు లేదా మిశ్రణ బ్రిటీష్-ఇండియన్ లేదా పూర్తిగా భారతీయులు కావచ్చు”. 

గోంపాడ్ ఊచకోతపై స్వతంత్ర దర్యాప్తును కోరినందుకు సుప్రీంకోర్టు మీకు జరిమానా విధించిన తర్వాత మలయాళీలకు మీ గురించి మీడియా ద్వారా తెలిసింది. మీ వ్యక్తిగత జీవితం గురించి మాకు చెప్పండి.

నేను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జన్మించాను. నా వయస్సు 57 సంవత్సరాలు. మా నాన్న ప్రకాష్ భాయ్ గాంధేయవాది. 1946లో గాంధీతో కలిసి సేవాగ్రామ్‌లో పనిచేశారు. నా భార్య, ఇద్దరు కుమార్తెలు హిమాచల్ ప్రదేశ్‌లో నివసిస్తున్నారు. నేను వాణిజ్యశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సంపాదించాను. యుగాంగ్ అనే వార్తాపత్రికకు ఎడిటర్‌గా పనిచేశాను. ఢిల్లీలో కొంతకాలం గడిపిన తర్వాత గుజరాతీ ఆదివాసీలతో కలిసి మూడేళ్లు పనిచేశాను. మా పెళ్లయిన 20 రోజుల తర్వాత ఆదివాసీలతో కలిసి జీవించడానికి, పని చేయడానికి మేమిద్దరం చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడకు మకాం మార్చాం.  గ్రామాల్లో పనిచేయాలని యువతకు గాంధీ ఇచ్చిన సలహాలు గాంధీవాదాన్ని అనుసరించడానికి ప్రేరణనిచ్చాయి. గ్రామస్తులు మా కోసం ఒక కుటీరాన్ని నిర్మించారు. ఛత్తీస్‌గఢ్‌, దంతేవాడలోని సేంద్ర గ్రామంలో ఒక ఆశ్రమాన్ని ప్రారంభించాము.  వెయ్యిమంది సిబ్బంది వున్నారు. మేము అనేక జిల్లాల్లో పనిచేశాము. అయితే,  ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణవంటి కొత్త ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చినప్పుడు ఉత్పన్నమైన మానవహక్కుల సమస్యలను న్యాయస్థానాలకు తీసుకువచ్చాము. ఆదివాసీలపై సల్వాజుడుం చేస్తున్న దౌర్జన్యాలను ప్రశ్నించాము. ఇది మాకూ ప్రభుత్వానికి మధ్య ఘర్షణకు దారితీసింది.  నేను అధికారులకు సమస్యగా పరిణమించడంతో ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించకుండా సంవత్సరాలపాటు నిషేధానికి గురయ్యాను.

2009 అక్టోబర్ 1నాడు ఛత్తీస్‌గఢ్‌లోని గోంపాడ్‌లో ఏం జరిగింది?

భద్రతా బలగాలు, సల్వాజుడుం (ప్రభుత్వం ఆదివాసీలతో ఏర్పాటు చేసిన అక్రమ మిలీషియా) 16 మంది ఆదివాసీలను చంపేశాయి. 2 ఏళ్ల పిల్లాడి చేతివేళ్లను నరికివేశారు. బాధిత ఆదివాసీలు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారిని ఢిల్లీకి తీసుకెళ్లాము. విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసాము. పిటిషన్ దాఖలు చేసి 13 ఏళ్లు గడిచిన తరువాత ఎలాంటి విచారణ జరపకుండానే కేసు బూటకమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి మేము సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించమని అడుగుతున్నాము. ఎటువంటి విచారణ లేకుండా, దానిని బూటకమని వారు ఎలా చెప్పగలరు?

గోంపాడ్‌లో భారత సాయుధ బలగాలు ఊచకోత కోసిన ఆదివాసీల కోసం పోరాడినందుకు సుప్రీంకోర్టు మీకు అయిదు లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే అరెస్టు చేస్తామంటూ బెదిరింపులు కూడా ఉన్నాయి. ఈ బెదిరింపులను మీరు ఎలా చూస్తారు?

నేను ఈ బెదిరింపులను ఆదివాసీలకు, వారి హక్కులకు, మానవహక్కులకు ముప్పుగా చూస్తున్నాను. కోర్టులో ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహించే ఏ వ్యక్తి అయినా శిక్షను ఎదుర్కొంటాడు, అది ఆదివాసీ మానవహక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ బెదిరింపులను నేను ఆదివాసీలకు బెదిరింపులుగా భావిస్తున్నాను.

ఆదివాసీల మధ్య, వారి కోసం పనిచేసిన వారు భీమా కోరేగావ్ కేసులో ముఖ్యంగా ఫాదర్ స్టాన్ స్వామిని జైల్లో పెట్టారు. ఫాసిస్టులు మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని ప్రణాళిక వేస్తున్నారా?

అవును, గోంపాడ్ కేసుపై తీర్పులో సుప్రీంకోర్టు నాపై ఎఫ్‌ఐఆర్‌ను అనుమతించింది కాబట్టి నన్ను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు.

ఆదివాసీల మధ్య పనిచేస్తున్నందుకు మీలాంటి గాంధేయవాదిని మావోయిస్టు అని పిలుస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?

మావోయిస్ట్‌‌గా ముద్రపడింది నా మీద మాత్రమే కాదు. ప్రభుత్వం తెలివైనది. రాజ్యాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిపైనా మావోయిస్టులుగా ముద్ర వేస్తుంది. అందుకే నన్ను మావోయిస్టు అని అనడంలో ఆశ్చర్యం లేదు.  నన్ను మావోయిస్టు అనడాన్ని చెడు వ్యాఖ్యగా తీసుకోను. ఎందుకంటే మావోయిస్టులు చెడ్డవారని, ప్రజా వ్యతిరేకులని నేను నమ్మను. కానీ నన్ను ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘీ అని పిలిస్తే బాధపడ్తాను.

మారణహోమం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. రాజకీయ అధికారం మారినప్పటికీ ఆదివాసీలపై అణచివేత కొనసాగుతోంది. మీరు దానిని ఎలా చూస్తారు?

క్షేత్రస్థాయి పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ఆదివాసీల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరిన్ని భద్రతా దళాలను మోహరించారు. కొత్త క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. బస్తర్ ప్రాంతంలో 12 చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఈ శిబిరాల ఏర్పాటును ఆదివాసీ సముదాయాలు, యువత, మహిళలు వ్యతిరేకిస్తున్నారు.  బూటకపు ఎన్‌కౌంటర్‌లు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా ఆదివాసీల స్థితిలో మార్పు రాలేదు.

గాంధీవాదం, అహింసలకు సంరక్షకురాలిగా చెప్పుకునే భారత జాతీయ కాంగ్రెస్‌ను మీరు ఎలా చూస్తారు?

గొంపాడు కేసుల మాదిరిగానే సుప్రీంకోర్టులో కేసులు వేసినప్పుడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా న్యాయవాదులను నియమించింది. బీజేపీ హయాంలో ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లను సమర్ధించింది.  సల్వాజుడుంను సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే.

విస్తృతంగా ప్రాచుర్యం పొందిన భారతీయ సాయుధ దళాలు, మావోయిస్టుల మధ్య ఆదివాసీలు ‘నలిగిపోతున్నారనే  సిద్ధాంతం’ తో మీరు ఏకీభవిస్తున్నారా?

ఆదివాసీలతో మాట్లాడిన తర్వాత, వారు ఈ సిద్ధాంతాన్ని ఆమోదించరని నాకు అర్థమైంది. ఈ సిద్ధాంతాన్ని ప్రభుత్వ పక్షం వహించే వ్యక్తులు, మీడియా ప్రచారం చేస్తుంది. మేము ప్రజలతో మాట్లాడినప్పుడు, వారు తమపై రాజ్యం మాత్రమే దాడి చేస్తుందని చెప్పారు.  “మీపై దాడి చేసింది మావోయిస్టులా?” అని గోంపాడు ఆదివాసీలను జర్నలిస్టులు అడిగినప్పుడు వారు దానిని ఖండిస్తూ “మావోలు మమ్మల్ని ఎందుకు చంపుతారు?” అని ఎదురు ప్రశ్నించారు. కాబట్టి, ఈ సిద్ధాంతంలో నాకు ఎలాంటి వాస్తవమూ కనిపించలేదు.

మావోయిస్టులు మీతో ఎప్పుడైనా చెడుగా వ్యవహరించారా?

లేదు, నేను వారితో ఎలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోలేదు. మేము వారితో (మావోయిస్ట్‌లతో) చాలా విషయాలు చర్చించాము. మేము చర్చించిన విషయాలు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాము. ఆదివాసీలకు రోడ్లు, కరెంటు స్తంభాలు, రేషన్ షాపుల ఏర్పాటు వంటి గతంలో లేని ఎన్నో మంచి సూచనలను మావోయిస్టుల నుంచి తీసుకున్నాం.

మావోయిజం భారతదేశానికి అతిపెద్ద అంతర్గత ముప్పు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రస్తుత హోంమంత్రి, అమిత్ షా కూడా 2022 నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని చెప్పారు. అదే సమయంలో, భారీ మొత్తంలో అటవీ భూమిని కార్పొరేట్‌లకు ధారాదత్తం చేస్తున్నారు. ఆదివాసీల ప్రతిఘటనను రాజ్యం అణిచివేస్తోంది. పాలక ప్రభుత్వం, ప్రతిపక్షాలు అప్పుడూ ఇప్పుడూ ఒకే విధానంలో ఉన్నాయని అనుకుంటున్నారా?

అవును. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, సీపీఐ(ఎం) వంటి ఇతర పార్టీలు ఒకే విధమైన ఆర్థిక విధానాలను కలిగి ఉన్నాయని మాకు తెలుసు. ఈ పార్టీల ఆర్థిక విధానాలు ఒకేలా ఉన్నప్పుడు, రాజ్యాంగం, చట్టపరమైన హక్కులు, మానవహక్కుల పట్ల వారి పాలన, వైఖరి ఒకే విధంగా ఉంటాయి. వాస్తవంలో మనం చూస్తున్నది ఇదే. అధికార పార్టీ మారినా ఆదివాసీలకు క్షేత్రస్థాయిలో ఏమీ మారదు.

ఆదివాసీ ప్రాంతాల్లో, ప్రభుత్వానికి ఆదివాసీలకు మధ్య జరుగుతున్న ఘర్షణ యుద్ధమని మానవహక్కుల సదస్సులో మీరు అన్నారు. ఆ యుద్ధానికి నేడు బీజేపీ-మోదీ ప్రభుత్వం నాయకత్వం వహిస్తోంది. ఈ యుద్ధంపై ప్రతిపక్షాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి?

యుపిఎ ప్రభుత్వంలోని పూర్వ గృహమంత్రి చిదంబరం, ప్రధాని మన్మోహన్‌సింగ్ హయాంలో అంటే కాంగ్రెస్ హయాంలో ఈ యుద్ధం మొదలైంది. తానే ప్రారంభించినప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తుంది?

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎకరాల కొద్దీ అటవీ భూమిని అదానీ, వేదాంత, టాటా వంటి సామ్రాజ్యవాద దళారీ బూర్జువాలకు గనుల తవ్వకాల కోసం యివ్వడంపై ఆదివాసీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీ, ప్రతిఘటనల చారిత్రక నేపథ్యం ఏమిటి?

2005లో ఛత్తీస్‌గఢ్‌లో ఈ దోపిడీ మొదలైంది. 1991-92లో ప్రపంచీకరణసరళీకరణ-ప్రైవేటీకరణ అని పిలవబడే కొత్త ఆర్థిక పాలన ప్రారంభమైన తర్వాత, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలను అభివృద్ధి చేసే నెపంతో బహుళజాతి కంపెనీలు రావడం ప్రారంభించాయి. 

దక్షిణాసియాలో, ప్రత్యేకించి భారతదేశంలో, అంతర్జాతీయ పెట్టుబడిదారులు గనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు, ముఖ్యంగా మధ్య భారతదేశంలోని జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు రావడం ప్రారంభించారు. ఈ ప్రాంతాలకు అంతర్జాతీయ పెట్టుబడి వచ్చిన తర్వాత ఛత్తీస్‌గఢ్ వంటి సహజ ఖనిజసంపద ఉన్న ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లో బంగారం, వజ్రాలు, ఇనుప ఖనిజం, తగరం వంటి అనేక విలువైన ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీలు 2005లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. చట్టపరమైన మార్గాలను అనుసరించే బదులు, వారు 2005లో సల్వాజుడుం వంటి చట్టవిరుద్ధమైన మిలీషియా కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు 5000 మంది గూండాలను సంఘటితం చేసి, వారికి రైఫిళ్లు ఇచ్చి, ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించుకున్నారు. ఈ ప్రత్యేక పోలీసు అధికారులు ఆదివాసీ గ్రామాలపై దాడులు ప్రారంభించారు. దాదాపు 644 గ్రామాలను కాల్చేశారు, వేలాది మంది ఆదివాసీలను చంపారు, కటకటాల వెనక్కు నెట్టారు;  వేలాది మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసారు. సల్వాజుడుం రాజ్యాంగ విరుద్ధమని 2011లో సుప్రీంకోర్టు ప్రకటించింది

ఛత్తీస్‌గఢ్‌లో హాసదేవ్ నిరసన ఏమిటో చెప్పగలరా?

ఇది అదానీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన. అదానీ తన బొగ్గు తవ్వకాల విస్తరణ కోసం మరింత భూమిని లాక్కొని అడవులను నరికివేయాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, నేను అక్కడికి వెళ్లాను.  ప్రతిఘటన, నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. పలుచోట్ల ప్రజలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇకపై అదానీకి భూములివ్వబోమని ప్రజలు నినాదాలు చేస్తున్నారు.

ప్రభుత్వం, పోలీసుల సహకారంతో కార్పొరేట్‌ సంస్థలు అడవులను దోపిడీ చేయడం, ఆదివాసీలపై పారామిలటరీ దాడులు చేయడం పట్ల బహుజన సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధుల వైఖరి ఏమిటి?

బహుజన సంఘాలు ఆదివాసీలతో కలిసి ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకిస్తున్నాయి. అడవుల నరికివేత, కార్పొరేట్ల భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

సామాన్య ప్రజలు, రాజకీయ పార్టీలు దోపిడీదారులకు వ్యతిరేకంగా చేస్తున్న శాంతియుత-సాయుధ పోరాటాలను ఎలా చూస్తారు?

అవును, సీపీఐ (మావోయిస్ట్), సీపీఐ, సీపీఐ(ఎం), పీయూసీఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్), సర్వ ఆదివాసీ సమాజ్ వంటి గాంధీవాద ఆదివాసీ సంస్థలు అనేక రకాల పోరాటాలు సాగిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో అన్ని రకాల ప్రతిఘటనలు కొనసాగుతున్నాయి. దోపిడీదారులకు వ్యతిరేకంగా భారీ ప్రతిఘటన జరుగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ మహిళల పరిస్థితి ఏమిటి? మహిళలపై అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగించే సాయుధ అధికారులు శిక్షించబడతారా?

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసినందుకు ఇప్పటివరకూ భారతీయ సాయుధ దళ అధికారి లేదా పోలీసు అధికారి ఎవరికీ శిక్షపడలేదు. ఆదివాసీ మహిళలు భద్రతాబలగాల అణచివేతను ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో అత్యాచారం ఒక సాధారణ విషయంగా మారింది. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది.

ఆదివాసీలు మావోయిస్టుల్లో చేరడానికి కారణాలేంటి? అందులో మహిళల భాగస్వామ్యం ఎంత?

మావోల ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపుల్లో చాలా మంది మహిళలు ఉన్నారని మీడియా కథనాలను బట్టి మనం చూడవచ్చు.  ఆదివాసీలు మావోయిస్టుల్లో చేరడానికి గల కారణాలు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల దోపిడీ, రాజ్య దాడులు, దోపిడీలు.

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా సైన్యం(పిఎల్‌జిఎ)లోకి సిపిఐ (మావోయిస్ట్) మైనర్లను సైనికులుగా నియమిస్తుందనే అపోహ ఉంది. అది నిజమా?

గ్రామాలపై పలుమార్లు దాడుల తర్వాత, గ్రామ యువకులు సంఘటితమయ్యారు. భద్రతా దాడుల నుండి తమ సముదాయాన్ని రక్షించుకోడానికి శిక్షణ ఇవ్వడం ద్వారా మావోయిస్టులు వారికి మద్దతు ఇచ్చారు. గ్రామంలోని యువకులందరూ అక్కడ ఉంటారు, మైనర్‌లు కూడా ఉండవచ్చు. కానీ మావోయిస్టులు వారిని రిక్రూట్ చేశారు లేదా నియమించారు అని అర్థం కాదు. తమ సముదాయాన్ని కాపాడుకోవడానికి, రాజ్య హింసతో పోరు చేయడానికి గ్రామ యువత స్వయంగా సంఘటితమవుతున్నారు.

2021 ఏప్రిల్ 19-21 మధ్య ఛత్తీస్‌గఢ్‌లో డ్రోన్ దాడుల ద్వారా సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామాలపై బాంబు దాడి చేశాయని ఆదివాసీలు, మావోయిస్టులు చెప్పారు. ఇది నిజమేనా?

ఆదివాసీ రాజకీయ కార్యకర్త, సోని సోరి, గ్రామాలు, పొలాలు, ఆదివాసీల ఇళ్ల మీద వేసిన బాంబులు, రాకెట్ లాంచర్‌ల వల్ల ఏర్పడిన గోతులు, వాటి అవశేషాలను చూసి నివేదిక నిచ్చారు. మీడియా ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు.

ఒరిస్సాలో ఆర్‌ఎస్‌ఎస్‌-విహెచ్‌పి-బజరంగ్దళ్-బిజెపి ఉగ్రవాదులు మతమార్పిడి చేసిన దళిత-ఆదివాసీ క్రైస్తవులను చంపిన కంధమాల్ మారణకాండకు ఈరోజుకి పధ్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. మైనారిటీలపై దాడులను మీరు ఎలా చూస్తారు?

మైనారిటీలపై దాడులు భారతదేశంలో రోజువారీ విషయం, ఒకవేళ కనిపించే దాడులు లేకపోయినప్పటికీ కూడా, మైనారిటీలు తీవ్ర, శాశ్వతమైన ముప్పులో ఉన్నారు. పోలీసులు తమను ఉగ్రవాదులుగా, శాశ్వతంగా అనుమానితులుగా చూస్తున్నారని, ఏ రోజైనా అదుపులోకి తీసుకోవచ్చనే భయానికి గురవుతున్నారు.  నాకు చాలా మంది ముస్లిం, క్రైస్తవ స్నేహితులు వున్నారు కాబట్టి ఈ నిరవధిక బెదిరింపుకు గురవుతున్నారనే విషయం నాకు తెలుసు.

వారి మెదళ్లు ముప్పు నెదుర్కొంటున్నాయి కాబట్టి హిందువులలాగా ఆలోచించలేరు. వారికి నచ్చిన ఆహారం తినలేరు, స్వేచ్ఛగా నడవలేరు లేదా హోటల్‌లో నిర్భయంగా ఉండలేరు. ముస్లింలుగా వున్న తమ గుర్తింపు వల్ల హోటల్‌లో గది దొరకదని భయపడుతున్నారు. కాబట్టి వారు ఒత్తిడి, బెదిరింపులకు గురవుతున్నారు. ఇది సమాజానికి చాలా దురదృష్టకరం, ప్రమాదకరమైన అంశం.

పెట్టుబడిదారుల కోసం భారత సాయుధ దళాల ద్వారా జరుగుతున్న రాజ్యహింసను ఒక గాంధేయవాదిగా మీరు ఎలా విశ్లేషిస్తారు?

పెట్టుబడిదారీ విధానం హింస ద్వారా మాత్రమే విస్తరిస్తుంది. ఎందుకంటే ఇది ఇతరుల వనరులను లాక్కోవడంపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు తమ వనరులను ఇవ్వడానికి అంగీకరించరు. కాబట్టి పెట్టుబడిదారీ శక్తులు ప్రజల వనరులను స్వాధీనం చేసుకోవడానికి రాజ్యాధికారాన్ని, అక్రమ అధికారాన్ని, కండబలాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఆదివాసీ ప్రాంతాల్లో హింస ద్వారా సహజ వనరులను లాక్కోవడాన్ని మనం చూస్తున్నాం. దానిని వ్యతిరేకిస్తున్నాం.

యుఏపీఏ చట్టం ఎంత క్రూరంగా ఉంది?

ఇది ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను తిరస్కరిస్తుంది కాబట్టి చాలా క్రూరమైనది. ఛార్జిషీట్ దాఖలు చేయకుండా, సంవత్సరాల తరబడి జైల్లో ఉంచగలరు. భీమా కోరేగావ్ కేసులో, షోమాసేన్ 4 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నారు, ఆమెపై ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. ఈ అరెస్టులు, ఎటువంటి బెయిల్ లేదా విచారణ లేకుండా జైలులో నిర్బంధించడం చాలా క్రూరమైనది.  ‘బెయిల్ మంజూరు నియమం- జైలు మినహాయింపు’ అని సుప్రీం కోర్టు పేర్కొంది, కానీ ఇది యుఏపీఏలో వర్తించదు. ఈ చట్టం ప్రాథమిక రాజ్యాంగ హక్కులను అణిచివేస్తుంది కాబట్టి, దానిని రద్దు చేయాలి.

రాజకీయ అసమ్మతివాదులపైనా, పౌరులపైనా రాజ్యహింసను అమలుచేయడానికి యుఏపీఏని ఉపయోగించడంలో సిపిఐ(ఎం) పార్లమెంటరీ వామపక్షాలు ఇతర పార్లమెంటరీ పార్టీల కన్నా భిన్నంగా లేవని మీరు భావిస్తున్నారా?

అవును, ఇప్పుడు ఈ పార్టీలు కూడా ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను కొనసాగిస్తున్నాయి, కాబట్టి వారి పాలన బిజెపి, కాంగ్రెస్‌ల మాదిరిగానే ఉంది.  వారు రాజకీయ కార్యకర్తలపై యుఏపీఏ తదితర క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తున్నారు. రాజ్యం ఉగ్రవాదులపై కాకుండా రాజకీయ కార్యకర్తలపై యుఏపీఏని ఉపయోగిస్తుంది.

జాతీయ స్థాయిలో యుఎ(పి)ఎకి వ్యతిరేకంగా ప్రచారం చేసే సిపిఐ(ఎం), సాహిత్యాన్ని కలిగివున్నందుకు లేదా గోడలపై పోస్టర్లు వేసినందుకు కూడా రాజకీయ అసమ్మతివాదులపై యుఎ(పి)ఎను ప్రయోగించే కేరళ సిపిఐ (ఎం) ప్రభుత్వ  విధానాల మధ్య వైరుధ్యాలను మీరు ఎలా చూస్తారు?

ఇది దురదృష్టకరం, కపటమైనది. CPI(M) అటువంటి కార్యకలాపాలను మానుకోవాలి, దూరంగా ఉండాలి;  లేకుంటే అది సీపీఐ(ఎం) భవిష్యత్తు జాతీయ రాజకీయాలకు హాని కలిగిస్తుంది.

మావోయిస్టులుగా పిలువబడే ఆదివాసీలపై దాడి జరిగినప్పుడు పార్లమెంటరీ వామపక్ష-దళిత ఆదివాసీ సంస్థల ఎంపిక క్రియాశీలతను, మౌనాన్ని ఎలా చూస్తున్నారు?

భద్రతా బలగాలు ఆదివాసీలపై బూటకపు ఎన్‌కౌంటర్‌లు, అత్యాచారాలు జరిగినప్పుడు అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు మౌనంగా ఉండడం చాలా దురదృష్టకరం. మావోయిస్ట్‌లుగా ముద్ర పడుతుందేమోనని, అరెస్ట్ చేస్తారేమోనని, తమపై కేసులు పెడతారేమోనని లేదా అధికారంలో ఉన్నప్పుడు తమ రాజకీయ భావజాలం కూడా అలాగే చేస్తుంది కాబట్టి వారు వ్యతిరేకించడం లేదని అర్థం చేసుకోవచ్చు.

బిజెపి తమ రాజకీయ ప్రచారంలో గాంధీ, అంబేద్కర్ చిత్రాలను వారసత్వాన్ని ఉపయోగిస్తుంది. మీరు దానిని ఎలా చూస్తారు?

బీజేపీ కపట పార్టీ అని అందరికీ తెలుసు. ఈ మత ఛాందసవాదులు నాస్తికుడైన భగత్ సింగ్ చిత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ కులవాదులు ఒకవైపు ఆదివాసీలు, దళితులపై దౌర్జన్యాలకు దిగుతూనే మరోవైపు గాంధీ, అంబేద్కర్ చిత్రాలను వాడుతున్నారు.

రాజ్యం మీపై అయిదు సార్లు హత్యా ప్రయత్నం చేసిందని ఇంతకు ముందు పేర్కొన్నారు. దాని గురించి క్లుప్తంగా చెప్పగలరా?

నాకు సమాచారం ఉంది. వారు నన్ను చంపడానికి ప్రయత్నించారని నాకు తెలుసు. ఇప్పటికీ నేను సురక్షితంగా లేను సమీప భవిష్యత్తులో నాపై దాడులు జరగవచ్చు, అది నా మరణానికి కూడా దారితీయవచ్చు. ఈ కార్పొరేట్లను వ్యతిరేకించే ఎవరికైనా ముప్పు తప్పదు. అరెస్టు చేయవచ్చు, జైలులో లేదా జైలు వెలుపల చంపచ్చు. ఇది రాజ్యానికి సాధారణ పద్ధతి. ఇది ఫాదర్  స్టాన్ స్వామి, పాండు నరోటే ప్రాణాలను బలిగొంది. 

భగత్ సింగ్ తన చివరి పిటిషన్‌లో, “భారత శ్రమిక ప్రజానీకాన్ని, సహజ వనరులను కొన్ని పరాన్నజీవులు దోపిడీ చేస్తున్నంత కాలం యుద్ధ స్థితి ఉనికిలో ఉంది, ఉంటుంది. ప్రస్తుత సందర్భంలో ఈ భగత్ సింగ్ ప్రకటనను మీరు ఎలా చూస్తారు?

అవును, నేడు యుద్ధ స్థితి ఉంది. ఈ ప్రకటన నేటికీ వర్తిస్తుంది. ఆర్థిక దోపిడీ నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు. అవే దోపిడీవర్గాలు వున్నాయి. భారతదేశ శ్రమికులు, ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీలు దోపిడీ నుండి స్వాతంత్ర్యం పొందలేదు.

రాజకీయ కార్యకర్తలకు మీ సందేశం లేదా సలహా ఏమిటి?

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు ప్రభుత్వం తప్పు చేసినా న్యాయవ్యవస్థపైన ప్రజలకు ఆశ ఉండేది. ఇప్పుడు న్యాయవ్యవస్థ ఫాసిస్ట్ శక్తులలో మరింతగా భాగమైంది. మొత్తం వ్యవస్థపై ప్రజలు ఆశలు కోల్పోతున్నారు. సమాజం నిరాశాజనకంగా మారిన పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. ఇది సమాజాన్ని నిరాశకు గురి చేస్తుంది లేదా హింసాత్మకంగా మారుస్తుంది. బీజేపీ ఇప్పటికీ మైనారిటీలో వుంది, ప్రతిపక్షాలు చీలిపోయాయి కాబట్టి బీజేపీయేతర శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలి.

తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి

Leave a Reply