(గత ఏడాది చివరలో దేశమంతా మొదలైన అంగన్ వాడీల, ఆశా వర్కర్ల పోరాటం ఆ తర్వాత కూడా కొనసాగింది. ఈ వ్యాసం అప్పట్లో రాశారు. వసంత మేఘానికి ఆలస్యం గా చేరింది. విషయం ప్రాధాన్యత ఇప్పటికి ఉన్నందు వల్ల ప్రచురిస్తున్నాం – వసంత మేఘం టీం )
మన దేశంలో చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరి చేసే ప్రభుత్వ ఉద్యోగులు కోట్ల సంఖ్యలో వుంటారు. వారంతా దిగువ శ్రేణిలోకే వస్తారు. అలాంటి ఉద్యోగులలో అంగన్‌వాడీలు, వారి వద్ద సహాయకులుగా చిన్నారులకు వంటచేసి పెట్లే వారు, ఆశా (ఏ.ఎస్.హెచ్.ఏ – సాధికారిక సామాజిక అరోగ్య కార్యకర్త) వర్మర్లు కూడ వున్నారు. వారంతా మహిళలే కావడం విశేషం. ప్రతి రాష్ట్రంలో వీరి సంఖ్య వేలలోనే వుంటుంది. వారు తమ ఇంటిని నడుపుకుంటూ, పిల్లలకు ప్రేమగా, బాధ్యతగా సేవలందిస్తుంటారు. అశా వర్కర్లు వైద్య సదుపాయాలకు నోచుకోని వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గర్భిణి మహిళలకు సహాయపడుతుంటారు. వీరికి నికరంగా జీతాలంటూ లేవనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం విదిలించే డబ్బులను గౌరవ వేతనంగా భావిస్తుంటారు. ఆశా వర్మర్లకైతే, కేసులను బట్టి కొంత డబ్బు ముడుతుంది. వీరంతా కొరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ ఫైటర్స్‌గా కితాబులందుకున్నవారే! తేనెలొలికే మాటలతో గారడీ చేయడంలో మన దేశ ప్రధాని మోదీ అందెవేసిన చేయి. వారి సమ్మెల వివరాలు చూద్దాం.
దిల్లీలో అంగన్వాడీలు :
దేశ రాజధాని దిల్లీలో గత ఏడాది అంగన్వాడీలు తమ సమస్యలపై అనేక వారాల తరబడి సమ్మె చేశారు. అప్పుడు వారి కష్టాలు అందరి దృష్టికి వచ్చాయి . కానీ ఆంగన్‌వాడీ కార్యకర్తలపై అక్కడి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎస్మా (అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాడు.
పేదల సర్కారని గొప్పలు చెప్పుకునే ఆప్ సర్మార్ 884 మందిని ఉద్యోగాల నుండి తొలగించింది. 12 వేల మందికి షోకాజ్ నోటీసులిచ్చింది. అయినప్పటికీ అంగన్‌వాడీ కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా ‘నాక్ మే ధమ్ కరో! కేంపెయిన్ చేపట్టి వీధి వీధి తిరిగి రాజకీయ నాయకుల శ్రామిక వ్యతిరేక చరిత్రలు బ హిరంగపరిచి మున్సిపల్ ఎన్నికలను బహిష్కరించాలని కోరారు. శాంతియుత పోరాటంలో బహుశ ఇదే ప్రజల చేతులలో మిగిలిన విలక్షణమైన ఆయుధం!
దిల్లీ ఆంగన్‌వాడీ కార్యకర్తలు తిరిగి ‘పోరాట పక్షం” కేంపెయిన్ చేపట్టి కొన్ని డిమాండ్లు సాధించుకున్నారు. మహిళా సాధికారత గురించి సొల్లువాగుడు వాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, దిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఐదు మాసాల తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దిల్లీ రాష్ట్ర ఆంగన్‌వాడీ కార్యకర్తల, సహాయకుల యూనియన్ నాయకత్వంలో తమ డిమాండ్లలో భాగమైన గౌరవవేతనాన్ని పెంచుకున్నారు. 884 మందిని ఉద్యోగాల నుండి తొలగించడం తప్పని ఒప్పించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక వడ్రా అంగన్‌వాడీల సమ్మెను బలపరుస్తుంటే మరోవైపు ఆ పార్టీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు అంగన్‌వాడీ కార్యకర్తల తొలగింపును సమర్థించాడు. ఎందుకంటే అయనకు ఈ ఒక్కొక్క తొలగింపు కేసు చూడడానికి రూ. 20 లక్షల ఫీసు వసూలు చేస్తున్నాడనే విషయం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోని ఫలితంగా దిల్లీ ఆంగన్‌వాడీ, సహాయకులు అక్టోబర్ 10-12 తేదీలలో నిరహారదీక్ష జరిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం అపేది లేదనీ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.7 వేలు, సహాయకులకు నెలకు రూ.4 వేల గౌరవ వేతనం లభిస్తోంది. అంగన్‌వాడీ కార్యకర్తలు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏ పార్టీ ప్రభుత్వం అందుకు సిద్దంగా లేదు. స్కీం వర్మర్లకు రూ. 26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలనీ కోరుతుండగా రూ. 12 వేలకు మించి ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదు.
సెప్టెంబర్ 20 నాడు ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సహ అన్ని రంగాలలోని స్కీం వర్మర్లు మహాధర్నా జరిపారు. ఒడిసా లో ఆశా వర్కర్లు అర్ధాకలితో బతకలేక , చాలీ చాలనీ గౌరవ వేతనాలతో ఇల్లు గడుపుకోలేక తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై మిలిటెంట్‌గా పోరాదారు. నిఖిల్ ఒడిశా ఆశా వర్మర్ల సంఘం (ఏఐటీయూసీ) నాయకత్వంలో డిసెంబర్ ర5నాడు 5 వేల మంది ఆశా వర్మర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు.
ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం (యం.డీ.యం) వర్మర్లను భారత శ్రామిక కాంగ్రెస్‌లో నిర్ణయించిన విధంగా పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలనీ కోరారు. వారు కనీస వేతనంగా రూ. 26 వేలు ఇవ్వాలనీ, అశా వర్మర్లకు మరణాలు సంభవిస్తే ఎక్స్‌గ్రేషియాను రూ. లక్ష నుండి 5 లక్షలకు పెంచాలనీ డిమాండ్ చేశారు. వాళ్ల డిమాండ్లను ప్రభుత్వం అమోదించని పక్షంలో వాళ్లు 2023 మార్చ్ నుండి వీధులలోకి వచ్చి 10వేల మంది కార్యకర్తలతో రాత్రి-పగలు సమ్మె చేస్తామనీ ఒడిశా ఆశా కార్మిక సంఘం అధ్యక్షురాలు బిజయ్ జేనా సృష్టం చేశారు. రాష్ట్ర వ్యాపితంగా 45 మంది వర్మర్లు వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై జీవిస్తున్నారని తెలిపింది.
మహారాష్ట్రలో అంగన్ వాడీలు: ఇక్కడ రెండు లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు వున్నారు. వాళు తమ విశ్రాంత జీవితంలో దొరుకుతున్న పెన్షన్ డబ్బుల పెంపుదలకు సమ్మె పోరాటం
చేపట్టారు. వారికి ఉద్యోగ విరమణ సందర్భంగా రూ. లక్ష ఇవ్వాలనీ ప్రభుత్వ ఆదేశం వున్నప్పటికీ రూ. 75 వేలకు మించి ఇవ్వడం లేదనీ, అవి కూడ సరిగా చెల్లించడం లేదనీ తెలుపుతున్నారు. ఆంగన్‌వాడీ కార్యకర్తలకు (గ్రాట్యుటీ కూడ ఇవ్వాలనీ సుప్రీంకోర్టు 25 ఎప్రిల్ 2022నాడు అదేశించినప్పటికీ అవి చెల్లించడం లేదు.
ఛత్తీస్‌గఢ్ మధ్యాహ్న భోజన కార్యకర్తలు :
బస్తర్ డివిజన్‌లోని 7 జిల్లాల మధ్యాహ్న భోజన (మిడ్ డే మీల్) కార్యకర్తలు అక్టోబర్ 20 నాడు తమ న్యాయమైన మూడు డిమాండ్ల సాధనకై జరుపుతున్న 47 రోజుల సమ్మెలొ భాగంగా పెద్ద ఎత్తున కదిలి జగ్టల్‌పుర్‌లో రాష్ట్ర రాజధాని రాయపుర్ వెళ్లే రోడ్ బ్లాక్ చేశారు. వారు జాతీయ రహదారిని బ్లాక్ చేయడానికి వెళ్తుంటే పెద్ద ఎత్తున పోలీసులు ప్రత్యక్షమై వారిని అడ్డుకున్నారు. దానితో వారు నారాయణ్‌పుర్ రోడ్‌ను చక్కాజాం చేశారు. తమకు ప్రస్తుతం రోజుకు కేవలం రూ. 50 మాత్రమే గౌరవవేతనంగా ఇస్తున్నారనీ, దానిని రూ. 300గానైనా మార్చాలనీ కోరుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ గత విధానసభ ఎన్నికల సందర్భంగా వారి గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ వాగ్దానం చేసింది. కానీ, మళ్లీ ఎన్నికలు వస్తున్నప్పటికీ వారి వేతనాన్ని పెంచి తమ హామీని నిలబెట్టుకున్నది లేదు. వాళ్లు రెండుసార్లు విద్యాశాఖ మంత్రి టేకంను కలవడానికి వెళ్లితే ఆయన అపాయింట్‌మెంటే దొరుకలేదు. ఆయనగారి పీ.ఏ. కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వాళ్లు విధానసభ సభ్యులను, లోక్ సభ సభ్యులను, మంత్రి కోవాసీలక్మాను కలిసి మొర పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దానితో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 86 వేల 500 మంది వంట చేసే వాళ్లు తమ సమ్మె పోరాటాన్ని ఉదృతం చేస్తామనీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఛత్తీస్‌గఢ్‌లో అంగన్ వాడి కార్యకర్తల, హెల్పర్ల సమ్మె: మన దేశ దళారీ పాలక వర్గలకు వివిధ పాలనా వ్యవహారాలలో ప్రపంచ బ్యాంకు, ఐ.ఎమ్.ఎఫ్.ల నుండి అందే మార్గదర్శకాలలో భాగంగానే ‘సమ్మిళిత బాల శిశు సంరక్షణ (ఐ. సీ.డీ.ఎస్) పథకం ఒకటి. ఈ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా బాల్‌వాడీ, ఆంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పర్చి దేశంలో లక్షలాది ఆంగన్‌వాడీకార్యకర్తలను, హెల్చర్‌లను గౌరవవేతనంపై నియమించి అగౌరవపరుస్తున్నారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ ప్రభుత్వాలు గుర్తించడంలేదు. ఛత్తీష్‌గడ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవవేతనం పెంచుతామని ఉచిత వాగ్జానం చేసింది. కాని అధికారంలోకి వచ్చి నాల్గు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ అంగన్‌వాడీ కార్యాకర్తల, హెల్పర్ల డిమాడ్లను నెరవేర్చలేదు.
దానితో, తమ డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సంఘటితమై 2022 ఏప్రిల్-మే నెలల్లో రాయపుర్‌లో మండుటెండల్లో ప్లాస్టిక్ టెంట్లు వేసుకొని నిరవధిక నిరహారదీక్ష్మ ధర్నా చేశారు. ధర్నాను చెదరగొట్టడానికి పోలీసులు ధర్నా స్టలంపై దాడి చేసినప్పటికీ అంగన్‌వాడీ మహిళలంతా ధైర్యంగా తమ అరు డిమార్ల సాధనకు రాష్ట్ర రాజధానిలో 40 రోజులు ధర్నా చేశారు. రాష్ట్ర రాజధానితో పాటు అనేక జిల్లాలలో జిల్లా, బ్లాక్ కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి తమ డిమాండ్ల పత్రాన్ని కలెక్టర్‌లతో పాటు ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతికి పేర్లతో పంపుకున్నారు. 40 రోజుల సమ్మె తర్వాత ఆంగన్‌వాడీ కార్యకర్తల సంఘ నాయకత్వ ప్రతినిధి బృందాన్ని భూపేశ్ బఘేల్ ప్రభుత్వం చర్చలకు అహ్ననించింది. అంగన్‌వాడీ కార్యకర్తల, హెల్పర్ల సంఘం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచగా రాష్ట్ర ప్రభుత్వం ఆంగన్‌వాడీ కార్యకర్తల, హెల్పర్ల గౌరవవేతనం పెంచుతాం, అంగన్‌వాడీ కార్యకర్తల నుండి ప్రమోట్ అయినవారిని ఐ.సీ.డీ.ఎస్ అధికారిగా నియమిస్తామని హామీ ఇచ్చింది.
కానీ, ఆరునెలలు దాటినా భూపేశ్ బఘేల్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయక ల (హెల్పర్ల) సంఘం జనవరి 23న తమ ఆరు సూత్రాల డిమాండ్ల కై నిరవధిక సమ్మె ప్రదర్శనలకు దిగుతామనీ ప్రకటించింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఛత్తీస్‌గఢ్‌లో సాధారణంగ సమ్మెకు దిగే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో తాము నక్సలైట్లుగా మారడం తప్ప గత్యంతరం లేదని బహిరంగంగానే ప్రకటిస్తూ సమస్యల పరిష్కారానికి నక్సలిజమే మార్గమని చెప్పకనే చెప్పే అనవాయితీ ఉన్నది.
ఆంగన్‌వాడీ, సహాయక్ ల డిమాంద్స్:
- అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 26వేల వేతనం ఇవ్వాలి.
- సహాయక్ ల కు (హెల్పర్లకు) నెలకు రూ. 12వేల వేతనం ఇవ్వాలి.
- మినీ అంగన్‌వాడీలకు, అంగన్‌వాడీ కేంద్ర కార్యకర్తలకు సమాన వేతనం ఇవ్వాలి.
- ఆంగన్‌వాడీ కార్యకర్తలకు సహాయికీ(హెల్పర్లకు)లను ప్రభుత్వ ఉద్యోగులుగ గుర్తించి పెన్షన్ పథకాలు వర్తింపచేయాలి.
- ఐ.సీ.డీ.ఎస్ విభాగాన్ని పైవెటీకరణ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అపాలి.
- ఆంగన్‌వాడీ కార్యకర్తలనుండే డిపార్టుమెంటల్ ప్రమోషన్స్ ఇచ్చి ఐ.సీ.డీ.ఎస్ అధికారిణులను మార్చాలి.
పై డిమాండ్ల సాధనకై జనవరిలో సమ్మెను తలపెట్టారు. వీరే కాకుండా చత్తీష్‌గడ్ రాష్ట్రంలో వున్న వివిధ ప్రభుత్వ విభాగాల కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 45 వేల మంది కలసి ఉమ్మడి గా ఏర్పర్చుకున్న ఫెడరేషన్ జనవరిలో వారంతా సమ్మెకు దిగుతారనీ ప్రకటించింది. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలలోని మధ్యాహ్న భోజన వంటవాళ్లతో పాటు మిథానిన్‌లు, తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు మన్‌రేగా ఉద్యోగులు డిసెంబర్ 15 నుండి జిల్లా, బ్లాక్‌లలో ప్రదర్శనలు, ధర్నాలు జరిపారు. ఈ పోరాటం ఆగడు. డేనీకాంతే వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి. అయితే ఈ పోరాటం అంగన్ వాడిల సమస్యలను లోకానికి చాటింది. వాళ్ళ దుర్భర జీవితం అందరికి తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వివిధ పథకాల పేరుతో తక్కువ వేతనాలు చెల్లిస్తూ వెట్టి చాకీరి చేయించుకోవడానికి వ్యతిరేకంగా వారంతా సమ్మె అస్త్రాన్ని సంధిస్తున్నారు. వారి పోరాటాలకు అండగా నిలబడుదాం. వారి సమస్యల పరిష్కారానికై సమైక్యంగా పోరాడుదాం. ఇది నేటి ఆవశ్యకత.