మణిపూర్‌ మండుతోంది. అయితే అగ్గి రాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డు తెగ హోదా ఇచ్చే విషయం మీద ఆలోచించి నివేదిక సమర్పించమని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన ఫలితంగానే జరిగిందా? (ఆ న్యాయమూర్తికి అలాంటి ఆదేశం ఇచ్చే అధికారం లేదనీ, ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే వుందనీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడాన్ని మనం గమనించాలి) లేక ఇంకేమైనా లోతైన విషయాలు వున్నాయా? లోతుల్లోకి వెళ్ళి పరిశీలించకుండా సమస్య అసలు స్వభావాన్ని అర్థం చేసుకోలేం. ఆ స్వభావం అర్థం కాకుండా పరిష్కారాలు ఆలోచించలేం. అందుకే ముందుగా మణిపూర్‌ సామాజిక జీవితం గురించి కొంతైనా తెలుసుకుందాం.

          అస్సాంతో సహా ఈశాన్య భారత రాష్ట్రాలన్నీ భౌగోళికంగా భారతదేశంలో భాగమే అయినా ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని, అక్కడి ప్రజల్ని భారతీయులుగా భావించే మనస్తత్వం మెజారిటీ భారతీయులకు లేదు. అక్కడ జాతులేవీ భారతీయమైనవి కావని, వాళ్ళు చైనా జాతికి చెందినవాళ్ళని, వెనుకబాటులో వున్నవాళ్ళని రకరకాల అపోహలు మిగిలిన భారతదేశమంతటా ఇప్పటికీ చదువుకున్నవాళ్ళలో కూడా కొనసాగుతున్నాయి. ఇది ప్రజల తప్పు కాదు. ఈశాన్య భారతాన్ని భారతీయ జనజీవితంలో భాగం చేయడంలో పాలకవర్గాల వైఫల్యమే దీనికి కారణం. వివిధ జాతులు, తెగలు నివసించే ప్రాంతాలపట్ల అనుసరించాల్సిన వైఖరి గురించి ఇప్పటిదాకా ఏ భారత ప్రభుత్వానికీ సరైన ఎరుక లేదు. భిన్నత్వంలో ఏకత్వం అని నినాదాలు ఇవ్వడమేకాని ఆచరణలో అదంటే ఏమిటో ఆలోచించే వ్యవధే వాళ్ళకు లేదు. నిజానికి ఆ భావన అమూర్తమైనది కాదు. దేశంలో వున్న భిన్న జాతులు తెగలు, ఇతర ప్రజాసమూహాల మధ్య నిజమైన స్నేహపూర్వక సయోధ్య కుదరాలంటే ముందు ఆ ప్రజాసమూహాల అస్తిత్వాలను, సంస్కృతులను  గుర్తించి, గౌరవించాలి. వాటి మధ్య ఆదాన ప్రదానాలను ప్రోత్సహించాలి. సర్దుబాటు ధోరణి అలవడాలి. ఇవన్నీ నాగరికమైన సున్నితంగా ఆలోచించే పార్టీలకు, పాలకులకు మాత్రమే అర్థమౌతాయి. అప్పుడే వివిధ ప్రజాసమూహాల మధ్య నిజమైన భావ ఐక్యత వర్థిల్లుతుంది.

          ఈశాన్య భారతంలోని రాష్ట్రాలలో అంత్యంత సంక్లిష్టమైన వివాదాస్పదమైన రాష్ట్రం మణిపూర్‌. మణిపూర్‌లో ప్రజలందరూ ఒకే తెగకు చెందినవాళ్ళు కాదు. దీనికంటే ముందు మణిపూర్‌ భౌగోళిక పటాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అది భౌగోళికంగా రెండు ప్రధాన భాగాలుగా వున్నది. ఒకటి, లోయ ప్రాంతం రెండవది, కొండప్రాంతం. లోయ ప్రాంతంలో నాలుగు జిల్లాలున్నాయి. అవి ఒకటి పశ్చిమ ఇంఫాల్‌, రెండు తూర్పు ఇంఫాల్‌, మూడు థౌబాల్‌, నాలుగు బిష్ణుపూర్‌. కొండప్రాంతాలలో ఐదు జిల్లాలున్నాయి. అవి సేనాపతి, చురాచాంగ్‌పూర్‌, వుక్రుల్‌, చందేల్‌, తామేగ్లాంగ్‌.

          ఇందులో లోయప్రాంతంలో నివసించే ప్రజలు మెయితీలు. మణిపూర్‌ మొత్తంమీద అత్యంత ఎక్కువ జనాభా వీళ్ళదే. ఆధిక్యత కూడా వీళ్ళదే. వాళ్ళు మాట్లాడే భాష మెయితీ. దాన్నే అధికారికంగా మణిపూరి అంటారు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలలో ఇది కూడా ఒకటి.  మెయితీలకు, మణిపూర్‌లోని కొండప్రాంతాలలో నివసించే నాగా, కుకీలాంటి ఇతర తెగలకు చాలా వ్యత్యాసం వున్నది. వీళ్ళు తమని తాము బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు.

          వీళ్ళు హిందూ ఆచారాలను పాటిస్తారు. ప్రారంభంలో మాంసం తినేవారు, జంతుబలులు కూడా వుండేవి. ఇప్పుడు నాగరికమై లేదా బ్రాహమ్మణీయ ఉచ్చులోపడి మాంసం మానేశారు. చేపలు మాత్రమే తింటారు. ఆవును పూజిస్తారు. తమనితాము ఉన్నత కుల సంజాతులుగా భావిస్తారు. తమది ప్రాచీనమైన నారగికత అన్న భావన వాళ్లకున్నది.  హిందూ దేవతలను, దేవుళ్ళను పూజిస్తారు. ప్రత్యేకించి కృష్ణుడిపట్ల ఎక్కువ ఇష్టం. తాముచేసే క్రతువుల పవిత్రతను కాపాడుకుంటారు.

          వీళ్ళు మణిపురీ లేదా మెయితీ బ్రాహ్మణులు. బెంగాల్‌, మిథిల, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ , ఒరిస్సా ప్రాంతాల నుండి బ్రామ్మణులు 15వ శతాబ్దంలో మణిపూర్‌కు వలస వెళ్ళడం ప్రారంభమైంది. బహుశా బెంగాల Êలో ముస్లింల పాలన ప్రారంభం కావడం దీనికి కారణమై వుండవచ్చు. వీళ్ళది వైష్ణవ సంప్రదాయం. వలసవెళ్ళినచోట మణిపూరి భాష నేర్చుకున్నారు. స్థానిక సంప్రదాయాలను, తమ సంప్రదాయాలను మిళితం చేసి వీళ్ళు బ్రాహమ్మణ సంస్కృతిని ప్రారంభించారు.

          స్వతసిద్ధంగా మెయితీల మతం ఆదివాసీ మతం. బహుదేవతారాధన వున్నది. సానామహి అనే ఆరాధనా తత్వం వాళ్ళది. మైతీలందరూ నీటివనరులున్న భూభాగంలో వరి సాగు వృత్తిగా చేపట్టారు. గుర్రాలను పెంచుతారు. పోలో వాళ్ళ జాతి క్రీడ. వీళ్ళల్లో సినీ నిర్మాతలు, సంస్కృత పండితులు, సంగీతకారులు, జర్నలిస్టులు, పద్మశ్రీలు కూడా వున్నారు. ఈ రోజున మణిపూరి సంగీతం పేరిట, నృత్యం పేరిట చలామణి అవుతున్నది మెయితీ తెగవారి సంగీత, నృత్యాలే.

          మణిపూర్‌లో లోయలో నివసించేవాళ్ళకి, కొండప్రాంతాల్లో నివసించేవాళ్ళకి మధ్య వున్న అస్తిత్వ వైవిధ్యం ప్రధాన వైరుధ్యం. ఉన్నత చదువులు చదువుకుని నగరాలలో నివసిస్తూ మణిపూరి భాషను మాట్లాడుతూ వున్న ప్రజలు రాష్ట్రంలోని లోయప్రాంతాలలో వుంటారు. వీళ్ళలో ప్రధానంగా హిందువులు, చెప్పుకోదగ్గ సంఖ్యలో ముస్లింలు వున్నారు. వాళ్ళ జీవితం ఉన్నతమైనది. మంచినీరు, ఆసుపత్రులు, విద్య, వైద్యం, ప్రభుత్యోద్యోగాలు అన్నింటిలోనూ వాళ్ళదే ప్రధాన పాత్ర. టూరిజం నుండి వచ్చే ఆదాయం కూడా చాలా ఎక్కువ. పరిశ్రమలు ఎక్కువగా వున్న ప్రాంతం అదే.

          మరోపక్క అన్ని రకాలుగా మెయితీలకంటే వెనుకబడ్డ వివిధ తెగల సమూహాలు గ్రామీణ ప్రాంతాలలో కొండప్రాంతాలలో నివశిస్తుంటారు. వీళ్ళలో అత్యధికులు తాంగ్‌కుల్‌, థాడో, కాబుయీ, మావో వంటి గిరిజన భాషలను మాట్లాడతారు. వీళ్ళలో 90శాతం మంది క్రైస్తవులు. జీవనానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని అడవులలోనూ, కొండప్రాంతాలలోనూ నివశిస్తుంటారు.

          మణిపూరి మాతృభాషగా కలిగిన ప్రజలు లోయ ప్రాంతపు జనాభాలో 85 నుండి 90 శాతం. వాళ్ళు ప్రధానంగా పశ్చిమ ఇంఫాల్‌, తూర్పు ఇంఫాల్‌, బిష్ణుపురా, హౌబాల్‌ అనే జిల్లాల్లో నివశిస్తారు. మరోపక్క కొండ ప్రాంతాలైన సేనాపతి, చురా చాంద్‌పూర్‌, చందేల్‌, ఉక్రుల్‌, తామేగ్లాంగ్‌ అనే ప్రాంతాల్లో మణిపూరి మాట్లాడేవాళ్ళు నాలుగుశాతం మాత్రమే. కొండ ప్రాంతాల్లో 89 నుండి 96 శాతం క్రైస్తవులుకాగా, లోయలో 75శాతం మంది హిందువులు. తూర్పు ఇంఫాల్‌, హౌబాల్‌ జిల్లాల్లో గణనీయమైన ముస్లిం జనాభా వుంది.

          మెయితీలను యస్‌.టి. జాబితాలో చేర్చితే రిజర్వేషన్లలో సింహభాగం వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వరంగ ఉద్యోగాలలో కొండజాతి ప్రజలకంటే మెయితీలు ఎక్కువ అవకాశాలు పొందివున్నారు. జనాభాలో 43శాతంగావున్న కొండజాతి ప్రజలకి 35శాతం ఉద్యోగాలు, లోయప్రాంతం వాళ్ళకి 65శాతం ఉద్యోగాలున్నాయి. అవన్నీ క్రమంగా మెయితీల చేతుల్లోకి వెళ్ళిపోతాయని వాళ్ళ ఆవేదన.

          ఇందులో భూ యాజమాన్య సమస్య కూడా వుంది. మెయితీలను కూడా యస్‌.టిలుగా మారిస్తే కొండ ప్రాంతాలలో వుండే సాంప్రదాయక భూయాజమాన్యంలో మార్పులు వస్తాయని కొండప్రాంతాల ఆదివాసీలు చేస్తున్న ఆరోపణలలో నిజం లేకపోలేదు.

          మణిపూర్‌లోని గ్రామాల సంఖ్య పెరుగుదల, తరుగుదల పైన కూడా వివాదం వున్నది. ఉదాహరణకు ఇంఫాల్‌ లోయలో 1969లో 587 గ్రామాలుండేవి. వాటన్నింటిలోనూ ఆధిపత్యం మెయితీలదే. 2021నాటికి ఈ సంఖ్య 544కు తగ్గిపోయింది. అదే సమయంలో కొండ ప్రాంతాల్లో 1969లో 1370 గ్రామాలుండేవి. 2021నాటికి అవి 2244కు పెరిగాయి. ఈ గ్రామాల్లో వుండే ప్రజలందరూ కుకీలు, నాగాలు వంటి 34షెడ్యూల్డు తెగలకు చెందినవాళ్ళు. అయితే కొండప్రాంతాల్లో గ్రామాలు పెరగడానికి అక్రమచొరబాటుదారుల ప్రవేశమే కారణమని భారతప్రభుత్వం వాదన. అయితే అది వాస్తవం కాదంటున్నారు స్థానిక భాజపా ఎమ్‌ఎల్‌ఏ దినాగాంగ్లూంగ్‌ గంగ్‌మెయి. కుకీలలో ఒక సంప్రదాయం వున్నది. తెగ పెరిగినకొద్దీ చుట్టుపక్కల ప్రాంతాలలో కొత్త గ్రామాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చే సాంప్రదాయం. అదే ఈ పెరుగుదలకు కారణం కాని అక్రమ వలసదారులు కాదని ఆయన అభిప్రాయం. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తరవాత అక్కడ నుండి వలసలు మణిపూర్‌లోకి వచ్చిన మాట వాస్తవమేగాని వాళ్ళ సంఖ్య వందల్లో మాత్రమే వుందని ఆయన అంటున్నారు. మణిపూర్‌ లోయ ప్రాంతాలలో గ్రామాల సంఖ్య తగ్గడానికి కారణం అక్కడ అభివృద్ధి జరిగి పట్టణీకరణ పెరగడం.

          మయన్మార్‌ నుంచి వలసవచ్చిన ప్రజల్ని భారత ప్రభుత్వం శరణార్థులుగా గుర్తించడం లేదు. అలా గుర్తిస్తే వాళ్ళ జీవికకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యత తాత్కాలికంగానైనా భారత ప్రభుత్వం స్వీకరించాలి. అందుకే వాళ్ళు అక్రమ చొరబాటుదారులనీ వాళ్ళని గుర్తించే ప్రశ్న లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఐక్యరాజ్యసమితి శరణార్ధులకు సంబంధించి చేసే నిర్ణయాలకు భిన్నం. ఈ విషయమై ఢల్లీిలో వున్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో పిటీషన్‌ ఇవ్వడానికి వెళుతున్న ప్రజలపై పోలీసులు దాడిచేసి వాళ్ళవద్ద ఆధార్‌ కార్డులాంటి గుర్తింపు కార్డులు లేవనే కారణంగా 200`300మందిని అరెస్టు చేశారని నందితా హక్సర్‌ అంటున్నారు.

          మయన్మార్‌ నుండి వలస విచ్చనప్రజల్లో అత్యధిక శాతం మందికి అవసరమైన వసతులు కల్పించే బాధ్యతనంతటినీ కుకీలే భుజాన వేసుకున్నారు. వలస వచ్చిన శరణార్థులకు, కుకీ తెగకు మధ్య బంధుత్వపూర్వకమైన సంబంధాలు వుండడం దీనికి కారణాలు.

          నిజానికి మెయితీలకు ఎస్‌.టీ.లుగా గుర్తింపు నిచ్చే విషయం పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జాతీచేసినప్పుడు కొండ ప్రాంతాల్లోని తెగల ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేశారు. మెయితీలు తమనితాము ఎన్నడూ ఎస్‌.టి.లుగా భావించకపోవడమే దీనికి ప్రధాన కారణం. వాళ్ళు తాము నాగరికులమని, తమ ఆచార సంప్రదాయాలు మిగిలిన తెగలకంటే భిన్నమైనవనీ ఒక ఆధిక్యతా భావాన్ని ఎప్పుడూ ప్రదర్శించేవాళ్ళు. అలాంటివాళ్ళు అకస్మాత్తుగా తమను యస్‌.టి.లుగా గుర్తించాలని ఎందుకు కోరుకుంటున్నారో మిగిలిన ప్రజలకు అర్థం కాలేదు.

          ఎందుకంటే మణిపూర్‌ భూభాగంలోని సారవంతమైన భూములన్నీ మెయితీలు నివసించే లోయలోనే వున్నాయి. అక్కడ వ్యవసాయమే కాకుండా దేశీయ, అంతర్జాతీయ టూరిజం ద్వారా కూడా విపరీతమైన ఆదాయం వస్తుంది. పైగా వాళ్ళందరూ హిందువులు. కొద్దిమంది ముస్లింలు కూడా వున్నారు. అయితే కొండప్రాంతాల్లో నివసించే ప్రజల్లో అత్యధిక శాతం క్రైస్తవులు. రాజకీయాధికారాన్ని పంచుకునే విషయంలో కూడా ఈ తారతమ్యం వున్నది. 60మంది శాసనసభ్యులున్న మణిపూర్‌లో 40స్థానాలు లోయలోనూ, 20స్థానాలు కొండ ప్రాంతంలో వున్నాయి. ఆ 40 స్థానాల్లోనూ నిరంతరం మెయితీలే గెలిచేవారు. కాబట్టి సహజంగానే రాజకీయాధికారం వాళ్ళదే.

          ఇప్పుడు మెయితీలకు యస్‌.టి. జాబితాలో చేరే అవకాశం కల్పిస్తే భూమిమీద తమకున్న సంప్రదాయక యాజమాన్యానికి దెబ్బతగులుతుందని నాగాలు, కుకీలు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతాలపై ఆదివాసీలకే హక్కు వుండాలని ప్రభుత్వం చట్టంచేసినా దానికి ఆచరణలో ఎంతగా తూట్లుపడుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే.  అటవీసంపదను కాపాడే నెపంతో, చట్టవ్యతిరేకంగా అడవుల్లో చేరుతున్న వలసదారులను ఏరిపారేయడం అనే కారణంగా ప్రభుత్వం అక్కడ నుండి పెద్ద ఎత్తున గ్రామాలను ఖాళీ చేయించడం ప్రారంభించింది. ఇది వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బకొట్టటమే. ఇలాంటి పరిస్థితులలో మెయితీలను కూడా యస్‌.టి.లుగా ప్రకటిస్తే వాళ్ళు చట్టబద్ధంగానే తమ కొండ ప్రపాంతాలకు వచ్చి తమ భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటారనే భయం నాగాలది, కుకీలది. ఇది అవాస్తవికమైన భయం అనడానికి అవకాశం లేదు. దేశంలో అనేకచోట్ల ఇదే జరుగుతోంది.

          గంజాయి సాగు మరొక ప్రధాన సమస్య. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సరిహద్దు దేశాల నుండి మణిపూర్‌ గుండా భారతదేశంలోకి దిగుమతి అవుతున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందుకే గంజాయి పెంపకంపైన యుద్ధాన్ని ప్రకటించిన ప్రభుత్వం అనేక గ్రామాల్లో గంజాయి పంటను  ధ్వంసం చేసింది. 2017 `18 మధ్య కాలంలో 18,664 ఎకరాలలో గంజాయి పంటను నాశనం చేశారు.  చాలా గ్రామాల నుండి ప్రజల్ని ఖాళీ చేయించింది. అయితే వాళ్ళకు పునరావాసాన్ని కల్పించకపోవడం, ప్రత్యామ్నాయ జీవికకు అవసరమైన మార్గాలను చూపించకపోవడం, నష్టపరిహారాలు చెల్లించకపోవడం జరగలేదు. దీనిపట్లకూడా ఒక భాజపా ఎమ్‌ఎల్‌ఏ స్పందిస్తూ కొండప్రాంతాల్లోని చర్చిగాని, పౌరసంస్థలు గాని ఎన్నడూ గంజాయి సాగును ప్రోత్సహించలేదని అన్నారు. వాస్తవానికి లోయలోని ధనవంతులే కొండప్రాంతాల్లోని అడవుల్లో డబ్బును మదుపు పెట్టి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపణ. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు రొడ్డ కొట్టుడుగా అమానవీయంగా వ్యవహరిస్తే అంతిమంగా నష్టపోయేది ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలే.

          ఈ కారణాలన్నింటితోపాటు మరొక ముఖ్యకారణం కేంద్రంలో రాష్ట్రంలో వున్న భాజపా ప్రభుత్వాలు ఆదివాసీల హైందవీకరణను పెద్ద ఎత్తున పథకం ప్రకారం ప్రోత్సహించడానికి ప్రయత్నించడం. దానిలో భాగంగానే లోయలో వున్న హిందూ మెయితీలు, కొండప్రాంతాల్లో వున్న క్రైస్తవులైన నాగా, కుకీల మధ్య అధిగమించడానికి వీలులేని విభజన రేఖను సృష్టించారు. మణిపూర్‌లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలో చాలా పెద్ద సంఖ్యలో చర్చిలు దాడులకు గురయ్యాయి. మణిపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌ భక్తచరణ్‌ దాస్‌ అభిప్రాయాంలో ఈ చర్చీల విధ్వంసానికి కారణం ఆరంబాయి టెనెగోల్‌ అనే సంస్థ. ఇది భజరంగదళ్‌ లాంటిది. మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌ ఆశీస్సులు దీనికున్నాయి. ఇలాంటిదే మరొక సంస్థ మెయితీ లీపున్‌ ఈ చర్చీల విధ్వంసానికి, పోలీసుల క్యాంపుల నుండి తుపాకులు ఎత్తుకుపోవడానికి ఈ రెండు సంస్థలే కారణం. వీళ్ళలో మత విద్వేషం ఎంతగా పెరిగిందంటే వాళ్ళు మెయితీల చర్చీలను కూడా ధ్వంసం చేశారు. అలానే కొన్ని చోట్ల హిందూ దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. 

          గత కొద్దిరోజులుగా మణిపూర్‌ మండుతోంది. ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో 60మంది మరణించారని వార్తాపత్రికలు చెప్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 20వేలమంది ఇళ్ళువదిలి శరణార్థుల శిబిరాలలో తలదాచుకుంటున్నారు.  కేంద్రం 355వ నిబంధనను ప్రయోగించి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. అక్కడ ప్రస్తుతం అధికారంలో వున్నది భాజపా ప్రభుత్వమే. బహుశా ఇతర పార్టీల ప్రభుత్వం వుండి వుంటే 356ను ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించి వుండేది. నిరవధిక కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత అమలులో వున్నవి.           నందితా హక్సర్‌ చెప్పినట్టుగా ఇలాంటి సందర్భాలలో వివిధ ప్రజాసమూహాల మధ్య రాజకీయపరమైన సంభాషణకు అవకాశం వుంటే తప్ప ఇలాంటి సున్నితమైన సమస్యలకు పరిష్కారం వుండదు. ప్రభుత్వాలు సున్నితత్వానికి దూరమై చాలా సంవత్సరాలైంది. సమస్యలపట్ల మానవీయ స్పందన వాటిల్లో కనపడడం లేదు. మతాల మధ్య, కులాల మధ్య, తెగల మధ్య, మొత్తంగా ప్రజాసమూహాల మధ్య మానసిక ఐక్యతను సాధించే విషయంలో ప్రస్తుత పాలకులకి ఎలాంటి ఆసక్తి లేదు. సామ్రాజ్యవాదులు పాటించిన విభజించి పాలించు సూత్రాన్నే భాజపా ప్రభుత్వం అమలుపరుస్తోంది. మరోవైపు దేశంలోని ఆదివాసీ ప్రజా సమూహాలని హైందవీకరించడం వేగాన్ని పుంజుకుంది. ఈ మధ్యకాలంలోనే అఖిల భారత స్థాయిలో బంజారాలు, లంబాడీల సమ్మేళనాల్ని సంఫ్‌ుపరివార్‌ ఆధ్యర్వంలో నిర్వహించడం కూడా ఇందులో భాగమే. ఒకవైపు మతం మారిన హిందువులను ఘర్‌వాపసీ పేరుతో వెనక్కు రమ్మని ప్రోత్సహిస్తూ మరోపక్క ఆదివాసీ ప్రజల దేవుళ్ళను, దేవతలను సంప్రదాయాలను హైందవీకరించడం ఇలాంటి విస్పోటనాలకి కారణం. రాబోయే రోజుల్లో ఇవి మరింతగా పెరిగే ప్రమాదం వున్నది. పాలకవర్గాలు ఆదివాసీలను కూడా తమ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా చిచ్చుపెట్టి అడవుల్లో విద్వేషపు మంటలు రగిలుస్తున్నాయి.

One thought on “మణిపూర్‌లో మంటలు కాదు ..మాటలు కావాలి

  1. చాలా మంచి వ్యాసం. అనేక జాతులు వాటి మధ్య ఐక్యత వైరుధ్యాలను శోధించాలనుకునే వారికి ఈశాన్య ప్రాంతం కేస్ స్టడీ గా ఉపయోగపడుతుంది. అలాగే వైరుధ్యాలను దూరం చేసే విషయంలో ప్రభుత్వాల వైఫల్యానికి కూడా ఈ ప్రాంతం ఒక కేస్ స్టడీ!

Leave a Reply