(మధ్య భారతదేశంలో ఆదివాసులపై ప్రభుత్వ బలగాల హత్యాకాండ కు వ్యతిరేకంగా  ఐక్య కార్యాచరణ సన్నాహాల్లో భాగంగా  25, శనివారం ఉదయం 10 గంటలకు, హైదరాబాదులో ని సుందరయ్య విజ్ఞానకేంద్రం, షోయబ్ హాల్లో   ఏర్పాటు చేసిన సమావేశంలో  పౌరహక్కుల సంఘం ప్రవేశపెట్టిన కీనోట్ )

మితృలారా.. ఆదివాసులకు భారత రాజ్యాంగం హామీ పడిన హక్కులు తీవ్రమైన సంక్షోభంలో పడిపోయాయి. అడవి, సహజ వనరులు, పర్యావరణం, ఆదివాసుల జీవనోపాధులతో సహా వాళ్ల జీవించే హక్కును సహితం భారత ప్రభుత్వం  ఉల్లంఘిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పీడిత సమూహాలన్నిటి రక్షణ కోసం అనేక ప్రత్యేక చట్టాలను రాజ్యాంగం ప్రకటించింది. ఇందులో ఆదివాసల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపించింది. అయితే ఇవి మొదటి నుంచి అరకొరగానే  అమలవుతూ వచ్చాయి. మన పాలకులు చేపట్టిన అభివృద్ధి నమూనా వల్లనే చట్టబద్ద పాలన అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది,  అయినప్పటికీ ఆదివాసులు తమ పోరాటాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ వచ్చారు. అడవిని, సహజ వనరులను, తమదైన జీవన సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆదివాసులు చేస్తున్న పోరాటాలను ప్రభుత్వం అణచివేసి కార్పొరేట్ అభివృద్ధి నమూనాను ఆదివాసుల మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.

ఈ ఘర్షణ తీవ్రరూపం తీసుకొని ప్రభుత్వం ఆదివాసులను   ఎన్కౌంటర్ల పేరిట హత్య చేయడం గత ముఫ్పై నలభై ఏళ్లుగా తీవ్రమైంది. ఇందులో భాగంగా ఇటీవల మధ్య భారతంలో, ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్ లో   పెద్దఎత్తున ఆదివాసీ హత్యాకాండ కొనసాగుతున్నది. గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్   పేరుతో ఆదివాసులను వెంటాడింది  . దానికి వ్యతిరేకంగా తెలుగు సమాజాల్లోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. మేధావులు, పాత్రికేయులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదులు ఆదివాసులకు సంఫీుభావంగా నిలబడిన చరిత్ర మన తెలుగు రాష్ట్రాలకు ఉన్నది.

గతంకంటే కూడా ఇప్పుడు ఆదివాసీ తెగలు తీవ్రమైన సంక్షోభంలో పడిపోయాయి. వాళ్ల అస్తిత్వమే ప్రమాదంలో పడిరది. ఆదివాసి జాతి హననం అనదగిన స్థాయిలో నిత్యం ఛత్తీస్ ఘడ్ లో , మహారాష్ట్రలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కేంద్రంలో బిజెపి ఏలుబడి మైదలైన గత పదేళ్లలో కార్పొరేటీకరణ తీవ్రమయ్యాక అడవిలోని సహజ వనరుల దోపిడీ తీవ్రం కావడం దీనికి కారణం. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసులు న్యాయమైన పోరాటాలు చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా మైనింగ్ కోసం కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఆదివాసులు ప్రశ్నిస్తున్నారు. అడవుల్లోకి కార్పొరేట్లను రానీయమని పోరాడుతున్నారు. వాళ్లను నిర్మూలించి, అడవిని అదానికి, అంబానికి అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకంలో భాగంగానే ఈ ఏడాది జనవరి నుంచి ఆపరేషన్ కగార్ అనే అణచివేత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం సైనిక దాడి మాత్రమే కాక రాజకీయార్థిక, సాంస్కృతిక దాడిగా ఆదివాసుల మీద అమలు చేస్తున్నారు. దీని కోసం పోలీసులు, అర్ధ సైనిక బలగాలు చాలక ఏకంగా దేశ సరిహద్దులో ఉండ వలసిన రకరకాల సైనిక బలగాలను మధ్య భారత దేశంలోకి తరలించారు.

ఛత్తీస్ ఘడ్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సైనిక క్యాంపులకు తోడు 2023 డిసెంబర్లో బిజెపి అధికారంలోకి వచ్చాక కగార్లో భాగంగా ఒక్క దక్షిణ బస్తర్లోనే 18 క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇవిగాక దంతెవాడ, బైలాదిల్లా ప్రాంతంలో నాలుగు, పశ్చిమ బస్తర్లో ఐదు క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇవిగాక ఇంకో యాభై దాకా క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి ఇప్పటి దాకా 120 మంది ఆదివాసులను పోలీసులు, సైనికులు చంపేశారు. తాజాగా ఈ నెల 23వ తేదీన ఏడుగురు ఆదివాసులను చంపేశారు. ఇక అక్రమ అరెస్టులకు, వేదింపులకు లెక్కేలేదు.

ఇంత పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించాక అక్కడి ఆదివాసీ జీవితం ఎట్లా ఉంటుందో ఊహించవచ్చు. దేశంలో ఒక చిన్న సైజు గాజాగా బస్తర్ మారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల తరఫున రంగంలోకి దిగి ప్రారంభించిన  ఆపరేషన్ కగార్ అనే ఈ సైనిక దాడిని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు ఖండిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు

వినిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు ఈ దాడిని ఖండిరచాయి. ఈ నెల 18న పౌరహక్కుల సంఘం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రాజకీయ పార్టీల, సంస్థల ప్రతినిధులు, మేధావులు, రచయితలు ఆదివాసీ జాతి హననానికి వ్యతిరేకంగా ప్రజాతంత్ర శక్తులన్నీ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని  బలంగా అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆదివాసులకు మద్ధతుగా ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడానికి గల సాధ్యాసాధ్యాలను చర్చించుకోవడానికి మీ అందరినీ ఆహ్వానించాం. అందరం కలిసి తగిన నిర్ణయం తీసుకొని ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలని, ఆదివాసుల కోసం మనం చేయగల కార్యక్రమాలను రూపొందించుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మిత్రులు ఆ దిశగా చర్చించాలని కోరుతున్నాం.

Leave a Reply