అదిలాబాదు జిల్లా, బెల్లంపెల్లి, కన్నాల బస్తీలో నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాట ప్రేరణతో కార్మిక వర్గ పోరాటం పారంభమైందంటే అందుకు రెండు పిడికిళ్ళు బిగించిన వాళ్ళు గజ్జల గంగారామ్, కటకం సుదర్శనం. కన్నాల బస్తీ అంటే కార్మికవాడ. ఆ వాడలో బెల్లంపెల్లి విప్లవోద్యమ తల్లిగా పిలుచుకునే లక్ష్మమ్మకు పీపుల్స్‌వార్ దండకారణ్య పర్స్పెక్టివ్ విప్లవాచరణ ప్రారంభకాలంలోనే అమరుడైన గజ్జల గంగారామ్ కన్నకొడుకు అయితే ఈ 31న అమరుడైన కటకం సుదర్శన్ (69) పెంచుకున్న కొడుకు అనవచ్చు. ఆమె మరో కన్న బిడ్డ విప్లవోద్యమంలోనే అమరురాలైన సరోజ సహచరుడు, అదిలాబాదు నుంచి దేశవ్యాప్తంగా విప్లవోద్యమ నిర్మాణంలో అగ్రశ్రేణి నాయకుడైన నల్లా ఆదిరెడ్డి, శ్యామ్. శ్యామ్, గంగరాం, కటకం సుదర్శన్‌లు జిల్లా కమిటీ నాయకులుగా వున్నప్పుడే ప్రారంభమైంది సింగరేణి కార్మిక సమాఖ్య. కటకం సుదర్శన్ కోసం, ఆనంద్ దూలా కోసం కన్నీళ్ళు పెట్టే, పిడికిళ్ళు బిగించేవారందరూ ఇవాళ ఒకసారి ఇటీవలనే సింగరేణి కార్మికోద్యమంపై ఒక సృజనాత్మక వాస్తవ గాధ రాసిన హుసేన్ తల్లులు-బిడ్డలు చదవండి. కటకం సుదర్శన్ ప్రయాణం కన్నాల బస్తీ నుంచి అదిలాబాదు, ఇంద్రవెల్లి, దండకారణ్యం మీదుగా మధ్యభారతమంతా మార్గదర్శకత్వానికి, భారత విప్లవోద్యమ నేతృత్వానికి ఆయన పాల్గొన్న లాంగ్ మార్చ్ అర్ధమౌతుంది. ఆయన కొన్నాళ్లుగా శ్వాసకోశ అనారోగ్యంతో అంపశయ్య మీద నుంచే విప్లవ వ్యూహ రచనలో పాల్గొంటున్నారు. ఇటువంటి అమరులందరూ మరణం నా చివరి చరణం కాదు, రణం నా జీవితాచారణ అని పీడిత, పోరాట ప్రజలకు హామీ పడిపోయిన వాళ్ళే. అవిభక్త బస్తర్ జిల్లాలోని ఏడు జిల్లాలు, హన్స్దా అడవులు, సిలింగేర్ అయిదుగురు అమరుల మార్గంలో సడక్ రోకో, ఠాణా రోకో, కంపెనీ రోకో ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్మిస్తుంటే, దానికంతా దండకారణ్యంలోని ఆదివాసీ యువతీ యువకులు నాయకత్వం వహిస్తుంటే మోడీషా ప్రభుత్వం మావోయిస్టు రహిత ఎన్నికల కోసం, ఒక్క ఏప్రిల్ నెలలోనే రెండుసార్లు విమాన దాడులు జరిపించినాక ఇక ఆకాశ యుద్ధమే అని అర్ధమైంది. ఏ మధ్య భారతంలో మైనింగ్ కోసం కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఈ బాంబింగ్ జరిగిందో అక్కడ మావోయిస్టు, మందుపాతర పేల్చింది ఎంతో లోతయిన భూగర్భం నుంచి ఆదివాసీ ఆక్రోశ అగ్రహాల వ్యక్తీకరణ అది.
అపుడు నాకు రెండు విషయాలు జ్ఞాపకం వచ్చాయి. పాలస్తీనా జాతి విముక్తి పోరాటంలో పాదాల కింద నేల కూడా లేకుండా పోరాడుతున్న ప్రజలు మానవ బాంబులై పేలినా నేను ఆహ్వానిస్తానన్న మన కాలపు మార్క్సిస్టు మేధావి ఎడ్వర్డ్ సయీద్ పరిశీలన. 1974 నాటికి ఇరవై ఏళ్ల యువకుడైన కటకం సుదర్శన్ హైదరాబాదులో పాలిటెక్నిక్‌లో మైనింగ్ చదువుతూ రాడికల్ విద్యార్ధి సంఘ నిర్మాణంలో ఎంత ముందు చూపు. ఎంత దార్శనికత. విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగానే, విప్లవోద్యమ అవసరాల కోసమే బెల్లంపల్లి కార్మిక పుత్రులు ఇద్దరిలో గంగారాం మెకానికల్ ఇంజినీరింగ్ ఎంచుకుంటే, సుదర్శన్ మైనింగ్ ఎంచుకున్నాడు. సిపిఐ ఎం.ఎల్ పీపుల్స్ వార్ దండకారణ్య పర్స్పెక్టివ్ రచించుకొని బస్తర్‌కు వెళ్ళిన ఏడు దళాల్లో గజ్జల గంగారాం, విప్లవం తన ఆయుధాలు తానే నిర్మాణం చేసుకునే దశలో వినూత్న టెక్నాలజీలతో తయారుచేస్తున్న బాంబు చేతిలో పేలి అమరుడయ్యాడు 1982లోనే. రాకెట్ లాంచర్లతో ఆకాశ యుద్ధంలో పాల్గొనే స్థాయికి మధ్య భారతానికి నాయకత్వం వహిస్తూ అమరుడయ్యాడు ఆనంద్ దూలా. తెలుగు సాహిత్యంలో ఒకే ఒక్క ప్రజా విప్లవ సైనిక వ్యూహ సృజనాత్మక రచన అల్లం రాజయ్య వసంతగీతమయితే ఆనంద్ అందులో అవిభాజ్యమైన ఆత్మ.
దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధితో అడవిలో అర్ధాయుష్షే నూరేళ్ళయే స్థితిలో 69 ఏళ్ళు జీవించి, అక్షరాలా విప్లవంలో జీవించి ఆనంద్ మే 31న అమరుడయితే ఆయనకు మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అగ్రశ్రేణుల నుంచి కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో పక్షాన సైనిక వందనమాచరించి అంత్యక్రియలు చేసిన నాలుగు రోజులకు గానీ శత్రువునుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకొని ఈ రోజు కేంద్రకమిటీ అభివక్త అభయ్, తెలంగాణ అభివక్త జగన్‌లు చేసిన ప్రకటన వివరాల్లోకి నేను పోవడం లేదు. కానీ కన్నాల బస్తీ కటకం సుదర్శన్ భారత విప్లవోద్యమ నాయకత్వంలో కీలక స్థానంలో వున్న ఆనంద్, దూలాగా ఎదిగిన క్రమాన్ని వాస్తవంగా తెలుసుకోవాలంటే, మీడియా చిత్రీకరణలకూ, వక్రీకరణలకూ భిన్నంగా ప్రభుత్వ దూషణలకు, ద్వేషానికి, ‘ఎన్కౌంటర్’ తప్పించుకున్నాడు అనే దుర్బుద్ధికీ దూరంగా ఆయనను అర్ధం చేసుకోవాలంటే ఈ ఒక్క రోజయినా ఆ రెండు ప్రకటనలు చదవండి. మనిషి మావోయిస్టయి, మావోయిస్టు ఆదివాసీ అయి, ఆదివాసీ మావోయిస్టు అయిన గుణాత్మక పరిణామం తెలుసుకోవాలన్నా ఆ రెండు ప్రకటనలు ఎట్లాగైనా సంపాదించి చదవండి. తెలంగాణలో ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలకు 74 నుంచి 80 దాకా రాడికల్ ఉద్యమం పర్యాయ పదమైతే అందులో ఆనంద్, బెల్లంపల్లి, జన్నారం, లక్సెట్టిపేటల నుంచి అదిలాబాదు దాకా వున్నాడు. దండకారణ్య పర్స్పెక్టివ్కు సిరోంచ, గడ్చిరోలీల నుంచి గోదావరి తీరం దాకా వున్నాడు. అరణ్యోద్యమంలో ఉన్నాడు. మధ్య భారతానికి అభివక్త ప్రతాప్‌గా, మార్గదర్శి ఆనంద్‌గా వున్నాడు. భారత విప్లవోద్యమ కేంద్ర స్థానంలో వున్నాడు.
1995నుంచే ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఆచరణకు ఆయన దిక్సూచి. మధ్యభారతంలో ప్రజాస్వామిక ప్రజాసంఘాల ఆచరణకు ఆయన ఒక సంకేతం. శ్రుతి, సాగర్ ఎన్‌కౌంటర్‌తో వెల్లువెత్తిన తెలంగాణ ప్రజాస్వామిక ఐక్యసంఘటనా సంచలనానికి ఆయన చలన సూత్రం.
నేనాయనను పాలిటెక్నిక్ రాడికల్ విద్యార్ధిగా మాత్రమే చూశాను. శ్యామ్ అమరత్వం ప్రతిస్పందనలో చదువుకున్నాను. అప్పటినుంచే ఆయన నాతోలేనిదెన్నడు? మనలోలేనిదెన్నడు? ‘మట్టికాళ్ళ మహారాక్షసి’ పాదాల కింద పేలడానికి సిద్ధంగా మట్టిపొరల్లో నిద్రిస్తున్న ఆనంద్ దూలా నూతన మానవుడు.