చదువేలేని తరంలోంచి వచ్చాను. మా జేజబ్బ ఏటవతల తాండ్రపాడు. నాన్నకు చదువు లేదు. అప్పట్లో పిలిచి కోర్టులో తోటమాలి పని ఇచ్చారు. ఆ తరువాత బిల్లజవానుగా ఉద్యోగంలో స్థిరపడ్డారు.
నాకు చదువు మీదకన్నా సినిమాలు కథలమీద మోజు .
అందుకే చదువు అబ్బలేదు.
కర్నూలు లో పుట్టాను.
అది 1990 కవిత్వజ్వరం బాగా పట్టుకున్న కాలం. నాకు కవులంటే పిచ్చి మోహం. వాళ్ళ ఫోటోలు తెల్లపుస్తకం లో అతికించి, ఫోటోలకింద వారి చిరునామాను, ప్రచురితమైన కవిత్వం సంకలనాల్ని రాసి దాచుకునే వాణ్ణి. ఇప్పటికీ ఆపుస్తకం ఉంది.
ఆశారాజు రాసిన రెండవపుస్తకం ‘దిశ ‘ నాకు రంగుల సీతాకోకలా అనిపించింది. నేనూ ఇలా రాయాలని అనుకున్నాను. మరి రాయడం అంతసులువు కాదని తరువాత తెలిసింది. అపుడపుడు రాసిన కవితల్ని ఎవరికి చూపించాలి…?
నా చుట్టుపక్కల సాహిత్య వాతవరణమే లేదు. లైబ్రరీలో రామ్చంద్ మిత్రుడు పరిచయం అయ్యాడు.
అతను చిన్న కవితని చూడకుండా పెద్ద దుడ్డుకర్రతో బాదేవాడు. శిల్పం గురించి ఉపన్యాసం ఇచ్చేవాడు.
ఇప్పటికీ బాగా గుర్తు. ఆంధ్రభూమి ఆఫీసుకు నేను, అతను వెళ్ళాం అక్కడ బొమ్మదేవర నాగకుమారి రచయిత్రి కనిపించింది.
ఆమె తో మాట్లాడుతూ, కవిత్వం మేము రాస్తే వేసుకోరు పెద్దవాళ్ళు రాస్తే వేసుకుంటారు అని కాసింత నొచ్చుకున్నట్టు అన్నాను. ఆమె నా కవిత్వాన్ని చదివి ముందు మీరు అక్షర దోషాలు సరిచూసుకోండి. అని సరిచేసింది.
ఇప్పటికీ ఆమె సరిచేసిన కవిత్వం కాగితాలు అలాగే ఉన్నాయి.
రాయాలన్న ఉత్సాహం వుంది
సరైన అవగాహన లేదు. అప్పటికి కర్నూలు కవులతో పరిచయం లేదు. రామ్చంద్ మిత్రుడే నాకు దిక్సూచి.
మా అమ్మమ్మ అంటే నాకు భలే ఇష్టం. ఆమె వద్ద బోలెడు కథలు చెప్పేది. ఆ ప్రభావం నామీద గాఢంగా చూపింది. అందుకే బాలమిత్ర, చందమామ, బొమ్మరిల్లు, పిల్లలపుస్తకాల్ని పరిచయం చేసుకున్నాను.
8వతరగతిలో డిటెక్టివ్ పుస్తకాల్ని, కమర్షియల్ నవలల్ని చదివి 10తరగతి తప్పాను. నాన్నా స్నేహితుడి సలహ నన్ను మెకానిజం షాపులో కట్టేసింది .
అక్కడ తీరిక వేళల్లో వారపత్రికల్ని జీర్ణం చేసుకున్నాను.
ఈ సమయం లోనే జహీర్ అనే మిత్రుడ్ని పరిచయం చేశాడు రామ్చంద్.
ముగ్గురం సాహిత్యం గురించి అర్ధరాత్రుళ్ళు కూడా రోడ్డు పక్కన షాపుల పై కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం ప్రతిరోజు.
సీరియస్ సాహిత్యం అపుడు పెద్దగా వంటపట్టలేదు. మిత్రుడు పాణి కొత్తగా పరిచయం అయ్యాడు. అతను అన్నమాట ఇప్పటికీ గుర్తుంది.
సామాజిక సృహతో ఏదైనా రాస్తే బాగుంటుంది కదాని.
నేను అన్నాను ఒక చట్రం లో ఇమడదల్చుకోలేదని. అప్పటి తెలివి అది మరి.
కర్నూలు నుంచి జహీర్, రామ్చంద్ కలిసి ఎటునుంచి నరుక్కరావాలి అనే కవితా సంపుటిని తెచ్చారు. అందులో నా మొదటి కవిత శుద్దవచనం తో అచ్చయింది.
తరువాత కథాసమయం అని కొంతమంది మిత్రులు కలిసి కథలమీద మాట్లాడుకుంటున్నారని తెలిసీ వారిలో నేనూ ఒకణ్ణి అయ్యాను. అక్కడ చర్చలు సాహిత్యం పై బాగా కాలిపోయేలా జరిగేవి. నేను భయపడ్డాను.
అప్పటికే నా కథలు ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి లో అచ్చయి ఉన్నాయి. వీళ్ళ దాటికి కధా స్వరూపం వస్తువు శిల్పం నన్ను బాగా కుదిపేశాయి. ఆలోచనల్లోకి నెట్టేశాయి.
ఆ ప్రభావం తో ఎంటికేడ్సాల, చీడకాటు కథల్ని రాశాను. అవి కథాసమయం, హంద్రీకథల్లో నిలిచిపోయాయి .ఆ తరువాత కథలు రాయడం ఆపేశాను.
కవిత్వం పై దృష్టిని పెట్టాను.
కాశీభట్ల వేణుగోపాల్ గారనే పెద్ధ రచయిత మన కర్నూలు లో ఉన్నాడని, రామ్చంద్ అతని వద్దకు తీసుకెళ్ళాడు.
అక్కడ వెంకటకృష్ణ అనే కవి కూడా కనిపించాడు.
పరిచయం చేసుకున్నాము.
సాహిత్యం ఏంచదువుకున్నావని వెంకటకృష్ణ అడిగేసరికి సమాధానం తడబడింది. ఏవో నాలుగు పేర్లు చెప్పి తప్పించుకున్నాను.
కాశీభట్ల గారే మద్దుర్నగర్ లో ఉండే నా షాపు వద్దకు వచ్చి పలకరించేవారు .నేను జేబులో దాచుకున్న కవిత్వం భయంగా వినిపించేవాణ్ణి. తను భుజం తట్టేవాడు. అలా అతని ఎదుట సమయం దొరించుకుని చదివి మెప్పు పొందేవాణ్ణి.
నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని ఇది నా అభిప్రాయం.జనాంతికం కాదని సూటిగా చెప్పేవారు.
మార్పులు చేర్పులతో ఇలా 2004 లో గురువు గారితో ముందుమాటగా ‘ఒకతడి అనేక సందర్భాలు ‘ కవితా సంకలనం తో కవిత్వం లోకి పూర్తిగా అమరిపోయాను.
రాసిన కవిత్వం పార్కుల్లో రాంచంద్కు చూపే వాణ్ణి. అతను చదివి మొదటి పుస్తకం వచ్చిన తరువాత కూడా ఇంకా పాతవాసనేనా! అని విమర్శించేవాడు. కొత్తగా ఎలా రాయాలో తెలియదు.అతనిపై ఉడుక్కునే వాణ్ణి. నీవు రాసి చూపు అని వాదనకు దిగేవాణ్ణి
కాలక్రమేణా తను బిజీ కావడం, నేను అనేక కవితా సంకలనాల్ని చదవుతూ నాలోని వచనాన్ని ఎండగడతూ వచ్చాను.
సముద్రం దాహం తీర్చదని జ్ఞానం వచ్చిన తరువాత తెలిసినట్టు
కవిత్వదూప తీరనిదని అదే జ్ఞానం మళ్ళీ సెలవిచ్చింది.
నాలో కవిత్వం ఇగిరిపోకుండా ఉండడం కోసం ,నేను వేరే ఊరి మిత్రులతో తరచుగా మాట్లాడే వాణ్ణి.
ఈ జర్నీలో ఫేస్బుక్ లో కవిసంగమం అనే గ్రూప్లో జాయినయ్యాను. అడ్మిన్ యాకూబ్ గారి సహకారం నాకు ఉపయోగపడింది.కొత్త కవులు ,కొత్త వాసన వెదక్కున్నాను నాలా కవిత్వం కొరకు పలవరించే వారిని.
వారితో స్నేహం కవిత్వం మరింత తెలుసుకునేలా చేసింది. చదవడం రాయడం చేస్తూ మరింత మెరుగయ్యాను
శ్రీ శ్రీ ని, అరుణ్ సాగర్ని, కొప్పర్తి,కొండేపూడి నిర్మల ఇంకా అనేక కవుల కవిత్వాన్ని తలగడ కింద దాచుకుని చదివాను.
ముఖ్యంగా ‘కావేగో ‘గారి రచనల్ని తన పదాల పొదుపు శిల్పం వర్ణం శబ్దం నాకు పిచ్చి ఇష్టం.
కాలవలు, బావులు, చెరువులు, నదులు, దాటి సముద్రం వద్ద నిల్చున్నాను.
అరుపు మాయమయింది.
నిశ్శబ్దం మచ్చికయింది
‘నేను’అనే శబ్దాన్ని మెల్ల మెల్లగా ఉపసంహరించుకుంటున్నాను.
ఇపుడు వెలుగును చదవగలుగుతన్నాను.
కవిసంగమం లో ప్రతిరోజు కవిత్వం రాశాను.
ఈ మధ్య ‘తూనీగ తో సాయంకాలం ‘ప్రేమలేఖ నుంచి కవిత్వ సంకలనం వచ్చింది.
ఈ పుస్తకం తృప్తిని ఇచ్చింది.
చదివిన వారు ఇష్టంగా అనుభూతించారు.
పలానా కవిత్వం రాయాలని నేను ఎన్నడూ అనుకోలేదు.
ప్రయాణం అంతే…
కనిపించినవి, ఆవహించినవి, గాయపరచినవి, దుఃఖానికి గురిచేసినవి అక్షరాలై తెల్లకాగితం లో కవిత్వమై దాక్కున్నాయి.
అంకె మీద దృష్టిని జీవనానికి సరిపడేంత కుదుర్చుకుని
అక్షరాన్ని ఇష్టం చేసుకునాను.
కొత్త వస్తువు, కొత్త శిల్పం అంటే మాగిన ఇష్టం.
కొత్త కవుల్ని బాగా చదువుతుంటాను.నేను కొత్తగా ఉండడానికి….
ఈ నాలుగు మాటల అవకాశాన్ని పంచుకోవడానికి ఇచ్చిన వసంతమేఘం మేగజైన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.