ఇది యుద్ధం
అనుకున్నాక..
గెలుపొక్కటే
లక్షమనుకున్నాక..

నువ్వూ నేనూ
అతడూ ఆమె
ప్రజా యుద్ధానికి
మారు పేరులం కదా..

జన సంగ్రామానికి
జవసత్వాలౌతూ
జననమే కానీ
ఎవరికైనా మరణమెక్కడిదీ..

అడవినీ మైదాల్నీ
కన్నీటి సంద్రాల్నీ
అలుపెరుగని అమ్మవడై
ఆలింగనం చేసుకున్నవాడు

అయిన వాళ్ళందరినీ
కష్టజీవి కన్నీళ్ళలో
ఆ బతుకు గాయాల్లో
దర్శించుకున్న దార్శికుడతడు..

ఏవూరూ ఏవాడా
ఎవరి బిడ్డా
ఏవొక్కరి స్వప్నమదీ
అతడికి మరణమెక్కడిదీ..

అతడి సహచర్యంలో
ఆయుధమూ అక్షరాలు దిద్ది
చెరచబడ్డ చెల్లెళ్ళ
పిడికిళ్ళై విరబూయాలని
పరితపించింది..

పారే చెలిమ
తరాల దూపతో అల్లాడే
ఆదివాసీ గొంతు తడిపే
కర్తవ్యాన్ని కళ్ళకద్దుకున్నది..

ఆ చెట్టూ ఈ పుట్టా
వాగూ వంకా పూవూ పిందే
సెంట్రీ గాసిన తీతువూ
దాపుగాసిన గుబురు పొదలూ

దుఖ్ఖ నదుల నదిమిపట్టి
తలలు వొంచి భుజముకెత్తి
వీరుడా నువ్వమరుడన్నయ్
నీబాటలోనే మా అడుగులన్నయ్

కన్నీటి జ్ఞాపకాలు తొలుచుకొచ్చే
బాధా బాసా మసిలే నెత్తురూ సరే
దారి పొడవునా ఒలికిన త్యాగాలే
చరిత్ర ఎత్తిపట్టిన విజయ కేతనలు

బస్తర్ను బిస్తర్లా చుట్టేద్దామని
మువ్వన్నెల కలలుగనే ప్రహార్లు
బిగుపిడికిళ్ళై దారికడ్డం లేసిన
పసి బిడ్డల కళ్ళకు జడుస్తున్నయ్

ఆ చూపుల్లో దాగిన
నిర్మల సాకేత నవ్వుల్లోని
సాయుధ సంకల్పాన్ని పసిగట్టి
వొణికిపోతున్నాయ్

క్రాస్రోడ్లో కామ్రేడ్లని ఒకడూ
బస్తర్ ఖాళీ ఏకాకని మరొకడూ
మాఫియా మీడియా తోడైకూస్తేనేం
జనమూ జంగూ ఒంటరి వౌనా..

వొడవని దుఃఖ్ఖం వొళ్ళో దాచి
సాగే జంగును కళ్ళకద్దుకుని
కమ్ముకువచ్చే రాజ్యం కుట్రను
తరిమికొటే తెగువై సాగాలిప్పుడు

ఓటమెరుగని ఉద్యమస్ఫూర్తీ
సాయుధ దృక్కుల పౌరుషచూపూ
తనవని చాటి మన చేతులకిచ్చిన
రగల్జెండను భుజానికెత్తి జోహార్లందాం!!

Leave a Reply