జహీర్ భాయి (జహీర్ అలీ ఖాన్) విషాదకర ఆకస్మిక మరణంతో దేశం ఒక ఉత్తమమైన, ప్రజాస్వామికవాదిని కోల్పోయింది. ముస్లిం మైనారిటీలకు దేశంలో ప్రజాస్వామ్య ఆవరణ (స్పేస్) పూర్తిగా మృగ్యమవుతున్న కాలంలో, ఆత్మ రక్షణ కోసం వాళ్లు కూడా మతవిశ్వాసాన్నే కవచంగానూ, ఆయుధంగానూ ఎంచుకోవాల్సిన స్థితి ఏర్పడిన కాలంలో హైదరాబాదులోని పాత నగరంలో ఒక ప్రజాస్వామిక ద్వీపంలా జహీర్ అలీ ఖాన్ ఒక కొవ్వొత్తి వెలిగించుకొని లౌకిక ప్రజాస్వామ్య భావజాలం గల మనుషుల్లోకి, నిర్మాణాల్లోకి తన ప్రయాణం మొదలుపెట్టాడు. చార్మినార్ నుంచి, సాలార్‌జంగ్ మ్యూజియం నుంచి ఇమ్లీబన్ బస్‌స్టాండ్‌కు వచ్చే తోవలో అబీద్ అలీ ఖాన్ మెమోరియల్ కంటి వైద్యశాలను ఎందరు ఆ మార్గంలో వెళ్లే వాళ్ళు తమ మనసుల్లో నిలుపుకున్నారో కానీ తనను పెంచుకొని కన్న తండ్రిగా చూసుకున్న అబీద్ అలీ ఖాన్ స్మారకంగా ఏర్పడిన ట్రస్టుకు జహీర్ అలీ ఖాన్  మేనేజింగ్ ట్రస్టీ.  అట్లే లక్డీకా పూల్ దగ్గర ట్రస్ట్ ఆఫీస్ నుంచి వెలువడే సియాసత్ వెబ్  మ్యాగజైన్ చదివే వాళ్లకు ఆయన కేవలం హైదరాబాదు పురానా షహర్, తెలంగాణ గురించి మాత్రమే కాదు బాబ్రి మసీదు విధ్వంసకాలం నుంచి కశ్మీరు మొదలు కన్యాకుమారి వరకు జరుగుతున్న ప్రజాస్వామిక విలువల విధ్వంసం గురించి ఎంత ఆవేదన చెందాడో, ఆరాటపడ్డాడో తనకు చేతనయిన అంటే ట్రస్టుకు సాధ్యమైన సహాయ సహకారాలను బాధితులకు అందించాడని తెలిసే ఉంటుంది. ఈ రెండు చోట్ల మాత్రమే కాదు మోజం జాహీ మార్కెట్ చౌరస్తా నుంచి ఆబిడ్స్ త్రోవలో ఎడమవైపు సియాసత్ ఆఫీసులో ప్రవేశించగానే కుడి చేతి వైపు కూర్చుని సియాసత్ పత్రిక నిర్వహణ చేస్తున్న మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ ఎల్లవేళలా ఎదురొచ్చి స్వాగతం చెప్పే సుతిమెత్తని మనిషిగా కనిపిస్తాడు. గత 30 ఏళ్లుగా ఆయన సహాయ సహకారం పొందని ఒక్క ప్రజాస్వామిక సంస్థ అయినా, వ్యక్తి అయినా ఉన్నారనుకోను.

విరసం మొదలు, కుల నిర్మూలన పోరాట సమితి, చైతన్య మహిళా సంఘం వరకు అబిడ్స్‌లో ఆఫీసుకు వెళ్లి తెలుగులో రాసిన తమ సుదీర్ఘమైన ప్రకటనలు ఎన్నిసార్లు ఇచ్చారో కానీ కామ్రేడ్ ఎం.టి. ఖాన్ అమరుడయ్యాక ఆ ప్రకటనలను ఆయన ఎంత జాగ్రత్తగా అనువాదం చేయించి ఉర్దూ పాఠకుల కోసం తప్పకుండా ప్రముఖంగా వేశాడని మనకెవ్వరికీ ఎట్లా తెలుస్తుంది.

ఈ డెబ్భైఅయిదేళ్ల తరం ఉర్దూను ముసల్మాన్‌ల భాష అని ఇతరంగా చూసే అమృతోత్సవ కాలంలో ఉన్నాం. ఎంత ఐరనీ, ఎంత విరోధా భాస. దేశ విభజన నుంచి ఇప్పటిదాకా ‘ఈ ఉదయమేనా మనం కోరుకున్నది’ అని ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఆవేదన చెందినట్లు చిమ్ముతున్న విషవాయువులు గ్యాస్ చాంబర్లు అయిన స్థితి హైవే మీద ఏర్పడి కదా జహీర్ అలీ ఖాన్ ఊపిరాడక చనిపోయింది.

భూదేవి నగర్ మార్గంలో ముఖ్యమంత్రి రాక కోసం పోలీసులు చేసిన అట్టహాసం, ఆర్భాటం సీసీ కెమెరాల్లోనూ టీవీ ఛానెల్స్‌లోనూ వీడియోలు చెరిగిపోక ముందే జహీర్ భాయ్ పడిపోయి, ఊపిరాడని స్థితి అంతా ఎట్లా రికార్డ్ అయిందో బయట పెట్టాలని డిమాండ్ చేయాలి. ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితుల పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేయాలి. ముఖ్యమంత్రి మూడు నిమిషాల రాక, సందర్శనం, పరామర్శ ఎంత బ్లో అప్ చేసి, ఎంత రిపీట్ చేసి చూపారో అంత ఎన్లార్జ్ చేసి చూపిస్తే ముఖ్యమంత్రి రాకయే జహీర్ భాయి ఆకస్మిక మరణానికి దారితీసిందని ఇప్పుడు ఊహిస్తున్న వాళ్ల మాట రూఢి అవుతుంది.

ఖననం చేయబడిన గద్దర్ వెన్నుపూస దగ్గరి రాజ్యం బుల్లెట్ సాక్షిభూతంగా మిగిలినట్లే ప్రేక్షకుల మనోఫలకంపై జహీర్ భాయ్ ఊపిరాడక పడిపోయి ఆసుపత్రికి చేర్చకముందే అసువులు బాసిన దృశ్యం కూడా రానున్న మంచి రోజుల దాకా నిలబడి ఉంటుంది.

ఒక్కసారి ఈ ఆగస్టు 7 సంఘటనను 1990 మే 6న వరంగల్ రైతు కూలీ సంఘం మహాసభల ఊరేగింపు, బహిరంగ సభతో పోల్చండి. దాదాపు 20 కిలోమీటర్ల దూరం పధ్నాలుగు లక్షల మంది జనం పోలీసు బందోబస్తు కూడా లేదు. స్వీయ క్రమశిక్షణ. ఒక్క అనుచిత చర్య లేదు. ఒక్క విషాద సంఘటన లేదు.

గుజరాత్ మారణకాండ తర్వాత 2002, ఏప్రిల్ 9న దేశంలోనే అఖిలభారత స్థాయిలో మొట్టమొదటిసారిగా నిజ నిర్ధారణకు వెళ్లిన ఏఐపిఆర్ఎఫ్ (ఆలిండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం) (అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక) బృందానికి మున్సిఫ్ పత్రికతో పాటు అండగా నిలిచిన పత్రిక సియాసత్ సంస్థలు, అబిదాలీ ఖాన్ స్మారక ట్రస్ట్. ఎపిసిఎల్‌సి నుంచి ప్రజా సంఘాల్లో పని చేస్తూనే, మైనారిటీ హక్కుల కోసం ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసిన అవిశ్రాంత పోరాట యోధురాలు రెహానా సుల్తానా, ఎప్పుడు ఆఖరి వాళ్ళమే అని లో ప్రొఫైల్లో ఉండే అంబర్‌పేట ఉపాధ్యాయుడు అబ్దుల్ లతీఫ్‌ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఏప్రిల్ 9 నుంచి 20 దాకా గుజరాత్‌లో అహ్మదాబాద్, వడోదర, ఆనంద్ , సూరత్ మొదలైన ఎనిమిది జిల్లాల్లో బాధితుల శిబిరాలు, మృతుల కుటుంబాలు, విధ్వంసానికి గురైన స్థలాలు చూడడం మాత్రమే కాదు, సియాసత్ సమకూర్చిన అన్ని ప్రాథమిక అవసరాల సహాయ సహకారాలని వారికి అందించి, పరామర్శించి, ఆశ్వాసం చెప్పి తిరిగి వచ్చిన బృందం వివరించిన దారుణ, మారణ, బీభత్స, విద్వేష, విధ్వంస రాజ్య దాడియే రాజమండ్రి విరసం (2002 మే) సభల తర్వాత ముప్ఫై మంది రచయితల బృందం మళ్ళీ గుజరాత్‌కి వెళ్లి వచ్చి ఒక ఏడాదికి పైగా హైదరాబాదులోనే ‘గుజరాత్ గాయం’ నిర్వహించడానికి ప్రేరణ అయింది. యాకూబ్ కన్వీనర్‌గా, విరసం, అరసం, జనసాహితీల నుంచి షరీఫ్, ఎస్.వి.సత్యనారాయణ, దివి కుమార్‌లు కోకన్వీనర్లుగా హైదరాబాదులో ఏర్పడిన ఐక్యవేదిక గురించి చెప్పడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అటువంటి అవసరం అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఉన్నదనడానికి ఎన్నో సందర్భాలున్నాయి కానీ ఈ కృషికి అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచిన పత్రిక సియాసత్ అది ఒక పత్రిక కాదు ఒక సంస్థ. దాని నిర్వాహకుడు జహీర్ అలీ ఖాన్. ఆ కాలంలో తెలుగులో వచ్చిన ప్రతి కరపత్రం మొదలు పుస్తకం వరకు ఏది ఉర్దూలో రావాలన్నా అది ఉచితంగా అచ్చు వేయించే బాధ్యత జహీర్ భాయిదే.  ‘గుజరాత్ గాయం’ నుంచి మోడీ యజమాని అమెరికా ఇరాక్‌పై దాడి చేసేదాకా ఆ సాంస్కృతిక పోరాటం కొనసాగి ఇంక అది సద్దాం హుస్సేన్ ఉరిశిక్ష దాకా సాహిత్య సాంస్కృతిక ప్రతిఘటనగా తెలుగు నేల మీద ఎట్లా కొనసాగిందో అది చరిత్ర.

ఎందుకంటే అప్పటిదాకా సిపిఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్)  పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న వడకాపురం చంద్రమౌళి, ఆయన సహచరి కరుణల అంత్యక్రియల దగ్గర తెలిసింది సద్దాం హుస్సేన్ ఉరిశిక్ష వార్త. వాళ్ళిద్దరిని పార్టీ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి పోతుంటే ఒరిస్సా సరిహద్దుల్లో పట్టుకొని కాల్చివేశారు పోలీసులు అద్వానీ, చంద్రబాబు నాయుడు, హెచ్.జె దొరల ఆదేశాలపై. మొదటి ఇద్దరి గురించి పాఠకులకు తెలుసు కానీ హెచ్.జె దొర వరంగల్‌లో డిజిపి ‘నక్సలైట్స్’ గా విశ్వహిందూ పరిషత్ మహాసభలను ప్రారంభించి ఎబివిపి విద్యార్థులు రాజ్యం ‘కళ్ళు చెవులు’ అని ‘ది వీక్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1984 లోనే చెప్పాడు. ఆయన పుట్టపర్తి సాయిబాబా భక్తుడు కూడ. ఈ ఉదంతాన్ని ఈ విషవృక్షం ఊడలు దిగిన కాలంలో గుర్తు చేసుకోవాల్సి ఉంది.

                                                                                     2

హైదరాబాదులో బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన కాలానికే పాత నగరంలో సలావుద్దిన్ ఒవైసీ ఎంఐఎం అధ్యక్షుడుగా ఒక ప్రబలమైన ముస్లిం నాయకుడు. ఎందుకు ఈ ప్రస్తావన అంటే అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం మొదటి దశ. జలగం వెంగళరావు హోం మంత్రి. మతం పేరుతో జరిగే ఘర్షణలు నివారించడానికైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించడానికైనా ఒవైసి బ్రహ్మానందరెడ్డి ముందు పెట్టిన డిమాండ్‌లు పాత నగరంలో పేదరికం నిర్మూలన కాదు, సంక్షేమ కార్యక్రమాలు కాదు, బడి కాదు, దవాఖాన కాదు, యువకులకు ఉపాధి ఉద్యోగాలు కాదు -మసీదుల్లో లౌడ్  స్పీకర్లు పెట్టుకోవడం అంటుండేవాడు ఎం.టి. ఖాన్. నరేంద్ర -ఒవైసీల రాజకీయ శిబిరాల మధ్య సంక్షోభాలకు ప్రజలు గురయ్యే కాలంలో పాత నగరంలో కాలుతున్న ఓడలో కాసబియాంకగా నిలబడిన వాడు ఏం.టి. ఖాన్.  విరసం అయినా ఏపీసిఎల్‌సి అయినా హైదరాబాదు ఏక్తా అయినా పురానాపూల్ దగ్గర ఆయన పేద ముసాఫిర్ ఖానాయే.

ఆ ఎం.టి ఖాన్ ఆశయాలకు అండగా నిలిచింది సియాసత్. ఆయన టీచరుగా పదవీ విరమణ చేసి, ఈనాడు న్యూస్ టైం ఇంగ్లిషు పత్రికలో కూడ కొన్నాళ్ళు పనిచేసి మానేసిన తర్వాత ఆయన ఆఖరి శ్వాస దాకా ‘సియాసత్’ లో ఒక స్థానం ఇచ్చి కాలమ్ రాయించిన వాడు జహీర్ ఆలీ ఖాన్.

ఇంక 1990-91 నాటికి సలావుద్దీన్ ఓవైసీ అనుమతి లేకుండా ప్రజాసంఘాలు ముస్లిం ప్రజల దగ్గరికి వెళ్లలేని స్థితి. అద్వానీ రథయాత్ర కాలం నుంచే పాత నగరంలో పీపుల్స్‌వార్ ఆర్గనైజర్‌గా పెట్టి పని చేయించాలన్న సంకల్పం విపి సింగ్ మండల్ కమిషన్ అమలును ప్రకటించినపుడు గాని సాధ్యం కాలేదు. ఒక విధంగా విప్లవోద్యమానికి విశాల బహుళ ప్రజారాశుల్లోకి  పోవడానికి అగ్నివేశ్ మాటల్లో చెప్పాలంటే మండల్-కమండల్ ఘర్షణ వాతావరణం ఎంతో ఉపకరించింది. ఇంచుమించు అదే కాలంలో కువైట్‌ను సద్దాం హుస్సేన్ ఆక్రమించుకున్నాడనే నెపంతో అమెరికా బాగ్దాద్‌పై బాంబు వేసింది.

హైదరాబాదులో నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రైవెటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని దళిత, బహుజన విప్లవ విద్యార్థి సంఘాలనన్నింటిని ఐక్యం చేసి ఆర్‌ఎస్‌యు వీరన్న (వీరారెడ్డి) పిడిఎస్‌యు మారోజు వీరన్న నాయకత్వంలో విద్యార్థుల ప్రతిఘటనా పోరాటం మొదలైంది. హైకోర్టులో కూడ న్యాయపోరాటం చేపట్టిన విద్యార్థులు విజయం సాధించి నేదురుమల్లి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పాత నగరంలో మత ఘర్షణలు సృష్టించి రాయలసీమ నుంచి ఫ్యాక్షనిస్టు ముఠాలను కూడా ప్రవేశపెట్టి, కత్తులు, తుపాకులే కాదు బాంబులు కూడా పంచి రాజీవ్ గాంధీ అనుయాయుడిగా ముఖ్యమంత్రి అయ్యాడని మనం గుర్తు చేసుకోవాలి.

అప్పుడు ప్రవేశించాడు వీరన్న పాత నగరంలో పీపుల్స్ వార్ ఆర్గనైజర్‌గా. రెండు సంవత్సరాలలో అక్కడ పేద ముస్లింల తలలో నాలుక అయ్యాడు కానీ అది దుర్బేధ్యమైన కోట. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఏఐఎల్ఆర్‌సి, విరసం  తీసుకున్న సాంస్కృతిక ప్రతిఘటనా పోరాటంలో భాగంగా 1993లో ఏఐఎల్ఆర్‌సి దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. అంబర్‌పేట ఛే నెంబర్ బస్‌స్టాప్ దగ్గర రాణా ప్రతాప్ హాల్‌లో రెండు రోజులు సదస్సు జరిగి, (అనురాధా గాంధీ కీలక పత్రం ప్రవేశపెట్టింది) ఊరేగింపు చార్మినార్ దాకా సాగి పాతబస్తీలో ఒక స్కూలులో బహిరంగ సభ జరిగింది. ఈ సభలకు ఉర్దూలో కరపత్రాలు పాత నగరంలో పంచగలిగాం. పోస్టర్లు వేయగలిగాం. కానీ మర్నాటికి పోస్టర్లు గోడల మీద  కనిపించేవి కాదు. ఊరేగింపు, బహిరంగ సభకు తన అనుచరులు ఎవరు రాకుండా ఒవైసీ జాగ్రత్త పడ్డాడు. 2004 అక్టోబరులో సిపిఐ మావోయిస్టు, సిపిఐ ఎం-ఎల్ జనశక్తితో కలిసి ప్రభుత్వంతో శాంతి చర్చలకు వచ్చినపుడు మధ్యవర్తుల్లో ఒకరైన పొత్తూరి వెంకటేశ్వరరావు మాత్రమే కాదు, జాహీర్ అలీ ఖాన్ కూడ వారిని టీకి పిలిచి ముస్లిం మైనారిటీల సమస్యలు, డిమాండులు వారి ముందు ఉంచాడు. దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు నేల మీద పేద పీడిత ముస్లింలు, వారి గొంతు అయిన జహీర్ అలీ ఖాన్ మొదటి నుంచి విప్లవ పార్టీలను తాము నమ్మదగిన, ఆధారపడదగిన నేస్తంగా చూశారు. ఈ గతం నుంచి సరిగ్గా 20 ఏళ్లకి ఇవాల్టి స్థితికి వచ్చాం. ఇప్పుడు ఏఐఎల్ఆర్‌సి లేదు. అనురాధ గాంధీ లేదు. ఎం.టి ఖాన్ లేడు. వీరన్న సరే సరి.  94 ఎన్నికల సమయంలో పంజాబ్ కమాండోస్ నగరం నుంచి పట్టుకపోయి ఏటూరునాగారం అడవుల్లో ఎన్కౌంటర్ చేశారు. మృతదేహాన్ని కూడ తలితండ్రులకివ్వలేదు. బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ గాయం మీదుగా గుజరాత్ మోడల్ అయ్యి ఇవాళ మణిపూర్‌లో మారణహోమం అయింది. మరి ఎమ్.ఐ.ఎమ్ ఏమైంది? సలావుద్దీన్ ఒవైసీ నుంచి  అసదుద్దీన్ ఒవైసీ కాలానికి ఆల్ ఇండియా ఎమ్.ఐ.ఎమ్ అయి వరుసగా ఎమ్‌పి, ఎమ్మెల్యే సీటు, సీట్లని కైవసం చేసుకుంటూ రాష్ట్రంలో చంద్రశేఖరరావు పాలనకు ప్రత్యక్షంగా, మోడీ పాలనకు పరోక్షంగా ఎన్నికల చదరంగం ఆడుతూ తెలంగాణ, మహారాష్ట్ర, యుపిలలో కూడ తన బలం చూపుతున్నది. ‘నా దృష్టిలో ఎంఐఎంకు, ఆర్ఎస్ఎస్, బిజెపిలకు ఏమి తేడా లేదంటా’డు జహీర్ భాయి. జహీర్ భాయ్‌అయినా, సియాసత్‌యినా అబిదలీఖాన్ ట్రస్ట్‌ అయినా ఈ ముప్పేట దాడిలో (తెలంగాణలో భూస్వామ్య, కార్పొరేట్, దళారి కొల్లగొట్టి వేలం వేస్తున్న భూములు, సంపద, కేంద్రంలో మోడీ అమలు చేస్తున్న ఫాసిజం పాత నగరంలో ఎంఐఎం బిగిపిడికిలి) ఎంత ఎదురీతగా, పేద ముస్లిం ప్రజలకు, ముఖ్యంగా స్త్రీలకు ఎంత అండగా ఉంటూ బయట ప్రజాస్వామిక శక్తులతో కలిసి పనిచేస్తున్నారో ఊహించుకుంటే రమాసుందరి రాసినట్లు ‘ఇప్పుడు కావల్సిన మనిషి’ మనకు లేకుండా పోయాడు. ఆయన మోడీ పాలనపై సమాంతర వ్యాఖ్యలు ఎన్. వేణుగోపాల్ ‘వీక్షణం’ ఎన్నిక చేసిన సంపాదకీయాలు ‘విద్వేషపు విశ్వ గురువు’ మలుపు ప్రచురణ పుస్తకావిష్కరణ సభకు ఆగస్టు 5న అధ్యక్షత వహించి, ఆగస్టు 6న గద్దర్ ఆకస్మిక మరణ వార్త విని ఎల్‌బి స్టేడియంకు వెళ్లి ఆయన పార్థివ దేహంతో ప్రయాణం చేశాడు. ఈలోగా ఆరవ తేదీ రోజే ఆగస్టు 13న అచ్చంపేటలో పాలమూరు అధ్యయన వేదిక ఏర్పాటు చేసిన  ‘మన బాల జంగయ్య’ ఆవిష్కరణ సభలో అమరుడు బాల జంగయ్య మొదటి వర్ధంతి సభలో ‘ప్రజల పాటల కవి గద్దర్’ పై ప్రసంగిస్తానని మాట ఇచ్చాడు. మృత్యు రాజ్యం అడ్డుపడ్డది.

One thought on “‘ఇప్పుడు కావల్సిన మనిషి’ జహీర్ భాయి

  1. నాకు తెలిసి ఓల్డ్ సిటీ లో అప్పుడు పనిచేయడానికి వెళ్ళిన ఆర్గనైజర్ కా. వీరన్న కాదు. వేరే కామ్రేడ్. తరువాత ఆ కామ్రేడ్ ఉద్యమంలో కొనసాగలేదు.

Leave a Reply