అమానవీయ మనువాద పర్యవసానం మహిళల నగ్నప్రదర్శన

మణిపుర్ లోని కాంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళల నగ్న ప్రదర్శన, వారిలో 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. ఆమె 56 ఏళ్ల తండ్రిని, 19 ఏళ్ల సోదరున్ని కాల్చి చంపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ప్రదర్శనను చూపుతూ 26 సెకన్ల వీడియో వైరల్ కావడంతో మణిపుర్ లో మనువాదం ఎలా బుసలు కొడుతుందో వెల్లడైంది. యావద్దేశవాసులు ఆ దారుణానికి చలించిపోయారు. విదేశీయులు సైతం నిర్ఘాంతపోయారు. ‘‘కనిపిస్తే కాల్చివేత’’ ఆదేశాలు, 10 వేల మంది అదనపు భారత సైన్యాల మొహరింపు మధ్య ఈ దారుణం జరిగింది. దేశంలోని దాదాపు 5,500కు పైగా ప్రముఖ ప్రజాహిత వేధావులు, రచయితలు, కళాకారులు, హక్కుల కార్యకర్తలు, సినీ దర్శకులతో కూడిన కన్ సర్న్ సిటిజన్స్ ఆన్ మణిపుర్ ఆ ఘటనపై చలించిపోయి తమ సంతకాలతో ఒక పత్రాన్ని గవర్నర్ కు అందజేసి ప్రజల ముందుంచారు. అనేక హక్కుల సంఘాలతో, ప్రముఖులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీలు అనేక వాస్తవాలతో, గ్రౌండ్ రిపోర్టులను మనముందుంచాయి. ఛత్తీస్ గఢ్ లో పని చేసి మణిపుర్ వెళ్లిన ఆ ఆదివాసీ ఆడపడచు అనసూయ ఉయికే దృష్టిలో మణిపురిలు చొరబాటుదారులు. కాబట్టి వాళ్లపై ఏం చేసినా చెల్లుతుందనేది ఆమెకు హిందుత్వం నూరిపోసింది. అప్పటికే యురోపియన్ పార్లమెంట్ మణిపుర్ మారణహోమంపై స్పందిస్తూ మైనార్టీలకు భద్రత కల్పించాలనీ భారత ప్రభుత్వాన్ని కోరింది.  మణిపుర్ మే 3 నుండి మండుతుంటే, 160 మంది వరకు ప్రధానంగా కుకీ-జో తెగ వారు మరణించినా, 300 చర్చిలు తగులబడ్డా, 75 వేల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వస్థలాలను వదిలి సహాయ శిబిరాలకు, పొరుగు రాష్ట్రాలకు పారిపోయినా, విదేశీ పర్యటనలో మునిగిపోయి ఆ మంటలపై పల్లెత్తు మాట మాట్లాడని ప్రధాని మోదీ సైతం మహిళలపై జరిగిన అమానవీయ కృత్యంపై పెదవి విప్పక తప్పలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆ ఘటనపై స్పందిస్తూ అలాంటి సెక్స్ కేసులు వందల కొద్ది జరుగుతున్నాయనీ అవన్నీ తన గమనంలో వున్నాయన్న విధంగానే మీడియా ముఖంగా గుట్టు విప్పాడు. కాకపోతే, అక్కడ అంతర్జాలం నిలిపివేయడంతో అక్కడి ఘోర కృత్యాలు బహిర్గతం కాకుండా చేయగలిగామనీ చెప్పకనే చెప్పాడు. అవి వరుసగా ఇపుడు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు అధికారికంగా మంత్రుల దండు, భాజపా మీడియా సెల్ ఎడతెరిపి లేకుండా పక్కతోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నాయి. విచిత్రం ఏమంటే, ఆ దారుణ ఘటన జరిగిన వేళ దేశ ఉపరాష్ట్రపతి ఆ రాష్ట్రంలోనే వుండడం, రాష్ట్ర ముఖ్యమంత్రి తన ట్విట్టర్ సందేశాలు పోస్టు చేయడంలో మునిగిపోవడం చూస్తే ప్రపంచం కళ్లు కప్పడానికి పాలకులు ఎంతటి నైచ్యానికి పూనుకుంటారో అమాయకులకు సైతం సునాయసంగా అర్థమవుతుంది. నిజానికి, పాలకుల ఆశిస్సులతో జరుగుతున్న ఈ దారుణాలకు మూలం ఏంటి? వీటి నివారణకు ఏం చేయాలి తక్షణం? శాశ్విత సమాధానాలు ఏమున్నయి? ఇవి మన ప్రజలకు తెలియాలి. ఎందుకంటే, వీటిపై ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ, పార్లమెంటులో మోదిత్వ శక్తులు చర్చే జరగనీయడం లేదు. పర్యవసానంగా, ప్రజలకు ఆ సమస్యపై ఆయా రాజకీయ పార్టీల వైఖరులు తెలియనపుడు మణిపుర్ హత్యలకు, అత్యాచారాలకు, విధ్వంసానికి, హిందుత్వ శక్తుల ఉన్మాదానికి దారి తీసిన పరిస్థితులను ప్రజలు తెలుసుకోవాలి. వాటి పరిష్కారానికి మణిపుర్ ప్రజలతో భుజం భుజం కలిపి పోరాడాలి.

            మణిపుర్ లోని ‘మైథేఈ’ లలో 18వ శతాబ్దంలో రాజా చోంగ్బా కాలంలో బ్రాహ్మణ మతం (హిందూ)లోని ఒక శాఖ వైష్ణవం లో బలపడింది. బెంగాల్ నుండి 1704లో మణిపుర్ వెళ్లిన నింబార్కా అనే మత ప్రవక్త            అందుకు కావలసిన బీజాలు వేశాడు. ఆ తరువాతి రాజు గరీబ్ నివాజ్ పూజారీ శాంతిదాస్ గోస్వామి పై ఏర్పడిన విశ్వాసం, ఆయన దీవెనలతో పరమ వైష్ణవ భక్తుడయ్యాడు. పాలకుల ప్రాపకం పొందిన మతం కావడంతో మైథేఈ ప్రజలు ఆ మతావలంబకులయ్యారు. బెంగాళీల ప్రభావంతో విస్తరించిన వైష్ణవం ప్రజలకు మతం మత్తు ఎక్కించడానికి రాధ-కృష్ణల రసక్రీడను మైథేఈ భాషలో రాసలీల నృత్యం గా మలిచి మైథేఈ ప్రజల ఆదివాసీ నృత్యాలను జోడించి భక్తులకు రక్తి కట్టించి మత్తెక్కించారు. ఆ ప్రభావంతో మైథేఈ మందిరాల విధ్వంసం, విగ్రహాల చౌర్యం అన్నీ జరిగిపోయాయి. 1919 నాటికి విశ్వ కవి రవీంద్రుడు మహాభారతం ఆధారంగా చిత్రాంగద నాటకం రూపొందించిన విషయం జగద్విదితమే. 1940ల లోని రాజు చురచంద్ సింగ్ కూతురు వినోదిని శాంతికేతన్ లో అభ్యసించడం వరకు చరిత్రను పరికిస్తే హిందూ మత ప్రభావాన్ని అనేక రూపాలలో అక్కడి ప్రజలలో పాదుకొల్పారన్న విషయం బోధ పడుతుంది.

            మరోవైపు, అక్కడ రాజు చురచంద్ సింగ్ సోదరుడు హిజం ఇరాబత్ సింగ్ (1896-1951)లో కమ్యూనిస్టు విప్లవ భావాలు కలిగినవాడు. ఆయనను లిజెండరీ మణిపుర్ కమ్యూనిస్టు రెవల్యూషనరీ గా గుర్తిస్తారు. ఆయన 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. 1943-44లో జైలు జీవితం అనుభవించాడు. భారత – బ్రిటిష్ అధికార మార్పిడి తరువాత నెహ్రూ-పటేల్ ల నాయకత్వంలో సైనికంగా, దౌర్జన్యపూరితంగా భారత్ లో మణిపుర్ విలీనంతో ఆయన 1948లో రహస్య మణిపుర్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి శంకమూదాడు. భారత పాలకవర్గాలు మణిపుర్ దేశాన్ని బలవంతంగా విలీనం చేసుకోవడం అక్కడ అనేక సాయుధ ప్రతిఘటనకు ఊపిర్లు పోసింది. మణిపుర్ ప్రజల స్వయం నిర్ణయాధికార ఆకాంక్షలను భారత ప్రభుత్వం, భారత సైనిక బలగాలు సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం-1958 ని ప్రయోగిస్తూ నిర్ధాక్షిణ్యంగా అణచివేయడానికి వ్యతిరేకంగా 1964లో సంయుక్త జాతీయ విమోచనా సంఘం (UNLF)   ఏర్పడింది. ఈ రోజు అక్కడ పోరాడుతున్న అనేక ఉద్యమ సంస్థలకు ఇదే ఆద్యురాలు.

            యూ.ఎన్.ఎల్.ఎఫ్ సార్వభౌమాధికారం (Sovereignty), సామ్యవాదం  (Socialism) తన లక్ష్యంగా ప్రకటించుకుంది. అందులో నుండి 1977లో కంగ్లీపాక్ ప్రజా విప్లవ పార్టీ (People’s Revolutionary Party – Konglipak – PREPAK) ఆవిర్భవించింది. మైథేఈ భాషను అధికార భాషగా ప్రకటించడం, పరాయివారిని అక్కడి నుండి పంపించివేయడం దాని తక్షణ డిమాండ్ లుగా పేర్కొంది. 1978లో ప్రజా విముక్తి సైన్యం (People’s Liberation Army) ఏర్పడింది. వివిధ రాజకీయ విభేదాలతో ఆ సంస్థ తదనంతర కాలంలో అనేక గ్రూపులుగా చీలిపోయింది.  వాటిలో 1980లో ఏర్పడిన ప్రత్యేక సామ్యవాద మణిపుర్ రాజ్య కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఒకటి. 2011లో ‘‘మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ మణిపుర్’’ ఏర్పడింది. అది నూతన ప్రజా మిలీషియా (NPM) పేరుతో సాయుధ సంస్థనూ ఏర్పర్చుకుంది. ఇవన్నీ భారతదేశం నుండి విడిపోయే లక్ష్యంతోనే పని చేస్తున్నవి. కానీ, విషాదం ఏమంటే, ఇవన్నీ మైథేఈ ప్రజల మధ్య, వారితోనే ఏర్పడి కొండ ప్రాంతాలలోని ఆదివాసీ ప్రజలతో మమేకం కాలేకపోయాయి. ఆ ప్రజలను తమ ఉద్యమ సంస్థలలో భాగం చేయలేకపోయాయి.

మణిపుర్ ప్రజలలో ఈనాటికి నిలబడి పని చేస్తున్న సంస్థలలో యూ.ఎన్.ఎల్.ఏ; పీ.ఎల్.ఏ; ప్రిపాక్ లు ముఖ్యమైనవి. ఒకే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థలు సమైక్యం కాకపోవడమే కాకుండా తమలో తాము ఘర్షణలకు పూనుకోవడం ఒక సాధారణ దృశ్యంగా మారింది. ఎత్నిక్ గ్రూపుల ఘర్షణలలో భాగంగా నగా సంస్థ ‘‘నగా జాతీయ సోషలిస్టు కౌన్సిల్ (ఇసాక్-ముయివా)’’ (NSCN-IM) 3 సెప్టెంబర్, 1993నాడు 100 మంది కుకీలను ఘోరంగా హత్య చేసింది. అలాంటి ఘర్షణల ఫలితంగా, కుకీలు కూడ ‘‘కుకీ జాతీయ సంస్థ’’ (KNO) ‘‘కుకీ జాతీయ సైన్యం’’ (KNA)లను ఏర్పర్చుకుంది. కుకీ, నగా మూలవాసీ ప్రజల మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటుంటాయి. గత రెండున్నర దశాబ్దాలకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్న ఎన్.ఎస్.సీ.ఎన్. తో భారత ప్రభుత్వం ఎడతెగని చర్చలను కొనసాగిస్తోంది. ఈ మధ్య సుదీర్ఘ కాలంలో దాని అగ్రనాయకత్వం కామ్రేడ్స్ ఇసాక్, ముయివాలు అసువులు బాసారు.

            పై పరిణామాలకు సమాంతరంగా మైథేఈ ప్రజలలో నుండి మైథేఈ తీవ్రవాద ఛాందసవాద (చావనిస్టు) సంస్థలు కూడ పుట్టుకు వచ్చాయి. వాటిలో మైతీ లీపున్, అరంబై టెంగోల్ లు అత్యంత కరుడుగట్టిన హిందుత్వ సంస్థలుగా నిలిచాయి. మే నుండి ఇప్పటి వరకు మణిపుర్ లో జరుగుతున్న హింస, అత్యాచారాలు, అగ్నికాండలు, నగ్నకాండలు, లూటీలు, దొమ్మీలు అన్నీ రాజ్యం సంపూర్ణ అండదండలతో జరుపుతున్నది ఈ సంస్థలేనన్నది బహిరంగ రహస్యం. మే 4నాడు సభ్య సమాజమంతా తలదించుకునే లాగా ఇద్దరు మహిళలను పాశవికంగా నగ్నంగా ఊరేగించింది ఈ సంస్థలకు సంబంధించిన దండేనని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాలం చెల్లిన మనుస్మృతి (మనుచట్టాలు)ని నమ్మేవాళ్లకు ఇలాంటి పరమ సాడిస్టు చర్యలు ఆనందాన్నిస్తాయి. మనువు దేశంలో నికృష్ట కుల వ్యవస్థకు ఉక్కు చట్రంలో కట్టుదిట్టంగా నిలపడానికి రూపొందించిన భయంకర చట్టాలలో అంగాలను కోయడం, నగ్నంగా ఊరేగించడాలు ఆనాడు సాధారణమే అయ్యాయి. ఆ చట్టాలనే వర్తమాన మనువాదులు అమలు చేయడం వారి సనాతన ధర్మపిపాసతకు అద్దం పడుతుంది. సభ్య సమాజంలో అలాంటి శక్తులకు స్థానం లేదనీ ప్రజ తిరగబడకుండా వారి చర్యలను భూస్థాపితం చేయలేరు.

            పై చరిత్రాక పరిణామాల నేపథ్యంలో నడుస్తున్న చరిత్రను చూడాలి. మణిపుర్ జనాభా 32 లక్షలు మాత్రమే. వారిలో మైథేఈలు 53 శాతం వుండగా 40 శాతానికి పైగా కుకీ, నగాలు వున్నారు. మైథేఈలు వైష్ణవ మతావలంబకులు కాగా కుకీ, నగాలు క్రైస్తవాన్ని స్వీకరించారు. అక్కడ తరచుగా ఎత్నిక్ ఘర్షణలు జరగడం తెలిసిందే కానీ, మత ఘర్షణల చరిత్ర గతంలో లేదు. అక్కడి ప్రజలు దశాబ్దాలుగా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంకింద నలిగిపోతున్నారు. మణిపుర్ లో భారత సాయుధ బలగాలు వివక్షాపూరితంగా వ్యవహరించే చరిత్ర జగమెరిగినదే. ఇటీవలి చరిత్రలో మణిపుర్ అంటేనే 2004 అందరికీ గుర్తొస్తుంది. 2004లో మణిపుర్ లో భారత సైనికులు మనోరమ అనే మహిళను అపహరించి అత్యాచారం జరిపి హత్య చేసినపుడు అక్కడి మహిళలు అత్యంత ఆక్రోషంగా భారత సైన్యాలకు వ్యతిరేకంగా ”Indian Army Rape Us” అంటూ నగ్నంగా నిలబడి నినదించి భారత సైన్యాల అమానుషత్వాన్ని ఎండగట్టగా, వినోదిని తన పద్మశ్రీ అవార్డును భారత ప్రభుత్వం ముఖాన తిప్పికొట్టింది. భారత సైన్యాల కౄరత్వానికి నిరసనగా ఇరోమా షర్మిలా 16 ఏళ్లు విఫల ఉపవాస దీక్ష జరిపింది చూశాం. భారత సైనికుల చేతులలో మాయమై పోతున్న తమ బిడ్డల జాడ తెలుసుకోవడానికి అక్కడ అనేక మంది మహిళలతో కూడిన ‘‘మియీరా పైబీ’’  మాతృసంస్థ పని చేస్తున్నది. భారత జనాభాలో మణిపురీలు 0.4 శాతం వుండగా 64 శాతం మణిపురీలపై ఊపా కేసులు నమోదై వున్నవి. ఇలాంటి మణిపుర్ 2014వరకు మనకు తెలిసింది. ఆ తరువాత మణిపుర్ మత ఘర్షణలకు, కొత్త తరహ మారణహోమానికి దారులు తెరిచింది.         

  2014లో హిందుత్వ శక్తులు కేంద్రంలో అధికారాన్ని చేపట్టాక వారి కేంద్రీకరణ ఈశాన్య ప్రాంతంపై ఎంత బలంగా కొనసాగుతుందో చూస్తున్నాం. అనేక జిత్తులతో అక్కడి ‘రాష్ట్రాల’ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నది, సాయుధ సంస్థలను లోబర్చుకుంటున్నది తెలిసిందే. 2017లో మణిపుర్ అధికారాన్ని కైవశం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ పావులు కదిపింది. అప్పటికే అసోంలో హేమంత విశ్వ సర్మ భాజపా తీర్థం పుచ్చుకొని వుండడంతో, ఆయనతో పాటు ఆర్.ఎస్.ఎస్ ఆలోచనాపరులలో ఒకరు, చాణక్య నీతిలో ఆరితేరుతున్న రాంమాధవ్ ను మణిపుర్ కు కేంద్ర నాయకత్వం తరలించింది. వారు మణిపుర్ లోని మైథేఈలను కాంగ్రెస్ పట్టు నుండి తమ పట్టులోకి తెచ్చుకొని బీరేన్ సింగ్ ను ముందుకు తెచ్చారు. కుకీలకు ఎర వేసి ఓట్లను సొమ్ము చేసుకోవడానికి అనేక కసరత్తులు చేశారు. వాటిలో ఒకటి 2005లో మూడు పక్షాల మధ్య (కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు కుకీ ఉద్యమ సంస్థలు) కుదరిన ‘‘సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్’’ (SoO) గౌరవిస్తామనీ హామీ ఇచ్చారు. మణిపుర్ లో శాంతి స్థాపనకు జరిగిన కాల్పుల విరమణ ఒప్పందమే సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్. బీజేపీ నాయకులు ఇచ్చిన హామీని నమ్మి ప్రజలు ఓటు వేసి తమ ప్రాంతం నుండి ఇద్దరు విధానసభ సభ్యులను గెలిపించారు. లోకసభకు ప్రతినిధులను పంపారు. కానీ, అధికారం చేపట్టాక హామీలన్నీ వల్లకాడయ్యాయి. బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక చోటు చేసుకున్న పరిణామాలు తెలుసుకుంటే తప్ప వర్తమాన మారణహోమానికి మూలాలు అర్థం కావు.

2017 నవంబర్ 21-22 రెండు రోజులు వైబ్రంట్ గుజరాత్ లాంటి మదుపుదారుల సమావేశాలు జరిపాడు. ఇటీవలి సంవత్సరాలలో ప్రతి రాష్ట్రంలో వైబ్రంట్ సమావేశాలు జరుపడం చూస్తున్నాం. దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులు హజరై లక్షల కోట్ల రూపాయల యం.ఓ.యూ లు కుదుర్చుకోవడం చూస్తున్నాం. మణిపుర్ లో కూడ ప్రభుత్వం అనేక ఒప్పందాలు చేసుకుంది. మణిపుర్ లోని ఉక్రూల్, చందేల్, చురంద్ చుపుర్ జిల్లాల కొండ ప్రాంతాలలో క్రోమైట్, సున్నపురాయి, నికెల్, రాగి, ప్లటీనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ (పీ.జీ.ఈ) సహ ఇతర పలు రకాల గనులున్నాయి. ఈ ప్రాంతాలు కుకీ, నగా ఆదివాసీ ప్రాంతాలు. ఈ ఒప్పందాలు అమలు కావాలంటే, గనుల తవ్వకాలు జరగాలి. అందుకు ప్రజలు, చట్టాలు అనుమతించాలి. చట్టాలలో మార్పులైతే, చట్టసభలలో చేయగలరు. కానీ, ప్రజల అనుమతి దగ్గరే, విధ్వంసం చేలరేపుతున్నారు. అందుకు 2005-09 మధ్య బస్తర్ లో భారీ విధ్వంసాన్ని సృష్టించిన సల్వాజుడుం ఒక నమూనా.

మణిపుర్ లో గనుల తవ్వకాలను అడ్డుకుంటూ 4 ఆగస్టు, 2020నాడు ‘‘మూలవాసీ ప్రజా రక్షణ యువ కార్యాచరణ కమిటీ’’ (Youth Action Committee for Protection of Indigenous People) ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిపి తవ్వకాలను ఆపాలనీ విజౢప్తి చేశారు. ‘‘ట్రైబల్ ఏరియాల రిజర్వు ఫారెస్టు 1966’’ చట్టాన్ని అమలు చేయాలనీ కోరారు. ప్రజల ప్రతిఘటన పాలకులకు కునుకు పట్టకుండా చేసింది. ఆ తరువాతి పరిణామాలు ముఖ్యంగా 2023 మార్చ్ పరిణామాలు ఆగ్నికి వాయువులా తోడయ్యాయి.

మార్చ్ 10, నాడు బీరేన్ సింగ్ ప్రభుత్వం సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ ఒప్పందాన్ని రద్దు చేసింది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కాల్పుల విరామానికి స్వస్తి చెప్పింది. మారణకాండకు దారులు సుగమం చేసింది. ఇది కుకీల అణచివేతకు అనివార్యమైన చట్ట సడలింపు. మరోవైపు మైథేఈలకు తుపాకీ లైసెన్స్ లు మంజూరు చేశారు. మార్చ్ లో ప్రభుత్వం అన్యాక్రాంత భూమిలో చర్చీలను కట్టారంటూ మూడు చర్చిలను కూల్చింది. ముఖ్యంగా కుకీలు పవిత్రంగా భావించే చురచాంద్ పుర్ జిల్లాలో గల ‘‘భారత-కుకీ యుద్ధ స్మృతి చిహ్నాం’’ కూల్చింది. కాంగ్ పోక్పీ, తెంగౌపాల్ జిల్లలలో అడవులు, వన్యప్రాణుల రక్షణ పేరుతో కుకీల ఇండ్లు కూల్చి వాళ్లను తరిమివేశారు. 24 మార్చ్ నాడు బీరేన్ సింగ్ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరింపచేశాడు. వీటన్నింటికి తోడు తక్షణం కెటలిస్టిక్ చర్యగా జస్టిస్ మురళీధరన్ మార్చ్ 27నాటి తీర్పు మణిపురీలను అనివార్య ఆత్మరక్షణా చర్యలకు నెట్టంది. హైకోర్టు పరిధిలో లేని విషయమని తెలిసి జస్టిస్ మైథేఈలకు రిజర్వేషన్ కల్పించడం పరిశీలించాలనీ ప్రభుత్వానికి హితవు పలికాడు. ఈ పరిణామాలన్నీ అత్యంత వినాశకరమైనవి.

ఈ విధ్వంసానికి సుప్రీంకోర్టు కావాలసినంత అవకాశాన్ని ఇచ్చింది. జస్టిస్ మురళీధరన్ వెలువరించిన తీర్పు తన పరిధిలోది కాదనీ మే 17నాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి చెల్లదంది. నిజానికి ఈ మాత్రం విజౢత లేకుండా ఆ మహానుభావుడు హైకోర్టు న్యాయమూర్తి అయ్యాడనుకోగలమా! ఇలాంటి అత్యంత సున్నితమైన ప్రజల సమస్య విషయంలో సుప్రీంకోర్టు జాప్యం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోగలం? పాలకపక్షాల రాజ్యంగయంత్రంలో భాగమైన చట్టసభలు, న్యాయ వ్యవస్థ వారి ప్రయోజనాలను నెరవేర్చడానికే అంకితమైనాయనీ ప్రజలు అనుకోవడం తప్పెలా అవుతుంది?

పై పరిణామాలకు నిరసనగా మే 3 నాడు ‘‘అఖిల మణిపుర్ ఆదివాసీ విద్యార్థి సంఘం’’  భారీ ప్రదర్శన జరిపింది. ఆ రోజు నుండి వరుసగా మణిపుర్ లో మారణహోమం రగుల్కొంది. హత్యలు, అత్యాచారాలు, మహిళల నగ్న ఊరేగింపులు, కాల్చివేయడాలు, కూల్చివేయడాలు నిరాటంకంగా జరిగిపోయాయి. గమనించాల్సిన ప్రమాదకర పరిణామం ఏమంటే, మణిపుర్ చాందసవాద సంస్థలు పోలీసు స్టేషన్ లపై పడి వందలాది తుపాకులు దోచుకెల్లాయి. ఈ పరిణామాలపై కేంద్రం ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ మౌనం అనూహ్యమైనది ఏమీ కాదు. ఒకపక్క బీరేన్ మహిళలపై అత్యాచారాల సంఘటనలు వందలాది జరిగాయనీ బహిరంగంగా చెపుతుంటే, ఆయన ఎరుకలో వున్నవనే విషయాన్నే ప్రజలకు తెలుపుతుంటే, మోదీ ఎలా ఖండిస్తాడు? ఇవన్నీ ఆయనకు, దేశ వ్యవహారాల మంత్రి అమిత్ షాకు తెలిసే జరిగాయనీ ముఖ్యమంత్రి ప్రకటన అంతస్సారమనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కుశాగ్రబుద్దులు కావలసిన అవసరమేం లేదు. మోదీ, నగ్న మహిళల ప్రదర్శన సందర్భంగా కావాలనే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లను ఆయన సందర్భరహితంగా ప్రస్తావించడం ఆయన నీచ కౌటిల్యానికి పరాకాష్ట. ఈ పాలకులు శవాలపై కాసులు ఎరుకునే మొనగాళ్లు! మణిపుర్ లో మైథేఈలను ఆదివాసులుగా గుర్తించి లేద కొండలలోని ఆదివాసుల భూములను మైథేఈలూ కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడం విషయంలో కోర్టు అనుమతి అంటూ చాలా మంది పేర్కొంటున్నారు. కానీ, నిజానికి ఇదేదో భూములు లేని వారికి భూములు కొనుగోలు చేసే హక్కుకు సంబంధించిన సమస్య కాదు. కొండ ప్రాంతాలలోని గనుల తవ్వకాలకు అవసరమైన చట్ట పరమైన భారీ మార్పులను డిమాండ్ చేస్తున్న సమస్య. కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం జరుగుతున్న మారణహోమం. మణిపుర్ లో తక్షణం శాంతి నెలకొనాలంటే, మార్చ్ లో రద్దు చేసిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ను వెంటనే అమలులోకి తేవాలి. గనుల కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. 1966నాటి ట్రైబల్ ఏరియాల అటవీ సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. నగ్నంగా ఊరేగించిన మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు, గాయాలపాలైన వారికి సరైన వైద్యంతో పాటు అవసరమైన (ఆర్థిక) సహాయాన్ని అందించాలి. ఛాందసవాద సంస్థలను తక్షణం నిషేధించాలి. సహాయ శిబిరాలలోని కుకీ ప్రజలకు విశ్వాసాన్నిచ్చే విధంగా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి. పార్లమెంటు సమావేశాలను ఉద్దేశ్యపూర్వకంగా జరుగనివ్వకుండా చేయడాన్ని ఆపి విపక్షాలతో కూచోని మణిపుర్ శాంతికి మార్గం వేయాలి. ఇవి కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలే కాగలవు. మణిపుర్ ప్రజల మౌలిక సమస్యకు వారు కోరుతున్న విడిపోయె హక్కుతో సహ స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వడమే అవుతుంది. అక్కడి తెగలు తమ జీవనవిధానాన్ని, వనరుల వినయోగాన్ని ప్రజాస్వామిక పద్ధతులు రూపొందించుకొని స్వేచ్ఛగా నిర్ణయించుకుంటాయి. కార్పొరేటీకరణ, దాని ప్రయోజనాల సంరక్షణకు సైన్యకరణ, సమస్యను  పక్కదారులు పట్టించడానికి హైందవీకరణ దుష్ట త్రయం పీడ విరుగడ కాకుండా దేశంలోని పీడిత తాడిత ప్రజల ప్రయోజనాలు నెరవేరవు.

Leave a Reply