రజ్మియా అంటే ఉద్యమగీతం. తెలంగాణ ముస్లింకవులు తెలుగులో,ఉర్దులో రాసిన కవితల సంకలనం ఈ పుస్తకం. దీనికి సంపాదకుడు స్కైబాబ(ఎస్.కె.యూసుఫ్ బాబ). ’నసల్’కితాబ్ ఘర్,తెలంగాణ ముస్లిం రచయితల వేదికలు ఈ పుస్తకాన్ని ప్రచురించాయి. అక్బర్,ఫవాద్ తంకానత్ లు తెలుగు,ఉర్దులలో ముఖచిత్రాలు గీశారు. తెలుగులో 36 మంది(75 పేజీలు), ఉర్దులో 31మంది(68పేజీలు) కవుల కవితలతో కూడిన పుస్తకామిడి.డిసెంబర్ 2012 లో పుస్తక ప్రచురణ జరిగింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ నేపథ్యంలో రాసినవే ఇందులోని కవితలన్నీ.

ఈ పుస్తకంలోని కవితలలో విభిన్న ఇతివృత్తాలను కవులు ఎంపిక చేసుకున్నారు. ప్రాథమికంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చుట్టూ తిరిగినా,కవితల్లో ఇతరత్రా అనేక అంశాలు, నేపథ్యాలు కలగలిసిపోయి ఉన్నాయి. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమ సమయంలో రాష్ట్ర డిమాండ్ ను వ్యక్తీకరించేక్రమంలో సంస్కృతులు, భాష, ఉద్యమాలు, మోసాలు, కులఅణిచివేతలు, మతవెనకబాటుతనాలు, అస్పృశ్యత, రిజర్వేషన్, దురాచారాలు వంటి అనేక అంశాలు చర్చకు వచ్చిన తరహాలోనే విభిన్న సమస్యలు,అంశాలను ఈ పుస్తకంలోని కవితలు ప్రస్తావించాయి. ప్రతి కవితా సాధారణ భాషలోనే ఉండటం ఈ పుస్తక విశిష్టత. కవిత్వం, పుస్తకం పాఠకునికి ఎంతగా చేరువవుతుందనేది ఆ పుస్తకంలో వాడిన భాషలోని సరళత మీద ఆధారపడుతుంది. ఎంతో పెద్దకవులూ బొక్కబోర్లా పడేది భాష విషయంలోనే. తమకు వచ్చిన అవార్డులు, పొందిన సత్కారాలను చూసుకుని మురిసిపోవడం తప్ప తమ రచన పాఠకునికి ఎంత దగ్గరవుతుందనేది కొమ్ములు తిరిగిన ఏ కవీ ఆలోచించడం లేదు. అందుకు భిన్నంగా ఈ పుస్తకంలోని ప్రతి కవితలోనూ సరళమైన భాషావాడకం జరిగింది.అందుకే ప్రతికవితా  ఇప్పటికీ ఇంకా చదవాలనిపించేదిగానే ఉంది. ఈ పుస్తకంలో ఇది ప్రశంసించదగ్గ విషయం.

ఇక పుస్తకంలోని కవితలను చూద్దాం! పుస్తకంలో చర్చించిన అనేక అంశాలలో తెలంగాణ ఉద్యమం,తెలంగాణ సమాజం,ఆ సమాజంలో మతసామరస్యం,హైదారాబాద్ పాతనగర జీవితం,ముస్లిం ప్రజల కష్టాలు,పేదరికం,వారి మతసహనం,సామాజిక అణిచివేతలు,క్రూర రాజకీయాలు,హక్కుల ఉల్లంఘనలు,ఎన్ కౌంటర్లు,వీటన్నిటి నుంచి ప్రజలు కోరుకునే స్వేచ్చ,విముక్తి ప్రకటనలు,అందుకు ఎంచుకునే దారి వంటివి ప్రధానాంశాలు.

         హైదారాబాద్ గురించి షాజహానా అన్న అద్భుతమైన మాటలు

                           ఏం పోగొట్టుకుని ఇక్కడికి వచ్చినా

                           ఏదో ఒకటి దొరికిస్తుందీ అమ్మ! (మేరా హైదారాబాద్-షాజహానా,పే.73)

         నిజానికి తెలంగాణ మొత్తానికీ సరిపోయే మాటలు.

తెలంగాణ ప్రజలు నిష్కల్మషమైన వాళ్ళు. ప్రజలు అని అందరినీ ఒకే గాటన కట్టడం కాదుగానీ ఎక్కువకెక్కువగా ఇక్కడి వాళ్ళ మానసిక ప్రవృత్తి కల్మష రహితంగానే ఉంటుంది. స్వాభిమానం,ఎవరి సాయం కోసం చేయిచాచని మనస్తత్వం ప్రజలది.

                           అయ్యో…

                           నా బిడ్డలు

                           ఒకని జోలికి బోతోల్లు గాదు

                           ఒగని ఉసురు బోసుకుంటోల్లు గాదు

                           ఒగల ఉప్పు దింటోల్లు గాదు (బద్వా-స్కైబాబ,పే.21)

రాజకీయాలు ప్రజలను వేరుచేయడం, నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజలకు అడ్డుగోడలు నిర్మించడం తప్ప ప్రజలకు సాధారణంగానే కల్మష నిర్మాణ చరిత్రలుండవు.ఒకటీఅరా ఉన్నా రాజకీయాలు పెంచి పోషిస్తే తప్ప ఏనాడూ ఆ కల్మషాలు వ్యక్తిగత స్థాయి నుంచి సమూహ వ్యక్తీకరణలు గా మారలేదు.

                           రాజకీయ షైతాన్ తప్ప           

                           ఏ అడ్డులేని మానవత్వపు

                           పరిమళాల చమన్ తెలంగాణ (సర్ జమీన్ – షేక్ హాజీ నూరానీ, పే.33)

అయితే రాజకీయాలు ఎప్పటికప్పుడు ప్రజలను విడదీయడమే పనిగా ఉంటూ సామాజిక నిర్మితులను ఎక్కడికక్కడ కూల్చివేస్తూ పోతున్నాయి.సమాజంలో అసమానతలు పెంచుతూ ప్రజాసమూహాలను అణిచివేతల పాలుచేస్తున్నాయి. రాజకీయాలు ఆడుతున్న ఈ వికృతక్రీడలకు ఒకానొక సందర్భం ప్రపంచీకరణ విస్తృతికి పునాదిగా భారతదేశంలోకి ప్రవేశించిన సరళీకృత ఆర్థిక విధానాలు.

                           ఆడేటి ఆటలేదు పాడేటి పాట లేదు

                           పల్లె సంబరాలే లేవమ్మో

                           నేడు టీవీలు,సినిమాలు పల్లె కళలను మింగేనమ్మ!(పండు వెన్నెల్లలోన-నిసార్, పే.72)

 ఇక కులం,దాని అణిచివేతలు ఉండనే ఉన్నాయి. వేలాది ఏళ్లుగా కుల ఆధిపత్యాలు,అవి నెరిపే అణిచివేతలను లక్షలకొద్దీ ప్రస్తావించినా ఆ బాధల సంఖ్య ఇదమిద్ధంగా తేలదు. తరతరాల సామాజిక అణిచివేత అంతా బ్రాహ్మణీయ ఆధిపత్య అణిచివేతే.ఎక్కడ బ్రాహ్మణీయ భావజాలం సామాజిక ఆచరణలోకి వస్తుందో ఆసమాజమంతా తీవ్రమైన అణిచివేతలతోనే గమనం సాగిస్తుంది.సంస్కృతులు,జీవనవిధానాలు,ఆహారాలు,ఆహార్యాలు,భాషలు..ఒకటేమిటి,అన్నింటా బ్రాహ్మణత్వం అంటే అణిచివేతలకు తాత్విక భూమిక.

                           మడిబట్టల తడి తెలుగును ఒళ్ళంతా పూసుకుని (మూసీ ఆవాజ్ – ఖాజా,పే.56)

  అనేది భాష ఎట్లా బ్రాహ్మణీకరించబడిందో తెలిపే వ్యక్తీకరణ.రుద్దినంత కాలం సంస్కృతాన్ని రుద్దింది,రుద్దుతున్నది బ్రాహ్మణీయ భావజాలం.తెలుగుకు కాస్త స్వతంత్రత ఏర్పడుతున్నపుడు అదే తెలుగు పేరుతోనే సంస్కృతాన్ని,బ్రాహ్మణీయ భాషను చలామణి లోకి తెస్తున్నది.ఎటొచ్చీ జరుగుతున్నది బ్రాహ్మణీయ విస్తరణ.ఈ అణిచివేతలు వందలు వేలాది..

                           దేశముఖ్ లో            

                           బాపన దొరలో

                           వెలమదొరలో

                           పటేళ్ళో పట్వారీలో…

                           పేరు ఎడైతే ఏమ్!?

                           పదవి ఎడైతే ఏమ్!!??

                           ఊరిజనాన్ని

                           చెప్పులకింద తొక్కిపట్టిన

                           వేల ముఖాల నిజాంలూ….!!

                           కోటి ముఖాల రజాకార్లూ….!!( మూసీ ఆవాజ్ –ఖాజా,పే.57-58)

ఈ నిజాంలను,రజాకార్లను పొదివి పట్టుకుని కాపాడుతున్నవి రాజకీయాలు. ప్రజల వైపున ఏనాడూ నిలబడని రాజకీయాలు ఆ ప్రజల దైనందిన జీవితాల వినాశనానికి నిరంతరం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. అనేకసార్లు విజయం సాధిస్తూనే ఉన్నాయి. ప్రజలను చైతన్యం నుంచి దూరముంచి,వారి జ్ఞాన స్థాయిలను వీలైనంత నిర్వీర్యం చేయడమే ఆ రాజకీయాల పని.

                           మనం సిగ్గులేకుండా నిగ్గు తేలిన వాళ్ళం

                           నీతి నిజాయితీ లేకుండా బతుకుతున్న వాళ్ళం

                           ఎవడు వచ్చినా ఎవడు చచ్చినా

                           ఏడ్చే “దద్దమ్మలం”

                           తలలూపడం తప్ప “తలెత్తుకోవటం” అంటూ

                           చాతకాని “బసవన్నలం”(తెగించిన వాళ్ళం-కె.ఇక్బాల్,పే.38)

         ప్రజలనిలా దద్దమ్మలు,బసవన్నలు చేసింది ఈ రాజకీయాలు,వాటి ప్రతినిధులైన నాయకులే.

గద్దెనెక్కెదాకా ఎన్నెన్నో నీతులు వల్లించి చేతిలోకి అధికారం వచ్చాక క్రూర పరిపాలన సాగిస్తున్న ఈ నాయకుల వల్లే ప్రజలకు అనర్థాలు.

                           నీతులు వల్లిస్తూనే,నిజాయితీకి చేటు

                           రాజ్యాంగబద్ధులమంటూనే రాబందుపాలనే (పకడ్బందీగాఉద్యమిద్దాం – ఎం.ఎ.బాసిత్,పే.35)

అందుకే తెలంగాణ ప్రజలు ఈ గడ్డమీద తరచూ విప్లవాలు పూయిస్తుంటారు, విప్లవ ఫలాలను పండిస్తుంటారు. పువ్వులు అనేకసార్లు రాలవచ్చుగాక,ఫలాలు పండేలోపు ఎండవచ్చుగాక..కానీ పూలను వికసింపచేయడాన్ని మాత్రం ఇక్కడి ప్రజలు ఆపరు.

                           ఈ నేలన విప్లవాలు విరివిగా పూస్తుంటాయి

                           ఎర్రెర్రగా ఎరెపెక్కి సూర్యులు కాస్తుంటాయి(విప్లవాల తెలంగాణ-ముహమ్మద్                                                                                           సిరాజుద్దీన్, పే.46)

ప్రజలకు, ప్రజా పోరాటాలకు,విప్లవాలకు ఏనాడైనా అడ్డంకులు సృష్టించేవి ఆయా కాలాల రాజకీయాలే. అయితే రాజకీయాలు అడ్డుగోడలనెన్ని కట్టినా తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు వికసిస్తూనే ఉన్నారు. తమ అడ్డుగోడల్లో భాగంగా ప్రజల మధ్య అనైక్యతను సృష్టించే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నారు. మతాల పేరుతో గీయాలనుకున్న విభజనగీతలను ఎప్పటికప్పుడు చెరిపెస్తూ ప్రజలు  హిందు ముస్లిం సామరస్యాన్ని స్నేహాన్ని నిలుపుకుంటూ తమ మధ్య నెలకొన్న అనుబంధాన్ని  ఏనాడూ వదిలిపెట్టుకోలేదు.

                           తెలుగేదో ఉర్దూ ఏదో

                           తేల్చుకోలేని తెలంగాణ

                           ఇస్లామేదో హైందవమేదో

                           గుర్తు పట్టడమే మరచిన

                           ఆత్మీయ అనుబంధాల ఖజానా(సర్ జమీన్ – షేక్ హాజీ నూరానీ, పే.33)

         సరిగ్గా ఇలాంటి నిష్కపట మనస్కులే హైదారాబాద్ పాతనగరంలో నివసించే ప్రజలు..ముస్లిం ప్రజలు..

 జీవితం పొడుగునా చేర్చబడుతున్న వేలాది సమస్యలకు ఎక్కడ ఏ పరిష్కారం దొరికినా,దొరకక పోయినా ఎవరి న్యాయాన్యాయ తీర్పులకోసం దిక్కులు చూడకుండా అన్నీ సమూహాల ప్రజల సంస్కృతులనూ తాము ఇముడ్చుకుంటూ,తమ జీవితావిష్కరణలను అందరికీ పంచుతూ ఎంతో సామరస్యంతో ముస్లింలు బతుకుతున్నారు. ఆ సమరసతే వారిని విశాల దృక్పథం వైపుకు నడిపించింది.పాతనగరం అంతా ఆ సమరస జీవన విధానాలే.

                           ఈద్ నమాజ్ ఎప్పుడౌతుందా

                           గుండెకు హత్తుకుందామనే

                           హిందూ బంధువులొకవైపు(సర్ జమీన్ – షేక్ హాజీ నూరానీ, పే.32),

 రెక్కా డొక్కా రెండూ ఆడటం తెలియని ముస్లిం సోదరులు మరొకవైపు హైదరాబాదంతా అదే సౌభ్రాతృత్వంతో కలగలిసి బతుకుతున్నారు.

అయితే దేశమంతా ఉన్నట్లే పాతనగరంలో ముస్లింల జీవితాలూ ఎంతో దుర్భరంగా ఉన్నాయి.బయటి ప్రపంచానికి అదొక తీవ్రవాదుల అడ్డా.దేశద్రోహుల కేంద్రం.అక్కడ ఎక్కువ జనాభా ముస్లింలే కావడాన ఈ ఆరోపణలు మరింత సులభంగా ప్రజల మెదళ్ళలోకి చొప్పించేందుకు ఆస్కారాలవుతున్నాయి.కానీ పాతనగరంలో జీవితం చాలా బాధకారంగా ఉంటుంది.పేదరికం అడుగడుగునా నిజమై కాటువేస్తుంటే చిన్నపాటి రోజుకూలికీ నోచుకోని బతుకులేందరివో..

                           కన్ను తెరిస్తే దోజఖ్(నరకం)

                           కన్ను మూస్తే జన్నత్(స్వర్గం)

                           ఈ రెండిటి మధ్య సర్కాస్ తీగపై

                           బ్యాలెన్స్ నడక మాది(అస్థిత్వ పంజరాలు-వలి హుసేన్,పే.18)

 పాతనగర జీవితాలకు సంబంధించి ఇదొక సరైన వ్యక్తీకరణ.స్వర్గానికి నరకానికి మధ్య బతుకును బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే రోజువారీ లక్ష్యం. ఈ ప్రయాణంలో నరకానిదే ఎల్లవేళలా పైచేయి. నిత్యనరకాలు ఎన్నెన్నో..

                           కొడుకుల్ని టెర్రరిస్టుల్లా చూసే

                           అనుమానపు చూపులు ఎదురైనా

                           మా గరీబీ నీడలా నాట్యం చేస్తనే ఉంటది

                                                               (అస్థిత్వ పంజరాలు-వలి హుసేన్,పే.18-19)

పేదరికాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే పాతనగరాన్ని మించిన ప్రదేశం మరోటి లేదు.పేదరికంతో అప్పులు చేసినా,అడుక్కున్నా చివరికి వాటి ఫలితమూ ఒక గండమే.మాఫియాగా విస్తరించిన మైక్రో ఫైనాన్స్ ఉచ్చులోపడని పెద ముస్లింలు పాతనగరంలో తక్కువే. ఈ మాఫియా ఎన్ని ప్రాణాలను బలిగొన్నా, మానాలను హరించినా, చార్మినార్ పైనుండి పడవేసినా ఎలాంటి కేసులుండవు, విచారణాలుండవు, సాక్ష్యాలు అసలే ఉండవు.

                           మగాడు దొరక్కపోతే

                           ఆడవాళ్ళు జామీన్(అస్థిత్వ పంజరాలు-వలి హుసేన్,పే.19)

ఇదే పరిస్తితి రోజురోజూ… ఒక్కనాడు చెల్లింపు ఆలస్యమైనా ఇండ్లమీద పడి దాడులు చేయడాలు,హింసించడాలు.అసలు పాతనగర జీవితమే ఒక దుర్భరం.  వలి హుసేన్ అన్నట్టు,

                           పాత నగరంలో

                           మేం పాతరేసినట్లు ఉంటాం(అస్థిత్వ పంజరాలు-వలి హుసేన్,పే.18)

 అసలు ఈ దేశంలో ముస్లిం ప్రజల జీవితాలే చాలా దయనీయ చరిత్ర కలిగినవి.వాళ్ళ జీవితాలు ఎంతగా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయో చెప్పడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు.కానీ దాన్ని అర్థంచేసుకోలేని బలహీన జ్ఞానులు ఎంతసేపూ షేర్ వానిలు వేసుకునే ధనికులుగానే ముస్లింలను చూస్తూ పోతారు.

                           ఊపర్ షేర్ వాని కా అమీరి

                           అండర్ పారేషాని కా ఫకీరి(అస్థిత్వ పంజరాలు-వలి హుసేన్,పే.19)

షేర్ వాని మాటున ఫకీరి-దాచేస్తే దాగని సత్యం.లోలోపలి చిరుగులు చూడలేనివారికి బయటి ధగధగల షేర్ వాని చాలా అందంగానే కనిపిస్తుంది.ఎటొచ్చీ చిరుగులు చూడలేని మనసులే అందవిహీనమై ఆలోచిస్తాయి.

                           హమ్ ఆబాద్ కే నవాబ్ నైహై

                           బర్ బాది కా షికారి గులాబ్ హై (అస్థిత్వ పంజరాలు-వలి హుసేన్,పే.19)

 అందుకే ముస్లింల జీవితమంటేనే పేదరికపు బతుకుప్రయాణం.అడుగడుగునా పేదరికం వల్ల తలెత్తే సమస్యలు,కష్టాల విషవలయాలే.ఎన్నటికీ విచ్చుకోని పువ్వులై మొగ్గగా బతికి మొగ్గగా వాడి మొగ్గగానే రాలిపోయే జీవితాలు.

                           మా జిందగీలు

                           మొలకెత్తని ఇత్తులు

                           పుచ్చిపోయిన గింజలే (వెయ్యి ముక్కలైన అద్దం-జవేరియా,పే.29)

ఏ కాలానికాకాలం చరిత్ర పొడుగునా దగాపడ్డ జీవితాలు, వంచించబడ్డ జీవితాలు. ఆ వంచనలు ఎవరితోనన్నది ప్రశ్నకాదు,కానీ వంచనకు గురై ఇప్పుడు విగతంగా మారిన ఒక ప్రజాసమూహపు దైన్యాన్ని విస్మరించడం,పైగా అంగీకరించడానికి నిరాకరించడం కాలం మిగిల్చిన ఒక విషాదం.

                           మా దేహాలు కాలం చేసిన గాయాల రసికారుతున్న వ్రణాలు

                                                      (ప్రజలు రాజులు కారు,నాజీలు కారు-హనీఫ్,పే.23)

 అంటూ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు కాలం ఏం జవాబివ్వగలదు?కాలం పొడుగునా ఆ వ్రణాలకు  బాధ్యులైన వాళ్ళేమని బదులివ్వగలరు?

తెలంగాణ అన్నా ముస్లింలన్నా మొదటగా గుర్తొచ్చేవి ఎన్ కౌంటర్లు. బూటకపు ఎన్ కౌంటర్లు.ఎదురుకాల్పుల పేరిట చంపదాలు.పౌరహక్కుల ఉల్లంఘనలు.రాజ్యం కసాయితనంతో పౌరుల్ని చంపడానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఈరోజటి తెలంగాణ సమాజం,ముస్లిం సమాజం నిల్చున్నాయి.ఒక మనిషిని చంపాలనుకుంటే అతను తెలంగాణ వాడని ముద్రవేసి చంపిన కాలాన్ని 70లు,80లలో చూస్తే ముస్లిం కాబట్టి చంపే సాధికారతను పొందుతున్న కాలాన్నిప్పుడు చూస్తున్నాం.ఏ సాక్ష్యామూ పెద్దగా అవసరం లేకుండానే చరిత్రలో రెండుపేజీలు తిరగేసి చూసి గానీ,రోజూ గమనించి గానీ తెలుసుకోవచ్చు.

                           పొట్టలో నువు పేల్చిన గుండు

                           ఎన్నెన్ని వంకలు తిరిగిందో

                           బయటపడ్డ పేగులను సవరించిన చేతివేళ్ళ

                           ప్రయత్నాన్నడుగు

                           ప్రాణాలను మోసుకెళ్లిన

                           గాలి తేమ తెరలనడుగు(తస్మాత్ జాగ్రత్త-సిరిసిల్లా గఫూర్ శిక్షక్,పే.47) 

ఎందరో ఈ ప్రజాపోరాటాలలో అమరులైనా,ఇంకెందరో ఊచల వెనక లాకప్ చీకట్లలో ఏళ్లకేళ్లు మగ్గినా ఎందరో మానప్రాణాలను పోగొట్టుకున్నా, ఎందరో వీరులు అడవుల్లో తుపాకి గుండ్లకు బలైనా వారి స్ఫూర్తి ఏనాడూ సమాజం మీద ప్రసరించకుండా ఉండలేదు. వారి స్పూర్తి నిలిపిన ఉద్యమాలు ఆగిపోయి సమాజాలు స్తబ్ధమైపోయింది లేదు.త్యాగాల వెనక ఎన్ని బాధలున్నా వాటిని ప్రేమగా అంగీకరించి మరిన్ని కొత్త పోరాటాలకు దారి చూపారు, చూపుతున్నారు కనుకే ఆ ఎన్నేళ్లయినా ఇప్పటికీ ఆచరణ దారులవుతున్నాయి.సమాజాలూ ఆ  త్యాగాలను ప్రేమగా దాచుకుంటూనే వస్తున్నాయి.

                           లక్షల గుండుసూదులు దేహాల్లో ప్రేమగా దాచుకున్న నెత్తుటి నెమలీకలు,

                           సమాధుల్ని పెళ్లగించండి సాక్ష్యాలు వెక్కిరిస్తాయి(ప్రజలు రాజులు కారు,నాజీలు                                                                                       కారు-హనీఫ్,పే.24)

కానీ సాక్ష్యాలను చూసే ధైర్యం రాజ్యానికుండదు. చూస్తే వేలాది తన తప్పులు,మారణహోమాలు తననే కలవరపెడతాయి గనుక.అయితే రాజ్యం వెనక్కి చూడకపోయినా సమాజాలు రాజ్యాన్ని వెనక్కి నెడుతుంటాయి.తప్పులను  నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాయి.నీ సంగతేంటని నిలదీస్తుంటాయి.రాజ్య స్వభావాన్ని నగ్నంగా బహిరంగపరుస్తుంటాయి.

                           ఉన్నదున్నట్లు మాట్లాడ్తే

                           నీతి దప్పుతున్నవంటే

                           నా బిడ్డల్ని పొట్టన బెట్టుకుంటున్నవ్ గదరా

                           గరీబోళ్ళ కోసం బందూఖ్ బట్టినోన్ని సంపుతుంటివి

                           నీ లెక్కనే మనుషులందర్కి హక్కులుంటయంటే నరుకుతుంటివి (బద్వా-                                                                                            స్కైబాబ,పే.21)

ముస్లిం పౌరులతో పాటు తెలంగాణ ఉద్యమకారులకూ వర్తించే వాక్యాలివి.తెలంగాణ లో అయితే నక్సలైట్లని,ముస్లిం లనైతే పాకిస్తాన్ ఏజెంట్లని పేర్లుబెట్టి చంపేసే విధానప్రణాళికలు రాజ్యానికి చాలా బాగా తెలుసు. అందుకే ఈ రెండు సమాజాలు నిత్యం తమ పౌరులను రాజ్య కబంధహస్తాలకు కోల్పోతూ వస్తున్నాయి.అయినాసరే, పోరాటాలతో మోదుగుపుష్పాలు పూస్తూనే ఉంటాయి,రాజ్యం రక్తపు వేడుకలు జరుపుకుంటూనే ఉంటుంది.

                           బుల్లెట్లతో గాయపడ్డ అడవి అమరుల రక్తాన్ని

                           పులుముకొని మోదుగు పువ్వులను పుష్పించింది

                           పువ్వులను పిండి తీసిన రక్తంతో రాజ్యం

                           ఎన్నికల్లో హోలీ వేడుకలు జరుపుకొంటుంది(తెలంగాణ ఒక మోదుగు పువ్వు-                                                                                        ఆజం అలీ,పే.45)

వేడుకలతో రాజ్యం ప్రతిసారీ తీపి పంచుకుంటుంటే రేపటి ప్రతి వేకువలోని తీపిని కలగంటూ పౌరులు ఉద్యమిస్తూనే ఉన్నారు. పోరాటబాటన నడుస్తూనే ఉన్నారు. తనువులు చాలిస్తూనే ఉన్నారు.

అయితే ఈ పోరాటాల వెనుక సిద్ధాంతాలున్నాయి. త్యాగాల వెనుక నిర్ధిష్ట శాస్త్రజ్ఞానాలున్నాయి. అమరత్వాల వెనక దేశదేశాల చారిత్రక ఫలితాల సారాల రంగరింపుంది.ఆ జ్ఞానాలను వదిలిపెట్టి పోరాటాలు చేయడం నేలవిడిచిన సాము అని పోరాటవీరులకు స్పష్టంగానే తెలుసు. ఆ శాస్త్రీయతను అశాస్త్రీయతగా తీసిపారేస్తున్న రాజ్యవైఖరి కూడా స్పష్టంగానే తెలుసు.

                           చారిత్రక సత్యాన్ని గోనె సంచిలో కుక్కేసిన వైనం చూసినం

                           గతితార్కిక జ్ఞానాన్ని కుతర్క గోతిలో తోక్కెసిన తీరు చూసినం (పకడ్బందీగా ఉద్యమిద్దాం!-ఎం.ఎ.బాసిత్,పే.35)

ఈ స్పష్టతతో రాజ్యవైఖరిలోని మోసాలను గ్రహించడం తెలుసుకున్నారు కనుకే దశాబ్దాలుగా అపరిమిత పోరాటాలను నిర్మించగలుగుతున్నారు.ఎప్పటికప్పుడు రాజ్యవిధానాలను ఎండగట్టగలుగుతున్నారు.బలమైన రాజ్యం ముందు పోరాటాలను సవాళ్ళుగా పెట్టగలుగుతున్నారు.

                           ఇప్పుడ్ గుడ

                           నేన్ దిమాఖ్ దర్వాజల్ బంద్ చెస్ కొని

                           గంగీరెద్దుని అయితడి అన్ కుంటున్నయా

                           మున్ పటి లెక్క

                           నద్ది దాటినంక తెప్పలెక్క తల్ గబెట్ నీకి సుస్ తున్నయా

(మళ్ళీ తెప్పలెక్క  తల్గా బెడ్ తయ్?-గౌస్ మొహియుద్దీన్ ,పే.53)

స్పష్టత ఇలా ఉంది. ఇంత స్ఫష్టంగా ఉంది.ఏ మాత్రం అస్ఫష్టత లేని స్ఫష్టత ఇది.మోసాన్ని గ్రహించి అందులోంచి ఆత్మవిశ్వాసాన్ని తయారుచేసుకుని దాని తాలూకు ఫలితాన్ని మళ్ళీ మోసానికే విరుగుడు చేసేంతగా పొందిన స్ఫష్టత ఇది.

                           గొర్రె ఖస్సాబ్ కి నమ్ తంల వింత లేద్

                           ఇంకా నాకీ గొర్రె అన్ కుంటేనె వింత

(మళ్ళీ తెప్పలెక్కతల్ గాబెడ్ తయ్?-గౌస్ మొహియుద్దీన్ ,పే.53)

గొర్రెలని అనుకునే రాజ్యానికి ఎదురు నిలిచి అన్నీ మోసాలకూ,అన్నీ దుర్మార్గాలకు,అన్నీ అణిచివేతలకూ రాజ్యాన్నే జీమ్మెదారిని చేసి ఆ రాజ్యం మీద బాణాలను సంధించే స్ఫష్టమైన శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోపెట్టి రాజ్యానికి ఎదురునిలబడి ప్రశ్నించడమే ఈ పోరాటాల స్వభావం.

                           మా కంచం ముందు మెతుకు మెతుక్కి

                           మేకులు కొడుతున్నది మీలాంటి వాళ్ళే కదా(మేరా హైదారాబాద్-షాజహానా,                                                                                                   పే.75)

పోరాటాలు చేయాలంటే శత్రువును స్ఫష్టంగా గుర్తించాలనే లెనిన్ నానుడి ఉంది.ఆ గుర్తింపు లేకపోతే పోరాటం మొత్తంగా వైఫల్యం చెందుతుంది.అలాంటి అనుభవాలు కళ్ళముందర తరచూ కనిపిస్తుంటాయి.నిన్నటి చరిత్రలో దాగిపోయి అవి నిలుచున్నాయి.ఆ గుర్తింపును గనుక నిర్ధిష్టంగా పోరాటం అందుకుంటే,దాన్ని ప్రజలకు అందించగలిగితే ఇక ఆ పోరాటానికి ఎదురుండదు.

                           పక్కోడు మన చెవులల్ల

                           ఇసం పోయడానికస్తే

                           వాడి చెవులల్ల సీసం పోద్దాం

                           “ఉన్నోడు”మళ్ళా మనుషుల్ని

                           వేరు పడేసే ఇకమతీ సేస్తే

                           వాడి ముచ్చట మోర్ల తోక్కేద్దాం(కరెంట్ కంచే తీద్దాం-షహనాజ్ ఫాతిమా,పే.36)

శత్రువును గుర్తించడం కోసం శత్రువు ఏ రూపంలో ఎదురవుతాడనేది కూడా గ్రహించాల్సిన విషయమే.శత్రువు కులం రూపంలో ఉంటాడు,మతం రూపంలో ఉంటాడు,వర్గం రూపంలో ఉంటాడు,ప్రభుత్వం రూపంలో ఉంటాడు.వీటన్నిటి విరాట్ స్వరూపంగా రాజ్యం రూపంలో ఉంటాడు.ఎక్కడికక్కడ ఈ రూపాల మీద కలబడి పోరాడుతూ పోతుంటేనే పోరాటం ప్రజాబాహుళ్యంలోకి విస్తరించబడి సమాజం మరింతగా పోరాటంతో పెనవేసుకుంటూ పోతుంది.

                           తెల్లదొరలు కడ్డుగాళ్ళు అన్నాడు మా తాత!

                           మీ కంటే బద్మాష్ గాళ్లా ఆల్లూ?

                           సూడూ-బాగా సోచాయించుకో

                           ఈడా నీ నూకలు ఒడిషినయి

                           ఇప్పుడన్నా నోర్మూసుకొని పో

                           మా మొగోళ్లు,మా పోరగాండ్లు

                           మా అక్కసెల్లెల్లు బాగా ఉషారైన్ రు

                           నీకు గదిమిగదిమి కొడ్తారు

                           బడ్తలు పట్టిండ్రు,

                           జరా పైలం కొడకా!(జరా పైలం కొడకా!-యం.డి.ఖలీల్ అహ్మద్,పే.30)

సమాజం చేతిలోని బడ్తకు ఏ రాజ్యమూ నిలవదు.బడ్త పట్టాలనే అవసరం సమాజానికి ఏర్పడాలి.స్వేచ్చ కావాలని సమాజం కోరుకుంటే పోరాటాలు అందుకు చేతిబడ్తలుగా మారిపోతాయి.ఒకసారి బడ్త దొరికితే ఆపడం ఎవరివల్లా కాదు.స్వేచ్చను ఒక స్వప్నంగా కంటే అవసరంగా గుర్తించే క్రమం వివిధ అనుభవాలు పరిస్థితుల నేపథ్యంలో పరిపుష్టమవుతుంది.

                           గుమ్మిలో గుట్టుగా వున్నప్పుడు

                           ఎంత ఉబలాటపడ్డానో…                   

                           బయటి ప్రపంచాన్ని చూడాలని –(మొలకెత్తడమంటే…-ఇక్బాల్,పే.37)

అంటూ స్వప్నించడం కాదు కావాల్సింది,ఆ స్వేచ్చ కోసం ఏం చేయాలనే జ్ఞానాన్ని గ్రహించడం ముఖ్యం.ఇక ఆ తర్వాత పని సులభంగానే జరిగిపోతుంది.స్వేచ్చను పొందటమంటే సంఘర్షించడమేనని,నిత్యపోరాటాల సారమే స్వేచ్చ అని తెలుసుకోవడమే స్వేచ్చను పొంది అనుభవించే గమ్యానికి సరైన బాట.

                           నాలుగు చినుకులు పది

                           నా చుట్టూ నేల

                           తేమతో బిగుసుకుపోతున్నప్పుడు తెల్సింది

                           మొలకెత్తడమంటే

                           సర్దుకుపోవడం కాదు!

                           సంఘర్షించడమని…!!( మొలకెత్తడమంటే…-ఇక్బాల్,పే.37)

ఈ దారిన నడవడం ప్రారంభిస్తే కొంత సమయం పట్టినా అది తప్పకుండా విముక్తి లక్ష్యాన్ని చేరుస్తుంది.అందుకే విముక్తికి అవసరమైన జ్ఞానాన్ని పొందడం ఒక ప్రాథమిక దశ. ఆ దశను దాటి వెళ్ళడం అంటే విముక్తి కోసం పయనించడమే.

                           నా వొంటి మీదికి నీ ఆక్రమణలు వద్దులే ఇంక

                           నీ ముళ్ళ కంప మీద

                           వస్త్రాన్ని కాలేను ఇంకా!

                           పై చర్మం వొలుచుకుపోయినా సరే

                           నీ చేతుల ఇనప తాళ్ల నించి

                           నా వొంటిని చీల్చుకు రావడం ఎట్లానో తెలుసులే నాకు!

(రెండు దేహాల ఆత్మకథ- అఫ్సర్,పే.26)

విముక్తి ప్రయాణం తప్పకుండా సమాజానికి విముక్తిని సాధించిపెడుతుంది.సమాజంలోకి వర్గాలన్నీ విముక్తి పొంది తరచూ వినిపించే వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. అప్పటికి చచ్చిపోయి పడిఉండే రాజ్యాన్ని చూసి జాలిపడుతూ ఆ సమాజం ముందుకు,మరింత ముందుకు,ఇంకా ఇంకా ముందుకు పోతుంది, పోతూనే ఉంటుంది.

                           మాకిప్పుడు ఒక పాటపాడాలనుంది

                           శాసిస్తున్నోల్లకు ‘శ్రద్ధాంజలి ఘటిస్తూ’…(వెయ్యి ముక్కలైన అద్దం-                                                                                                     జవేరియా,పే.29)

                           —ఇవీ ఈ ‘రజ్మియా-తెలంగాణ ముస్లిం కవిత్వం’పుస్తకంలోని కవితల్లోని కొన్ని పంక్తులు.పుస్తకం నిండా నిండిన కవితల్లో ఇంకా చాలా చక్కటి వ్యక్తీకరణలు,కడుపుమంటల బాధలు,వాటి తాలూకు ఆక్రోశాలు ఉన్నాయి.చాలాచోట్ల న్యాయమైన డిమాండ్ లతో కూడిన ప్రశ్నలూ ఉన్నాయి.ప్రతి కవితా ఒక్కోరకమైన బాధానో,కోపాన్నో,డైన్యాన్నో,పరిష్కారాన్నో సూచిస్తూ రాసిందే.వ్యక్తీకరించడంలో ఒక్కో కవీడీ ఒక్కో దారి,ఒక్కో విధానం అయినా అందరి డిమాండ్ ఆనాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే.

అయితే ఇక్కడొక విషయాన్ని ప్రత్యేకంగా స్పష్టపరచాలి.ఈ పుస్తకంలోని అనీ కవితలూ ఇంతకుమును చెప్పినట్లుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన డిమాండ్ నేపథ్యంలో రాసినవే. అయితే రాస్తున్న క్రమంలో పంక్తుల్లో చాలాచోట్ల కేవలం రాష్ట్రసాధన విషయానికే కాకుండా గతంలోని,భవిష్యత్తు లోని ఇతరత్రా సందర్భాలకు కూడా వర్తించే అంశాలను అనేకంగా ప్రస్తావించారు. అనుమానమేం లేదు,అవి రాష్ట్రసాధన సందర్భంలో సరిగ్గా అమరుతాయి.అయితే అంతకుమించి ఆ సందర్భాన్ని దాటిన ప్రాసంగికత కూడా ఆ పంక్తులకుంది.ఈ వ్యాసంలో అలాంటి పంక్తులనే తీసుకుని విశ్లేషించడం జరిగింది.ప్రజాస్వామిక ప్రజల తెలంగాణ అడిగినవాళ్ళ డిమాండ్ లను తోసిరాజని భౌగోళిక అస్తవ్యస్తతలతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకిచ్చివేశారు కనుక ఈరోజు ఆ డిమాండ్ ప్రాధాన్యత తగ్గినందున ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి గాను అందులోని ఇతర సందర్భాలకూ వర్తించే పంక్తులను తీసుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా స్పష్టం చేయాల్సిన విషయం.లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సందర్భంలో వచ్చిన పుస్తకం మీద ఇప్పుడు సమీక్ష ఎందుకు?అనే ప్రశ్న పడేపడే ఎదురవుతుంటుంది.ఆ సందర్భాన్ని దాటిన వ్యక్తీకరణలేన్నో ఈ పుస్తకంలో ఉన్నాయనేది దీనికి వివరణ. వాటన్నింటినీ ప్రస్తావించి తెలంగాణ రాష్ట్రంఏర్పడిన ఆరేడేళ్ళకు కూడా వాటికెలాంటి రిలవెన్స్ ఉందో చెప్పడమే ఈ వ్యాస ఉద్దేశ్యం. ఏడేళ్ళ తర్వాత కూడా సరిపోయేలా విషయప్రకటన చేయడంలో ఈ పుస్తకంలోని కవులు పూర్తిగా విజయవంతమయ్యారు.

Leave a Reply