ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని జనవరి 31న తెల్లవారుజామున హస్తగతం చేసుకుంది. ఆగ్నేసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్‌ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత సైన్యాధిపతి మిన్‌ అంగ్‌ హేలింగ్‌ అధికారం చేపట్టాడు. అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్ర్యం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేళ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి జారిపోకుండా యత్నిస్తున్న సైనిక నియంతలకు 1988లో మొదటిసారి ప్రతిఘటన ఎదురైంది. బ్రిటన్‌ నుంచి మయన్మార్‌‌కు తిరిగి వచ్చిన ఆంగ్‌సాన్‌ సూకీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డి)ని స్థాపించి మయన్మార్‌లో ప్రజస్వామ్యం కోసం ఉద్యమించారు. 1990లో జరిగిన ఎన్నికల్లో సూకీకి ప్రజలు బ్రహ్మారథం పట్టారు. ఆ ఎన్నికల్లో 58 శాతం ఓట్లతో, పార్లమెంటులో 492 స్థానాలకు గాను 382 స్థానాలు గెలుచుకున్నారు. మిలిటరీ అనుకూల పార్టీకి కేవలం పది సీట్లు మాత్రమే వచ్చాయి. సూకీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో సైన్యం తిరుగుబాటు చేసి సూకీని నిర్భంధించి అధికారాన్ని తిరిగి తన గుప్పెట్లో పెట్టుకుంది. సూకీని గృహనిర్బంధంలో ఉంచింది. 1991 అక్టోబర్‌లో సూకీ నోబెల్‌ శాంతి బహుమతిని పొందింది.

మయన్మార్‌లో 1990 నాటి పరిస్థితి మరోసారి పునరావృతమైంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీకి పార్లమెంటులో 440 స్థానాలకు గాను 315 స్థానాలు లభించాయి. 224 స్థానాలు ఉన్న ఎగువ సభలో 161 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. సూకీ బలపడడం తమ ప్రయోజనాలకు ముప్పుగా భావించిన సైన్యం మళ్లీ అదే పాత తరహాలో తిరుగుబాటు చేసింది. మయన్మార్‌లో సైనిక నియంతృత్వాన్ని మూడు దశాబ్దాలుగా సవాల్‌ చేస్తూ వస్తున్న ఆంగ్‌సాన్‌ సూకీని సైన్యం ఎంతమాత్రం సహించలేదనడానికి తాజా తిరుగుబాటు ఒక నిదర్శనం. ఎన్ని నిర్బంధాలెదురైనా సైనిక పాలనను అంతమొందించి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఆమె కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు నిర్బంధంలో ఉన్న ఆంగ్‌సాన్‌ సూకీని, ఇతర అగ్ర నేతలను విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని యాంగాన్‌ వీధుల్లోకి వచ్చి డిమాండ్‌ చేస్తున్న నిరసనకారుల పైకి సైన్యం యుద్ధ ట్యాంకులను ఎక్కుపెట్టింది. మీడియా, సామాజిక ప్రచార మాధ్యమాలపై ఆంక్షలు విధించింది. విమాన సర్వీసులను రద్దు చేసింది. మానవ హక్కులను బాహాటంగా కాలరాస్తున్నది.

2008లో సైన్యం తీసుకొచ్చిన కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు తొలుత నిరాకరించిన సూకీ, ఆ తరువాత సైనిక జనరల్‌ ధీన్‌ సేన్‌ పన్నిన మాయోపాయంలో చిక్కుకున్నారు. కొత్త రాజ్యాంగం ప్రకారం మిలిటరీకి పార్లమెంటులో 25 శాతం సీట్లు రిజర్వు చేయబడింది. ప్రభుత్వంలో కీలకమైన రక్షణ, హోమ్‌, విదేశీ వ్యవహారాల శాఖలను సైన్యానికి కేటాయించాలని చెబుతోంది. ఆమెను అధ్యక్ష పదవికి అనర్హురాలిని చేసే నిబంధన కూడా ఈ కొత్త రాజ్యాంగంలో పొందుపరిచారు. మయన్మార్‌ జాతీయుడు కాని విదేశీయున్ని సూకీ వివాహమాడినందుకు రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్ష పదవి చేపట్టడనికి అవకాశం లేదు. మయన్మార్‌‌ను ప్రజాస్వామ్యం పరివర్తన దిశగా తీసుకెళ్తామన్న సైనిక పాలకుని మాటల్లో ఇంత మోసం ఉంటుందని ఆమె ఊహించలేకపోయారు.

2010లో గృహనిర్బంధం నుండి బయటకు వచ్చిన సూకీకి ఒబామా ప్రభుత్వం మద్ధతు తెలియజేయడమే కాకుండా, మయన్మార్‌లో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని చెప్పి అప్పటివరకూ దేశంపై గల ఆంక్షలను ఎత్తేసింది. ఇదంతా ఒక విధంగా ఒబామా “ఆసియా ‘పివోట్‌’ వ్యూహంలో భాగంగా చైనాకు పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి తీసుకున్న చర్య మాత్రమే. 2010లో జరిగిన ఎన్నికలను ఎన్‌ఎల్‌డి పార్టీ బహిష్కరించింది. ప్రజా ఒత్తిడితో 2015లో సైన్యానికి ఎన్నికలు నిర్వహించక తప్పలేదు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి గెలిచింది. ఎన్‌ఎల్‌డి భారీ విజయం సాధించినప్పటికీ ఆమె అధ్యక్షురాలు కాలేకపోవడానికి విదేశీ నిబంధన అడ్డం వచ్చింది. దీంతో ఆమె కోసం స్టేట్‌ కౌన్సిలర్‌ అన్న పదవిని సృష్టించారు. అంతే తప్ప సైన్యం తన అధికారాలను వదులుకోవడానికి సిద్ధం కాలేదు. దీంతో సైన్యానికీ, సూకీకి మధ్య వైరుధ్యం అలాగే కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పునాదులపై నవ మయన్మార్‌ నిర్మించాలన్న లక్ష్యం నెరవేరలేదు. మిలిటరీ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పుతామని వారి స్వేచ్చకు, అభివృద్ధికి కృషి చేస్తానని 2015 ఎన్నికల ప్రచార సమయంలో సూకీ హామీ ఇచ్చింది. 2017లో రఖీనే రాష్ట్రంలో రోహింగ్యాలపై సైన్యం సాగించిన ఊచకోతను సూకీ బహిరంగంగా సమర్ధించారు. మిలిటరీ, అధికార సూకీ పార్టీలు కలిసి మైనారిటీ రోహింగ్యాలను ఊచకోత కోసాయి. దేశాన్నుండి లక్షలాది రోహింగ్యాలను వలసబాట పట్టించారు. ఇది అంతర్జాతీయంగా ఆమె ప్రతిష్టను మసకబారేలా చేసింది. సైన్యానికి దాసోహమయ్యారన్న అపఖ్యాతిని ఆమె మూటగట్టుకున్నారు. మయన్మార్‌ ప్రభుత్వం చైనా ఆర్థిక సహకారంపై చాలా వరకు ఆధారపడి ఉంది. చైనా దృష్టిలో భౌగోళికంగా తను చేపట్టే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో మయన్మార్‌ కీలకపాత్ర పోషిస్తోంది.మయన్న్మార్‌లోని అరకాన్‌ రాఖైన్‌ రాష్ట్రంలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. రాఖైన్‌ రాష్ట్రంలో బర్మాను పాలించిన ఒకప్పటి జనరల్‌ థాన్‌ ప్వే పేరున చాలా మొత్తంలో గ్యాసు నిక్షేపాలున్నాయి. వాటిపై చైనా కన్నేసింది. దీనికి తోడు ముస్లిం రోహింగ్యాలు నివసిస్తున్న రాఖైన్‌ రాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో చమురు, హైడ్రో కార్చన్స్‌ నిక్షేపాలున్నాయి.

మయన్మార్‌ సైనికాధినేత మిన్‌ అంగ్‌ హెలింగ్‌ జనవరి 18న చైనాలో పర్యటించి రాగానే ఈ సైనిక కుట్ర జరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. ఎన్‌ఎల్‌డి ఆర్థిక విధానాలు ప్రముఖ సైనిక కుటుంబాల వ్యాపార ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయి. సోషల్‌ సామ్రాజ్యవాద చైనా విస్తరణ విధానం, అదిపత్య కాంక్షను అమలు చేయడానికి అమెరికా నూతన అధ్యక్షుడు జో బిడెన్‌ అడద్దుతగలవచ్చునని భావించిన చైనా ముందుగానే జాగ్రత్త పడి, తనకు అనుకూలమైన సైనిక నియంతల పాలనను ప్రోత్సహించిందని
ప్రజలు భావిస్తున్నారు. రోహింగ్యాల ఉచకోత విషయంలో మిగతా ప్రపంచం బర్మాను తీవ్రంగా తప్పుబడుతుంటే చైనా బలంగా వెనకేసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బర్మాలో జరిగిన దానిని చైనా అధికారిక మీడియా సైనిక కుట్ర అనడం లేదు. సూకీని గద్దెదించేయడం, నిర్బంధించడం, అధికారాన్ని మిలటరీ లాక్కోవడం వంటివన్నీ కేబినెట్‌ విస్తరణలాగానూ, అధికార పంపకాల్లో స్వల్పమార్పుచేర్పులగానూ అభివర్ణిస్తున్నది.

గత ఐదు సంవత్సరాల పాలనలో సూకీకి విసృతాధికారాలేమీ లేవు కానీ, చైనా పెట్టుబడులనుంచి బర్మాను కాపడుకొనేందుకు ప్రయత్నించడంతో ఆమె పట్ల చైనా పాలకులకు ఆగ్రహం కలిగింది. విదేశీ పెట్టుబడుల్లోనూ, వాణిజ్యంలో మూడోవంతు చైనాదే కావడంతో, ఆమె తన దేశం రుణ ఉచ్చులో పడకుండా కొన్ని ప్రాజెక్టులను అడ్డగించారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బిఆర్‌ఐ)లో అంతర్భాగంగా ఉన్న చైనా – మయన్న్మార్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సిఎంఇసి)లో అనేక భారీ ప్రాజెక్టులు చైనా చేపట్టింది. బర్మా మొత్తం రుణభారంలో దాదాపు సగం ఇవే కావడంతో సూకీ కొన్నింటికి కత్తెర వేశారు. మరికొన్నింటిని నత్తనడకన సాగించి, మూడువంతుల ప్రాజెక్టులను కదలనీయకుండా చైనా పాలకులకు మహా చిరాకు కలిగించింది. మరోపక్క భారత్‌తో కలసి హైవే, పోర్టు, ప్రత్యేక ఆర్థికమండలి ఇత్యాదివి సంకల్పించడం కూడా చైనాకు కంటగింపు అయ్యాయి.

సుదీర్ధకాలం ప్రజాస్వామ్యం కోసం పోరాడిన మయన్మార్‌ ప్రజలు మిలటరీ ఆధిపత్యాన్ని అంగీకరించే అవకాశం లేదు. గతంలో దశాబ్దాల తరబడిగా సాగిన సైనిక ఏలుబడిలో మయన్న్మార్‌ ప్రజలు సర్వ స్వాతంత్రాలనూ కోల్పోయారు. ఆ చీకటిని తలచుకునే వారికెవరికైనా మళ్లీ ఆ రోజులు దాపురించకూడదని అనిపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకోవచ్చునన్న రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగానే ఈ పని చేశామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ రాజ్యాంగ విరుద్దం. అలాగే ఏడాదిపాటు మాత్రమే పాలిస్తామని, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ ప్రజా పాలకులకు అధికారం కట్టబెడతామని చెబుతున్న మాట ప్రజలు విశ్వసించడం లేదు. “సెనిక పాలనపై తిరగబడకపోతే తర్వాతి తరాలకు విద్య, వైద్యం, స్వేచ్చ లేని దుర్భాగ్య జీవితం గడపవలసి వస్తుందని” ప్రజలు భావిస్తున్నారు. సూకీ ప్రభుత్వ బాధ్యత స్వీకరిస్తే తమకు సర్వాధికారాలు కట్టబెడుతున్న రాజ్యాంగాన్ని ఇప్పుడొచ్చిన మెజారిటీతో ఎన్‌ఎల్‌డీ సర్మారు మారుస్తుందనే భయంతో సైన్యం ఈ దారుణానికి తెగించిందని ప్రపంచానికి అర్థమైంది.

ప్రజా ఆందోళనతో రగులుతున్న మయన్మార్‌ :

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పూర్వ రాజధాని యాంగూన్‌లో పెద్దయెత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మాండలేలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నినదించారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసు వాటర్‌ క్యానన్లను ఉపయోగించారు. కొన్నిచోట్ల కాల్పులు జరిపారు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ నిరసనల్లో విద్యార్థులు, యువత, మహిళలతో పాటు అన్నివర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. పోలీసులు నిర్బంధం పెంచుతున్న కొద్ది ఉద్యమం విసృతి చెందుతుంది. బాగో, దావీ. ఉత్తర షాన్‌ రాష్ట్రాలకు ఉద్యమం విస్తరించింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన సైనిక కుట్రకు వ్యతిరేకంగా ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. “మిలటరీ డిక్టేటర్‌ ఫెయిల్‌, ఫెయిల్‌: ‘డెమోక్రసీ విన్‌, విన్‌” (సైనిక నియంతను ఓడిద్దాం – ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం) అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ‘ఎగైనెస్టు మిలటరీ డిక్టేటర్‌షిప్‌'(సైనిక నియంతృత్వాన్ని వ్యతిరేకించండి) అని రాసి ఉన్న బ్యానర్‌తో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘మేం స్వతంత్రతను, న్యాయాన్ని కోల్పోయాం. మాకు వెంటనే ప్రజాస్వామ్యం కావాలి. మయన్మార్‌ ప్రజల ఘోష వినండి” అని నినదించారు. అధికారం నుంచి తొలగించిన ప్రజా ప్రభుత్వానికి తిరిగి అధికారం అప్పగించాలని, నిర్బంధించిన నేతలకు స్వేచ్చ కల్పించాలని ఉద్యమకారులు డిమాండు చేస్తున్నారు.

మయన్మార్‌లో అనేక ప్రాథమిక పౌర స్వేచ్చలను రద్దుచేస్తూ సైనిక ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కోర్టు వారెంట్లు లేకుండానే ఎక్కడైనా సోదాలు చేయడానికి, అరెస్టులు చేయడానికి అధికారులకు సైన్యం వీలు కల్పించింది. జైలు నుంచి నేరస్థులను విడిచిపెట్టి సైన్యం హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆందోళనలు పెరుగుతుండడంతో వాటిని అణచివేసేందుకు సైన్యం పలు కుట్రపూరిత చర్యలకు పాల్చడుతోంది. పలుచోట్ల కర్ఫ్యూ విధించారు. నిరసనలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నిలువరించేందుకు సామాజిక మాద్యమాలపై నిషేధాన్ని మరింత విస్తరింపజేసింది. పౌర నిరసనలను కట్టడి చేసేందుకు వ్యక్తిగత గోప్యత పరిరక్షణ కోసమని చెబుతూ సరికొత్త సైబర్‌ భద్రత చట్టం ముసాయిదాను తయారు చేసింది. అయితే, గోప్యత పరిరక్షణ ముసుగులో దేశవ్యాప్తంగా నిరసన గళాలను నొక్కేసేలా అందులోని నిబంధనలు ఉన్నందున ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఉద్యమానికి పాశ్చాత్య దేశాల మద్ధతు :

సైనిక తిరుగుబాటుతో మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌ హెచ్‌ఆర్‌సి) దృష్టి సారించింది. ఈ అంశంపై చర్చించేందుకు గాను ఫిబ్రవరి 19న అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. సామాజిక మాద్యమం ఫేస్‌బుక్‌ తీవ్రంగా స్పందించింది. దేశ మిలిటరీకి సంబంధించిన “టాట్మడా ట్రూ న్యూస్‌ ఇన్‌ఫర్మేషన్‌ టీం’ళ అధికారిక పేజీని ఫేస్‌బుక్‌ తొలగించింది. సూకీ సహా నిర్బంధించిన నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ డిమాండ్‌ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ సైనిక పాలనపై ఆంక్షలు విధించాడు. ప్రజాస్వామ్య పాలన కోసం పోటెత్తిన ప్రజలకు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. అంతేగాక ఫిబ్రవరి 2వ వారంలో అమెరికా ఉన్నత సైనిక జనరల్స్‌పై ఆంక్షలు ప్రకటించింది. ఫిబ్రవరి 23న మయన్నార్‌ మిలిటరీ నేతలను, వారి ఆర్థిక ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఈయూ ఆంక్షలు విధించింది. మయన్నార్‌ సంస్కరణలకు కార్యక్రమానికి ఈయూ నుండి అందే ఆర్థిక సాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత అమెరికా వైమానిక చీఫ్‌ మాంగ్‌ కియా, మరో సైనిక పాలక మండలి సభ్యుడు మో మింట్‌ టున్‌లను అమెరికా బ్లాక్‌ లిస్టులో పెట్టింది.

ముగింపు :

కొన్ని తప్పిదాలు ఉన్నప్పటికీ సూకీ మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం సాగిస్తున్న పోరాటం మహత్తరమైనది. ఆమెకు సంఘీభావంగా అంతర్జాతీయ సమాజం నిలవాల్సిన అవసరముంది. మయన్నార్‌ విషయంలో భారత్‌, చైనాలు రెండింటికీ వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. సైనిక పాలన కాలంలో వైనా ప్రభుత్వం మిలటరీతో సఖ్యత నెరపగా, భారత్‌ మిలటరీతో మిత్రత్వం సాగిస్తూనే సూకీ ప్రజాస్వామ్య ఉద్యమానికి పరోక్షంగా తోడ్పాటు అందించింది. చొరబాటు [గ్రూపుల నుండి తన ఈశాన్య సరిహద్దుల రక్షణలో మయన్మార్‌ సైన్యం నుండి భారత్‌ సహాయం పొందుతున్నది. అంతేగాక పలు మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టులు నిర్మించింది. పశ్చిమ దేశాల్లాగా కఠిన వైఖరి తీసుకుంటే సైన్యం చైనాకు దగ్గరవుతుందన్న ఆందోళన కూడా ఉంది. మరోవైపు అమెరికా సామ్రాజ్యవాదం చైనాకు వ్యతిరేకంగా మయన్మార్‌లో జోక్యం చేసుకుంటుంది.

భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకమైన మయన్మార్‌లో పరిణామాలు భారత్‌పై కూడా ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ పౌర సమాజంతో బాటు మన దేశపు లౌకిక ప్రజాస్వామ్యవాదులంతా మయన్మార్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతు కలపాలి. ప్రపంచ దేశాలన్నీ సైన్యంపై ఒత్తిడి తెస్తేనే… అక్కడి ప్రజలకు నైతిక మద్దతునిస్తేనే ప్రజాస్వామ్యం మళ్లీ చివురిస్తుంది. అందుకోసం అందరూ కృషి చేయాలి. కాబట్టి ఏ దేశ వ్యూహాత్మక ప్రయోజనాలెలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అన్ని దేశాలూ తమ వంతు కృషి చేస్తాయని ఆశించుదాం. ఏ దేశ వ్యూహాత్మక ప్రయోజనాలెలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అన్ని దేశాలూ తమ వంతు కృషి చేస్తాయని ఆశించుదాం. మయన్మార్‌లో ప్రజాస్వామ్యం వికసిస్తుందా? శాంతియుత వాతావరణం ఏర్పడుతుందా? అంటే ముఖ్యంగా మయన్మార్‌‌ పయనమెటో చైనా, అమెరికా స్పందనలు, చర్యలను బట్టి ఉంటుంది.


(తాజా సమాచారం : మయన్మార్‌ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రజలు అనేక రూపాల్లో నిరసనలు చేపట్టారు. విరిమీద మిలటరీ దాడుల జరిగాయి. ఈ దాడులలో ఇప్పటివరకు 531 మందికి పైగా ప్రజలు మరణించారు)

Leave a Reply