చిన్నప్పుడు ఎమ్నూరు (ఎమ్మిగనూరు) అంటే నాకు రెండే కొండగుర్తులు. మా వూరి మిందనుంచి పొయ్యే ఎంజి (మాచాని గంగప్ప ట్రాన్స్పోర్ట్ సర్వీస్) బస్సు. అప్పట్లో నీటుగా వుండి స్వీడు…గా పోయే బస్సని బో పేరు దానికి. చార్జిగాని గవుర్మెంటు బస్సు కాడికి రోంత తక్కువ. ఆ బస్సు వచ్చే తాలికి పెద్దింత మంది జమైతాండ్రి , ఆలీశం అయినా ఆ బస్సు కోసరమే ఎదురు చూస్తాండ్రి . రెండోది ప్రతీ ఎండాకాలం సెలవులకి మా రోజ పెద్దమ్మ కాడికి పోతే కర్నూలులో వెరైటీ, శ్రీరామా, ఆనంద్ టాకీసుల దారిలో, రాజ్ విహార్ సెంటర్లో రోడ్డు మింద బట్టల షాపుబైట కనిపించే ‘ఎమ్మిగనూరు చేనేత వస్త్ర సహకార సంఘము.లి’ బోర్డు. ఆ అంగడి బైట తలిగిచ్చిన కాంగ్రెస్ జుబ్బాలు, కాంగ్రెస్ టోపీలు, రంగురంగుల అంచులతో తెల్లటి పంచెలు, నేత బట్టలు.
పేరుగొన్న మంత్రాలయం ఎమ్నూరు పక్కనే వున్నా మాకి తెలీదు, అప్పటికి మావూళ్ళలో భక్తి టూరిజం కాలేదు. అంతేకాదు భయముతో డబ్బు పెట్టి కొనగలిగిన వస్తువు కూడా కాలేదు భక్తి. ఏడాదికో, రొండెండ్లకో ఎవరికి వాళ్ళు, వాళ్ళ ఇంటి దేవుడు మద్దిలేటి స్వామి, కౌలుట్లయ్య స్వామి కాడికో పోయ్యోస్తా వుండ్రి. అందుకనే సొంతజిల్లా లోనే వున్నా 23 యేండ్లు వచ్చే వరకు మంత్రాలయం గాని, శ్రీశైలం, మహానంది, అహోబిలం గానీ నేను చూడనేలేదు.
కానీ ఎమ్మిగనూరు పశుల సంత మాత్రం బాగా తెలుసు ఎందుకంటే మా ప్యాపలి ఎద్దుల సంతంత గొప్పది అది. ఆవూరు కన్నడ సీమ సరిహద్దు పట్టణం. అయినా పెండ్లి సంబంధాలు రెండుపక్కలా ఇచ్చి పుచ్చుకునేంత దగ్గిర. సగం జనాలు కన్నడమే మాతాడుతారు. పొద్దున్నేవిభూది అడ్డ పట్టీలతో కనిపించే శివభక్తులు వాళ్ళు.నేసే కులస్తులు అందరూ మాజిల్లాలో శివభక్తులే. మా వూరి నేసేవాళ్ళతో కూడా ఆ వూరికి బంధుత్వాలు వున్నాయి. ‘ఎమ్మె గె నూరు ‘ అంటే కన్నడ భాషలో ‘బరెగొడ్డు కు వంద ‘ అని. అంత చవకగా సంతలో పశువులు అమ్మేంత పాడి, పశు సంపద వుండేది. ఒకప్పుడు మా వూర్లలో. వానలు ఒక మోస్తరుగా పడినా,గట్టిగా పండేది ఒక కారు పంటే అయినా ఇంటికి ఎన్నో కొన్ని గింజలొచ్చేవి. కాబట్టే పంటలూ, పశువులూ సమృద్ధి అని మాకు అనిపించేది. చేలల్లో జొన్నలు, సొద్దలు కొర్రలు, సాముకొర్రలు, అలసందలు, పెసులు, నువ్వులు, కందులు. బుడ్డలు ( వేరుసెనగ కాయలు) ఏసేటోల్లు. అమ్ముకోడానికి కాకపోయినా ఇంటి మట్టసానికి తిండి గింజలుండేవి. బావులకింద, చెరువులు,వాగు వొడ్డు చేలల్లో వరి పండేది. పల్లెల్లో తాగడానికి నీళ్లువుండేవి, కూలోల్లకు పనులు దొరికేవి. కొన్ని వూర్లల్లో ఎండా కాలంలో మూడు నెల్లు నీటికి కటకటమన్నా తొమ్మిది నెల్లు యే దిగులూ వుండేది లేదు. (ఎమ్మిగనూరుకు మరింత ఆపక్కనే తుంగభద్ర కాలవొచ్చే వూర్లు మాత్రం ఎప్పుడూ మెరమెరా పచ్చగా మెరిసేవి. మూడు కార్లు పంట. పిడికిట మట్టి నలిపితే జలజలా వడ్లు రాలే మడులు అవి.) ఉల్లిగడ్డలు అయితే చెప్పనలవి కానంత పంట. ఇదంతా నేను చిన్నగున్నప్పుడు లేదా మారుతి పదో తరగతి అయ్యేంత వరకూ.
యీ నేపథ్యం అర్థం చేసుకోకపోతే, మా వూళ్ళ జీవితం తెలియకపోతే మారుతి కథల లోతు మనకు తెలియదు. ప్రతి కతలో కనపడని దుఃఖమేదో కథకుడిని, చదువరిని ఎందుకు వెంటాడుతుందో తెలుసుకోలేము. కర్నూలు జిల్లాలోనే వున్నా యీ పశ్చిమప్రాంత మాండలిక యాస అత్తగారింటి కొచ్చిన మా కన్నడ కస్తూరి లెక్క ఎందుకు పరిమళిస్తుందో అర్థం కాదు.
మనుషులకు బాల్యం యెట్లనో, మానవ సమూహమైన సమాజానికి పల్లెలు అటువంటివి. అప్పుడు ఎంత దరిద్రంలో బతికినా అవి మరులు గొలిపే తియ్యని జ్ఞాపకాలే. ఇప్పుడు అక్కడి జీవితాలు మారిపోయి వుండవచ్చు. మారిన ఆర్థిక సంబంధాల వల్ల మునుపటి లాగా, మనం అశించినట్టు వుండకపోవచ్చు. కానీ అది వొక వెంటాడే నీడ వంటి జ్ఞాపకం. గతం లోంచి వర్తమానా న్ని చూడగలిగే సూక్ష్మదర్శిని. కథకుడు ఎప్పుడూ ఆ పాత సంబంధాలతో మరులుగొని వుంటాడు. ఆ మమతల కోసం ఆరాటపడతాడు. మళ్లీ వెనక్కు వెళ్ళలేమని తెలిసినా వదులుకొనలేని జంజాటం అది. ఉద్వేగాలే ప్రధానం. అన్ని లక్షణాలతో, అవలక్షణాలతో అవి అట్లనే వుంటాయి. ఆ మనుషులూ అట్లనే వుంటారు. అటువంటి ఒకానొక పల్లెనుంచి బయలుదేరిన మారుతి అనే వ్యక్తి అనుభవాలూ, జ్ఞాపకాలూ యీ కథలు. అందుకనే యెక్కువ కథలకు కేంద్రం తన సొంతూరు గువ్వల దొడ్డి. పల్లెతో ముడి బడిన ప్రతికథలో గిడ్డయ్య సామి గుడి వుంటుంది. అనుమేశప్ప, పెద్ద గిడ్డయ్య, తంబళ్ళ వెంకటేశు వుంటారు. కథకుడు వూరికి పోయి వస్తూ వుంటాడు. మరులుగొనిన ఆ వూరి జ్ఞాపకాలలో ఒకసారి తీరని దుఃఖము, ఒకసారి అంతులేని వ్యగ్రత, ఒకసారి మనసు కుశాలు, ఇంకోసారి తీవ్రమనోవేదన, ఒకోసారి అంతులేని సంతోషము పొందుతూ వుంటాడు. పల్లె నిండా పరుచుకున్న ఏడు రంగుల జీవితమది. కన్ను గూటిలో గడ్డ కట్టిన విషాదమది.
సీమ అంటేనే బాంబులు కత్తులు , నరుక్కొడాలు అనుకునే సినిమా దర్శకులు, సినిమా రచయితలు గమనించవలసిన పాయింటు యీ మొత్తం సంకలనంలో ఒక్క కథ తప్ప( కెంపు) యెక్కడా ఫ్యాక్షన్ వూసే లేదు. అదికూడా ముఠా నాయకులు వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అని ఎరుక తెచ్చుకునే ఒక బిసి కులానికి చెందిన ఫ్యాక్షన్ అనుచరుడు రామాంజనేయులు కథ. గౌడకులస్తులు గ్రామ నాయకులు ( వీళ్ళు యీడిగ గౌడులు కాదు. అగ్రవర్ణ లింగాయత గౌడలు )
“యాడాది నుంచి గౌడల రాజకీయం అర్తుం అవుతానే ఉండాది. ఏమ్జేయ్యాల అని ఆలోచన జేసె. ఇప్పుడు ఊర్ల ఎవురికి గూడా గౌడల ఎంబడి తిరిగేకి పురసత్తు లేదు. వారం దినాలు వాన రాకుంటే గుంటూరికి, బెంగులూరికి, బొంబాయికి బతకనీకి సుగ్గికి పోతావుండారు. పిల్లోల్లంతా సదువుకొనేకి పట్నాలకి పోతావుండారు. వానుంటే ఉంటారు ల్యాకుంటే సుగ్గికి పోతాండారు. మాము బాగు బడటం ఇష్టుము ల్యాక సేన్లకి ఈయప్పోల్లె నీళ్ళు రాకుండా సేసినారు. కిన్దోల్లు నీల్లు దొంగులుక పోయ్యేరని మనం ఎందుకనుకునాల? ఆయప్పోల్లు దొంగులు కుంటుంటే ఈయప్పోల్లు ఏమి సేస్తున్నట్లు ? ఏమ్ల్యా! ఈనాయండ్లకి సేన్లు పండితే మన మాట ఇనరు అనేది ఆయప్పొల్ల అనుమానము.” అంటాడు రామాంజనేయులు.
2000ల తరువాత ‘సీమ ఫ్యాక్షన్’ ఎందువల్ల కథావస్తువు కాదో కథకుడు గమనించాడు.
1995 తో మొదలై కొత్త శతాబ్దంలోకి ప్రవేశిస్తున్న కాలంలో దేశంలోకి వచ్చిన సరళీకరణ విధానాలు, ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన రుణాలు మా ఊర్లలో పెద్ద మార్పులనే తెచ్చాయి. ప్రభుత్వ కొత్త విధానాలకు మునుపటి ఫ్యాక్షనిజం అడ్డంకి అయ్యింది. బిసి, ఎస్.సి కార్పొరేషన్లు ఇస్తున్న సబ్సిడీ వ్యవసాయ రుణాలతో ఆయా కులాలు ఆర్థికంగా ఎదగడం మొదలైంది.అవసరాలకు వూరి పెద్ద కులాలపైన ఆధార పడడం తగ్గింది. కొత్తతరానికి అందివచ్చిన చదువులు, ఉద్యోగాల వల్ల మునుపటి వెనుకబాటుతనమూ తగ్గింది. గతంలోలాగా ప్రాణాలకు తెగించి ఫ్యాక్షన్ నాయకుల వెంట నిలిచే అనుచరగణం దొరకడం క్రమంగా కరువైంది.
ఒకప్పుడు ఫ్యాక్షన్ కు ప్రధాన ఆదాయవనరుగా వున్న భూమి స్థానంలో, సారా వేలం పాటల స్థానంలో కొత్త ఆదాయ మార్గాలుగా లిక్కర్ కాంట్రాక్టులు, వాటర్ షెడ్ పథకాలు, రోడ్లు, ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు, ఖనిజ తవ్వకాలు (గనులు) వచ్చి చేరాయి. సహజంగానే బెదిరించడానికి తప్ప ముఠాల అవసరం పడలేదు. అంటే ముఠా నాయకులు మారుమనసు పొంది కె. విశ్వనాథ్ ‘ సూత్రధారులు’ సినిమాలో లాగా మంచి వాళ్ళు అయిపోయినారని కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో సమాజాన్ని నేరీకరణ ( క్రిమినలైజ్) చేసే పనిని సరికొత్తగా, నేరుగా ప్రభుత్వాలే చేపట్టాయి ( నయీం, జడల నాగరాజు). ప్రత్యర్థులను చంపడానికి ఇతర రాష్ట్రాల కిరాయి హంతకులు కూడా చవకగా దొరుకుతున్నారు. ‘సెనగలు తిని చేయి కడుక్కు న్నట్లు’ పనయిపోతున్న పరిస్థితుల్లో మందలు మందలు గా మనుషులను పోషించే అవసరం ఇంక నాయకులకు లేకపోయింది. పాలక పార్టీ నాయకులకు మరీ ఇబ్బంది అయితే ఆ పని కూడా చేసి పెట్టగల నైపుణ్యం పోలీసు లు పొందివున్నారు. (సస్పెండ్ అయిన ఒక ఎస్.పి. అప్పుడు మా జిల్లాలో పనిచేస్తూ ఎన్ కౌంటర్లు చేసి ప్రభు త్వ పార్టీకి అట్లా సహకరించాడు కూడా) కాబట్టి ఫ్యాక్షన్ అనేది 2000 తరువాత “తొడగొట్టే తెలుగు సినిమా” కథగా మాత్రమే తన పాత రూపంలో బతికి వుంది.
మరి యీ రచయితకు కొత్త వస్తువులు ఏవి?
1. తాగు, సాగు నీళ్ళు లేక పోవడం:
నీళ్ళింకని నేల కథలో గిడ్డయ్య మాటల ఆంతర్యం గ్రహించండి.
“మాయమ్మ సోమక్క. మాకి మూడు ఎకరాలు వరిమడి ఉండ్య. మాకి బాయి ఉండ్య. మా వూరికి కాల్వ ఉండ్య. ఎండా కాలమూ కాల్వ నీళ్ళు పారుతా ఉండ్య. వానా కాలం వానకే వడ్లు పండిస్తాంటిమి. మానాయన మోటతో (కపిల) నీళ్ళు పారిస్తా ఉండ్య. మా నాయన నన్ని సదువిడిపిచ్చి సేని పనికి పిలుసుక పోబట్ట్యా ! మూడు ఎకరాల వరిమడి పెట్టుకొని మనకి సదువెంటికిలే ? అంటాండ్య. నాను కూడా బడి ఇడిసి పెట్టి మానాయనతో కల్సి సేనికి పోతాంటి సార్. నాయన మెత్తగాయ, మాయమ్మ మెత్తగాయ. నాకి పెండ్లి సేసిరి. బాయి ఎండి పాయ. మోట మూలాన పడ్య. సేను బీడు అయిపాయ. మానాయన ఎప్పుడు సూసినా నా కొడుకుని సదవొద్దని వాని గొంతు గోసిడిస్తిని అని పలమతాండ్య. ఇంట్ల తిండికి జరగకపాయే . ఇంగ ఇట్ల కాదని నాను నా పెండ్లాం హైదరాబాద్ కి బతకనీక వస్తిమి. సెడి పట్నం సేరాలనేర్య పెద్దలు.”
యీ మాటలతో మరో పాత్ర సోమశేఖర్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
“తన చిన్నతనంలో ఎమ్మిగనూరులో చుట్టూ ఎక్కడ చూసినా నీళ్ళుఉండేవి” ఆ నీళ్లన్నీ ఎక్కడికి పోయాయి..? తుంగభద్ర కాల్వ కింద వేసవి కాలములో గూడ నీళ్ళు వచ్చేవి. ఈ కాలువ క్రింద పండే పొలాలలో పని చేయడానికి ఎంతోమంది ఆస్పరి, దేవనకొండ, తుగ్గలి వంటి ప్రాంతాలనుండి సుగ్గికి వచ్చేవారు. తను వదలిపెట్టిన పన్నెండు ఏళ్ళలోనే ఎంత మార్పు వచ్చింది”
అట్లాగే ఊరిమర్లు కథలో “ఇంత సంతోసంగా ఉన్న మావూర్ల సిన్నగా దుఃఖం మొదులాయ . ఏంటికప్పా? అంటే మా వూరు కాలవకి నీళ్ళు వచ్చేది తగ్గిపోయ. తుంగబద్ర డ్యాంల పూడు (ఒండ్రు మట్టి ) పేరుకొని నీళ్ళు తగ్గేవ్య అని కొంతమంది అంటుండ్రి. ఇంకొంత మంది గుంటూరోల్లు కర్నాటకంల బూములు గుత్తకు తీసుకొని పెద్ద కాలవకి గాలి పైపులు ఏసీ నీళ్ళు దొంగులుకుంటుం డారు దానికే మనకి నీళ్ళు వొస్త లేవు అని అంటుండ్రి.”
యీ మాటలు అర్థం కావాలంటే రాయలసీమకు జరిగిన నీటి మోసం ఏమిటో తెలియాలి. తడి గుడ్డతో సీమ గొంతు కోసిన మా నాయకుల ద్రోహమూ, ఆంధ్రా నాయకుల లౌక్యమూ తెలియాలి.
రాయలసీమకు యెంతో కొంత నీరు ఇవ్వగలిగిన నదులు రెండే రెండు అవి కృష్ణ, తుంగభద్ర. “శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా నీళ్లలో క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి . విశాలాంధ్ర ఏర్పాటు క్రమంలో ఆంధ్రా తెలంగాణా ఒప్పందం వల్ల క్రిష్ణా – పెన్నార్ డ్యాము శాశ్వతంగా మూలకుబడి అటుపక్క నాగార్జున సాగర్ నిర్మాణం జరిగింది. అట్లా కృష్ణానది నీళ్లకు మన్ను బడింది. మరో వైపు కర్ణాటకతో చర్చల్లో తుంగభద్ర నీటిలో 80 శాతం నీరు కోరుకునే బదులు ఆనాటి మా నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో వెలుగులు నింపడానికి 80 శాతం విద్యుత్తును కోరుకుని తుంగభద్ర నీళ్ళు కూడా లేకుండా జేసి సీమనోట్లో మట్టి గొట్టినారు. ఇంత బుడనష్టం జరిగినా రాయలసీమ ప్రజలది త్యాగమే కాదంటారు మంగళగిరి ఆంధ్రా నాయకులు.
నా మిత్రుడు, విప్లవ కవి, సెజ్ వ్యతిరేక ఉద్యమకారుడు కాగుల మధుసూధన్ తరచూ ఒక మాట అనేవాడు “పెరుగన్నం లోకి అరటి పండు లేకపోతే మీకు కరువు. మాకు కరువంటే తినడానికి మజ్జిగ, అన్నమే కాదు గంజికూడా లేకపోవడం”. కరువుకు కుల, వర్గ, ప్రాంతీయ స్వభావం వుందని తన మాట.
.
2. నీళ్ళులేక, ఉపాధిలేక మనుషుల వలస:
నేళ్ళింకని నేల కథలో “వూర్ల ఎవరూ లేరు నాయనా. ఊర్ల వుండేదంతా ముసిలోల్లే. అందరూ సుగ్గికి పోయేర్య. నా క్వాళ్ళి అమ్మ నాయనోల్లు గూడ ఈడ లేరు. బెంగ్లూరు పోయేర్య. నా క్వాళ్ళిని ఈడే మా సేనులోనే మట్టి చేస్తాం” అంటుంది ఒక పాత్ర.
కర్నూలు జిల్లాలో సుమారు 36 మండలాల్లో వర్ష పాతం సగటు కంటే తక్కువ. యేటా కరువు తప్పనిసరి కావడం తో వేల కుటుంబాలు వలస బాట పడతాయి (పనిచేత కాని ముసలి వాళ్ళు తప్ప). ఐదు, పది ఎకరాలు వున్న రైతు కుటుంబం కూడా వలస పోతుందంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఒక్క ఆదోని డివిజన్ లోనే యేటా సుమారు రెండు లక్షల మంది సుగ్గి బాట పడతారు (వలస పోతారు). కన్నడ భాషలో ‘ సుగ్గి’ అంటే పంటల కోత కాలం బహుశా డిసెంబరు – జనవరి నెలలు. యెక్కువ మంది దగ్గరలోని గుంటూరు జిల్లాకో, తెలంగాణా జిల్లాలకో పత్తి తీయడానికి పోతారు. కొంత మంది బహుదూరంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలకూ వలసపోతారు . పంటల కాలం కానప్పుడు మట్టి పని, బేల్దారి పని, రాళ్ళు, ఇటుకలు మోయడం వంటి ఇతర పనులకు బెంగుళూరు, ముంబాయి, హైదరాబాద్ పట్టణాలకు వలస వుంటుంది . ఇంటిల్లి పాదీ వూరు విడుస్తున్నప్పుడు పిల్లలను మాత్రం వూర్లో వదిలేసి ఎట్లా పోవడం? 6నుంచి 10వ తరగతి చదివే పిల్లలు అయినా సరే చదువు ఆపించి మరీ వలసకు తీసుకుపోతారు. ఇంటిల్లపాదీ కష్టపడితే, కూలి డబ్బులు నాలుగు యెక్కువ వస్తే ఆ ఏడాది దిగులు లేకుండా సంసారం నడుస్తుందన్న కడుపాశ కూడా వుంది. ఇక్కడ బాల్యం బడుల్లో కాదు కూలి బరువుల్లో పెరుగుతుంది.
3. రాయలసీమ నీటి ఉద్యమాలు
“అనుమేసప్పా! మీరంతా సదువుకునేర్య. ఉద్దోగాలు సేస్తుండారు. మనూరికి నీల్లోచ్చేతట్ల సేయండప్పా” అంటాడు తమ్మల వెంకటేసు.
కాల్వ కథలో “రెండేండ్లకి ఒకసారన్నా పోతానా , ఓ పది మంది అన్నా వూరు ఇడిసేర్య అని తెలుస్తాది. ఈ ఏడు ఎవురెవురు వూరు ఇడిసిండారో ఏమో అనుకొంటా బస్సు కిటికీల నుంచి బయటికి సూసుకొంటా ఆలోసన సేసుకుంటా కూసుంటి. ఏడిగాలి కిటికీలనుంచి ముకానికి కొడతాంది. కనుసూపు మేర యాడగూడా సేద్యమే కనబడకుండాది. కర్నూలు కాడినుంచి నాగలాపురం కాడికి ఒక్క సేనుల గూడా ఇత్తనం ఏయల్యా! అన్నీ సేన్లల్ల ప్లాట్ల బోర్దులే వుండాయి. ఈనాయండ్లు ఇండ్లు కట్టేదిల్యా , సేద్యం సేసేదిల్యా ! అశపాతకం నాయండ్లు అనుకొంటి .
ఈతూరి కాల్వ అంతా పూడిపోయి పాడుబడిన దానిమాదిరి వుండాది . ఈ తూరికి శానా అద్వానం అయ్యిడిసిండాది . కాల్వ నిండా పరంగి సెట్లు మోలిసేవ్య. నీళ్ళు పారిన గుర్తులుకూడా ల్యాకుండా వుండాది. కాల్వని సూసి కడుపుల ఎవరో సేయిపెట్టి దేవినట్లయ్య. కండ్లల్ల నీళ్ళు వచ్చిడిస్య. సిన్నప్పుడు గోనెగండ్లకి స్కూలుకి పోతున్నపుడు బస్సు వచ్చేవరకి ఈ కాల్వలోనే గదా మాము మా సంతోసాన్ని సూసుకొనింది . రోడ్డు కాడి నుంచి ఈకాల్వ ఎంబడే కదా నీళ్ళ శబ్దుము ఇనుకొంటా మూడు మైళ్ళు వుండేది కూడా తెలకుండా మావూరికి నడుసుకొంటా పోతావుండింది. ఈకాల్వనే గదా నాకి ఈపోద్దుకీ నీళ్ళంటే ఇష్టుము వుండేతట్ల సేసింది. ఈకాల్వ నన్ని కలలోన గూడ ఇడిసిపెట్టలేదు గదా? ఎప్పుడు సూసినా నీళ్ళ కాల్వ పారుతున్నట్లు , యాడసూసిన గూడా నీళ్ళే ఉన్నట్ల కలలోన ఎప్పుడూ వస్తుండాది. ఎట్లా కాల్వని,ఈనాయండ్లు ఇట్లసేసిడిసేర్య కదప్పా అనుకొనిడిస్తి. రోడ్డు మీద కాల్వ మోరికి “అనేక కోట్లు ఎచ్చించి వ్యయ ప్రయాసాలతో అందజేసిన నీటిని పొదుపుగా వాడుకోండి ” అని రాసింది ఈపొద్దుకి నాకి బాగా గురుతుండాది.. ఇప్పుడు ఆ మోరి లేదు. ఆనీళ్ళు లేవు.
“ఇంగ కాల్వ కి రిపేర్లుల్యా గిపేర్లుల్యా . యానాకొడుకన్నా పట్టిచ్చుకునేడనా? . కాల్వ ఎండిపోయినంక బోర్లు కుడా ఎండిపాయ. ఊరంతా నాశనం అయ్యిడిస్య. ఎమో ల్యాప్పా మా దరిద్రం ఇట్లుండాది అనె. “
విజయనగర రాజుల కాలం నుంచి సీమలో యెన్నో చెరువులు, కుంటలు, బావులు వుండేవి. వీటి కిందనే సేద్యం సాగేది. కుంటలు చెరువుల మరమ్మతుకు యెంతో కొంత సక్రమ వ్యవస్థ వుండేది. పేరెన్నిక గన్న కంభం చెరువు, బుక్కపట్నం, ధర్మవరం, శింగనమల చెరువులే కాదు ప్రతీ గ్రామానికి ఒక చెరువో, కుంటో వుండేది. ఒక్క అనంతపురం జిల్లాలోనే యిప్పటికీ 1264 చెరువులు వున్నాయి. కర్నూలు జిల్లాలో 672 చెరువులు, అంటే చెరువుల కింద సేద్యం యెంత ప్రాధాన్యతగొన్నదో అర్థం అవుతుంది.
విజయనగర పతనం తరువాత వచ్చిన పాలెగాళ్ల రాజ్యం లో కూడా నాయకుడి శ్రద్ధను బట్టి కొన్ని చోట్ల చెరువుల వ్యవస్థ సక్రమంగానే సాగింది. సీమ బ్రిటీష్ కు దత్తు పోయినాక వాటి గురించి పట్టించుకునే నాథుడే లేడు.
స్వాతంత్య్రం తరువాత చెరువులు కుంటల పట్ల మన పాలకులు కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగించారు. పట్టణాల పక్కన వున్న చెరువులు కుంటలు అయితే నగర విస్తరణలో రియల్ ఎస్టేట్ కాసులకు బలయ్యాయి.
1980ల్లో రాయలసీమ కరువు నివారణ, తాగుసాగు నీటి ఉద్యమం జరిగింది. రాయలసీమ విద్యార్థి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థియువకులు, రైతులు దీక్షతో కదిలారు. ఏంవి రమణారెడ్డి, మైసూరారెడ్డి వంటి భూస్వామ్య నాయకులు ఆరంభించిన ఉద్యమం అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి అర్ మోసంతో వెన్నుపోటు పొడవబడింది. ప్రజల విశ్వసనీయతను కోల్పోయి మళ్లీ 30 ఏళ్ళ పాటు సీమ ఉద్యమం వూసుయెత్తడానికి వీలులేనంతగా కుంగిపోయింది. సీమ ఉద్యమ పర్యవ సానంగానే ఎత్తుకున్న తెలుగుగంగ పథకం ఎప్పటిలాగే బయటి(నెల్లూరు) రాజకీయాలకు బలి అయ్యింది.
తెలంగాణా ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో 2012 తరువాత యువకులు విద్యార్థులు రైతులు తమ సీమకు జరిగిన, జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమం చేపట్టారు. గుండ్రేవుల ప్రాజెక్టు, సిద్దేశ్వరం అలుగు, వేదవతి యెత్తిపోతల పథకం, కృష్ణా, తుంగభద్రా నీటి వాటాల వంటివి ప్రజలోకి చర్చకు తెచ్చారు. యీ కథకుడు ఆ ఉద్యమ కార్యకర్త. అందుకే యీ మాటలు రాయగలిగాడు.
“నాను కూడా కర్నూలుల ఆఫీసుల అయ్య లోపలున్నప్పుడు స్టూలు ఏసుకొని వాకిలి కాడ కూసోని ఉంటాను. మా అపీసు గేటు కాడ రాయలసీమకి నీళ్ళు కావాలని ధరనాలు సేస్తుంటారు. నాను వాళ్ళని సూస్తుంటానే గానీ యానాడు ఆలోచన సెయ్యలే. మా సారూ కాడికి పత్రం ఇచ్చేకి వొచ్చినప్పుడు గుండ్ర్యావుల , యాదవతి , సిద్దేశ్వరం ప్రాజెక్టులు కట్టాలని అడుగుతా వుంటారు . అవుగదా ఈయప్పోల్లు అడిగేది కరేక్టు కదా అనుకొంటా వుంటి. అయితే ఈవుద్దిమం మా వూరికాడికి కూడా వచ్చేద్య అనమాట ! నాను ఇట్లా ఆలోసన సేసుకుంటా నడుస్తుంటే వాడు సేసేదే కరెక్టు. మాము సదువుకొని ఉద్యోగాలు సేసుకొంటా మా స్వార్థంల మాము వుండాము. అందురూ మనమాదిరే అనుకొంటే ఎట్లాలే ? నీకొడుకు ఈ సీమ నీళ్ళు తాగి , గాలి పీల్సి , ఈన్యాలల పండిన పంట తిని ఋణం తీర్సుకొంటుడాడు లే!. మనమూ ఉండాము ఏంటికి? బూమికి బరువు . మన కండ్ల ముందరే కాల్వ ఎండిపాయినా మనకి బుద్దిరాల్య. ఎన్ని వూర్లోల్లు మనూరుకి సుగ్గికి వస్తుండిరి. ఇప్పుడు మనూరోల్లె బ్యారే వూరికి పోయే పోద్దోచ్చే! నీళ్ళు ల్యాక ఎట్లాంటి వూరు ఎట్లా అయిపోయేద్య. ఈ కాల్వని సూసినాక మనము గూడా మీ వోనితో కల్సకుంటే మనము మనుషులమే కాదలే! “ అంటి .
4. పల్లెలో సంఖ్య రీత్యా అతి తక్కువగావుండి గుర్తింపుకు నోచుకోని కులాలు
హిందూ మతం తన విస్తృతి కోసం “కింది కులాలలో ” కూడా ఒక పూజారి వ్యవస్థను ఏర్పరిచింది. వైష్ణవ సాప్రదాయంలో సాతాని, నంబి కులాలు అటువంటివి. సాధారణంగా బ్రాహ్మణ ప్రాబల్యం లేని గ్రామాల్లో వీరు ఆంజనేయ, వేణుగోపాల స్వామి గుడి పూజారులు. వీరు ఇచ్చే గుడి తీర్థ ప్రసాదాలను బ్రాహ్మణులు స్వీకరించరు ఎందుకంటే వీరు తమకు సమానం కాదని బ్రాహ్మణుల భావన. అలాగే శైవ సాంప్రదాయంలో తమ్మలోళ్లు ( తంబళ్ల వికృతి రూపం కావచ్చు). వీరుకూడ బ్రాహ్మణులు లేని చోట్ల పూజారులు. బ్రాహ్మణులు వున్న చోట్ల గుడి శుద్ధి చేసే సేవకులు. గర్భగుడి ప్రవేశం నిషిద్ధం. పూజారితో పాటూ వీరికీ కొంత మాన్యం, ఆయరికం వుంటుంది. ఊరిమర్లు అటువంటి తమ్మలోళ్ళ వెంకటేశు కథ.
నీరు లేక పంటలు రాక గ్రామంలో బతకడం కష్టమైనా ఊరిమీద మమకారం చంపుకోలేక గిడ్డయ్య స్వామిని, వున్న మెట్టపొలాన్ని వదులుకోలేక భార్యా పిల్లల్ని కూడా వదిలేసిన ఒక రైతు కథ. పూజారి కుటుంబం ఊరొదిలినా తాను మాత్రం గిడ్డయ్యనే నమ్మి శిధిలమైన మనిషి.
“ఎప్పుడైతే నీళ్ళు బందు ఆయనో మావూర్ల గూడ ఆనందము బందు ఆయిపాయ! గిడ్డయ్య గుడికి వొచ్చే వోళ్ళు తగ్గిరి. వొచ్చినా రూపాయి రెండురూపాయిలు ఇచ్చేది లేకపాయ. కట్టేకి పూలు లేవు, బాసింగాలు లేవు. ఆకుల పూజ చేపిచ్చేవొల్లే లేరు… మా మాన్యం సేను కూడా పాడు అయిపాయ . కల్లాల కాడ గింజలొచ్చేది ఆగిపోయ . సంక్రాంతి పండగ నాడు గింజలకి ఎంకటేసు ఊరంతా తిరిగినా పిడికెడు గింజలు వచ్చేది కష్టం అయిపోయ. తాను కాయాసత (ఇష్టంగా) సూసుకున్న ఎద్దుల్ని మేత ల్యాక ఎమ్మనూరు సంతల అమ్మి వొచ్చే. ఎద్దుల్ని అమ్మినంక ఆయప్ప ఒక నెలదినాలు మనిసి కాలేకపోయ.”
5..సీమ భాష, సంస్కృతి పట్ల చిన్నచూపు:
నీళ్లింకని నేల కథలో సోమశేఖర్ ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చిన తరువాత తన రాయలసీమ యాసను తగ్గించుకొనెందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రాయలసీమ యాసలో మాట్లాడినపుడు ఆఫీస్ లో కొందరు నవ్వుకోవడము తనకు ఇబ్బందిగా అనిపిస్తోంది . మీడియాలో ఇమడాలంటే రాయలసీమ యాసను వదలుకోవాలనే వాస్తవాన్ని తొందరలోనే గ్రహించాడు సోమశేఖర్ ” సీమ భాష, సంస్కృతి పట్ల నగర వాసుల, కోస్తాంధ్రుల చిన్నచూపు మా అందరికీ అనుభవమైనది.
కథలలోని పాత్రల పేర్లు ఆ ప్రాంత సంస్కృతి నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. నీల్లింకని నేల కథలో ఒక పాత్ర పేరు ఉళ్ళక్కి. యెమ్మిగనూరు, ఆలూరు, ఆదోని ప్రాంతాల్లో పిల్లలు పుట్టి చనిపోతూ వుంటే యిటువంటి పేరు పెడతారు. ఉళ్లక్కి అంటే ‘అది జరగలేదు అని’ అంటే ‘పుట్టనే లేదు’ అని విధిని నమ్మించడం. ఇటువంటి ఆచారం ఇతర రూపాల్లో సీమ అంతా వుంది. పుల్లయ్య: పుల్లి ఇస్తారాకు ( తినిపారేసిన) లో బిడ్డను దొర్లించి ఇంటికి తెచ్చుకుంటారు. తిరుపాలు: తిరిపమునకు (ఉద్దరగా) దొరికిన బిడ్డ అని అర్థం.
6. సమిష్టి సంస్కృతి – దాని విధ్వంసం
రాయలసీమలో దర్గా సంస్కృతి ఎక్కువ. పిల్లలుకాక పోయినా, ఒళ్ళు పాలుమానినా దర్గాకో, పీర్లకో మొక్కు కుంటారు అందుకే ఇక్కడి ముందుతరంలో కాజన్న, పక్కీర్ రెడ్డి, వుసేనప్ప, మస్తానమ్మ వంటివి హిందువుల సాధారణమైన పేర్లు వుండేవి. (ఇప్పుడు ఇటువంటి పేర్లు కనపడవు) ఈశ్వరమ్మా ! నిన్ను నమ్మితీ కథలో యీ సన్నివేశం చూడండి.
“ఇంగ భజిని స్టార్టు అయితాండ్య. మిసిని లచ్చుమన్న సుక్లాం భరదరం పాడతాండ్య. ఈడిగి ఉసేనప్ప కాళ్ళ సందున డక్కి పెట్టికొని సేతిఏళ్ళు ఎట్ల తిరుగుతుండ్యనో తలకాయి కుడా ఆయప్ప అట్లే తిప్పుతుండ్య. పాట అయిపోయెతప్పుడు “నమో పారతీ పతిహరహర మహాదేవ” అంటుండ్రి. ఇంగ వూర్లో ఉన్న దేవుల్లందరినీ తలుస్తుండ్రి. శ్రీరామసంద్రమురితికి జై, నీలకంటేస్పురిడికి జై, లింగమయ్య తాతకి జై, మారేమ్మవ్వకి జై, సుంకులమ్మవ్వకి జై, గెనకలమ్మవ్వకి జై , దస్తగిరయ్య తాతకి జై, కాసిమప్ప తాతకి జై, అనుకుంటా ఇంకో పాట ఎత్తుకుంటుండ్రి.”
ఆంజనేయస్వామి గుడి భజనలో రాముడు, శివుడుతో పాటు శూద్ర దేవతలు మారెమ్మ, సుంకులమ్మలే కాదు, వూరి దర్గా గురువులు దస్తగిరయ్య, కాసీమప్ప తాత, గంజిల్ల బడేసాబ్ అప్ప కూడా జేజేలు అందుకోవడం యీ దేశంలో యెన్నో ఏళ్లుగా అమలులో ఉన్న లౌకిక ప్రజాస్వామ్య వారసత్వం. మనం గమనిస్తే మత సామరస్యత అనేక రూపాల్లో మనచుట్టూ వ్యక్తమౌతుంది.
టివి లు వచ్చినాక వూరి సమిష్టి సంస్కృతి విచ్ఛిన్నమై పోయిన స్థితిని ఇదే కథలో చెబుతాడు
” ఒగ అరుదుము గంట అయిపోయినాక ఒకాయప్ప ఎనకాల ఇంగోగాయప్ప అంతా కలిసి ఆరు మంది వొచ్చిరి.
”ఎం లసుమన్న ఇంతేనా” అంటి.
“ఈటికే ఎక్కువ” అన్య.
భజిని స్టార్టు సేసిరి. డక్కి కొట్టెకి ఎవురూ ల్యకుంటే నానే కొట్టిడిస్తి. ఏంటికో కానీ మనసుకి నచ్చల్యా. పాత భజిని గురుతుకి వచ్చ్య. మనసులో మనసుల్యా. గిడ్డయ్య సామి గూడా ఎందుకో దిగులుగా ఉన్నట్ల కనిపించ్యా. నాల్గు పాటలకే బందు సేసిరి.”
“అయ్యగాల్లు అందురూ టీవీలు సూసేకి కలబడ్రి, భజినికి యాయప్ప రాకున్నాడు” అనిడిస్య. గిడ్డయ్య సామి కెల్ల సూస్తి. నాతుక్కు శానా దిగిలుగా సుసినట్ల అనిపించ్య.
సెల్ ఫోన్ లు వచ్చిన తరువాత యీ స్థితి ఇంకెంత మారిందో రచయిత చూడవలసివున్నది.
7. పల్లెల్లో మత సామరస్యత
మా జిల్లాలో పెద్ద పల్లెల తిరునాళ్ళకి సురభి కంపెనీ డ్రామాలు నడిచేవి. నలభై రోజులు రోజుకొక కథ ఆడేది. పక్కవూర్లనుంచి బండ్లు కట్టుకోని వచ్చి చూసేటోల్లు. కొంచెం పంటల ఆదరువు వున్న వూర్లల్లో అయితే యేటా వూర్లో వాళ్ళే ఒక తూరి డ్రామా కట్టాలసిందే. కర్నూలు చుట్టు పక్కల యే డ్రామాకైనా ఆడ ఏసం కావాలంటే మాకు ఒకే ఒక దిక్కు కర్నూల్లో వుండే రజనీబాయి. ఇది ఒక కాలపు సాంస్కృతిక చరిత్ర.
రామనవమికో, శివరాత్రి జాగరణకో కాదు దర్గాకు జరిగే ఉర్సుకు రామాంజనేయ యుద్ధం డ్రామా ఆడాలనుకోవ డం యిప్పుడు బహు ఆశ్చర్యం కానీ ఒకప్పుడు వుండేది. ‘ కుశలంబే కద ఆంజనేయ ‘ కథ శిల్ప నైపుణ్యం అద్భుతం. ఏక కాలంలో మూడు చోట్ల డ్రామా గురించిన చర్చతోనే కథ మొదలౌతుంది. యీ మూడు సన్నివేశాల లో వున్న మనుషులు మూడు నెలల తరువాత గువ్వలదొడ్డిలో జరిగే డ్రామాలో భాగమౌతారు.
కర్నూలు జిల్లా పల్లెల్లో డ్రామా అనేది సంగీత నాటక కళలను ఒక స్థాయిలో కిందికులాలకు విస్తరింపజేసింది. నాకు తెలిసి యెక్కువ మంది హార్మోనిస్టులు బి.సి.లే. (నేను గమనించిన మరో అంశం కర్నూలు చుట్టు పక్కల నాటకం నేర్పడానికి వచ్చే హార్మోనిస్టులలో ఒకరిద్దరు మాల కులస్తులు కూడా వుండిన్నారు.)
వూరు ఆడే యీ డ్రామాల్లో వూరిలోని దళిత కులాలకు యెంత మేరకు పాత్రలను ఇచ్చారనేది నాకు తెలియదు. యీ కథలో మాత్రం మాదిగ బజారి జాంబవంతునిపాత్రకు ఎంపిక అయినాడు. రాముడి పాత్రకేమో తురకాయప్ప రసూల్. ఇతర మతాల పట్ల గౌరవం యే స్థాయిలో ఉండేదో చెప్పే రుజువు యిది.
“యామాటకి ఆమాట సెప్పల్ల ! ఒక రసూలు సాబు మటుక్కి అచ్చరం పొల్లు ఫోకుండా పద్యాలుసెబుతుండ్య. రాగానికి రాగం , మాటకి మాట బలే సేబుతుండ్య . ఇంగా ఏమంటే రసూలు సాబు డ్రామా మొదులు పెట్టినప్పటి నుంచి నీసు తినేది ఇడిసిపెట్ట్య. కడాకి కోడిగుడ్డు కూడా ముట్టుత ల్యాకుండ్య . కొడుకుకి ఒడుగు సేసినా నీసుని ఇట్లా ముట్టుకోల్యా ! దేవుని ఏసం కట్టేన్య , తింటే ఎట్లప్పా అన్య .రసూలు సాబు భక్తికి ఉరూరే అచ్చర్యపోయా”.
గ్రామాల్లో వుండిన ఒక పరస్పర సహకార వ్యవస్థను అద్దంలో చూపింది యీ కథ.
“డ్రామా నేర్సుకోనేది అంతా అయిపాయ. గిడ్డయ్య గుడి కట్టమీద మైకు పెట్టుకొని పున్నము నాడు మొత్తము ఆడేకి తయారయిరి. రాత్రి గిడ్డయ్య గుడి కట్ట కాడికి డ్రామా అడేవోల్లు, ఊరి పెద్దమనుసులు , సూసేవొల్లు అందురూ వొచ్చిరి. రాముని ఏసం కట్టిన రసూలు సాబు పద్యం సెప్పేది ఇని అందరూ సీలలు ఏసిరి.
సూడనీక వొచ్చిన సాదువు ఒగాయప్ప “రాముడికి గడ్డం ఉండదు కదా ? మరి ఈయప్పకి గడ్డం ఉండాది ఎట్లా? “ అని పుల్ల పెట్ట్య.
“ తాతా ఇది దేవుని గడ్డం . తీసేకి లేను. “ అన్య రసూలు సాబు. పెద్దమల్లయ్య “ రసూలుగాడు శానా నిష్టగా డ్రామా నేర్సుకొనేడ్య. ఏడు నెలల సంది ఒక్కదినుము కూడా నీసు ముట్టల్యా… కొడుకు ఒడుగు అయితే కూడా నీసు ముట్టలేదంటా. యా దేవుడైనా దేవుడే గదా! మనము నిష్టగా ఉండల్ల అంటుండ్యనంట. మరి ఆయప్ప మన దేవునికి అంత భక్తి సూపిచ్చినప్పుడు మనం గూడా ఆయప్ప దేవునికి అంతే భక్తి సూపల్ల కదా “ అన్య.
“ రసూలు సాబు పద్యం సెబితే ఆ సీరాముడే సేప్పినట్లుఉంటాది. రామునేసానికి రసూలే తగినోడు “ అని బోయ దుబ్బమ్మ అన్య.
గడ్డం రాముడితోనే డ్రామా సక్రమంగా అయిపాయ. డ్రామా నేర్పించిన పాండురంగయ్యకి , అమ్మయ్యకి అందరూ ఇండ్లకి పిలిసి దాన్యం పెట్టిరి. ఇయ్యాల్సిన పద్దెనిమిది నూర్లు ఇచ్చిరి. ఎద్దులబండి వొడ్లు , జొన్నలు, సద్దలు మూటలత నిండి పోయిండ్య. పాండురంగయ్యని, అమ్మయ్యని సాగానంపేకి ఊరూరే వొచ్చ్య. కండ్ల నీళ్లతో సాగనంపిరి. కొన్ని సంవత్సరాలు రామాంజినేయ యుద్ధం పద్యాలు అందరి నోర్లల్ల నాన్య” ఒకప్పుడు ఇంత మత సామరస్యత వున్న వూర్లల్లోకి విద్వేషాలు యెట్లా వస్తున్నాయి? పాలకులే మతం పేరున ప్రజలను చీల్చాలని చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలంటే సామరస్య ఉద్యమానికి గ్రామమే పునాది కావాలి.
8. బాపన సేద్యం
‘ పునరపి ‘లో రచయితే తన కథ చెబుతున్నాడు. ఊర్లో జరిగీ జరగని పౌరోహితం, సేద్యంతో కష్టాలు పడుతున్న ఒక పేద బ్రాహ్మణ కుటుంబం. యీ రెండూ కడుపు నింపడం లేదని తల్లి వంటలు చేయడానికి కూడా పోతుంది.
“మా యమ్మ మా నాయన ఈ సేనుల పడిన కష్టం తలుసుకుంటే ఇప్పుడికి నా కండ్లల్ల నీళ్ళు తిరుగుతాయి సూడప్పా . కాని శానా మంది బాపనోళ్ళు తిండి మీద
యావ తోనే వండే వృత్తిని ఎన్నుకొనేర్య అంటారు. నాకి అయోప్పల్ల రాతల మీద శానా అభ్యంతరము వుండాది. మాము కూడా బాపనోల్లె. మాయమ్మ గాని, మా నాయన గాని మాము గాని యానాడు తిండికి అంగలార్చల్యా. తిండికి కనా కష్టం పడినోల్లం.”
పిల్లలకు యీ పూజారి చదువులు వద్దని తల్లి పట్టు పట్టడంతో పల్లె విడిచి ఎమ్మిగనూరు టౌనుకు పోతారు. కూతురు పెండ్లి కోసం వూరి ఇల్లు అమ్ముకున్నారు. పిల్లలు అందరూ స్థిర పడినాక ఆయిల్లు మళ్లీ అమ్మకానికి వస్తే తల్లి మళ్లీ కొనాలనుకోవడంతో కథ మొదలౌతుంది.
“సేను ఇత్తిన కాడి నుంచి పీకే వరకు కంటిమీద కునుకు లేకుండ్య. ప్రెపంచమ్లో ఇప్పుటికీ రెండు యుద్దాలు జరిగేవ్య అని సదివినాను గాని రైతుకి మాత్రం దినూము ప్రేపంచ యుద్దమే. ఒకపారి బండ కుంట మీద బుడ్డలు ఆర బెట్టి వుంటిమి. యాడనుంచి వచ్చెనో పెద్ద వాన వచ్చిడిస్య. నాను, మాయమ్మ, గిడ్డయ్య వుంటిమి. ఇంగ సూస్కో బుడ్డలన్ని వాన నీళ్ళల్లో కొట్టుక పోతుంటే మాయమ్మ జల్ల తీసుకొని నీళ్ళల్ల పోతున్న బుడ్డలని ఒలిపి ఒలిపి గడ్డకి ఏస్తా వుంటే నాకేమో మాయమ్మ భారతం లోన అభిమన్యుని మాదిరి కనిపిచ్చ్య . గిడ్డయ్య తెగించి కొట్టుకు పోతున్న బుడ్డలని ఒడిసి పట్టి బండ మీద ఏడుసుకుంట పోసేది సూసి నాకిగూడ ఏడుపు వచ్చిడిస్య . మాయమ్మ గిడ్డయ్యతో “మన గాశారం (గ్రహచారం) బాగాలేదు లేప్పా ఏంటికి ఏడుస్తావు” అన్య. కాని మాయమ్మ మాము అంతా బయట పడుకొని వుంటే ఒక్కతే ఇంట్ల కూసోని ఏడిసింది నాను సూడలేదు అనుకొనింది. మాయమ్మ తన కష్టం తన పిల్లలకి రాకూడదని వంట పని, ఇంటి పని, సేను పని సేసి మమ్ముల్ని సేద్యం అనే యమలోకము నుంచి తప్పిచ్చిన దేవత మాకి. మీరు అనుకునోచ్చు,” బాపనాయమ్మ ఇంత కష్టం చేసి ఉంటాదా” అని. బాపనత్వం మాకి అన్నం పెట్టి వుంటే మాయమ్మ, మా నాయన ఇంత కష్టం ఏంటికి సేస్తుండ్రి?”
“మా ఊర్ల మాకి తినేకి అంత ఇబ్బంది లేకుండ్య గాని సదువుకునేకి శాన కష్టంగా వుండ్య. ఓ.సి. అని బడిలోన బుక్కులు ఇయ్యకుండ్రి. మా సీనియర్ల దగ్గర సగము ధరకి కొనుక్కుంటా వుంటిమి.”
సీమ బయటి వాళ్లకు యీ కథ ఆశ్చర్యం కలిగించవచ్చు. సేద్యం చేసే బాపనోల్లు వున్నారా? అని. మా జిల్లాలో అట్లాంటివి శానా సంసారాలు వుండిన్నాయి. కోస్తాలో మాదిరి వాళ్ళది గట్టు మీద సేద్యం కాదు. కూలికి పిలిస్తే దుడ్లు యాడినుంచి తెచ్చి యియ్యాల అని పిల్లల తో సహా ఇంటిల్లిపాదీ చేనిలో దిగి కష్టపడే రకం. బైటి నుంచి తమ మీద వచ్చిన మాటలకు నొప్పి పడి, రచయిత ఆక్రోశపడిన సందర్భాలు ఇవి.
అయితే అగ్రవర్ణ పేదలకు పేదరికం వల్ల కష్టాలు వుండవచ్చు నేమో గానీ దళితులలో పోల్చితే కులపీడన లేదు అన్న విషయం మరిచిపోరాదు. పిల్ల పెండ్లికి అమ్ముకోదానికి తమకు ఇల్లైనా వుంది అన్నదీ మరచిపోరాని వాస్తవం. అంతే కాదు. తానే మిగతా కథల్లో(నీళ్ళింకని నేల) చెప్పినట్టు బాపనయ్య కోతల తరువాత గింజలు అడుక్కోడానికి రైతుల ఇంటింటికీ పోయినా యీసడింపు వుండదు. గౌరవం తోనే కాసిని ధాన్యం పెట్టి పంపుతారు. దీన్ని అగ్రకులానికి వున్న సామాజిక పెట్టుబడి ( సోషియల్ కాపిటల్) అనుకోవచ్చు. యిది రచయిత మొదటి కథ(2018) కాబట్టి కథనంలో మిగతా విషయాలు పక్కకు పోయి ఆక్రోశం మాత్రమే డామినేట్ చేసిందేమో? కొంత అపార్థానికి తావు ఇస్తుందేమో అని నాకు అనిపించింది.
తృతీయ ప్రకృతి, నిర్ణయం,మలుపు అనే మూడు కథలు యీ విభజన కిందికి రావు. కర్నూలు జిల్లా ప్రాంతీయత వస్తువుగా కథలు రాసిన యీ కథకుడు ఆధునిక జీవితంలో నెలకొన్న కొన్ని ఇతర సంక్లిష్ట అంశాలనూ కథలుగా రాశాడు
ఆత్మహత్య చేసుకుందామని పోయిన ఒక యువకుడి జీవితం ‘ మలుపు ‘ కథ. ఆత్మహత్య చేసుకోబోతున్న అతడిని తెలివిగా ఆపి, చావు నుంచి తప్పించి, ఉద్యోగం కొరకు సిద్ధంచేసి అదృశ్యమైపోయిన ఒక అజ్ఞాత వ్యక్తి. ఆత్మహత్యను వాయిదా వేయించి జీవితం పట్ల ఆశ కల్పించడం కోసం మూడు పేజీలలో కథ నడిచిన బిగువు కథకుడి రచనా పటిమను చూపుతుంది.
‘తృతీయ ప్రకృతి’సమాజంలో అల్ప సంఖ్యలో వుంది నిత్యం తల్లి దండ్రుల యీసడింపును, సమాజం నుంచి అవమానాలను ఎదుర్కొంటూ బతికే LGBTQ సమూహాల కథ.
నిర్ణయం కథ చదవగానే నాకు రాప్తాడు గోపాలకృష్ణ కథ ‘సీతమ్మత్త ‘ గుర్తుకొచ్చింది. పార్వతమ్మ వృద్ధాశ్రమంలో వుంది. కొడుకు,కోడలుకు అమెరికాలో ఉద్యోగం .బాగా చూసుకుంటారు, డబ్బుకూ లోటు లేదు. భర్తను కోల్పోయాక మానసిక ఒంటరితనం తప్ప. ఆశ్రమం ఆ కొరతనూ తీర్చింది. అందరికీ సహకారం అందిస్తూ సేవలు చేస్తూ తన జీవితం తాను ఏర్పరచుకొన్నది. మంచి మనసున్న కొడుకు యీ దశలో తమకు తెలిసిన ఒక టీచరు రామయ్య సారుతో సహజీవనం చేయగలవా? అని తల్లిని అడుగుతాడు. తల్లికి తోడు కల్పించాలను కున్న ఆధునిక యువకుడు అతను. కానీ ఆ తల్లి ఆలోచనలు చూడండి.
“ఇప్పుడు ఈ రామయ్యతో కలిసి జీవించడం అంగీకరిస్తే అతను తన మీద పెత్తనం చేయడన్న గ్యారంటీ ఏమిటి? ఇప్పుడు ఈ వృద్ధాఆశ్రమంలో ఎంతో ఆనందంగా ఉన్నాను. నాకంటూ ఇష్టమైన ఒక జీవన విధానాన్ని మలచుకొన్నాను. నేను ఇలా ఉండాలి అనుకొని నాకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇంకా ఇక్కడ ఎన్ని బాధ్యతలున్నాయని. శారదమ్మ, ఆది శేషయ్యల పిల్లలు డబ్బుకు కక్కుర్తి పడి వారికి డార్మేట్రీ ఆప్షన్ తీసుకోవడం వలన ఆ ముసలి దంపతులు ఈవయసులో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని. నెలకు ఒక్క మూడువేలు అదనంగా చెల్లిస్తే వారిద్దరినీ షేరింగ్ రూముకు మార్చవ చ్చు. పాపం రాత్రి తొమ్మిది అయ్యిందంటే ఇరువురూ పరాయోల్లై పోతారు. ఎవరి డార్మెట్రీకు వారెళ్ళిపోతా వుంటే మనసుకు ఎంత కష్టంగా ఉంటుంది. రాత్రిపూట భార్యా భర్తలు ఒకేచోట నిద్రించడం ఈ వయసులో శారీరక అవసరంకోసం కాదు. నాకూ ఒకరు తోడున్నారనే ఒక ధైర్యం కోసం. ఈ నెల నుండి తన పెన్షన్ నుండి మూడు వేలు చెల్లించి వారిని ఒక చోటకు చేర్చాలనుకొం టున్నది. మరణపు అంచున వున్న సుబద్రమ్మ తన పిల్లలు ఇక్కడ తను చనిపోయినా రారనీ, బ్రాహ్మణ సాంప్రదాయంలో తన భర్త కర్మకాండ జరిగిన హంపీలోనే తన కర్మకాండకూడా శాస్త్రోకంగా జరిపించాలనీ, ఆ బాధ్యత పార్వతమ్మదేననీ మాట తీసుకొంది. ఆశ్రమంలో పనిచేసే ఆయమ్మ కొడుకు కూడా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తనే వాడి ప్రతిభను గుర్తించి వాడి చదువు భాద్యతను తీసుకొంది. ఇలాంటి బాధ్యతలను రామయ్య ఒప్పుకొంటాడా? పుస్తకాలు చదవనిస్తాడా? రెండు సంవత్సరాలుగా వెన్ను నొప్పితో మంచంపై ఉండి, తనను అక్కా అని ఆప్యాయంగా పిలిచే నారాయణస్వామి తో ఈ రామయ్య మాట్లాడనిస్తాడా? ఈ కలసి జీవించే ప్రతిపాదనే నాకు వద్దు. నాకు ఈ జివితమే చాలా సంతృప్తి కరంగా ఉంది. నాకు ఈ జీవితమే బావుంది. మరో ఉచ్చులో ఇరుక్కోవడం ఎందుకు? మరొక నరకంలోకి ప్రవేశించే ధైర్యమూ తనకు లేదని అనుకొంటూ గట్టి నిర్ణయం తీసుకొంది పార్వతమ్మ. కొత్త భాద్యతల నిర్ణయం వలన రోజూ ఆరు గంటలకు నిద్రలేచే పార్వతమ్మ ఈరోజు ఐదున్నర గంటలకే నిద్ర లేచింది.”
యీ కథలలో కూడా కథాంశం చుట్టూ మానవ సంబంధా లు అల్లుకొని వుంటాయి. నేపథ్యంలో కరువు, నీళ్ల లేమి, గ్రామాల విధ్వంసం, వలస, వలస ప్రాంతంలోని దుర్భర జీవితం, అన్నీ ప్రస్తావనకు వస్తాయి.
ఉరుసుకి కొత్త బట్టలు పెడితే పొంగిపోయి ” తండ్రీ! నాను సచ్చెంతవరకి నాసేయి యిడుసొద్దు . ” అంటున్న తంబల్ల వెంకటేశు రూపం నన్ను వెంటాడుతున్నది. అటువంటి మనుషులు మనకు చాలామంది తెలుసు. కన్నీటి బొట్టుగా రాలే వాళ్ళ జ్ఞాపకాలు మనసును కోత పెడతాయి.
చివరగా ఒక్క మాట ప్రస్తావించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. మాండలీకం ఇంత కఠినంగా ఉండాల్సిందేనా? యీ ప్రశ్న మళ్లీ మళ్లీ తలెత్తుతూనే వుంటుంది. అల్లం రాజయ్య తెలంగాణా మాండలికంలో, అట్టాడ అప్పల్నాయుడు శ్రీకాకుళం మాండలీకం లో రాసినప్పుడు కూడా ఇవి వచ్చాయి. యీ ఇరువురూ తమ ప్రాంత బయటి పాఠకుల కోసం తమ తొలి సంకలనాలలో కొన్ని మాండలిక పదాలకు అర్థాలను ఇచ్చినట్టు గుర్తు. ఆ తరువాత పాఠకులు అలవాటు పడినాక అటువంటి అవసరం మళ్లీ రాలేదు. నాగప్ప గారి సుందర్రాజు మాదిగోడు సంకలనం వచ్చినప్పుడూ ఇదే చర్చ వచ్చింది. కారణం ఏమంటే మాండలిక పదాలతో పాటు కన్నడ యాస కూడా కలగలిసి బైటి పాఠకులకు ఇబ్బంది అనిపిస్తుంది. మాండలికాన్ని ఉపయోగించినా యాస కొంచెం తగ్గిస్తే రచన పాఠకులకు చేరడం సులువు అని కొందరి వాదన. నిజానికి ఏ వివరణలూ లేక పోయినా నామిని కథలకు వచ్చిన ప్రాచుర్యం యీ వాదన సరికాదేమో అనిపిస్తుంది.
మారుతి కథల్లోని బువ్వలు తాగేకి, కాడికి నూరు రూపాయలు, తావిడిస్తి= తావు+ యిడిస్తి (ఆ ప్రాంతం విడిచి పెడితిని) వంటి పదప్రయోగాలు నాకు అద్భుతం అనిపించాయి. ఆదోని, ఆలూరు, బళ్ళారి, హోసూరు, కృష్ణగిరి వంటి సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే అచ్చ తెనుగు పదాలు ఇంకా మిగిలి ఉన్నాయేమో అనిపించింది నాకు. భాషా పండితులు చెప్పాలి.
కథల్లో కొంత వివరణ అవసరమైన, నాకు తెలిసిన కొన్ని మాండలిక పదాలు కింద ఇస్తాను.
- దరేశాని =దరేసాహెబ్ ను
- గిడ్డయ్యస్వామి = ( గిడస)పొట్టిగావున్న ఆంజనేయుడు పదం అనంతపురం, కర్నూలు జిల్లాలలో మాత్రమే వుంది.
- కాయాస. =ఆసక్తి
- సంచకారం = అడ్వాన్సు
- కువ్వాడం = ఎగసేక్యాలు, ఎగతాళి
- ఆయిత్వారం= ఆదివారం
- ఎగితి= తాహతు
- అపూటం= మొత్తంగా