బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ లో సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఏర్పాటు, వివిధ చోట్ల రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసీలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా మే 12, 13 తేదీల్లో వారు  జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పాదయాత్ర చేసారు. దాదాపు 200 రోజులుగా, వేలాది మంది గ్రామస్తులు తమ మూడు అంశాల డిమాండ్ల కోసం అబూజ్‌మడ్ తోయ్మెటాలో ధర్నాకు కూర్చున్నారు. ప్రభుత్వం తమ మాట వినకపోవడంతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

రేషన్, నీళ్లతో  బయలుదేరారు.

అబూజ్‌మడ్‌కు చెందిన వేలాది మంది ఆదివాసీలు శుక్రవారంనాడు మండుతున్న ఎండలో రేషన్, నీరు, నిత్యావసర వస్తువులు, సంప్రదాయ ఆయుధాలతో మూడు ట్రాక్టర్లలో నగరానికి చేరుకున్నారు. దాదాపు 40 కి.మీ.ల ఈ మార్గంలో కుంక్ర‌జార్ సమీపంలో భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి కానీ అడ్డుకోలేకపోయాయి. ఆదివాసీలు పోలీసు బారికేడ్‌ను దాటుకుని పాదయాత్రను కొనసాగించి రాత్రి 10 గంటల ప్రాంతంలో నారాయణపూర్‌లోని బఖ్రుపరా చేరుకున్నారు. అక్కడ రాత్రి బస చేసి శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సి ఉండింది. కానీ అంతకు ముందే జిల్లా కలెక్టర్ అజిత్ వసంత్, ఎస్పీ పుష్కర్ శర్మ వారిని కలిసి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కలెక్టర్‌ హామీ ఇచ్చారు

కలెక్టర్ అజిత్ వసంత్ మీడియాతో మాట్లాడుతూ..”మూడు అంశాల డిమాండ్లతో  ఆందోళన చేస్తున్న ఓర్చా గ్రామీణ ప్రాంతాల నుంచి నారాయణపూర్‌కు తరలివచ్చిన   ఆదివాసీలను కలుసుకుని డిమాండ్లపై చర్చించాం. పెసా చట్టం, అటవీ సంరక్షణ చట్టం (2022)ని సవరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి వారికి విషయం వివరించాం. చట్టంలో చేయాల్సిన సవరణల గురించి ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. ప్రజా ప్రతినిధుల ద్వారా  వారి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పాం” అని వివరించారు.

పోలీసులు గ్రామస్తులను నక్సలైట్లు అంటున్నారు

“ప్రస్తుతానికి వెనక్కు వెళ్తున్నాం, కానీ మా ఉద్యమం కొనసాగుతుంది. ప్రభుత్వం అంగీకరించకుంటే మళ్లీ పాదయాత్ర చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అబూజ్‌మడ్ నుంచి కలెక్టర్‌ను కలిసి మెమోరాండం యిచ్చేందుకు వచ్చినప్పుడల్లా పోలీసులు మాపై నక్సలైట్‌ ముద్రవేసి జైలుకు పంపి చిత్రహింసలకు గురిచేస్తున్నారు.  అబూజ్‌మడ్ లోని చాలా మంది ఆదివాసీలను పోలీసులు నక్సలైట్‌లు అని  జైలుకు పంపారు” అని వారు అంటున్నారు.

ఉద్యమం అంతం కాదు

  ఈ రెండు రోజుల ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రదీప్ కుమార్ గోటా  “శుక్రవారం నాడు సుమారు వెయ్యి మందిమి మా డిమాండ్లతో నారాయణపూర్  పాదయాత్ర చేసాం.  భద్రతా బలగాలు మమ్మల్ని కుంక్రజార్ దగ్గర ఆపడానికి ప్రయత్నించారు, కానీ మేము మా డిమాండ్లతో ముందుకు సాగాము.  నారాయణపూర్‌లోని బక్రుపారా కూరగాయల మార్కెట్‌లో రాత్రి బస చేసాం. ఉదయం కలెక్టర్‌ను కలిసి మా డిమాండ్‌లపై వినతి పత్రాన్ని అందజేసాం” అని వివరించారు.

ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ హామీ మేరకు ఆదివాసీలు తిరిగి వెళ్లారు, కానీ మా ఉద్యమం ముగియలేదు. ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించి చట్టాన్ని సవరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది.

తాము అడవిని కోల్పోతామని ఆదివాసీలు భయపడుతున్నారు

తమ డిమాండ్ల కోసం నారాయణపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆదివాసీలు చాలా కాలంగా నిరసనలు చేస్తున్నారు. ఇందులో సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు రద్దు, రోడ్డు వెడల్పు ఆపుదల, పెసా చట్టాన్ని మార్చడం వంటివి ప్రధాన డిమాండ్లు. మరోవైపు గ్రామస్తులు నిరంతరం వ్యతిరేకిస్తున్న  ‘క్యాంపు-రోడ్-క్యాంపు’ పథకం కింద బస్తర్‌ను నక్సలిజం నుండి  విముక్తి చేయడానికి,  అన్ని ప్రాంతాలను రోడ్డు మార్గంలో అనుసంధానించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

గత వారం, జన్ చౌక్ నుండి ఇదే విధమైన ఉద్యమాన్ని గురించి రాసినప్పుడు, గ్రామస్తులు “మాకు పెట్టుబడిదారుల కోసం కాకుండా గ్రామస్తుల కోసం ఉద్దేశించిన రహదారి కావాలని అన్నారు. నారాయణపూర్‌లో ఇనుప ఖనిజం సమృద్ధిగా లభిస్తుందని గ్రామస్తుల నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు విస్తరణ జరిగితే పెట్టుబడిదారులు మొత్తం ఖనిజ సంపదను లాగేసుకోవడంతోపాటు అడవిని పూర్తిగా ధ్వంసం చేయడంతోపాటు కాపాడాల్సిన ఆదివాసీ సంస్కృతిని కూడా నాశనం చేస్తారు.

(బస్తర్ నుంచి పూనం మసీహ్ నివేదిక)

Leave a Reply