‘గొందుల్‌పారా’ బొగ్గు ప్రాజెక్టుకు ప్రతిఘటనపై నిజ నిర్ధారణ నివేదిక

భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని 500 హెక్టార్లకు పైగా సారవంతమైన వ్యవసాయ భూములను, అడవులను అదానీ ప్రతిపాదిత ‘గొందుల్‌పారా’ బొగ్గు గని నాశనం చేస్తుందని నిజ-నిర్ధారణ బృందం తెలియజేస్తోంది. ఐదు గ్రామాలపైన తీవ్ర ప్రభావం పడనుంది. 780 కుటుంబాలు నిర్వాసితులవుతారు.

అదానీ బొగ్గు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడినందుకు ప్రభుత్వ అధికారులు తమను హింసించారని గ్రామస్థులు నివేదిక బృందానికి చెప్పారు. నిరసనకారులపట్ల పోలీసులు వివిధ నేరాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు  జీవనోపాధికోసం అందిస్తున్న  ప్రభుత్వ సహాయాన్ని నిలిపివేసారు. అదానీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయవద్దని స్థానిక సహకార సంఘానికి ఆదేశాలు జారీ చేశారు. అయినా నిరసనలు కొనసాగుతూనే వున్నాయి.

నివేదికను రూపొందించిన ఆకాష్ రంజన్, ధీరజ్ కుమార్‌లు జార్ఖండ్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు. ఆహార భద్రతా హక్కుల మెరుగుదలకు కృషి చేస్తున్నారు. 2023 ఏప్రిల్ లో, వారు అదానీ గ్రూప్ ప్రతిపాదిత ‘గొందుల్‌పరా’ బొగ్గు గని వల్ల ముప్పుకులోనవుతున్న   గ్రామాలను సందర్శించారు. (ఈ ప్రాంతంలో వున్న ప్రధాన గ్రామం – గొందల్‌పుర పేరును అదానీ తప్పుగా రాయడం కొనసాగిస్తున్నారని గమనించాలి.) 2020 నవంబర్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు కేటాయించిన ఈ ప్రాజెక్ట్‌ పై స్థానిక ప్రజల దృఢమైన వ్యతిరేకత వెనుకగల కారణాలను అన్వేషించడం నిజ-నిర్ధారణ నివేదిక సారాంశం. మైనింగ్ ప్రాజెక్టు వల్ల 781 కుటుంబాలు నిర్వాసితులవడంతోపాటు ఐదు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

గొందల్‌పుర, గలి, బలోదార్, హహే, ఫూలాంగ్ గ్రామాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం 513 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం సేకరించనున్నారు. ఇందులో, 43.5% రైయ్యాతి భూమి (సాగు చేయడానికి చట్టపరమైన హక్కులు ఉన్న స్వంత భూమి); 42.8% అటవీ భూమి; 13.7% గైర్ మజరువా భూమి – అంటే నీటి సరఫరా, శ్మశాన వాటికలు, దేవాలయాలు మొదలైన ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన సార్వజనిక భూమి.

ఐదు గ్రామాలలో గొందల్‌పురాలో 115, గాలిలో 71, బలోదర్‌లో 37 హెక్టార్ల రాయతీ భూమిని సేకరించనున్నారు. హహే, ఫూలాంగ్ గ్రామాల్లో రాయతీ భూమిని సేకరించరు. మైనింగ్ కారణంగా మొత్తం 781 కుటుంబాలు నిర్వాసితమవుతాయి.

బొగ్గు తవ్వకాల కోసం బహుళ పంటలు పండే భూమిని సేకరిస్తున్నారు. పైన పేర్కొన్న మూడు గ్రామాలకు చెందిన దాదాపు 223 హెక్టార్ల వ్యవసాయ భూమిని మైనింగ్ కోసం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ భూమి అత్యంత సారవంతమైనది, ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ పంటలు పండుతాయి. వరి, గోధుమల, చెరకు, కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేస్తారు. పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నాయి. దాదాపు ఆరు మీటర్ల లోతులో ఇక్కడ నీరు లభ్యమవుతుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఏడాదికి హెక్టారుకు సుమారు 5-6 టన్నుల బియ్యం దిగుబడి ఉంటుంది.

అడవులు నాశనమవుతాయి, ప్రవాహాలు ఎండిపోతాయి. ప్రతిపాదిత బొగ్గు గని చుట్టూ కొండలు, అడవులు, నదులు ఉన్నాయి. దాదాపు 220 హెక్టార్ల అటవీ భూమి ఆనవాలు లేకుండా పోతుంది. మహువా, కేంద్, బేరి, మామిడి, పనస మొదలైన పండ్ల చెట్లు అనేక రకాల ఔషధ మూలికలు, దుంపలు ఈ అడవులలో దొరుకుతాయి.

ఈ అడవులలో అనేక నదుల మూలాలు ఉన్నాయి. గోబర్దహ, గుడ్లగావా నదులకి బలోదర్ గ్రామం, కరీరేఖ నదికి గాలి గ్రామం, గటికొచా నదికి హహే గ్రామం మూలస్థానాలు. ఈ నాలుగు నదులు కలిసి ఏర్పడిన ధోల్కత్వా నది (దిగువ బాద్మహి నది అని కూడా పిలుస్తారు), విశ్రాంపూర్ వద్ద దామోదర్ నదిలో కలుస్తుంది. బొగ్గు తవ్వకం ఈ నదుల మూలాలను నాశనం చేస్తుంది, దిగువ ప్రవాహాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ప్రతిపాదిత లీజు ప్రాంతంలో, నదీ పరివాహక ప్రాంతాలతో పాటు నదీగర్భంలో కూడా గనుల తవ్వకం చేపట్టాలనే ప్రతిపాదన వుంది.

ఏనుగులు, అడవి పందులు, ఎలుగుబంట్లు, నెమళ్లు, కుందేళ్ళు వంటి జంతువులు ఈ అడవిలో నివసిస్తాయి, ఇది ఏనుగు కారిడార్‌లో కూడా భాగమే. ప్రస్తుతం గ్రామస్తులకు, జంతువులకు మధ్య పెద్దగా ఘర్షణలు లేవు. ప్రతిపాదిత బొగ్గు గని ద్వారా అడవిని నాశనం చేయడం వల్ల పెద్ద జంతువులు, స్థానిక మానవుల మధ్య ప్రమాదకరమైన ఘర్షణ వస్తుంది. గని తవ్వకాల వల్ల జీవనోపాధి, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

మైనింగ్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితమయ్యే దాదాపు అన్ని వ్యవసాయాధారిత కుటుంబాలు. అధిక దిగుబడి రావడంతో చాలా కుటుంబాలు బియ్యం అమ్ముకోగలుగుతున్నాయి. ఈ ప్రాంతంలో వరి తర్వాత చెరకు ప్రధాన పంట. చెరకుతో చేసిన బెల్లం ప్రధాన ఆదాయ వనరు.

బలోదర్ గ్రామానికి చెందిన సుమిత్రా దేవి, చెరకు నుండి బెల్లం తయారు చేయడం ద్వారా తన కుటుంబం సంవత్సరానికి 2 లక్షల వరకు (US $2500) సంపాదిస్తున్నదని నిజనిర్ధారణ కమిటీకి తెలిపింది. గ్రామస్తులు చాలా వరకు వ్యవసాయం ద్వారా 2 నుంచి 2.5 లక్షల వరకు సంపాదిస్తున్నారని రైతు వినయ్ కుమార్ తెలిపారు. బలోదర్‌కు చెందిన ఒంటరి మహిళ అయిన సునీతా దేవి గత ఏడాది బెల్లం 20 వేల (US $ 243), వరి 30 వేల (US $ 365), మహువ 10 వేల (US $ 121) 10 వేల (US $ 121) విలువైన ఉల్లిపాయలను అమ్మినట్లు తెలిపారు.

అడవులే జీవనోపాధికి మరో ప్రధాన వనరు. గ్రామస్తులు అడవిలో దొరికే  మహువా, కెందు ఆకులు, టేక్, మొహాలమ్ ఆకులు అమ్ముతారు. దాదాపు అన్ని కుటుంబాలు ప్రతి సంవత్సరం 1.5 టన్నుల మహువా (మద్య పానీయం తయారీకి ఉపయోగించే కండగల తినదగిన పువ్వులు) అమ్ముతాయి. ఆ ప్రాంతంలో ఉద్యోగాల కొరత లేదు. వలసలు తక్కువే. ఈ ప్రాంతంలో ఏడు ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటిలో స్థానిక ప్రజలతో పాటు బయటి వ్యక్తులకు ఉపాధి కల్పిస్తున్నారు.

గ్రామస్తులు మైనింగ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు.

బొగ్గు ప్రాజెక్టుపై సముదాయ సంప్రదింపులకు అవసరమైన గళ్ళపై టిక్ పెట్టించడానికి అదానీ, జిల్లా పరిపాలనలు తరచూ అధికారిక గ్రామ సమావేశాలను (గ్రామ సభ)ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. కానీ గ్రామస్తులు అలాంటి సమావేశాలను రద్దు చేయించడంలో సఫలమయ్యారు. 

మైనింగ్ వల్ల కలిగే సామాజిక ప్రభావ అంచనా (SIA) ను 2021 సెప్టెంబర్-2022 జనవరి కాలంలో  ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ నాబార్డ్ (ఎన్‌ఏబిఏఆర్‌డి) నిర్వహించింది.

ఎస్ఐఏ ఫలితాలను వివరించడానికి గని ప్రభావిత గ్రామం బలోదార్‌లో 2022 జూలై 15 న గ్రామ సభ బహిరంగ విచారణను ఏర్పాటు చేశారు. గ్రామస్తుల భారీ నిరసనల నేపథ్యంలో ఈ సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఇతర ప్రభావిత గ్రామాల్లో ప్రతిపాదిత గ్రామ సభలను డిప్యూటీ కమిషనర్ రద్దు చేశారు.

ఎస్ఐఏ నివేదికను గ్రామసభ ముందు ఉంచాలని 2022 అక్టోబర్ 1న మరోసారి నోటిఫికేషన్ జారీ చేసారు. 2022 అక్టోబర్ 2న గోందల్‌పుర పంచాయతీ అధ్యక్షుడి అధ్వర్యంలో ఐదు ప్రభావిత గ్రామాల గ్రామస్తులు గ్రామ సభ నిర్వహించిన సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు భూమి ఇవ్వకూడదని చేసిన లిఖితపూర్వక తీర్మానాన్ని డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు.

సామాజిక ప్రభావ అంచనా నివేదికలో వాస్తవ సంబంధిత పొరపాట్లు  ఉన్నాయి

2021 సెప్టెంబర్ నుండి 2022 జనవరి వరకు, గనుల తవ్వకాల వల్ల కలిగే సామాజిక ప్రభావ అంచనా (ఎస్ఐఎ) కోసం ప్రభుత్వం నియమించిన ఎన్ఎబిఆర్డి (నేశనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్) కన్సల్టెన్సీ సర్వే నిర్వహించింది. గ్రామస్తులు ఆ సర్వేను వ్యతిరేకించారు. నివేదికలో కనిపించే అనేక “వాస్తవాలు” అబద్ధమని వారు చెబుతున్నారు.

 వీటిలోః

1. ప్రాజెక్ట్ కోసం బహుళ పంటలు పండే వ్యవసాయ భూమిని సేకరించడం లేదని, అలాగని వ్యవసాయ శాఖ సర్టిఫికేట్ ఇచ్చిందని ఎస్‌ఐఏ నివేదికలో చెబుతున్నది పూర్తిగా అబద్ధం; సేకరించబోతున్న  భూమిలో బహుళ పంటలు పండుతాయి. ఏడాది పొడవునా ఇక్కడ వ్యవసాయం సాగుతుంది.

2. భూమికి బదులుగా ఇచ్చిన పరిహారం మొత్తంతో బాధిత కుటుంబాలు సంతృప్తి చెందలేదని నివేదిక పేర్కొంది, కానీ వాస్తవానికి చాలా మంది కౌలు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ తమ భూమిని వదులుకోవడానికే ఇష్టపడడం లేదు.

3. ఎస్‌ఐఏ నివేదిక ప్రకారం, వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్నందున ప్రజలు వ్యవసాయం ద్వారా జీవించడం కష్టం. కానీ వాస్తవం ఏమిటంటే వ్యవసాయాధారిత  అత్యధిక కుటుంబాల జీవన స్థాయి మెరుగ్గా వుంది. ఉత్పాదకత బాగుంది. ప్రతి సంవత్సరం హెక్టారుకు ఐదు టన్నులకు పైగా వరి ఉత్పత్తి అవుతుంది. బెల్లం, కూరగాయలు వంటివి అమ్మకోవడం ద్వారా వారికి అదనపు ఆదాయం వుంటుంది.

4. గ్రామస్తుల ఆరోగ్య స్థితి ఏ మాత్రం బాగాలేదన్నట్లుగా చిత్రీకరించి తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రాంతంలో మలేరియా, రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు సాధారణ సమస్యలేనని ఈ నివేదిక పేర్కొంది. అయితే గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి.

గ్రామీణ వైద్యుడు దీపక్ కుమార్ ప్రకారం గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం వుంది. అంటే, గ్రామ ప్రజలు కాలానుగుణ అనారోగ్యాలు తప్ప ఇతర తీవ్ర రోగాల బారిన పడే పరిస్థితి వుండదు.

5. అదానీ కంపెనీ  ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్, ప్రభుత్వ సముదాయ సహాయ సంస్థలు పనిచేస్తున్నాయి.

6. అదానీ కంపెనీ ఆదేశాల మేరకు పరిపాలన, ఒక ముఖ్యమైన సముదాయ -సహాయక సంస్థ వంటి ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అదానీకి అనుకూలంగా మాట్లాడాలని జిల్లా కమీషనర్‌తోపాటు ఇతర అధికారులు ఒత్తిడి చేస్తున్నారని గొందల్‌పుర పంచాయతీ వార్డు సభ్యురాలు యశోదా దేవి తెలిపారు.

7గ్రామస్తుల ప్రకారం, జార్ఖండ్ స్టేట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (JSLPS), సమూహాలకు  సహాయం అందించే ప్రభుత్వ-యాజమాన్య ఏజెన్సీ (తక్కువ వడ్డీ రుణాలు, స్వయం-సహాయక బృందాల సౌలభ్యం వంటివి) అదానీ బొగ్గు ప్రాజెక్టుకు మద్దతు ఇస్తుంది. దీని వల్ల  పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను జెఎస్‌ఎల్‌పిఎస్‌లో ఉద్యోగం చేశానని, అయితే అదానీ కంపెనీని సమర్ధించకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారని యశోదా దేవి అనే స్థానిక వ్యక్తి తెలిపారు. బొగ్గు ప్రాజెక్టును ఆదుకోవాలని ప్రలోభాలకు గురిచేస్తున్నారని, లేని పక్షంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదానీకి జేఎస్‌ఎల్‌పీఎస్‌ మద్దతు ఇవ్వడంతో గొందల్‌పుర గ్రామంలో ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు.

8. గొందల్‌పుర రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయవద్దని ఒక ముఖ్యమైన వ్యవసాయ సహకార సంఘానికి ఆదేశాలు జారీ చేశారు.

9. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఈ రంగానికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పిస్తుంది. గొందల్‌పుర సమితి సభ్యుడు దేవనాథ్ మహాతో ఈ ఏడాది నీటి కొరత ఉన్నప్పటికీ వరి పంట బాగానే ఉందని చెప్పారు. అయితే, గ్రామస్తులు అదానీ బొగ్గు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి జిల్లా కమిషనర్ ఆదేశాల మేరకు గొందల్‌పుర పిఎసిఎస్ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేయలేదు. అందువల్ల రైతులు వరిని చాలా తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సి వచ్చింది.

10. గ్రామాల్లోకి అదానీ కంపెనీ ఉద్యోగుల ప్రవేశంపై నిషేధం

11. నిరంతర నిరసనలు జరుగుతున్నప్పటికీ కంపెనీ అధికారులు రకరకాల సాకులతో గ్రామాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది అదానీ కంపెనీ చేస్తున్న రెచ్చగొట్టే చర్య అని గ్రామస్తులు అంటున్నారు. ప్రభావిత గ్రామాలన్నింటి వెలుపల కంపెనీ అధికారుల ప్రవేశాన్ని నిషేధిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు అదానీ ఉద్యోగుల ప్రవేశాన్ని కూడా నిషేధించాలని గ్రామస్తులు డిప్యూటీ కమిషనర్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, డీఐజీకి లేఖలు రాశారు.

12. గ్రామస్తుల నిరసనలు, స్థానిక అధికారుల స్పందనలు

13. మైనింగ్ ప్రాజెక్టును వ్యతిరేకించినందుకు 120 మంది పురుషులు, మహిళలపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 107 కింద కేసు నమోదు చేశారు. అనేక మందికి ‘జిలా బదర్ నోటీసు’ (నిర్దిష్ట ప్రదేశంలోకి, అది వారి సాధారణ పని, / లేదా నివాస ప్రాంతం కూడా అయి వుండవచ్చు, ప్రవేశించకుండా నిరోధించే ఆదేశం) జారీ చేసారు.

ప్రతిపాదిత బొగ్గు గని తవ్వకాలపై తమ వ్యతిరేకతను ప్రదర్శించేందుకు, చాలా మంది గ్రామస్తులు 2023 ఏప్రిల్  13  నుండి గ్రామం వెలుపల నిరవధిక ధర్నా (నిరసన దీక్ష)లో కూర్చున్నారు. అదానీని తరిమికొట్టే వరకు సమ్మె కొనసాగుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. తమ భూములకు బదులుగా వారికి పరిహారం లేదా ఉపాధి హామీలు అక్కర్లేదు. భూముల కోసం ప్రాణత్యాగమైనా చేస్తామని అంటున్నారు. చిరు-బార్వాడిహ్ నిరసన (ప్రతిపాదిత ఎన్‌టిపిసి బొగ్గు గనికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు కాల్పులు జరిపి చంపినట్లుగా, అధికారులు కాల్పులు ప్రారంభిస్తే కనక, పిల్లలను రక్షించడానికి గ్రామం వెలుపల ధర్నా చేస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. ప్రతిపాదిత బొగ్గు గని కోసం అడవులు, ప్రభుత్వ భూమిని ఉపయోగించడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.

గ్రామస్తులు తమ కౌలు భూమిని అప్పగించడాన్ని వ్యతిరేకించడమే కాకుండా అటవీ భూములను అటవీయేతర అవసరాలకు ఉపయోగించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు హజారీబాగ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారికి గ్రామస్తులు లేఖ రాశారు. నది, రోడ్లు, రిజర్వాయర్లు, చెరువులు, పాఠశాలలు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలతో సహా ప్రభుత్వ భూములు లేదా సాముదాయిక భూములను అదానీ కంపెనీ స్వాధీనం చేసుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు.

ముగింపు   

అదానీ గ్రూప్ గొందల్‌పుర మైనింగ్ ప్రాజెక్టు వల్ల ఐదు గ్రామాల ప్రజలు, నీరు, అడవులు, భూమి, జంతువులు నాశనం అవుతాయి. ఈ ప్రాంత పర్యావరణం తీవ్రంగా ప్రభావితమవుతుంది. గ్రామాలు నాశనం కావడం మాత్రమే కాదు, దామోదర్ నది ఉపనదిల మూల జలాలు ఎండిపోవడంతో, అనేక పరిసర ప్రాంతాల భూమి కూడా క్షీణించిపోతుంది. ఎట్టి పరిస్థితులలోనైనా గ్రామస్తులు తమ భూమిని అప్పగించడానికి నిరాకరిస్తున్నారు. 2016లో చిరుదిహ్‌లో వేరే కంపెనీ ప్రతిపాదిత బొగ్గు తవ్వకాల నుండి తమ భూములను రక్షించుకుంటున్న గ్రామస్థులపై పోలీసులు కాల్పులు జరిపిన దుర్ఘటనకు దారితీసిన విధంగా బలప్రయోగం ఉపయోగించకుండా, సంయమనంతో వ్యవహరించాలని అధికారులను కోరారు.

https://www.adaniwatch.org/_adani_go_back_fact_finding_report_on_resistance_to_adani_s_gondulpara_coal_project

Leave a Reply