వారం కింద. ఒకరోజు.

 ఉదయం ఇంటర్వెల్‌ అయిపోయింది. అంతా ఎవరి క్లాసులకు వాళ్ళం పోతున్నాం. నేను టెన్త్‌ క్లాస్‌  గదిలోకి వెళ్ళాను. సెంటు వాసన గుప్పు మంటోంది. బోర్డువైపు చూశాను. ఇంగ్లీష్‌ టీచర్‌ ఆరోజు థాట్‌ ఫర్‌ ది డే ఇలా రాశారు.

If  you light a lamp for someone else
It  will also brighten your own path

బోర్డు తుడుస్తూ ఆలోచిస్తున్నాను. ఎకనామిక్స్‌లో కొంచెం కవర్‌ చేద్దామనుకున్నాను. బోర్డువైపు తిరిగి  టాపిక్‌ రాసేంతలో  కిరణ్‌ కంప్లయింట్‌ ‘‘మేడం, మేడం శ్రావణ్‌ సెంటు తెచ్చాడు’’

            కంప్లయిట్స్‌ పర్వం మొదలైౖంది. రఘు కూడా తెచ్చాడు, ఇంకొకడు కూడా.

            అమ్మాయిలు నెయిల్‌ పాలిష్‌లు, లిప్‌స్టిక్‌ తెచ్చారని మొదలు పెట్టారు. మధ్యాహ్నం లంచ్‌ టైంలో మేకప్‌ వేసుకుంటారని చెబుతున్నారు.

‘‘అసలేం తెచ్చారో నేను చూస్తాను, ముందు టేబుల్‌పై పెట్టండి అన్నీ’’ అని గదమాయించాను.

ఇంట్లో వాడిపడేసిన పాత సామాను తెచ్చినట్లు వరుసగా తెచ్చారు. కుప్పపడ్డాయి. ఒకడు షేవింగ్‌ క్రీం తెచ్చాడు. ఏవో రకరకాల జెల్‌ బాటిల్స్‌, సెంటు సీసాలు, నెయిల్‌ పాలిష్‌లు. అన్నీ వాడిపడేసినవి  వీళ్ళ బ్యాగుల్లోకి వచ్చాయి. 

కోపంతో వూగిపోయాను. ‘‘ఎందుకూ రా  ఇవన్నీ క్లాస్‌కు, ఇంకోసారి ఇలాంటివి తెస్తే ఏం చేస్తానో నాకు తెలియదు.  ప్రాజెక్ట్‌ వర్క్‌ ఇస్తున్నా. వచ్చే సోమవారం అందరూ సబ్మిట్‌ చేయాలి. లేకుంటే  ఒక నెల ఆబ్సెంట్‌ వేస్తాను. అదే మీకు పనిష్మెంట్‌’’ అన్నాను.

                           

ఇదుగో..  ఆ పనిష్‌మెంటుకు ఫలితమే ఈ ప్రాజెక్ట్‌ వర్క్‌. అందంగా ముస్తాబు చేశారు. లాంగ్‌సైజ్‌ నోట్‌ బుక్స్‌లో బొమ్మలు అంటించారు. కింద వివరాలు రాశారు. చూసిరమ్మంటే కాల్చివచ్చారు ఈ పిడుగులు అనుకుంటూ, ఒక్కోనోట్‌బుక్‌ తిప్పుతూ ఉన్నాను. బాగా కుదిరింది వెధవలకు. లేకుంటే క్లాస్‌రూం కాస్మటిక్స్‌ షాపుగా మారుస్తారా? అని అనుకుంటున్నాను.

            నా టేబుల్‌పై నలబై ఐడు పుస్తకాలు.

ఇంతూ వారం కింద వాళ్లకు ఇచ్చిన  పనిష్‌మెంటు ఏమంటే`  మీ ఇళ్ళకు దగ్గరగా షాపింగ్‌ మాల్స్‌కు వెళ్ళి వస్తువులు ఏమేమి అమ్ముతున్నారో వాటి ధరలు, కంపెనీ పేరు, ఎక్స్‌పైరీ తేదీ లాంటివి రాసుకరమ్మన్నాను.

            ఇంకేం.. వరుసగా స్నానపు సబ్బులు, బట్టలుతికే సబ్బులు, డిటెర్జంట్‌ పౌడర్లు, వాష్‌రూం క్లీనింగ్‌ లిక్విడ్స్‌, పౌడర్లు, మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌లు,  బ్యూటీ క్రీమ్‌లు, ఐస్‌ క్రీమ్‌లు, చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్‌లు, ఒక్కటా? రెండా? అబ్బో లిస్ట్‌ చాంతాడంత.  బియ్యం, బాళ్ళు, వంట నూనెలు లాంటివి కూడా ఉన్నాయి.

            చివరిలో  మీ అభిప్రాయాలు రాయాలి అన్నాను.

            చాలా రాశారు.

వారం లోపల ఎంత పెద్ద పని చేశారు? అవి చదువుతుంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. 

వాళ్ళ ఇళ్ళల్లో ఏమేమి వాడుతున్నారో వాటి గురించీ రాశారు. ఇవి చూచేసి ఈ రోజు కొత్త పాఠం ఆరంభిద్దామనుకున్నాను. ఏ పాఠాన్నయినా పుస్తకంలో ఉన్న చోట మొదలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నా ఆరంభాన్నిబట్టి నేను సిలబస్‌లో ఏది చెబుతున్నానో కాసేపు పిల్లలు గుర్తుపట్టలేరు. ఈ రోజు చెప్పాలనుకున్న ఎకనమిక్స్‌ పాఠం ఎక్కడ మొదలు పెట్టాలి? అనుకుంటూ  కవిత అనే అమ్మాయి ప్రాజెక్ట్‌ వర్క్‌ తీసుకున్నాను.

అది కాస్త వెరయిటీగా ఉంది.

‘‘మా అక్క ఇంటర్‌ సెకెండియర్‌  చదువుతోంది. జుట్టు బాగా వత్తుగా పొడవుగా వుంటుంది. అమ్మ రకరకాల ఆయిల్స్‌ మా జుట్టుకు పెడుతూ ఉంటుంది. ఐ.ఐ.టీ. కోచింగ్‌ క్లాస్‌లో ఉంది. ఎప్పుడూ చిటపటలాడుతూ వుంటుంది. అమ్మ, నాన్నలు చెప్పేది అస్సలు వినదు. మా ఇంట్లో నాలుగు రకాల తల నూనెలున్నాయి.

ఒకరోజు అక్క మొండికేసింది.

డాడీ ఈరోజు నాకు గుండు చేయించండి. హాయిగా ఉంటుంది. మీరు కూడా తోడు రండి ఇద్దరం చేయించుకుందాం అని అడిగితే, డాడి  తప్పించుకున్నాడు. 

నాకుండేది నాలుగు వెంట్రుకలే.  జాగ్రత్తగా కాపాడుకుంటున్నా పోరా.  మీ అమ్మను చేయించుకోమని చెప్పు అన్నాడు డాడి.

అమ్మ గుండెల్లో రాయిపడిరది. అసలే  ఎన్నెన్నో రకాల షాంపులు  వాడుతుందా జుట్టు కోసం.

అందుకే అమ్మ ఏందంటే ‘అందరూ జుట్టు కావాల్లంటే నీవేందో  పిచ్చి మొహమా గుండు చేసుకుంటానంటావ్‌’ అన్నది.  అక్క వింటేనా. నేను రేజర్ల గురించి తెలుసుకుంటున్నాను. అప్పుడు అక్క అక్కడికి వచ్చి నన్ను అడిగింది. ‘కవితా గుండు చేయించుకుందాం నాకు తోడురావే’ అని. అమ్మ బాబోయ్‌! నాకు జుట్టు అంటే ఎంత ప్రేమో. ‘ఊహూ నాకొద్దు నేను రాను’ అన్నాను.

 ఆరోజు ఆదివారం. అక్క ఎవరికీ చెప్పకుండా స్కూటీ ఎక్కి మంగలిషాపుకు పోయి గుండు చేయించుకొని ఇంటికొచ్చింది. అమ్మకు ఆశ్చర్యంతోపాటు కోపం వచ్చింది. గుండులోని ఆనందం అహా! ఓహో! అంటూ అక్క చిందులేస్తోంది.

అక్కకు ఇదెలా సాధ్యమైంది?  నాకు జుట్టు ఇష్టం. జుట్టు కోసం పాపం అమ్మ చేసే రకరకాల పనులు కష్టమైనా ఇష్టంగా భరిస్తాను. అట్లాంటిది అక్క గుండు ఎలా చేయించుకుంది?

 డాడీ అప్పుడే కాలేజీ నుండి  ఇంటి కొచ్చాడు.  అక్కను చూసి మెచ్చుకున్నాడు. 

‘అమ్మడు ఈ నెల మూడు వేలు రూపాయలు  మిగిల్చింది..’ అన్నాడు.

నాన్న అట్లా అనడం నాకు ఆశ్చర్యం వేసింది. కానీ ఆ మాటలో చాలా ప్రశ్నలు తలెత్తాయి. అక్క మూడు వేలు మిగిల్చిందా? కానీ కొన్ని  అర్థం కావటంలేదు. నాన్న మాటతో నాకు చాలా ఐడియాస్‌ వచ్చాయి. అసలు మా ఇంట్లో తిండికి అయ్యే ఖర్చు ఎంత? ఇలాంటి వాటికి అయ్యే ఖర్చులు ఎంత? ఇవన్నీ ఎలా మాకు ఇష్టమైనవి అయ్యాయి? ఎవరు ఇష్టమైన వస్తువులుగా వీటిని మార్చేశారు? అనే ఆలోచన వచ్చింది. మా ఇంటి సంగతి స్టడీ  చేయాలనుకున్నాను’’ అని రాసి వాళ్లింట్లో ఎన్ని రకాల వస్తువులు  వాడుతున్నారో వివరంగా లిస్టవుట్‌ చేసింది కవిత.

హిమనీష్‌ ప్రాజెక్ట్‌ కాస్త వెరయిటీగా ఉంది. వాడు బ్యూటీ ప్రాడక్ట్స్‌ తీసుకున్నాడు. ఎన్ని కంపెనీలో.  పెద్దలిస్ట్‌  ` బాబా రామ్‌దేవ్‌, హిమాలయ, గోద్రెజ్‌ ఇంకా ఎన్నో కంపెనీలు ఫెయిర్‌ Ê లవ్‌లీ పై కాస్త విశ్లేషణ రాశాడు.

చివర్లో `

‘‘ఇది మా బాబాయి ఫోటో, మా డాడీ, మమ్మీ, మా అక్క, ఇది మా తాతయ్య ఫోటో అంటూ కుటుంబ సభ్యుల ఫోటోలు జతపరిచాడు. మా తాతయ్యకు చిన్నప్పటి నుండి వాళ్లమ్మ ఏవేవో పొడులు వాడేదట. తెల్లబడాలని.  

మా తాతయ్యకిప్పుడు 70 ఏండ్లు. ఆయన చిన్నప్పుడు నల్లగా ఉండేవాడంట.

అందరూ నల్లోడు, నల్లోడు అని వెక్కిరించేవారంట.

ఆయనకు ఉద్యోగంలో చేరాక ఫెయిర్‌ Ê లవ్‌లీ వచ్చాక దాన్ని  మొదలుపెట్టాడట.  కానీ ఆయన కలర్‌లో ఏ మార్పూ లేదు.

ఎంత  ఖర్చుపెట్టాడో.  ఆయన కలర్‌ మారాలని.  కానీ ఏం లాభం. మా తాతయ్య ఎంత మంచివాడో. అందరికీ సహాయం చేస్తాడు. బాబాయి కూడా మూడుపూట్ల అవే క్రీంలు రాస్తుంటాడు. ఏమీ మారలేదు.

 తాత ఫోటో పక్కన ఫెయిర్‌ Ê లవ్లీ అడ్వర్‌టైజ్‌మెంట్‌ కటింగ్‌ పేస్ట్‌ చేసాడు.

అసలు మా తాత చిరునవ్వులో ఎంతో అందముంది.

ఆయన మంచిమనసులో ఎంతో అందముంది.

మాపై ఆయన చూపించే ప్రేమలో ఎంతో అందముంది..’’ అని రాశాడు హిమనీష్‌.

ఎంత చక్కగా రాశాడు అని ఆశ్చర్యపోయాను. మనసులోనే అభినందించాను.

ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రాజెక్టు వర్క్‌ తయారు చేశారు.

ఇంకోడు కెల్లాగ్‌ చికెన్‌లాంటి వస్తువులతోపాటు ఇంకా రకరకాల  రెడీమేడ్‌ మిక్స్‌ల గురించి వాటి ధరలు, కంపెనీల పేర్లు రాశాడు. తనకు  దోసె, చికెన్‌ ఇష్టమని రాశాడు.  నూడుల్స్‌ అంటే చాలా ఇష్టం. కానీ మా అమ్మ అరిచి గోలపెట్టినా చేయదు అని వాడి బాధ చెప్పుకున్నాడు.

ఇంకొక అమ్మాయి వర్ష. వాళ్ళ ఇంట్లోని డ్రెస్సింగ్‌ టేబుల్‌ మీద ఏముండేది  మొదలు పెట్టి   ఇంట్లో వస్తువులన్నీ లిస్టవుట్‌ చేసింది. దాదాపు 20 వస్తువుల లిస్ట్‌. ధరల కంపెనీలు. మొత్తం నెలకు అయ్యే ఖర్చు లెక్కలు వేసి రాశారు.

అబ్బా చివరికి బడ్జెట్‌లోకి కూడా పోయారు..అని మురిసిపోయాను.

ఇంకొకడు ఇవన్నీ రాస్తూ వాళ్ళింట్లో   పాండ్స్‌ పౌడర్‌, ఫెయిర్‌ Ê లవ్లీ తప్ప ఇంకేమీ లేవని రాశాడు. 

షాపుకెళ్ళి సేకరించిన లిస్ట్‌ తయారు చేశాడు.

ఇదంతా చూశాక నాకు అనిపించింది. ఎందుకైనా మంచిది .. వీళ్లు వీటిని వస్తువులు అని రాశారు. సరుకులు అని మొదలు పెడదాం.. ఈ రోజుకు మంచి ఇంట్రడక్షన్‌ ఇచ్చినట్లవుతుందని వాళ్ల ముఖాల్లోకి చూశాను.

తమ  ప్రాజెక్ట్‌ వర్క్‌ గురించి ఏమంటానో అని ఆసక్తిగా, గుసగుసలాడుకుంటూ నా వంకే చూస్తున్నారు. అప్పుడు వాళ్ల కళ్లలో ఎన్ని అందాలో, ఎన్ని వెలుగులో.

Leave a Reply