స్వీడన్(గోథెన్బర్గ్) ఆధారిత వి-డెమ్ ఇన్స్టిట్యూట్ ‘డెమోక్రసీ రిపోర్ట్ 2024’ ని మార్చి 7న విడుదల చేసింది. ప్రజాస్వామ్య నివేదిక 2024 ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రతిభావంతుల సహకారంపై ఆధారపడిరది. 1789 నుండి 2023 వరకు 202 దేశాలకు సంబంధించిన 31 మిలియన్ డేటాసెట్లను ఉపయోగించుకుంది. వి-డెమ్ ఇన్స్టిట్యూట్ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది. అవి: లిబరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ ఆటోక్రసీ, క్లోజ్డ్ ఆటోక్రసీ. 2023 నాటికి, ప్రపంచ జనాభాలో 71 శాతం (5.7 బిలియన్ల ప్రజలు) నిరంకుశ పాలనలో నివసిస్తున్నారు. ఇది దశాబ్దం క్రితం ఉన్న 48 శాతం కంటే గణనీయమైన పెరుగుదల. ప్రపంచ జనాభాలో 5 శాతం మందిని ప్రభావితం చేస్తున్న 18 దేశాలలో మాత్రమే ప్రజాస్వామ్యీకరణ జరుగుతోంది. నివేదిక సారాంశంలో భారతదేశం ప్రజాస్వామ్య వెనుకబాటుతనానికి సంబంధించిన ధోరణిని నొక్కి చెబుతుంది, ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపొందించడంలో రాబోయే ఎన్నికలు పాలన కీలక పాత్రను హైలైట్ చేయనున్నాయి.
భారత్‌లో ప్రజాస్వామ్యం అనేది లేదని, అక్కడ నియంతృత్వం ప్రబలిందని ‘వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ’ (వి-డెమ్) సంస్థ తేల్చి చెప్పింది. ఈ సంస్థ 179 దేశాలలో ప్రజాస్వామ్యం తీరుతెన్నులను పరిశీలించి మన దేశానికి 104వ ర్యాంక్ ఇచ్చింది. నైగర్, ఐవరీ కోస్ట్ దేశాల మధ్య భారత్‌కు స్థానం కల్పించింది. ప్రపంచంలో నియంతతృత్వ పాలన అధికంగా కొనసాగుతున్న పది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉన్నదని స్పష్టం చేసింది. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పటికీ నియంతృత్వ పాలన నడుస్తోందని, అక్కడి రాజ్యాంగ సంస్థలు పాలకుల కనుసన్నల్లో పనిచేస్తున్నాయని తెలిపింది. 2018లో ప్రారంభమైన ఈ తరహా పరిపాలన 2023లో తారా స్థాయికి చేరిందని ఎత్తిచూపింది. వాస్తవానికి 2014 నుండే ఈ పోకడలు కన్పిస్తున్నాయని తెలియజేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల అధికారం అని అర్థం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆచరిస్తున్న ప్రభుత్వ ఏర్పాటు విధానమే ప్రజాస్వామ్యంగా గుర్తిస్తున్నారు, భావిస్తున్నారు. అందరూ సమానం, అందరికి స్వాతంత్య్రం, ప్రజలందరిలో సహోదరత్వం అనేది ప్రజాస్వామ్యంలో మౌలిక నియమాలు లేదా విలువలు. రాజకీయ కోణంలో ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, ఆర్థిక కోణంలో చూస్తే దోపిడీ, పీడనలను నిరోధించడం, సామాజికంగా వ్యక్తుల మధ్య కులం, వర్ణం, జెండర్, పుట్టుక, మతం, భాష లాంటి ప్రాతిపదికపై అన్ని వివక్షలను నిర్మూలించడం. ఎలక్టోరల్ ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో ప్రజలు తమ పాలకులను ఓటు వేయడం ద్వారా ఎన్నుకునే ప్రభుత్వ వ్యవస్థ అని అర్థం. భారత్ మోడీ పాలనలో ఎలక్టోరల్ డెమోక్రసీ నుంచి ఎలక్టోరల్ అటోక్రసిగా మారిందని వి-డెమ్ నివేదిక పేర్కొంది. ఎన్నికల నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్య సంస్థలు అధికార వర్గానికి జేబు సంస్థలుగా ఉంటాయి. ఈ రకమైన పాలనలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సహోదరత్వం, లౌకికత, సామాజిక న్యాయం హరించబడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలంటే ఓటర్లు మాత్రమే, పౌరులు ఏమాత్రం కారు. ఇప్పుడు భారత్ ఎన్నికల నిరంకుశత్వం నుండి అతి నిరంకుశ దేశంగా మారిందని వి-డెమ్ పేర్కొంది.
భారత్‌లో ‘‘10 సంవత్సరాలుగా, భావప్రకటనా స్వేచ్ఛ క్రమంగా గణనీయంగా క్షీణించడం, మీడియా స్వాతంత్య్రంపై రాజీ పడడం, సోషల్ మీడియాపై అణిచివేతలు, ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై వేధింపులు, అలాగే పౌర సమాజంపై దాడులు వంటి వాటితో సహా భారతదేశం నిరంకుశీకరణ ప్రక్రియ చక్కగా నమోదు చేయబడిరది. ప్రతిపక్షాల బెదిరింపు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని పాలక బహుళవాద వ్యతిరేక, హిందూ-జాతీయవాద భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఉదాహరణకు విమర్శకుల నోరు మూయించడానికి దేశద్రోహం, పరువు నష్టం, తీవ్రవాద వ్యతిరేక చట్టాలను ఉపయోగించింది. 2019లో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టాన్ని (యుఎపిఎ) సవరించడం ద్వారా బిజెపి ప్రభుత్వం లౌకికవాదానికి రాజ్యాంగ నిబద్ధతను దెబ్బతీసింది. ‘‘మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీల మతపరమైన హక్కులను అణచివేస్తూనే ఉంది. రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వ విధానాలను నిరసించే వ్యక్తులను బెదిరించడం, అలాగే విద్యారంగంలో అసమ్మతిని నిశ్శబ్దం చేయడం ఇప్పుడు ప్రబలంగా ఉంది.
1975 జూన్ 25 భారతదేశానికి చీకటి రోజు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కింది. దేశంలోని ప్రతిపక్ష నాయకులను, ప్రజాసంఘాల నాయకులను, హక్కుల సంఘాల నాయకులతో సహా లక్ష మందిని జైళ్ళలో పెట్టడమే కాక సార్వత్రిక ఎన్నికలు వాయిదా వేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చట్టాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం జరిగింది. 1971లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆమె అవకతవకలకు పాల్పడినట్లు మోపబడిన ఆరోపణలపై విచారణ జరిపిన అలహాబాద్ కోర్టు ఆమెని దోషిగా నిర్ధారించి పార్లమెంటుకు అనర్హురాలుగా ప్రకటించడమే కాక 6 సంవత్సరాల పాటు ఏ పదవికి పోటీ చేయడానికి అర్హురాలికాదని తీర్పునివ్వడం కారణంగానే ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
దీంతో రాజ్యం నిరంకుశంగా మారింది. ఆనాడు 1975లో దేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు అదే స్థాయికి దిగజారిందని వి-డెమ్ పేర్కొంది. ఇకపై భారత్‌ను ప్రజాస్వామిక దేశం అని ఎంత మాత్రం పిలవలేం. ప్రపంచంలో 42 దేశాల్లో నియంతృత్వ పాలన కొనసాగుతోంది. అందులో భారత్ కూడ ఉంది. ఆయా దేశాల్లో 2.8 బిలియన్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో 35 శాతం మంది ప్రజలు అణచివేతకు గురవుతున్నారు. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 18 శాతం. నియంతృత్వ దేశాల్లో నివసిస్తున్న జనాభాలో సగం మంది మన దేశంలోనే ఉన్నారు.
అన్ని సూచికలూ అంతే:
ఇక ప్రజలు, మైనారిటీల హక్కుల పరిరక్షణ విషయంలో భారత్ స్థానం 92. ఇక్కడ కూడా మన స్కోరు ఘోరంగానే ఉంది. ప్రభుత్వ, మెజారిటీ ప్రజల దౌర్జన్యాల నడుమ మైనారిటీల హక్కులు మంటగలుస్తున్నాయి. దేశ రాజకీయ రంగంలో అన్ని సామాజిక గ్రూపులకు సమాన హక్కులు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. ఈ విషయంలో మన స్థానం 137. అట్టడుగున ఉన్న 45 దేశాల్లో భారత్ కూడా ఉంది. రాజకీయ ప్రక్రియల్లో పౌరులందరూ క్రియాశీలకంగా పనిచేస్తున్న దాఖలాలు కూడా కన్పించడం లేదు. ఈ సూచికలో భారత్ స్థానం 103. ఇది క్రమేపీ పడిపోతుండడం గమనార్హం. ఏ ప్రజాస్వామిక వ్యవస్థలో అయినా సంప్రదింపుల ప్రక్రియకు ప్రాధాన్యత ఉంటుంది. సంప్రదింపుల్లో ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో భారత్ ర్యాంక్ 101. మన దేశంలో ప్రభుత్వం సంప్రదింపులకు తావు లేకుండా చేసింది. అన్ని వ్యవహరాలు పాలకుల అభీష్టం మేరకే జరిగిపోతున్నాయి. అందుకే సూచికలో మన స్థానం దిగజారిపోయింది. మనదేశంతో పాటు ప్రపంచంలో దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాల్లోనే ఎక్కువగా నియంతృత్వ పాలనలు నడుస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కజక్‌స్థాన్, ఆఫ్ఘానిస్తాన్, తుర్క్మెనిస్థాన్ ఉజ్బెకిస్థాన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది నియంతృత్వ పాలన కింద నలిగిపోతున్నారు.
పడిపోతున్న ప్రజాస్వామిక సూచిక:
దక్షిణాసియాలో సగటు జీవుల ఉదార ప్రజాస్వామ్య స్థాయి 1975 నాటి స్థాయికి పడిపోయింది. అది వియత్నాం యుద్ధం ముగిసిన కాలం. భారత్‌లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రస్తుతం ఉదార ప్రజాస్వామ్య సూచికలో భారత్ స్థానం 104. దాని స్కోరు 0.28. ఎన్నికైన ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించిన ప్రజాస్వామ్య సూచికలో భారత్ ర్యాంక్ 110. ఈ విషయంలో దాని స్కోరు దారుణంగా ఉంది. దేశంలో స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ కనుమరుగవుతోంది. ప్రపంచంలో భారత్ సహా 18 దేశాల్లో ఈ పరిస్థితి కన్పిస్తోంది. ఈయూ సభ్య దేశమైన హంగరీ, ఫిలిప్పైన్స్‌లోనూ ఇదే పరిస్థితి. 2008 నుంచి భారత్‌లో నియంతృత్వ పోకడలు కన్పించడం మొదలైంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు క్రమేపీ విఘాతం ఏర్పడిరది. స్వతంత్ర మీడియా, సామాజిక మాధ్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. పౌర సమాజంపై కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని హిందూ జాతీయతావాద బిజెపి ప్రభుత్వం విమర్శకుల నోరు మూయించేందుకు వారిపై రాజద్రోహం, తీవ్రవాదం వంటి కేసులు పెడుతోంది. పరువునష్టం దావాలు వేస్తోంది. 2019లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (ఉపా) సవరించడం ద్వారా లౌకికవాదానికి కట్టుబడిన రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తోంది.
దేశంలో ఫాసిజం :
భారతదేశంలో ఫాసిజం తనను తాను పునర్నిర్మించుకుంటుంది. హిందూత్వం అనేది జాతీయవాదం జాతి రూపం. ఇది హిందూ జాతీయవాదం – హిందుత్వం ద్వారా ప్రవేశించింది. భారతీయ జనతా పార్టీ(బిజెపి) వంటి అతి మితవాదం ఆర్ఎస్ఎస్ గ్రూపులు ఆధ్వర్యంలో భారతదేశంలో ఫాసిజం వ్యక్తమవుతోంది. మనువాద బ్రాహ్మణీయ ఫాసిస్టు శక్తులు ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తోన్నాయి. అటువంటి దృగ్విషయాన్ని తప్పుగా నిర్వచించడం ఫాసిజం, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఖచ్చితమైన లేబులింగ్ లేకుండా, ఫాసిజానికి వ్యతిరేకంగా ఎప్పటికీ సమర్థవంతమైన ప్రతి వ్యూహాన్ని అభివృద్ధి చేయలేం.
1925 నుండి, మితవాద హిందూ జాతీయవాద పారామిలిటరీ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్) దాని అత్యంత దృఢమైన ప్రతిపాదకుడు. ఆర్ఎస్ఎస్ పూర్తిగా కుడి-కుడి, క్రమానుగత, నిరంకుశత్వం, హిందూ ఆధిపత్యం ఆవరణలో స్థాపించపబడిరది. హిందూ జాతీయవాదం హిందీ భాష, హిందూ మతం, హిందూ పురాణాలు, దేశం పట్ల ప్రశ్నించని విధేయతను విధించడం ద్వారా ఏకరూపతను కోరుకుంటుంది. వివిధ స్థాయిలలో, ఇది భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ప్రయత్నిస్తుంది, రాజకీయ చర్చల నుండి మతపరమైన బహుళత్వం, లౌకికవాదాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తోంది. ఆర్ఎస్ఎస్లో క్రియాశీల సభ్యుడు, ప్రస్తుత రైట్‌వింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గోద్రా అనంతర అల్లర్లలో తన భాగస్వామ్యానికి అపఖ్యాతి పాలయ్యారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే ఆర్ఎస్ఎస్ హిందూత్వ మిషన్‌ను మోడీ ఆధ్వర్యంలో భారత్ నెరవేరుస్తోంది. ఒకప్పుడు లౌకిక రాజ్యంగా ఉన్న భారతదేశం, హిందూత్వ అనధికారిక భావజాలంతో ఎన్నికల నిరంకుశంగా మారింది.
అపరిమిత ఆంక్షలు :
దేశంలో మత స్వేచ్ఛ కనుమరుగైంది. మోడీ ప్రభుత్వం మత స్వేచ్ఛ హక్కుల్ని అణచివేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని భయపెడుతోంది. విద్యారంగంలో సైతం అసమ్మతి నోటికి తాళం వేస్తోంది. స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరగడంలో, ప్రజలకు సకాలంలో సమాచారాన్ని చేరవేయడంలో, పౌర సమాజానికి అండదండలు అందించడంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్న మీడియాపై కూడా ప్రభుత్వం కక్ష కట్టింది. మీడియాపై ఆంక్షలు విధించడంలో ఎల్ సాల్వెడార్, భారత్, మారిషస్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోంది. ప్రపంచంలో ఇంటర్నెట్ సౌకర్యాలను నిలిపివేస్తున్న దేశాల్లో భారత్ ముందుంది. సామాజిక మాధ్యమాలపై కూడా ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. రైతుల నిరసనలు, చలో ఢల్లీి కార్యక్రమాలపై సోషల్ మీడియాలో వార్తలు రాకుండా ఆంక్షలు విధించిందని వి-డెమ్ నివేదిక వేలెత్తి చూపింది. ఎన్నికల ప్రజాస్వామ్యంగా ఉన్న భారతదేశం 2014 తర్వాత ఎన్నికల నిరంకుశత్వంగా మారిందని వి-డెమ్ నివేదిక సోదాహరణంగా విశ్లేషించింది.