దేశంలో దండకారణ్యం వంటి విశాలమైన ఆదివాసీ ఆవాస భూగోళంలో, జనతన రాజ్యం వంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ దశాబ్దాలుగా పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అక్షరాలా సాయుధ వర్గ యుద్ధంలో అప్రతిహతంగా పోరాడుతూ ఎన్కౌంటర్లు మొదలు కేంద్ర ప్రభుత్వ వాయు సైన్య ఆకాశ బాంబింగ్‌కు కూడ గురవుతున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్, రaార్ఖండ్ రాష్ట్రాలు మొదలు దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సమాజాలు జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ (ఆదివాసి స్త్రీలపై లైంగిక అత్యాచారాలకు ప్రతిఘటన మాత్రమే కాదు, ఇంకా విస్తృతార్థంలో అస్తిత్వ స్వీయ గౌరవ చైతన్యం)లను కాపాడుకోవడానికి నూతన పోరాట రూపాలు ఎంచుకుంటున్నారు. అటువంటి సాంస్కృతిక వ్యక్తీకరణ రూపాలను ఇటీవల విజయవాడలో జరిగిన విరసం మహాసభల (2024 జనవరి 27, 28 ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం) కు బస్తర్ నుంచి వచ్చిన సాంస్కృతిక కళా బృందాలే దృష్టాంతం. అంత మాత్రమే కాదు. ఆదివాసేతర ప్రజస్వామిక శక్తులు, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఎదుర్కొంటున్న విశాల సామాజిక సమూహాలు, ముఖ్యంగా యువతరం ఆ ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల ఆసక్తితో, కుతూహలంతో, జిజ్ఞాసతో చూస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసుకునే క్రమంలో ఎంతో వినూత్నమైన సృజనాత్మక ప్రయోగాలు చేస్తున్నారు. అటువంటి కృషి ఢల్లీి నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటకల వరకు కూడ ఎట్లా జరుగుతున్నదో కూడ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక సాంస్కృతిక ప్రదర్శనల్లో విరసం వేదిక మీద చూసాం. ఇట్లా మన కళ్ల ముందు జరిగిన వాటినే మనం దృశ్యాలుగా చూసినపుడు ఒక కథ ఆధారంగా విరసం సాంస్కృతిక బృందం ప్రదర్శించిన ‘నీడలు’ నాటిక కూడ ఒక విస్తృతార్థంగల ప్రయోగంగా కనిపిస్తుంది.
ఎక్కడా ఒక భౌతిక పోరాట ప్రేరణ లేకుండా ఇంత భావజాలం కొత్త పోరాట శక్తులకు, రూపాలకు నిర్మాణాలివ్వజాలదు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాల వ్యతిరేక కిసాన్ ఆందోళనకు, ఇప్పటి కిసాన్ ఆందోళనకు కూడ గుణాత్మకంగా గల ఆ తేడాను చూడవచ్చు.
ఒకప్పుడు విప్లవ ప్రజా సంఘాలు, నిర్దిష్టంగా ఎఐపిఆర్ఎఫ్ (1992`2004) పెట్టిన డిమాండ్, ఎంచుకొన్న పోరాటం ‘ప్రపంచ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఓ) నుంచి భారత ప్రభుత్వం బయటికి రావాలి అని కోరుకునే సామ్రాజ్యవాద వ్యతిరేక డిమాండ్ ఈసారి కిసాన్ ఆందోళన చేపట్టింది.
నిన్నటిదా కొన్ని ప్రతీకలకు, సంకేతాలకు, నిర్మాణాలకు, వ్యవస్థలకు వ్యతిరేకంగా వచ్చిన నినాదాలు, డిమాండ్లు ఇప్పుడు సారభూతమైన పోరాట రూపాలు తీసుకుంటున్నాయి.
ఇందుకు మనకు లిట్మస్ పరీక్షలు చాలు. వీటి పట్ల ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది. కొండకచో ‘ఉదార’ ప్రజాస్వామ్య వాదులనుకునేవారు ఎట్లా స్పందిస్తారు? గత కిసాన్ ఆందోళనకన్నా ముందే ప్రారంభమై ఇంకా కొనసాగుతున్న సిలింగేర్ ఆదివాసీ ప్రజల సడక్ రోకో, ఠానా రోకో, కంపెనీ రోకో పోరాటం హస్దేవ్ అడవులదాకా విస్తరించి, బస్తర్ పరివ్యాప్తమై పోరాట శక్తులనందరినీ ఆకర్షిస్తున్నా మీడియా మౌనం వహించింది. ఒకరిద్దరి మినహాయింపులతో ఉదార ప్రజాస్వమ్య వాదులు, సంస్థలు మౌనం వహించాయి.
గతంలో కిసాన్ ఆందోళన ఈ మూడు చట్టాలు రావడం వెనుక ఆదానీ, అంబానీ ప్రయోజనాలు ఉన్నాయని వాళ్ల కంపెనీలకు వ్యతిరేకంగానూ, వాళ్లకు వ్యతిరేకంగానూ ప్రదర్శనలు, పోస్టర్లు వేసినపుడు రిపోర్టు చేసిన మీడియా కూడ డబ్ల్యు.టి.ఓ. నుంచి బయటికి రావాలనే విషయాన్ని ఫోకస్ చేయకపోవడమే కాకుండా, రైతుల డిమాండ్లను అమోదిస్తే రైతులకే నష్టం అని పుంఖాను పుంఖంగా రచనలు చేయిస్తున్నది. ఈసారి కిసాన్ ఆందోళన్ నాయకత్వమే జాతి వ్యతిరేక వాదుల చేతుల్లోకి పోతున్నది అంటున్నారు. ఇంక ఇపుడు దేశ సరిహద్దుల పంజాబ్‌లోని వాఘా దగ్గరి నుంచి పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు , ఢిల్లీకి కుదించబడినాయి. దండకారణ్యంలో ఎన్కౌంటర్ లైతే, ఆకాశ బాంబులయితే, ఇక్కడ టియర్ గ్యాస్‌లు, పెల్లెట్లు, పోలీసుల కాల్పులు అప్పుడే ఐదుగురి ప్రాణాలు బలిగొన్నాయి. 1985 సెప్టెంబర్ 3న డాక్టర్ రామనాథం గారిని పోలీసులు హత్యచేసినపుడు ఢల్లీిలో పియుడిఆర్ సంస్మరణ సభ నిర్వహిస్తే గద్దర్ హక్కుల కార్యకర్తలకు రైతాంగ హక్కులకు ఉన్న గతితార్కిక చారిత్రక సంబంధాన్ని సృజనాత్మకంగా కళాత్మకంగా వివరిస్తూ దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకురో, మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో బెటిండ్రో అంటూ హక్కులు అడిగిన డాక్టర్ గారిని కాల్చిచంపనెవ్వడోరన్నా అని రాసాడు. ఇప్పుడిది రైతుల దారుల్లో మేకులు నాటడం, బ్యారికేడ్లు, గోడలు కట్టడం, ఆకాశం నుంచి కశ్మీర్లో వలె పెల్లెట్లతో, టియర్ గ్యాస్‌తో కకావికలు చేసే దశకు చేరుకున్నది.
కిసాన్ ఆందోళన గురించి వసంతమేఘం మార్చ్ సంచిక ప్రత్యేక వ్యాసాలు ప్రచురించింది గనుక ఆ వివరాల్లోకి పోవడం లేదు కానీ కార్పొరేటీకరణ అందుకోసం సైనికీకరణ, ద్రవ్య పెట్టుబడి నేరుగా సామ్రాజ్యవాద దళారుల ద్వారా మధ్య భారతంలో ప్రవేశిస్తున్నపుడు అంతర్జాతీయంగానూ, దేశంలోనూ తీవ్ర ఆందోళన, ఉద్యమాలు పెల్లుబుకుతున్నపుడు రాజ్యం ఒకవైపు నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తూ, కొత్త కొత్త అప్రజాస్వామిక చట్టాలు తెస్తూ, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు మావోయిస్టు పోరాటం ఉన్న రాష్ట్రాల్లో అడవిని ఆక్రమించుకోవడానికి 2023లో తెచ్చిన చట్టాలవంటివి తెస్తూ, ప్రజల మధ్య, జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మణిపూర్ వంటి ఆత్మహత్య సదృశ్యమైన ప్రయోగాలు చేస్తూ అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నా సంఘర్షణాయుతంగా (కాన్ఫ్లిక్ట్ ఏరియా) గా ప్రకటించకుండానే బస్తర్ విషయంలో చేస్తున్న కొత్త దుర్మార్గ వ్యూహంగా రాయడానికే ప్రత్యేకంగా ఈ రచన ఎంచుకున్నాను. దేశంలో అంతర్గతంగా ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్ర సైనిక, ఆర్ధ సైనిక బలగాలను ఉపయోగించరాదనేది బిజెపి ప్రభుత్వ విధానమని పార్లమెంటులో ప్రధాని మోడీ కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో చేసిన చర్యల పట్ల విమర్శగా చేసిన ప్రకటనను గతంలో ఒక రచనలో ప్రస్తావించాను. దానిని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం భూపేష్ భగేల్ పాలన కాలంలో తాము కేంద్ర జోక్యం లేకుండా మావోయిస్టు ప్రభావాన్ని ఆదివాసులతో తగ్గించడానికి చేస్తున్న సంస్కరణలకు పేర్కొనడం గురించి కూడ రాసి ఉన్నాను. ఇపుడు మళ్లీ బిజెపి ప్రభుత్వం వచ్చాక కూడ ఈ రెండు విధానాలు ఇంకా ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇవ్వాళ ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతమంతటా ఇటీవల కురుసం శంకర్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసినట్లుగా అంతా ఇరవై ఇరవై ఐదు, ముప్పై సంవత్సరాల యువతీ యువకుల నాయకత్వంలో, స్కూల్ పిల్లలు, ప్రజలు, స్త్రీ, పురుషులు వేల సంఖ్యలో పాల్గొంటున్న నిరాయుధ సడక్ రోకో, ఠానా రోకో, కంపెనీ రోకో ఉద్యమాలు పెల్లుబుకుతున్నాయి. ఆ విషయాలేమో మీడియా ఎక్కడా రిపోర్ట్ చేయదు కాని ఆ పోరాటాల నెదుర్కొవడానికి ఒక సంస్కరణ వాదంగా కనిపించే మావోయిస్టు వ్యతిరేక ఉద్యమాన్ని, మరొకటి ‘ఆత్మ నిర్భర్’ రూపంలో సైనికీకరణను చేపట్టాయి.
మొదటిది పంచాయితీ సర్పంచ్‌లను కూడగట్టుకొని ప్రభుత్వ ప్రరేపిత మీడియా ద్వారా చర్చల కోసం చేసే పాద యాత్రలు, సభలు, ధర్నాలు వగైరా. వీళ్లు ఆదివాసుల పట్ల, వాళ్ల న్యాయమైన డిమాండ్ల పట్ల పూర్తి సానుభూతి ప్రకటిస్తూనే ప్రభుత్వమూ, పాలకవర్గాల్లో ఉన్న కొందరు మాజీ తెగ నాయకులు, ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ నాయకులను ముందుపెట్టి మావోయిస్టులకు పోలీసులకు మధ్యన ఆదివాసులు నలుగుతున్నారు గనుక శాంతి చర్చలు కావాలని కోరుతూ చేస్తున్న పాదయాత్రలు, ప్రదర్శనలు, దీనికోసం ప్రయోజిత మీడియా నిజనిర్ధారణలను కూడ అనుకూలమైన పత్రికల ద్వారా చేయించి తెలుగు పాఠకుల దృష్టికి తెచ్చి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మార్చ్ 2 ‘సాక్షి’ లో కవర్ పేజీలోనే బాక్స్ కట్టి వేసిన ‘బస్తర్‌లో భయం భయం’ వంటి రిపోర్టు అటువంటిది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి బయల్దేరి ‘మావోయిస్తు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తి’ దాకా వెళ్లి రాసిన రిపోర్టు. అన్నలు విధించిన ఆంక్షలు, పారా మిలటరీ చెక్ పాయింటులను దాటుకుంటూ వెళ్లి, జవాన్లు, అధికారులతో పాటు, మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్) లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి తెలుసుకున్న క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం ఒక సగం పేజీ రెండు కాలమ్స్‌తో ముగిసింది. సాధికారత కోసం పువ్వర్తిలో హిడ్మా ఉపయోగించే సమావేశ మందిరం, కమ్యూనికేషన్ సెంటర్ ఫొటో కూడ తీసారు.
ఒక్క ‘సాక్షి’లోనే కాకుండా మార్చ్ 2న (బహుశా తర్వాత కూడ) ఇటువంటి రిపోర్టులు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోనూ వచ్చే ఉంటాయి. నా కన్నా ఎక్కువే తెలుగు ప్రజలు, పాఠకులు, చూసి, చదివే ఉంటారు. ఆ వివరాల్లోకి పోను గానీ, మీడియాతో ఒక అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు పెట్టించడానికి ఇటువంటి ప్రాయోజిత ప్రయాణాలుంటాయి. అదేమంటే మావోయిస్టులకు , పోలీసులకు మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారు. పోలీసు క్యాంపులు ఎక్కువ ఉన్న చోట అభివృద్ధి ఉంది. అందుకు దాఖలా రోడ్లు. పువ్వర్తి దాకా పోగలిగారు. పోలీసు చెక్ పోస్టులు, నాకాలు. జనతన రాజ్యంలో ‘అభివృద్ధి’ లేదు. ఎందుకంటే వాళ్లు, వీళ్ల భయానికి ఆదివాసులు అడ్డగించడం వల్ల ‘ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలి బాట, ఎడ్లబండి దారులే ఆధారం. అయితే పోడు భూముల్లో జనతన సర్కార్ అదివాసీ గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లతోని నిర్మించిన స్కూళ్లు కనిపించాయి అని మాత్రం రాయక తప్పలేదు. అమరుల స్థూపాలు ఉన్నాయి.
‘ఇరువురి మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు’ అనే ప్రజలు లేని క్షేత్రస్థాయి పరిశీలనలే కొంచెం ముందుకువెళ్లి ‘శాంతి చర్చలు’ పాద యాత్రలు, ధర్నాలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు చిరకాలంగా గతంలో బిబిసి ప్రతినిధిగా ఛత్తీస్‌గఢ్‌లో పనిచేసిన శుభ్రాంశు చౌధురి కేంద్రంగా జరుగుతున్నాయి. ఇది పూర్తిగా రాజ్య ప్రేరేపితమైంది కనుక ఏ పార్టీ ప్రభుత్వమున్నా దీనికి ఆటంకాలు ఉండవు. ప్రజల నుంచి మద్దతూ ఉండదు. వీళ్లు ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణాన్ని, ఇరువైపుల కాల్పుల విరమణను డిమాండు చేయరు. మావోయిస్టులు సాయుధ పోరాట విరమణ చేసి శాంతి చర్చలకు రావాలని ఏకపక్ష డిమాండ్ పెడతారు. ఇది ఒక ప్రహసనం.
సాల్వాజుడుంను రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పులోనే ఎటువంటి వారి చేతికి తుపాకి ఇవ్వవచ్చునో సూచనలు ఉన్నాయని తీర్పును బిట్విన్ ది లైన్స్ చదివిన ప్రొఫెసర్ శేషయ్య గారు మన చట్టాల్లోనే కాదు మన రాజ్యాంగంలోనే ఈ ద్వంద్వాలకు ఎంతో చోటు ఉందని ఆయన జీవితకాలమంత చెప్పే ఉన్నారు. ఆ రచనలన్నీ మన ముందున్నాయి. కనీసమైన విద్యార్హత (ఆదివాసీకైతే మెట్రిక్ ఫెయిల్ అయినా చాలు) తుపాకి పట్టడంలో శిక్షణ ఉండాలని ఆ తీర్పులో సూచించారు. నిజానికి సల్వాజుడుంలో ఉన్న ఆదివాసుల్లో ఎక్కువ మంది మాజీ మావోయిస్టులు. వాళ్లందరికి పోలీసులను ఎదుర్కొనే, కేంద్ర అర్ధ సైనిక బాలగాలను ఎదుర్కొనే శిక్షణయే పిఎల్‌జిఎలో ఉండే ఉంటుంది. కాకుండా మిలీషియాలో ఉన్న వాళ్లయినా విల్లంబులు వేయడం, సంప్రదాయ ఆయుధాలు ఎంతో నైపుణ్యంతో ఉపయోగించగల నేర్పు ఆదివాసులకు ఉగ్గుపాలతో అబ్బే విద్య. కనుక సుప్రీం కోర్టు తీర్పులో సూచించిన విద్యార్హత కలవారినందరినీ డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డిఆర్జి) లతో అప్పటి నుంచే రిక్రూట్ చేసుకుంటున్నారని, వాళ్లకు సిఆర్పిఎఫ్ వంటి కేంద్ర అర్ధసైనిక బలగాలకన్నా మావోయిస్టుల ఆనుపానులు, ఉండగల స్థలాలు, గుంపులు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా బస్తర్‌లోని భౌగోళిక స్థితులు, వాతావరణం తెలిసిన స్థానికులుగా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది గనుక అకాశం నుంచి మావోయిస్టులు ఉండడానికి అవకాశమున్న ఆదివాసీ ఆవాసాలను చూపి బాంబులు వేయడానికి ఈ డిఆర్జి బలగాలను వినియోగించుకుంటున్నారని గతంలో కూడ రాసి ఉన్నాను. ఇపుడు దీనికి తోడుగా విద్యావంతులవుతున్న (కనీసం మెట్రిక్ ఇంటర్ ) చదువుకున్న 18, 20 ఏళ్ల యువకులను మూలవాసీ సాంస్కృతికమంచ్లో వాళకి, యువజన నిర్మాణాల్లోకి పోకుండా చేయాలన్నా, నిరుద్యోగ సమస్య ఆదివాసీ విద్యార్థుల్లో తలెత్తకుండా చూడాలన్నా ఇవ్వాళ దేశమంతా ఉద్యోగ కల్పనకు మిగిలిన అవకాశం పోలీసుల్లో, సైన్యంలో చేర్చుకోవడమే. నూతన ఆర్థిక విధానంలోనే సామ్రాజ్యవాద ప్రపంచీకరణలోనే విధ్వంసం ఉన్నది ఉన్నది గనుక సమాజంలో తలెఎత్తే అశాంతిని అణచడానికి లాటిన్ అమెరికా దేశాల్లోనే కాదు, తూర్పు మధ్య భారతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో, కశ్మీరులో ఎంత సైనికీకరణ జరిగిందో మనం చూస్తున్నాం. కార్పొరేటీకరణ-సైనికీకరణ వ్యతిరేక ఉద్యమం గత రెండు మూడు సంవత్సరాల్లోనే ఎంతవేగంగా బలపడుతున్నదో చూస్తున్నాం. కార్పొరేట్లకు సేవ చేయడానికే ఉన్న దళారీ ప్రభుత్వాల దగ్గర ఉన్న అస్త్రం సైనికీకరణయే. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో భాగంగా ప్రభత్వం కనుసన్నల్లోనే ఎన్నో ప్రైవేటు ఏజెన్సీలు ఏర్పడి రష్యా, ఇజ్రాయిల్ వంటి దేశాలతో భారత ప్రభుత్వానికి ఎంతో మంచి స్నేహం ఉంది గనుక అక్కడ ఉద్యోగావకాశాలు ఉన్నాయని యువకులకు మంచి జీతాలు వస్తాయని పంపిస్తున్నాయి. అట్లా వెళ్లినవాళ్లు రష్యా, ఉక్రెయిన్ ఆక్రమణ యుద్ధంలో, ఇజ్రాయిల్ గాజాపై దాడిలో సైనికులుగా రిక్రూట్ చేసుకుంటున్నట్లు యుద్ధంలో వాళ్లు చనిపోతే గానీ బయటి ప్రపంచానికి తెలియడం లేదు. ఇట్లా అథో జగత్ జనాన్ని యుద్ధాలలో సైనికులుగా పంపించడాన్ని గ్రాసంగా పంపించడమంటారు. ఏ యుద్ధంలో ముందుండి చచ్చేవాళ్లయిన పేదలు, సిపాయిలు అనేది చరిత్ర రుజువు చేసిన సత్యం.
కేవలం మావోయిస్టులతో పోరాడడానికే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బస్తర్‌లోని బీజాపూర్, సుకుమా, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో, ముఖ్యంగా నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ను లక్ష్యంగా చేసుకొని 2022 లో ‘బస్తర్ ఫైటర్స్’ అనే పేరుతో స్పెషలైజ్డ్ (ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఫోర్స్) సైనిక బలగాలను సిద్ధం చేస్తున్నారు . దీనికి గ్రామాల నుంచి 2100 మందిని రిక్రూట్ చేసుకున్నారు. బస్తర్‌లోని ఏడు జిల్లాలకు ఒక్కొక్కదానికి మూడు వందల మందిని కేటాయించారు.
కేంద్ర బలగాలను దేశంలో ఆంతరంగిక ఘర్షణల్లో ఉపయోగించకూడదనే బిజెపి విధానానికి అనుగుణంగా కూడ ఒక ఎన్కౌంటర్లో కేవలం ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డిఆర్జి, బస్తర్ రైఫిల్స్‌ను ఉపయోగించినట్లు ఐ.జి. సుందరరాజ్ చెప్పిన విషయాన్ని కూడ గతంలో ప్రస్తావించాను.
బస్తర్ రైఫిల్స్ పాల్గొంటున్న ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మరణించినా, ఇంక బస్తర్ రైఫిల్ జవానే చనిపోతే ప్రభుత్వం మీడియాలో ముఖ్యంగా జాతీయ మీడియాలో పెద్ద ప్రచారం ఇస్తున్నది. అంటే ఇరువైపులా ఆదివాసులే మరణిస్తున్నారని చూపడానికి. ఇదివరకు శాంతి ప్రతిపాదనల్లో ఇరువురి మధ్యన ఆదివాసులే నలిగిపోతున్నారని ప్రచారం చేయడానికి ‘బస్తర్ రైఫిల్స్’ కు చెందిన వాళ్లు చనిపోతే పెద్ద ప్రచారం ఇస్తున్నారు.
రాయ్‌పూర్ నుంచి కూడ వెలువడే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మార్చ్ 3వ తేదీన కాంకేర్ జిల్లాలో 2వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో బస్తర్ రైఫిల్స్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్కురేటి (23) చనిపోయాడని ఆ వివరాలన్నీ రెండు కాలమ్స్ వార్త రాసి అతని ఫొటో కూడ ఇచ్చింది. ఇతడు కాంకేర్ జిల్లా సంగం గ్రామానికి చెందిన బస్తర్ ఫైటర్స్ పోలీసులో మొదటి వాడని పేర్కొన్నది. అట్లే వీళ్లు ఎంత సుశిక్షితులుగా ఉన్నారో ఇది నిజమైన ఎన్కౌంటర్ అని చెప్పడానికి ఒక మావోయిస్టు లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్జిఎస్) కమాండర్ కూడ చనిపోయాడని, అతని తలపై పది లక్షల రూపాయల రివార్డు ఉందని, శవం దగ్గర ఎకె 47 దొరికిందని కూడ ప్రకటించారు గాని ఆ దృశ్యం ఫొటోలో ఏమీ ఇవ్వలేదు. నగేష్ ది నారాయణపూర్ జిల్లాలోని ఖోకామెట్ట గ్రామంలో జరిగింది. ఈ గ్రామం నారాయణపూర్ జిల్లాలోకి వస్తుంది. కాంకేర్ జిల్లాలోనే ఉన్న కాంకేర్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిదూర్ అడవుల్లో జరిగింది. బి.ఎస్.ఎఫ్, డిఆర్జి, బస్తర్ ఫైటర్స్ సంయుక్త బలగాలు అబూజ్మడ్ ఏరియాలో నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలిక ఉందనే సమాచారంతో వెళ్లారని, గోవా రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణానికి కూడ మించిన ఈ ప్రాంతం ఇప్పటికీ సర్వే కూడ చేయబడలేదని, కనుక అక్కడి దాకా చొచ్చుకుపోయి ఈ బస్తర్ రైఫిల్స్ జవాను ప్రదర్శించిన సాహసాన్ని త్యాగాన్ని ఫలితాన్ని ప్రస్తావిస్తూ కాంకేర్ ఆడిషనల్ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీసు ఈ వివరాలన్నీ ఇచ్చాడు.
మరొకవైపు గ్రామస్తులేమో ఈ గాలింపు జరుపుతున్న సంయుక్త బలగాలు తమ కుటుంబాల నుంచి అడవి దినుసులు సేకరించి సంతలో అమ్మడానికి పోయిన ముగ్గురు తమ వాళ్లను చంపారని ఫిర్యాదు చేశారు. ఒక మావోయిస్టును పట్టుకొనో, ఎన్‌కౌంటర్‌లోనో చంపడానికి పోయి ముగ్గురు గ్రామీణ ఆదివాసులను కూడ చంపడానికి వెనుకాడని ఈ సైనిక దాహం ఆదివాసులను సైన్యంలో చేర్చుకునే ఆకర్షణతో తీర్చుకోవడం చాల ప్రమాదకరమైన వ్యూహం. అమానవీయమైన వ్యూహం. సడక్ రోకో, ఠానా రోకో, కంపెనీ రోకో అవి అతి సరళమైన భాషలో ఆదివాసీ సమాజం కార్పొరేటీకరణ కోసం జరుగుతున్న సైనికీకరణనే ప్రతిఘటిస్తున్నారు. మరి మనమేం చేద్దాం?