(చలసాని ప్రసాద్‌ 5,6 జనవరి 2008 గుంటూరులో జరిగిన విరసం మహా సభల ప్రసంగ పాఠం పునర్ముద్రణ – వసంతమేఘం టీం)


సంస్కృతి అంటే ఏమిటి? నాగరికత అంటే ఏమిటి? కులానికి, సంస్కృతికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు వసంతకాలపు సరస్సులో పద్మాలలాగా నా మనస్సులో వున్నాయి. ఎంత సందేహ పూరితమైన అభిప్రాయాలున్నాయో అంత సమాచారము ఉన్నది, అన్ని ఆలోచనలూ ఉన్నాయి. ఇవన్ని ఈ సందర్భంలో మీతో పంచుకొని ఒక చిన్న ప్రయత్నమే ఇది. సంస్కృతి అనగానే సంఘపరివార్‌ గుర్తుకు వస్తుంది. బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు జాతీయ సంస్కృతిని, సాంస్కృతిక జాతీయ వాదమని చెపుతుంటాడు. అందులో జాతీయవాదమనేది ఒక ప్రత్యేకమైన అంశం. సంస్కృతి గురించి ఎవరేమి చెప్పినా ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ సామాజిక నిర్మాణానికి సంస్కృతి గురించి ఒక ఎజెండా వుంటుంది. దాన్ని ప్రకటించుకుంటూ వుంటాయి.

ఒక లెక్క ప్రకారం సంస్కృతికి రెండు వందల నిర్వచనాలు ఉన్నాయి. మనిషి అంటే ఏమిటి? భూమి అంటే ఏమిటి? అని ఒక నిర్వచనంగా ఎట్లా చెప్పుకుంటామో అట్లా సంస్కృతికి నిర్వచనం చెప్పే ప్రయత్నాలు జరిగాయి. అసలు నిర్వచనం అంటే – డెఫినేషన్‌ అనేది జర్మన్‌ పదం. సంస్కృతిని ఒక నిర్వచనంలో ప్రకటించడానికి చేసిన ప్రయత్నాల్లో ఏది. సమగ్రంగా సంస్కృతిని ప్రతిబింబించింది? అని తేల్చడం కష్టం. అలాగే సంస్కృతితో కలగలసినవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు భూమి, నాగరికత, మతం, కులం వగైరా. ఈ విషయాల్లో కూడా మనకు ఒక స్పష్టత ఉంటేనే మొత్తంగా సంస్కృతి గురించి లోతైన అవగాహన కలుగుతుంది. ఇప్పటికే మనకున్న అవగాహనతో ఏదో ఒక నిర్వచనం ఇచ్చుకొని చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు.

‘భూమిలోన పుట్టు భూసారమంతయు / తనువులోన పుట్టు తత్త్వమెల్ల / శ్రమలోనే పుట్టి సర్వంబు తానౌను అని వేమన చెప్పాడు. ఇది మామూలు కవిత్వమనుకుంటే పొరపాటు. ఆయన భూమి గురించి చెప్పాడు, శ్రమగురించి చెప్పాడు, తత్త్వశాస్త్రం గురించి చెప్పాడు. తత్వశాస్త్రమంటే వేదాంతం కాదు. ఎందుకంటే ఆయన తనువులోన పుట్టు తత్త్యమెల్ల అన్నాడు. మానవ జీవితం అతని తాత్వికతకు కేంద్రం. మానవ శ్రమని ఆయన చాలా స్పష్టంగా గుర్తించాడు. పాశ్చాత్య తత్వవేత్తలకంటే చాలా ముందే శ్రమలోనే సర్వం పుడుతుంది అని చెప్పిన విశ్వకవి ఆయన. శ్రమ నుంచి సంస్కృతి పుడుతుంది. అని కూడా ఆయన చెప్పాడు.

ఇక్కడ మనం జాషువా వేదిక మీది నుంచి మాట్లాడుకుంటున్నాం. ‘ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి ఇనుప గజ్జెల తల్లి జీవనము చేయు / కసరి బుసకొట్టు నాతని గాలిసోకంగ / నాల్గు పడగల హైందవ నాగరాజు అన్నాడు జాషువా.

జాషువాగారు ఈ పద్యం రాసినపుడు నాలుగు పడగలే ఉన్నాయి. విశ్వనాథ దాన్ని వేయి పడగలు చేశాడు. ఇప్పుడు మోడీ కోటి పడగలు చేశాడు. బుష్‌ శతకోటి పడగలు చేస్తున్నాడు. జాషువా ఆహరించి అనే పదం ఎందుకు వాడాడా అని నాకు అనుమానం వచ్చింది. దానికి మూడు అర్థాలు ఉన్నాయి. ఆరగించి, అపహరించి, ఆకర్షించి అని ఈ మూడూ సంస్కృతికి సంబంధించిన పదాలు. దేశమంటే మట్టికాదోయ్‌, /దేశమంటే మనుషులోయ్‌ / నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్‌ అన్నాడు గురజాడ. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. అని కూడా అన్నాడు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం శరీర తత్వం స్ఫురింప చేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి అని శ్రీ శ్రీ చెప్పాడు. ఈ నలుగురు మూడు కాలాలకు చెందినవారు. అయితే సంస్కృతికి మానవ శ్రమతో సంబంధముంది అనే విషయాన్ని ఎవరి పంథాలో వాళ్లు చెప్పారు. నలుగురూ కూడబలుక్కుని రాసిన వాళ్లు కాదు, కాని సంస్కృతికి, శ్రమకు మధ్య ఉన్న సంబంధం ఈ నలుగురి అవగాహనలో అంతస్సూత్రంగా కొనసాగింది. అది శ్రీ శ్రీ కాలానికి మరింత స్పష్టంగా వ్యక్తమయింది. ఈ విషయం ఎందుకుచెపుతున్నానంటే మతములన్నియు మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అనే మాట మార్క్సిజం ఈ దేశానికి రాకముందు, పాశ్చాత్వ భావజాలంతో మనకు సంబంధం పెద్దగా కలగకముందు, రష్యన్‌ విప్లవం రాకముందు మన గురజాడ చెప్పాడు. విశ్వకవికి ఉండే లక్షణం అది. ఎందుకంటే ఆయన తరువాత టి.ఎస్‌.ఇలియట్‌ అనే అతను అతనికి కవిత్వంలో 1922లో నోబెల్‌ ప్రైజ్‌ వచ్చింది. అప్పటికి చాలా నిరాశా జనకంగా కవిత్వం రాశాడు. 20వ శతాబ్దంలో నాగరికత సంస్కృతి నిరాశా పూరితంగా వ్యాఖ్యానించ బడుతున్నాయి. మళ్లీ మనం వేదకాలానికి వెళ్లిపోదాం అనే దారి ముందుకు వచ్చింది. టి.ఎస్‌. ఇలియట్‌ అనే పుస్తకం ఒకటి రాశాడు. పేజీకి ఒకసారైనా మతంతో అనుసంధానం చేశాడు. అది చదివి నేను మిమ్మల్ని విసిగించను. కాని సారాంశం ఏమంటే సంస్కృతి అంటే మతమే అని ఆయన అభిప్రాయం. ఇది ఎంత తప్పో ఇవాళ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దీని ప్రభావం కూడా తక్కువ కాదు. ముఖ్యంగా బిజెపి మతాన్ని భుజాన వేసుకొని ప్రచారం చేస్తోంది. ఈ పనిలో మోడీ హిట్లర్‌ కి తమ్ముడు కూడా కాదు. అన్నగా తయారయ్యాడు. అందుకే రేప్పొద్దున బిజెపి తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిగా అద్వానిని తీసేసి మోడిని ప్రకటించినా నేను ఆశ్చర్యపోను. సరే మళ్లీ ఇలియట్‌ దగ్గరకు వస్తే ఆయన సంస్కృతి అంటే మతమే అని చెప్పిన కాలంలో మనదగ్గర ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల రాశాడు. అందులో ఆయన ఎన్నెన్ని కొత్త విషయాలని ఆ కాలానికి ప్రతిపాదించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఇలియట్‌ కంటే మన గురజాడ, ఉన్నవ ఎంత ఉన్నతంగా ఆలోచించారో గమనించండి. ప్రజలకు ముఖ్యంగా పేద జనాలకి, వాళ్ల జీవితానికి, శ్రమకు సంస్కృతికి ఉన్న సంబంధాన్ని ఎంత బాగా పసిగట్టారో ఈ ఉదాహరణలు తెలియజేస్తాయి. నేను ఇలియట్‌ గురించి ఈ మాట అంటున్నందుకు ఆంగ్లభాషాభిమానులకు, ముఖ్యంగా కేవలం కవితాలోలురకు కష్టం కలిగించవచ్చు. అయినా నేనీ మాట చెప్పి తీరాలి అనుకున్నాను.

మనదేశంలో వేమన, జాషువా అట్టడుగు జీవితం నుండి శ్రమతో సంస్కృతికి ఉండే సంబంధాన్ని చెబుతూనే దానితోపాటు ఇంకో విషయం గూడా చెప్పారు. 

ఉదాహరణకు వేమన కులముగలవారు – గోత్రంబు కలవారు – విద్యచేత విర్రవీగువారు – పసిడి కలుగువాని బానిస కొడుకులు అన్నాడు. ఆయన సంస్కృతిని, కులాన్ని, మతాన్ని, జ్ఞానాన్ని కలిపి ఆలోచించాడు. లేకపోతే సంస్కృతిగా చెలామణి అవుతున్నదాని మూలాన్ని ఆస్తిలో చూడడం సాధ్యం కాదు. ఇవాళ కులాన్ని, మతాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వాళ్లు ప్రజల మనసులకు చెదలు పట్టించాలని చూస్తున్నారు. పాలకవర్గాలు, సంపన్నులు, రావిశాస్త్రిగారి భాషలో చెప్పాలంటే పెద్దింటివాళ్లు, పెద్దకులాల వాళ్లు కుట్రపూరితమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా కాలం కిందటే మొదలైంది. ఒకప్పుడు చాప కింది నీరు మాత్రమే.. ఆ తరువాత జేబులో తేలయింది. ఇప్పుడు నట్టింట్లో నాగుపామయింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టాలి. మతమే సంస్కృతి అనే ప్రచారం చేసిన ఇలియట్‌ లాంటి వాళ్లంతా మన రావిశాస్త్రిగారన్నట్టు మనలాంటి బేడా పరగ్గాళ్లు కాదు. ప్రపంచ ప్రసిద్ధి పొందినవాళ్లు. కాని వాళ్ల భావజాలం చాలా ప్రమాదకరమైనది.

చాలా విచిత్రంగా మనదేశంలో సంస్కృతి అంటే కులమే లేదా వర్ణాశ్రమ ధర్మాలే అనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. కోట్ల సంవత్సరాల నుండి ఈ విశ్వం ఉన్నది. లక్షల సంవత్సరాల నుండి మానవులు ఉన్నారు. వేల సంవత్సరాల నుండి నాగరికత ఉన్నది. సంస్కృతి అనగానే గ్రీసు దేశాన్ని రెఫర్‌ చేయడం పరిపాటి. వాళ్లకి కవిత్వం, నాటకం, తత్వశాస్త్రం వగైరా అన్ని వున్నాయి. కాని సంస్కృతి అనే మాట ఆ కాలంలో లేదు. రోమ్‌ సమాజం గ్రీకు నుంచి దిగుమతి చేసుకుని కమర్షియల్‌ సంస్కృతిని, కమాడిటి సంస్కృతిని ప్రపంచానికి ఎగుమతి చేసింది. హెర్బిడ్‌ రీడ్‌ ఈ మాట చాలా అర్థవంతంగా రాశాడు.

1955లో ఆంధ్రరాష్ట్రంలో జరిగిన మధ్యంతర ఎన్నికల సందర్భంలో సంస్కృతి గురించి చాలా విలువైన అభిప్రాయాలు చర్చకు వచ్చాయి. అది కలిమి లేముల మధ్య పోరాటంగా సాగింది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఎన్నికల రూపంలో వర్గ సంఘర్షణ చాలా నిర్ధిష్టంగా వర్గప్రయోజనాల ప్రాతిపదికమీద కొనసాగింది. 1955లో కమ్యూనిస్టు పార్టీ, తాను అత్యధిక మెజార్టీతో గెలుస్తామని కర్నూలు కొండారెడ్డి బురుజును కైవసం చేసుకుంటామని గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ అంతా తారుమారైంది. సరిగ్గా కేరళలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. కమ్యూనిస్టు పార్టీ అనే శిశువుని నెహ్రూ, ఇందిరాగాంధీ ఊయలలోనే గొంతు పిసికి చంపారు. ఆంధ్ర ఎన్నికల సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ మీద తీవ్రమైన నీలాపనిందలతో ప్రచారం జరిగింది. కమ్యూనిజం, మార్క్సిజం భారతీయమైనవి కాదు. ఈ దేశానికి సంబంధించినవి కాదు. మన సంస్కృతికి విరుద్ధం అని నార్ల వెంకటేశ్వరరావు వంటి గొప్ప మేధావి పనిగట్టుకుని ప్రచారం చేశాడు. ఆయన ఎంత గొప్ప మేధావో, పాత్రికేయుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని ఆయన పనిగట్టుకొని కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేయవద్దని కాంగ్రెస్‌ని గెలిపించమని ప్రచారం చేశాడు. జమిందార్లను, రాజులను పెద్దింటి వాళ్లను పెద్ద కులాల వాళ్లను గెలిపించడానికి, సంపన్నులకు ఊడిగం చేయడానికి ఆంధ్రప్రభ పత్రికను వాడుకున్నాడు. వీళ్ల దృష్టిలో కమ్యూనిజం భారతీయ సంస్కృతికి విరుద్ధం. మార్క్సు, ఎంగెల్స్‌, స్టాలిన్‌ మావోలు గిట్టరు. పతంజలి, వశిష్టుడు, వ్యాసుడు ఆరాధ్యం. నార్ల వెంకటేశ్వర రావు చాలా హాయిగా ప్రభు సేవచేశాడు. అప్పుడు రచయితల కర్తవ్యమేమిటి అని పండితారాధ్యుల నాగేశ్వరరావు ప్రచారం ప్రారంభించాడు. ఇదంతా సాహిత్య సాంస్కృతిక రంగాలలో కొత్త ఆలోచనలకు దారితీసింది. ముఖ్యంగా సంస్కృతి గురించి అంతకు ముందున్న ఆలోచనలకంటే కొత్త ఆలోచనలు మొగ్గ తొడిగాయి. దీనికి సాహిత్య రంగం కేంద్రమయింది. సాహిత్యం పాత్ర ఇదే.

మానవ జీవితంలోని అతి ముఖ్యమైన సంస్కృతి తదితర అంశాల మౌలిక చర్చను ఒక సందర్భంగా ముందుకు వచ్చినపుడు రచయితలే చేస్తారు. కుటుంబరావుగారు అన్నట్టు సంఘర్షణ వచ్చినపుడు రచయితలు తటస్థంగా ఉండలేరు. సాహిత్య సాంస్కృతిక రంగాలలో వర్గపోరాటం అనదగిన సంఘర్షణకు కారణం అవుతారు. గోర్కీని సాహిత్య అకాడమీ నుంచి తీసివేసినపుడు రష్యాలో చెకోవ్‌ రాజీనామా చేశాడు. లిట్మస్‌ టెస్ట్‌ అని అంటాం గదా సరిగ్గా అలాంటి సందర్భం ఒకటి ముందుకువచ్చి అందరినీ నిలదీస్తుంది. అప్పుడు నిలబడినవారే కొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తారు. అట్లా 55ఎన్నికల్లో కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్డ రచయితలు సామాజిక రాజకీయ సంస్కృతి గురించిన చర్చకు కారణమయ్యారు.

ఇంత జరిగి ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఓటమి పాలయ్యింది. అది వేరే విషయం. అయినా అప్పుడు జరిగిన ప్రచారం మధ్యతరగతిని విద్యావంతుల్ని కొంతైనా ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకి తిరుపతిలో ప్రపంచ సంస్కృతి మహా సభ జరిగింది. అక్కడ సంస్కృతం, సంస్కృతి ఒకటే అని ప్రతిపాదించారు. నార్ల తెలుగులో రష్యాను పొగుడుతూ రాసిన తొలి వ్యక్తి. ఆయన హేతువాది, నాస్తికుడు. ఆయనకు మతం పట్టింపు లేదు. ఆయన తిరుపతిలో జరిగిన ప్రతిపాదన మీద స్పందిస్తూ సంస్కృతం సంస్కృతీ ఒకటి కాదు అని రాశాడు. ఆయనే అంతకు ముందు ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడిరచమని, కమ్యూనిజం భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని 15 సంపాదకీయాలు (‘ప్రగతి’) రాశాడు. కాంగ్రెస్‌ ను గెలిపించడానికి, భారతీయ సంస్కృతికి మార్క్సిజం వ్యతిరేకమని చెప్పడానికి అంత పెద్ద ఎత్తున శ్రమ చేసినవాడే తిరుపతి ప్రపంచ సంస్కృతీ మహాసభ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాశాడు. సంస్కృతి గురించి అధ్యయనం చేసేవాళ్లకి ఆయన రాసిన వ్యాసం బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతం, సంస్కృతి ఒకటికాదు ధర్మం, న్యాయం, నాగరికత ఒకటి కాదు అని చాలా వివరంగా రాశాడు. సంస్కృతం అంటే అహంకారం కాదు, అతిశయం కాదు, గర్వం కాదు అని రాశాడు. ఇది అందరూ చదవవలసినది.

అయితే సంస్కృతి చర్చలో ఏది సంస్కృతి కాదో తేలికగా చెప్పవచ్చు. నార్ల కూడా ఆవ్యాసంలో అట్లాగే చెప్పాడు. ఇవాళ మోడి అసహనం కాని, వెంకయ్యనాయుడి వదరుబోతుతనం కాని, అద్వానీ ప్రవచనాలు కానీ, సంస్కృతి కాదని వాళ్లు చెప్పేది సంస్కృతికి దోహదపడేది కాదని స్పష్టంగా చెప్పవచ్చు. కానీ, సంస్కృతి అంటే ఏమిటి అని చెప్పడం చాలా చిక్కుతో కూడిన పని. భారతీయ సంస్కృతి అంటే ఏమిటి? అది ఒక అవిచ్ఛన్నమైన స్రవంతా అనే ప్రశ్న వస్తుంది. అట్లాగే హింసా అహింసల చర్చకూడా వస్తుంది. ఇదే నార్ల కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా రాసిన సందర్భంలో పార్టీ తరపున ప్రత్యగాత్మ చాలా మంచి రిప్లై రాశాడు. హింస కమ్యూనిస్టుల సంస్కృతి అని అది భారతీయం కాదని నార్ల అంటే ప్రత్యగాత్మ – మహాభారతంలో పాండవులు చేసింది, కాకతీయులు చేసింది పల్నాటి వీరులు చేసింది హింస కాక మరేమిటి అని ప్రశ్నించాడు. ఇవాళ బిజెపి ప్రచారం చేస్తున్నట్టు భారతీయ సంస్కృతి ఏకశిలా సదృశ్యం కాదు. ప్రత్యగాత్మ ప్రశ్నించినట్టు ఏది భారతీయ సంస్కృతి? పదహారువేల తొమ్మిది మంది (రాధతో సహా) స్త్రీలతో జీవించిన కృష్ణుడుదా? ఏక పత్నీవ్రతుడైన శ్రీరాముడుదా? అలాగే యజ్ఞయాగాదుల సంరక్షణ కోసం విల్లు ఎక్కు పెట్టిని శ్రీరాముడుదా? యజ్ఞయాగాదుల్ని నిరసించిన బుద్ధుడిదా? మాయావాదాన్ని మోసుకు తిరిగిన శంకరుడిదా? ఏనాటి నుంచో ఈ దేశంలో భౌతికవాదాన్ని భుజాల మీద ఎక్కించుకున్న చార్వాకులదా?’ అందుకని భారతీయ సంస్కృతి ఒక సజీవ స్రవంతి. అందులో అనేక పాయలున్నాయి.

ఇంతకీ చాలా ఎక్కువ ఆమోదం పొందే ఒక నిర్వచనాన్ని ఉటంకిస్తాను. ‘‘Culture, then, is not someting that stays in the head, it is something that lives in the life; It is not an accumulation of learning, but an application of experience and education” అన్నాడు విల్‌ డ్యురాంట్‌. ‘‘సంస్కృతి అంటే మన బుర్రలో నిలవుండేది కాదు. అది జీవితంలో జ్వలించేది. పాండిత్యం పోగు చేయడం కాదు, విద్యనీ, అనుభవాన్ని అన్వయించేది సంస్కృతి…..’’

కల్చర్‌గా మనం చెప్పుకుంటున్నది నిజజీవితంలో చాలా వైవిధ్యమైనది సంస్కృతి అంటే జీవన విధానం అనే నిర్వచనం ఇక్కడి నుండే వచ్చింది. సంస్కృతిని, ఆంత్రోపాలజీని, చరిత్రని, మతాన్ని, సైన్స్‌ని, వ్యవసాయాన్ని పరిశీలించినవాళ్లు చేసిన సూత్రీకరణల్లో భారతీయ సంస్కృతి అనేదాంట్లో చాలా వైవిధ్యం ఉన్నది. బహుశా యేదేశంలో లేనటువంటి సాంస్కృతిక వైవిధ్యం మనదేశంలో ఉంది. దానికి మనం గర్వించాలి. అయితే సంస్కృతి అంటే ఫలానా అని మాత్రమే చెప్పి మిగతా సంస్కృతికి, సాంస్కృతిక వైవిధ్యానికి అపచారం చేయడం నేరమౌతుంది.

సంస్కృతికి బాహ్యరూపం నాగరికత. అయితే దీనికి మూలం భూమి, శ్రమ. శ్రమను మనం యెలా చూస్తాం అనే దాన్ని బట్టి మన సంస్కృతి అవగాహన తేలుతుంది. శ్రమ పట్ల మనిషికి ఉండే గౌరవం మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. శ్రమ లేనిదే కోతి నుండి మనిషి రూపొందేవాడు కాదు. దీని గురించి ఎంగెల్స్‌ వానరుడి నుండి నరుడు శ్రమ శక్తి వల్లనే వచ్చాడని శ్రమను కేంద్రం చేసుకొని రాశాడు. మార్క్సిస్టులు కాని వాళ్లు కూడా దీన్ని అంగీకరించారు.

5,6 జనవరి 2008 గుంటూరులో జరిగిన విరసం మహా సభల ప్రసంగ పాఠం‘ఏది సంస్కృతి’ నుంచి..

భూమి సంస్కృతి నాగరికత, 2008

Leave a Reply