మూలం: ఆన్ ఫ్రాంక్ తెలుగు అనువాదం: బీనా దేవి
ప్రపంచంలోనే మహా నియంత. ఎటువంటి నేరమూ చేయని లక్షలాది యూదు జాతీయులను కేవలం ‘యూదులుగా పుట్టడమే వాళ్ళ నేరమని’ భావించి, మారణహోమం చేయించిన నర రూప రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అతను పరిపాలిస్తున్న కాలంలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఒక ఇంట్లో అటక లాంటి భాగంలో తన కుటుంబంతో సహా గడిపిన ఒక యూదు బాలిక ఆన్ ఫ్రాంక్.
జర్మన్ లో ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో 1929 జూన్ 12 వ తేదీన పుట్టింది ఆన్ ఫ్రాంక్. తండ్రి ఒట్టో ఫ్రాంక్. తల్లి ఎడిత్ ఫ్రాంక్. అక్క మార్గెట్. 1933లో హిట్లర్ నాయకత్వంలోని నాజీలు అధికారంలోకి వచ్చారు. వెంటనే యూదులపై ఆంక్షలు మొదలయ్యాయి. యూదుల ఆస్తులను లాక్కోవడం మొదలు పెట్టారు. అప్పుడే ఆన్ ఫ్రాంక్ తల్లి తన ఇద్దరి కూతుర్లను తీసుకుని నెదర్లాండ్ తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. తండ్రి ఒట్టో ఫ్రాంక్ తన షేర్లను వేరే వాళ్లకు బదిలీ చేసేసి నెదర్లాండ్స్ ముక్య పట్టణమైన అమస్టర్ డాంకి పోయి అక్కడ వ్యాపారం మొదలుపెట్టాడు. తర్వాత భార్యా, పిల్లల్నీ అత్తగారినీ కూడా తను ఉంటున్న అమస్టర్ డాంకి రప్పించుకున్నాడు. కానీ, 1940 లో నాజీలు నెదర్లాండ్స్ కూడా ఆక్రమించుకున్నారు. ఇక్కడ కూడా యూదులపై వేదింపులు మొదలయ్యాయి. అక్కడే కాదు, యూరప్ అంతటా యూదులు ఏమూలనున్నా యూదులను మట్టు బెట్టాలని మొదట కొన్ని ఆంక్షలతో ప్రారంభించాడు. యూదుల పిల్లలు యూదుల స్కూళ్ళల్లోనే చదవాలి. యూదులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించుకోకూడదు. వారు తాము యూదులమని చెప్పే చిహ్నాలు ధరించాలి. సినిమా హాళ్ళకు వెళ్ళకూడదు. ఏ సామాజిక, సాంస్క్రుతిక కార్యక్రమాలలోనూ పాల్గోరాదు. సాయంత్రం 3-5గంటల మధ్యనే షాపింగ్ చేసుకోవాలి. మంగలి షాపులూ, బ్యూటీ సెలూన్లూ యూదులు పెట్టినవి మాత్రమే వాడాలి. రాత్రి 8 గంటలనుండి పొద్దున్న 6 గంటలలోపు రోడ్లమీద తిరగకూడదు. దియేటర్లకూ, సినిమాలకూ మరే ఇతర వినోద కార్యక్రమాలకు వెళ్ళకూడదు. స్విమింగ్, టెన్నస్, హాకీలాంటి ఆటలు ఆడకూడదు. పడవలు నడపకూడదు. పబ్లిక్ ఆటలు ఆడకూడదు. స్వంత తోటలైనా, ఫ్రెండ్స్ తోటలైనా రాత్రి 8 తర్వాత కూర్చోకూడదు. ఫ్యాక్టరీ నుండీ, సంస్థల నుండీ యూదు కార్మికులనూ, యూదు వుద్యోగులనూ తొలగించాలి. లేకుంటే యజమానిని శిక్షించేవారు. యూదుల వ్యాపారాలనూ, షేర్లనూ లాక్కోవడం, తిండీ, తిప్పలు లేకుండా గొడ్డు చాకిరీ చేయించడం చేసేవారు.
ఆనీ ఫ్రాంక్ అక్క మార్గెట్ కి 1942 జూలైలో అటువంటి వెట్టి చాకిరికి రమ్మనమని పిలుపు వచ్చింది. ఒక షాపుకి సంబంధించిన సామాన్లు పెట్టుకునే స్టోర్ రూములో అటక మీద వెళ్ళడంతో ఆనీ ఫ్రాంక్ కుటుంబం రహస్య జీవితం మొదలయ్యింది. ఆనీకి అంతకు ముందు 1941లో 13 వ పుట్టిన రోజు నాడు ఒక డైరీ బహుమతిగా వచ్చింది. ఆ డైరీలోనే ఆమె రహస్య స్థావరంలో వున్నన్నాళ్ళు తన అనుభవాలనూ, బయట జరుగుతున్న క్రూరత్వాలను, బయట నుండి వస్తూన్న తన స్నేహితులు చెప్పిన విషయాలనూ , 1942 జూన్ 12 నుండి మొదలయి 1944 ఆగస్ట్ ఒకటవ తారీఖు వరకు, ఏరోజు ఏం జరిగిందీ రాసుకుంది. అదే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో కధ ఏమీ వుండదు. ఉన్నదంతా నాజీల అమానుష ఘోర క్రుత్యాలు. అందులోనుండి కొన్ని మాటలు.
“బయట ఎండ. ట్రాము యూదులకు నిషేధం.మాకు వున్న ఒకే ఒక్క ప్రయాణ సాధనం ఫెర్రీ.”[సైకిళ్ళను మాత్రమే వాడాలి. కారు వున్నా వాడకూడదు.]
“s s వాళ్ళు [ప్రభుత్వ సైన్యం సరిపోక హిట్లర్ ప్రైవేటు సైన్యాన్ని కూడా నియమించుకున్నాడు. మరి లక్షలాది మంది చంపాలంటే ప్రభుత్వ సైన్యం సరిపోదు. ఆ ప్రవేటు సైన్యాన్నే s s సైన్యం అంటారు.] డాడికి ‘కాల్ అప్’ నోటీసు పంపించారు. విషయం తెలిసి మమ్మీ, వాన్ డాన్ దగ్గరకు వెళ్ళింది. ఆటను మా డాడి వ్యాపారంలో ఫ్రెండ్. ”కాల్ అప్ “దాని అర్ధం నిర్భంద శిబిరాలు. [వీటినే కాన్సన్ టేషన్ కాంప్ లనీ, ఆస్విజ్ లనీ, హోలీకాస్ట్ లనీ అంటుంటారు. యూరప్ వివిధ దేశాలు వున్నాయి కదా! ఈ మాటలన్నీ వేరే వేరే భాషలలోని పదాలు అనుకుంటాను. అయితే, అసలు మానవత్వపు భాషలో అర్ధం చేసుకుంటే అవన్నీ నరకకూపాలు, మారణహోమాలు, నరబలులు. ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు.] కానీ, అసలు విషయం కాల్ అప్ డాడికి కాదు. 16 ఏళ్ళ అక్క మార్గెట్ కి. ఈ వయసు అమ్మాయిల్ని ఒంటరిగా తీసుకువెళతారా? కానీ, దేవుడి దయవల్ల తీసుకువెళ్ళలేదు.”
“1942 జూలైలో మేము అజ్ఞాతంలోకి వెళ్ళాము. నేను వుండే బిల్డింగ్ ను వర్ణిస్తాను. కింద పెద్ద షాపు వుంది. దాన్ని స్టోర్ గా ఉపయోగిస్తారు. ”అందులో వుండేవారు. దానికి సీక్రెట్ ఎనెక్స్ అని వాళ్ళే పేరు పెట్టుకున్నారు. అంటే, షాపు వాళ్ళు సామాన్లు పెట్టుకునే అటక.
“మా యూదు ఫ్రెండ్సు అందరినీ డజన్ల లెక్కన తీసుకుపోయారు. వీళ్ళను పశువుల ట్రక్కుల్లో వెస్టర్ బోర్క్ కు తరలించారు. [మరికొంతమందిని రైళ్ళలో తీసుకెళ్ళేవారు. రైలు అంటే, పాసింజర్ రైలు కాదు. గూడ్స్ రైలు. పశువుల్ని ఎక్కించినట్టుగా లోపల ఎక్కించేవారు. నిజం చెప్పాలంటే అక్కడ యూదుల్ని పశువులతో పోల్చడం కూడా ఎక్కువే. నిర్జీవ వస్తువుల్ని గూడ్స్ కంపార్ట్ మెంట్లలో పడేసినట్లు పడేసేవారు. గమ్యం చేరేలోపే కొంతమంది ప్రాణాలు పోయేవట.]అది యూదుల పెద్ద నిర్బంద శిబిరం. అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉంటాయట. వందమందికి ఒకటే స్నానాల గది. లేవెట్రీలు తక్కువే. ఆడా, మగా పిల్లలూ అందరూ కలసే పడుకోవాలి. దానివల్ల అక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ఎంతో మంది ఆడవాళ్ళూ, ఆఖరికి అమ్మాయిలు కూడా అక్కడ వుంటే తల్లులవుతున్నారు. అక్కడ నుండి తప్పించు కోవడం అసంభవం. చాలా మందికి గుండు చేసేవారు. ఇక్కడ హాలెండ్ లోనే ఇలా వుంటే, దూర ప్రాంతాలకు పంపించే వారి సంగతి ఏమిటి? వాళ్ళను చంపేశారని అనుకుంటున్నాం. ఇంగ్లీష్ రేడియో లో వాళ్ళను గ్యాస్ తో చంపేశారని చెప్పారు. అదే బహుశా వేగంగా చచ్చి పోవడానికి మార్గమేమో. ఈ భయంకరమైన కధలు చెప్పినపుడు నన్ను నేను నిగ్రహించు కోలేక పోయాను.”
“మాతో పాటూ ఉండడానికి ఎనిమిదో మనిషిని తీసుకోవాలని అనుకున్నాం. మా దగ్గర ఇంకో మనిషికి తిండీ, చోటూ వున్నాయనీ, ఏడుగురైనా, ఎనమండుగురైనా ప్రమాదం ఒక్కటే అనుకున్నాం. అతని పేరు డసెల్స్”
“జర్మన్ల లీడర్ “రాటర్” స్పీచ్ ఇచ్చాడు.”జూలై పది లోపు జర్మన్ల అధీనంలో వున్న అన్నీ దేశాల నుండి యూదులు వెళ్లిపోవాలి. ఏప్రెల్ ఫస్ట్ నుండీ మే ఫస్ట్ లోపు యుట్రెక్ట్ రాష్ట్రం మొత్తం తుడుచుపెట్టుకు పోవాలి.[యూదులు బొద్దింక లైనట్లు] మే ఫస్ట్ జూన్ ఫస్ట్ మధ్యలో ఉత్తర, దక్షిణ హాలెండ్ లో వున్న ఈ దరిద్రపు ప్రజలను జబ్బుతో వున్న పశువుల్లాగా మురికి కబేళాలకు పంపించెయ్యాలి….ఒక చిన్న మంచి వార్త ఏమిటంటే, జర్మన్ లేబర్ ఎక్సేంజ్ డిపార్ట్ మెంట్ ను ఆందోళన కారులు తగలబెట్టేసారు. కొన్ని రోజుల తర్వాత రిజిస్టార్ ఆఫీసును కూడా తగలబెట్టేసారు. జర్మన్ పోలీసు యునిఫారంలో వచ్చి గార్డుల నోర్లు కట్టేసి ముక్ష్యమైన కాగితాలన్నీ తగలబెట్టేసారు.”
“ఈ రోజు నీకు బాధ కలిగించే వార్త చెబుతాను.మా యూదు ఫ్రెండ్స్ నందరినీ గెస్టోపో వాళ్ళు డజన్ల లెక్కన తీసుకుపోయారు. [ గెస్టోపో ’అనేది ఒకపేట లేదా చిన్న ప్రాంతం అనుకోవచ్చు. ముందుగా నాజీలు, యూరప్ లోని ప్రతి ఊర్ల లోనూ వున్న యూదులను వెతికి పట్టుకొని ఒక దగ్గర చేరుస్తారు. అక్కడ కొన్ని రోజులు ఉంచిన తరువాత రైళ్ళ లో మరో ప్రాంతం లోవున్న కాన్సంట్రేషన్ క్యాంప్ కు తరలించేస్తారు. మొదటగా ఉంచిన ప్రాంతాన్నే ‘గెస్టోపో’ లంటారు.] వీళ్ళను పశువుల ట్రక్కుల్లో ‘వెస్టర్ బోర్క్’ తరలించేసారు.అది యూదుల పెద్ద నిర్బంద శిబిరం.అక్కడ పరిస్థితులు భయంకరంగా వుంటాయి.”
“అజ్ఞాతంలో లేని యూదుల పరిస్థితి తో పోల్చుకుంటే, మేము స్వర్గంలో ఉన్నట్లే. ఒకప్పుడు ఎంతో బాగా సుఖంగా బతికిన మేము ఇప్పుడు ఎలా దిగజారి పోయమో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది…..ఈ యుద్ధం వలన ఎవరికి లాభం? మనుషులు ఎందుకు శాంతియుతంగా బతకరు? ఎందుకీ సర్వనాశనం? ప్రశ్న అయితే బాగానే వుంది. కానీ, ఇంత వరకూ ఎవరూ సమాధానాలు కనుక్కోలేదు. ఎందుకంత పెద్ద విమానాలు తయారు చేస్తారు? బాంబులు ఎందుకు తయారు చేస్తారు?” ఇలాంటి అనేక అంశాలతో ఈ డైరీ 1944 ఆగస్ట్ ఒకటవ తారీకు వరకూ వుంది. రహస్య కాలంలో ఆ కుటుంబానికి సహాయకునిగా వున్న మియప్ గీస్ ఈ డైరీ ని భద్ర పరిచాడు. నాజీ శిబిరం నుండి తండ్రి ఒట్టో ఫ్రాంక్ బ్రతికి బయటకు వచ్చాక ఈ డైరీ ముద్రణ జరిగింది.
ఈ డైరీ రాయడం ఆపేసిన నాలుగు రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 4వ తేది పొద్దున్న పదీ, పదిన్నర మధ్యలో నాజీ ఆఫీసర్లు ఆనీ రహస్య స్థావరంపై దాడి చేశారు. ఆనీ కుటుంబాన్నీ, వీళ్ళకు సాయం చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అక్కడున్న ఖరీదైన సామానూ, డబ్బూ తీసుకున్నారు. 1944 సెప్టెంబర్ 3 వ తేదిన పోలెండు లోని ఆస్విజ్[నిర్బంధ శిబిరం] తీసుకెళ్ళారు. అక్టోబర్ లోనో, నవంబర్ లోనో గాస్ చాంబర్ లో చంపేశారు. ఎడిత్ ఫ్రాంక్ [ఆనీ తల్లి] నిర్భంద శిబిరంలో 1945 జనవరి 6న ఆకలీ, అలసట వలన చనిపోయింది. మర్గెట్, ఆనీలను అక్టోబర్ చివరలో హనోవర్ దగ్గర వున్న కాన్సంట్రేషన్ క్యాంప్ కి తరలించారు.1944-45లో అనారోగ్య వాతావరణంలో టైఫాయిడ్ వల్ల వేలాది మంది ఖైదీ లు చనిపోయారు. మార్గెట్,ఆనీలు కూడా అలాగే చనిపోయారు. ఆ క్యాంప్ 1945 ఏప్రెల్ 12న విముక్తి అయ్యింది. ఆ 8 మందిలో బ్రతికివున్నది ఒట్టో ఫ్రాంక్ మాత్రమే.అతను 198o లో చనిపోయాడు.
మొత్తం నిర్భంధ శిబిరాల్లోనూ, గ్యాస్ చాంబర్లలోనూ నాజీలు కోటీ పది లక్షల మందిని చంపేశారు. అందులో యూదులు అరవై లక్షల మంది. పది లక్షల మంది పిల్లలు. వారి నేరం. యూదులుగా పుట్టడమే. ఉరి తియ్యడం అయితే, ఆలస్యం అవుతోందని, సామూహికంగా గ్యాస్ చాంబర్లలో[విషపు గాలి] లోనికి పంపించేవారట. అక్కడ ఉంచిన నిర్భంద శిబిరాల్లో వ్రుద్దుల్నీ, చిన్న పిల్లనీ ముందుగా వేరు చేసేసి”మీరందరూ స్నానాలు చేద్దురు”అని చెప్పి గ్యాస్ చాంబర్ లోనికి పంపిస్తారు.లోపల విషపు గ్యాస్ వదిలేస్తారు.దాంతో ఒకేసారి ప్రాణాలు పోతాయి. సామూహిక దహనాలు చేసేవారు. మిగిలిన కమ్యునిస్టులూ, నాజీలను వ్యతిరేకించే ఇతరులూ వున్నారు. మొత్తంగా హిట్లరు తలపెట్టిన మారణ హోమంలో చనిపోయిన వాళ్ళు 5 కోట్ల మంది.
అసలు హిట్లర్ కి యూదుల మీద ఎందు కంత కోపం? కోట్లాది మంది అమాయకులనూ, ఏ నేరం చేయని వాళ్ళనీ చంపించేటంతటి క్రూరత్వం ఎలా వచ్చింది? అసలు క్రైస్తవులకూ, యూదులకూ ఎందుకు శత్రుత్వం? యూదులు కూడా క్రైస్తవులలో ఒక భాగం అని యూదుల చరిత్రలో వుంది. అంటారు. ఏ చారిత్రిక కారణం తోనో శత్రుత్వం ఏర్పడింది. పూర్వకాలంలో వందల సంవత్సరాల ముందు, వందల తరాల ముందు ఏదో జరిగితే జరిగి ఉండవచ్చు, మరి ఇప్పటి[ఈ కధా కాలం నాటికి] యూదులు ఏం చేశారు?ఇంకా ప్రపంచాన్ని చూడని పసి పిల్లలు ఏం చేశారు?హిట్లర్ అధికారం లోకి వచ్చే కొత్తలో నాజీలను వ్యతిరేకించే వాళ్ళను మాత్రమే నిర్భందించే వాడట. క్రమంగా జాతి అహంకారం మితిమీరిపోయింది. మేము ఆర్య సంతతి వాళ్ళమని.యూదులు మాకు వ్యతిరేకులనే భావం స్థిరపడిపోయి, తన అధికారాన్ని అంతా ఉప యోగించి ప్రపంచం మొత్తం మీద ‘యూదు’ అనేవాడు ఎవ్వడూ నామరూపాలు లేకుండా సర్వనాశనం చేస్తానని కంకణం కట్టుకున్నాడు. అసలు హిట్లర్ అధికారం లోకి రాకముందే కొన్ని వందల సంవత్సరాల ముందే నిండే వివక్షత వుంది. ఈ విషయంలో కార్ల్ మార్క్స్ తండ్రి కూడా ఈ వివక్షతను ఎదుర్కొన్నాడు. మార్క్స్ వంశీకులు యూదు మతస్తులే. కానీ, అతని తండ్రి క్రైస్తవులు తప్పా, మరే మతస్తులూ న్యాయ వాద వ్రుత్తి చేయకూడదని ప్రష్యా ప్రభుత్వ నిభందన వుంది. ప్రష్యా అంటే, అది జర్మనీ లో భాగమే. ఆ కారణంగా అతనికి ఇష్టం లేకపోయినా 1917లో క్రైస్తవ మతం తీసుకున్నాడు. అంటే మార్క్సు పుట్టడానికి ఒక సంవత్సరం ముందు. మొదట్లో అతను ఒక్కడే క్రైస్తవం తీసుకున్నాడు. కొన్నాళ్ళకి మొత్తం మార్క్స్ కుటుంబం మొత్తం క్రైస్తవం తీసుకుంది. ఇక్కడ అనుకోవలసింది ఏమిటంటే, యూదుల మీద వివక్షత ఏనాటి నుండో వున్నది. కానీ అది హిట్లర్ దగ్గరకు వచ్చేసరికి అహంకారం తలకెక్కి పరాకాష్టకు చేరుకొని లక్షలాది మంది అమాయకులను బలితీసుకుంది.