ఆకులన్నీ రాలి మోడై ఎండిన కథల చెట్టు కూలిపోయిన వర్తమాన స్థితి కనబడుతుంది. రాయలసీమలోకథల పెద్దోళ్ళలో.. బహుశా ఆధునిక కథను వొడిసిపట్టుకుని దాంతోనే నాలుగైదు దశాబ్ధాలు సాహచర్యంచేసిన కథల రారాజు అస్తమించిన దుఃఖ సందర్భమిది. ఆయన గూర్చి మాట్లాడ్డమంటే మానవీయ విలువలగూర్చి మాట్లాడటమే. సింగమనేని నారాయణ అసలు సిసలైన మార్క్సిస్టు కథకుడు. నిఖార్సైన భావజాలంతోజీవించినవాడు. కథల కార్థానాలోనే జీవితఖైదీగా బతికినవాడు. ఎవరేకథ రాసినా ఆ కథను అసాంతం చదివిఆ కథపై నాలుగుమాటలు మాట్లాడి కథకుడిని ఉత్సాహ పరిచే సాహిత్య సంస్కారమున్నవాడు. రాయలసీమకథను కథల ప్రపంచంలో అగ్రభాగాన నిలిపిన కథకుడు. ఆయన రాయని కథావస్తువు మిగల్లేదు. ఇదిరాయలేదనడానికి వీల్లేని వస్తువులన్నింటిని రాసేసినవాడు.
చాలా కథలను చాలా చదివినప్పటికీ 2018లో వచ్చిన ఆయన రాసిన “నీకూ నాకూ మధ్య నిశీధి”కథల సంపుటి నన్ను బాగా ఆకర్షించింది. పన్నెండు కథల సమాహారమైన ఆ సంపుటిలోని కథల్లో మధ్యతరగతిజీవితాలను, సున్నిత సంఘర్షణల్ని చక్కగా వ్యక్తీకరించాడు. సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబవ్యవస్థలోకూరుకుపోయిన అనేకానేక ఒడిదుడుకుల బతుకుల్ని గుండె ప్రకంపనమయ్యేలా రాశాడు. చాలా మంది కథలుసీమ కథాసాహిత్యంలో లబ్ధిప్రతిష్టులై ఉన్నప్పటికీ అతనిలా కథకుడిని వేలు పట్టుకుని నడిపించిన వాళ్ళూతక్కువే అనొచ్చు. మధ్యతరగతి బతుకుల్లో నిత్యం కొనసాగే ఆర్థిక సమస్యల సుడిగుండాల్ని మానవీయకోణంలోఆవిష్కరించే ప్రయత్నం నిరంతరం చేశారు. సామాజిక చైతన్యమే అతని కలానికి బలం. ఎవరెన్ని భావాజాలాల్లోకొనసాగుతున్నా వర్తమాన పరిస్థితులకనుగుణంగా తన పంథా మార్చకోక తనెంచుకున్న ఎర్రెర్రని దారిలోనడిచిన కథకుడు.
ఉత్తమపురుషలో సాగుతున్న కథలు రాయడం, శ్రమైక జీవనానికి అద్ధం పట్టే పాత్రల్ని సృష్టించడంఆయనకే సాధ్యం. సాహిత్యానికి రాయలసీమ ఎందరో కథకులనిచ్చింది. కాదు కాదు సామాజిక చైతన్య జ్వాలల్ని రగిలించే దివిటీ అయ్యింది. అలా వచ్చిన కథకుల్లో సింగమనేని అగ్రభాగంలో ఉంటారు. సీమ రైతుకన్నీళ్ళను అక్షరాల జడివానకు కరువునేలపై కరిపించిన వాడు. మనిషి కేంద్రంగా రాసిన కథలు తెలుగు కథాసాహిత్యంలో ఎన్నో ఉన్నప్పటికీ అతనిలా భిన్నంగా చెప్పిన కథలు తక్షువే. సైద్ధాంతిక భావజాలం కలిగి ఆభావజాలంలోనే నడిచి పొడిబారిన కథల క్షేత్రంలో కథల సిరులను పండించిన వాడు. కథల పరిణామక్రమాన్ని ఎప్పటికప్పుడు సూక్ష్మకోణంలో చూస్తూ వర్తమాన ప్రపంచానికి అనుగుణమైన కథలనందించిన కథలయాత్రికుడు.
కొన్ని సందర్భాల్లో కథకుడు వొక నిర్ధిష్ట చట్రంలో తనకు తాను బంధీ అయి కథల్ని రాసుకుపోయి..మూసలో బతికేప్రయత్నాలు చేసుకంటాడు. అనేక ప్రభావాలకు లోనై బతికేస్తుంటాడు. సింగమనేని అలాకాదు.ఎక్కడ కూడా కాంప్రమైజంగ్ కాని సెన్సిటివ్ నేచర్‌ని అలవరచుకున్నవాడు. అతని కథలు స్త్రీవాదులుచదివితే అందులో ప్రీవాదం కనబడుతుంది, దళితులు చదివితే దళితవాదం, మానవవీయ విలువలకోసంపరితపించే మానవతావాదులు చదివితే మానవీయ నైతిక విలువలు ఇలా చెప్పుకుంటూపోతే అనేకానేకవస్తురూపాలన్ని కనబడ్డాయి.
సింగమనేని పెన్నుమూసేశాక వర్తమానకాలంలో కథలవనం ఎండిపోయినటైంది. అతని ఖాళీని అంతత్వరగా తెలుగు కథల ప్రపంచంలో పూద్చలేరు. చిగురించాల్సిన కథల్ని సాహిత్యవనంలో నాటే తోటమాలులుతయారవ్వడం ఇంకొద్ది కాలం పట్టొచ్చు.