నీటి కొరతతో బాధపడుతున్న పంజాబ్‌లో పంటల వైవిధ్యీకరణను అమలు చేయడం నేడు చాలా అవసరం. కానీ గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో పప్పుధాన్యాలు, ప్రత్తి, మొక్కజొన్న ఉత్పత్తి, సేకరణ గణనీయంగా తగ్గింది. ఈ పంటలను సాపేక్షికంగా చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే ఐదేళ్లలో ఈ పంటలకు సంబంధించి కేంద్రంపై దాదాపుగా ఎటువంటి భారం పడదు. పంజాబ్‌లో వ్యవసాయం స్థితిగతులు ఏమిటో, రైతు సంఘాలు ఢిల్లీ చలో అనే నినాదంతో పెద్ద ముందంజ వేయడానికి ఎందుకు సిద్ధమవుతున్నాయో చూద్దాం.
ఫిబ్రవరి 18 వ తారీకు ఆదివారం అర్ధరాత్రి వరకు నిరసనకారులతో జరిగిన నాలుగో విడత చర్చల్లో పంజాబ్ రైతుల కోసం పంటల వైవిధ్యీకరణ ప్రతిపాదనను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వ మద్దతు గల సహకార సంఘాల తరఫున ఐదు పంటల సేకరణ కోసం ఐదేళ్ల ఒప్పందాల ప్రతిపాదనను ముందుంచింది. వీటిలో, కంది, మినప, మసూర్ పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటలకు కనీస మద్దతు ధరను (ఎమ్ఎస్పి) ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది.
ఆహార మంత్రి పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ, “అత్యంత వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచన” చేసామని, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎఎఫ్ఇడి), కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా ఈ పంటల ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పాడు.
కానీ సోమవారం సాయంత్రం అయేటప్పటికి, దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేసే అన్ని పంటలకు ఎమ్ఎస్పికి చట్టబద్ధమైన హామీని, దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేసే అన్ని పంటలకు పంట ధరలను నిర్ణయించడానికి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ నివేదికను సిఫారసు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ విధంగా రైతు సంఘాలు బుధవారం, ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటల నుంచి ‘ఢిల్లీ వెళ్దాం’ అనే నినాదంతో మరోసారి నిరసన ప్రదర్శనకు సంసిద్ధమయ్యాయి.
పంజాబ్ లో కేంద్ర ప్రభుత్వం ఎందుకని పంట వైవిధ్యీకరణపై దృష్టి పెట్టింది?:
మొత్తం పంజాబ్ భౌగోళిక విస్తీర్ణంలో 80 శాతానికి పైగా (50. 33 లక్షల హెక్టార్లలో 41. 17 లక్షల హెక్టార్ల వరకు) సాగు చేస్తారు. ఇందులో కూడా అత్యధికంగా బియ్యం, గోధుమలు పండిస్తున్నారు. 2019-20 సంవత్సరంలో 41.17 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 35.21 లక్షల హెక్టార్లలో గోధుమలు, 31.42 లక్షల హెక్టార్లలో వరి పంటలు సాగు అయ్యాయి.
కేంద్రం ప్రతిపాదించిన 5 పంటల వాటా 0 తో సమానం.
2019-20లో 2.48 లక్షల హెక్టార్లలో ప్రత్తి, 1.14 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, కేవలం 33,000 హెక్టార్లలో పప్పు ధాన్యాల(ఖరీఫ్, రబీ రెండూ) పంటలను సాగు చేసారు.
వరి పంటలో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. 1 కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి సుమారు 2,500 లీటర్లు (నీటిపారుదల లేదా వర్షపాతం) అవసరం, బియ్యం సాగు కారణంగా రాష్ట్రంలో భూగర్భజలాలను విచ్చలవిడిగా వాడడంతో పంజాబ్ నేడు పెద్ద ఎత్తున మరుభూమీకరణ వైపు పయనిస్తోంది.
పంజాబ్‌లో పంట వైవిధ్యీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఆశించిన ఫలితాలు ఇంకా రాలేదు. దీనికి విరుద్ధంగా, 2017-18లో 2.91 లక్షల హెక్టార్లు వుండిన పత్తి పంట విస్తీర్ణం 2021-22లో 2.51 లక్షల హెక్టార్లకు తగ్గింది. అదేవిధంగా, మొక్కజొన్న (పంజాబ్‌లో ఖరీఫ్ పంట) సాగులో కూడా 2017-18లో వున్న 1.14 లక్షల హెక్టార్ల నుండి 2021-22లో 1.05 లక్షల హెక్టార్లకు తగ్గింది. అయితే, పప్పు ధాన్యాలలో, 2017-18లో 30,2000 హెక్టార్లలో సాగు అవగా, 2021-22లో 62,600 హెక్టార్లకు పెరిగింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఎమ్‌ఎస్‌పిపై మూడు రకాల పప్పులను సాగు చేసే రాష్ట్రాలు ఏవి?
దేశంలో పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేసే కొన్ని రాష్ట్రాలు సగానికి పైగా ఈ పంటలను సాగు చేస్తున్నాయి. పప్పు ధాన్యాలపై ఎమ్ఎస్పి ఈ రాష్ట్రాలకు కావాలి, కానీ ప్రభుత్వం ప్రతిపాదన పంజాబ్ రైతుల కోసం. భారతదేశంలో 95 శాతం ఎర్ర కందిపప్పు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లలో ఉత్పత్తి అవుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలు 80% కంది పప్పును ఉత్పత్తి చేస్తాయి. మినప పప్పు ఉత్పత్తిలో 75 శాతం మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలలో అవుతుంది. వీటిలో పంజాబ్ ఎక్కడా నిలబడదు. కానీ ప్రభుత్వం ఈ పంటల కోసం పంజాబ్‌కు ఎమ్ఎస్పిని ప్రతిపాదిస్తోంది.
దేశంలో పప్పు ధాన్యాలకు వున్న డిమాండ్‌ను పూర్తి చేయడానికి భారతదేశం విదేశాల నుండి పెద్ద మొత్తంలో దిగుమతులపై ఆధారపడుతుంది అనేది కూడా ఒక వాస్తవం. 2021-22 సంవత్సరంలో మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తి 27.69 మిలియన్ టన్నులు మాత్రమే వుండింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, 2027 నాటికి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పప్పు ధాన్యాల కొనుగోలుకు ప్రోత్సాహకం (ఎమ్ఎస్పి పెంపు), ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్), ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్) వంటి కార్యక్రమాల ద్వారా పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఎంత మొత్తములో పప్పు ధాన్యాలు, పత్తిని కొనుగోలు చేస్తుంది?:
కేంద్రం మొత్తం 22 పంటలకు ఎమ్ఎస్పిని ప్రకటించింది, కానీ సేకరణ కొన్ని పంటలకు మాత్రమే పరిమితమై వుంది. భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -ఎఫ్‌సిఐ) ద్వారా ప్రధానంగా గోధుమలు, వరి ధాన్యాలను, ఎన్ఎఎఫ్ఇడి ప్రధానంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను, సిసిఐ ప్రత్తిని కొంటాయి.
ప్రత్తి: పంజాబ్‌లో సిసిఐ ద్వారా పత్తి సేకరణ గత మూడు సంవత్సరాలుగా పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి, అయితే మొత్తం గణాంకాలు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయి. దేశంలో సిసిఐ కొనుగోలు చేసే మొత్తం పత్తిలో పంజాబ్ వాటా 5 శాతం మాత్రమే. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలు 2021-22 సంవత్సరంలో దేశంలో మొత్తం కొనుగోలు 91.90 లక్షల ప్రత్తి బేళ్ళు (ఒక బేలు 170 కిలోలకు సమానం) కాగా అందులో ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేసింది 34.01 లక్షల బేళ్ళు. 2021-22లో పంజాబ్ నుంచి కేవలం 5.36 లక్షల బేళ్ళు మాత్రమే. అయితే ఇది 2020-21లో 3.58 లక్షల బేళ్ళతో పోలిస్తే కొంత పెరుగుదలను సూచిస్తుంది.
పప్పుధాన్యాలు: 2022-23 సంవత్సరంలో, నాఫెడ్ 29.64 లక్షల టన్నుల పప్పుధాన్యాలను పిఎస్ఎస్ కింద కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది, ఇది సుమారు 13.77 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించింది. అదేవిధంగా పిఎస్ఎఫ్ కింద 57,754 టన్నుల పప్పుధాన్యాల కొనుగోలు జరిగింది. నాఫెడ్ చేసిన మొత్తం కొనుగోళ్లలో చెరకు (84.59 లక్షల టన్నులు) అతిపెద్దది కాగా తరువాత స్థానంలో మినుముల (12.59 లక్షల టన్నులు) కొనుగోలు జరిగింది.
వివిధ పంటలకు ఎమ్ఎస్పిని సిఫారసు చేసే సంస్థ వ్యవసాయ ఖర్చుల-ధరల కమిషన్ (సిఎసిపి) ఎన్ఎఎఫ్ఇడి చేసిన పప్పు ధాన్యాల సేకరణపై ప్రశ్నలు లేవనెత్తడాన్ని గమనించాలి.
“రబీ పంట మార్కెటింగ్ సీజన్ ధరల విధానం: 2024-25” శీర్షికతో సిఎసిపి తన నివేదికలో ఇలా పేర్కొందిః గత రెండు సీజన్లలో శనగ పంట రికార్డు స్థాయిలో ఉత్పత్తి కావడం, మార్కెట్లో చాలా తక్కువ ధరకు అమ్మకం జరగడం కారణంగా, ప్రభుత్వ ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్) కింద 2022-23లో 25.6 లక్షల టన్నులు, 2023-24లో 22.3 లక్షల టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. పప్పు ధాన్యాల మొత్తం కొనుగోలు కూడా 2021-22లో 29.6 లక్షల టన్నుల నుండి 2022-23లో 30.2 లక్షల టన్నులకు పెరిగింది.
అయితే, పిఎస్ఎస్ కింద కొనుగోలు చేసిన పప్పు ధాన్యాలను పంపిణీ చేయడానికి ఖచ్చితమైన యంత్రాంగం లేకపోవడం వల్ల నేఫెడ్ పప్పు ధాన్యాలను ఎమ్ఎస్పి కంటే చాలా తక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో అమ్మేసింది.
సిఎసిపి ప్రకారం, పిఎస్ఎస్ కింద శనగ పప్పు 2022-23 సంవత్సరంలో క్వింటాల్ కు 4,646 రూపాయల చొప్పున అమ్మారు; ఈ ధర వాస్తవానికి ఎమ్ఎస్పి కంటే చాలా తక్కువగా ఉంది. సిఎసిపి నివేదిక ప్రకారం, “ఒకవేళ పప్పుధాన్యాలు బహిరంగ మార్కెట్లో ఎమ్ఎస్పి కంటే తక్కువ ధరకు అమ్ముడైతే కనక అది మార్కెట్ ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రైతుల నుండి వ్యాపారులు నేరుగా కొనుగోలు చేయకుండా చేస్తుంది.”
దీని ప్రకారం, దేశంలో ‘ఆకాంక్షించే’ జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించిన జిల్లాల్లో, కుటుంబాలకు పప్పు ధాన్యాలు పంపిణీ చేస్తే, ఈ ప్రాంతాలలో పోషణను మెరుగుపరచడంతో పాటు మార్కెట్ ధరలను ప్రభావితం చేయకుండా పప్పు ధాన్యాల నిల్వల సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది అని సిఎసిపి అభిప్రాయపడింది.
బహిరంగ మార్కెట్లో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎఎఫ్ఇడి)నిర్వహణ పద్దతి వల్ల నష్టపోవడం సహజం కాబట్టి ప్రభుత్వ ధరల మద్దతు పథకం కింద కొన్న పప్పు ధాన్యాల నిల్వలను పంపిణీ చేయడం యిప్పటికీ ఒక సవాలుగానే మిగిలి వుంది.
February 20, 2024
రవీంద్ర్ పట్వాల్ “జన్‌చౌక్” సంపాదకవర్గ సభ్యుడు
Telugu – పద్మ కొండిపర్తి