భారత్‌లో ప్రజావ్యతిరేక కార్పొరేటు అనుకూల మోడీ ప్రభుత్వ విధానాల వల్ల అత్యధిక ప్రజలు కొనుగోలు, ఆదాయాలను కోల్పోతోంటే అపర కుబేరులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నారు. మార్చి 2న హురున్ గ్లోబల్ 10వ వార్షిక నివేదిక రిచ్ లిస్టు 2021 భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 209కి చేరిందని తెలిపింది. 100 కోట్ల డార్ల సంపద కలిగి ఉన్న వారిని బిలియనీర్ అంటారు. ప్రస్తుత డాలర్ మారకం రేటు ప్రకారం రూ.7400 కోట్ల పైమాటే. మొత్తం 209 మందిలో 177 మంది బిలియనీర్లు భారత్‌లోనే నివసిస్తుండగా మిగిలిన వారు విదేశాల్లో స్థిరపడ్డట్లు నివేదిక వెల్లడించింది. అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు దేశంలో సంవత్సరన్నరగా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికి పోయాయి. ఉపాధి కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కోట్లాది మంది పేదరికంలోకి జారిపోయారు.
కరోనా కష్టకాలంలోనే నూతనంగా 40 మంది అపర కుబేరులుగా అవతరించారనీ, సంపన్నుల వద్ద మరింత సంపద పోగుబడిందనీ ఫోర్బ్స్ పత్రిక ఇటీవల ప్రకటించింది. ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా మహమ్మారి కమ్ముకు రావడంతో సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నమైనాయి. ప్రపంచమంతా దివాళా తీసినా ఈ మాంద్యాలు, అంటువ్యాధులు కొందరిని మాత్రం తాకలేదని ఈ నివేదిక చెబుతోంది. కరోనా కాలంలో రికార్డ్ స్థాయిలో కొత్త బిలియనీర్లు ఉద్భవించారు. 2019లో బిలియనీర్ల సంఖ్య 2098 ఉండగా 2020లో బిలియనీర్ల సంఖ్య 2755గా పెరిగిందని ‘ఫోర్స్ -2021’ 35వ వార్షిక నివేదిక పేర్కొంది. అంటే ఒక్క సంవత్సరంలో 657 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరారు. వీరంతా 70 దేశాలకు చెందినవారు. మొత్తం బిలియనీర్లలో సగం మంది అమెరికా, చైనాలోనే ఉన్నారు. అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్-5 దేశాల్లో అమెరికాలో 724 మంది, చైనాలో 698 మంది, భారత్‌లో 140 మంది, జర్మనీలో 136 మంది, రష్యాలో 117 మంది బిలియనీర్లు ఉన్నారు. అయితే చైనా బిలియనీర్లలో 71 మంది హాంగ్‌కాంగ్‌కు చెందిన వారు కాగా… ఒకరు మకావోకు చెందినవారున్నారని ఫోర్బ్స్ రిపోర్ట్ పేర్కొంది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 2019లో 615 ఉండగా 2020లో ఇది 724కు పెరిగింది. ఇక చైనా బిలియనీర్ల సంఖ్య 239 నుంచి ఏకంగా 626కు పెరిగింది.
మూడు దశాబ్దాల సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు వలన భారత్‌లో కుబేరులు పెరిగిపోతున్నారు. 1990కి ముందు మన దేశంలో బిలియనీర్లు లేరు. ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చాకనే బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ఇటీవలి కాలంలో చైనా ప్రభువు కన్నెర్రకు గురై, కొంతకాలం ఎవరికీ కనిపించకుండా పోయిన జాక్‌మాను రెండో స్థానంలోకి నెట్టేసి, ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. అనతికాలంలోనే అతివేగంగా ఎదిగొచ్చిన అదానీ ఆ తరువాత స్థానంలో ఉండటంలో ఆశ్చర్యమేమీ కాదు. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి ఇరవై మందిలో తొలిసారిగా చేరిన అదానీ ఎదుగుదల వేగం చూస్తుంటే, ఆయన త్వరలోనే మరిన్ని రికార్డు సృష్టించవచ్చు. ప్రపంచ కోటీశ్వరుల్లో తొలి స్థానాల్లో ఉన్న జెఫ్ బెజోస్, ఎన్‌మస్క్‌కంటే ఈ ఏడాది ఎక్కువ సంపాదించిన ఘనత ఆయనది. మోడీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల వల్ల దేశంలోని ఓడరేవు, విమానాశ్రయాలు, బొగ్గుగనులు, విద్యుత్‌ప్లాంట్లలో ఆయన విస్తరణ వేగం ఊహకు అందనిది. ఆరేళ్ళక్రితమే వివిధ రంగాల్లోకి వ్యాపించడం ఆరంభించిన ఈయన సంపద ఏడాది కాలంలో కనీసం నాలుగు రెట్లు పెరగడం విశేషం.
లాక్‌డౌన్ వల్ల భారత్ జిడిపి వృద్ధిరేటు ఏడున్నర శాతం క్షీణించిందని ప్రభుత్వం చెప్పిన కాలంలోనే, కొత్తగా నలభై మంది కుబేరులు పుట్టుకొచ్చారు. బిలియనీర్ల ఆస్తిపాస్తులు మరింత పెరిగాయి. . కొవిడ్ కాలంలో లక్షలాది మంది వలస పోయారు. కోట్లాది కుటుంబాలు కకావికలమైనాయి. ఇంతటి కష్టకాలంలోనూ సంపన్నులు మరింత సంపద పోగేసుకోగలగడానికి కరోనాను కూడా వారికి వరంగా మార్చగలిగే మోడీ ప్రభుత్వ విధానాలే కారణం. ఈ కష్టకాలంలో పాలకులు ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలన్నీ పేదలకు కాక పెద్దలకే ప్రయోజనం చేకూర్చాయి. సంపద సృష్టికర్తలన్న ముద్దుపేరుతో ప్రభుత్వాలు వారు మరింత దాచుకొనేందుకూ, దోచుకునేందుకూ సహకరిస్తున్నాయి. సంపద పంపిణీలో అసమానతల, శ్రమజీవికి తగిన ఫలం దక్కకపోవడం పాలకులకు పట్టడం లేదు. కార్మికులకు రక్షణనిచ్చే చట్టాన్నీ చట్టుబండలు చేసి, బడా పారిశ్రామికవేత్తల వీరవిహారానికి ఆటంకాలు లేకుండా చేయడమే జరుగుతోంది. పెరిగిన సంపద అందరిదీ కాదనీ, కొందరిది మాత్రమేననీ, ప్రజందరికీ చెందాల్సిన సంపదను కొందరికి మాత్రమే కట్టబెట్టే పని మోడీ పాలనలో యథేచ్ఛగా సాగిపోతున్నదనీ గ్రహించాలి.
కరోనాతో భారత్‌లో డెబ్బయ్ శాతం మంది మరింత పేదరికంలోకి జారిపోయారనీ, ఒకశాతం సంపన్నులు నాలుగు రెట్లు బాగుపడ్డారని ఇటీవల ఆక్స్‌ఫామ్ వ్యాఖ్యానించింది. వీరి వద్ద దేశ సంపదలో 73 శాతం పోగు పడిందని ఆ నివేదిక వెల్లడించింది. పేదలు తిరిగి తేరుకోవడానికి కనీసం పదేళ్లు పడుతుందనీ, ప్రజలకు నేరుగా ఆర్థిక మేలు సమకూర్చే ప్రయత్నాలు అవసరమనీ ఆక్స్‌ఫామ్ పేర్కొన్నది. ప్రభుత్వ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, సామాజిక రక్షణలు కల్పించడం ఇత్యాది సూచనలు చేసింది. ఈ కష్టకాలంలో సంపన్నుల మీద మరిన్ని పన్నులు వేసి సొమ్ము సమకూర్చుకోమని హితవూ చెప్పింది. ప్రజాహితం కోరి అటువంటి ప్రతిపాదనలు చేసినందుకు కొందరు అధికారులను శిక్షించిన ఘనత మన పాలకులది. ప్రభుత్వ విధానాల్లో మార్పు రానంత వరకూ కుబేరుల జాబితాలో ఏటా మరింతమంది చేరుతూనే ఉంటారు. ఆక్స్‌ఫామ్ ఆవేదన చెందుతూనే ఉంటుంది. ప్రజలు దుర్భర దారిద్య్రంలోకి జారుపోతూనే ఉంటారు.
హురున్ రిపోర్ట్ ప్రకారం… గుజరాత్‌కు చెందిన ఇద్దరు బడా కార్పొరేట్లు గౌతమ్ అదానీ, అనిల్ అంబానీల ఆదాయం మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక భారీగా పెరిగింది. ముకేష్ అంబానీ మొత్తం సంపద గతేడాది కాలంలో 24 శాతం పెరిగి 83 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.6.09 లక్షల కోట్లు) చేరుకుంది. గౌతమ్ అదానీ కుటుంబ ఆదాయం రెట్టింపై రూ.2.34 లక్షల కోట్ల సంపదతో 48వ స్థానానికి చేరారు. తర్వాత స్థానంలో హెచ్‌సిఎల్ శివ నాడర్ కుటుంబం రూ.1.94 లక్షల కోట్ల సంపదతో 58 వస్థానం, సీరం ఇన్‌స్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా రూ.1.35లక్షల కోట్ల సంపదతో 113వ స్థానంలో నిలిచారు. జెడ్‌కార్‌కు చెందిన జేచౌదరీ సంపద 274 శాతం పెరిగి 1300 కోట్ల డాలర్లకు, బైజూస్ రవీంద్రన్ కుటుంబ సంపద 100 శాతం పెరిగి 280 కోట్ల డాలర్లకు చేరింది. మహీంద్రా గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రా కుటుంబ సంపద 100 శాతం అధికమై 240 కోట్ల డాలర్లకు చేరింది. పతంజలి అయుర్వేద్‌కు చెందిన ఆచార్య బాలకృష్ణ సంపద 32 శాతం పెరిగి 360 కోట్ల డాలర్లకు చేరింది.
హైదరాబాద్ బిలియనీర్లు :
హురున్ అంతర్జాతీయ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన 10 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ ఈ ఏడాది జనవరి 15 నాటికి రూ. 1,65,900 కోట్లు (2260 కోట్ల డాలర్లు) అని జాబితా పేర్కొంది. ఈ పది మందిలో ఏడుగురు ఫార్మా రంగం నుంచి కాగ మిగిలిన ముగ్గురు మౌళలిక వసతులు, నిర్మాణ రంగానికి చెందిన వారు.
పేరు కంపెనీ ఆదాయం రూ.కోట్లలో భారత్‌లో స్థానం ప్రపంచ స్థానం
మురళి దివి దివీ ల్యాబోరేటరీస్ 54,100 20 385
పివి రాంప్రసాద్‌రెడ్డి అరబిందోఫార్మా 22,600 56 1,096
బి.పార్ధసారథి రెడ్డి హెటిరో డ్రగ్స్ 16,000 83 1,609
కె.సతీశ్‌రెడ్డి డాక్టర్ రెడ్డీస్ 12,800 108 2,050
జివి ప్రసాద్ డాక్టర్ రెడ్డీస్ 10,700 133 2,238
పి.పిచ్చిరెడ్డి మేఘాఇంజనీర్ 10,600 134 2,383
రామేశ్వర్‌రావు మైహోంఇండస్ట్రీస్ 10,500 138 2,383
పివి కృష్ణారెడ్డి మేఘా ఇంజనీర్ 10,200 140 2,383
ఎంఎస్ నారాయణరెడ్డి ఎంఎస్‌ఎన్‌ల్యాబ్ 9,800 143 2,530
విసినన్నపనేని నాట్కో ఫార్మా 8,600 164 2,686
శ్రమ జీవులకు ప్రభుత్వ చేయూత అవసరం :
కరోనాతో ప్రభావితులైన పేదలకు సాయం చేయడానికి మే 2020లో ప్రపంచ బ్యాంకు భారత్‌కు రూ.5,444 కోట్లు అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద గుర్తించిన 32 కోట్ల మంది వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా సొమ్ము వేయడానికి ఈ సాయం అక్కరకొచ్చిందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఐ)కు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ కోసం కూడా ప్రపంచ బ్యాంకు ఇంతే మొత్తాని సమకూర్చింది. కొవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన పేద, దుర్భల కుటుంబాలకు రూ.2,895 కోట్ల మేరకు సాయం అందించడానికి నిరుడు డిసెంబర్‌లో మరోసారి ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. మరోవైపు… కొవిడ్ సాయం కింద నిరుడు ఏప్రిల్-జూన్ మధ్య పేద మహిళల జన్‌ధన్ ఖాతాల్లోకి నెలకు రూ.500 చొప్పున వేశారు. వివిధ క్షేత్రస్థాయి సమస్యలతో చాలామందికి ఈ సొమ్ము అందే అవకాశం రాలేదని యేల్ విశ్వవిద్యాలయం పరిశోధనల అధ్యయనంలో తేలింది. కరోనా లాంటి ఉత్పాతాల వేళ ఇలాంటి తాత్కాలిక సాయాలతో పేదల జీవితాల్లో పెద్దగా మార్పు రాదు. ధరలు దిగివచ్చి, ఉపాధి అవకాశాలు పెరిగితే తప్ప ప్రజకు దీర్ఘకాలిక లబ్ధి చేకూరదు. అలా జరగాలంటే గడిచిన ఏడాదిలో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింతగా చేయూతనివ్వాలి. వ్యవసాయ సమస్య పరిష్కారం నుంచి స్వయం ఉపాధి పథకాల అమలు తీరును సమీక్షించి లోపాలను సరిదిదా్దలి. ఇలా అన్ని కోణాల్లో సమగ్ర కృషితో మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని వేల్ విశ్వవిద్యాయ పరిశోధనల అధ్యయన బృందం స్పష్టం చేసింది.
130 కోట్లకు పైబడిన జనాభాతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ మీద కరోనా ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. కొవిడ్ కారణంగా ఒక్క 2020లోనే 7.5 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారిపోయారని అమెరికాకు చెందిన ప్యూ పరిశోధన కేంద్రం ప్రకటించింది. అలాగే, రోజుకు రూ.700-1,500 ఆదాయం పొందే మధ్యతరగతి ప్రజల్లో 3.2 కోట్ల మంది అల్పాదాయ వర్గశ్రేణిలోకి పడిపోయారు. రోజుకు రూ.150-700 ఆర్జించే అల్పాదాయ వర్గంలోని 3.5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు వెళ్ళిపోయారు. కరోనా సంక్షోభంతో దేశంలో పేదరికం గణనీయంగా పెరిగిందన్న ‘ప్యూ’ నివేదిక ఆందోళన రేపుతోంది. 2030 నాటికల్లా దేశంలో దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం చెబుతోంది. అయితే, ఆ లక్ష్య సాధనకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు చేస్తోంది.
కరోనా కాంలో అధికమైన అంతరాలు :
దేశంలోని ధనవంతులు, పేదల ఆదాయ వ్యత్యాసాలను కొవిడ్ భారీగా పెంచిందని ఆక్స్‌ఫామ్ నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లోని మొదటి వంద మంది సంపన్నుల సంపద నిరుడు మార్చి నుంచి ఈ జనవరి వరకు 35 శాతం అంటే రూ.13 లక్షల కోట్ల మేరకు పెరిగింది. దీనికి సమాంతరంగా ఒక్క ఏప్రిల్ 2020లోనే గంటకు 1.70 లక్షల మంది సామాన్యులు తమ ఉపాధిని కోల్పోయారు. మొత్తం మీద లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తరువాత 12.2 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను పోగొట్టుకున్నారు. దీంతో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమతో పాటు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నవారు ఉన్నపళంగా పేదరికంలోకి జారిపోయారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సిఎంఐఈ) గణాంకాల మేరకు నిరుద్యోగిత రేటు ఏప్రిల్ 2020లో 23.52 శాతంగా నమోదైంది. 2021 మార్చి చివరి నాటికి 13.6 శాతంగా నిరుద్యోగ రేటు ఉంది.
లాక్‌డౌన్‌కు సడలింపు ఇచ్చాక ఉపాధి అవకాశాలు కొద్దిమేరకు పెరిగినా ప్రైవేటు సంస్థల్లో వేతనాల్లో కోతలు, పెరిగిన ధరల నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాల్లో తరుగుదలే కనిపిస్తోంది. కరోనాతో దేశంలో పెరిగిన పేదరికం స్థాయుల్ని మదింపు వేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వ్యవస్థాగతమైన ప్రయత్నమేదీ ఇప్పటివరకు జరగడం లేదు. ‘కొవిడ్ వ్యాప్తి ప్రారంభమయ్యాక దేశంలో ఎంతమంది పేదరికంలోకి కూరుకుపోయారో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏదైనా అధ్యయనం చేసిందా?’ అని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి ‘లేదు’ అంటూ ఒక్క మాటలో జవాబు ఇచ్చింది కేంద్రం.
తాజాగా కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రజల ముందు చేదు నిజాల నుంచింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక రంగాలైన విద్య, వైద్యాలు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటున్నాయి. లేదా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యాన్ని అందిస్తోంది. అదీకాకుంటే ప్రభుత్వం వైద్య బీమా కల్పిస్తోంది. భారత్‌లో ఇంకా వైద్య బీమా విస్తృత పరిధిలోకి రాలేదు. కేవలం ఉన్నత వర్గాలకే ఇది అందుబాటులో ఉంది. దీంతో 70 శాతం పైగా ప్రజలు ఆధునిక వైద్యానికి నోచుకోలేక పోతున్నారు. వైద్యంపై ప్రభుత్వం జిడిపిలో మూడు శాతం ఖర్చు పెట్టాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం అది 1.2 శాతంగానే ఉంటోంది. దీన్ని మూడు శాతానికి పెంచితే ప్రజలు తమ చేతి నుంచి ఆరోగ్యంపై చేసే వ్యయంలో 60 శాతం తగ్గుతుందని నిపుణు అంచనా.
అలాగే విద్యార్థులకు చిన్నారులకు పౌష్టికాహార పథకాన్ని అమలు చేయాలి. ఆకలి బాధలు, చావులు లేని సమాజం కోసం శ్రమించాల్సిన ప్రభుత్వాలు, అందుకు భిన్నంగా సమస్యను పెంచే చర్యలు చేపట్టడం ఘోరం. ఆసియాలోనే అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామని, చైనాను అధిగమించే సత్తా మనకు ఉందని ఊహాజనితమైన భవిష్యత్తును ఆవిష్కరించే ప్రయత్నాలను ప్రభుత్వాలు ఇకనైనా మానుకోవాలి. ఆకలి, అర్థాకలితో అల్లాడుతున్న కోట్లాది మందిని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగడమేనని గుర్తించాలి. మానవాభివృద్ధి జరుగని ఆర్థికాభివృద్ధి వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా పాలకులు కోరుకుంటున్న పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కూడా మనజాలదు. ఇది ఆర్థిక సంక్షోభానికి, ఆర్థిక సంక్షోభం సామాజిక రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని పాలకులు గుర్తించాలి. అందుకు ప్రజా ఉద్యమం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.