కాళీపట్నం రామారావు మాస్టారితో నా పరిచయం బహుశా 1967 జనవరిలో మొదలైందనుకుంటాను. అప్పుడు నా వయస్సు పదిహేను సంవత్సరాలు. తొమ్మిదో తరగతిలో నిలదొక్కుకుంటున్న సమయం. అదీ యువ దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చిన యజ్ఞం కధతో… కారా ఊరు మురపాక. నా బాల్యంలో కొంత భాగం గడిచిన మా అమ్మమ్మ ఊరు వెన్నంపల్లి లాంటిది. నేను పుట్టి పెరిగిన గాజులపల్లి చాలా చిన్న ఊరు. అప్పటి నా స్థితి- ఇప్పటికీ వదలని – పల్లెటూరి జీవితానుభవం… అత్యంత కౄరమైన భూస్వామిక దోపిడీ, పీడన – హింస, వివక్షతలో కూడా బతకడానికి నా చుట్టూ ఉన్న మనుషులు చేసే భీకర పోరాటం- వాళ్లు పడే యాతన – వీటన్నిటి తడి వేడి – ఆ బాల్య, కౌమారపు వయస్సులో… అలాంటి యుద్దాలల్లో పూర్తిగా కూరుకు పోయి గాయి గాయిగా తిరుగుతున్న కాలం. ఈ జ్వరాన్ని, నొప్పిని ఎవరు తమ గుండెలకద్దుకుని తగ్గిస్తారు? వెతుకులాట – నాకన్నాఅన్ని తెలిసినట్లు దిలాసాగా లేడిపిల్లల్లా పరుగులెత్తే సహచరులైన కౌమారపు ఆడపిల్లలా? మాల మాదిగ నేస్తులా? పశువులు, పక్షులు, పంటచేలు పని – అడవి, గుట్టలు- అచ్చమైన రైతులు రైతుకూలీల మనుషులైన మాలమాదిగలా. వీటన్నిటిలో లీనమైన- బడిలో పైకులస్తుల లైన బడి పిల్లలతో కలువక – చదువనే గడ్డిపోచతో దొరికిన ప్రతి పుస్తకం ఆబగా ఆర్తిగా చదువుతూ- ఈ దిక్కుమాలిన జ్వరపీడిత రోగాన్ని తగ్గించేదెవరూ అని వెతుకుతున్న కాలం.
మంథనిలోని అతి పురాతన గ్రంథాలయం నా మౌన సంఘర్షణల అడ్డా….
శరత్, మాయమయి- మాక్సిమ్ గోర్కి , ప్రేమ్ చంద్ , యద్దనపూడి, లత, గోపీ చంద్, మహాత్మాగాంధీ- కొమ్మూరి, డిటెక్టివ్ నవలలు… ఈ కలగాపులగపు చదువులో యజ్ఞం కథ, కథలోని శ్రీరాములు నాయుడు, పంచాయితీలు చెప్పే మావూరి జిత్తులమారి కులపెద్దగా తేలాడు. అప్పలరాముడు మా ఊరి మాలకందుల రాయమల్లయ్య లాగా అనిపించాడు. గ్రామాలు ఎంతదుర్మార్గమైన భూస్వామిక, కుల, లింగ ఉరితాళ్ల అల్లికలతో ఉంటాయో తెలిసినా – కుట్రలూ కుతంత్రాలకు యజ్ఞం కథలోని రాజ్యానికుండే లింకు అప్పటికి నాకు అర్థం కాలేదు. అప్పటికి నాకు రాజ్యం అంటే తెలవదు. మా ఊళ్లోని రాజ్యం అసలు తెలవదు.
యజ్ఞం కథలో తన కన్న కొడుకును కంబారీగా మార్చజాలని అప్పల్రాముడు క్షనికావేశంలో కొడుకు తల నరికాడు. హత్యలు, ఆత్మహత్యలు తెలుసు గానీ, ఇది నన్ను వెంటాడేది. ఇది మూడు తరాల కథ.
1969 నాటికి తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులందరిలాగే నేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నాయకున్నయ్యాను. మూడువందల విద్యార్ధుల బలిదానాలు – నాయకుల విద్రోహంతో పాటు ఉద్యమం వెనకబడిపోయింది. మా చదువులు ఒక సంవత్సరం వెనక బడ్డాయి. మేం గాయపడి కలతచెందాం.
దారులు వెతకడం ఆరంభమయ్యింది… ఆవెతుకులాటలో నక్సల్బరీ, శ్రీకాకుళాలు మా లాగే గాయపడి మమ్మల్ని వెతుక్కుంటూ 1972కే మా దగ్గరికే వచ్చాయి. ఉత్తచేతులతో రాలేదు. వాళ్ల ఉద్వేగాలనూ, అనుభవాలను వాటి మిళితమైన సాహిత్యాన్ని, రాజకీయాలను వెంటతీసుకుని వచ్చాయి.అవి భారత దేశంలో కార్మిక కర్షకుల నాయకత్వంలో నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా వచ్చాయి.
సుబ్బారావు పాణిగ్రాహి పాటలు, భూషణం, రావి శాస్త్రీ, ఎన్నెస్ ప్రకాశరావు- కారా కథలు, శ్రీశ్రీ కవిత్వం, శివసాగర్ కవిత్వం, దిగంబర, తిరగబడుకవులు మమ్ముల్ని ముంచెత్తారు. ‘అవున్నన్నా కాదన్నా మేం కమ్యునిష్టులం’ కావాల్సిందేననుకుంటున్న దశ. కాలేజీల్లో చేరినంక ఈ అధ్యయనం, రంధీ ఎక్కువయ్యాయి.
జవాబుదొరకని అప్పల్రాముడి కొడుకు హత్య- మొత్తంగా రైతుకూలీలుగా, పాలేర్లుగా, మారిపోయిన మా ఊళ్లలోని మాల మాదిగల కళ్లల్లో కన్పించేది. ఆ కంఠ స్వరంలో వినిపించేది. వ్యవసాయమే జీవనాధారమైన పల్లెల్లో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతుండటం అవి ఇరవైఏండ్లు నాలోపల ఘనీభవించడం- యాతన – మనసున బట్టని యాతన… బతుకులు ఉన్నకాడ ఉండనీయని నిరంతర కొట్లాటలు- గొడువలు- మనసున పట్టని చదువు. చాలీ చాలని బతుకులు – ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని రాజకీయాలు… అంతూ పొంతూ లేని రాతలు- అనేకానేక చర్చలు, మీటింగులు…
-2-
మదరాసు నుండి కతకత్తాకు- విశాఖపట్నం మీదుగా విజయనగరం కెడంగా పోయే గ్రాండ్ ట్రంక్ రోడ్ నుండి ఆరుమైళ్లు కుడిగా, సముద్రానికి ఐదు మైళ్లు ఎడంగా, కాలినడకన శ్రీకాకుళానికి పదిహేను మైళ్ల దూరంలో ఉన్న మురపాక (సుందరపాలెం) ఊరిలో మాస్టారు నిండా విఫల, బాల్య, కౌమార ప్రేమలు, మాకన్నాముప్పైఏడ్ల ముందు గ్రామం గాలిలో కలెగలిసి పోయిన మాష్టారు భావోద్వేగాలు. ఉత్పత్తి శక్తులు ఫ్యూడల్ నిప్పులో కాలిపోతున్న కమురు వాసన – మూడువేల సంవత్సరాలుగా కుళ్లిపోయి కంపుకొడుతున్న కుల వ్యవస్థ- వర్గ వ్యవస్థ- ఏ చిన్న మార్పుకెరటమైనా అతిపురాతన భారతీయ బ్రాహ్మణీయ గ్రామీణ కుళ్లులో కలిసిపోయింది. విరిగిపోయింది. ట్రంకురోడ్డు, గ్రామల్లోన్నివిలువైన ఉత్పత్తులను దోచుకుపోయి తెల్ల వాళ్లు కలకత్తా రేవుకెత్తారు. బ్రిటన్ భారతీయుల నెత్తురుతో బలిసిపోయింది. దళారులు రంగులు మార్చి ఇలాంటి గ్రామాల శవాల దిబ్బల్లో సొమ్ము చేసుకున్నారు.
ఊర్లో గుడి – అతి పురాతన యుద్ద క్షేత్రం – రక్తం, కన్నీళ్లు పారేదక్కడే. అప్పల్రాముడు గోనెపట్టాలో తెచ్చిపడేసిన తన కొడుకు శవం అక్కడే. న్యాయాన్యాయాలు ఇంకా పరిష్కారం కాని కోట్లాది రైతాంగం ఆకాంక్షల ప్రతిరూపమది.
ఇలాంటి యుద్ద భీభత్సంలోకి నక్షలైట్లలా – పువ్వుల పుప్పడిని పరపరాగం చెందించే పక్షుల్లాగా కొన్ని పుస్తకాలు వచ్చి గుడిలో చేరాయి. కన్నీళ్ల తో అలుక్కుపోయిన అక్షరాలు ఆ పక్షుల రెక్కల గాలిని పసిగట్టాయి.
1947 తర్వాత నల్ల, తెల్ల దోపిడీ దారులకు కొత్త దళారుల, మధ్యవర్తుల అవసరం మేరకు గ్రామాల్లోకి బడులు వచ్చాయి.
చదువనే గడ్డపోచతో – కరణం కొడుకే అయినా అంత డబ్బు, వసతీలేని రామారావు మేస్టారు చదువుకోవడం, పంతులు కావడం, విశాఖ పట్నం ఉపాధ్యాయుడుగా రావడం – అదొకనిరంతర యాతనల చరిత్రే కానీ మురపాకలో నిత్యం నిరంతరం కనిపించి, వినిపించే భౌతిక, భౌద్దిక భూస్వామిక అణచివేత – ఆ హత్యాకాండలో నొక్కిపట్టిన గొంతు, ఇంకిపోయిన కన్నీళ్లు ఇక్కడ నేరుగా కన్పించవు, నిజమే కానీ అనతి కాలంలోనే విశాఖపట్నం అనేక పల్లెల జీవరక్తాన్ని తాగిన నగరం అయినా నెత్తురు కనిపించని నంగనాచిలా కనిపించింది.
అప్పటికే విశాఖ లో రావిశాస్త్రీ, చలసాని ప్రసాద్, భారత కమ్యూనిష్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘం, ఐవీ సాంబసివరావు లాంటి వారెందరో ఉన్నారు. వాళ్లు విశాఖ పట్నం గురించే కాదు, కమ్యునిష్టు మేనిఫెస్టో మొదలుకొని, చైనా విముక్తి దాకా తెలిసిన వాళ్లు, గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతిక వాదంతో పాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలు ఎందరెందరో చర్చోపచర్చలు చేసే వాళ్లు. ప్రపంచ సాహిత్యం, భారతీయ సాహిత్యం కుప్పపోసి బంతితిప్పే బాపతు రచయితలు… అప్పటికే మద్రాసు చేరిన కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ సాహిత్యం కారా చదివారు.
తన లోలోపల ఏవో తిరుగుతున్నాయి కానీ తన చుట్టున్న వాళ్లను, వారి ప్రాపంచిక జ్ఞానాన్ని చూస్తే భయమేసేది. నిత్యమూ నిరంతరం స్కూలూ, ట్యూషన్లు చెప్పకపోతే గడవని స్థితి. సముద్రంలో తనో నీటిబిందువు, తనచుట్టూ ఉన్నవాళ్లు గజయీతగాళ్లుగా కనిపిస్తున్నారు. అయినా మురపాక – తనకుబలాన్ని దుఃఖాన్ని ఇచ్చిన మురపాక … దుమ్ము నిండిన బాటలు, నెత్తురు, చెమటతో తీసిన పంటలు, పంటపొలాలు తన లోపలున్నాయి. భారత దేశంలో కోట్లాది మంది నివసించే ఒక నమూనా గ్రామం తన భౌతిక, భౌద్దిక రూపంతో తన అనుభవంలో ఉన్నది.
వాళ్లందరిలో అదే తన బలంగా గుర్తించారు కారా. తను నేలమీద బలంగా నిలబడగలడు, నడువ గలడు.
అప్పటికే కమ్యునిష్టు పార్టీలో రణదివే రగడ లేవదీశాడు. రష్యా, చైనాల మధ్య చర్చల దుమారం రేగుతోంది. మనుషులు బయటకు కనిపించే జీవితం వెనక ఒక సమాజం – దానికి ఒక తత్వ శాస్త్రం రాజ్యం చట్టం ఉన్నాయని కోకు నవలలు, కధలు విరివిగా రాస్తున్నారు. అదనపు విలువ గురించి రావి శాస్త్రి ఋక్కులు బల్ల చెక్క సబ్బుబిళ్ల రాశారు. శ్రీ శ్రీ మహాప్రస్థానం గీతాలు విశాఖలో మోగుతున్నాయి. మావో వైరుధ్యాలు కోకు అనువాదం చేశారు. రష్యా, చైనాల సాహిత్యం విరివిగా అందుతోంది…
నలబై సంవత్సరాలుగా తనలో పేరుకుపోయిన వత్తిడి, నిద్రలో మెలకువలో, వెంటాడే మురపాక, తడిబట్టలతో గొంతులు కోసే శ్రీరాములు నాయుడి నెహ్రూమార్కు స్వాతంత్రం. భూములు సాపు చేసుకొని సాగు చేసిన రైతాంగం క్రమంగా ఈ కౄర యజ్ఞం లో సమస్తం కోల్పోయి రైతు కూలీలుగా, పాలేర్లుగా రెక్కలే ఆస్తిగా మిగిలిన క్రమం, క్రతువు – ముఖ్యంగా దళితులు. ఉత్పత్తి శక్తులు- ఉత్పత్తి సంబంధాల పోరాటం రూపుగడుతోంది…
కన్పించే జీవితం వెనుక కన్పించని ఆర్థిక ఉచ్చులు, చట్టం, న్యాయం వగైరా, వగైరా… స్థూలంగా నిత్యం, నిరంతరం తమ ఊపిరంత సహజంగా అభివృద్ధి చెందాల్సిన ఉత్పత్తి శక్తుల భీకర పోరాటం పెనుగులాట, వాటిని అణిచి వేసే దోపిడి రాజ్యం కళలు, దేవుడు, ఉత్పత్తి సంబంధాలు… ఈ భీకర యుద్ద క్షేత్రం భూమి తన ఊరు… ఒక పక్క అశేష పీడిత రైతాంగం – రైతుకూలీలు, మరో పక్క భూస్వామ్యం, దళారీ పెట్టుబడిదారులు – ఇది యజ్ఞం . కారా లోపలి నుండి విస్పోటనంగా యజ్ఞం కథ బయట పడ్డది – 1964లో… అప్పటికి కారా వయస్సు 40 సవంత్సరాలు. ప్రతి వాక్యం కారా లోపల ఊహ తెలిసినప్పటి నుండి రూపొందింది. ప్రతి మాటా మట్టి నెత్తురూ కలెగలిసి రూపొందాయి. పుండు నుంచి చీము బయట పడింది కానీ, తనకు అలకనయ్యింది కానీ, ఈ నొప్పిని అక్కున చేర్చుకునేదెవరు? సాహిత్యం నిండా అప్పటికి ఇలాంటి రైతాంగపు చెమట వాసన లేదు. వన్నెల భాష, దగుల్బాజీ టక్కుటమారాల కుప్పెతెప్పల వ్యాపార సాహిత్యం వెల్లువెత్తుతున్న కాలంలో రావిశాస్త్రి, కొకులతో పాటు యజ్ఞం కథ ఒక నిప్పురవ్వ.
ఏ హంగులూ ఆర్భాటం సుకుమారపు సుతిమెత్తదనం లేని – అందంగా అలంకరించుకుని నిండా ఫ్యూడల్ దళారీ సంకరవాసన పూసుకుని – భారత దేశ పేద ప్రజల మురికి వాసన సోకకుండా గులాబీ పువ్వు ధరించే కాశ్మీర్ పండిట్ బ్రాహ్మణ నెహ్రూనే హంతకుడనేంత మొనగాడా – ధోవతి కట్టుకున్న, పెద్దగా ఇంగ్లీషు చదవని కారా? ఆయన బ్రాహ్మడే అయినా అలాంటి హత్యల టెర్రర్ కథ రాయడంఏమిటి? డాంగే లాగా వర్గ సంకర మాటలు చెప్పక ఇదేం పోయే కాలం? 1964లో రాసిన కథ మరో రెండు సంవత్సరాలకు ప్రచురణ జరిగింది. అంటే కధరాసినా ఏ పత్రిక వెంటనే వేయదుగదా? కథలోని ప్రతి మాటనూ తరచి తరచి చూసుకోవడం- అలాంటి మృత్యు శీతల స్థితిలో రెండు సంవత్సరాలు గడపడం ఎంత యాతన? ఆ కథ మాస్టారును జీవితాంతం వెంటాడింది. అనేక మంది అనేక రకాలుగా చర్చించారు.
1964 నవంబరు 7న కమ్యునిష్టు పార్టీ చీలిపోయి కమ్యునిష్టు మార్కిస్టు పార్టీ ఏర్పడింది. 1966లో చైనాలో మావో సాస్కృతిక విప్లవం తీవ్రస్థాయికి చేరింది. అదే 1966 నవంబర్ (దీపావళి) యువ ప్రత్యేక సంచికలో యజ్ఞం కథ అచ్చయింది.
అప్పుడా కథమీద దుమారం లేచింది. ఇప్పటికీ ఆ దుమారం ఆరిపోనే లేదు. గ్రామాలల్లో ఆడుగుబొడుగు భూమి గుంజుకుని దళితులు మొత్తం దేశవ్యాప్తంగా రైతు కూలీలుగా మారిపోయి యుద్దరంగంలోకి నెట్టబడ్డారు. దస్యులుగా నిరంతరం యుద్దాల్లో ఉన్న ఆదివాసులు, పితృస్వామ్యం ఆస్థి గుంజుకున్న మహిళలతో చేరారు.
ఇది యజ్ఞం కథ. దాసులుగా బహుజనులను నిత్యం దోపిడి చేస్తు – పావులుగా వాడుకుంటున్నది భూస్వామ్యం. ఆరిపోని నిత్యం నిరంతరం భారతీయ రైతాంగ భూపోరాట గాథ… కోట్లాది మంది హత్యా కాండ కథ. దేశాన్ని కొల్లగొట్టి పెరిగిన ఢిల్లీలో రోడ్లమీద వేలాది మంది భైటాయించి ఆరునెలలుగా పోరాడుతున్న రైతాంగ గాథ.
-3-
ధర్మపన్నాగాలెంతవరకూ… అంతా నువ్వు చెప్పినట్టు వినేవరకూ…
ఆ తర్వాత… !
ఇది 1964లో కారా మాస్టారు రాసిన యజ్ఞం కథ ముగింపు వాక్యం. మానవ చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే – మార్క్సు
ఆ తర్వాత ఏం జరిగింది? నక్సల్బరీలో రైతాంగం జోతేదారుల పంటలు స్వాధీనం చేసుకున్నారు. సాయుధ పోరాటం వదిలి పార్లమెంటు పంథా పట్టిన ఉభయ కమ్యునిష్టు పార్టీలు రాజ్యాంగ యంత్రంలో భాగమయ్యాయి. వాళ్ల మార్గం కాదని 1967లో రైతాంగం నక్సల్బరిలో సాయుధ పోరాట రూపం తీసుకున్నది. అదే 1967లో శ్రీకాకుళంలో ఆదివాసులు బుగతల మీద తిరగబడ్డారు… ఒక నిప్పురవ్వ దావానలమై దేశమంతా వ్యాపించింది.
రాజ్యం కలవరపడ్డది. ఎప్పటిలాగే తన పోలీసు బలగాలతో రైతాంగ ఆదివాసీ తిరుగుబాట్ల మీద దాడికి దిగింది.
అప్పటి నుండి ఇప్పటి దాకా అనేక మలుపులతో విప్లవోద్యమం భారతదేశంలో 13 రాష్ట్రాల్లోకి విస్తరించి నిలదొక్కుకోవడం అందరికీ తెలిసిందే.
శ్రీకాకుళ ఆదివాసీ పోరాటం మీద నిర్భంధం కొనసాగుతున్న దశలో – నాయకులను ఎన్కౌంటర్ పేరుమీద హత్యలు చేస్తున్న దశలో విశాఖ విద్యార్థులు రచయితలారా మీరెటువైపు అని ప్రశ్నించారు. జులై 4 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది.
శ్రీశ్రీ, కె.వి.రమణా రెడ్డి, ఎం.టి.ఖాన్, చలసాని ప్రసాదు, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు, చరబండరాజు, జ్వాలా ముఖి నిఖిలేశ్వర్, వరవరరావు లాంటి వాళ్లెందరో పోరాడుతున్న ఆదివాసుల పక్షాన నిలబడ్డారు. విరసం పోరాడే ప్రజలకు జెండా అయ్యింది.
వైయుక్తిక, భావవాద, మార్మిక వాద, వ్యాపార, సంస్కరణవాద రకరకాల సాహిత్యం స్థానంలో తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యం స్పూర్తితో ప్రజాపోరాటాల నేపధ్యంలో మార్కిజం -లెనినిజం- మావో లోచన విధానం ప్రాతిపదికగా సాహిత్య కళా రూపాలు ప్రజోద్యమాలతో సంలీనమై… రూపంలో, సారంలో, భాషలో ప్రజా పోరాట స్వభావాన్ని సంతరించుకున్నాయి… యజ్ఞం కథ విస్తరించింది. భూషణం కొండగాలి అడివంటుకున్నది విస్తరించాయి.
ఈ మొత్తం సాహిత్యోద్యమంలో, విరసంలో కారా భాగం… రచయితల మీద కుట్రకేసులు – అరెస్టులు, జైల్లు- పెరిగిన నిర్భంధం దశలో దశలో కారా – విరసానికి కార్యదర్శిగా పనిచేశారు.
-4-
కారా కథలు మరింత పదునెక్కి రాజకీయమయ్యాయి. ఉత్పత్తి శక్తులను దోచుకొని- వారికి కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ లేని దుర్మార్గమైన కౄరమైన భూస్వామిక దోపిడిని అది దళితులను ఎంత నికృష్ట స్థితికి నెట్టుతున్నాయో వాళ్లు తిరుగబడక తప్పని స్థితిని ‘చావు’కథలో రాశారు. అర్ధవలస అర్ధ భూస్వామిక దోపిడికి ప్రజాస్వామ్య ముసుగు తొడిగి, సమస్తం రకరకాల రూపాలతో దోచుకోవడం కుట్ర – అలాంటి కుట్రను విప్పి చెప్పి మెజార్టీ శ్రామిక ప్రజలు పోరాడి దోపిడి, హింసలనుండి విముక్తి కావడం విప్లవం అవుతుందని కారా ఎలుగెత్తి చాటారు. కుట్ర ప్రభుత్వాలది, ప్రజల తిరుగుబాటు బహిరంగ విప్లవంగా కుట్ర కథ రాశారు. సమస్త పేర్లతో ప్రజలను మోసం చేసే దోపిడీ చేసే ఉత్పత్తి పద్దతుల స్వరూపాన్ని ఎండగట్టాడు. నెహ్రూమార్కు సోషలింజంలో – ప్రజల రక్త మాంసాలు కొల్లగొట్టే పెట్టుబడిదారులకు, భూస్వాములకు కట్టబెట్టే, రాజ్యాంగ యంత్రం, చట్టాలు, అతిపెద్ద కుట్ర అని కారా కుట్ర కథలో నిరూపించారు. కుట్ర కథ 1947 తర్వాత స్వాతంత్రం పేర జరిగిన అధికార మార్పిడి భారత దేశ ఆర్థవలస, అర్ధ భూస్వామిక ఆర్ధిక కుట్రను బట్టబయలు చేసింది. ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాలను, వాటి మధ్య గర్షణను పునాది, ఉపరితలాంశాలతో సహా ఇంత శాస్త్రీయంగా చర్చించిన కథలు తక్కువ.
యజ్ఞం కథ గ్రామీణ భూస్వామిక ఉత్పత్తి సంబంధాలను ఎండగడితే, కుట్ర కథ దళారీ పెట్టుబడి దాని ఉత్పత్తి సంబంధాలను రూపుకట్టింది. స్థలకాలాల్లో అభివృద్ది నిరోదకమైన -దోపిడి హింసలతో కూడుకున్న – అత్యధిక గ్రామీణ ప్రజల మనుగడకు అవరోధంగా ఉన్న పాత సమాజాన్ని కూలదోసే శ్రామీక వర్గంతో సాహిత్యం నిరంతరం కలిసినడుస్తుంది. కార్ల్ మార్క్స్ చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అన్నారు. తత్వవేత్తలంతా సమాజాన్ని విశ్లేషించారు. కానీ దీన్ని మార్చాలి… మార్పు క్రమం సమాజంలోనూ, సాహిత్యంలోనూ ఆరంభమయ్యింది…
విప్లవోద్యమం ఉత్పత్తి శక్తుల అభివృద్దికి అడ్డంకిగా ఉన్న ఉత్పత్తి సంభంధాలను కూలదోసే వర్గపోరాటం మూడులక్ష్యాలతో- వర్గపోరాటం, ఉత్పత్తి శక్తుల వికాసం, శాస్త్రీయ విజ్ఞానం ప్రాతిపదికగా కొనసాగుతుంది. ఈ పోరాట క్రమంలో రాజకీయాలు సాహిత్య కళా రూపాలు ఒక భాగం.
నక్సల్ బరీ, శ్రీకాకుళ పోరాట అనుభవాలు సమీక్షించుకుని భారతదేశవ్యాపితంగా పీడిత ప్రజలు పోరాటాల్లోకి సమీకరించబడ్డారు. ఈ క్రమంలో అంతవరకూ జరిగిన భారతదేశ ప్రజా పోరాటాల అద్యయనం విరివిగా కొనసాగింది. చిన్నవో పెద్ద వో అన్ని ప్రాంతాల్లో విప్లవ పార్టీలు ఏర్పడి పనిచేయనారంభించాయి.
1967లో పాత రివిజనిస్టు ఆచరణ మీద తిరుగుబాటుతో, చైనా సాంస్కృతిక విప్లవ ప్రభావంతో ఆరంభమైన నక్సల్బరి, శ్రీకాకుళ విప్లవోధ్యమాలు 1972 నాటికి తమ రాజకీయ ఆచరణ, అవగాహనలోని అతివాద, మితవాద దోరణులతో, ప్రభుత్వం పెద్ద ఎత్తున హింసాత్మకంగా అణచివేయడంతో వెనుకంజ వేశాయి. తమ పోరాట అనుభవాన్ని ఆత్మపరిశీలన చేసుకున్నాయి. దేశంలో అత్యయిక పరిస్థితి 1975 నాటికి నిర్మాణం కాని ప్రజాందోళన వివిధ రూపాల్లో దేశవ్యాపితంగా గొప్ప తిరుగుబాట్ల రూపంలో చెలరేగింది. దేశంలో అత్యయిక పరిస్థితి ప్రకటించి, లక్షలాదిమందిని జైళ్లలో పెట్టి సుమారు ముప్పైవేల మందిని వివిధ రాష్ట్రాలల్లో హత్యకావించింది అప్పటి ఇందిరాగాంథీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాలంలో జరిగిన అన్ని రకాల రాజకీయ, విప్లవోద్యమ పోరాట ప్రకంపనలన్నీ విరసం సాహిత్యంలో ప్రతిభింభించాయి.
రష్యాలో 1905 బూర్జువా విప్లవం ముందటి భావవిప్లవానికి దోహదం చేసిన టాల్ స్టాయ్, గోర్కి, తుర్గెనేవ్ లాగా తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ, కొకు, చలం, రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు తమ వంతు కర్‌ివ్యాన్ని నిర్వర్తించి ఫ్యూడల్, భావవాద సాహిత్యం స్థానంలో తిరుగుబాటు శాస్త్రీయ ఆలోచనలను ప్రవేశపెట్టి ఎందరో యువ రచయితలను సమీకరించారు. శ్రీశ్రీ పౌరహక్కుల ఉద్యమంలో భాగంగా(1974, 1975) తెలంగాణలోని ప్రతి చిన్న పట్టణానికి వచ్చి విప్లవ శక్తులను కూడగట్టడమే కాక, అండగా నిలబడ్డారు.
విరసంలో జరిగిన అనేక పాత కొత్తల సామాజిక సంఘర్షణలోంచి చాలా సాహిత్యం వచ్చింది. ముఖ్యంగా అన్ని సాహిత్య రూపాల్లో… నాటకం, బ్యాలే, పాట, కవిత్వం, ఉపన్యాసం, నవలలు, కథలు, సాహిత్య విమర్శ, అనువాదం లాంటి అనేక ప్రక్రియలల్లో విరసం నాయకత్వంలో సమిష్టి కృషి జరిగింది. అనతికాలంలో జననాట్యమండలి లాంటి సాంస్కృతిక సంస్థల నిర్మాణానికి (1972) విరసం ప్రేరణ అయ్యింది.
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత విప్లవోద్యమాలు పరిణామాత్మక పోరాటాలను సమీక్షించుకుని, ‘కొందరు వీరులు మాత్రమే చరిత్ర నిర్మాతలు కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలన్న’ అవగాహనతో తమ శక్తులన్నింటినీ సమీకరించుకుని వ్యవసాయ విప్లవం ప్రాతిపదికగా 1977 నుండి రైతంగా పోరాటాలల్లో భాగంగా విద్యార్థులు గ్రామాలకు తరలారు. మార్కిజం – లెనినిజం- మావో ఆలోచనా విధానం గైడ్ లైన్ గా గ్రామాల్లోని ఆర్థిక , రాజకీయ, సామాజిక విషయాలను అధ్యయనం చేయడం తో పాటు రికార్డు చేశారు.
కరింనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతుకూలీ సంఘాలు ఏర్పడి పెద్ద ఎత్తున భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఆరంభమయ్యాయి. దున్నేవారిది భూమి, వెట్టి రద్దు, పాలేర్ల జీతాల పెంపు, కూలి రేట్ల పెంపు, ఆశ్రిత కులాల వెట్టి రద్దు – ప్రజాపంచాయితీలు, డిమాండ్లతో పెద్ద ఎత్తున వేలాది మంది సబ్బండ వర్ణాలు పోరాటాల్లో కదిలారు. వేలాది ఎకరాల భూమి అక్రమించుకున్నారు. పంచాయితీల్లో అక్రమంగా వసూలు చేసిన దండగలు వాపస్ తీసుకున్నారు. ఆ క్రమంలో తెలుగు లో, ఇతర భారతీయ భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రైతాంగ పోరాట నేపథ్యంలో భూమి కేంద్రంగా వచ్చిన సాహిత్యాన్ని విప్లవోద్యమాలు అధ్యయనం చేశాయి.
వట్టి కోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, గంగు, దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్లు, మోదుగు పూలు, ఉన్నవ మాలపల్లి, ప్రేమ్ చంద్ గోదాన్, భూషణం కొండగాలి, వాసిరెడ్డి సీతా దేవి నవలలు, సుంకర, వాసిరెడ్డి మా భూమి నాటకం, చౌలీ పో ఉప్పెన, రష్యా బీళ్లు దున్నేరు, టావ్ చింగ్ నా కుటుంబం, ఎమిలీ జోలా భూమి, శివరామ కారంత్ మరల సేద్యానికి , నిరంజన్ మృత్యుంజయులు, గోపీనాథ్ మహంతి అమృత సంతానం, శివశంకర పిళ్లై కూలిగింజలు, కారా యజ్ఞం , చావు, ఆర్తి లాంటి అన్ని కథలు చాలా మంది విప్లవోద్యమ ప్రజలు, విద్యార్థులు, నాయకులు చదివారు, చర్చించారు, విశ్లేషించారు. తమ చైతన్యంలో భాగం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలోకి పుస్తకాలు ప్రవేశించాయి.
లోతైన సాహిత్య అధ్యయనం చేయడమే కాక, ప్రజాసాహిత్యం పెంపొందడానికి నిర్మాణం, నిరంతర సాధన అవసరం అని భావించారు. విరసం, జననాట్య మండలి చొరవతో విప్లవోద్యమాలనుండి ప్రజా రాసులనుండి రచయితలు, కవులు, కళాకారులు వచ్చారు. వారందరికీ ఎక్కడికక్కడ అధ్యయనం, తర్ఫీదు మొదలయ్యాయి. అనేక పాటలు, కథలు పోరాటంలోనుండి ఎదిగిన వాళ్లు రాశారు. వందలాది కథలు ప్రజలు మౌఖికంగా ప్రచారం చేశారు. ప్రజలు చెప్పుకున్న లిఖితం కాని కథలు కొన్ని వందలు. ప్రతి విప్లవకారుడు కథకుడో, పాటగాడో అయ్యాడు. నిరక్షరాశ్యులు కైగట్టారు. లూషన్ , చైనా విప్లవంలో వచ్చిన మౌఖిక సాహిత్యాన్ని తిరిగి చెప్పిన కథలుగా సంకలనం చేశాడు. మేథావి -మూర్ఖుడు- బానిస, కొండని తవ్విన ముసలివాడు, గొడ్డలి కామ లాంటి అనేక చైనా కథలు గ్రామాల్లో ప్రచారం అయ్యాయి.
భారతదేశంలో మొట్టమొదటి సారిగా విప్లవోద్యమాలు దీర్ఘకాలం – యాభై సంవత్సరాలు – మూడు తరాలు నిలదొక్కుక్కున్నాయి. భారతదేశవ్యాపితంగా వర్గాలుగా, కులాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా, పితృస్వామికంగా అనేక ప్రత్యేకతలతో, వైరుధ్యాలతో అతి పురాతన బ్రాహ్మణీయ భావవాదంతో కొనసాగుతున్నది. ఉత్పత్తి శక్తుల బంధిఖానాలా మారింది. సోషలిస్టు శిబిరం లేని దశలో అనేక ఆటుపోట్లతో – విప్లవోద్యమాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి వైరుధ్యాల గురించి అన్నిరకాల నిర్మాణాల్లో అధ్యయనం – పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యంలో వందలు వేల సంఖ్యలో కథలు, పాటలు, నవలలు, బ్యాలేలు, నాటకాలు వచ్చాయి. భారతీయ సాహిత్యంలోకి, ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. వేల సంఖ్యలో కవులు, కళాకారులు, సాహిత్యకారులు, అన్నికులాల నుండి – దళిత, బహుజన, మహిళ, ఆదివాసి, మత మైనారిటీల నుండి వచ్చారు. సాహిత్యంలో శ్రమైక జీవనం అందులోని ఆరాట పోరాటాలు వచ్చి చేరాయి.
స్థలకాలాల్లో ముఖ్యంగా విప్లవోద్యామాలు మిగతా అన్నిరకాల పోరాటాల్లాగే సాహిత్యం, కళలు ఒక ఆయుథంగా ఎంచి ఎక్కడికక్కడ తగిన నిర్మణాలు, శిక్షణ, విమర్శ, ఆత్మవిమర్శ, గతితార్కిక, చారిత్రక అవగాహనతో వర్గపోరాటాల అభివృద్ది క్రమంలో నిర్మించారు, నిర్మిస్తున్నారు.
-5-
విరసం తో ఉన్నా, బయట ఉన్నా, కాళీపట్నం రామారావు మేస్టారు విప్లవ సాహిత్యోద్యమంలో తన వంతు కర్తవ్యంగా తను రాయడమే కాకుండా రచయితలకు, తమ తరఫు అనుభవాలను పంచడం, సమిష్ఠి శిక్షణా కార్యక్రమాలు, అందుకు తగిన నిర్మాణాలల్లో తనకు వీలైనంత మేరకు పనిచేశారు. రచయితల బృందాలతో తను నడిచారు. అనేక మంది యువరచయితల రచనలు చదివి వారితో ఆత్మీయ సంబంధం నెరిపి రచనలో మెళుకువలు పంచుకున్నారు.
ఏ సాహిత్యానికైనా వస్తువు, శిల్పం, భాష, ఆయా కాలాల సమాజం నుండి రచయిత, కళాకారుడు ఎంచుకుంటాడు. తన దృక్పథంతో, సాధనతో, కృషితో వర్గ పోరాటం లాగే సృజనాత్మకంగా మలుస్తారు. భౌతిక శ్రమల పరిణామ క్రమంలాగే, బౌద్దిక శ్రమలు, సృజనాత్మకత కనిష్ట స్థాయినుండి గరిష్ట స్థాయికి శిక్షణ, సాధనల ద్వారా పెరుగుతాయి. ఇలాంటి కృషి – సమిష్టిగా సాగితే – శిక్షణ, నిర్మాణం వలన ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగటం వలన రాసిలో వాసిలో సాహిత్యకారులు, కళాకారులు ఎక్కువగా వస్తారు. శ్రామిక ప్రజల నుండి విస్మృతికి గురైన అనేక బృందాలనుండి సాహిత్యం వస్తుంది.
విప్లవోద్యమం స్థలకాలాల్లో వైరుధ్యాలను ఎప్పటికప్పడు గుర్తిస్తూనే ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల మార్పుకోసం శ్రామిక వర్గ రాజకీయ అధికారం కోసం కుల, మత, వర్గ , లింగ, జాతి, ప్రాంతీయంగా చీలి ఉన్న ప్రజారాశులను సమీకరించడానికి సాహిత్య కళా రంగాలను నిర్మించడంతో పాటు ఇదివరకే రూపొందిన సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. విప్లవ సాహిత్యాన్ని ముఖ్యంగా ప్రజాసాహిత్యాన్ని ఈ నేపథ్యంలో అర్థం చేసుకుంటే ఏ రచయిత అయినా, కళాకారుడు అయినా వారి సాహిత్యమైనా అర్థం అవుతుంది. ఈ దీర్ఘకాలిక పోరాటంలో వందలాది వేలాది మంది రచయితలు., కళాకారులు, పేరులేని ప్రజారాశుల్లాగా వస్తారు. అనేక మలుపుల్లో కొందరు ఆగిపోతారు. కొత్త వాళ్లు వచ్చి చేరుకుంటారు.
కాళీపట్నం రామారావు కథలను ప్రజా ఉద్యమాల నేపథ్యంలో విశ్లేషించాలి. యజ్ఞం కథ శ్రీకాకుళ ఉద్యమంకన్నా ముందు రాసింది. బద్దలు కాబోయే విస్పోటనం అందులో చిత్రితమైనది. ఆర్తి, చావు, కుట్ర, వీరుడు – మహావీరుడు, శాంతి లాంటి అనేక కథలు ఆ తర్వాతవి. విరసం ఏర్పడి సాహిత్యానికి ఒక నిర్మాణం ఏర్పడి ప్రజాపోరాటాలతో మమేకమైన తర్వాతి కాలానికి, వస్తువులకు సంబంధించినవి.
-6-
నాకు కారా మాస్టారు 1980 నుండి ప్రత్యక్షంగా తెలుసు. 1982 మార్చి మొదటి వారం కారా రైతాంగ పోరాటాలు ఉదృతంగా సాగుతున్న కాలంలో తీవ్ర నిర్భంధంలో కూడా పోరాట ప్రాంతానికి వచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగ పోరాటం దొరలకు విధించిన సాంఘిక భహిష్కరణ కొనసాగుతున్న తరుణంలో కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడిన జగిత్యాలకు వచ్చారు. నిజాం వెంకటేశం, బీఎస్ రాములు, అలిశట్టిప్రభాకర్ లాంటి వాళ్లు జగిత్యాలలోనే ఉన్నారు. వారితో కలిసి ధర్మపురి నుండి కొండగట్టు వేములవాడ, జగిత్యాల, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో పోలీసు క్యాంపుల్లో కూడా గ్రామాలు తిరిగాము. వ్యవసాయ విప్లవం మొదలుకొని నాయకత్వం దాకా గ్రామాలల్లో ప్రజలు, దొరలదాకా ప్రత్యక్షంగా తిరిగి చూశారు. అప్పటికి జరిగిన అనేక సంఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. విప్లవోద్యమంలో ఏ ఏ వయస్సుల వాళ్లు , కులాల వాళ్లు, వర్గాల వాళ్లు, ముఖ్యంగా రైతులు నాయకత్వంలోకి ఎంతమేరకు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. దోపిడి పద్దతులు, మహిళల మీద జరిగే లైంగిక దోపిడి, రైతులు ఆక్రమించిన భూములు, పెరిగిన కూలి రేట్లు, పాలేర్ల జీతాలు, భూములు, పంటల వివరాలు అనేకం తెలుసుకున్నారు.
ఆతర్వాత నేను, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి చాలా సార్లు కారాగారిని కలుస్తూనే ఉన్నాం. భావజాల పరంగా నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాం. ఈ క్రమంలో విప్లవోద్యమాల్లోని ఇన్ని మలుపులు – పెడధోరణలు- రాజకీయ అవగాహనలో పురోగమనం- తిరోగమనం ఎప్పటికప్పుడు కారాగారు తెలుసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా పరిణామాత్మక పోరాటాలు గుణాత్మక పోరాటాలుగా అభివృద్ది చెందిన దశలో ప్రతిష్టంభణకు లోనైన ఎం.ఎల్ పార్టీలు, ముందుకు పోయిన వారి గురించి అర్ధం చేసుకున్నారు.
ఐతే సర్వసంపూర్ణంగా కారాగారు ఏలాంటి శషభిషలూ లేకుండా ఉన్నారని కాదు. భారతీయ సమాజాన్ని, విప్లవోద్యమాల పురోగమనాన్ని ప్రజారాశులను అధ్యయనం చేయడంలో, అర్థం చేసుకోవడంలో ఎన్ని రకాల విశ్వాసాలు, సంఘర్షణలు ఆలోచనా ధోరణలు ఉన్నాయో… కారాకు కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అధ్యయనంతో చాలా వరకు తెలుసుకుని మార్చుకున్నవీ ఉన్నాయి. మార్చుకోనివీ ఉన్నాయి. అయినా భారతీయ సమాజం గురించి, తెలుగు సాహిత్యం అధ్యయనంలో ఆరోగ్యం సహకరించినంత మేరకు చురుగ్గా ఉన్నారు.
రాజకీయాల్లో కూలిపోతున్న పాతదానికి, రూపొందుతున్న కొత్తదానికి ఎంత సంఘర్షణ ఉంటుందో కారా, మేము పరస్పరం అంత సంఘర్షణ పడ్డాము. స్వీయాత్మక ఉద్వేగాలతో, విశ్వాసాలతో భిన్నరకాల సాహిత్యాన్ని, ప్రజలను అర్ధం చేసుకోవడంలో మన ఆచరణలో భాగం చేసుకోవడంలో అంతర్ బాహిర్ వర్గపోరాటం వారితో మా సంబంధాన్ని బలపరిచాయి. పరస్పరం నేర్చుకున్నాము. రఘొత్తమ రెడ్డి వారికి కారాతో గల అనుబంధం గురించి పుస్తకమే రాశారు. ఈ పరస్పర సంఘర్షణ క్రమం – నేర్చుకున్న క్రమం అందులో వివరంగా రాశారు. వ్యక్తుల మధ్య సంబంధాలుగానీ ప్రజా పోరాటాలు గానీ, ఈ నిరంతర ఘర్షణ ఉంటేనే సజీవంగా పురోగమిస్తాయి.
-7-
కథలు రాయడం తగిన ప్రత్యేక నిర్మాణం, శిక్షణతోనే సాధ్యమన్న విషయం 1984 నాటికి రూపుదిద్దుకున్నది. రకరకాల కారణాల చేత విరసంలో పాతకథకులు వారి వారి వ్యక్తిగత కారణాలతో తగ్గిపోవడం – ప్రజారాశులనుండి- కింది కులాల నుండి, మత మైనారిటీల నుండి, మహిళల నుండి కొత్త కథకులు రావడం రీత్యా కథలకు వర్క్ షాపులు అనివార్యమయ్యాయి. పరిణామాత్మక పోరాటాలు గుణాత్మకంగా మారాల్సిన అనివార్య స్థితి. విరసం చొరవతో శిక్షణతోనే అనేక ప్రజాసమూహాల ఆరాట పోరాటాల కథలు రావడం ఆరంభమయ్యింది.
1984లో రావిశాస్త్రి, కారా, చలసాని ప్రసాద్, కృష్ణాబాయి, తుమ్మల వేణుగోపాలరావు విశాఖలో ఉన్న విద్యార్ధులు, యువకుల సహాయంతో నాలుగు రోజుల కథా వర్క్ షాపు విశాఖ పట్నం విరసం నిర్వహించింది. ఆ వర్క్ షాపునకు శాస్త్రీయమైన ఒక ప్రణాళిక లాంటిది రూపకల్పన రావిశాస్త్రి , కారా మిత్రులు కలిసి చేశారు. ముఖ్యంగా పది కథలు వివిధ ధోరణులకు సంబంధించినవి బాగా ప్రసిధ్ది చెందిననవి రచయితల పేర్లు లేకుండా జిరాక్సు తీసి రచయితలకు పంచి ఆ కథల మీద వివరంగా చర్చించారు. కారా, రావిశాస్త్రి మమ్ములందరిని ఆచర్చలో భాగం చేసి మంచి కథలు, చెడ్డ కథలు ప్రజలకు ఉపకారం చేసే కథలు, అపకారం చేసే కథలు వివిధ ముసుగుల్లో రచయితలు ఎలా రాస్తారో వివరించారు. అప్పటికి విప్లవోద్యమం నుండి వచ్చిన కథల్లో ఉండకూడని అంశాల గురించి రావిశాస్త్రి మాట్లాడారు.
అందులో కొన్ని కథలు జాతీయ అంతర్జాతీయ భూస్వామిక పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద భావజాలాలకు ఏవిధంగా ప్రతీకలో చెప్పారు ముఖ్యంగా వస్తువు( కథాంశం) శిల్పం, భాషకు వర్గ స్వభావం ఎట్లాఉంటుందో వివరించారు. బండపాటు, గాలివాన కథలగురించి జరిగిన చర్చ, నిర్ధారణ విప్లవాత్మకమైనవి.
ఆతర్వాత లోపూడిలో కృష్ణాబాయిగారు, అనురాథాగారి సహకారంతో జరిగిన విరసం కథావర్క్ షాపులో కథకు స్థలకాలాల ప్రభావం ఉంటుందని మాకందరికీ కారా తెలియజేశారు. ఎంత గొప్ప కథ అయినా వారి సమూహానికి, ప్రాంతానికి చెందని కథను ప్రజలు వారి వారి చైతన్యంలో భాగం చేసుకోజాలరని… అణగారిన అట్టడుగు ప్రజా సమూహాల జీవితం కథల్లో కి రావాలని చెప్పారు. రకరకాల వెసులుబాట్ల మూలకంగా లౌక్యులైన లేదా స్థితి పరులకు నచ్చే సాహిత్యమే ప్రజాసాహిత్యంగా ప్రచారం జరుగుతున్నదని, ఈ స్థితి మారాలంటే మనమే పూనుకుని ఆయా జిల్లాల నిజమైన ప్రజా రచనలను వెతికి పట్టుకోవాలని కారా చెప్పారు. మొదటి సారిగా జిల్లాల వారీగా రచయితల గురించి అధ్యయనం మొదలయ్యింది. ఆ అవగాహనే విస్తరించి తెలుగులో వచ్చిన అన్ని కథల సేకరణకు కథానిలయం ఏర్పాటుకు అనేక ఇతర కారణాలతో పాటు ఈ అవగాహన కూడా ఒక కారణం. ఇవ్వాళ్ల తెలుగు కథ ఎన్ని రకాల పోకడలు పోయిందో మనం అంచనా కట్టడానికి దాఖలాలుగా నిలిచిన కథలను అధ్యయనం చేయడానికి కథా నిలయం ద్వారా వీలుకలుగుతుంది. విశ్వాసాలతో స్వీయాత్మకతతో కాకుండా విశ్లేషించడానికి అన్నిరకాల కథలు మనకు అందుబాటులో ఉన్నాయి.
నేనొకసారి మాస్టారుతో అన్నాను “ఇంత శ్రమ అవసరమా? కాల గర్భంలో కలిసిపోయినవాటిని బతికించాలా ?”
“నిజమే ! ఇది ఒక ప్రయత్నం ఏది మంచో ఏది చెడో ఎవరికి తోచిన విధంగా వాళ్లం మాట్లాడతాం. దీనికి దాఖలాలు ఉండవు. అదివదిలెయ్ నూరు భక్తి పుస్తకాల్లో ఒకటి హేతువు పుస్తకం ఉండగలిగితే మనం గెలుపు దారిలో ఉన్నట్లు అని మీ పెద్దాయన అన్నట్లు ఎక్కడో చదివాను” అన్నారు నాతో…
ఆ పెద్దాయన ఎవరో నేను రకరకాలుగా పొరబడ్డాను. చాలా ఆలశ్యంగా మావో అన్నారని తెలిసింది.
రఘోత్తమరెడ్డి పూనికతో బండారు కిష్టయ్య, శంకర్, నేను, రఘోత్తం కారా మీద వీడియో తీయాలని బయలుదేరి వారంరోజులు వారితోపాటు గడిపాము.
మమ్ముల్ని తన అనుభవంలోని ఉద్వేగ స్థలాలన్నింటికీ తిప్పారు. నాయుడిగారి పాత డాబా మేడ మెట్లు ఎక్కుతూ ఆ కళ్లల్లో కన్నీటిపొర – డాబా మీద పిట్టగోడనానుకుని ఆయన ముఖంలో కనిపించిన కౌమారపు విషాదపు వియోగపు నిట్టూర్పు… బహుశా ఆయన కథల్లో, అక్షరాలల్లో నిబిడీకృతమైన ప్రేమ, ఆర్తి… పెంకుటిండ్లు, గుడిసెలు, అడ్డసుట్టల ఆడామగా, దుబ్బనిండిన మట్టిరోడ్లు, మాలపేట, సముద్రపు పిచ్చిగాలీ, అతిపురాతన గుడి… ఆ మురపాక వీథులు, పంటపొలాలు కారాగారి ఎన్నివెక్కిళ్లను దాచుకున్నాయో? అదంతా రాయరాక, రాయలేక ఎంత యాతన పడ్డారో? మూడువేల సంవత్సరాల రక్‌సిక్త బ్రాహ్మణీయ భూస్వామ్యం అణగదొక్కిన ఉత్పత్తి శక్తుల సృజనాత్మకత రాయగల భాష, సాహిత్యం రూపొందే క్రమం విప్లవోద్యమమంత సుదీర్ఘమైనది. జయాపజయాలతో, ఆటుపోట్లతో యాతనమయమే అయినా, వీరోచితమైన ప్రజలు నిర్మించే వర్గపోరాట నిర్మాణం కదా.! అందులో నడిచారు కనుకనే ఆ వాక్యాలకు అంత తడి – పదును…
-8-
సృజనాత్మక సాహిత్యం ఉద్వేగాల మిళితం కనుక విశ్లేషించడం కన్నా చదవడం వలన అనుభవంలోకి తెచ్చుకోవడం వలన మనకు మరింత చేరువౌతుంది. కాళీపట్నం రామారావు కథలు నేను దుఃఖం తో, కోపంతో చదివాను. రకరకాల ఉద్వేగాలతో చదివాను, ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. పాత్రలు, వాక్యాలు నిత్యం నిరంతరం ఆయా సందర్భాల్లో వెంటే ఉంటాయి. అప్పల్రాముడు 1977లోనే నాకు అర్థమయ్యాడు అనుకున్నాను. సంపద- శ్రమ – అదనపు విలువ కులప్రాతిపదికన కొల్లగొట్టబడ్డాయని 1977వరకు నాకు తెలువదు… కులం పునాదిలో తిష్టవేసిన వేరుపురుగు అనే ఎరుక లేదు… ఎనిమిదవ తరగతిలోనే అంబేద్కర్ కులనిర్మూలన చదివినా వంటబట్టలేదు. అలాంటి బహుజనులు, దళితులు, మహిళలు, ఆదివాసులు విప్లవోద్యమ నాయకులై భారత దేశంలో సాయుధపోరాటంలో ముందు వరుసలో నిలబడుతారని నేనూహించలేదు. తన కొడుకు తలనరుక్కున్నా అప్పల్రాముడు అతని కొడుకు ఇప్పుడు ఘనమైన భారతదేశ బ్రహ్మణీయ దళారీ ప్రభుత్వాలకు అంతర్గత ముప్పుగా పెనుసవాలుగా నిలిచారు. మూడువేల సంవత్సరాలుగా పోరాడుతున్న ఆదివాసులు ఆధునిక యుద్ద రీతులు నేర్చుకుంటున్నారు. పితృస్వామిక భావజాలం కింద నలిగిపోయిన మహిళలు పురుషుల కన్నా ఎక్కువగా యుద్దరంగంలో నిలిచి పోరాడుతున్నారు.
ఇవ్వాళ్ల భారతదేశ రాజకీయాలు, సమస్త కళలు, కులాల పేరుమీద ప్రజలను చీలదీసే కళలో ఆరితేరుతున్నాయి. ప్రజాపోరాటాలు పదునెక్కుతున్న దశలో చిట్టచివరి మోసపూరితమైన ఎత్తుగడ ఇది. అలాంటి ప్రచారాలకు మునుపెన్నడు లేనంత పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి ప్రవహిస్తోంది. ప్రజల మాటలతో ప్రజల సొమ్ముతో ప్రజలమీద దాడికి దిగుతున్నారు. అయితే ఇది కొత్త కాదు. ఈ ఎత్తుగడల గురించి అధ్యయనం అవగాహన ప్రజా ఉద్యమాలకు, ప్రజా సాహిత్యానికి పెరిగింది. కులం పునాదిగా గుర్తించిన విప్లవోద్యమాలమీద సాంస్కృతిక దాడి పెరిగింది.
ఎవరు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ల వెనుక ఎవరు నిలుచున్నారో వివిధ సమూహాల ప్రజలు దేశ వ్యాపితంగా ఉద్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. వర్గ, కుల, లింగ, మత ప్రాంతీయ, జాతి వైరుధ్యాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం అలాంటి పీడిత ప్రజలు నాయకులుగా తాము కోల్పోయిన సమస్తం తిరిగి పోరాటం ద్వారా సాధించుకునే చైతన్యం దిశగా అభివృద్ది చెందుతున్నారు.
మనం విశ్వాసాల మీద ఆధారపడో, రచనల మీద ఆధారపడో రచయితలను అంచనా కట్టరాదు. రచయితతో కలిసిపోవాలి. మనకు వీలైనంత మేరకు వాళ్లందరినీ కలువాలి. మొదట వాళ్లను వినాలి. తెలుసుకోవాలి… అప్పుడు మనకు వారి బలం, భావోద్వేగాలు విశ్వాసాలు తెలుస్తాయి. వాటికి కారణాలు అర్థమౌతాయి. వారితో నిరంతర స్నేహపూర్వక వాతావరణం పెంచుకుంటే మనకు ప్రపంచ వ్యాపితంగా ఉన్న మనలాంటి రచయితలు అందించిన సాహిత్యం, అనుభవం తెలుస్తుంది. వారితో మనం మన ఆధిపత్యం లేకుండా పరస్పరం తెలుసుకోవాలి. ఇది కారా నుండి మాకు అందిన అవగాహన. వారు మాకు (రఘోత్తమ్ కు, నాకు) చాలా మంది రచయితలను పరిచయం చేశారు. మా అంతట మేము రచయితలను వెతుక్కుంటూ వెళ్లాము…
విరసం ముప్పైకి పైగా కథా వర్క్ షాపులు వివిధ ప్రాంతాల్లో అక్కడి స్థానిక రచయిత/ రచయిత్రులతో నిర్వహించింది. సోదర రచయిత/రచయిత్రులు- అనేక సంస్థలు, వ్యక్తులు పూనుకుని చాలా కథల వర్కషాపులు నిర్వహించారు. దాదాపుగా అలాంటి అన్ని రకాల వర్క్ షాపుల్లో వీలైనంత మేరకు విరసం రచయితలు పాల్గొనటం వలన – కథ గురించిన అథ్యయనం, అవగాహన పెరగటమే కాక, వందలాది మంది కథకులు వచ్చారు. పదుల సంఖ్యలో మునుపెన్నడు ఎరుగని చీకటి కోణాలు జీవితాల గురించిన సంకలనాలు, ప్రతి సంవత్సర కాలంలో వచ్చిన ప్రాంతీయ, జిల్లాలవారీ, దళిత, మహిళా, మత మైనారిటీల కథలు, సాహిత్యం రాశిలో వాసిలో విశేషంగా వచ్చింది.. వస్తున్నది.. కథా రచయితల మధ్య అనుబంధం అవగాహన పెరిగాయి.
ఇవ్వాళ్ల ప్రజావ్యతిరేకమైన కథ తెలుగులో రావడం అరుదు… ప్రజాజీవితం నేపథ్యంగల కథ తిరుగులేని సాహిత్య రూపంగా ఎదిగింది. అన్ని ప్రచార మాథ్యామాలు, దృశ్య, శ్రవణ, సోషల్ మీడియాలోకి విస్తరించింది.
కథకు సంబంధించిన వస్తువు, శిల్పం, భాష, దృక్పథం లాంటి అంశాల్లో తెలుగు కథ మిగతా ప్రాంతీయ భాషలకన్నా విస్తృతంగా, రాజకీయంగా గొప్ప పరిణతి సాధించి, ప్రపంచ సాహిత్యానికి సరితూగే విధంగా వస్తోంది. అన్నిరకాల ప్రజా ఉద్యమాలతో పాటే తెలుగు కథ నడిచింది, ఎదిగింది. రచయిత/ రచయిత్రుల అధ్యయనం, అనుభవం చాలా పెరిగింది. విభిన్న చీకటి కోణాలలోకి కథ పయనించడమే కాక వందల సంఖ్యలో పుట్టుకథలు వచ్చాయి.
ఈ మొత్తం కథా పరిణామ క్రమంలో జ్ఞాతంగానో, అజ్ఞాతంగానో కారా ఉన్నారు. వారి విశేష కృషికి దాఖలాగా వారు – వారి సహచరులు, కుటుంబసభ్యులు, సాహిత్య ప్రేమికులు, ప్రజాస్వామిక వాదులు, కలిసి నిర్మించి, సేకరించి – మన అధ్యయనం కోసం నిలబడిన కథానిలయం ఉన్నది… కారాగారు మమ్ములను వారి పిల్లల్లాగే చూశారు.. వారి కుటుంబం మమ్ములను ఆదరించింది.
వేలాది కథలతో పాటు – అంతక ముందటి తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరి, శ్రీకాకుళం నుండి నేటి దాకా కొనసాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం కోసం కొనసాగుతున్న వర్గోపోరాటం నుండి వచ్చిన వందలాది కథలు, నవలలు, జ్ఞాత- అజ్ఞాత రచయితలవి సేకరించిన లక్ష తెలుగు కథల్లో నీటిలోని చేపల్లాగా ఉన్నాయి. విలువైన కొన్ని నవలలు ఉన్నాయి. ఎంత నిర్భంధమున్నా ప్రజల్లో లీనమైన విప్లవోద్యమంలాగా కథానిలయంలో పీడితుల, రకరకాల సమూహాల యధార్థ కథలతో పాటు విప్లవ కథలు విస్తరించి ఉన్నాయి.
కారా మాస్టారు అనేక సందర్భాల్లో కథల గురించి చెప్పిన విషయాల్లో నాకు అర్థమైనంత మేరకు నా భాషలో కొన్ని…
– పుట్టుకథలు – కట్టుకథలు ఉంటాయి. పుట్టుకథలు రాశిలో తక్కవగా వచ్చినా వాసిలో నిలుస్తాయి. కట్టుకథలు పుంఖాను పుంఖంగా వచ్చినా నిలబడవు.
– సాథారణంగా రచయితలు ప్రపంచంలోని సాధారణ ఉద్వేగాలైన దుఃఖం, కోపం, ప్రేమ, కరుణ లాంటి విషయాల గురించి ఎక్కువగా రాస్తారు. ఇలాంటి కథలకు స్థలకాలాల ప్రమేయం తక్కువ. ప్రజల దైనందిన ఆరాట పోరాటాలు- స్థలకాలాలల్లో వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి- చలనంలో ఉండి జీవితంలో ఉంటాయి. నామట్టుకు నేను పాఠకులు పరిమితమే అయినా.. రెండో రకం కథలే ఇష్టపడుతాను.
– ఇదివరకే ఎవరైనా రాసిన వస్తువు మనం రాయడం వలన మన శ్రమ, పాఠకుడికాలం వృధా. ఏమి రాయాలో ఏది రాయకూడదో తెలుసుకోవడానికి రచయితలు బాగా చదవాలి. కథ మనం అనుకున్న విధంగా వచ్చేదాకా సాధన చేయాలి. ఇతరుల నుండి, ప్రజల నుండి నిరంతరం నేర్చుకోవాలి.
– కథలు మనకు ఎంత గాఢమైన సంకల్పం ఉన్నా ఊరికే రావు. నిరంతర సాధనతో పాటు ఉద్యమంగా, సమిష్టిగా నిర్మించాల్సిందే.
– కథ వ్యక్తిగత పనిలాగా కన్పించినా, అది సామాజికం. చచ్చినట్టు మనకు ఇష్టం ఉన్నా లేకున్నా సమాజం, దాని మంచి చెడ్డలతో సహా కథలో వచ్చి కూచుంటుంది… రచయిత పీకపట్టుకుని రాయిస్తుంది.
– రచయితలకు తగినంత అధ్యయనం, ప్రజలతో సంబంధం లేకపోతే – రచయిత ఒకే కథను స్థలాలు, సంఘటనలు, పేర్లు మార్చి పదే పదే రాస్తుంటారు. వ్యాపార సాహిత్యం దాదాపుగా ఒకే కథాంశం చుట్టు నడుస్తుంది. రచయితలు వీలైనంత మేరకు ఎక్కువ తిరగాలి. అన్నిరకాల ప్రజల ప్రత్యేక జీవన మూలాల్లోకి, సంఘర్షణలోకి వెళ్లాలి.
– మనుషులు వారికి ఉండే అవగాహన పరిథి వలన సాధారణంగా చెప్పేదానికి, మనం వాటిని పరిశీలించడానికి చాలా తేడా ఉంటుంది. రచయితలకు విన్నవాటిని విశ్లేషించుకునే పరిశీలన దృక్పథం ఉండాలి. అనేక ఉద్వేగాలతో మిళితమైన సత్యాన్ని గుర్తుపట్టగలుగాలి. సత్యంకు వర్గస్వభావంతో పాటు చలనం ఉంటుంది.
– సమాజం కదలబారుతున్నప్పుడు వివిద రకాల సమూహాల్లో కదలిక మొదలౌతుంది… ప్రజాశత్రువులను తటస్థులుగా, తటస్థులను కార్యోన్ముఖులుగా, కార్యరంగంలోని వారు కనిష్టస్థాయినుండి, గరిస్ఠస్థాయికి ఎదిగే విధంగా మన పనివిధానం ఉండాలి.
– కనిపించే జీవితం ద్వారా కనిపించని జీవితాన్ని సాహిత్యం రూపుకట్టాలి. మార్క్సిజం తెలియని వారికి ఇది అసాధ్యం. మార్క్సిజం పిడివాదం కాదు, జడవాదం కాదు.
– సాహిత్యం మంచికి చెడుపు చేసేదిగా, చెడుకు దోహదం చేసేదిగా ఉండరాదు.
– రాసి కాదు. వాసి ముఖ్యం.
– శాశ్వత సాహిత్యం అంటూ ఉండదు.
– రాజకీయం కాని శుద్ధ సాహిత్యం ఉండదు. ఉందని చెప్పే వారు ఖచ్చితంగా అబద్దమైనా చెబుతుండాలి, మోసగాళ్లైనా అయి ఉండాలి.
– మార్క్సిజాన్ని అత్యంత సృజనాత్మకంగా ప్రజాజీవితంతో అన్వయించి తగిన భావోద్వేగాలతో చిత్రించిన కథలు ప్రజలు పట్టించుకుంటారు. ఎక్కడున్నా, ఏభాషలో ఉన్నా తెచ్చుకుంటారు.
– మనం నడిచిన దారికి, నడిచే దారికి చరిత్రలో లెక్కుండాలి.
-సమాజం ఎన్నిమలుపులు తిరిగిందో, మనుషులు ఎంత యాతన పడ్డారో, ఎన్ని రకాల పోట్లాడారో తెలియడానికైనా చరిత్ర ఉండాలి…
విప్లవోద్యమాల కాలంలో, స్థలంలో తను సాహిత్యం ద్వారా, ప్రజా పోరాటాలల్లో భాగమై మనందరిలాగే ఆటుపోట్లతో జీవించి, మనలో అనేక ఉద్వేగాలు రేపిన ఆయన సాహిత్యం – పోరాడేవారు, వైరుధ్యాలను తెలుసుకోవాలనుకునే వారు చదువతగింది. నిరంతరం చర్చించ తగింది – అమరుడైన కాళీపట్నం రామారావు మాష్టారికి జోహార్లు…
వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపం.
19-6-2021