(1829లో వేమన పద్యాల కూర్పుకు బ్రౌన్‌ రాసిన ఇంగ్లీషు ముందుమాట) 

తెలుగు: సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌

ఏదైనా ఒక భాషను అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం సహజంగానే దేశీయులలో ప్రజాదరణపొందిన పుస్తకాలను గురించి తెలుసుకోవాలని అశిస్తాం. ఆ పుస్తకాలు సరళమైన శైలిలో వుండి విదేశీయులు కూడా తేలికగా అర్థం చేసుకునేటట్లు వుండాలని అనుకుంటాం. తెలుగుకు సంబంధించి 1824లో ఇలాంటి పరిశోధన ప్రారంభించాను. ఆ సందర్భంగా ఈ పుస్తకంలో ప్రచురించిన పద్యాలతో నాకు పరిచయం కలిగింది. ‘వేమ’ లేదా ‘వేమన’ (రెండు పేర్లూ వాడుకలో వుండేవి) రచించిన అనేకమైన రాత ప్రతులు నాకు లభ్యమయ్యాయి. నేను వాటిని చదివి నా ఉద్యోగబాధ్యతల్లో విశ్రాంతి దొరికిన సమయాల్లో అనువాదం చేశాను. వాటిల్లో అనేకరకాలైన తప్పులు`  స్పెల్లింగులకు సంబంధించినవి, లయకు సంబంధించినవి, అర్థానికి సంబంధించినవి కోకొల్లలుగా కనపడ్డాయి. ఏ రెండు రాతప్రతులలోనూ ఆ పద్యాల వరుస ఒకే క్రమంలో లేదు. అంతేకాక, ఆ చాటు పద్యాల సంఖ్య కూడా రెండు వందల నుండి ఎనిమిది వందలదాకా ఒక్కో ప్రతిలో ఒక్కో రకంగా వుంది. నేను నివశిస్తున్న మచిలీపట్నంలో లభ్యమైన రాతప్రతుల కాపీలను సేకరించిన తరవాత విశాఖపట్టణం, నెల్లూరు , గుంటూరు, కడప,మద్రాసుల నుండి మరిన్ని ప్రతులను క్రమక్రమంగా సేకరించాను. తదనంతరం వాటికి సంబంధించిన ఒక సూచికను తయారుచేశాను. తొమ్మిది వరుస క్రమాలలో (కాలమ్‌) ఈ పద్యాలు ఏ ఏ ప్రాంతాలలో లభ్యమయ్యాయో రాశాను. ఇలా చేయడం మూలంగా వాటిని సరిచూసుకునే అవకాశం నాకు లభించింది. మొత్తంమీద నాకు లభ్యమైన పద్యాలు దాదాపు 2500. అయితే వీటన్నింటిని సరిచూసుకున్న తరవాత వాటి సంఖ్య 2000ల కంటె కొంచం ఎక్కువగా వుందని తేలింది.

ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక ఈ పద్యాలను ఒక క్రమపద్ధతిలో పెట్టవలసిన అవసరం కలిగింది. వీటిని ఎత్తిరాసినవాళ్లు /కాపీ చేసినవాళ్లు ఎవరి ప్రాధాన్యతను బట్టి వాళ్ళు వరుసక్రమాన్ని ఎంచుకొన్నారు. అయితే ఈ క్రమాన్ని ఎక్కడ భద్రపరచి వుంచలేదు. నేను ఈ మొత్తం పద్యాలని 5రకాలుగా వర్గీకరించాను. మత సంబంధమైనవి, నైతిక సంబంధమైనవి, వ్యంగ్యాత్మకమైనవి, మార్మికమైనవి మరియు కలగూర గంప లాంటివి. ఈ చివరి రెండు విభాగాలకు చెందిన పద్యాలు, మొత్తం పద్యాలలో సగానికంటె ఎక్కువగా వున్నాయి. అయితే వాటిపట్ల ఆసక్తిగాని, వాటివల్ల ప్రయోజనంగాని వుండవని భావించి ఈ సంపుటిలో వాటిని చేర్చలేదు. ఈ పుస్తకం చదివేవాళ్ళకు మొదటి అధ్యాయం కంటే, రెండు, మూడు అధ్యాయాలు తేలికగా అనిపిస్తాయి. అందుచేత వాళ్ళు మొదటి అధ్యాయాన్ని చివరిలో చదవటం మంచిది.

మార్మికతకు సంబంధించి నిగూఢమైన, నిరుపయోగమైన సిద్ధాంతాల అధ్యయనం తెలుగు ప్రజలలో జరిగింది. వేమన ఇలాంటి పగటి కలలను చాలా కన్నాడు. వాటిని రాయడంలో ఆయన అంతరార్థం ఏమిటో చాలా సందర్భాలలో సందేహాస్పదం. అలాంటి పద్యాలలో తేలికగా అర్థమయ్యే కొన్నింటిని మాత్రమే నేను ఈ సంకలనంలో వుంచాను.  వ్యంగ్యాత్మక పద్యాలలో, న్యాయబద్ధంగా వుండాల్సిన వ్యాఖ్యాల స్థానంలో తనకు నచ్చనివాటిని తిట్టినట్లు వున్న అనేకమైన వాటిని కూడా నేను ఈ సంకలనంలో చేర్చలేదు.  నిజానికి ఇంకా కొన్నింటిని కూడా చేర్చివుండవల్సింది కాదు. అయితే తెలుగు ప్రజలలో వాటికి చెప్పుకోదగిన ప్రజాదరణ వుందని నేను గుర్తించాను. 

ఈ పద్యాలలో కొన్ని ‘భాస్కర’, ‘సుమతి’ అనే వ్యక్తులకు చెందిన సంకలనాలకు చెందినవిగా గుర్తించి వాటిని కూడా బయట వుంచాను. మరికొన్ని పొడుపు కథలు వేమనకు సంబంధించినవి కావని, ‘తిరుమలేశ’ అనే చాటుకవికి చెందినవని గుర్తించి వాటిని కూడా తిరస్కరించాను. 

ఒకదానితో ఒకదానికి సంబంధంలేని ఇలాంటి కలగూరగంప పద్యాలను సాధారణంగా శతకం అంటారు. అంటే హారములు, లేదా శతాబ్దాలు/వందలు అని అర్థం. పాతకాలంలో వీటిని ఆంగ్ల కవులు రచించేవారు. లయలో, వస్తువులో, కోరస్‌లో ఆ పద్యాలన్నీ ఒకేరకంగా వుండేవి. వీటిని ఏ వంద పద్యాలకు ఆ వంద విడివిడిగా సూచించేవారు. ఆ పద్థతినిగాని, ఆ పేరునుగాని ఈ సంకలనంలో వుంచటం అనవసరమనిపించింది. ఈ సంకలనం గ్రీకు, లాటిన్‌ సాహిత్య  రచనల సంకలనాలను పోలివుంది. 

వేమనకు సంబంధించిన ఎలాంటి చారిత్రకతను రాబట్టటం తేలిక కాదు. ఆయన అసలు పేరు కూడా తెలియదు. ఆయన తన వంశనామాన్ని ఎక్కడా తెలియజేయలేదు. ఆయన ‘జంగమ’ వంశానికి చెందినవాడని నేను ఊహిస్తున్నాను. జంగమ అనేది శూద్రులకు సంబంధించిన ఒక కులం. వాళ్ళు కేవలం శివుడిని మాత్రమే పూజిస్తారు. జంగమ మతాన్ని స్వీకరించాక వాళ్ళు తమ వంశనామాన్ని వదిలివేస్తారు.  అప్పటి నుండి వాళ్లను సాధరణాంగా కులం పేరుని బట్టే గుర్తిస్తారు. ఈ జంగమ కులాన్ని గురించి మాత్రమే వేమన ఎక్కడా వ్యంగ్యాత్మకంగా రాయలేదు. వేమన బోధనలకు ఈ జంగమ కులం అనుగుణంగా వుంది. 

ఆయన జన్మస్థలం గురించిగాని, ఆనాటి పరిస్థితుల గురించిగాని వాస్తవాలు సక్రమంగా ఎవరూ పదిలపరచలేదు. జన్మరీత్యా ఆయన ఒక కాపు, లేదా రైతు. ఆయన అనవేమారెడ్డి కుటుంబానికి చెందినవాడని కొందరు వక్కాణిస్తారు. ఈ అనవేమారెడ్డి కాండనూలు లేదా కర్నూలు దేశానికి చెందిన అధిపతి. వేమన సోదరుడు గండికోట దుర్గరక్షకుడు అని చెపుతారు. వేమన కాండనూలుకు చెందిన క్రిష్టపాడు గ్రామానికి చెందినవాడని కొందరు, గుంటూరుకు చెందిన యినకొండ (వినుకొండ) చెందినవాడని మరికొందరు నమ్ముతున్నారు. కడప జిల్లాలోని చిట్వేలులో ఆయన జన్మించారని కొందరు చెప్పడాన్ని కూడా నేను విన్నాను. ఈ ప్రాంతాలన్నింటిలో ఈ విషయాన్ని విచారించే అవకాశం నాకు దొరికిందిగాని ఎలాంటి సమాచారం నాకు లభించలేదు. అయితే ఆయన పద్యాలలో కొన్నింటిలో వాడిన యాసనుబట్టి ఆయన బహుశా తెలింగాణాలోని నైఋతి ప్రాంతానికి చెందినవాడని అనిపిస్తుంది. ఆ ప్రాంతంలోనే ఈ పట్టణాలన్నీ వున్నాయి. ఆయన 17వశతాబ్దపు ప్రారంభంలో జీవించాడని నమ్ముతున్నారు. 

గ్రీకు సాహిత్యంలో లూసియన్‌ (Lucian) తో తెలుగు సాహిత్యంలో వేమనను పోల్చవచ్చు. వేమన ప్రసిద్ధుడైన రచయిత. ఆయన పద్యాలు సాంప్రదాయకమైనవి కావు. కవితాత్మకమైనవి కావు. అయితే అప్పుడప్పుడే చదువుతున్నవారికి ఉపయోగకరంగా వుంటాయి. తెలుగు భాషను అలంకరించిన నగిషీ చెక్కిన అనేకమైన రచనలకు వేమన రచనలు భిన్నంగా వుంటాయి. కాని సాధారణ పాఠకులకు చాలా ఉపయుక్తంగా వుంటాయి. ఏ భాషలోనైనా సామెతలుగాని, నానుడులలు గాని సంక్షిప్తంగా, సాంద్రంగా వుంటాయి అది వాటి శైలి. వాటిల్లో వాక్య నిర్మాణాలకు సంబంధించిన, క్రియారూపాలకు సంబంధించిన వివిధ రూపాల కోసం ఎదురుచూడడం సరైంది కాదు. ఇవన్నీ కావాలనుకుంటే పాఠకుడు ఇంతకంటే నగిషీ చెక్కిన , వైవిధ్యభరితమైన సంకలనాలు చదవాలి.

నోట్‌ : 

ఈ రచయిత రాసిన పద్యాలలో చాలా భాగం ` మొదటి 20లాగా` ఆటవెలది రూపంలో వున్నాయి. అన్నింటిలోనూ ‘‘విశ్వధాభిరామ వినురవేమ’’ అన్న కోరసే వుంది. ఇందులో ‘వి’ అనే అక్షరం ప్రతి పద్యం చివరిలోనూ ఉంది. అంటే ప్రతిసారి ప్రతిపద్యం విశ్వధాభిరామ వినురవేమ అనే చరణంతో ముగుస్తుందని అర్థం. కొన్ని ప్రతులలో ‘విశ్వధాభి’ బదులు ‘విశ్వత్‌ అభి’ అనీ మరికొన్నింటిలో ‘విశ్వత్‌ భి’ అనీ వుంది. అ కోరస్‌ ప్రాధాన్యత నిగూఢంగా ఉంది. అయితే దానితో సంబంధం లేకుండా ఏ పద్యానికీ అర్థం వుండదు.  ఇందులో వాడిన ‘వేమ’ అనే పదం ఈ నైతిక రచయిత అన్నయ్యను ఉద్దేశించిందని కొందరు విశ్వసిస్తారు.

నేను ఇచ్చిన అధో సూచికలు, విషయసూచికలు పాఠకుడికి అవసరమైన సమాచారాన్నంతటిని అందచేస్తాయని నమ్ముతున్నాను. (లూసియన్‌ : క్రీ.శ. 125 నుండి 185. ఈయన వ్యంగ్య రచయిత, కరపత్రాల. నవలల రచయిత. మూఢాచారాలను మత విశ్వాసాలను అపహాస్యం చేస్తూ రచనలు చేశాడు. ఆయన మాతృభాష ‘సిరియాక్‌’ అయినప్పటికి ఆయన రచనలన్నీ దాదాపుగా ప్రాచీన గ్రీకు భాషలోనే వున్నాయి. ఆయన రచనల్లో ఎ ట్రూ హిస్టరీ (A True History), డైలాగ్స్‌ ఆఫ్‌ ది డెడ్‌ (Dialogues of the Dead), ఫిలాసఫీస్‌ ఫర్‌ సేల్‌ (Philosophies for Sale), డైలాగ్స్‌ ఆఫ్‌ ది గాడ్స్‌ (Dialogues of the Gods ) ముఖ్యమైనవి.  రోమన్‌ సామ్రాజ్యంలో భాగమైన సిరియా ప్రాంతంలో సమోసాత (Samosata) అనే నగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ` అను)

Leave a Reply